మంగళవారం, నవంబర్ 26, 2024

కులశేఖర్ ...

"మా వైజాగ్ కుర్రాడే.. పాటల్లో మా శ్లాంగ్ అదరగొట్టేడు. నాకో కేసెట్ ఇచ్చేడు వినమని.. తనకి పది కేసెట్లు ఇచ్చేరట" విశాఖ మిత్రుడు ఉత్సాహంగా చెబుతుంటే, "రెమ్యూనరేషన్ గానా?" అని అమాయకంగా అడ్డుపడ్డాను. "లేదులెండి, డబ్బులు కూడా ఇచ్చేరట" నవ్వుతూ జవాబిచ్చేడు. "మా వాడిది సింహాచలం. నాన్నగారు లెక్చరర్, బ్రదర్స్ సింహాచలం టెంపుల్ లో పనిచేస్తారు.. ఈ కుర్రాడికి మొదటి నుంచీ రైటింగ్ బాగా ఇంటరెస్ట్.. శాస్త్రి గారి దగ్గర కొన్నాళ్ళు ట్రైనింగ్ అయ్యేడు" మిత్రుడు వివరించేడు. నిన్నో మొన్నో జరిగినట్టుగా ఉన్న ఈ సంభాషణ జరిగి దాదాపు పాతికేళ్ళు. సంభాషణలో 'కుర్రాడు' సినీ గీత రచయిత కులశేఖర్. కొంచం సేపటి క్రితమే అతని మరణ వార్త చెవిన పడింది. జ్ఞాపకాలు మొదలయ్యాయి. 


'చిత్రం' సినిమా విడుదలకి ముందు ఆ సినిమాకి పని చేసిన చాలామందికి మల్లేనే కులశేఖర్ గురించి కూడా ఎవరికీ తెలియదు. ఆ సినిమా అనూహ్య విజయం సాధించడంతో, పని చేసిన అందరూ ఎంతోమందికి 'మావాళ్ళు' 'మనవాళ్ళు' అయిపోయేరు రాత్రికి రాత్రే. తర్వాత, వాళ్ళందరి ప్రయాణాల్లోనూ అనేక ఎత్తు పల్లాలు. కథానాయకుడు ఉదయ్ కిరణ్ ప్రయాణం, ముగింపు ఎలా అయితే అనూహ్యమో, ఈ కులశేఖర్ ప్రయాణమూ, ముగింపూ కూడా అంతే అనూహ్యం. ఉదయ్ కిరణ్ నాకు తెరమీద మాత్రమే తెలుసు. కానీ, మిత్రుడి కారణంగా కులశేఖర్ కాస్త ఎక్కువ తెలుసు. అర్ధాంతర మరణం - అది ఎవరిదైనా సరే - బాధిస్తుంది. వెళ్లి పోయిన వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడంలో ఏమన్నా సాంత్వన దొరుకుతుందా అంటే, ఏమో.. 

ఉత్తరాంధ్రలో బాగా పాపులర్ అయిన గరివిడి లక్ష్మి హరికథ (?) ట్యూన్లో రాసిన 'ఓ మావా, ఎల్లిపోతున్నాది' పాట బాగా హిట్. 'కుక్క కావాలి' పాటకి కూడా బాగా పేరొచ్చింది. కానీ 'చిత్రం' ఆల్బమ్ లో నాకు బాగా నచ్చిన పాట 'ఊహల పల్లకీలో ఊరేగించనా..' గురువు శాస్త్రి గారు (సిరివెన్నెల సీతారామశాస్త్రి) చేయి చేసుకుని వుంటారా అని అనుమాన పడ్డాను కూడా. అలా జరిగేందుకు ఏమాత్రం అవకాశం లేదని నా మిత్రుడు చాలా గట్టిగా చెప్పేడు. ప్రపంచం మొత్తం విజయం వెనుకే పరుగు తీస్తుంది. అందులో సినిమా పరిశ్రమ ముందుంటుంది. కులశేఖర్ తో సహా, 'చిత్రం' సినిమాకి పని చేసిన వాళ్ళందరూ అక్షరాలా ఊపిరి సలపనంత బిజీ అయిపోయేరు. 


"అంత సక్సెస్ కొట్టినా మా వాడేం మారలేదు తెలుసా.. ఎవరెవరికి రాస్తున్నాడో వివరంగా చెప్పేడు ఫోన్ చేసి" మిత్రుడి అప్డేట్ ని టీ చప్పరిస్తూ విన్నాను. "ఓసారి ప్లాన్ చేసి కలుద్దాం. అతనికి సాహిత్యం అంటే చాలా ఇష్టం. సంతోషిస్తాడు, బాగా మాట్లాడతాడు కూడా..." తల ఊపేను. కలవాలని నేను అనుకోలేదు కానీ, కొన్నాళ్ల తర్వాత కలిశాను. వాక్ మెన్ లో ట్యూన్ వింటూ, పొదిగేందుకు మాటలు వెతుక్కుంటూ, శబ్ద రత్నాకరం తిరగేస్తూ, అతిథుల్ని పలకరిస్తూ అక్షరాలా అష్టావధానం చేస్తున్న కులశేఖర్ ని కాసేపు చూశాను. వాతావరణం బరువుగా వుంది. తీరా డ్రాయింగ్ రూమ్ వరకూ వెళ్లి ఏమీ మాట్లాడకుండా వచ్చేయడం ఎందుకనిపించి అడిగాను, "పెళ్లికిలా పల్లకిలా ఈ ప్రేమ అని రాశారు, అంటే ప్రేమకి పర్యవసానం పెళ్లే అంటారా?" చురుక్కుమన్న చూపు ఇప్పటికీ గుర్తుంది. "ప్రేమకి పర్యవసానం ప్రేమే" అంటూ క్లుప్తమైన జవాబు. 'నువ్వులేక నేనులేను' సినిమాలో 'నిండు గోదారి' పాట చార్ట్ బస్టర్ అప్పట్లో. 

ఒక వృత్తిలో ఉన్నవాళ్లు, సీనియర్లని స్మరిస్తూ ఏదైనా పని చేయడం సినిమా పరిశ్రమలో కొంచం అరుదే. అలాంటిది, 'వచన రచనకి మేస్త్రి' మల్లాది రామకృష్ణ శాస్త్రిని స్మరిస్తూ కులశేఖర్ 'మణిదీపం' అనే సంచిక తీసుకొచ్చేరు. అన్నివిధాలా నాణ్యమైన పుస్తకం. లైబ్రరీలో దాచుకోవలసినది. కాలం గడుస్తోంది. చిత్రమైన పరిశ్రమ కదా. అవకాశాల ఉద్ధృతి నెమ్మదించింది. 'ప్రేమలేఖ రాశా' అనే సినిమాకి దర్శకుడిగా కొత్త అవతారం. తర్వాత కాలంలో బాగా పేరు తెచ్చుకున్న అంజలి కథా నాయిక. ఇప్పుడు వశిష్ట పేరుతో చిరంజీవిని డైరెక్ట్ చేస్తున్న కుర్రాడు హీరో. కుర్రాడి తండ్రి ప్రొడ్యూసర్. సినిమా బాగా ఆడలేదు. ఉప్పొంగిన కెరటం నెమ్మదిగా వెనక్కి తగ్గినట్టుగా, కులశేఖర్ నెమ్మదిగా వెనక వరుసలోకి వెళ్ళిపోయేడు. 

ఏళ్ళు గడిచిపోయేయి. ఉన్నట్టుండి పేపర్లలో ఓ వార్త. గోదావరి జిల్లాలో ఓ ఆలయంలో వెండి వస్తువులు దొంగిలిస్తూ పట్టుబడ్డ సినీ గీత రచయిత కులశేఖర్ అని. అతని మానసిక పరిస్థితి అంత బాగాలేదని కూడా. 'ఓడలు బళ్లవుతాయి' అనేసుకోగలం కానీ, బండిగా మారిన ఓడ కథని ఊహించలేం కదా. "ఆలయాల్లో పని చేసే వాళ్ళు చాలా మంది దేవుడు మా యింటి మనిషే, దేవుడి సొమ్ము మా సొమ్మే అనుకుంటారు.. ఇతను సినిమా వాడవ్వడం వల్ల విషయం పెద్దదయ్యింది" మిత్రుడు ఫోన్ లో అంటున్నాడు.. నాకు చెబుతున్నాడో, తనకి తాను చెప్పుకుంటున్నాడో అర్ధం కాలేదు. "ఇలా జరిగి ఉండాల్సింది కాదు.. చాలా జరిగేయి. నాకు తెలుసు కానీ, చెప్పలేను.. చెప్పాలని లేదు.." కాల్ కట్టయ్యింది. నాకూ తెలుసుకోవాలని లేదు. వెనక్కి తగ్గిన కెరటం మళ్ళీ ఉప్పొంగుతుంది అనుకున్నాను. ఇలా శాశ్వితంగా కుంగిపోతుందని అనుకోలేదు. కులశేఖర్ ఆత్మకి శాంతి కలగాలి. 

6 కామెంట్‌లు:

  1. కుల శేఖర్ అని మంచి పేరు ఉన్నవాడు. వైష్ణవ సంప్రదాయంకు చెందిన వాడు అయి ఉండవచ్చు. అతడు రాసిన కొన్ని పాటలు బాగానే పాపులర్ అయ్యాయి.

    సినీ రచయిత గా రాణించే ప్రతిభ ఉన్నవాడే. అయితే ఏదో సమస్యతో మానసికంగా దెబ్బతిన్నాడు. నియంత్రణ కోల్పోయాడు. జువ్వలాగా ఒక్క సారిగా పైకి ఎగిరి వెలిగి అంతే వేగంగా పతనం అయ్యాడు. 53 ఏళ్లకే వెళ్ళిపోయాడు.

    రిప్లయితొలగించండి
  2. కెరీర్ తలకిందులైతే కొంత మంది తట్టుకోలేరేమో మురళి గారూ.
    చుట్టూ చేరి తప్పు దోవ పట్టించే కుట్రదారుల మాటల్లో పడడం కూడా ఒక కారణం. తద్వారా తగులుకునే దుర్వ్యసనాలు, వాటిల్లో మునిగి తేలుతూ వృత్తి కమిట్ మెంట్స్ ని నిర్లక్ష్యం చెయ్యడం మరో బలమైన కారణం. అలనాటి అందాల నటుడు రామ్మోహన్ మరో ఉదాహరణ. కొంతవరకు స్వయంకృతాపరాధాలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజమండీ.. ఎదగడం ఎంత కష్టమో, నిలబడడం అంతకన్నా ఎక్కువ కష్టం.. ధన్యవాదాలు.. 

      తొలగించండి
  3. సక్సెస్ స్టెప్ బై స్టెప్ వస్తేనే ఫౌండేషన్ స్ట్రాంగ్ గా వుంటుంది అనుకుంటా..ఓవర్ నైట్ తో వచ్చే పాపులారిటీ, సక్సెస్ పునాది లేని కట్టడం లాగే ఎప్పుడు కూలిపోతుందో తెలీదు.

    రిప్లయితొలగించండి
  4. జెనెరిక్ గా ఇలా అనేసుకోలేమండీ.. స్టెప్ బై స్టెప్ ఎదిగి కూడా అనూహ్యంగా కూలిన మహానటులున్న పరిశ్రమ అది.. అలాగే ఓవర్ నైట్ వచ్చి నిలదొక్కుకున్న వాళ్ళూ ఉన్నారు.. ఏ కథ కి ఆ కథే ప్రత్యేకం.. ధన్యవాదాలు.. 

    రిప్లయితొలగించండి