సోమవారం, డిసెంబర్ 21, 2015

కొల్లాయిగట్టితేనేమి?

కోనసీమలో ఉన్న ముంగండ అగ్రహారానికి ప్రపంచవ్యాప్తంగా పేరు. కేవలం వేదపండితులు, ప్రాచీన శాస్త్రాలలో నిష్ణాతులు మాత్రమే కాదు, ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న ఎందరికో ముంగండ పుట్టినూరు. ఉపద్రష్ట జగన్నాధ పండితరాయలు రెండు శతాబ్దాలకి పూర్వమే ఢిల్లీ సుల్తానుల ఆదరణకు పాత్రుడవ్వడం మాత్రమే కాదు, దర్బారు రాజనర్తకిని పెళ్ళాడి అక్కడే స్థిరపడిపోయాడు. ఝాన్సీ లక్ష్మిబాయి సైన్యంలో పనిచేసిన ముఖ్య సైనికుల్లో కొందరు ముంగండ వాస్తవ్యులే. వేదఘోషతో మారుమోగే ఆ పల్లెటూరిలో ఆధునికతకీ లోటులేదు. అలాంటి ముంగండ అగ్రహారాన్ని కథా స్థలంగా తీసుకుని మహీధర రామమోహన రావు రాసిన చారిత్రాత్మక నవల 'కొల్లాయిగట్టితేనేమి?'

జాతీయోద్యమ స్ఫూర్తి, స్వతంత్ర కాంక్ష దేశం నలుమూలలా పాకిపోయిన 1920-22 సంవత్సరాల మధ్య కాలంలో ఆంధ్రదేశంలో జరిగిన సాంఘిక, ఆర్ధిక, రాజకీయ పరిణామాలని ముంగండ అగ్రహారపు దృష్టి కోణం నుంచి చూస్తూ 1964 లో ఈ నవలని రాశారు రామమోహన రావు. నాలుగేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డుని అందుకున్నదీ పుస్తకం. ముంగండలోనే పుట్టిపెరిగిన మహీధర, బాల్యంలో తను చూసిన ఎందరో వ్యక్తులనీ, ఎన్నో సంఘటనలనీ నవలలో చిత్రించినా అది "కల్పనలో కొంత భారం తప్పించుకునేటందుకు తప్ప, దీనిలో పాత్రలేవీ యదార్ధాలు కావు. కథ జరిగి ఉండనూ లేదు" అని స్పష్టంగా చెప్పారు ముందుమాటలో.

రాజమండ్రి కళాశాలలో చదువుతున్న రామనాధం, గాంధీజీ పిలుపు అందుకుని విదేశీ వస్త్ర దహనం కార్యక్రమంలో తన దుస్తులూ, దుప్పట్లనీ తగలబెట్టి, అర్ధంతరంగా చదువుమాని ముంగండకి ప్రయాణం కావడం కథా ప్రారంభం. పడవ ప్రయాణంలో తోటి ప్రయాణికురాలు స్వరాజ్యం తో పరిచయం అవుతుంది అతనికి. ముంగండ పక్కనే ఉన్న చిరతపూడి వాస్తవ్యుడు, బ్రహ్మ సమాజికుడూ అయిన అబ్బాయి నాయుడి కూతురామె. అత్తవారి అభీష్టానికి వ్యతిరేకంగా కాలేజీలో చదువుకుంటోంది. ముంగండ లో రామనాధం కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకీ కూడా అతని నిర్ణయం అర్ధం కాదు. నేడో రేపో ఇంగ్లండు వెళ్లి ఐసీఎస్ పరీక్ష ఇచ్చి కలెక్టరుగా రావాల్సిన తాను ఇలా చదువు మధ్యలో మానుకుని రావడం ఎందుకో వాళ్ళకి అర్ధమయ్యేలా చెప్పడం అతనికి చేతకాదు.


నిజానికి చదువైతే మానుకున్నాడు కానీ, తర్వాత ఏం చేయాలనే విషయంలో స్పష్టత లేదతనికి. చిన్నప్పుడే తల్లిదండ్రులని పోగొట్టుకున్న రామనాధాన్ని నిస్సంతు అయిన అతని బాబాయి శంకరశాస్త్రి పెంచి పెద్ద చేశాడు. రామనాధంతో పాటు అతని ఆస్తినీ పెంచి పెద్దచేసిన శంకరశాస్త్రి, అమలాపురం పోలీసు ఇన్స్పెక్టర్ ఆదినారాయణ మూర్తి కూతురు సుందరితో కుర్రాడికి బాల్య వివాహమూ జరిపించేశాడు. అల్లుడు చదువు మానుకోడం, పైగా గాంధీ ఉద్యమంలో చేరాలనుకోడం కొరుకుడు పడదు నారాయణమూర్తికి. ఓ పక్క శంకరశాస్త్రి-నారాయణ మూర్తి కలిసి రామనాధాన్ని "దారిలో పెట్టే" ప్రయత్నాలు చేస్తూండగానే, ఊహించని విధంగా జైలుపాలై, శిక్ష పూర్తయ్యాక కూడా అగ్రహారీకులు సూచించిన ప్రాయశ్చిత్తానికి నిరాకరించి కులం నుంచి వెలివేయబడతాడు రామనాధం.

తోటలో ఓ చిన్న పాకలో ఒక్కడూ జీవితం మొదలు పెట్టి, చరఖా ఉద్యమాన్ని ఇంటింటి ఉద్యమంగా మార్చే ప్రయత్నాలు ఆరంభిస్తాడు.జాతీయోద్యమంలో ముంగండ నుంచి పాల్గొన్న మొదటి వ్యక్తి రామనాధం పెదనాన్న విశ్వనాథం. అయితే, విశ్వనాథానికి అన్యకులానికి చెందిన స్త్రీ వల్ల కలిగిన కొడుకు వెంకటరమణకి మాత్రం ఆంగ్లేయులపై మోజు. అభివృద్ధి, కులవ్యవస్థ నిర్మూలన వాళ్ళ వల్లే సాధ్యమని నమ్ముతాడు. సంప్రదాయాన్ని ప్రాణం కన్నా మిన్నగా భావించే ముంగండ అగ్రహారీకులు ఊరి చెరువుకి నిత్యం కాపలా కాస్తూ ఉంటారు. పంచములు ఆ చెరువు నీటిని ముట్టుకోవడం నిషేధం. వాళ్లకి నీళ్ళు కావాలంటే ఎవరన్నా తోడి పోయాల్సిందే. మంచినీటి సమస్యని  పరిష్కరించాలని నిర్ణయించుకున్న రామనాథానికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి.

చదువు మానేసిన రామనాధంతో కాపురం చేయడానికి సుందరి నిరాకరిస్తుంది. మరోపక్క చదువుకున్న కారణానికి స్వరాజ్యాన్ని విడిచిపెట్టి మరో స్త్రీని వివాహం చేసుకుంటాడు ఆమె భర్త. విజయవాడలో జరిగిన కాంగ్రెస్ జాతీయ సమావేశాల్లో ఊహించని విధంగా రామనాథానికి పేరొచ్చి పెద్ద నాయకుల దృష్టిలో పడతాడు. గోదావరి జిల్లా పర్యటనకి రాబోతున్న గాంధీజీని ముంగండ తీసుకెళ్ళి తను చేస్తున్న కృషిని పరిచయం చేయాలన్నది రామనాధం కోరిక. అందుకు ప్రయత్నాలు ఆరంభిస్తాడు. స్వరాజ్యం, రామనాధాల జీవితాలు ఏ మలుపు తిరిగాయన్నదానితో పాటు, కలెక్టరు కావాల్సిన రామనాధం చదువు మానేయడానికి గాంధీయే కారణమని దుమ్మెత్తి పోసే అతని కుటుంబ సభ్యులు, అగ్రహారీకులు గాంధీజీ విషయంలో ఎలాంటి వైఖరి తీసుకున్నారన్నది నవల ముగింపు. ఊపిరి బిగపట్టి చదివించే కథనం ఈ నవల ప్రత్యేకత. పాత్రలు, సన్నివేశాలు అన్నీ కళ్ళముందు కనిపిస్తాయి.

చదువుతున్నంతసేపూ ఇదే నేపధ్యంతో వచ్చిన నవలలు'చదువు,' 'మాలపల్లి,' 'నారాయణరావు,' 'వేయిపడగలు,' 'రామరాజ్యానికి రహదారి' పదేపదే గుర్తొస్తూనే ఉంటాయి. సంభాషణలు క్లుప్తంగా ఉండడం, సన్నివేశాల ద్వారానే కథని చెప్పడం ఈ నవల ప్రత్యేకత. అందుకే కావొచ్చు, నాటకీయత బహుతక్కువగా ఉంది. ప్రదాన పాత్రలతో పాటు వితంతువు నరసమ్మ, ఖద్దరు అమ్మే దువ్వూరి సుబ్బమ్మ, లెక్చరర్ రంగనాధరావు పాత్రలు బాగా గుర్తుండిపోతాయి. జాతీయోద్యమం నేపధ్యంలో వచ్చిన తెలుగు సాహిత్యంలో ఈ నవలకి ప్రత్యేక స్థానం ఇవ్వాల్సిందే. (విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రచురణ, పేజీలు 364, వెల రూ 250, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

2 వ్యాఖ్యలు:

 1. నేను ఈ నవల చదివి చాన్నాళ్ళయిందండీ! నా స్మృతిపథంలో ఉన్న కథకూ, మీరు చెప్పిన కథకు స్వల్ప వైరుధ్యాలున్నాయి..మరి నాకే సరిగ్గా గుర్తులేదేమో తెలియదు!

  చదువు మానేసిన రామనాథంతో కాపురం చేయడానికి సుందరి నిరాకరిస్తుంది -> సుందరికి రామనాథం చదువుతో పెద్దగా సంబంధం లేదేమో! కేవలం తండ్రి ప్రభావం వల్ల తండ్రి ద్వేషించిన రామనాథాన్ని తానూ ఆకారణంగా..అకారణంగా ద్వేషిస్తుంది. అంతే!

  గాంధీజీని ముంగండ తీసుకెళ్ళి తను చేస్తున్న కృషిని పరిచయం చేయాలన్నది రామనాథం కోరిక -> కృషిని పరిచయం చేయాలనా? స్వయంగా గాంధీజీ చేత తన చెరువును హరిజనులు వాడుకునే విధంగా వీలు కల్పిస్తే ఆగ్రహారికులు నోరు మెదపరన్న కారణం వల్లనా?

  ఏమైనా, మంచి నవలను పరిచయం చేశారు!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. @సుభగ: మొదటి పాయింటులో ఒకరకంగా మీరే రైటు.. ఆమె పరంగా కారణం అతని చదువు కాదు, కానీ ఆమె తల్లిదండ్రుల అభ్యంతరానికి మూలకారణం అతని చదువే కదండీ.. కథని క్లుప్తంగా చెప్పే క్రమంలో ఆ కంక్లూజన్ తీసుకున్నానన్న మాట! ఇక, రెండో పాయింటు మీరు పొరబడ్డారు. "ముంగండకి గాంధీ గారిని తీసుకువచ్చి తను నడుపుతున్న ఖద్దరు ఉత్పత్తి కేంద్రానికి ఆయన ఆశీర్వచన సంపాదించాలని రామనాధం ఆలోచన" (పేజీ 312) ..అదండీ విషయం!! ..ధన్యవాదాలు

  ప్రత్యుత్తరంతొలగించు