శుక్రవారం, అక్టోబర్ 09, 2020

కొండపొలం 

తెలుగు నవల ప్రౌఢిమను సంతరించుకుని శతాబ్దం కావొస్తున్నా అనేక వర్గాల జీవితాలు సమగ్రంగా రికార్డు కాలేదన్న సత్యాన్ని మరోమారు ఎత్తిచూపే నవల సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన 'కొండపొలం.'  కరువుసీమ రాయలసీమలోని గొర్రెల కాపరుల జీవితాలని ఇతివృత్తంగా తీసుకుని ఈ నవల రాశారు. ఏళ్లతరబడి వాళ్ళ జీవితాలని పరిశీలించి, ఎన్నో వివరాలని సేకరించి, దానికి ఓ వ్యక్తిత్వ వికాసపు కథని జోడించి నవలగా మలిచారు రచయిత. పుస్తకం చదవడం పూర్తి చేసి పక్కన పెట్టాక కూడా గొర్రెలు, గొర్రెల కాపరులు, వాళ్ళ జీవన విధానం కొన్నాళ్లపాటు పాఠకులని వెంటాడతాయనడం అతిశయోక్తి కాదు. కథానాయకుడు రవిని మాత్రమే కాదు, అతని తండ్రి గురప్పనీ, గురు సమానుడు పుల్లయ్యనీ, స్నేహితులు అంకయ్య, భాస్కర్ తదితరులనీ, మరీముఖ్యంగా అతని జీవన గతిని మార్చేసిన పెద్దపులినీ మర్చిపోవడం అంత సులువేమీ కాదు. 

పంటపొలాలకి సకాలంలో నీరందకపోతే పంట నష్టం. అదే గొర్రెలకు మేతా, నీరూ అందకపోతే ప్రాణ నష్టం. కరువు విలయతాండవం చేస్తున్న ఓ వేసవిలో, తమ గొర్రెలకి ఎలాగయినా మేత, నీరు అందించి వాటిని రక్షించుకోవాలని 'కొండపొలం' బయల్దేరతారు అహోబిలం సమీపంలోని ఓ గ్రామంలో గొల్లలు.ముందుగా కొందరు అడవికి వెళ్లి పచ్చిక, నీరు అందుబాటులో ఉన్న చోట్లని గుర్తు పెట్టుకుని రావడంతో ప్రయాణ సన్నాహాలు మొదలవుతాయి. ఒక్కో మంద లోనూ వందేసి గొర్రెలు. వాటిని నిలేసేందుకు ఇద్దరిద్దరు కాపరులు. వారం రోజులకి సరిపడా పాడవ్వని ప్రత్యేకమైన ఆహారం (రొట్టెలు వగయిరా), నీళ్ల క్యాన్లు తదితర సామాగ్రితో బయల్దేరతారు. ప్రతివారం ఊరినుంచి ఎవరో ఒకరు అందరు కాపరుల మరుసటి వారపు ఆహారాన్నీ (భత్యం అంటారు) అడవికి తీసుకెళ్లి ఇవ్వాలి. ఊళ్ళో వానలు కురిశాకే మందలు, వాటితో పాటు కాపరులూ  వెనక్కి తిరిగి వచ్చేది. 

గురప్ప మందకి రెండో మనిషి కావాలి. ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అందరికీ గొర్రెలు అలవాటే. పెద్ద కొడుక్కి మూడు నెలల క్రితమే పెళ్లయింది. పెళ్ళైన తొలి ఏడాది కొండపొలం వెళ్లకూడదని గొల్లల ఆచారం. అలాగే ఆడపిల్లని అడవికి తీసుకెళ్లడాన్ని కూడా సమర్ధించరు. అలా వెళ్లిన అమ్మాయికి పెళ్లి సంబంధాలు రావడమూ కష్టమే. ఇక మిగిలింది రెండో కొడుకు రవి. ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్ లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న రవి, ఆ సమయానికి ఊళ్ళోనే ఉంటాడు. రవి అడవిలో ఉండగలడా, తనకి సాయ పడగలడా అన్నది గురప్ప సందేహమైతే, చదువుకున్న కుర్రాణ్ణి కొండపొలం పంపడం అతని భార్యకి అభ్యంతరం. మందకి రెండో మనిషి దొరక్క పోవడంతో అడవికి ప్రయాణం కాక తప్పదు రవికి. ఆ ప్రయాణం మొదలైనప్పటి నుంచీ, కొండపొలాన్ని రవి కళ్ళతో పాఠకులకి చూపించారు రచయిత. 

చదువుకున్న వాడే కానీ బొత్తిగా భయస్తుడు రవి. ఆ భయం కారణంగానే నాలుగేళ్లుగా ప్రయత్నిస్తున్నా ఉద్యోగం సంపాదించుకోలేక పోతున్నాడు. ఇంటర్యూ అన్నా, గ్రూప్ డిస్కషన్ అన్నా తగని భయం అతనికి. పల్లెటూరివాడిననే ఆత్మ న్యూనత నుంచి బయట పడలేక పోతున్నాడు. ఈ అడవి ప్రయాణం అతనికి పూర్తిగా కొత్త. యాభై రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన కొండపొలం తొలినాళ్లలో తాడుని చూసి పామనుకుని భయపడిన వాడు, నక్కని చూసి జడుసుకున్న వాడూ, చివరికి వచ్చేసరికి తన గొర్రెల మందని రక్షించుకోడానికి పెద్దపులితో తలబడే ధైర్యాన్ని సంతరించుకుంటాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని మించి ఇంకేదన్నా సాధించాలనీ, తనవల్ల అడవికి ఏదన్నా ఉపకారం జరగాలనీ తపిస్తాడు. కొత్త లక్ష్యాన్ని ఏర్పరుచుకుని విజయం సాధిస్తాడు. 

నవలలో పాఠకులని కట్టిపడేసేది మాత్రం యాభై రోజులపాటు సాగే కొండపొలం. గొర్రెలు, కాపరులతో పాటు పాఠకులు కూడా నల్లమలకి వెళ్ళిపోతారు. కొండచిలువలు, చిరుతలు, పెద్దపులుల నుంచి గొర్రెలకు, కాపరులకు ఎదురయ్యే సవాళ్ళకి ఉద్విగ్న పడతారు. కాపరుల వ్యక్తిగత జీవితాలలో జరిగే సంఘటనలని సొంత మనుషులకి జరిగిన వాటిగా భావిస్తారు. ఊళ్ళో ఎప్పుడు వర్షం కురుస్తుందా, ఈ మందలన్నీ ఎప్పుడు ఈ అడవి నుంచి బయట పడతాయా అని ఎదురు చూస్తారు. ఇలా చూసేలా చేయడంలో రచయిత కృతకృత్యులయ్యారు. నవల చదువుతూ ఉంటే, కాపరులతో పాటు రచయిత కూడా కొండపొలం వెళ్లి తన అనుభవాలని రికార్డు చేశారా అనిపించేంత గాఢమైన సన్నివేశ కల్పన చేశారు. ఎర్ర చందనం అక్రమ రవాణాని, చెంచుల సమస్యలని కూడా ఈ గొల్లల కథలో భాగం చేశారు. 

'కొండపొలం' చదవడం పూర్తి చేశాక సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డిలోని ఆశావాది కనిపిస్తాడు పాఠకులకి.  రవిని అటవీశాఖ అధికారిని చేయడం మాత్రమే కాదు, అతని కారణంగా ఎర్ర చందనం స్మగ్లింగ్ ఆగిపోయిందని చెబుతారు మరి. పాత్రల చిత్రణకి వస్తే మనుషుల్ని కేవలం బ్లాక్ అండ్ వైట్ లో మాత్రమే చూశారు. అధికశాతం పాత్రలు మంచి వాళ్ళు (దాదాపుగా ఒకే మూసలో ఉంటారు వీళ్ళు), కొద్దిమంది చెడ్డవాళ్ళు (వీళ్ళదీ ఒకే ధోరణి). నలుగురు మనుషులు కలిస్తే రాజకీయం పుడుతుందని వాడుక. అందరు గొల్లలు కలిసి అన్ని రోజులు అడవిలో గడిపినా ఎక్కడా వాళ్లలో వాళ్ళకి అభిప్రాయ భేదాలు వచ్చే సందర్భం లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అందరూ అన్నివేళలా ఒకే మాట మీద ఉండడం, ఎవరూ, ఎదురాడక పోవడం అన్నది కొండపొలం లాంటి ప్రత్యేక సందర్భాలలో సహజంగానే జరుగుతుందా, లేక రచయిత పాజిటివిటీకి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి అలాంటి వాటికి కథలో చోటివ్వలేదా అన్న ఆలోచన వచ్చింది నాకు. 

నవల ప్రారంభం కొంచం నాటకీయంగా ఉన్నా, ఒక్కసారి కొండపొలం  మొదలయ్యాక ఊపిరి బిగబట్టి చదివిస్తుంది. సంభాషణలు అక్కడక్కడా ప్రీచీగా అనిపిస్తాయి కానీ అవేవీ కథా గమనానికి అడ్డు పడవు. ఎక్కడా సుదీర్ఘమైన సంభాషణలు లేవు కూడా. రవిలో మార్పు వచ్చే క్రమాన్ని, చుట్టూ జరిగే సంఘటనలకు అతని స్పందనలో క్రమేపీ వచ్చే మార్పునీ ప్రత్యేకంగా చిత్రించారు. కథని పట్టుగా నడిపించడానికి పెద్దపులి పాత్ర ఎంతగానో దోహద పడింది. ఏ మలుపు నుంచి, ఏ చెట్టు/బండచాటు నుంచి పెద్దపులి వచ్చి మంద మీద దాడి చేస్తుందో అనే సందేహం పాఠకులని ప్రతి పేజీలోనూ అప్రమత్తంగా ఉంచుతుంది. తరువాతి పేజీకి పరుగెత్తేలా చేస్తుంది. నిజానికి ఈ నవలని కొండపొలం వెళ్లొచ్చిన గొల్ల కులం వారెవరైనా రాసి ఉంటే ఎలా ఉండేదా అన్న ఆలోచన వచ్చింది. చివర్లో చదివిన ముందుమాటలో రచయిత కూడా ఇలాంటి అభిప్రాయాన్నే ప్రకటించారు. సాహిత్యాభిమానులు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది. 

(తానా నవలల పోటీలో రెండు లక్షల రూపాయల బహుమతిని గెలుచుకున్న ఈ నవల 'తానా ప్రచురణలు' ద్వారా మార్కెట్లో ఉంది. పేజీలు 350, వెల రూ. 200).

3 కామెంట్‌లు:

  1. కొండపొలానికి ఏర్పాట్లు మొదలైనప్పటి నుండే అసలు కథ మొదలవుతుంది. దానికి ముందు జరిగే సంఘటనలు మరీ ముఖ్యంగా రవి వ్యక్తిత్వ వికాస పాఠాలు ఈ కథకి అవసరంలేని మోత. ఎర్రచందనం స్మగ్లర్ల ఎపిసోడ్ కూడా సినిమాటిక్‌గా ఉంటుంది.

    కానీ మీరన్నట్టు నవల పూర్తిచేసిన తర్వాత కూడా కొన్నిరోజులపాటు ఆ అడవి, ఆ గొఱ్ఱెలు, అడవిలోని ఆ రాత్రులు వెంటాడుతూ ఉంటాయి.

    మీకు తెలిసే ఉంటుంది క్రిష్ దర్శకత్వంలో వైష్ణోతేజ్ హీరోగా సినిమా చేస్తున్నారు. వికారాబాద్‌లో షూటింగ్ నడుస్తోంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 'కొండపొలం' రవిలో తెచ్చిన మార్పుని చిత్రించడం కోసం అదంతా అనిపించిందండీ.. సినిమా గురించి విన్నాను. క్రిష్ సినిమాల్లో గ్రాఫిక్స్ మీద శ్రద్ధ ఉండదని నాకో కంప్లైంట్ .. ఇందులో సీజీ చాలా ముఖ్యం.. ఎలా తీస్తారో మరి. ..ధన్యవాదాలు 

      తొలగించండి
  2. ఈ నవల నేను చదవలేదు కాని, ఈ టపా చదివాక గతంలో చూసిన ఒక బాలల చిత్రం గుర్తొచ్చింది. దాని పేరు “గౌరు – జర్నీ ఆఫ్ కరేజ్"
    ఆ సినిమా గురించి నేను వ్రాసిన టపా.
    https://bonagiri.wordpress.com/2017/09/17/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B0%E0%B1%87%E0%B0%A6%E0%B0%BF/

    రిప్లయితొలగించండి