శనివారం, ఏప్రిల్ 22, 2023

సంకెళ్లను తెంచుకుంటూ

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రిటైర్డ్  చీఫ్ సెక్రటరీ కాకి మాధవరావు ఆత్మకథ 'సంకెళ్లను తెంచుకుంటూ'. మాధవ రావు స్వయంగా ఇంగ్లీష్ లో రాసుకున్న 'బ్రేకింగ్ బారియర్స్' కు రఘురాములు చేసిన తెలుగు అనువాదం ఇది. కృష్ణా జిల్లా పెద మద్దాలి గ్రామంలో ఓ దళిత కుటుంబంలో జన్మించి, తల్లి ప్రోత్సాహంతో చదువు సాగించి, ఐఏఎస్ సాధించి, ఎందరో ఐఏఎస్లు కలగనే చీఫ్ సెక్రటరీ పోస్టు వరకూ రావు చేసిన ప్రయాణమే ఈ పుస్తకం. వ్యవసాయ కూలీలుగా పని చేసిన మాణిక్యమ్మ, శోభనాద్రి దంపతుల చిన్న (రెండో) కొడుకుగా పేదరికంలో గడిచిన బాల్యం మొదలుకొని, ఉద్యోగ జీవితంలో ఎదురైన సవాళ్లు, ఆటుపోట్లు మీదుగా, తాను కోరుకుంటున్న సాంఘిక, రాజకీయ సంస్కరణల వరకూ తన అనుభవాలను, ఆలోచనలను అక్షరబద్ధం చేశారు మాధవ రావు. 

మోతుబరి రైతు దగ్గర పాలేరుగా జీవితం గడిపిన శోభనాద్రి తన కొడుకులు ఇద్దరూ కూడా తనలాగే 'నమ్మకస్తులైన పాలేర్లు' గా జీవించాలని గట్టిగా కోరుకున్నారు. ఈ ఆలోచనని అంతకన్నా గట్టిగా వ్యతిరేకించారు మాణిక్యమ్మ. ఫలితం, కొడుకులిద్దరూ ఊరి ఎలిమెంటరీ స్కూలు దాటి హైస్కూలుకి, అటుపైన కాలేజీకి వెళ్లి చదువుకునే అవకాశం దొరికింది. పెద్ద కొడుకు ఉద్యోగంలో కుదురుకోగా, ఆంధ్రా యూనివర్సిటీలో పీజీ చదివిన మాధవరావు సివిల్ సర్వీసెస్ సాధించారు. తనకి మేలు చేసిన ఎంతో మందిని పుస్తకం పొడవునా పేరు పేరునా ప్రస్తావించినప్పటికీ, తనలో సివిల్ సర్వీసెస్ ఆలోచన మొలకెత్తడానికి కారకులు, ప్రిపరేషన్ కి సహాయ పడిన వారు, ప్రోత్సహించిన వారి వివరాలని ఎక్కడా రాయకుండా ఆశ్చర్య పరిచారు రచయిత. 

"కట్ చేస్తే ఐఏఎస్" అన్నంత సులువుగా చదువు నుంచి ఉద్యోగ విషయాల్లోకి వచ్చేయడం వల్ల ఓ ముఖ్యమైన లింక్ మిస్సయినట్టుగా అనిపించింది పుస్తకం చదువుతుంటే. ప్రారంభంలో ఏ కెరీర్ లో అయినా ఇబ్బందులు సహజమే. సివిల్ సర్వీస్ ఇందుకు మినహాయింపు కాదని గతంలో కొందరు ఐఏఎస్ లు రాసిన ఆత్మకథల్లో చదువుకున్నాం. అలాంటి సమస్యలే మాధవరావుకీ ఎదురయ్యాయి. తనని ఇబ్బంది పెట్టిన అధికారుల పేర్లు బయట పెట్టలేదన్న మాటే కానీ, వాళ్ళ వివరాలు ఎంత సూక్ష్మంగా చెప్పారంటే -- ఇచ్చిన ఆధారాల సాయంతో గూగుల్ చేసి వాళ్ళ పేర్లు, ఫోటోలు సరి చూసుకోవచ్చు. ఎన్నో క్లిష్టమైన ఫైళ్లని పరిష్కరించిన అనుభవం కదా మరి. వరంగల్ కలెక్టర్ గా పని చేసిన నాటి అనుభవాలు మాత్రం ఆసక్తిగా చదివిస్తాయి. 'నక్సలైట్ సానుభూతి పరుడు' అన్న ముద్ర పడింది అప్పుడే. 

నేదురుమల్లి జనార్దన  రెడ్డి  ముఖ్యమంత్రి గా పనిచేసే రోజుల్లో, మాధవరావు సెక్రటరీ గా ఉన్నారు. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత హైదరాబాద్ వస్తున్నారు. మాధవరావు ని ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఆమెకి స్వాగతం పలకమన్నారు జనార్దన రెడ్డి. అంతకు మునుపే జనార్దన  రెడ్డి తమిళనాడు వెళ్ళినప్పుడు జయలలిత సెక్రటరీ ఆయనకి స్వాగతం పలికారు. ఇది బదులు తీర్చుకోడం అన్నమాట. అయితే, జయలలితకి స్వాగతం పలకడానికి మాధవరావు నిరాకరించారు. ఆయనదృష్టిలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత జానకి రామచంద్రన్ (ఎంజీఆర్ భార్య) కి ఉంది తప్ప, జయలలితకి కాదు. ఈ అభ్యంతరాన్ని జనార్దన రెడ్డి మన్నించారు. అనూహ్యంగా, ఇది జరిగిన కొన్నేళ్ళకే, ఎన్టీఆర్ వెన్నుపోటు ఫలితంగా ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ పదవి చేపట్టారు మాధవరావు. దీనిని కేవలం 'పారడాక్స్' అనగలమా?  

మొత్తం పధ్నాలుగు అధ్యాయాలుగా విభజించిన ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చినవి పది, పదకొండు అధ్యాయాలు. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు పనితీరు పట్ల రచయిత పరిశీలనలున్నాయి వీటిలో. తాను చెప్పాలనుకున్న విషయాలని కొన్ని చోట్ల నేరుగానూ, చాలాచోట్ల గుంభనంగానూ చెప్పుకొచ్చారు. ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ ఏర్పాటు గురించి చెబుతూ "హైదరాబాద్ సంస్థాన పరిపాలకుడైన నిజాం ఉస్మానియా యూనివర్సిటీ కి 1917 లో 1,600 ఎకరాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఒక్క బిజినెస్ స్కూల్ కు 260 ఎకరాలు కేటాయించారు" అన్నారు. ఈ రెంటిలో ఏ సంస్థ ఏయే వర్గాలకి ఉపయోగ పడిందన్న ప్రశ్న పాఠకులే వేసుకుని, జవాబు వెతుక్కోవాలి. ఐఎస్బీ కి, సింగపూర్ విమానాలకి ఇచ్చిన 'రాయితీ' లని వివరంగానే ప్రస్తావించారు. 

మొత్తం పుస్తకాన్ని పూర్తి చేశాక, రచయిత తన చిన్ననాటి పేదరికాన్ని, తన కులాన్ని 'సంకెళ్లు' గా భావించారనిపించింది. కడుపు నిండా తిండి దొరకని నాటి పేదరికం, అప్పుడు తప్పక మొదలుపెట్టిన మితాహారాన్ని ఇప్పటికీ కొనసాగించడం లాంటి విషయాలు కదిలిస్తాయి. అయితే, కులం అన్నది ఆయన విషయంలో సంకెలగా కాక పూలదండగానే మారిందనిపించింది (పుస్తకంలో ప్రస్తావించిన విషయాల మేరకు). మరీ ముఖ్యంగా, చీఫ్ సెక్రటరీ నియామకం వెనుక కులం బలంగా పనిచేసింది. ఎస్సీ వర్గీకరణ ఆందోళనలు జరుగుతున్న ఆ రోజుల్లో కీలక పదవికి తనని ఎంపిక చేయడం వెనుక చంద్రబాబు నాయుడు వ్యూహమూ, చాతుర్యమూ ఉన్నాయన్నది మాధవరావే అంగీకరించిన విషయం. పాలనా సంబంధ విషయాల పట్ల ఆసక్తి ఉన్నవారికి ఆసక్తి కలిగించే పుస్తకం. అనువాదం మరికొంత సరళంగా ఉండొచ్చు. (భూమి బుక్ ట్రస్ట్ ప్రచురణ, పేజీలు 289, వెల రూ. 300. అన్ని ప్రముఖ పుస్తకాల షాపులతో పాటు ఆన్లైన్ లోనూ లభ్యం). 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి