శనివారం, సెప్టెంబర్ 26, 2020

బాలూ

తనకి కరోనా పాజిటివ్ వచ్చిందనీ, ముందు జాగ్రత్త కోసం ఆస్పత్రిలో చేరుతున్నాననీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సెల్ఫీ వీడియో విడుదల చేసినప్పుడు, "ఒకసారి ట్రీట్మెంట్ చేయించుకుని వచ్చేస్తే ఇక పాడుతా తీయగా, స్వరాభిషేకం ప్రోగ్రాం షూటింగులు పెట్టేసుకుంటారు కాబోలు" అనుకున్నాను. వైద్యం అలా కొనసాగుతూ ఉన్నప్పుడు కూడా అదే నమ్మకం, "ఇవాళ కాకపోతే రేపు.. 'నా ఆరోగ్యం కోసం ప్రార్ధించిన మీ అందరికీ అనేక నమస్కారాలు' అంటూ టీవీలో కనిపించేస్తాడు" అనుకున్నా. కోలుకుంటున్న కబురులు వినిపిస్తూనే, ఉన్నట్టుండి పరిస్థితి విషమం అనీ, అటుపైన 'ఇకలేరు' అనీ చెప్పేశారు హాస్పిటల్ వాళ్ళు. వాళ్ళు చెప్పే వరకూ కూడా ఆగకుండా సోషల్ మీడియాలో నివాళులు హోరెత్తడం మొదలుపెట్టేశాయి. నివాళులు అర్పించడంలో మనమే ముందుండాలనే సోషల్ మీడియా రష్ బాలూని కొన్ని గంటల ముందుగానే స్వర్గస్తుణ్ణి చేసేసింది. ఇది విషాదంలోని మరో విషాదం. 

బాలూ అంటే నాకు మా ఇంట్లో ఉండే కరెంట్ రేడియో. తర్వాతి కాలంలో విరివిగా వచ్చిన పోర్టబుల్ టీవీ సైజులో ఉండే ఆ రేడియోలోనే బాలూ పేరుని, పాటని మొదటగా వినడం. అరుదుగా పత్రికల్లో ఇంటర్యూలు వచ్చేవి. తను కాస్త బొద్దుగా మారిన రోజుల్లో ఓ కాలేజీ అమ్మాయి తన దగ్గరికి వచ్చి 'లవ్ బాలూ' అందనీ, తనేమో 'లవ్ బాలూ కాదమ్మా లావు బాలూ' అన్నాననీ చెప్పిన ఇంటర్యూ బాగా గుర్తుండిపోయింది. సినిమాల్లో అడపాదడపా వేషాలు, డబ్బింగులు ఇవన్నీ ఓ వైపైతే పాతికేళ్ల క్రితం మొదలైన ప్రయివేటు తెలుగు చానళ్ళు, వాటిల్లో తరచుగా కనిపిస్తూ, పాడుతూ, మాట్లాడుతూ ఉండే బాలూ మరోవైపు. ఘంటసాల తర్వాతి తరంలో వచ్చిన పాటల్లో నూటికి తొంభై బాలూవే అవ్వడం వల్ల కూడా కావొచ్చు, వైవిధ్యంగా ఉండే జేసుదాసు గొంతు నాకు అభిమాన పాత్రమయ్యింది. దీనర్ధం బాలూ పాట ఇష్టం లేదని కాదు. అసలు బాలూ పాటని ఇష్టపడకుండా ఉండడం సాధ్యపడదేమో కూడా. 

టీవీ చానళ్ళు-బాలూ అనగానే అందరికీ మొదట గుర్తొచ్చేది 'పాడుతా తీయగా' కార్యక్రమం. నేను టీవీ తెరమీద బాలూని దగ్గరగా గమనించింది మాత్రం అదే సమయంలో జరిగిన ఓ సినిమా కార్యక్రమంలో. అందరూ చిన్న పిల్లలతో ఎమ్మెస్ రెడ్డి మల్లెమాల పతాకం మీద నిర్మించిన 'రామాయణం'  (జూనియర్ ఎన్ఠీఆర్ మొదటి సినిమా) చిత్రాన్ని ప్రమోట్ చేయడం కోసం బాల నటీనటులతో  జెమినీలో ఓ ఇంటర్యూ వచ్చింది. ఆశ్చర్యంగా, ఆ ఇంటర్యూ నిర్వహించింది బాలూనే. రాముడి పాత్ర కాకుండా నీకు ఇష్టమైన ఇంకో పాత్ర ఏమిటి అని బాలూ అడిగినప్పుడు, 'రావణాసురుడు'  అని జూనియర్ చెప్పడమూ, "మీ తాతయ్యకి కూడా రావణబ్రహ్మ పాత్రంటే చాలా ఇష్టమయ్యా" అంటూ బాలూ నవ్వడమూ అలా గుర్తుండిపోయాయి. నావరకూ, బాలూ నవ్వు అంటే ఇప్పటికీ ఆ క్షణంలో  నవ్విన నవ్వే.

(Google Image)
అదే సమయంలో, అదే ఛానల్ కోసం చేసిన ఓ సరదా కార్యక్రమంలో (ఓ హిట్ పాట ట్యూన్ లో మరో హిట్ పాటని అప్పటికప్పుడు ప్రేక్షకుల ఫోన్ కోరిక మేరకు పాడడం) 'శంకరా.. నాద శరీరా పరా' ని వేరే ట్యూన్ లో పాడినప్పుడు 'ఇలా చేయకుండా ఉంటే బాగుండేది' అనిపించింది. రానురానూ టీవీలో బాలూ కనిపించడం పెరిగే కొద్దీ ఈ 'ఇలా చేయకుండా ఉంటే బాగుండేది' జాబితా కూడా పెరుగుతూ వచ్చింది. పాట ట్యూన్ లో కిట్టింపులు చేయడం నన్ను బాగా ఇబ్బంది పెట్టిన విషయం (సినిమాలో పాడినట్టు కాకుండా కొంత మార్పు చేయడం -  తగినంత ప్రాక్టీసు లేకనా లేక కావాలని చేస్తూ వచ్చిందా అన్నది ఇప్పటికీ సందేహమే). అలాంటి సందర్భాల్లో కో-సింగర్ల ఇబ్బంది స్పష్టంగా కనిపిస్తూ ఉండేది మొదట్లో (రానురాను వాళ్ళూ అలవాటు పడిపోయారు). 

తను వేలల్లో పాటలు పాడిన కాలంలో పదుల సంఖ్యలో మాత్రమే పాటలు పాడిన గాయకుల్ని 'పాడుతా తీయగా' కి అతిధులుగా పిలిచి, వాళ్ళు పాడిన ఆ కొన్ని పాటలూ కూడా తను మిస్ అయినందుకు వాళ్ళ సమక్షంలోనే బాధ పడడం ("ఇంకానా బాలూ? ఇంకా ఎన్ని పాటలు పాడాలి? ఇంకెవరూ పాడకూడదా?"), రెండు మూడు సినిమాల్లో హీరో వేషాలు వేసి తర్వాత అవకాశాల కోసం తిరుగుతున్న వాళ్ళని అతిధులుగా పిలిచి "అందరు హీరోలకీ పాడాను. మీకూ పాడాలని ఉంది, కనీసం ఒక్క పాట" అని కోరడం (మాడెస్టీ అని తను అనుకుని ఉండొచ్చు గాక) లాంటివి చూసినప్పుడు 'అబ్బా' అనిపించడం - వీటితో పాటు మరికొన్ని కారణాల వల్ల ఆ ప్రోగ్రాం మీదే ఆసక్తి సన్నగిల్లింది. - మాత్రమే కాదు, "అసలు బాలూ టీవీలో కనిపించకుండా ఉంటే బాగుండేదేమో" అనిపించేది. నిజానికి 'పాడుతా తీయగా' 'పాడాలని ఉంది' లాంటి కార్యక్రమాలు ఎందరికో ప్లాట్ఫార్మ్ ని, కెరీర్నీ ఇచ్చాయి. 

బాలూ తనని తాను కొంచం ఎక్కువగా ఆవిష్కరించుకున్న కార్యక్రమం 'మా' టీవీ కోసం ఝాన్సీ చేసిన 'పెళ్లి పుస్తకం.' ఆసాంతమూ ఆసక్తిగా సాగే ఆ కార్యక్రమం చివర్లో, "మేం చాలా నిజాయితీగా మాట్లాడాం. ఈ కార్యక్రమంలో పాల్గొనే అన్ని జంటలూ ఇలాగే నిజాయితీగా మాట్లాడాలి" అని సందేశం ఇవ్వడం బాలూ మార్కు చమక్కు. తను అడపాదడపా మాత్రమే తెరమీద కనిపించే రోజుల్లో బాలూ ఎలా చేశాడో చూడడం కోసం 'ఓపాపా లాలి' లాంటి సినిమాలకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి కానీ, టీవీలో తరచూ కనిపించడం బాగా పెరిగిన కాలంలో వచ్చిన 'మిథునం' నాటికి మాత్రం బాలూ ఎలా చేశాడన్న కుతూహలం కన్నా, సినిమా ఎలా తీసి ఉంటారన్న ఆసక్తే ఎక్కువైంది. (తెలియకుండానే తన నటన మీద ఓ అంచనా వచ్చేసిందేమో బహుశా). బాలూని నాలుగడుగుల దూరం నుంచీ చూసిన సందర్భాలు నాలుగైదు ఉన్నాయి కానీ, ఒక్కసారి కూడా దగ్గరకి వెళ్లి పలకరించాలనిపించలేదు - బహుశా టీవీ వల్లే. 

కొన్నాళ్ల క్రితం నేనూ, నా మలయాళీ మిత్రుడూ సినిమా పాటల గురించి ఇంగ్లీష్లో  మాట్లాడుకుంటున్నాం. జేసుదాస్, విజయ్ ఏసుదాస్ పాటల గురించి నేనూ, 'ఎస్పీబీ సర్' పాటల్ని గురించి తనూ. "హీ ఈజ్ వెరీ హంబుల్. డౌన్ టు ఎర్త్..." అంటూ చాలా సేపు మాట్లాడాడు. నేను 'బాలూ' అని రిఫర్ చేస్తే, కాసేఫు తెలుగులో బాలూ అనే ఇంకో గాయకుడు ఉన్నాడనుకుని పొరబడ్డాడు తను. 'బాలూ, ఎస్పీబీ సర్ ఒక్కరే' అని నేను చెప్పినప్పటి తన రియాక్షన్ ఇప్పటికీ గుర్తే. "హౌ కెన్ యు కాల్ హిం బాలూ?" అంటూ తగువేసుకున్నాడు. ఏళ్లతరబడి మన జీవితంలో ఓ భాగమైపోయిన వాళ్ళని ఇంకెలా పిలుస్తాం? అదే విషయం చెప్పడానికి ప్రయత్నించా. 'ఎస్పీబీ సర్' ని ఒక్కసారైనా కలవాలన్న నా మిత్రుడి కోరిక తీరకుండానే, కరోనా మహమ్మారి బాలూని బలి తీసుకుంది.  'నీవు లేవు నీ పాట ఉంది' అంటూ ఏనాడో కవికుల తిలకుడు దేవరకొండ బాలగంగాధర తిలక్ చెప్పిన కవితా వాక్యం బాలూ విషయంలో అక్షర సత్యం. బాలూ పాట ఎప్పటికీ మార్మోగుతూనే ఉంటుంది.   

18 కామెంట్‌లు:

  1. యధావిధిగా మీనుండి మరో వెటకారం పోస్టు. సంగీతాన్ని ఆశ్వాదించాలంటే కొంచెం స్వర జ్ఞానం కూడా ఉండాలి. పాట పాడిన ప్రతి గాయకుడు/గాయకురాలికీ ఏం సలహాలు చెపుతారా అని చూడడం అలవాటయిపోయింది.యూట్యూబ్ పుణ్యమా అని పాత కార్యక్రమాలు కూడా మళ్ళీ వింటుంటాం. ఎపుడూ బోర్ కొట్టదు. ఇవి కాకుండా తమిళ్ లో కూడా విజయ్ టీవీ వాళ్ళవీ, హిందీలో సరిగమప కార్యక్రమాలు కూడా చూస్తుంటాం. ఇన్ని సంగీత కార్యక్రమాలు ఎడతెరిపి లేకుండా నడుస్తున్నాయంటే కారణం బాలు గారు మాత్రమే కాదు సంగీత అభిమానులు అంతమంది ఉన్నారన్నమాట !

    శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తి గానరసం ఫణి:

    రిప్లయితొలగించండి
  2. మీరు బాలు గురించి ఎప్పుడు టపా రాస్తారా అని చూస్తున్నాను. అయితే కొంచం అసంతృప్తి కలిగింది టపా చదివాక. బహుశా బాలు గురించి నిన్నటి నుండి ఎక్కడ చదివినా పాజిటివ్ కోణం నుండే ఉండటం వల్ల, ఆయనంటే విపరీతమైన ఇష్టం, గౌరవం వల్ల అందరూ, నాతో సహా అలానే ఆశిస్తారేమో ఈ టైంలో ఆయన గురించి ఏం చదివిన.
    కాసేపు అయ్యాక అనిపించింది...ఏం.. లెజెండ్స్ అయినంత మాత్రాన వాళ్లకి అన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయా అని !! అందరూ వాళ్లని మిగతావారు ఇష్టపడినట్టు అన్ని విషయాల్లో ఇష్టపడాలా ? అని.
    మీరు లేవనెత్తిన అంశాలు, ముఖ్యంగా టీవీ విషయంలో, చాలా మంది పెద్దవాళ్ళ దగ్గర ఇంచుమించు అవే అభిప్రాయాలను విన్నాను నేను గతంలో.
    అంతమాత్రాన...బాలు అంటే వాళ్లకి ఇష్టం లేదని కాదు, ఆయన పాటంటే ఇష్టం లేదనీ అంతకంటే కాదు....కేవలం అలా చేయకుంటే బాగుండేదని ప్రేమతో కూడిన ఫిర్యాదులు మాత్రమే... బాలు చాలా మంది హృదయాల్లో, ఆ మాట కొస్తే మీతో నాతో సహా, తనకే సొంతమైన గాత్రంతో, తాను మాత్రమే పాడగలిగే పాటలతో చోటు సంపాదించుకున్నారన్నది నిర్వివాదాంశం.
    ఒక అభిమానిగా ఆయన ఏదయినా మ్యూజిక్ స్కూల్ టాలెంటెడ్ పేద స్థూడెంట్స్ కి పెట్టుంటే బాగుండేదని నా కోరిక. ఏ ఆర్ రెహ్మాన్ లాగా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ అసంతృప్తి నాకు అర్ధమవుతుందండీ (మన ప్రయాణం ఇవాల్టిది కాదు కదా) 
      దానిని పక్కన పెట్టి మీరు ఆలోచించడం చాలా బాగా అనిపించింది.. థాంక్యూ.. 

      తొలగించండి
  3. మీ బ్లాగ్ లో మొదటిసారి నిరాశపరించిన పోస్ట్. ఎవరి అభిప్రాయం వాళ్ళది లెండి. 

    రిప్లయితొలగించండి
  4. మరణం కూడా judgement కి మినహాయింపు కాదని అర్ధమైంది.

    రిప్లయితొలగించండి
  5. Familiarity breeds contempt

    గుర్తుకు వచ్చింది మీ టపా చదివిన తరువాత. బాలు గారి ప్రతిభ ఆయన పాటల గొప్పదనం -- ఆయన అప్పుడప్పుడు చెప్పిన మాటలు , చేతలు కలిపి తీర్పు ఇవ్వడం సరికాదు.

    He is the Sachin tendulkar of Indian Music. The quality of thousands of songs in Kannada, Tamil, Telugu, Hindi is the main criterion he should be judged. He deserves Bharat Ratna.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అసలిక్కడ 'తీర్పు' అనే మాట ఎందుకు వచ్చిందా అని ఆలోచిస్తున్నానండీ (పైగా ఒకరు కాదు, ఇద్దరి నుంచి) 
      బాలు ప్రతిభ, ఆయన పాటల గొప్పదనం విషయంలో నాదీ మీ అభిప్రాయమే.. ఆయనకు అత్యున్నత పురస్కారమూ రావాల్సిందే (జీవించి ఉండగానే వస్తే మరింత బాగుండేది)
      ధన్యవాదాలు.. 

      తొలగించండి
  6. మీ పోస్ట్ కోసం నేనూ ఎదురుచూసానండీ. ఇందులో నాకు తెలియని విషయాలు, నాకలా అనిపించనేలేదే అనిపించేవీ చాలానే ఉన్నప్పటికీ మీకనిపించినదీ, తెలిసినదీ నిజాయితీగా రాసారనిపించింది. నిందాస్తుతే కనిపించింది.

    నాలుగురోజులుగా బోలెడు చర్చలు జరుగుతున్నాయి. ఎక్కడా మాట్లాడాలనిపించలేదు. ఇక్కడ కూడా ఈ విషయాలన్నీ ఎదుటివారికెలా కనిపిస్తాయన్నది చెప్దామనే రాస్తున్నాను. అదీ మేమందరం అభిమానించే నెమలికన్ను మురళిగారి పోస్ట్ కాబట్టి.

    యాపిల్స్ టు ఆరెంజెస్ అయినా ప్రస్తావన వచ్చింది కనుక, ఇష్టాయిష్టాలు వ్యక్తిగతమే అయినా చెప్తున్నా. జేసుదాస్ గొంతులో నేను వినే రొమాంటిక్ జాన్రా కుదరక నాకదో ఇబ్బంది. హరిహరాసనం, రాజీవ నేత్రాయ ఇంకెవరు పాడినా నచ్చదు మరి. పీబీ గొంతంటే మావిడిచిగురు వగరంత ముద్దు. కారణమేదైనా పీబీ మనం కన్నడిగులకిచ్చేసుకున్న ప్రేమకానుక. కన్నడదేశంతో కాస్త అనుబంధమున్న ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారీమాట. నెత్తిన పెట్టుకున్నారు.. పీబీని, బాలూని కూడా! ఇక్కడే ఉంటే బాలూ, పీబీ మధ్యలో అద్భుతమైన పాటలొచ్చి ఉండేవి నిజమే అయినా మన తెలుగువారికున్న "కళని ఆరాధించే స్థోమత" సంగతి మనకి తెలిసినదే కదా. ఎవరో అన్నారు మర్రిచెట్టు నీడలో మంచీ చెడూ రెండూ ఉండక తప్పదని.

    నేనో హోప్ లెస్ రొమాంటిక్ ని కనుక బాలూ పాటలో జిలుగుని ప్రేమిస్తాను. అతనిలో అద్భుతమైన డబ్బింగ్ ఆర్టిస్ట్ ని గౌరవిస్తాను. మిగిలినవేవీ చూడకపోవడం పూర్తిగా నా చాయిస్. చూసినా బహుశా ఇలాగే ప్రేమించేదాన్నేమో అనిపిస్తోంది. "ఇంకా ఎన్ని పాడాలి బాలూ?" అన్నారు. మనసే మందిరం సినిమాలో పీబీ శ్రీనివాస్ పాడాల్సిన పాట ఏ ఎల్ రాఘవన్ పాడాల్సి వచ్చిన సందర్భంలో రాఘవన్ నొచ్చుకుంటే పీబీ "ప్రతీపాట మీదా పాడేవారి పేరు రాసి ఉంటుందన్నారని" అదే బాలూ నాస్టాల్జిక్ గా తల్చుకున్నారు. అభిమానుల కంటికి అది కనిపిస్తుంది. నూటికి తొంభైశాతం పాటలు తానే పాడిన బాలూ పాడడం తగ్గిపోయి దారిచ్చాక కూడా "ఆహా!" అనిపించే ఒక్క గొంతు కనిపించకపోవడం యాదృచ్చికమే అనుకోవాలి.

    ఈ వార్త తెలియగానే దర్శకత్వం చాన్సులకోసం ఎదురుచూస్తున్న మిత్రుడు "బాలూ చేత ఓ పాట పాడించుకోకుండానే.." అంటూ అర్ధోక్తిలో ఆగిపోయారు. అక్కడ అతని కళ్ళు తడిసాయన్నది నాకర్ధమయింది. చిన్నచిన్న హీరోలని హుషారు చేసేందుకు చాన్సొస్తే మీ సినిమాలో కూడా పాడుతా అన్నారేమో బాలూ అని నవ్వుకుంటారు నాలాంటి అభిమానులు. నాణానికి మరోవైపు ఇది. ఏ వేటూరో ఉండి వివరంగా చెప్తే కానీ తెలియనివెన్నో ఉండే ఉంటాయి. హాయిగా ఓ పాట విని మనసు తీపిచేసుకుంటే పోదా అనిపిస్తుంది నాబోంట్లకి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలండీ.. 
      నా అభిప్రాయాలన్నీ టపాలో ఉన్నాయి కదా..
      పీబీది వేరే కథ, రామకృష్ణది ఇంకో కథ. ఇక్కడ, ఇప్పుడు అప్రస్తుతాలవి.. 
      ఎవరైతే బాలూ ప్రభంజనంలో కాసిని (మాత్రమే) పాటలు పాడి, కాస్తో కూస్తో పేరు తెచ్చుకున్నారో వాళ్ళతోనే అవి కూడా నేనే పాడేసి ఉండాల్సింది అనడం చూసినప్పుడు నేను బాలూ వైపునుంచి కాకుండా, అవతలి గాయకుల వైపు నిలబడి ఆలోచించాను.. ఆ విషయాలు ప్రస్తావించడానికి, బహుశా ఇది సమయమూ, సందర్భమూ కాకపోయి ఉండొచ్చు. 

      తొలగించండి
  7. Comment 1 of 2

    చాలా రోజుల తర్వాత మీ పోస్టు నన్ను బ్లాగుల వైపు లాగింది :)

    అలిపిరి మార్గంలో గోవిందా గోవింద అనుకుంటూ మెట్లెక్కే ప్రతిసారీ, ఆ పక్కనే ఆకాశమంత ఎత్తెదిగిన వృక్షాలు నన్ను ఆకర్షిస్తాయి. ఎన్ని వందల ఏళ్ళుగా ఈ పవిత్రమైన కొండ మీద ఉన్నాయో కదా. అన్నమయ్య, శ్రీకృష్ణదేవరాయల వంటి ఎందరో పురాణ పురుషులను, చారిత్రక వ్యక్తులను చూసుంటాయి కదా. వీటికేగనక మాటలొస్తేనా అని అబ్బురపడుతుంటాను. అలా మాటలొచ్చిన మహావృక్షం ఎస్పీబీ / బాలు సార్/ బాలు.. ఆయనే చెప్పుకున్నట్టు బాలుడు.

    ఘంటసాల మాస్టారు వెళ్ళిపోయాక బాలు ఒక ప్రభంజనంలా కమ్మేసాడు. అన్ని పాటలూ ఆయనే పాడేసాడు. మరొకరికి అవకాశం ఇవ్వలేదు. కొత్తవాళ్ళని ఎదగనివ్వలేదు అనే విమర్శ ఈనాటిది కాదు. కానీ ఒకనాడు నిర్మాతలు, దర్శకులచే శాసింపబడి ఇప్పుడు హీరోల కనుసన్నల్లో సాగే ఇండస్ట్రీలో ఒక గాయకుడి మాట చెల్లుబాటవుతుందా? తొలినాళ్ళలో బాలుకి మాత్రం అవకాశాలు వచ్చాయా? కమెడియన్స్‌కే కదా పాడించారు. సూపర్‌స్టార్ కృష్ణ గారితో, ఇళయరాజాతో విభేదాలొచ్చి కొన్నాళ్ళు ఆయన్ని పక్కన పెట్టలేదా? అప్పుడొచ్చిన కొత్తగాయకులు ఎందుకు నిలదొక్కుకోలేదు?

    Talents often go unnoticed when a greatest craftsman is still around and active. The contemporary talents have to undergo the litmus test when maestros like Sachin Tendulkar or SPB is around.

    రహ్మాన్ అనే విప్లవం వచ్చాక బాలు గారికి అవకాశాలు తగ్గాయి. హరిహరన్, శంకర్ మహదేవన్, సుఖ్వీందర్ సింగ్, కుమార్ సానూ, ఉదిత్ నారయణ్ వంటి పరబాషా గాయకులు వచ్చి పడ్డారు. కమర్షియల్ నంబర్స్ పాడారు. సుఖ్విందర్, ఉదిత్ అంటే నాకూ ఇష్టమే. కానీ వీరు బాలుకి సాటిరారు. వీళ్ళ గొంతులో ఉన్న texture లో మాత్రమే వైవిధ్యముంటుంది. బాలు గొంతుకి దూరంగా ఉండబట్టి కొత్తదనం కనిపించింది. కానీ బాలు పాట పాడే తీరులో గొంతుని పాదరసంలా మలిచే తీరులో వీళ్ళెవరూ బాలుని టచ్ చెయ్యలేరు.

    నాతో పనిచేసే ఒక మేనేజర్ ఒకసారి అన్నమాట. చిరంజీవికి మాత్రమే కెమెరాకి ఉండే స్వీట్ స్పాట్ తెలుసు అందుకే కెమెరా వైపు చూసి అతను చెప్పే ప్రతిమాట అభిమానుల గుండెల్లో నాటుకుంటుంది అని. అలాగే సినిమా పాటకి ఏం కావాలో బాలూకి మాత్రమే తెలుసు. సినిమా పాట అనేది సంగీతంలో సబ్ సెట్టే అయినా కూడా దాని శ్రోతలు వేరు. అది ఉపయోగింపబడే తీరు వేరు. దానికి మాస్ లక్షణం ఉంది. ప్రతి పేటలోని బాకా పెట్టించుకుని మోగే గుణం ఉంది. పాదరసాన్ని ఎలా ట్యాప్ చేస్తే బంగారమవుతుందో తెలిసిన పరుసవేది బాలు. సినిమా పాటకున్న ఆ గుణాలన్నింటినీ ఆకలింపుచేసుకుని పాటే తానై ఊగిపోయాడు కాబట్టే బాలు అన్ని వేల పాటలు పాడినా, ఇంకా పాడమని ఆయన వెంటపడ్డారు. సినిమా చూసే అభిమానికి, తెర మీద కనిపించే హీరోకి మధ్య అనుబంధం అర్ధం చేసుకుని తానే హీరో అయ్యి చిందులేసాడు కాబట్టే హీరోలు ఆయనని వదిలి పెట్టలేదు. థియేటర్లో చూసే ప్రేక్షకుడికి, బయట ఆడియో వినే శ్రోతకి ఇద్దరికీ ఒకే పాటలో న్యాయం చేయగలిగాడు బాలు.

    ఇంత పాడినా ఇంకొక్క పాటొచ్చుంటే అనే ఆశేంటి అనే ప్రశ్నకి ఒకటే సమాధానం. అదే కళాకారుడి దాహం. ఒక గొప్ప ఆర్ట్ ఏది ఎదురైనా అయ్యో ఈ ఆలోచన నాకు రాలేదేంటి అనే కళాకారుడి తపనే బాలుది. ఆయనే చెప్పాడు నేను ఏ గాయకుడిని ఆపలేదు, అలానే నాకొచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కాదనలేదు అని. మనో కూడా ఇదే అన్నారు. అసలు అన్నయ్యకి అంత టైము లేదు ఆ రోజుల్లో. ఒక స్టూడియో నుండి మరో స్టూడియోకి పరిగెట్టడంలోనే అయిపోయేది అని. బాలుకి పాటే ప్రాణం అయినా, పాటే అతని జీవనభృతి కూడా. ఎంత ప్యాకేజికి చేరుకున్నాక మనం మన కంపెనీకి బాబూ నాకు ఇంక నీ ఉద్యోగమూ, జీతం చాలు అని చెప్తామో ఎప్పుడైనా ఆలోచించామా?

    రిప్లయితొలగించండి
  8. Comment 2 of 2

    అమెరికన్ సొసైటీలో మనం గౌరవించే ఒక గొప్ప లక్షణం చివరి వరకూ పనిచెయ్యటం. 80 ఏళ్ళ వయస్సులో కూడా interviews అటెండ్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళని చూసి మనవాళ్ళు నేర్చుకోవాలయ్యా అంటాం. ఈనాటికీ పాడాలనుకునే బాలుగారిలో ఆ లక్షణమే నాకు కనిపిస్తుంది. చివరి వరకూ పనిచెయ్యటం, తన వృత్తిలో తనే ముందు వరుసలో ఉండాలనుకోవటం కర్మయోగమే కదా.

    టివి ప్రోగ్రాముల్లో బాలు కనిపించక పోయుంటే ఆయన హౌస్‌హోల్డ్ నేమ్ అయ్యుండేవాడు కాదు. మనతో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడే బాలు, తెలుగు పద్యాన్ని మళ్ళీ తెరపైకి తెచ్చిన బాలుని చూసి చూసి తన గొప్పతనం మరిచిపోయామేమో. కానీ ఈ కార్యక్రమాలు చేసిన మేలు అంతా ఇంతా కాదు. తెలుగు సినిమా చరిత్రలో ఎక్కడా రికార్డ్ కాని ఎన్నో విషయాలు వెలుగులోకొచ్చాయి. ఆనాటి గాయకుల, సంగీత దర్శకుల తీరు తెన్నులు, శైలి, సరదా సంఘటనలు రికార్డ్ అయ్యాయి. మహదేవన్-పుహళేంది మధ్య ఉన్న అనుబంధం, వేటూరి పాటల పైన విశ్లేషణ ఇలా ఎన్నో సామాన్య ప్రేక్షకులకు తెలిసాయి. నేను హిందీలో కూడా మ్యూజికల్ రియాలిటీ షోస్ చూస్తాను. కానీ పాటలో సాహిత్యం గురించీ, సంగీతం గురించి, పాట రికార్డ్ అయినప్పటి సంఘటనల గురించి ఇంతా సాధికారికంగా, ఫస్ట్ హ్యాండ్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్పే కార్యక్రమం పాడుతా తీయగా ఒక్కటే. మొన్న సిరివెన్నెల గారు తన నివాళిలో కూడా ఈ ముక్కే చెప్పారు.

    ట్యూన్ మార్చి పాడటం గురించి కూడా ఒక మాట. ప్రేక్షకులు పదే పదే విన్న అదే పాటను మళ్ళీ అదే తీరులో పాడటం కంటే ఒక సర్‌ప్రైజ్ ఇవ్వటం లైవ్ ప్రదర్శనలకు కావాల్సిన లక్షణం. కేవలం బాలూనే కాదు, అరిజిత్ సింగ్, సోనూ నిగమ్, సుఖ్వీందర్ అలానే ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. పాడుతా తీయగాలో కూడా పార్టిసిపెంట్స్‌కి ఆ ఛాయిస్ ఇవ్వాలనేది నా ఆకాంక్ష. ఇండియన్ ఐడల్ లో పార్టిసిపెంట్స్‌కి ఆ స్వేచ్ఛ ఉంటుంది.

    To err is human. బాలూ సాదరణమైన మనిషి, మనలానే పుట్టి మన మధ్యే ఎదిగిన మామూలు మనిషే. కాబట్టి ఆయన తప్పులే చెయ్యలేదు, ఆయనలో లోపాలే లేవు అని నేను చెప్పను. ఆయన ప్రొఫెషన్‌లో ఆయన ఎదిగే క్రమంలో ఆయన కొందరితో కటువుగా ఉన్నాడేమో, కొందరితో పోటీ పడ్డాడమో. కానీ ఆ పొటీ లేకుంటే, ఆ తపనే లేకుంటే, ఆ స్పర్ధ లేకుంటే జీవితంలో ప్రతి ఉదయం లేవగానే బ్రతకటానికి కావాల్సిన ఇంధనం ఎక్కడ నుండి వస్తుంది? వెనక్కి వెళ్ళి విజేతల జీవితాలని డిఫరెంట్ వేంటేజ్ పాయింట్లో చూస్తే ఇవే విమర్శలు కనిపిస్తాయి. ఆగి వెనక్కి చూసినవాడు విజేత కాలేడు. Survival of the fittest. కటువుగా అనిపించినా అదే కాలధర్మం.

    ఈ రోజు కాకపోయిన మరో నాలుగు రోజుల్లో ఆయన లేని లోటు మనకి తెలిసొస్తుంది. ఆయన absence యే ఆయన ఔన్నత్యాన్ని పెంచుతూ పోతుంది. మరికొన్ని రోజుల్లో ఆయన పైన విమర్శలన్నీ కరిగిపోతాయి. ఆయన వర్క్ మాత్రం తలెత్తుకుని అలానే మిగిలిపోతుంది. చరిత్ర చూసిన గొప్ప గాయకుడిగా ఆయన స్థానం ధృవనక్షత్రంలా స్థిరంగా ఉంటుంది.

    సర్వే జనా సుజనోభవంతు, సర్వే సుజనా సుఖినోభవంతు. స్వస్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ముందుగా, మీరివన్నీ మనసులోనే ఉంచేసుకోకుండా పంచుకున్నందుకు ధన్యవాదాలు. 
      'బాలూ ఎవరినీ ఎదగనివ్వలేదు' అని నేను అనడంలేదు, అనుకోడం లేదు. అయితే, తన ప్రభంజంలో కూడా కాసిన్ని పాటలతో ఉనికి చాటుకున్న గాయకుల ముఖానే 'ఆపాట కూడా నేను పాడి ఉండాల్సింది' అనడం నాకు అప్రస్తుతంగా అనిపించి, (స్పష్టంగా చెప్పాలంటే నేనీ విషయాన్నీ 'ఇప్పుడు' ప్రస్తావించడం అంత అసందర్భం) బాధేసింది (అది కూడా బాలూని గురించే). 
      అలాగే బాలూ ప్రొఫెషనలిజం విషయంలోనూ ఎలాంటి సందేహాలూ లేవు (శిఖరాన్ని చేరుకోడం కన్నా, అక్కడ నిలబడి ఉండడం ఎక్కువ కష్టం) 
      కళాకారుడి దాహం.. ఇక్కడా అదే సమస్య, సమయసందర్భాలు.. 
      టీవీకి బాలూ కంట్రిబ్యూషన్ - పూర్తిగా అంగీకరిస్తాను, కానీ నేను ప్రస్తావించిన లాంటివి జరగకుండా ఉంటే మరింత బాగుండేది కదా అన్న ఆలోచన, అంతే.. 
      ట్యూన్ మార్చి పాడడం - ఇష్టపడే వారూ ఉంటారన్నది నాకు తట్టలేదు. నావరకూ అలా ఎవరు పాడినా అంగీకరించలేను. 

      తొలగించండి
  9. "'బాలూ, ఎస్పీబీ సర్ ఒక్కరే' అని నేను చెప్పినప్పటి తన రియాక్షన్ ఇప్పటికీ గుర్తే. "హౌ కెన్ యు కాల్ హిం బాలూ?" అంటూ తగువేసుకున్నాడు." మంచి నివాళి.

    రిప్లయితొలగించండి