శనివారం, సెప్టెంబర్ 05, 2009

గీతాంజలి

రెండు దశాబ్దాల క్రితం వరకూ ఎవరినైనా 'గీతాంజలి' గురించి చెప్పమంటే మొదట వచ్చే సమాధానం 'రవీంద్రనాథ్ టాగోర్ రచన' అని ఉండేది. తర్వాతి కాలం లో అది కాస్తా 'మణిరత్నం-నాగార్జున' కాంబినేషన్ లో వచ్చిన సినిమా అయ్యింది. తమిళ దర్శకుడు మణిరత్నం 1989 లో తీసిన 'గీతాంజలి' సినిమా ఒక ట్రెండ్ సెట్టర్. ఆబాలగోపాలాన్నీ అలరించిన సున్నితమైన ప్రేమకథ.

హీరోకో, హీరోయిన్కో ప్రాణం పోయే జబ్బు ఉండడం, అది కథ క్లైమాక్స్ కి వచ్చాక బయట పడడం అన్నది తెలుగు సినిమాల్లో బాగా నలిగిన ఫార్ములా. ముఖ్యంగా అప్పటివరకూ ఇద్దరి హీరోయిన్లతో ఆడిపాడిన హీరోని శుభం కార్డు సమయానికి ఏకపత్నీవ్రతుడిని చేసేందుకు, ఇద్దరిలోనూ ఒక హీరోయిన్ కి ప్రాణాంతక వ్యాధి ఉన్నట్టు చూపించిన సినిమాలు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. ఈ రొటీన్ ఫార్ములాకి కొంచం భిన్నంగా నాయికా నాయకులిద్దరినీ ఎన్నాళ్ళు బతుకుతారో తెలియని పేషెంట్లు గా చూపడం 'గీతాంజలి' ప్రత్యేకత.

కథానాయకుడు ప్రకాష్ (అక్కినేని నాగార్జున) కులాసాగా కాలం గడిపే కాలేజి విద్యార్ధి. స్నాతకోత్సవం ముగిశాక, స్నేహితులతో ఆడి పాడుతుంటే ప్రమాదం జరిగి ఆస్పత్రి పాలవుతాడు. చికిత్స జరుగుతుండగా తెలుస్తుంది.. అతనికి కేన్సర్ చివరి దశలో ఉందనీ, ఇంకెన్నాళ్లో బతకడనీ. తల్లీతండ్రీ తనకోసం బాధ పడడం చూడలేక వాళ్లకి దూరంగా ఊటీ వెళ్ళిపోతాడు ప్రకాష్. అక్కడ అతనికి డాక్టరుగారమ్మాయి గీతాంజలి (నూతన నటి గిరిజ) పరిచయ మవుతుంది.

ముగ్గురు చెల్లెళ్లకి అక్కైన టీనేజ్ అమ్మాయి గీతాంజలి కి తల్లి లేదు. నానమ్మ పెంపకంలో పెరుగుతూ ఉంటుంది. అల్లరిపిల్ల. తన వెంటపడే అబ్బాయిలని ప్రాక్టికల్ జోకులతో ఏడిపిస్తూ ఉంటుంది. 'ఆమనీ పాడవే హాయిగా' పాడుకుంటూ ప్రకాష్ తనని పట్టించుకోడం లేదని అలిగిన గీతాంజలి, అల్లరి చేసి అతనితో మాట కలుపుతుంది. గీతాంజలి ప్రాణాంతకమైన గుండె జబ్బుతో బాధ పడుతోందనీ, ఎన్నాళ్ళో బతకదనీ తెలిసిన ప్రకాష్ ఆమెతో ప్రేమలో పడతాడు.

ప్రకాష్ కూడా ఇంకెన్నాళ్లో బతకడని గీతాంజలికి తెలుస్తుంది. మొదట అతన్ని తిరస్కరించిన ఆమె ఆపై అతను కావాలని ఆమె కోరుకోడం సినిమాకి ముగింపు. 'ఎన్నాళ్ళు బతుకుతారో తెలీదు..కానీ బతికినన్నాళ్ళూ ఆనందంగా బతుకుతారు' అన్న పాజిటివ్ నోట్ తో సినిమా ముగుస్తుంది. ఇది పూర్తిగా మణిరత్నం సినిమా. సున్నితమైన భావోద్వేగాల మేళవింపు. తనే కథ, స్క్రీన్ ప్లే సమకూర్చుకున్నారు. భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ సంస్థ నిర్మించింది.

టైటిల్స్ పడుతుండగానే హీరో పరిచయం, అతనికి ప్రాణాంతక వ్యాధి ఉందన్న విషయమూ తెలిసిపోతాయి. 'జల్లంత తుళ్ళింత' అనే పాటతో గీతాంజలి పరిచయం అవుతుంది. పాట, ఆ తర్వాత వచ్చే దృశ్యాల ద్వారా ఆమె చాలా అల్లరిపిల్ల అనీ, నాయనమ్మ అంటే భయం, తండ్రి అంటే గౌరవం ఉన్నాయని తెలుస్తుంది. తన వెంట పడ్డ ఓ కుర్రాడిని శ్మశానానికి రమ్మని అక్కడినుంచి 'లేచిపోదామ'నీ చెప్పి, చెల్లెళ్ళ సాయంతో అతను భయంతో పారిపోయేలా చేస్తుంది, 'నందికొండ వాగుల్లో' పాట పాడి. ప్రకాష్ నీ భయ పెట్టాలని చూస్తుంది కానీ, అతను తిరిగి వీళ్ళనే భయపెడతాడు. గీతాంజలిని ఏడిపించే క్రమంలో ఆమె జబ్బు గురించి తెలుస్తుంది అతనికి.

అప్పటిదాకా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిన ప్రకాష్, తను గీతాంజలి ని ప్రేమిస్తున్నానని తెలుసుకున్న క్షణం నుంచీ ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకుంటాడు. సిగరెట్ వెలిగించి, అంతలోనే ఆలోచనలో పడి, దానిని కింద పడేస్తాడు. తన ఆరోగ్యం విషయం మాత్రం ఆమె దగ్గర దాస్తాడు. ప్రకాష్, గీతాంజలి ప్రేమలో పడ్డాక ఇద్దరూ కలిసి శ్మశానంలో అంత్యక్రియలు చూసే దృశ్యం, అప్పటి వరకూ చావుని సులువుగా తీసుకున్న గీతాంజలి తండ్రిలో 'నాకు బతకాలని ఉంది నాన్నా' అని చెప్పే సన్నివేశం మనసుని మెలిపెడతాయి.

"అందరూ ఎప్పటికైనా చనిపోవాల్సిన వాళ్ళే.. కాకపొతే నేను మిగిలిన వాళ్ళందరికన్నా ముందుగా చనిపోతాను..అంతే" అని చెప్పే గీతాంజలి, అవే మాటలు ప్రకాష్ చెప్పినప్పుడు మాత్రం భరించలేదు. అతనెప్పుడు చనిపోతాడో అనే భయంతో తను గడపలేనని చెప్పి అతన్ని తిరస్కరిస్తుంది. "ఎందుకంటే..నా ప్రాణం కన్నా నువ్వు నాకు ముఖ్యం..." అని గీతాంజలి ఏడుస్తూ చెప్పే సన్నివేశం వెంటాడుతుంది. సంభాషణలు రాజశ్రీ రాశారు.

ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది పీసీ శ్రీరామ్ ఫోటోగ్రఫీ. సన్నివేశాలకు తగ్గ మూడ్ ని క్రియేట్ చేయడం కోసం లైటింగ్ ని వాడుకున్న తీరు అబ్బుర పరుస్తుంది. క్లోజప్ సన్నివేశాల్లో ఐతే వెలుగునీడలతో ఆడుకున్నారు. వేటూరి-ఇళయరాజా కాంబినేషన్లో పాటలన్నీ ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించేవే. నాకిష్టమైన పాట 'ఓం నమః..' ఈ పాట చిత్రీకరణ ఓ ప్రయోగం. పాట చిత్రీకరణ మొత్తం ఒక చుంబన దృశ్యం మాత్రమే. తరువాత చెప్పుకోవాల్సింది చివరి పాట 'ఓ పాపా లాలి.'

రాజస్థాన్ ఎడారిలో తీసిన 'ఓ ప్రియా ప్రియా..' పాట గురించి చిన్న గమ్మత్తు చెప్పాలి. అప్పట్లో దూరదర్శన్ 'చిత్రలహరి' లో ఈ పాట చూసి (అప్పటికింకా సినిమా చూడలేదు) నేను, నా మిత్రులూ ఇది పేద హీరో-డబ్బున్న హీరోయిన్ల ప్రేమ కథ అని తీర్మానించేసుకున్నాం. మొదటి పాట 'జగడ జగడ జగడం..' లో సిల్క్ స్మిత మెరిసి మాయమవుతుంది. ప్రకాష్ గా నాగార్జున బాగా చేశాడు. కొంచం బరువు తగ్గి ఉంటే ఇంకా బాగుండేవాడు అనిపిస్తుంది. కాలేజి స్టూడెంట్, ఆపై పేషెంట్ కదా. పైగా గిరిజ మరీ సన్నగా ఉండడంతో అతనికన్నా చాలా చిన్న పిల్ల అన్న భావన కలుగుతుంది.

గిరిజ నడక, బాడీ లాంగ్వేజి లో ఎక్కడా ఆడపిల్ల తాలూకు సున్నితత్వం కనిపించదు. ఆమె తరహానే అంతో, లేక పాత్ర కోసం అలా చేసిందో తెలీదు. ఆమె ఇతర సినిమాలేవీ చూడలేదు నేను. అల్లరి సీన్లలోనూ, సెంటిమెంట్ దృశ్యాల్లోనూ కూడా చాలా బాగా చేసింది. అంత బరువైన పాత్రకి ఓ కొత్త నటిని ఎంచుకోడం సాహసమనే చెప్పాలి. ఈ సినిమాలో పంటికింద రాయిలా అనిపించేది సుత్తివేలు-డిస్కోశాంతిల కామెడీ ట్రాక్. ఈ తెలుగు సినిమాలో కామెడీ ఒక్కటే కాస్త తమిళంగా ఉంటుంది. మణిరత్నం మార్కు కామెడీ అనాలేమో. ఈ ఒక్కటీ మినహాయిస్తే మళ్ళీ మళ్ళీ చూడదగ్గ సినిమా 'గీతాంజలి.'