బుధవారం, జనవరి 24, 2018

నవ వసంతం

చూస్తుండగానే 'పుట్టినరోజు జేజేలు...' పాడుకునే రోజు మళ్ళీ వచ్చేసింది. ఎప్పటిలాగే రాసిన విషయాల కన్నా రాయాల్సినవే ఎక్కువ మిగిల్చిన ఏడాది ఇది. అవును, 'నెమలికన్ను' కి తొమ్మిదేళ్లు నిండాయి. ఎప్పటిలాగే గడిచిన ఏడాది కూడా చదివిన పుస్తకాలు, చూసిన సినిమాల వివరాలే బ్లాగు రాతల్లో సింహ భాగాన్ని ఆక్రమించాయి. మిత్రుల ఆదరణ, ప్రోత్సాహం యధావిధిగా కొనసాగుతున్నాయి. వాళ్ళకే కాదు, అప్పుడప్పుడూ నాకూ ఎదురవుతున్న ప్రశ్న 'ఎందుకు తరచుగా రాయడం లేదు?' ఆశ్చర్యం ఏమిటంటే, ఎవరికైనా చెప్పేందుకే కాదు, నాకు నేను చెప్పుకునేందుకూ సంతృప్తికరమైన జవాబు దొరకడం లేదు.

ఇతర మాధ్యమాలలో తెలుగు వినియోగంలోకి రావడంతో, బ్లాగింగ్ బాగా తగ్గిపోయింది అన్నది అక్కడక్కడా వినిపిస్తున్న ఫిర్యాదు. కొన్ని బ్లాగుల విషయంలో ఇది నిజమే కూడా. కానీ, బ్లాగులకి కూడా సమ ప్రాధాన్యత ఇచ్చి గతంలో అంత విస్తృతంగా కాకపోయినా పోస్టులు రాస్తున్న, చదువుతున్న మిత్రులకి కొదవలేదు. ఇంకా చెప్పాలంటే బ్లాగింగ్ ని సీరియస్ గా తీసుకున్న వాళ్ళు ఎవరూ బ్లాగుల్ని విడిచిపెట్టలేదు. టపాల సంఖ్యనే ప్రాతిపదికగా తీసుకున్నా, గతేడాదిలో రాసిన యాభై నాలుగు పోస్టులని 'పూర్ పెర్ఫార్మన్స్'  కేటగిరీలో వేయలేను. ఇంతకన్నా తక్కువ రాసిన సందర్భాలు ఉన్నాయి మరి.

రాయాల్సిన విషయాలకి కొదవ లేకపోయినా రాయడం అన్నది తరచూ వాయిదా పడుతూ ఉండడం కొంచం గట్టిగానే ఆలోచించాల్సిన విషయం. 'నీచమానవుణ్ణి' కాకూడదని ('ఆరంభించరు నీచ మానవుల్..') ఎప్పటికప్పుడు హెచ్చరించుకుంటూనే, బ్లాగు విషయంలో ఎక్కువసార్లు అలాగే మిగిలిపోతూ ఉండడం నాకూ బాగాలేదు. అప్పుడప్పుడూ పాత టపాలు చదివినప్పుడు (నావీ, మిత్రులవీ) ఒక్కటే అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు రాస్తే మరికొన్నాళ్లు తర్వాత వాటినీ ఇలాగే చదువుకోవచ్చు అని. బ్లాగుల నుంచి నాస్టాల్జియాని విడదీయడం మన తరమా?


గతేడాది బ్లాగింగ్ వరకూ చూస్తే, ఏమాత్రం ముందస్తు ప్లానింగ్ లేకుండా మొదలు పెట్టి ఏకబిగిన పూర్తి చేసింది 'కన్యాశుల్కం' సిరీస్. గురజాడ వారి 'కన్యాశుల్కం' నాటకానికి నూట పాతికేళ్ల పండుగ జరుగుతున్న సందర్భంగా ఏదన్నా ఒక పోస్టు రాయాలన్న ఆలోచన, నెమ్మదిగా 'ఒక్కో పాత్రని గురించీ రాస్తే' వరకూ పెరగడం, అకారాది క్రమంలో ముఖ్య పాత్రల పరిచయాలు రాయడం జరిగిపోయింది. ఒక్కో పాత్ర తాలూకు వ్యక్తిత్వాన్ని బాగా అర్ధం చేసుకోవడం కోసం ఆ పుస్తకాన్ని మళ్ళీ మళ్ళీ చదవడం, 'కన్యాశుల్కం' నాటకం గొప్పదనాన్ని మరికొంచం అర్ధం చేసుకోవడం (ఇంకా చాలా మిగిలే ఉంది) జరిగాయి.

మనసులో పుట్టిన చాలా కథలు కీబోర్డు వరకూ రాకుండానే ఆగిపోయాయి. ఏళ్ళ తరబడి వాయిదా వేస్తున్న రాతలు 'మా సంగతి ఏమిటి?' అని కొంచం మర్యాదగానే గుర్తు చేస్తున్నాయి. చదువు విషయానికి వస్తే, నాన్-ఫిక్షన్ దారిలో వెళ్తోంది బండి. మధ్యలో బ్రేక్ కోసమైనా ఫిక్షన్ చదవాలని బలంగా అనిపిస్తోంది ఒక్కోసారి. కొన్ని మంచి సినిమాలు చూశాను. 'అద్భుతం' అనదగ్గవి తారస పడలేదు. మొత్తం మీద చూసినప్పుడు, సింహావలోకనంలో 'మరికొంచం తరచుగా రాయాలి' అన్నది నాకు బాగా అనిపించిన విషయం. తొమ్మిదేళ్లుగా 'నెమలికన్ను' అని అభిమానిస్తూ, ఆదరిస్తూ వస్తున్న మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు!!

30 కామెంట్‌లు:

  1. నవ వసంతపు నవోత్సవానికి - నవోత్సాహానికి శుభాభినందనలు, మురళిగారు!

    రిప్లయితొలగించండి
  2. అభినందనలు. ఇంకా ఎన్నో ఏళ్ళు ఇలాగే మీ వ్యాసంగం కొనసాగాలని ఆశిస్తున్నాను.
    నేను తప్పనిసరిగా చదివే బ్లాగుల్లో నెమలికన్ను కూడ ఒకటి.

    రిప్లయితొలగించండి
  3. Congratulations sir for 9 successful years in blogging..I wish many more years to go with wonderful posts.

    రిప్లయితొలగించండి
  4. బ్లాగు రాతలకి కరువు కాలం లాంటి ఈ రోజుల్లో కూడా క్రమం తప్పకుండా టపాలు వస్తున్న అతి తక్కువ బ్లాగుల్లో మీ బ్లాగు ఒకటి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. గోదావరి ఎండకూడదు. ఎప్పటికీ. ఎన్ని అవాంతరాలు వచ్చినా. జీవనదికి ఆ "హక్కు" లేదు.

    రిప్లయితొలగించండి
  6. అభినందనలు మురళి గారు. మీ కన్యాశుల్కం సిరీస్ మోత్తం చదినాను. చాలా విషయాలు తెలిసాయి. సినిమా చూసాను. పుస్తకం చదవడమే మిగిలి వుంది. చదివి యిస్తానని తీసుకున్న మిత్రుడు సంవత్సరం దాటిపోయినా యింకా పుస్తకం తిరిగి యివ్వలేదు.

    రిప్లయితొలగించండి
  7. కృష్ణా జిల్లాలో బోర్ల మీద వ్యవసాయం ఎన్నడో మొదలయింది. గొదావరి జిల్లాలో నీరు ఎపుడూ సమృద్ధిగా ఉండేది. మొన్న వెళ్ళినపుడు నీళ్ళు లేవు అని కరెంట్ వచ్చినపుడు తోడేసుకువాలని నిద్రపోకుండా పొలం దగ్గరే కాపలా కాస్తున్నారు. అన్నదమ్ముల మధ్య వైరాలు మొదలయ్యాయి. జీవనదికి హక్కులున్నా స్వేచ్ఛగా పారే పరిస్థితులు నేడు లేవు. అయినా సరే నవ వసంతంలోని సవాళ్ళను ఎదురీది, సమర శంఖాన్ని పూరించి, దశావతారం లో సాహితీ సేద్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి, విజయబావుటా ఎగరేసి జీవనదిని ఉత్సాహభరితం చేయాలని మన:స్పూర్తిగా కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  8. చూస్తూండగానే కాలం ఎంత వేగంగా గడిచిపోతుందండీ అసలు... ఈ ఏడాది మరిన్ని మంచి పుస్తకాలు చదవాలని ఇంకా మంచి సినిమాలు చూడాలనీ, మరెన్నో టపాలు రాయాలనీ కోరుకుంటూ శుభాభినందనలు మురళి గారు :-)

    రిప్లయితొలగించండి
  9. ఆత్మకింపైన భోజనమూ, లేప్టాప్ సహిత ఊయలమంచమూ, కప్పురవిడెమూ.. మీకందాలని రసజ్ఞులైన పాఠకుల తరపున కోరుకుంటూ.. శుభాభినందనలు.. :)

    రిప్లయితొలగించండి
  10. నెమలికన్నుకి నవ వసంతాలు నిండాయంటే ఆనందంగా వుంది. మురళి గారు చదివిన పుస్తకాలు, కథలు గురించి చెప్పినా... చూసిన సినిమాను సమీక్షించిన... తన పరిచయంలో ప్రాంతాన్ని అక్షరాల్లో చూపించినా... ఓ ప్రత్యేక శైలి ఉంటుంది. ఇక రుచుల్ని పరిచయం చేస్తే నోరూరాల్సిందే. నవ నవోన్మేషంగా ఉన్న నెమలికన్నుమరింతగా మాకు మధురానుభూతుల్ని పంచాలి.

    రిప్లయితొలగించండి
  11. అప్పటినుండి ఇప్పటివరకు క్రమం తమ్మకుండా చక్కగా నడుస్తున్న ఏకైక భాగు నెమలికన్ను. అభినందనలు మురళిగారు. ఒక పుస్తకం, లేదా సినిమా గురించి మీరు రాసిన రివ్యూలు చదవడం నా వరకు నేను విజ్ఞానంగా భావిస్తాను. మీరు వ్రాసే ప్రతి టపా చదువుతూనే ఉంటాను, చాలా సార్లు వాఖ్య వ్రాయలేకపోయినందుకు సిగ్గుగా కూడా ఉంటుంది. మీరు మరిన్ని పుస్తకాలు చదివి, సినిమాలు చూసి బ్లాగును దిగ్విజయంగా కొనసాగించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  12. నేను మీ బ్లాగాభిమానిని. సుమన్బాబు సిరీస్ నాకు బాగా నచ్చిన కంటెంట్..

    రిప్లయితొలగించండి
  13. హృదయపూర్వక అభినందనలు మురళి గారు.
    బ్లాగుల విషయం లో మీరు చెప్పింది పూర్తిగా నిజమండి. ఏంటో నేనైతే పూర్తిగా నిర్లక్ష్యం చేసాను.:(
    మీ 'కన్యాశుల్కం' తప్పకుండా మొత్తం చదువుతాను.

    రిప్లయితొలగించండి
  14. @లలిత టీఎస్: చాలా చాలా ధన్యవాదాలండీ..
    @sam: Thank you very much!!
    @bonagiri: ధన్యవాదాలండీ.. మీ సపోర్ట్ మరువలేను..

    రిప్లయితొలగించండి
  15. @ ప్రియరాగాలు: థాంక్యూ వెరీమచ్..
    @శిశిర: ఇతరత్రా సోషల్ మీడియా విస్తరించాక కూడా బ్లాగులకి పాఠకులు ఉండడం, బహుశా ఈ మాధ్యమం ప్రత్యేకత అనుకోవాలండీ.. ధన్యవాదాలు
    @విన్నకోట నరసింహారావు: హృదయపూర్వక ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  16. @పురాణపండ ఫణి: ఎండకూడదనే నేనూ కోరుకుంటున్నానండీ.. ధన్యవాదాలు
    @లియో: తప్పకుండా చదవండి.. నాటకం/సినిమా చూసినా, చదివినప్పటి అనుభూతి వేరు.. ధన్యవాదాలు
    @నీహారిక: గోదావరి జిల్లాల మెట్ట వ్యవసాయానికి నదీజలాలు రావండీ.. ఇక వైరాలంటారా, వస్తూ పోతూ ఉండడం మామూలే కదా.. మీ శుభకామనకి ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  17. @వేణూ శ్రీకాంత్: అవునండీ.. ఇలాంటప్పుడే 'కాలం వేళ్ళ సందుల నుంచి ఇసుకలా జారిపోతోంది' లాంటి వాక్యాలు గుర్తొస్తూ ఉంటాయి.. మీ సపోర్ట్ కి అనేక ధన్యవాదాలండీ..
    @హిమబిందు: గుర్తుందండీ.. బొత్తిగా రాయడం మానేశారు మీరు.. ఆఫ్ కోర్స్, నేను కూడా అంతే అనుకోండి :) ..ధన్యవాదాలు
    @కొత్తావకాయ: ఎక్కడ ఆపాలో తెలిసిన వారు మీరు :) ..ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  18. @చక్రవర్తి: తప్పకుండానండీ.. ధన్యవాదాలు
    @జ్యోతిర్మయి: భలేవారండీ.. మీ వ్యాఖ్యలన్నీ నాకు జ్ఞాపకమే.. మీ అందరి ప్రోత్సాహంతో తప్పక కొనసాగిస్తానండీ.. ధన్యవాదాలు
    @నీలకంఠ: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  19. @శ్రీ.దు : ధన్యవాదాలండీ
    @శ్రీకర్ బాబు: చాన్నాళ్ళకి.. ..ధన్యవాదాలండీ
    @జయ: హమ్మయ్య! మీరు వ్యాఖ్య రాయగలుగుతున్నారు నా బ్లాగులో.. మరికొంచం ఆక్టివ్ గా బ్లాగులు రాసుకుందామండీ.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  20. నెమలికన్ను కి పుట్టినరోజు శుభాకాంక్షలు మురళి గారు. మరిన్ని రాతలతో నెమలికన్ను ఇంకా ఉత్సాహంగా ముందుకు సాగాలి అని కోరుకుంటూ - లక్ష్మి

    రిప్లయితొలగించండి
  21. చాలా లేటుగా అభినందనలండీ ..
    ఈ వ్యాఖ్య అయినా అచ్చయితే హమ్మయ్యా అనుకుంటానండీ .. చాలా సారి కామెంట్లు ఎక్కడకో వెళ్పోయాయండీ

    రిప్లయితొలగించండి
  22. అభినందనలు ఆలస్యంగా మురళి గారు

    రిప్లయితొలగించండి
  23. @లక్ష్మి: ధన్యవాదాలండీ
    @వంశీకృష్ణ: అయ్యయ్యో.. కామెంట్ సెట్టింగ్స్ మార్చేశానండీ.. ఎవరికీ ఇబ్బంది ఉండదనే అనుకుంటున్నా.. ధన్యవాదాలు..
    @నీత: చాన్నాళ్ళకి!! కుశలమే అని తలుస్తానండీ.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి