శుక్రవారం, అక్టోబర్ 12, 2018

రెండు బంట్లు పోయాయి

చాసోకి శిష్య సమానుడూ, 'ఓన్లీ పతంజలి'కి గురు సమానుడూ అయిన ఉత్తరాంధ్ర కథా రచయిత పూసపాటి కృష్ణంరాజు. రాసిన కథలు నాలుగు పుంజీలకి మించకపోయినా, వాసికెక్కిన కథలవ్వడం చేత అనేకానేక కథా సంకలనాల్లో చోటు సంపాదించేసుకున్నాయి. కథలన్నీ విజయనగరం నేపథ్యంలోనూ, వాటిలో సింహభాగం క్షత్రియ కుటుంబాల్లోని పాత్రలతోనూ సాగుతాయి. 'దివాణం సేరీ వేట,' 'కుక్కుట చోరులు' తో పాటుగా నాకిష్టమైన మరో కథ 'రెండు బంట్లు పోయాయి.' చదరంగం బల్ల దగ్గర మొదలయ్యే ఈ కథ నడక ఆసాంతమూ చదరంగపుటెత్తుల్లాగే సాగుతుంది. అలాగని శ్రీపాద వారి 'వడ్ల గింజలు' తో ఎలాంటి పోలికా ఉండదు.

నిజానికి ఇదో పెళ్లి కథ. చంద్రం గారి కుమార్తె లక్ష్మీదేవిని శ్రీ రాజా కలిదిండి నీలాద్ధిర్రాజు గారి సుపుత్రుడు వరహాలరాజు ఎమ్.ఏ. కి ఇచ్చి చంద్రంగారి స్వగృహంలో వివాహం జరిపించాలని నిశ్చయించారు పెద్దలు. పొరుగూళ్ళలో ఉన్న బంధువులందరికీ మర్యాదపూర్వకంగా పిలుపులందాయి. పిలుపు అందుకున్న వారిలో 'తాతగారు' కూడా ఉన్నారు. తాతగారు ఎక్కడ ఉన్నా వెంట చదరంగం బల్ల ఉండాల్సిందే. ఆయనతో చదరంగం ఆడే అవకాశం కోసం ఆబాలగోపాలమూ ఎదురుచూస్తుంది అనడం అతిశయోక్తి కాదు. శుభలేఖ వచ్చే సమయానికి చదరంగం బల్ల ముందే ఉంటారు తాతగారు, వారి సన్నిహితులూను. అప్పటికప్పుడే ఓ మాట అనుకుని పెళ్ళికి ప్రయాణమవుతారు.

శుభలేఖ తెచ్చిన ఇద్దరు కుర్రాళ్ళ లోనూ ఒకడు శంకరం. పెళ్లికుమార్తెకి మేనబావ. కొన్నాళ్ల క్రితం వరకూ చంద్రం గారు అతన్నే అల్లుడిగా చేసుకుంటారని కూడా బంధువర్గం భావించుకుంది. కారణం తెలీదు కానీ, ఎమ్మే చదువుకుని, మదరాసులో ఏదో పనిచేస్తున్న ఆస్థిపరుడైన వరహాలరాజిప్పుడు వరుడయ్యాడు. మగ పెళ్ళివారు రావడంతోనే విడిదింట్లో మర్యాదలు మొదలయ్యాయి. ఇరువర్గాలూ చేతులు చాచి ఒకరినొకరు ఆహ్వానించుకుని, దయచేయండని గౌరవించుకున్నారు. "తలపాగాలు చుట్టుకుని తిలకం దిద్దుకొని ఠీవిగా ఉన్న రాజులంతా మీసాలు సరిజేసుకుంటూ, ఇస్త్రీ మడతలు నలక్కుండా విడిదిలో వేసిన తివాసీ మధ్యకు నెట్టి మర్యాదగా అంచులమీద ఒకరొకరు అంటీ  ముట్టకుండా జరిగి కూర్చున్నారు."



వంటకాలన్నీ రుచిగానే ఉన్నా తాతగారికెందుకో ఈ శాకాహారం పడినట్టు లేదు. "ఏమిటో మొగ పెళ్ళివారు కొంచం తక్కువ కనిపిస్తున్నారు తాతా" అన్నారు మనవడి (కథకుడి)తో. "దూరంనుంచి కదా" అన్న జవాబు వారికి నచ్చలేదు. "అదేవిటి! మా రోజుల్లో మాత్రం దూరపు చుట్టరికాలు చెయ్యలేదూ? చినబాబు పెళ్ళికి కొప్పాక ముప్ఫయి కార్లలోనూ ఇరవై బస్సులలోనూ జిల్లా సరిహద్దుకు తరలి వెళ్ళేం. ఆ సప్లైలేమిటి? ఆ మర్యాదలేమిటి?" అనేశారు గతాన్ని గుర్తు చేసుకుంటూ. తెల్లవారుతూనే పెళ్లి ముహూర్తం. పెళ్ళరుగు పక్కనే కుర్చీలో తాతగారూ, వారికి ఎదురుగా చదరంగం బల్లా. పై ఎత్తులు వేయడానికి వధువు తాతగారు ఎదురుచూస్తున్నారు. ఆటా, పెళ్ళి తంతూ దాదాపు ఒకేసారి మొదలయ్యాయి. ఆట రసకందాయంలో పడే సమయానికే, పెళ్లి మండపంలోనూ అలాంటి పరిస్థితే సంభవించింది.

చంద్రంగారు ముహూర్తం సమయానికి సర్దుబాటు చేస్తానన్న కట్నం తాలూకు పాతికవేలూ సర్దలేకపోయారు. తప్పకుండా ఇస్తానని చెబుతున్నా పెళ్ళికొడుకు వినిపించుకోలేదు. "అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలన్నారు. అదేదీ పనికిరాదు. గతిలేకపోతే మానుకోవాలి. ముందు డబ్బు పడితేనే శుభకార్యం జరుగుతుంది. అంతే" అంటూ పీటలమీద నుంచి లేచి పెళ్లరుగు దిగిపోయాడు వరహాల రాజు. "వీడు రాచపుట్టుకే పుట్టాడా!" అనుకున్నారు తాతగారు. వధువు పితామహుడికి కట్నం ప్రసక్తే తెలియదు. చంద్రంగారి తమ్ముడు ఉగ్రరూపం దాల్చాడు. పెళ్లింటి నాలుగు తలుపులూ మూయించేశాడు. ఊరుకాని ఊరు, పైగా బలగం తక్కువ. ఏం చేస్తారు మగపెళ్లివారు? పెళ్లికుమార్తె పినతండ్రిగారు, మేనమామ గారూ కలిసి పెళ్ళికొడుకుని అమాంతం ఆకాశం మీదకెత్తి ఒక్క కుదుపుతో పెళ్ళిపీటల మీద కూర్చోపెట్టారు.

"ఏవిటీ కంగాళీ చట్రం" అని తాతగారు అనుకునేలోపే మరో గొడవ. ఈసారి పెళ్లి కుమార్తె లేచి నిలుచుంది. పెళ్లికుమారుడు ముఖం మీద తెరపట్టిన శాలువా విసిరికొట్టింది. అందర్నీ తలెత్తి ధైర్యంగా చూసి, ఒక్క తృటిలో గిరుక్కున తిరిగి ఆరేడు గది తలుపులు తోసుకుని వెళ్లి పేరంటాళ్ళ మధ్య పడింది. ఆమెననుసరించి తల్లిగారు కూడా వెళ్లిపోయారు. "ఏమిటీ దొమ్మరిమేళం! వెధవ సంత! యిది పెళ్లేనా!" అనుకున్నారు తాతగారు. "చూడండి బాబూ ముహూర్తం దాటిపోతోంది" అన్నారు సిద్ధాంతి గారు. వధువు తరపున దాసీ చిట్టెమ్మ జబర్దస్తీగా తెచ్చిన కబురేమిటో, తాతగారి చదరంగ బలగంలో రెండు బంట్లు (రెండే, బంట్లే) పోయిన వైనమేమిటో తెలియాలంటే 'రెండు బంట్లు పోయాయి' కథ చదవాలి. (అభ్యుదయ రచయితల సంఘం ప్రచురించిన 'కథాస్రవంతి' సిరీస్ లో 'పూసపాటి కృష్ణంరాజు కథలు' సంపుటిలో (కూడా) ఉందీ కథ).

2 కామెంట్‌లు: