మంగళవారం, ఫిబ్రవరి 04, 2025

విప్లవ తపస్వి పి.వి.

పుస్తకం పేరు చూడగానే 'ఏవిటీ విరోధాభాస?' అనుకున్నాను. విప్లవం, తపస్సు రెండూ భిన్న ధృవాలు కదా. ఈ రెంటినీ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కి ఎలా అన్వయించి వుంటారు? అన్న ఆసక్తి కలిగింది. పుస్తకం పీవీకి సంబంధించింది కావడం మొదటిదైతే, రాసిన వారు సీనియర్ జర్నలిస్టు (పీవీ ప్రధాని పదవిని నిర్వహించిన కాలంలో ఢిల్లీ లో పనిచేసిన వారు), కవి, అనువాదకుడు (సాహిత్య అకాడెమీ బహుమతి గ్రహీత) కూడా కావడంతో పుస్తకాన్ని కొని ఏకబిగిన చదివేశాను. ఎ. కృష్ణారావు రాసిన మొత్తం ఏడు అధ్యాయాల ఈ పుస్తకంలో చివరి అధ్యాయం పేరు 'విప్లవ తపస్వి' స్వతంత్ర రజతోత్సవాల సందర్భగా 1972 ఆగస్టు 15 అర్ధరాత్రి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో పీవీ ఆవేశంగా చదివిన స్వీయ కవితలో సామాన్యుడిని వర్ణిస్తూ వాడిన మాట 'వాడు విప్లవ తపస్వి'. "పి.వి. నరసింహారావుకు సమయం ఉంటే ఇంకా ఎన్నో రచనలు చేసి ఉండేవారు. అయితే, పీవీ సాహిత్యం పైనే దృష్టి కేంద్రీకరించి ఉంటే, భారత దేశంలో ఇవాళ సమాన అనుభవంలో ఉన్న ఆర్ధిక, సామాజిక పరివర్తనాన్ని చూసి ఉండేవారం కాదేమో..!" అనే వాక్యంతో ఈ అధ్యాయమూ, ఈ పుస్తకమూ ముగిశాయి. ఆ ఆర్ధిక, సామాజిక పరివర్తనం ఏమిటన్నది మిగిలిన పుస్తకం చెబుతుంది.

"'ఆయనదొక రికార్డు కాని విజయవంతమైన చరిత్ర' అని పి.వి. నరసింహారావును 1994లో ప్రపంచ ఆర్ధిక వేదిక అధ్యక్షుడు క్లాస్ స్క్వాబ్ బహిరంగంగా ప్రశంసించారు" అనే వాక్యంతో ప్రారంభమయ్యే మొదటి అధ్యాయం 'పి.వి. ఒక చారిత్రక అవసరం' లో  భారత దేశంలో ఆర్ధిక సంస్కరణల పూర్వరంగాన్ని వివరించడంతో పాటు, పీవీ దేశ ప్రధాని కావడానికి నేపధ్యం, నాటి రాజకీయ, ఆర్ధిక పరిస్థితులు, అన్ని రాజకీయ పక్షాలనీ సమన్వయం చేసుకుంటూ ఆర్ధిక సంస్కరణలని విజయవంతంగా ప్రవేశ పెట్టిన తీరు, అదే సమయంలో సంస్కరణల దుష్ప్రభావం పేదలపై పడకుండా ఉండడం కోసం తీసుకున్న ప్రత్యేక చర్యలని సమగ్రంగా వివరించారు. "1991 ఎన్నికల్లో రాజీవ్ గాంధీ గెలిచి ఉంటే సంస్కరణలు ప్రవేశ పెట్టి ఉండేవారన్న వాదన అర్ధరహితం. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు మొదటి సగం సంవత్సరాలు ఉత్సాహంగా పని చేశారు కానీ తర్వాతి కాలంలో వెనక్కి తగ్గడం మొదలు పెట్టారు. దీనితో ఆయన హయాంలో ఆర్ధిక లోటు తీవ్రంగా పెరిగింది. ప్రభుత్వ తప్పుడు ఆర్ధిక  విధానాల గురించి హెచ్చరించిన ప్రభుత్వ ప్రధాన ఆర్ధిక సలహాదారు, బ్యాంకింగ్ సెక్రటరీ బిమల్ జలాన్ ను రాజీవ్ గాంధీ ప్రపంచ బ్యాంకుకు పంపించారు" లాంటి ఆసక్తి కరమైన విశేషాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో. 

"మొత్తానికి రాజీవ్ హయాంలో ప్రారంభమైన మోదీ ప్రాభవం, పి.వి. హయాంలో తిరుగులేనిదిగా మారింది. వారిద్దరూ కలుసుకున్నారనడానికి సమాచారం లేదు కానీ నరేంద్ర మోదీ పీవీ పట్ల అభిమానం పెంచుకున్నారనడానికి నిదర్శనాలున్నాయి" ..ఈ ప్రతిపాదనతో  'అయోధ్య-ఒక అధ్యాయం' ముగుస్తుంది. "పి.వి. మాజీ ప్రధానిగా ఉన్నప్పుడు అనేకసార్లు నేను (రచయిత) ఆయనతో అయోధ్య గురించి చర్చించాను. నేను బాబ్రీ మసీదు కూలిపోతున్న సమయంలో అక్కడే ఉన్నానని చెప్పినప్పుడు ఆయన ఆసక్తిగా అక్కడేం జరిగిందో తెలుసుకున్నారు. పి.వి. వాదనలు విన్న వారికెవరికైనా అయోధ్య ఉదంతంలో ఆయన పొరపాటు ఏమీ చేయలేదని అనిపిస్తుంది" అంటూ మొదలు పెట్టి, కరసేవ పూర్వాపరాలని కళ్ళకి కట్టినట్టు చెప్పారు కృష్ణారావు. "దేశంలో మత రాజకీయాలను ప్రవేశపెట్టి, రామ జన్మభూమి ఉద్యమాన్ని వ్యాపింపజేసి, బాబ్రీ మసీదు కట్టడం కూల్చివేత, గుజరాత్ అల్లర్లు వంటి ఘటనలకు కారణమైన భారతీయ జనతా పార్టీనే దేశ ప్రజలంతా ఆదరించడం దేశంలో మారుతున్న ప్రజల ఆలోచనా విధానానికి నిదర్శనం. ఈ మొత్తం క్రమంలో ఒక జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పూర్తిగా కుదించుకుపోయింది. ఈ పరిణామాల క్రమంలో పి.వి. నరసింహారావును దోషిగా చిత్రించిన కాంగ్రెస్ పార్టీ ఏమి సాధించింది? దేశాన్ని మలుపు తిప్పిన ఆర్ధిక సంస్కరణలను ప్రవేశ పెట్టిన ఆయనను తమ నేతగా చెప్పుకోలేని దుస్థితిని స్వయంగా కల్పించుకున్న కాంగ్రెస్ పార్టీ, చరిత్ర మలుపులో స్వయం దోషిగా మిగిలిపోయిందని చెప్పక తప్పదు" అంటారు ఈ రచయిత. 

రాజకీయ చదరంగపుటెత్తులు, పై ఎత్తుల సమాహారం ఈ పుస్తకంలో మూడో అధ్యాయం 'వ్యూహాలు, ప్రతి వ్యూహాలు'. అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న పీవీ, పార్టీలోనూ, బయటా ఉన్న ప్రత్యర్థుల్ని అత్యంత బలంగా ఎదుర్కొన్న రాజకీయ సన్నివేశాలెన్నింటినో కళ్ళముందు ఉంచింది ఈ అధ్యాయం. "పి.వి. హయాంలో అసమ్మతి శిబిరాన్ని పరోక్షంగా నిర్వహించిన సోనియా క్రమంగా పీవీ తర్వాత అధికారం కోసం వేగంగా పావులు కదిపారు. ఆమెకు అధికారం పట్ల కాంక్ష లేదన్న అభిప్రాయాలు పటాపంచలయ్యాయి. 1998లో సీతారాం కేసరిని ఇంటికి పంపించి సోనియా పార్టీ అధ్యక్షురాలయ్యారు. పి.వి. పై అసమ్మతి శిబిరం నడిపిన వారందర్నీ పార్టీలో కీలక పదవుల్లో చేర్చుకున్నారు" అంటూ స్పష్టంగానే పార్టీలో అసమ్మతికి మూలకారణాన్ని చెప్పారు కృష్ణారావు. ఇక, ప్రతిపక్షాల నుంచి ఒత్తిళ్లు, గద్దె దింపే ప్రయత్నాలు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సభలో పూర్తి మెజారిటీ లేకపోవడం, పీవీని అత్యంత బలహీన ప్రధానిగా వాళ్ళు భావించడం, వీపీ సింగ్ ని బలహీన పరిచినట్టే పీవీని కూడా బలహీన పరిచి బిజెపిని అధికారంలోకి తేవాలన్న ఆ పార్టీ నాయకత్వపు ఆత్రుత అంటారు ఈ రచయిత. 

మూడో అధ్యాయానికి కొనసాగింపుగా నాలుగో అధ్యాయం 'కుంభకోణాల వెనుక కోణాలు' ని చెప్పాలి. ప్రధాని స్థాయి వ్యక్తి మీద పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడం బోఫోర్స్ కుంభకోణంతో మొదలైతే, అది పరాకాష్టకి చేరింది పీవీ హయాంలోనే అని చెప్పాలి. ఐదేళ్ల కాలంలో అనేక కుంభకోణాలు, లెక్కకి మించిన కేసులు. పెద్ద పదవిని నిర్వహించి, పదవి నుంచి దిగిన తర్వాత చాలా ఏళ్ళ పాటు కోర్టుల చుట్టూ తిరిగిన మరొక నాయకుడు లేడు బహుశా. "పి.వి. నరసింహారావు హయాంలో జరిగాయని ప్రచారం జరిగిన కుంభకోణాలు ఏవీ నిజంగా కుంభకోణాలు కావని, అవన్నీ పీవీని అప్రతిష్ట పాలు చేయడానికి కుట్ర పూరితంగా సృష్టించినవని అర్ధం చేసుకోడానికి పెద్ద ఆలోచన అవసరం లేదు" అంటారు కృష్ణారావు. "స్టాక్ మార్కెట్ కుంభకోణం, జైన్ హవాలా వ్యవస్థీకృత లోపాలు, వారసత్వంగా వచ్చిన అవినీతి కార్యకలాపాల మూలంగా తలెత్తినవి కాగా, ప్రధానమైన లఖుభాయి పాఠక్, సెయింట్ కిట్స్ ఆరోపణలు పీవీపై దుష్ప్రచారం చేసేందుకు సృష్టించినవని వేరే చెప్పక్కర్లేదు. దక్షిణాది నుంచి మొట్టమొదటిసారి ప్రధాని అయిన పీవీని నిందలపాలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత శక్తులు ప్రయత్నించాయి. ఇవన్నీ అధికార పరమపద సోపాన పటంలో ఎత్తుకు పై ఎత్తుల్లాంటివి" అంటారు. 

అణు పరీక్షలు, విదేశాలతో సంబంధాలు -- ముఖ్యంగా పీవీ 'లుక్ ఈస్ట్' పాలసీ, కాశ్మీర్ సమస్య తదితర అంశాలని నిశితంగా చర్చించిన అధ్యాయం 'ఇంటా బయటా సాహసాలు'. ప్రధానిగా స్వరాష్ట్ర రాజకీయ శక్తులతో వ్యవహరించిన తీరుని 'తెలుగదేలయన్న' అధ్యాయంలో చదవచ్చు. పీవీ-ఎంటీఆర్, పీవీ-వైఎస్ రాజశేఖర రెడ్డి సంబంధాలు ఆసక్తిని కలిగిస్తాయి. ముఖ్యంగా నాటి రాష్ట్ర కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు, పై చేయి కోసం గ్రూపుల ప్రయత్నాలు, తాపత్రయాలు వీటన్నిటినీ ఒకింత వివరంగానే రాశారు. పుస్తకంలో చివరి అధ్యాయం ముందుగా చెప్పుకున్న 'విప్లవ తపస్వి'. సాహితీవేత్తగా పీవీని గురించి వివరంగా చెప్పే అధ్యాయం ఇది. "స్పానిష్ రచయిత గాబ్రియల్ గార్షియా మార్క్వెజ్ రచించిన 'వన్ హండ్రెడ్ ఇయర్స్ అఫ్ సాలిట్యూడ్' ను ఇంగ్లీషులో చదివి, పీవీ దాని స్పానిష్ మూలాన్ని తెప్పించుకుని చదివారు. ఆ తర్వాత మార్క్వెజ్ రచించిన 'లవ్ ఇన్ ది టైం అఫ్ కలరా' కూడా చదివారు. 'ఇంగ్లీషులో కన్నా స్పానిష్ భాషలో చదివితే ఇంకా మంత్రముగ్ధులమైపోతాం' అన్నారు" లాంటి విశేషాలెన్నో వున్నాయి ఈ అధ్యాయంలో. ఆధునిక భారతదేశపు చరిత్ర మలుపు తిరిగిన కాలాన్ని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్న వారిని ఆపకుండా చదివించే రచన ఈ 'విప్లవ తపస్వి'. శ్రీ రాఘవేంద్ర ప్రచురణ, పేజీలు 224, వెల రూ. 150, అన్ని పుస్తకాల షాపుల్లోనూ, అమెజాన్ లోనూ లభిస్తోంది.