సృష్టి కి ప్రతిసృష్టి చేయడం మొదలు పెట్టిన ఘనత విశ్వామిత్రుడిది. ఇంద్రుడితో మాట పట్టింపు రావడంతో, తన తపశ్శక్తి ధారపోసి 'త్రిశంకు స్వర్గం' సృష్టించాడాయన. అంత కష్ట పడక్కరలేకుండా అదే సృష్టిని చక్కగా కాపీ చేయడం అన్నది ఎప్పుడు మొదలైందో ఇదమిద్దంగా తెలీదు. బహుశా విశ్వామిత్రుడికి ముందు నుంచే ఉండి ఉంటుంది. ఎటొచ్చీ చేసింది కాపీ అని ఎవరూ ఒప్పుకోరు. ఇంగ్లీష్ అంత ప్రబలంగా లేని రోజుల్లో 'స్ఫూర్తి పొందాం' అని చెప్పుకుంటే, ఇప్పటి వాళ్ళు 'ఇన్స్పైర్' అయ్యాం అని మాట దాటేస్తున్నారు.
ఈ స్ఫూర్తి పొందడం లేదా ఇన్స్పైర్ అవ్వడం అన్నది అన్ని రంగాల్లోనూ ఉన్నా, సంగీతం లోనూ సాహిత్యం లోనూ ఇది కొంచం ఎక్కువ. సినిమా సంగీతం లో ఇప్పటికీ జనం నాలుకల మీద ఆడే ఆపాత మధురాల్లో చాలావాటికి హిందీ సినిమా పాటలు, విదేశీ సంగీతమూ స్ఫూర్తినిచ్చాయి. చాలా సందర్భాలలో ఆయా సంగీత దర్శకులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు కూడా. దక్షిణాది సంగీతాన్ని ఉత్తరాది సినిమాలకి వాడుకోడమూ జరిగింది. మొదట్లో ఈ 'స్ఫూర్తి' విషయం అతి కొద్దిమందికి మాత్రమే తెలిసేది.
మీడియా వ్యాప్తి పెరిగాక, ముఖ్యంగా విదేశీ చానళ్ళు తమ ప్రసారాలను మన దేశంలో ప్రారంభించాక, ఏ రచయిత/సంగీత దర్శకుడు ఏ విదేశీ చిత్రం నుంచి స్ఫూర్తి పొందారన్నది సామాన్య ప్రేక్షకుడికి కూడా తెలిసిపోతోంది. గతంతో పోల్చినప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా మెరుగు పడడంతో ఒకరికి తెలిసిన విషయం అతి తక్కువ కాలంలోనే పదిమందికీ చేరుతోంది. ఈ పరిణామం కొందరు కళాకారుల 'సృజనాత్మకత' కి గొడ్డలి పెట్టుగా మారింది.
"నా మ్యూజిక్ లో ఎక్కడైనా విదేశీ ట్యూన్స్ వినిపిస్తే రామచంద్రాపురం లో ఉన్న మా బంధువులు కూడా అడిగేస్తునారు.. ఈ పాటకి ఒరిజినల్ ఫలానా కదా అని" అని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ వాపోయాడు, నాలుగైదేళ్ళ క్రితం ఒక ఇంటర్వ్యూలో. 'నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు' అనుకునే వాళ్ళు మాత్రం తమ కృషిని కొనసాగిస్తున్నారు. స్వదేశం లోని వివిధ ప్రాంతాల జానపద సంగీతం నుంచి స్ఫూర్తి పొంది సినిమా పాటలు చేసే సంగీత దర్శకులు మరో రకం. చాలా 'చిత్రం' గా సినిమా రంగం లో పేరు తెచ్చేసుకున్న ఓ సంగీత దర్శకుడు ఇలా స్ఫూర్తి పొందిన పాపానికి కేసులు కూడా ఎదుర్కొన్నాడుట.
నిన్నటితరం సంగీత దర్శకుల నుంచి స్ఫూర్తి పొందే సంగీత దర్శకులకీ కొదవ లేదు. ఈమధ్య వస్తున్న వంశీ సినిమాలకి చక్రి చేస్తున్న సంగీతం వింటుంటే నాకే కాదు, చాలామందికి ఎనభైల్లో ఇళయరాజా చేసిన ట్యూన్లు గుర్తొస్తున్నాయి. సంగీతం గొడవ ఇలా ఉంటే, సాహిత్యానిది మరో కథ. రచయిత్రుల శకం ముగిసింది మొదలు, మొన్నటివరకూ ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించే రచనలు చేసిన ప్రముఖ నవలా రచయితలు ఇద్దరూ ఆంగ్ల నవలల నుంచి స్ఫూర్తి పొందినవారే. ఒకాయన ఒప్పుకుంటాడు, మరో ఆయన ఆవిషయం మాట్లాడడానికి ఇష్టపడడు.
సినిమా తీయడానికి కథ అవసరం అనుకున్న రోజుల్లో కథల మీద హక్కుల గురించి కోకొల్లలుగా గొడవలు జరిగాయి. "అన్ని కథలకూ మూలం రామాయణ భారతాలే.. అసలు ప్రపంచం లో ఉన్నవి ఏడు కథలే.. ఎవరు తీసినా వాటితోనే సినిమా తియ్యాలి" అని జంట రచయితలు పరుచూరి సోదరులు ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. "ఒక్కడు రాసిన కథతో సినిమా తీయడం ఏమిటి నాన్సెన్స్.. పది మంది రచయితలని కూర్చోపెట్టి చర్చిస్తే ఆ చర్చల్లోనుంచి కథ పుడుతుంది" అని వాదించిన దర్శకులూ ఉన్నారు.
ఇప్పుడైతే ఎంచక్కా కథల బాధ లేదు కాబట్టి కాపీ బాధా లేదు. బాగా హిట్టైన హిందీ సినిమాలోదో, రొటీన్ కి భిన్నంగా ఉన్న విదేశీ సినిమాలోదో 'పాయింట్' ని మాత్రం తీసుకుని సినిమాలు తీసేస్తున్నారు నవతరం దర్శకులు. అంటే వీళ్ళు స్ఫూర్తి కూడా పొందడం లేదు, కేవలం పాయింట్ మాత్రమే తీసుకుంటున్నారు. కాబట్టి ఏమీ అనడానికి లేదన్నమాట. మనం కూడా కథ ఒరిజినలా, కాపీనా అన్న విషయంలోకి వెళ్ళకుండా, సినిమా బాగుందా లేదా అన్న విషయం మాత్రమే చూసి, బాగున్న పక్షంలో మూల కథ ఎక్కడిది అయి ఉంటుంది అని ఆలోచించడానికి అలవాటు పడిపోతున్నాం.