సోమవారం, మార్చి 06, 2023

గ్లాచ్చు మీచ్యూ 

అసలు పుస్తకం పేరే భలే చమత్కారంగా ఉంది కదా అనుకుంటూ చేతిలోకి తీసుకుంటే, 'నా పర్సనల్ స్టోరీలు' అనే ఆకర్షణీయమైన ఉపశీర్షిక పుస్తకాన్ని బిల్లింగ్ కౌంటర్ వైపు నడిపించింది. పుస్తకం మీద దృష్టి పడడానికి కారణమేమో కవర్ పేజీ మీద రచయిత 'జయదేవ్' పేరు మరియు పోర్ట్రైట్. జయదేవ్ కార్టూనులు తెలుగు నాట మాత్రమే కాదు, అంతర్జాతీయంగానూ పేరు పొందాయి. తెలుగు వ్యాఖ్యల కార్టూన్లు పత్రికలు చదివే తెలుగు వాళ్ళని గిలిగింతలు పెడితే, క్యాప్షన్ లెస్ కార్టూనులు అంతర్జాతీయ పోటీల్లో ఆయనకి బహుమతులు తెచ్చిపెట్టాయి. కార్టూన్ రేఖలు మాత్రమే కాదు, జయదేవ్ వాటికి రాసే వ్యాఖ్యలూ బహు పొదుపుగా ఉంటాయి. ఒక్కోసారి రెండోసారి చదువుకుని అర్ధం చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఇదిగో ఈ పర్సనల్ స్టోరీలని కూడా రెండో సారి చదవాల్సిందే - అర్ధం చేసుకోడానికి కాదు, మరింతగా ఆస్వాదించడానికి. 

మద్రాసు చాకలి వీధిలో 'రేడియో కారమ్మ' మనవడిగా బాల్యాన్ని గడిపారు జయదేవ్. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో మొదట రేడియో కొనుక్కున్నది వీళ్ళే కావడంతో, ఇంటి యజమానురాలి పేరు మీద 'రేడియో కారమ్మ ఇల్లు' గా పేరు స్థిరపడి పోయింది. ఎక్సయిజ్ డిపార్ట్మెంట్ లో పని చేసే తండ్రి గారిది బదిలీల ఉద్యోగం కావడంతో, నాయనమ్మ, చిన్నాన్నల దగ్గర ఉండి చదువుకున్నారు జయదేవ్. వీళ్ళతో పాటు మేనత్త 'అనసూయమ్మఆంటీ' .. ఈవిడ దాదాపు జయదేవ్ ఈడుదే. మధ్యతరగతి మందహాసం, పైగా మద్రాసు నగరంలో.. ఇక సరదా కబుర్లకి లోటేం ఉంటుంది? వందకి పైగా ఉన్న స్టోరీలని ఒక ఆర్డర్ లో చెప్పాలనే శషభిషలేవీ పెట్టుకోలేదు రచయిత. అలాగని కొమ్మచ్చులూ ఆడలేదు. ఒక్కో స్టోరీని రెండు మూడు పేజీలకి మించకుండా క్లుప్తంగా చెబుతూనే, ఎక్కడా చర్విత చర్వణం కాకుండా జాగ్రత్త పడ్డారు. 

చిత్రకళ మీద లోపలెక్కడో ఉన్న ఆసక్తి బడి రోజుల్లో బయట పడింది. బళ్ళో మేష్టర్ల తో పాటు ఇంట్లో సభ్యులూ ప్రోత్సహించడంతో మెరుగులు దిద్దుకునే అవకాశం దొరికింది. కెరీరిజం ఊపందుకోని పంతొమ్మిది వందల యాభైల నాటి రోజులు కదా. రేఖలు సాధన చేస్తూనే, కార్టూనులు గీసి పత్రికలకి పంపడం, అవి అచ్చయ్యి పారితోషికాలు వస్తూ ఉండడం త్వరలోనే మొదలయ్యింది. కాలేజీ చదువుకు వచ్చే నాటికి, కార్టూన్ మానియార్దర్లు ఖర్చులకి సరిపోయేవి. పేరొచ్చేసినా సాధనని ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదు. ప్రతినెలా కార్టూనులు మీద వచ్చిన డబ్బులో కొంతభాగం డ్రాయింగ్ పేపర్లు, రంగుల కోసం, మరికొంత భాగాన్ని అంతర్జాతీయ పత్రికలు కొనడం కోసం క్రమం తప్పకుండా వెచ్చించేవారు జయదేవ్. అదిగో, ఆ పత్రికలు చదివే అలవాటే అంతర్జాతీయ కార్టూన్ రంగంలో అడుగు పెట్టడానికి దారి చూపింది. 

చదువుకున్న కాలేజీలోనే జువాలజీ డిమాన్ స్ట్రేటర్ ఉద్యోగం రావడంతో మద్రాసు వదిలి వెళ్లాల్సిన అవసరం కనిపించలేదు. కార్టూనింగ్ నే కాదు, చదువునీ విడిచిపెట్టలేదు. పులికాట్ చేపల మీద జయదేవ్ చేసిన పరిశోధన విశేషాలు ఎంత ఆసక్తిగా చదివిస్తాయో, ఆయన స్నేహితుడు పులికాట్ జలగలు మీద చేసిన పరిశోధన విశేషాలు అంతకు మించి చదివిస్తాయి. ఎంత ఘాటు విషయాన్నైనా అలవోకగా నవ్విస్తూ చెప్పడం ఆయనకి బాగా అలవాటైపోయింది మరి. సరదా సంభాషణ, స్నేహశీలత జయదేవ్ వ్యక్తిత్వంలో ప్రత్యేకతలు అనిపిస్తుంద కాలేజీలో లెక్చరర్లకు ఇళ్ల నుంచి కేరేజీలు తెచ్చే అమ్మాయికి 'క్లియోపాత్రా' అనే ముద్దు పేరు పెట్టి, ఆమెకో ప్రేమకథ సృష్టించి కార్టూన్లు వేయడం లాంటి చమక్కులు అసలు కథలో సరదాగా కలిసిపోయే కొసరు కథలు. స్టాఫ్ రూమ్ బోర్డు మీద రోజూ కార్టూన్ స్ట్రిప్ గా గీసే ఆ ప్రేమకథ కోసం లెక్చరర్లందరూ ఎదురు చూసేవారట. 

చిత్రకారులు, కార్టూనిస్టులు అందరితోనూ స్నేహం చేసి, దాన్ని నిలబెట్టుకున్నారు జయదేవ్. చిన్నా పెద్దా భేదాలు చూడలేదు. తనకి కావాల్సిన విషయాలు నేర్చుకోడానికి, తనకి తెలిసినవి నేర్పడానికి వెనకాడలేదు. ఆ అనుభవాలని అక్షరబద్ధం చేయడంలో ఎక్కడా ఆత్మస్తుతికి, పరనిందకీ చోటివ్వలేదు. (ఈమధ్యే మరో చిత్రకారుడి పరనిందా పూరితమైన ఆత్మకథ - బాలి 'చిత్రమైన జీవితం' - చదివానేమో, ఈ పుస్తకం మరింత హాయిగా అనిపించింది. సెన్సారు బోర్డు సభ్యుడిగా పనిచేసిన నాటి విశేషాల మొదలు, బాపూ-రమణల టెలిస్కూల్ పాఠాల కబుర్ల వరకూ ఏళ్ళ నాటి ముచ్చట్లని హాయిగా చెప్పారు. కార్టూనిస్టులందరినీ ఏకతాటి మీదకి తెచ్చి సభలు నిర్వహించడం లాంటి కబుర్లు ఆసక్తిగా అనిపించాయి. మద్రాసు జీవితం, తరచూ వచ్చే అనారోగ్యాలు, వాటికి చేయించుకునే వైద్యాలు లాంటి బరువైన విషయాలని కూడా తేలిగ్గా చెప్పారు. 

ముందుమాట రాసిన మాలతీ చందూర్ (ఈ పుస్తకం తొలి ముద్రణ 2009) "వీరేశలింగం గారి 'స్వీయ చరిత్ర', గురజాడ వారి డైరీలు, శ్రీపాద వారి 'కథలు-గాధలు' ..." అంటూ జాబితా రాశారు. 'కథలు-గాధలు' రచన శ్రీపాద వారిది కాదు, చెళ్ళపిళ్ళ వారిది. ప్రకాశకులైనా సరిదిద్ది ఉంటే బాగుండేది. కాస్త తక్కువగా నాలుగొందల పేజీలున్న ఈ పుస్తకంలో ప్రతి స్టోరీకీ జయదేవ్ స్వయంగా వేసుకున్న రేఖా చిత్రం ప్రత్యేక ఆకర్షణ. ఆపకుండా చదివించే కథనం, శైలి. జయదేవ్ జీవితంతో పాటు, తెలుగునాట కార్టూన్ పరిణామ క్రమాన్ని గురించి కూడా రేఖా మాత్రపు అవగాహనని ఇచ్చే రచన ఇది. (వియన్నార్ బుక్ వరల్డ్, చౌడేపల్లి, చిత్తూరు వారి ప్రచురణ. వెల రూ. 250). 

2 కామెంట్‌లు:

 1. “క్లియోపాత్రా” 🙂🙂. భలే పేరు పెట్టారు 🙂.

  పెద్దావిడ, కీర్తి శేషురాలు గురించి అనకూడదు గానీ చిన్న విషయం అడిగినా ఏవేవో వివరాలు దట్టించి చాంతాడంత సమాధానం వ్రాయడం ఆవిడకు అలవాటేగా. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పుస్తకం పేరు “అనుభవాలు-జ్ఞాపకాలూను”. ఇక ఈనాటి ప్రకాశకుల వద్ద నుంచి అంత పరిజ్ఞానం ఆశించడం అనవసరమేమో? వావిళ్ళ రామశాస్త్రులు, నవోదయ రామ్మోహన్ రావు గారు వంటి వారి రోజులు కావు గదా ఇవి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అందరికీ (పుస్తకాలు చదివే అందరికీ) తెలిసిన పుస్తకం పేరు కదండీ.. పైగా ఆవిడ నుంచి పొరపాటు దొర్లడం.. చివుక్కు మనిపించింది.. సరిచేసి ఉంటే బాగుండేదనికూడా.. ఓవర్ లుక్ అయిందేమో అని సరిపెట్టుకున్నాను.. ధన్యవాదాలు.. 

   తొలగించండి