గురువారం, జూన్ 18, 2015

తెర వెనుక -2

(మొదటిభాగం తర్వాత...)

"లంక తగిలేసింది బాబుగోరూ.. మరేటీ బయ్యం లేదు," వీర్రాజు కేక వినిపించింది. కళ్ళు చీకటికి అలవాటు పడుతూ ఉండగానే మబ్బులు తొలగిపోయి వెన్నెల కురిసింది. పడవ నీళ్ళదారి పట్టింది నెమ్మదిగా.

స్వామి చేతిలో గ్లాసు పరుపు మీద పడి, కొంత స్కాచ్ ఒలికింది. కాసేపటి తర్వాత, నా సిగరెట్ అయిపోవడం చూసి, తనో పెగ్గు కలుపుకుని, నాకూ ఓ స్మాల్ పెగ్ అందించాడు. చల్లని వాతావరణంలో, చలచల్లని డ్రింక్ గొంతు దిగడం, ఆ వెనుకే లోపలినుంచి వేడి పుట్టడం ఓ గమ్మత్తైన అనుభవం.

స్వామి నాతో మాట్లాడాలనడం మంచి శకునం అనిపించింది. చేపముక్క కొరుకుతూ వాడివైపు చూశాను. గ్లాసు చేత్తో పట్టుకుని ఒడ్డు వైపు చూస్తున్నాడు. చంద్రమ్మ వాడి జీవితంలోకి రానిక్రితం రోజుల్లోనూ ఇదే నిర్లిప్తత ఉండేది వాడిలో. ఆమె వచ్చాక వాడి జీవితంలో చెప్పుకోదగ్గ మార్పే వచ్చింది.

ఆరు వారాల్లో తిరిగి వస్తుందనుకున్న మా ట్రూపు నటి, ఆరు నెల్ల  తర్వాతే రాగలిగింది. వైద్యం వల్లేమో, ఒక్కసారిగా బరువు పెరిగిపోయింది. ఇక ఆమెచేత నాయిక వేషాలు వేయించలేం. అప్పటికే చంద్రమ్మ మా బృందంలో కుదురుకుంది.

అదే సమయంలో అవ్వ కాలం చేసింది. చంద్రమ్మకి మేమందరం సాయం చేసినా, స్వామి మాత్రం అన్నీ తనే అయ్యాడు. వాళ్ళిద్దరూ కలిసి ఓ ఇంట్లోకి మారారు. దూరం ఊళ్లలో నాటకాలకి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరినీ చూసి భార్యాభర్తలనే అనుకునేవాళ్లు అక్కడివాళ్లు.

నన్ను 'బాబుగారూ' అనీ, స్వామిని తప్ప మిగిలిన ట్రూపు సభ్యులని 'అన్నయ్యా' అనీ పిలిచేది చంద్రమ్మ. ఆ చనువు చూసుకునేమో, ఒకరోజు స్వామి లేకుండా చూసి "నలుగురూ నాలుగు రకాలుగా అనుకుంటారు. మీరిద్దరూ పెళ్లి చేసేసుకోవచ్చు కదమ్మా.." అన్నాడు మా సభ్యుడొకడు చంద్రమ్మతో.

"మీ నలుగురి కోసవే చేసుకోవాలన్నయ్యా.." అందామె. ఆ తర్వాత, ఇంకెవరూ వాళ్ళ పెళ్లి విషయం మాట్లాడలేదు.

మునుపటి వేగం కొంత తగ్గినా, మాలో ఉత్సాహం తగ్గలేదు. కొందరు పాతవాళ్ళు వెళ్లి, కొత్తవాళ్ళు వచ్చారు. చంద్రమ్మ-స్వామి నాయికా నాయకులుగా వేసేవాళ్ళు. తప్పితే, స్వామికి విలన్ వేషం. మా ట్రూపు పేరు చెప్పగానే వాళ్ళ జంట పేరు ముందుగా గుర్తొచ్చేంతగా పేరు తెచ్చుకున్నారు ఇద్దరూ. అందుకున్న బహుమతులకైతే లెక్కేలేదు.

కర్ణుడు-ద్రౌపది పాత్రల్ని సోషలైజ్ చేసి రాసిన 'మీరే చెప్పండి' నాటకాన్ని రవీంద్రభారతిలో వేసినప్పుడు ప్రేక్షకుల్లో తనికెళ్ళ భరణి కూడా ఉన్నాట్ట. మాకు తెలియదు. ప్రదర్శన అయ్యాక, భరణిని స్టేజి మీదకి పిలిచారు.

"నేను గతంలో కూడా చెప్పాను.. మహాభారతం.. నిజంగా జరిగితే అద్భుతం.. కల్పన అయితే మహాద్భుతం. చాలా రోజుల తర్వాత ఓ మంచి నాటకం చూశాను.." భరణి ప్రసంగం ముగియడంతోనే ఆడిటోరియం చప్పట్లతో మార్మోగింది.

"అందుకేనా గురు గారూ.. మీరు నాటకాలన్నీ భారతంలో కథల్తోనే రాస్తారు?" ఆవేళ రాత్రి నాలుగో రౌండ్ లో అడిగాడు స్వామి.

"మన జీవితంలో జరిగేవన్నీ భారతంలో కనిపిస్తాయిరా.. భారతంలో లేనివేవీ జీవితంలో జరగవు.. అంతే.." నా జవాబు వాడికి గుర్తుందో లేదో కానీ, నాకు మాత్రం గుర్తే.

పడవ బరువుగా సాగుతోంది. వీర్రాజు పదం పాడుకుంటూ గెడ వేస్తున్నాడు. పెరుగన్నం బాక్సు నేనొకటి తీసుకుని, స్వామికొకటి అందించబోయాను.

"ఈ కాస్తా లాగించేస్తాను గురు గారూ.." అన్నాడు చేతిలో ఉన్న గ్లాసు చూపిస్తూ. అర్ధరాత్రి కావొస్తోంది. ఉదయాన్నే బయల్దేరి నేను తిరిగి వెళ్ళాలి. నేను ఉద్యోగం నుంచి రిటైర్ అవ్వడం, పిల్లలు హైదరాబాద్ లో ఉద్యోగాల్లో స్థిరపడడంతో అక్కడే ఇల్లు తీసుకున్నాం. లంకలో ఉన్న కొబ్బరి తోటని వీర్రాజుకి కౌలుకిచ్చాను.

మా బృందం ఊరికొకరుగా చెదిరిపోయినా ఇప్పటికీ నాటకాలు ఆడుతూనే ఉన్నాం. 'ఎందుకొచ్చిన నాటకాలు?' అని ఎవరూ అనుకోరు. బహుశా, నాటకంలో ఉన్న ఆకర్షణో మరోటో కారణం అయి ఉంటుంది.

ఇప్పుడొచ్చింది ఊరిని చూసుకోడానికి కాదు, స్వామిని చూడ్డానికి. నేను రమ్మంటే వాడు రెక్కలు కట్టుకుని వాలతాడు. కానీ, ఇది వాడిని రప్పించుకునే సందర్భం కాదు. నేను రావాల్సింది. అందుకే వచ్చాను. సన్నగా గాలి తిరిగింది. వీర్రాజు పాట ఆగింది.

"గురు గారూ.. నేను నాటకాల్లోకి ఎందుకొచ్చేనో తెల్సా మీకు?" ఉన్నట్టుండి అడిగాడు స్వామి. వాడి చేతిలో గ్లాసు ఖాళీ అయిపోయింది. వీస్తున్న గాలి ఒక్కసారిగా ఆగిపోయింది.

"మీరు అడగలేదు గురు గారూ.. అస్సలేం అడగలేదు నన్ను. మీకు చెప్పుకోటం ఇదాయకం.. అమ్మే పెంచింది నన్ను.. అమ్మ కష్టం చూళ్ళేక ఉజ్జోగవెతుక్కుని చేరిపోయేను. ఉజ్జోగం ఒచ్చేసింది కదానేసి సమందం చూసి పెళ్లి చేసింది మా అమ్మ.. మనవల్ని ఎత్తాలనుకున్నాది పాపం.." నేను వింటున్నాను, నిశ్శబ్దంగా.

"స్మాల్ పెగ్ గురు గారూ.. విత్ యువర్ పర్మిషన్.." కొంచం నాటకీయంగా అడిగాడు స్వామి, బాటిల్ మూత తీస్తూ. ఓ గుటక వేసి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు.

"మంగ తో నాకు పెళ్లిచేసింది గురు గారూ అమ్మ. పెళ్లి పీట్ల మీద ఏడుపు మొకంతో కూచున్నాది మంగ. నేను పట్టించుకోలేదు. కార్యెం గెదిలోనూ అదే ఏడుపు. 'నాకొంట్లో బాలేదు..' అని చెప్పింది. నేను బయటికెల్లిపోతా నన్నాను... 'మూర్తానికి ఏవీ జరగలేదంటే మావోళ్ళు కోపం సేత్తారు.. బయటికెల్లకు..' అని బతిమాలింది. నేలమీద తలగడేసుకుని పడుకున్నాను..." ఊపిరి తీసుకున్నాడు.

"వారం పదిరోజులు రోజులు ఇదే తంతు.. అమ్మతోటీ పెడమొకంతోనే ఉండేది.. ఈలోగా తల్లిగారోళ్ళు మంగని పుట్టింటికి తీసుకెళ్ళేరు.. అక్కణ్ణించే అది లేచిపోయింది.." చెప్పడం ఆపి రెండు గుక్కలు గటగటా తాగాడు స్వామి.

"అది లేచిపోటంతో నాకేం పేచీలేదు గురు గారూ.. ఇష్టం లేని కాపరం సాగుతాదా.. కానండీ, ఆ బాత్తోటి మాయమ్మ గుండాగి చచ్చిపోయింది. చచ్చిపోలేదు.. పొడిచి పొడిచి చంపేసేరండి ఊళ్ళో వోళ్ళు, చుట్టాలోళ్ళూ.." కళ్ళు తుడుచుకున్నాడు. 

"నన్ను మాత్రం ఒదిలేరనుకున్నారా.. చెడ్డీ బొత్తం పెట్టుకోటం చేతకాన్నాకొడుకులు కూడా 'ఈడి పెల్లం లేసిపోయిందిరోయ్..' అనేవోడే. కాకులు చాలా మంచియి  గురు గారూ.. ఈ ఎదవలు కాకులకన్నా కనా కష్టం.. ..ఇంకొక్క పెగ్గుకి పర్మిషనివ్వాల్నాకు.." అంటూనే బాటిల్ అందుకున్నాడు.

వాడు పరిచయమైన తొలిరోజులు గుర్తొచ్చాయి నాకు. ఆ ఆవేశానికి కారణం అర్ధమవుతోంది.

"అమ్మే లేకపోయేక, ఈ ఎదవల చేత మాటలు పడతా బతకాలా అనిపించింది గురు గారూ.. ఆఫీసోళ్ళు కాకినాడంపితే, రాత్రేం తోచక నాటకం చూసేను. 'ఓ తల్లి తీర్పు' .. మీకు గుర్తున్నాదా?" తలూపాను, నిలువుగా.

"ప్రెతి డైలాగూ గుర్తే.. ఎన్ని చప్పట్లు గురు గారూ.. అది చూసేక నాకూ చప్పట్లు కొట్టించుకోవాలనిపించింది.. నాటకాల్లో జేరాలనిపించింది..చచ్చేం సాధిత్తాం, బతికి చూపించాలి కానీ అనుకున్నాను మీ నాటకం చూసేక," మాట్లాడ్డం ఆపి ఓ గుక్క తాగాడు.

"మీరు ఒక్క మాటకూడా అడక్కుండా నాటకాల్లో చేర్చుకున్నారు. చెప్పకపోటవే, నా జ్యేస చప్పట్ల మీదే.. ఏ డైలాగు ఎలాగ చెప్తే చప్పట్లడతాయా అని చూసేవోడిని. జనం చప్పట్లు కొడతంటే నన్ను నానామాట్లన్న కొడుకులందరూ వొచ్చి చప్పట్లు కొడతన్నట్టుగా ఉండేది నాకు.." క్షణం ఆగాడు.

"ఆర్టిస్టులు ఇబ్బంది పడతన్నారని తెల్సు గురు గారూ.. కానీ నాకు పడే చప్పట్లే నాకు ముఖ్యెం అనిపించేది.. ఇదంతా చెంద్ర ఒచ్చేవొరకూ... చెంద్ర.. చెంద్రేం చేసిందో చూసేరా గురు గారూ.." ఉన్నట్టుండి నా ఒళ్లో తలపెట్టుకుని భోరుమన్నాడు వాడు. వాడి తల నిమిరాను.. వెక్కిళ్ళు పెడుతున్నాడు స్వామి.

"ఒరే.. లేవరా.. లేచి మంచినీళ్ళు తాక్కొంచం.." కాస్త గట్టిగానే చెప్పాను. వాడు లేచి మొహం తుడుచుకున్నాడు.

"చెంద్రతో కలిసి స్టేజీమీద నాటకం ఆడుతుంటే, ఈ మనిషి మెచ్చితే చాలు కదా అనిపించేసింది గురు గారూ.. జనం చప్పట్లు లెక్కెయ్యడం మానేసేను.. చెంద్రేవంటదో అది చాలన్న లెక్కలోకొచ్చేసేను.."

"...ఇచిత్రం చెప్పనా గురు గారూ.. ఒకానొకప్పుడు జెనం నన్ను నాలుగు మాట్లంటే చచ్చిపోవాలనుకున్నాను.. చెంద్ర నేను కలిసుంటం చూసి నలుగురూ నాలుగు మాట్లంటే.. 'ఇంకో నాలుగనిపించాలీళ్ళచేత' అనిపించేది నాకు.." గ్లాసందుకుని ఓ గుటకేశాడు.

"చెంద్రేనాడూ పెళ్లి మాటెత్తలేదు.. అయితే ఏటి గురు గారూ.. మాకన్నా బాగా బతికిన మొగుడూ పెళ్ళాల్ని చూపించండి చూద్దాం.. ఈ దేవుడనే వోడున్నాడు చూడండి.. ఆణ్ణామీద పగబట్టేడు.. దాన్ని తీసుకుపోయేడు..." వెక్కిళ్ళు పెట్టేడు స్వామి.

నేను మాట్లాడాల్సిన సమయం వచ్చిందనిపించి గొంతు సవరించుకున్నాను. "దానికి అర్దాయుష్షు పెట్టేడ్రా భగవంతుడు.. మన చేతుల్లో ఏముంది చెప్పు? నీకు మేవందరం ఉన్నావని మర్చిపోకు. ఉజ్జోగానికి సెలవు పడేసి హైదరాబాద్ ఒచ్చెయ్.." ఒక్క క్షణం ఆగాను, వాడేమన్నా అంటాడేమో అని.

చంద్రమ్మ పోయినప్పటి నుంచీ వాడు మనుషుల్లో లేడు. పడవ బరువుగానే సాగుతోంది. ఒడ్డున వెలుగుతున్న వీధి దీపాలు దగ్గరగా కనిపిస్తున్నాయి.

"ఒక్కడివీ  ఇక్కడెందుకురా.. ఇక్కడున్నంత సేపూ చంద్రమ్మే గుర్తొస్తుంది నీకు.. మనాళ్ళు కొందరు టీవీ సీరియళ్ళలో ఉన్నారు.. నీలాంటి వాడు కావాల్రా వాళ్లకి. అంతా ఒకట్రెండు టేకుల్లో అయిపోవాలి. మన్నాటకాలు మనకెలాగా ఉంటాయ్.. అన్నీ చూసుకోడానికి మేవందరం ఉన్నాం.. నామాట విని నాతో వచ్చేయ్..." నా మాటలు పూర్తవుతూనే లేచి కూర్చున్నాడు వాడు.

"ఎక్కూ తాగేస్తన్నానని తెల్సు గురు గారూ.. ఇదే లాస్టు పెగ్గు.. కాదనకండి.." బతిమాలేడు.

ఇప్పుడు చెప్పినా వినడు వాడు. చెప్పాలని కూడా అనిపించలేదు నాకు. నా దృష్టంతా వాడు ఏం చెబుతాడా అన్నదానిమీదే ఉంది. వాడు వస్తానంటే నాకన్నా సంతోషించేవాడు లేడు. చంద్రమ్మ విషయం తెలియగానే 'స్వామినిక్కడికి తీసుకొచ్చేయండి' అని మావాళ్ళందరూ ముక్త కంఠంతో చెప్పి సాగనంపారు నన్ను. 

"జెనం చప్పట్ల కోసం నాటకాల్లోకొచ్చేను గురు గారూ.. తర్వాత, చెంద్ర కోసవే నాటకాలేసేను.. ఏ వేషం ఏసినా, ఏ డైలాగు చెప్పినా అదేవంటాదో అనే జ్యేస. చప్పట్లు, ప్రైజుల కన్నా దాని మాటే ముక్యెవైపోయింది.. అలాగలాటు పడిపోయేను.." చివరి గుక్క తాగాడు.

"మీరంటే నాకు చాలా గౌరం గురు గారూ.. మీ మాట తీసెయ్యాల్సి వొస్తాదని ఏనాడూ అనుకోలేదు.. కానీ.. కానీ.. చెంద్ర లేకపోయేక నేనింక మొకానికి రంగేసుకోలేను..నావల్ల కాదు..." అంటూనే పరుపు మీదకి ఒరిగిపోయాడు.

చిన్న కుదుపుతో ఒడ్డున ఆగింది పడవ. రేవులో ఉన్న గుంజకి పడవని కట్టేసి మా దగ్గరికి వచ్చాడు వీర్రాజు. సరంజామా అంతా సంచిలో వేసి అందించాను. అందుకోడానికి ముందు, రెండుచేతులూ పైకెత్తి స్వామికి దణ్ణం పెట్టాడు వీర్రాజు. వాడిని లేవదీశాడు నెమ్మదిగా.

"నా కదలాటిది బారతంలో ఉన్నాదా గురు గారూ?" కళ్ళు సగం తెరిచి అడిగాడు స్వామి.

మరో మబ్బులగుంపు చంద్రుణ్ణి  కప్పేసింది.

(అయిపోయింది)

25 కామెంట్‌లు:

 1. భారతం కాదుకానీ... ఒక కథ గుర్తొచ్చి మనసు మెలిపడింది ఈ కథ చదివాక. క్రౌంచ మిథునం..

  రిప్లయితొలగించు
 2. అద్బుతం అండి..
  మనుషుల మనస్తత్వాలు, ఎవరిని ఏవి నడిపిస్తాయో, ఎవరిని ఏవి ప్రభావితం చేస్తాయో చెప్పడం కష్టం..ఇలాంటి వాటిని పట్టి చూపించే రచనలు చాలా తక్కువ చదివాను.. భారతాన్ని మించింది జీవితం అని చెప్పకనే చెప్పారు.. ( లేక భారతం లో ఉండి నాకు తెలియని కధా ?)
  అందుకే చాలా గొప్పగా ఉంది మీ కధ :)

  రిప్లయితొలగించు
 3. అంత తాపీగా మొదలైన ప్రయాణాన్ని ఇల కుదిపేశారేంటండీ.. జీవన పయనాలిలాగే ఉంటాయంటారా.. హ్మ్.. కథ హృదయాన్ని మెలిపెట్టినా దాన్ని మీరు చెప్పిన విధానం, స్వామి యాస సూపరు ఎప్పట్లాగే.

  "క్రౌంచమిథునం" ఎంత బాగా చెప్పారండీ కొత్తావకాయగారూ.

  రిప్లయితొలగించు
 4. మనసు చెమ్మగిల్లింది. అంతా మీవల్లే

  రిప్లయితొలగించు
 5. అప్పుడే అయిపోయిందా?

  రిప్లయితొలగించు
 6. చక్కని పాత్రల చిత్రీకరణ.. మనసుని హత్తుకొనే కథావస్తువు.. ఒక nostalgic ఫీల్.. మీ కథల ట్రేడ్‌మార్కులండి!.. హృద్యమైన కథని అందించినందుకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 7. మీరు వ్రాసే కధల్లో మొదటి హీరోయిన్ కన్నా రెండో హీరోయిన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వ్రాస్తున్నారు.మీరు కూడా "మావిడాకులు" కి సపోర్ట్ చేస్తూ వ్రాస్తే ఎలాగండీ ? గోదారి నీళ్ళల్లోనే ఏదో తేడా ఉందనిపిస్తోంది.

  రిప్లయితొలగించు
 8. @niharika::గోదావరి నీళ్ళు వరద వచ్చినప్పుడు కొంచెం రంగు మారతాయగానీ రుచిలోగానీ ప్రభావంలో గానీ ఎప్పుడూ తేడా ఉండవు... మీ ఆలోచనా విధానం మాత్రం ఎప్పుడూ తేడాగానే ఉంతుంది...

  రిప్లయితొలగించు
 9. మీకు నా ఆలోచనా విధానం అప్పుడే అర్ధం అయిపోయిందా ? మొదటి భార్య వదిలేయడం,గయ్యాళితనం,అమాయకత్వం వంటి లక్షణాలు చూపిస్తూ రెండవ హీరోయిన్ మాత్రం దేవతగా చూపిస్తూ వరుసగా అవే కధనాలు వ్రాస్తుంటే చూసి(చదివి) కళ్ళు చెమ్మగిల్లించుకునే దొడ్డమనసు నాకు లేదు.ఇలా మగాళ్ళందరూ సెకండ్ హీరోయిన్ ల కోసమే ఎదురు చూస్తుంటారా ? తిన్నగా ద్వితీయ వివాహమే చేసుకోవచ్చు కదా? రాయడమంటే ఏమిటనుకున్నారు ? మనల్ని మనం నడిరోడ్డు మీద నిలబెట్టుకోవడమేనట !

  అన్నట్లు గోదావరి నీళ్ళు నాక్కూడా వంటబట్టేసాయి,సహవాసదోషమే మరి !

  రిప్లయితొలగించు
 10. @niharika :మీరు ఎక్కువగా వంటపట్టించుకోకండి .. కలుషితం అయ్యే అవకాశం ఉంది మా గోదావరి

  రిప్లయితొలగించు
 11. మీరు ఎక్కువగా వంటపట్టించుకోకండి .. కలుషితం అయ్యే అవకాశం ఉంది మా గోదావరి.......మీకు నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పాలి అంతే గానీ గోదావరి నీరు తాగేవారందరినీ హేళణ చేస్తున్నట్లు మాట్లాడకూడదు... పనికిమాలిన వెటకారం గొప్పవిషయమేం కాదు... మగవాళ్ళందరూ రెండవ హీరోఇన్ కోరుకుంటారోళేదో తెలుసుకోవడానికి బ్లాగెక్కి అరవనవసరం లెదు... మీచుట్టుపక్కల వారిని గమనిస్తే సరిపోతుంది...

  రిప్లయితొలగించు

 12. @కొత్తావకాయ: 'క్రౌంచ మిథునం' ..మీ వ్యాఖ్య చూశాక ఆలోచిస్తే పోలికలు కనిపించాయండీ.. ధన్యవాదాలు.
  @పల్లవి: శ్రద్ధగా చదివి, అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలండీ..
  @శ్రీ: మీ సపోర్ట్ కి చాలా చాలా ధన్యవాదాలండీ..

  రిప్లయితొలగించు
 13. @వేణూ శ్రీకాంత్: అవునండీ, జీవితమే.. ..ధన్యవాదాలు
  @శ్రీనివాస్ పప్పు: ఎంతమాట సారూ.. ..ధన్యవాదాలు
  @బోనగిరి: అవునండీ, ప్రతి కథకీ ఓ ముగింపు ఉంటుంది కదా.. ..ధన్యవాదాలు..

  రిప్లయితొలగించు
 14. @మురారి: వావ్.. నా ప్రయత్నం మీకు నచ్చిందంటే చాలా సంతోషంగా ఉందండీ.. ధన్యవాదాలు
  @నాగ శ్రీనివాస: వారికి నేను జవాబిస్తానండీ, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 15. @నీహారిక: కేవలం రెండు మూడు కథలు చదివి నా ఆలోచనా విధానాన్ని అర్ధం చేసేసుకున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలండీ. ఇక, మీకు ఏదన్నా 'తేడా' కనిపిస్తే అది నాది తప్ప, గోదారిది ఎంతమాత్రమూ కాదు. వరుసగా అవే కథనాలు అన్నారు, బావుంది. ఈ కథలో (మొదటి)భార్య గయ్యాళిలా అనిపించిందా మీకు? ఆమెకి ఇష్టంలేని పెళ్లి, అంతే. తను బాధ పడుతూ, అతన్ని బాధ పెడుతూ బతికేయాలంటారా అయితే? "తిన్నగా ద్వితీయ వివాహమే చేసుకోవచ్చు కదా?" ఈ ప్రశ్నకి జవాబుగా ఏం రాయాలో నాకు అర్ధం కావడం లేదు. మరోసారి ప్రశ్న చదువుకుంటే, అందులో అర్ధం లేదన్న విషయం మీకూ తెలుస్తుందనే అనుకుంటున్నాను. విమర్శించే హక్కు పాఠకులకి ఎప్పుడూ ఉంటుందండీ, కాకపొతే ఆ విమర్శకి వ్యక్తులనో, కులాలనో, ప్రాంతాలనో టార్గెట్ చేయకుండా కేవలం రాసిన విషయమ్మీదే దృష్టి పెడితే అందరికీ ఉపయోగం.. కాని పక్షంలో వాదోపవాదాలే మిగులుతాయి.. అంతే..

  రిప్లయితొలగించు
 16. వెన్నెల్లో గోదారి ప్రయాణం. లంక చేరేసరికి కడివెడు కన్నీళ్లు...ప్చ్ కొన్ని జీవితాలంతే..
  మీ ట్రేడ్ మార్క్ మరో కథ.

  రిప్లయితొలగించు

 17. నెమలి కన్ను మురళి వారు కూడా బుట్టలో పడే టట్టు ఉన్నారు :)

  ఏం చేద్దాం అంతా మంచు చుక్క కాల మహిమ :)

  జిలేబి

  రిప్లయితొలగించు
 18. @ మురళి గారు,
  నా మొదటి కమెంట్ మిమ్మల్ని ఉద్దేశ్యించి వ్రాసాను.తరువాత నాగశ్రీనివాస్ గారు వ్రాసారు ఆయనకు సమాధానంగా రెండవ కమెంట్ వ్రాసాను.మీరు బ్లాగుల్లో కాస్త మర్యాదగా వ్రాస్తారు కనుక మీరు కూడానా ? అని వ్రాసాను.మీ కధలన్నిటిలోనూ గోదారి,పడవ ఉన్నాయి.అందుకే గోదారి నీళ్ళల్లోనే తేడా ఉందేమో అనిపించింది.కధకి సంబందించిన విమర్శ అది.

  ఇకపోతే కధ వ్రాసినందుకు రచయతగా మీమ్మల్నే డైరెక్ట్ గా విమర్శ చేసే సౌలభ్యం మాకు మీరే ఇచ్చారు.మీకు ఇష్టం లేకపోయినా తప్పుగా మాట్లాడినా డెలిట్ చేసే సౌలభ్యం కూడా ఉంది.మీరు విమర్శని స్వీకరించను అని అంటే నేను ఏమీ చేయలేను.మీ కృష్ణవేణి లో మొదటి భార్య గయ్యాళి,తరువాత కధలో మైథిలి భర్త నిరాదరణ,ఈ కధలో మంగ ఇష్టం లేని పెళ్ళి.నేనింకా కధల్లోని విషయం జోలికి వెళ్ళలేదు. గతంలో తన్ హాయి జోలికెళితే పాఠకులు ఎలా రియాక్టయ్యారో నాకు గుర్తుంది కాబట్టి కధని నేను విమర్శించలేదు.ఆ కధల గురించి వ్రాస్తే మీరు కూడా తట్టుకోలేరని అర్ధం అయింది కాబట్టి నేను వ్యాఖ్యానించదలుచుకోలేదు. మీరు వరుసగా ఇవే కధలు వ్రాస్తుండటంతో చెప్పాలనిపించింది.ఇకమీదట విమర్శలు ప్రచురించకండి.

  చివరిగా ఒక్కమాట మీరన్నది నిజం బయటిప్రపంచంలో మీ కధల్లాంటి సన్నివేశాలు నాకు తారసపడలేదు.నా బంధువుల్లో గానీ స్నేహితుల్లో గానీ ఇల్లాంటి వారు తారసపడనే లేదు.ఈ బ్లాగుల్లోనే ఇటువంటి విషయాలు చదువుతున్నాను.రెండవ వివాహాలూ,విడాకులూ నా చుట్టుప్రక్కల ఎక్కడా చూడలేదు.ఒక్కసారి మాత్రం ఒకరు తప్పు చేస్తే ఆయనికి ద్వితీయ వివాహం చేసేసారు.మాకు స్వేచ్చతోపాటు కట్టుబాటు కూడా ఉంది.

  రిప్లయితొలగించు
 19. @జ్యోతిర్మయి: 'ట్రేడ్ మార్క్' వేసేశారా అయితే :)) ధన్యవాదాలండీ..
  @జిలేబి: అంతే అంటారా? ..ధన్యవాదాలు..

  రిప్లయితొలగించు
 20. @నీహారిక: "రాయడమంటే ఏమిటనుకున్నారు? మనల్ని మనం నడిరోడ్డు మీద నిలబెట్టుకోడమేనట" అన్నారు కదండీ మీరు. అలా 'రోడ్డు మీద నిలబడ్డ' నా ఆలోచనలని అర్ధం చేసుకున్నారనిపించింది. "కథ రాసినందుకు డైరెక్ట్ గా మిమ్మల్నే విమర్శ చేసే సౌలభ్యం" ..చిన్న తేడా అండీ.. విమర్శించాల్సింది రచనని, రచయితని కాదు. 'కృష్ణవేణి' 'వర్ణచిత్రం' 'తెర వెనుక' మూడింటిలో కామన్ పాయింట్ ఒంటరి మగాడికి మరో స్త్రీ దొరకడం. మీ అభ్యంతరం ఇదే అనిపిస్తోంది. మూడింటికీ పోలిక అయితే లేదు కదండీ. కట్టుబాటుని పాటించడం చాలా బావుంటుందండీ. ఎవరిచేతా వేలెత్తి చూపించుకోవలసిన అవసరం ఉండదు. కాకపొతే, కట్టుబాటా? జీవితమా? అన్న ప్రశ్న వచ్చి ఒక్కటే ఎంచుకోవలసి వచ్చినప్పుడు కట్టుబాటుకి కట్టుబడ్డ వాళ్ళూ, జీవితమే ముఖ్యమనుకున్న వాళ్ళూ రెండురకాల మనుషులూ ఉన్నారండీ నాచుట్టూ. 'కట్టుబాటుతో పాటు స్వేచ్చ కూడా ఉండడం' ..వినడానికి చాలా బావుందండీ. ఆచరణలో ఎలా సాధ్యమే ఊహకి అందడం లేదు. మరీ ముఖ్యంగా, కట్టుబాటుకీ, స్వేచ్చకీ క్లాష్ వచ్చినప్పుడు.. ఇకపోతే, ప్రపంచం చాలా పెద్దది కదండీ, అన్నీ మనకి నచ్చినట్టే జరగవు మరి. మరోమారు ధన్యవాదాలు మీకు..

  రిప్లయితొలగించు
 21. రచనని విమర్శించాలా రచయతని విమర్శించాలా అన్నది కూడా పెద్ద దుమారం రేపింది కదా ? వాల్మీకి భార్య వల్ల రామాయణం వ్రాసాడా? రామాయణం నిజంగా జరిగిందా ? అన్నది తేలలేదు. గొడవ ఎక్కడొస్తుందంటే మంచి భార్య ఉన్న రచయత ఆడవాళ్ళ గురించి చెడ్డగా వ్రాస్తున్నారు.చెడ్డ భార్య ఉన్న రచయత ఆడవాళ్ళ గురించి మంచిగా వ్రాస్తున్నారు. రచనని రచనగా చూడడం సాధ్యపడదు.వాటి ప్రభావం ప్రజలపై పడుతుంది.భగవద్గీత ఎంతటి ప్రభావం చూపగలదో అర్ధం అవుతుంది కదా ? ఆడవాళ్ళు కూడా అలాగే వ్రాస్తున్నారు. నేననేది ఏమిటంటే రాముడు మంచి బాలుడు అని చెప్పడానికి రావణుడు చెడ్డవాడు అని చూపించనవసరం లేదు. ఒక కమెంట్ తర్వాత ఇంకొక కమెంట్ ఎలా వ్రాసుకుంటూ పోతున్నామో అలాగే ఒక సంఘటన తర్వాత ఒక సంఘటన జరిగిపోతుంది అని చూపాలి.ఇపుడు వ్రాసిన ఈ కమెంట్ ప్రభావం మరొకసారి ఉండకపోవచ్చు.ఒక సంఘటన తర్వాత నేనూ,మీరూ జాగ్రత్త పడినట్లే జీవితం లో కూడా జాగ్రత్త పడవచ్చు కదా ? మనిషిలో మార్పే రాదు అనుకోవడం కరెక్ట్ కాదు అని నా ఉద్దేశ్యం.

  రిప్లయితొలగించు
 22. మురళి గారు,

  మీరు మిస్సయినట్లు ఉన్నారు.ఈ కధ నుండే ఆ వ్యాఖ్యలు తీసుకున్నాను.మిమ్మల్ని ఉద్దేశ్యించి కాదు.

  http://magazine.saarangabooks.com/2015/06/11/%e0%b0%b8%e0%b1%8b%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%b8%e0%b0%b0%e0%b1%8d%e0%b0%95%e0%b0%b8%e0%b1%8d/#comment-16996

  రిప్లయితొలగించు
 23. ఎప్పటిలాగే మనసును దోచుకునే కధనం, మాండలీకం :)

  రిప్లయితొలగించు
 24. @పరిమళం: చిన్నప్పుడంతా విన్న మండలీకం కదండీ మరి :) ..ధన్యవాదాలు..

  రిప్లయితొలగించు