"అసలు కమామిషు అన్న మాట విని ఎన్నాళ్ళయింది?" అని ఆలోచనలో పడ్డాను పుస్తకం పేరు చూడగానే. చదవడం పూర్తిచేయగానే వచ్చిన ఆలోచన అయితే "ఏముంటాయి ఆ పసలపూడి కథల్లో? తిండి గోలా, సెక్సు గొడవలూ తప్పిస్తే" అని వెటకరించే మిత్రులకి నోటితో సమాధానం చెప్పే బదులు ఈ పుస్తకాన్ని చేతిలో పెడితే సరిపోతుంది కదా అని. వంశీ రాసిన 'మా పసలపూడి కథలు' అనే డెబ్బై రెండు కథల సంకలనాన్ని పరిశోధనాంశంగా తీసుకుని, కె. రామచంద్రా రెడ్డి అనే పరిశోధకుడు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సమర్పించిన పీహెచ్డీ థీసిస్ ఇది. సాహిత్యాభిమానుల కోసం పుస్తక రూపంలో మార్కెట్లోకి వచ్చింది. ఒక రచయిత/రచయిత్రి సమగ్ర రచనల మీద పరిశోధన జరగడం, లేదూ ఒక నవల మీద సమగ్ర పరిశోధన జరగడం తెలుగునాట ఆనవాయితీగా వుంది. అయితే కేవలం ఒక్క కథాసంకలనమే పరిశోధనాంశం కావడం అరుదు. 'మా పసలపూడి కథలు' ఈ అరుదైన ఘనతని సాధించడం వంశీ (కొన్ని) సినిమాలు, రచనల అభిమానిగా వ్యక్తిగతంగా నాకు చాలా సంతోషాన్ని కలిగించింది.
సాహిత్యాంశానికి సంబంధించినవే అయినప్పటికీ చాలా పరిశోధనా గ్రంధాలు సామాన్య పాఠకులకి పఠనీయంగా వుండవు. రీసెర్చ్ ఫార్మేట్ లో చాలా అకడమిక్ గా వుండి, పుస్తకంలో పేజీలు బరువుగా కదులుతూ ఉంటాయి. ఈ పరిశోధనా గ్రంధం అందుకు మినహాయింపు. సూటిగా విషయంలోకి వెళ్లిపోవడం ఒకటైతే, చాలా చోట్ల ఈ పరిశోధకుడి ప్రతిపాదనలు, వెలికితీసిన విషయాలు చదువుతుంటే "ఇవి మనం చదివిన కథల గురించేనా?!" అని అడుగడుగునా కలిగే ఆశ్చర్యం మరొకటి. ఉదాహరణకి: "వందేళ్ళకి మించిన తెలుగు కథా సాహిత్యంలో ఏ కథని తీసుకున్నా ఐదుకి మించిన పాత్రల పేర్లు చెప్పిన కథలు అత్యరుదుగా వుండవచ్చు. కానీ, వంశీ కథలలో ఐదుకు తక్కువగా పాత్రల పేర్లు చెప్పిన కథలు కూడా అత్యరుదుగా వున్నాయి. ఆయన ప్రతి కథలోనూ ఐదుకు పైగానూ అత్యధికంగా పద్ధెనిమి వరకూ (పన్నెండో కథ 'తామరపల్లి సత్యం గారి తమ్ముడు రామం') పాత్రల పేర్లు చెప్పిన కథలూ కనిపిస్తాయి", లాంటి పరిశీలనలు కళ్ళు మిరుమిట్లు గొలుపుతాయి.
మొత్తం పది అధ్యాయాలుగా విభజించిన ఈ పుస్తకంలో నాలుగో అధ్యాయం 'మా పసలపూడి కథల్లో మాండలికం - భాషా విశేషాలు' అతి పెద్ద అధ్యాయం. మొత్తం 254 పేజీల పుస్తకంలో ఈ ఒక్క అధ్యాయమే 84 పేజీలు. నామవాచకాలు, సర్వనామాలు, క్రియా వాచకాలు, విశేషణ వాచకాలు, కథల కాలం దృష్ట్యా గృహోపకరణాలు, ప్రయాణ సాధనాలు, ఇతర కొలమానాలు, ఆహార పదార్ధాలు, అన్యభాషా పదాల, జంట పదాల, తిట్ల పలుకుబడి.. ఇవన్నీ ఈ అధ్యాయంలో భాగాలే. ఒక్క ఆహార పదార్ధాల లోనే అల్పాహారాలు, చిరుతిళ్ళు, మాంసం, చేపల వంటకాలు, ఇతర విభిన్న ఆహార పదార్ధాలు, పానీయాలు అనే విభాగాలు ఉన్నాయి. పరిశోధన 'లోతు' ఎంతో తెలుసుకోడానికి ఈ ఒక్క అధ్యాయం చాలు. "భారతదేశంలో ముసల్మానుల పరిపాలన ప్రభావం వల్ల ఉత్తర భారతంలో తయారయ్యే తీపి వంటకాలకు ఆ రాజుల నమ పదాలను పెట్టుకోవడం పూర్వం జరిగింది. ఆ వంటకాలు దేశం అంతా విస్తరించి నేడు అవే పేర్లు స్థానీయ పలుకుబడిలో వున్నాయి. ఖాజా-కాజా, బాదుషా, జహంగీర్-జాంగ్రీ మొదలైనవి" రెండు కథల్లో ప్రస్తావనకు వచ్చే తాపేశ్వరం కాజాని గురించి వివరణ ఇది.
'మా పసలపూడి కథలు-సింహావలోకనం-సమీక్షలు' అనే అధ్యాయంలో నాలుగో కథ 'కోరి రావులు గారి బస్ కండక్టర్' కథని గురించి చెబుతూ "మానవత్వం వున్న భద్రం ఏ పనిలోనూ ఇమడక కష్ఠాలు తెచ్చుకుంటూ వూరు వదిలి ఎటో వెళ్లిపోయాడని చెప్పడంలో రచయిత మంచి వాళ్ళకి ఈలోకంలో చోటు లేదని అన్యాపదేశంగా చెబుతారు" అన్నారు రామచంద్రారెడ్డి. అయితే, ఈ కథలో కండక్టర్ భద్రం తాను చేసే సాయాలకి తన యజమాని రావులు గారి బస్సుని వాడుకోవడం (బస్సులో ప్రయాణించే వాళ్ళ అవసరాలకి అనుగుణంగా అప్పటికప్పుడు రూటు మార్చేయడం - దాదాపు ప్రతిరోజూ) ఎంతవరకూ ఆమోదయోగ్యం అన్న ప్రశ్న వస్తుంది. తన శృతి మించిన మంచితనం కారణంగా యజమానికి (బస్సు వ్యాపారానికి) నష్టం చేస్తున్నానన్న ఆలోచన భద్రంలో వున్నట్టు కనిపించదు. 'మునగచెట్టు' కథకి శ్రీరమణ 'మిథునం' తో పోలిక తేవడం ముచ్చట గొలుపుతుంది. వంశీ కథలతో అతిపెద్ద సమస్య పేర్ల మార్పు. ఓకే కథ వేర్వేరు సంకలనంలో వేరే వేరే పేర్లతో వస్తూ వుంటుంది. ఇందుకు 'మా పసలపూడి కథలు' కూడా మినహాయింపు కాదని చెబుతుందీ పరిశోధనా గ్రంధం.
పసలపూడి కథలన్నీ, ఆ మాటకొస్తే వంశీ రచనలన్నీ, వర్ణన ప్రధానంగా సాగేవే. 'మా పసలపూడి కథలు - వర్ణనలు' అనే అధ్యాయాన్ని మానవ స్వాభావిక వర్ణనలు, ప్రకృతి వర్ణనలు, పల్లె వర్ణనలు, వంటల వర్ణనలు అనే నాలుగు భాగాలుగా విభజించారు. ప్రకృతి వర్ణనల్లో, ఋతు వర్ణనల్ని ప్రత్యేకంగా చేర్చారు. అయితే, వంశీ ప్రతి కథలోనూ చేసే ప్రకృతి వర్ణన రాబోయే సన్నివేశాన్ని లీడ్ చేసేదిగా వుంటుందన్నది నా గమనింపు. వర్ణనని చదువుతూనే పాఠకుడు ఒక మూడ్ లోకి వెళ్తాడు. జరగబోయే సన్నివేశం అచ్చంగా ఆ మూడ్ కి తగ్గట్టుగానే వుంటుంది. పచ్చని ప్రకృతి ఉంది కాబట్టి వర్ణించడం కాదు, వర్ణన ద్వారా తర్వాతి సన్నివేశానికి పాఠకుణ్ణి ప్రిపేర్ చేసి నెమ్మదిగా తీసుకువెళ్లడం. వంటల వర్ణనల్లో "ఎక్కడ అవకాశం దొరికినా అక్కడ వంటల గురించి వివరించిన తీరులో ఆ ప్రాంతపు జీవన శైలిని మరో కోణంలో పాఠకులకి పరిచయం చేయడం వుంది. ఇక్కడ విషయం బతకడం కోసం చేసే భోజనం గురించి కాదు. భోజనం వంకన అక్కడి ప్రజల నడుమ అనురాగానికి ఆ సందర్భాలు ప్రతీకలు. అక్కడి మనుషుల మధ్య పెనవేసుకున్న సాంఘిక జీవన విధానాలని ఆ భోజన పద్ధతుల ద్వారా వివరించే ప్రయత్నం. అలాంటి ప్రయత్నంలో ఈ కథకుడు విజయుడయ్యాడు" అంటారు.
శిల్పాన్ని గురించి చెబుతూ "వంశీ గారి పసలపూడి కథల్లో నిర్దిష్టమైన భౌగోళిక, ప్రాంతీయ స్వభావాన్ని చూడొచ్చు. గోదావరి పరివాహక ప్రాంతాన్ని నేపధ్యంగా తీసుకుని రాసిన ఈ కథలన్నిటికి నిర్దిష్టమైన భాషా సాంస్కృతిక లక్షణాలున్నాయి. రచయిత వాడిన ప్రాంతీయ నుడికారం, ప్రతి వస్తువుకి విశేషణం, దాని వెనకున్న ప్రాంతీయ ప్రత్యేకత కథలకు అదనపు సౌందర్యాన్నిచ్చింది" అన్నారు రామచంద్రారెడ్డి. "కేవలం వర్ణనాత్మక చిత్రణ, భాష, పేర్లు ఇత్యాది విలక్షణాలు వుంటే మాత్రం వంశీ కథలు ఏం చెప్తాయి అనే ప్రశ్నకు ఆ కథలలో - గొప్ప మనసుతో ఎందరినో ఆదుకున్న పాత్రలు, విలువల కోసం తాపత్రయ పడే పాత్రలు, స్వచ్ఛమైన ప్రేమతో ఆకట్టుకునే పాత్రలు, గొప్ప కళా నైపుణ్యంతో వెలుగొందిన జీవితాలు మొదలైనవి ఆదర్శవంతాలు. మోసాలు, ద్వేషాలు, అక్రమ సంబంధాలు అన్యాపదేశంగా చెప్పే మానవ విలువల ప్రాధాన్యాలే ఈ కథల పరమావధి" అనేది ఈ కథలు చదివిన పాఠకులందరూ ఆమోదించే ప్రతిపాదన. పరిశోధకుడే ప్రచురించుకున్న ఈ పుస్తకం వెల రూ. 260. ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ, ఆన్ లైన్ లోనూ కొనుక్కోవచ్చు. మలిముద్రణలో అచ్చుతప్పుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా వుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి