గురువారం, అక్టోబర్ 10, 2019

ఏ టైగర్ ఫర్ మాల్గుడి (A Tiger for Malgudi)

సాహిత్యంలో పులిని గురించి రాసిన వాళ్ళు అనుకోగానే మనకి మొదట జిమ్ కార్బెట్ గుర్తొస్తాడు. తెలుగులో అల్లం శేషగిరి రావు రాసిన వేట కథలు గుర్తొస్తాయి. వీటిలో చాలావరకూ వేటగాళ్ల దృష్టి కోణం నుంచి రాసినవే. కానీ, ఒక పులి తన కథని తాను చెప్పుకుంటే ఎలా ఉంటుంది? ఈ ఊహకి అక్షర రూపం ఇచ్చింది మాత్రం ఆర్కే నారాయణన్. తన ఊహల్లో సృష్టించిన పట్టణం 'మాల్గుడి' ని నేపధ్యంగా తీసుకుని రాసిన నవల 'ఏ టైగర్ ఫర్ మాల్గుడి.' జూ పార్కులో ఆశ్రయం పొందుతున్న ఒక ముసలి పులి, ఆత్మగతంగా తన జీవితాన్ని తల్చుకోడమే ఈ 175 పేజీల నవల. 

అడవిలో పుట్టిన ఓ మగపులి ఓ గుహలో బద్ధకంగా జీవిస్తూ ఉంటుంది. మిగిలిన జంతువుల మధ్య తన గౌరవాన్ని నిలబెట్టుకోడమే పెద్ద సవాలు. ఈ క్రమంలో ఒకరోజు ఒక ఆడపులితో తలపడవలసి వస్తుంది. అటు తర్వాత ఆ పులితోనే అదే గుహలో సహజీవనం చేసి పిల్లల్ని కూడా కంటుంది. పిల్లలతో సహా ఆడపులి వేటగాళ్ళకి చిక్కడం మగపులి జీవితంలో మొదటి మలుపు. వాటిని వెతుక్కుంటూ అడవి దాటి, కొన్నాళ్ల పాటు ఊళ్ళో మాటేసి దొరికిన జంతువులని తింటూ కాలం గడుపుతూ ఉంటుంది. నిజానికి అడవిలో గుహలో కన్నా, ఊళ్ళో జీవితమే బాగున్నట్టు భావిస్తుంది కూడా. 

అయితే, తమ పాడి పశువులు మాయమైపోతూ ఉండడాన్ని గమనించిన గ్రామస్తులు పులి ఉనికిని కనిపెట్టేస్తారు. వాళ్ళా సమస్యని కలెక్టర్ కి మొరపెట్టుకోవడంతో, పులి విషయం మాల్గుడి లో సర్కస్ కంపెనీ నడిపే 'కెప్టెన్' దృష్టికి వస్తుంది. చాకచక్యంగా పులిని బంధించి తన సర్కస్ కంపెనీకి తీసుకు వచ్చిన కెప్టెన్ ఆ పులికి 'రాజా' అని పేరు పెట్టి సర్కస్ ఫీట్లు చేసే శిక్షణ ఇస్తాడు. రాజాగా మారడం పులి జీవితంలో రెండో మలుపు. నిజానికి భయంకరమైన మలుపు. కెప్టెన్ కి రాజాకి మధ్య ఉన్న సమస్య భాష. ఒకరి భాష మరొకరికి తెలీదు. కాబట్టి కెప్టెన్ ఎలాంటి శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాడో రాజాకి తెలీదు. తాను చెప్పినట్టు రాజా వినకపోవడంతో కోపగించిన కెప్టెన్ ఇనప కుర్చీతో బాదడం, తిండి పెట్టకుండా మాడ్చడం లాంటి 'శిక్షలు' వేస్తూ ఉంటాడు. 

Photo: Wiki

కెప్టెన్ లేని సమయంలో, సర్కస్ కంపెనీలో ఉండే కొండముచ్చు అడవి భాషలో రాజాతో మాట్లాడడంతో కెప్టెన్ తన నుంచి ఏం ఆశిస్తున్నాడో తెలుసుకునే వీలు కలుగుతుంది. కాలక్రమంలో రాజా మనుషుల భాషని అర్ధం చేసుకోడమే కాదు, కెప్టెన్ నేర్పే ఫీట్లని అలవోకగా చేసేస్తూ సర్కస్ కంపెనీకి ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. అలా ఆకర్షణగా మారాక, ఓ సినిమా దర్శకుడి దృష్టిలో పడడం పులి జీవితంలో మూడో మలుపు. కెప్టెన్ సారధ్యంలో సినిమా చిత్రీకరణ లో పాల్గొనడం మొదలు పెట్టిన రాజాకి, షూటింగ్ లో జరిగిన ఓ గడబిడలో తప్పించుకోడానికి అవకాశం దొరుకుతుంది. మొదట ఓ బడిలో దాక్కుని, అటుపైన ఒక సన్యాసికి అనుయాయి గా మారిపోతుంది. 

కొన్నాళ్ల పాటు అడవిలో ఆశ్రమ జీవితం గడిపిన పులి పూర్తి సాధువుగా మారిపోయాక, సన్యాసికి తాను మరణానికి దగ్గరవుతున్నానని తెలుస్తుంది. సాధువుగా మారిన పులి తను లేకుండా అడవిలో ఒంటరిగా  బతకలేదని గ్రహించి, ఓ జూ పార్కుకి అప్పగించేస్తాడు. జూ ఎంక్లోజర్ లో తనని చూసిన జనం మాట్లాడుకునే మాటలన్నీ పులికి అర్ధమవుతూ ఉంటాయి. జూ లో మొదలైన కథ, ఫ్లాష్ బ్యాక్ కి వెళ్లి, మళ్ళీ జూ లో ముగుస్తుంది. పులుల మనస్తత్వాన్ని గురించీ, సర్కస్ కంపెనీలు జంతువులకి ఇచ్చే శిక్షణ గురించీ ఎంతో అధ్యయనం చేసి ఈ నవలని రాశారు ఆర్కే. సినిమా షూటింగ్ విశేషాలు సరేసరి. ఇక ఆర్కే మార్కు హాస్యానికి, వ్యంగ్యానికి కొదవ ఉండదు. 

సర్కస్ కంపెనీలు పులులని విరివిగానూ, విశేష ఆకర్షణ గానూ వినియోగించిన కాలంలో (1983) ఈ నవలని రాశారు ఆర్కే నారాయణన్. అడవిలో, గ్రామంలో, సర్కస్ కంపెనీలో, సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు పులి ఆలోచనల్ని "అచ్ఛం పులి ఇలాగే ఆలోచిస్తుందేమో" అనిపించేలా రాయడం ఈ నవల ప్రత్యేకత. సర్కస్ పులిని వినోదంగా చూస్తున్న ప్రజలకి, ఆ వినోదం వెనకున్న విషాదాన్ని వివరించడమే ఈ నవల ఉద్దేశం అనిపిస్తుంది, చదవడం పూర్తి చేశాక. చదువుతున్నంతసేపూ పులి పాత్రలో మమేకమవుతామనడంలో అతిశయోక్తి లేదు. ఆబాలగోపాలన్నీ అలరించే ఈ నవల పునర్ముద్రణలు పొందుతూనే ఉంది. 

2 కామెంట్‌లు:

  1. మీరు Vendor of Sweets గురించి రాస్తే చదవాలని కోరిక :)

    రిప్లయితొలగించండి
  2. @పరుచూరి వంశీకృష్ణ: తప్పకుండానండి.. ఆర్కే వర్క్స్ అన్నీ బాగుంటాయి. ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి