సోమవారం, మే 21, 2018

నవలాదేశపు రాణి

హైస్కూలు రోజుల నాటి బరువైన వేసవికాలపు మధ్యాహ్నాలు యిట్టే గడిచిపోయేలా చేసిందీ, అటుపైన సాహిత్యపు రుచిని మప్పిందీ ఒక్కరే.. ఆమె తెలుగుసాహిత్యపు 'నవలాదేశపు రాణి' యద్దనపూడి సులోచనా రాణి. సెలవురోజుల్లో క్లాసేతర పుస్తకం చేతుల్లో కనిపిస్తే కన్నెర్రజేసే అమ్మానాన్నా కూడా, ఆ పుస్తకం సులోచనారాణిది అని గమనిస్తే చూసీ చూడనట్టు తప్పుకునేవారు. అమ్మ, అత్తయ్యలు, పెద్దమ్మలు, పిన్నిలు పోటీలు పడి చదివి చర్చించుకున్నవీ, తాతయ్య తన చివరి రోజుల్లో కళ్ళజోడు సరిచేసుకుంటూ చదువుకున్న నవలలూ యద్దనపూడివే. సులోచనారాణి రచనలు సకుటుంబంగా చదవదగినవీ, వయోభేదం లేకుండా అందరూ ఆస్వాదించగలిగేవీ అనడానికి ఇంతకు మించి చెప్పాల్సింది ఏమీ లేదేమో.

దేశానికి స్వతంత్రం వచ్చేనాటికి విద్యలో, ప్రత్యేకించి స్త్రీవిద్యలో, వెనుకబడి ఉన్న ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రమూ ఉంది. "ఆడపిల్లకి చదువెందుకూ" నుంచి "చాకలిపద్దు రాసే చదువు చాలు" మీదుగా "మొగుడికో ఉత్తరమ్ముక్క రాసుకునే చదువన్నా చెప్పించాలి" వరకూ నెమ్మదిగా ఎదుగుతూ వచ్చిన ఆలోచనలని దేశ రాజకీయాలు, ప్రత్యేకించి ఇందిరాగాంధీ లాంటి నాయకులు పదవులు చేపట్టడంతో ఒక్కసారిగా పూర్తిగా మార్చి ఆడపిల్లలకి చదువు అవసరం అన్న ఎరుకని కలిగించాయి. స్వతంత్రం వచ్చి రెండు దశాబ్దాలు గడిచేసరికి చదవడం నేర్చిన మధ్యతరగతి గృహిణుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. వీరికి అవసరమైన వినోదాన్ని, తగు పాళ్ళలో విజ్ఞానాన్ని అందించే బాధ్యతని వార, పక్ష, మాస పత్రికలు స్వీకరించాయి.

నిరంతరం కొత్తని అన్వేషించే పత్రికా సంపాదకుల దృష్టివల్లనయితేనేమి, పత్రికల మధ్య పెరిగిన పోటీ అయితే ఏమి, మహిళల కోసం మహిళల చేతే విస్తృతంగా రచనలు చేయించే ఆలోచనలు జరుగుతున్న తరుణంలో కలంపట్టారు సులోచనారాణి. పుట్టి పెరిగింది పల్లెటూళ్ళోనే అయినా, అది విద్యావంతుల కుటుంబం కావడం, పెద్దలందరికీ పఠనాసక్తి ఉండడంతో సాహిత్యాన్ని చదువుతూ పెరిగారామె. పెద్ద చదువులు చదవలేకపోయినా ప్రపంచపు పోకడలని ఆకళింపు చేసుకున్నారు. సరదాగా కథా రచన ప్రారంభించి, పాఠకుల అభిమానాన్ని సంపాదించుకుని, అనుకోకుండా 'సెక్రటరీ' తో నవలా రచన మొదలుపెట్టి తక్కువ కాలంలోనే సాటి రచయితలు అసూయ పడేంత తిరుగులేని స్థానానికి చేరుకున్నారు.

సులోచనారాణి రచనల్ని గురించి మాట్లాడేటప్పుడు తప్పకుండా వేసుకోవాల్సిన ప్రశ్నలు రెండు. ఆమె రచనల్లో ఏం ఉంటాయి? ఏం ఉండవు?? నవలల్లో చదివించే గుణాన్ని పుష్కలంగా నింపడం ఆమె ప్రత్యేకత. మళ్ళీ మళ్ళీ చదివేప్పుడు కూడా పాఠకుల్లో అదే ఉత్సుకత, పుస్తకాన్ని పూర్తిచేసి కానీ పక్కన పెట్టలేని ఒకలాంటి బలహీనత.. ఇదే ఆమె విజయరహస్యం. ఆమె నవలలు సినిమాలుగానూ, టీవీ సీరియళ్లు గానూ రావడం వెనుక, కంప్యూటర్ రోజుల్లో కూడా మళ్ళీ మళ్ళీ ముద్రించబడుతూ ఉండడం వెనుక ఉన్న రహస్యమూ ఇదే. మానవ సంబంధాలని దాటి ఆమె రచనవస్తువు మరోవైపు వెళ్ళలేదు. కుటుంబంలో ప్రతి ఒక్కరూ తమని తాము ఐడెంటిఫై చేసుకునే పాత్రలు, మనింట్లోనో,  పక్కింట్లోనో  జరిగాయేమో అనిపించే సంఘటనలు. ఫలితంగా, తన టార్గెటెడ్ పాఠకులైన గృహిణులతో పాటు అన్ని వర్గాలనీ తన రచనలవైపు ఆకర్షించుకున్నారు. అతిశయాన్నీ, నాటకీయతనీ కూడా అంగీకరింపజేశారు.
 

మానవ సంబంధాల చుట్టూ కథలల్లిన సులోచనారాణి అక్రమసంబంధాల జోలికి వెళ్ళలేదు ఎన్నడూ. 'సంసార పక్షపు రచయిత్రి' అన్న ముద్రని సంపాదించుకుని, నిలబెట్టుకున్నారు. పాపులారిటీ కోసం క్షుద్రపూజలనో, పిశాచాలనో రచనల్లో ప్రవేశపెట్టలేదు. సెక్సు, హింసల జోలికి వెళ్ళలేదు. టీవీ సీరియళ్ల టైపు పగలు, ప్రతీకారాలు మచ్చుకైనా కనిపించవు. సంస్కృత కావ్యాలనో మరో రచనలనో అడ్డం పెట్టుకుని కథానాయికల అంగాంగ వర్ణనలు చేయలేదు.ఆమె సృష్టించిన నాయికలు బేలలు కారు, ధీరలు. అలాగని, నాయికలని ఉన్నతంగా చూపించడం కోసం నాయకుల వ్యక్తిత్వ హననం చేయడమో, వారిని మరగుజ్జులుగా చూపడమో జరగలేదెన్నడూ. విశ్వ విఖ్యాత మిల్స్ అండ్ బూన్స్ రచనలు, బెంగాలీ రచయిత శరత్ బాబు సాహిత్య ప్రభావం సులోచనారాణి రచనల మీద కనిపించినా నేరుగా కాపీ కొట్టారన్న అపప్రధని ఏనాడూ మూటకట్టుకోలేదు.

పురుషాధిక్య ప్రపంచంలో ఒక మహిళ తనకి తానుగా ఒక ఉన్నత స్థానాన్ని సృష్టించుకుని, దశాబ్దాల పాటు మరొకరిని దరిదాపులకు రానివ్వకుండా నిలబడడం అన్నది మామూలు విషయం కాదు. ప్రతిభకి నిరంతర కృషి తోడవడం వల్ల వచ్చిన ఫలితమది. విజయం వెంట పరుగుతీసే సినిమా వారు, సులోచనారాణి చేత సినిమా రచనలూ చేయించారు. సహజంగానే ఆమె కీర్తి కొందరికి కంటగింపు అయ్యింది. జోక్స్ నీ, సెటైర్స్ నీ ప్రచారంలోకి తెచ్చారు. ఆమెని దృష్టిలో ఉంచుకుని చేసిన వ్యంగ్య రచనలు, "నేను స్త్రీని, పైగా అందమైన పేరు భరిస్తున్నదానిని.. రచనలు చేయడానికి ఇంతకన్నా అర్హతేమి కావాలి?" లాంటి సంభాషణలు, మూడు నాలుగు పత్రికల్లో ఏకకాలంలో సీరియల్స్ రాసే పాపులర్ రచయిత్రి, ఒకసారి పొరపాటున ఒక పత్రికకి పంపాల్సిన మేటర్ని మరో పత్రిక్కి పంపినా పాఠకులు పోల్చుకోలేక చదివేసుకున్న ఇతివృత్తాలతో కథలు... తనని ఉద్దేశించి రాసిన వీటన్నింటినీ ఆమె స్పోర్టివ్ గానే తీసుకుని ఉంటారు బహుశా.

వ్యక్తిగా సులోచనారాణి వివాదరహితురాలు. ఏ వివాదంలోనూ ఆమె తలదూర్చలేదు. తనని విమర్శించిన వాళ్లకి కూడా మరింత పాపులర్ రచనలు చేయడం ద్వారానే సమాధానం చెప్పారు తప్ప మరో మార్గాన్ని ఎంచుకోలేదు. 'మీనా' నవలని కాపీకొట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ 'అ ఆ' సినిమా తీసినప్పుడు కూడా ఆమెనుంచి బహిరంగ విమర్శ రాలేదు. అయితే, ఆమె అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో, సినిమా విడుదలైన కొన్ని రోజులకి త్రివిక్రమ్ టైటిల్ కార్డ్స్ లో ఆమెకి 'స్పెషల్ థాంక్స్' చెప్పక తప్పలేదు. 'సులోచనారాణి నవలల్లో సామాజిక స్పృహ ఉండదు' అన్నది ఆమె రచనల మీద విన్న ప్రధాన విమర్శ. తెలుగు సాహిత్యంలో అస్తిత్వ వాదం ఊపందుకున్న కాలంలో కూడా ఆమె తన ధోరణిలో రచనలు చేశారు తప్ప, వాదాల జోలికి వెళ్ళలేదు. ఆమె మార్గం మీద ఆమెకి స్పష్టమైన అవహగాన ఉండడం ఇందుకు కారణం కావొచ్చు బహుశా.

తరచి చూస్తే, స్త్రీ సాధికారికతని తన రచనల్లో బలంగా ప్రతిపాదించిన రచయిత్రి సులోచనారాణి. తెలుగునాట తొలితరం ఉద్యోగినులు ఆమె పాత్రలలో తమని తాము చూసుకున్నారు అనడం అతిశయోక్తి కాదు. రచయిత్రిగా తన బలం ఏమిటన్నది ఆమెకి బాగా తెలుసు. తెలుగు లోగిళ్ళలో కనీసం కొన్ని తరాలకి సాహిత్యం చదవడాన్ని అలవాటు చేశాయి ఆమె రచనలు. అసలంటూ పాఠకులు తయారైతే, తర్వాత తమకి నచ్చిన సాహిత్యాన్ని చదువుకుంటారు కదా. ఈ తయారయ్యే ప్రక్రియకి ఆమె నవలలు చేసిన దోహదం తక్కువదేమీ కాదు. 'కమర్షియల్ రైటర్' అని ఆమెని చిన్నచూపు చూసిన సామాజికస్పృహ గల రచయిత(త్రు)లూ ఉన్నారు. వాళ్లకి చెప్పేది ఒక్కటే.. మీ రచనలు చదివిన, చదువుతున్న పాఠకుల్లో అనేకులు మొదట చదివిని ఆమె రచనలనే అని ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆమె రచనలు చదవడం వల్లే వాళ్ళు మీ రచనల దాకా వచ్చారని మర్చిపోకండి.

'నవలాదేశపు రాణి' అన్న కీర్తి కిరీటాన్ని సృష్టించుకున్న ఘనత సులోచనారాణిది. ఆ స్థానం ఆమెది మాత్రమే. సులోచనారాణి రచనలన్నీ ఒకచోట చేర్చి సంకలనం వెలువరించే దిశగా ఆలోచించాల్సిందిగా ప్రచురణకర్తలని కోరుతూ, నా బాల్యంలో భాగమైన, నేను చదివిన, చదువుతున్న సాహిత్యానికి కారకురాలైన నా అభిమాన రచయిత్రికి కన్నీటి నివాళి.

బుధవారం, మే 09, 2018

మహానటి

'మహానటి' అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు సావిత్రి. దక్షిణ భారత సినీ పరిశ్రమ మీద తనదైన ముద్ర వేసి, సినిమా చరిత్రలో తనకంటూ ఓ పేజీని నిర్మించుకున్న సావిత్రి భౌతిక ప్రపంచాన్ని విడిచి దాదాపు నాలుగు దశాబ్దాలు గడుస్తున్నా, ఆమె కథ సినిమాగా రికార్డు అవ్వలేదు. బహుశా, నాగ్ అశ్విన్ అనే యువ దర్శకుడి కోసమే ఆ అవకాశం ఇన్నాళ్లూ వేచి చూసిందేమో అనిపించింది, వైజయంతి మూవీస్, స్వప్న సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మించిన 'మహానటి' సినిమా చూసి థియేటర్ నుంచి బయటికి వస్తుంటే. ఒక్కమాటలో చెప్పాలంటే, వెండితెర మీద సావిత్రి ఎంత గొప్ప నటో, ఆమెకి అంత గొప్ప నివాళి ఈ సినిమా.

నిజానికి సావిత్రి జీవితం తెరిచిన పుస్తకం. బోళాతనం, ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మనస్తత్వం అవ్వడం వల్ల, చాలామంది నటీనటుల్లాగా ఆమె తన గతానికి రంగులు పూసి చూపించే ప్రయత్నం చేయలేదు. ఫలితంగా, ఆమె జీవితం మీద ఎన్నో పుస్తకాలు వచ్చాయి. కొన్ని నేరుగా ఆమె జీవితకథలుగానే ప్రకటించబడితే, మరికొన్ని ఆమె జీవితాన్ని ఆధారంగా చేసుకొని తయారైన కథలుగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ కథలన్నీ కాచి వడబోసి, నిజాలు నిగ్గుతేల్చి, ఆమె వ్యక్తిత్వాన్ని పట్టుకుని, ఆమె తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాల తాలూకు మూలాల్నివెలుగులోకి తెచ్చి, ఈ నాటికీ ఆమెని అభిమానించే అశేష ప్రేక్షకుల ముందు ఉంచే ప్రయత్నం చేయడం మామూలు విషయం కాదు. ఆ ప్రయత్నం చేసిన దర్శక నిర్మాతలకి ముందుగా అభినందనలు.


చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకుని, తనని ఏమాత్రం ఇష్టపడని పెదనాన్న పంచకి తల్లితో సహా చేరుకున్న ఓ అమ్మాయి మొదట నాటకాల్లోనూ, అటు తర్వాత సినిమాల్లోనూ చేరి మహానటిగా ఎదగడం, ఈ ఎదిగే క్రమంలో తీసుకున్న నిర్ణయాలు, చేసుకున్న అలవాట్ల ఫలితంగా కెరీర్నీ, డబ్బుని, మనుషుల్నీ నష్టపోయి మరణం అంచుకి చేరుకోటం.. ఇది ప్రధాన కథ. గొప్ప పేరు ప్రఖ్యాతులున్న నటీమణి కోమాలోకి జారి, ఎవరూలేని అనాధగా హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతున్నప్పుడు, ఆమె జీవితంలో ప్రజలెవరికీ తెలియని సంఘటనల్ని పరిశోధించి ప్రచురిస్తే ఆ కథనాలు సేలబుల్ అవుతాయని భావించే ఓ పత్రికా, ఆ పత్రికలో కొత్తగా చేరి తనని తాను నిరూపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్న జర్నలిస్టు, ఆ జర్నలిస్టుని ప్రేమిస్తూ ఆమె ప్రేమకోసం ప్రయత్నించే ఫోటోగ్రాఫరు.. ఇది ఉప కథ.

ఈ రెండు కథల్నీ పడుగూ పేకలుగా అల్లి, సావిత్రి వ్యక్తిగత, వెండితెర జీవితాల్లో ముఖ్య సంఘటనలు వేటినీ విడిచిపెట్టకుండా నడిపించిన కథలో ప్రతి పాత్రకూ రీప్లేస్మెంట్ ఊహించలేని నటీనటులు, పాత్రోచితమైన సంభాషణలు, మీదుమిక్కిలి ప్రేక్షకుల్ని సినిమాలో లీనం చేసే నేపధ్య సంగీతం కలిసి 'మహానటి' ని ఓ గొప్ప సినిమాగా నిలబెట్టాయి. సినిమా చూసిన ప్రేక్షకులు, సావిత్రి అప్పటికే పెళ్ళై పిల్లలున్న జెమిని గణేశన్ కి రెండో భార్యగా వెళ్లడాన్ని మాత్రమే కాదు, ఆమె మద్యానికి బానిస కావడాన్ని కూడా ఒప్పేసుకోగలగడం దర్శకుడి విజయమే. అనారోగ్యంతో ఉన్న సావిత్రి ముఖాన్ని ఎక్కడా తెరమీద చూపించక పోవడమే కాదు, ఎండ్ టైటిల్స్ కి ముందు ఆమె నాటకాల రోజుల సన్నివేశాన్ని రి-ప్లే చేయడం ద్వారా ప్రేక్షకులు సావిత్రిని ఎలా గుర్తుపెట్టుకోవాలని తాను భావిస్తున్నాడో చెప్పకనే చెప్పాడు నాగ్ అశ్విన్.


నటీనటుల్లో ముందుగా చెప్పుకోవాల్సింది సావిత్రిగా నటించిన కీర్తి సురేష్ గురించి. ఈమె తప్ప ఇంకెవ్వరూ ఈ పాత్రని చేయలేరు అనిపించేలా నటించింది. ఒక మేకప్, కాస్ట్యూమ్స్ మాత్రమే కాదు, సావిత్రిగానూ, సావిత్రి నటించిన పాత్రలుగానూ కూడా ఒప్పించింది కీర్తి. జెమిని గణేశన్ గా నటించిన దుల్కర్ సల్మాన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే తండ్రి మమ్ముట్టి 'స్వాతి కిరణం' లో అనంత రామశర్మ పాత్రని ఎంత అలవోకగా నటించాడో, జెమిని గణేశన్ పాత్రని అంతే అలవోకగా ఒప్పించేశాడు దుల్కర్. సావిత్రి పెదనాన్న చౌదరి గా రాజేంద్రప్రసాద్ కి కీలకమైన పాత్ర దొరికింది. సావిత్రి నట జీవితంలోని సెలబ్రిటీల పాత్రల్లో నటులు, దర్శకులు మెరిశారు. ఏ పాత్ర ఔచిత్యానికీ భంగం కలగక పోవడం  మెచ్చుకోవాల్సిన విషయం.

సహాయ పాత్రల్లో నాకు బాగా నచ్చింది జెమిని గణేశన్ భార్య అలమేలు గా చేసిన మాళవికా నాయర్. ఆమె తెరమీద కనిపించేది రెండు మూడు సన్నివేశాలే అయినా అవి కథకి కీలకం కావడం వల్లా. కీర్తి, దుల్కర్ లతో పోటీపడి ఆమె నటించడం వల్లా ఆమె నటన గుర్తుండిపోతుంది. దర్శకుడి పనితనాన్ని గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఎస్వీఆర్ గా నటించిన మోహన్ బాబు చేత కూడా అండర్ ప్లే చేయించి, ఎక్కడా మోహన్ బాబు కనిపించని విధంగా నటింపజేశాడు. సినిమా ప్రారంభ సన్నివేశం, ఇంటర్వెల్, ముగింపు వీటిని ఎంత శ్రద్ధగా ఎంచుకున్నాడో, సినిమాలో ప్రతి ఫ్రేమ్ నీ అంతే జాగ్రత్తగా ఎంచుకుని చిత్రించాడు. సావిత్రి జీవితంలో జరిగిన సంఘటనలన్నీ ఈ సినిమాలో ఉండకపోవచ్చు, కానీ ఉన్న సన్నివేశాలన్నీ ఆమె జీవితంలో భిన్న కోణాలని, ఆమె వ్యక్తిత్వాన్ని, ఆలోచనా విధానాన్ని పరిచయం చేసేవే.


ప్రధాన కథ మీద ఎంత శ్రద్ధ చూపించాడో, ఉప కథనీ అంతే జాగ్రత్తగా మలిచాడు దర్శకుడు. ఉప కథలోని పాత్రలకి కూడా తమదైన వ్యక్తిత్వాన్ని ఇవ్వడం, ఉప కథ ముగింపుకి ప్రధాన కథతో లంకె వేయడం నాగ్ అశ్విన్ లో ఉన్న రచయిత తాలూకు ప్రతిభని పరిచయం చేస్తుంది. ఇంతకీ ఈ సినిమా ఇతడికి దర్శకుడిగా కేవలం రెండో ప్రాజెక్టు కావడం మరింత ఆశ్చర్యకరం. ఎంతో అనుభవజ్ఞుడిలా, పరిణతితో తీశాడు సినిమాని.  ప్రస్తావించుకోవాల్సిన మరో అంశం సంభాషణలు. గత శతాబ్దపు అరవై, డెబ్బై, ఎనభై దశకాలు, నాటి బెజవాడ, మద్రాసు ప్రాంతాలు, అక్కడి పలుకుబళ్లు, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటూనే పాత్రల వ్యక్తిత్వాలని ఎలివేట్ చేసే విధంగా క్లుప్తంగా పలికించిన మాటలు. అదికూడా నాటకీయత దాదాపుగా లేకుండా. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు, మిక్కీ జె మేయర్ సంగీతం ఇవి రెండూ జిలుగు నగలో వెలుగు రాళ్ళలా అమిరాయి.

ఖర్చుకి వెనకాడకుండా తీసిన చిత్రం అనే మాట ఈ సినిమాకి అక్షరాలా సరిపోతుంది. ఆకాలం నాటి స్టూడియోలు, ఉపకరణాలు, సెట్టింగులు, వాహనాలు, నాటి మద్రాసు మహానగరం.. ఒకటేమిటి? సినిమాలో ప్రతి ఫ్రేము సెట్ లో తీసిందే. ప్రతి సెట్టూ కళ్ళు చెదిరేలా నిర్మించిందే. ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి విజయ-వాహిని స్టూడియోస్, మద్రాసు వీధులు, సావిత్రి భవంతి సెట్టింగులు. సావిత్రి వాడిన లాంటివే కాస్ట్యూమ్స్, నగలు, అవి కూడా ఆమె జీవితంలో వివిధ దశల్లోనూ, అనేక సినిమాల్లోనూ వాడినవి. అసలు ఆ రీసెర్చ్ కే ఎన్నాళ్ళు పట్టి ఉంటుందో కదా అనిపించింది. పత్రిక వాళ్లకి కథకి కథనానికి తేడా తెలియకపోవడం, ఒకట్రెండు చోట్ల ఎడిటింగు కాస్త ఇబ్బంది పెట్టాయి కానీ, మూడు గంటలకి మూడు నిముషాలు మాత్రమే తక్కువ నిడివి ఉన్న సినిమాలో ఆమాత్రం ఇబ్బందులు మామూలేనేమో. చివరిగా ఓ మాట, ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావు, రాలేవు. మనం చేయాల్సిందల్లా మర్చిపోకుండా చూడడం, 'మహానటి' జ్ఞాపకాలను నెమరేసుకోవడం.