బుధవారం, నవంబర్ 26, 2014

ధన్వంతరి వారసులు

వైద్యుడి దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరం. మహాభాగ్యమైన ఆరోగ్యం ఇబ్బంది పెట్టినప్పుడే కదా డాక్టరు గుమ్మం తొక్కాల్సి వచ్చేది. ఊరికే కూర్చుని తోచీ తోచకా లెక్కలేస్తే ఇప్పటివరకూ నాకోసం అయితేనేం, మావాళ్ళ కోసమయితేనేం సుమారు ఓ యాభై మంది డాక్టర్లని చూసినట్టుగా లెక్క తేలింది. వీళ్ళలో వైద్యుల మాట పక్కనపెట్టి, కనీసం మనుషులుగా ప్రవర్తించిన వాళ్ళు నలుగురైదుగురు కూడా కనిపించలేదు. ఇది అత్యంత దురదృష్టం.

నేను చూసిన డాక్టర్లందరూ కూడా ప్రైవేటు నర్సింగు హోములు, కార్పొరేట్ హాస్పిటళ్ళ వాళ్ళే. ఎమర్జెన్సీ మినహాయించి మిగిలిన అన్ని సందర్భాల్లోనూ ముందుగా అపాయింట్మెంట్ తీసుకునే వెళ్ళడం జరిగింది. కనీసం ఒక్కసారి కూడా ఆస్పత్రి వారిచ్చిన టైముకి డాక్టరు మమ్మల్ని చూడడం కాదు కదా, కనీసం హాస్పిటల్ కి కూడా రాలేదు. గంట నుంచి మూడుగంటల పాటు నిరీక్షణ. ఏ ఒక్క ఆస్పత్రీ, డాక్టరూ ఇందుకు మినహాయింపు కాదు. రోగుల టైం అంటే డాక్టర్లకి ఎంత చులకన?!!

కన్సల్టెన్సీ రూములోకి వెడుతూనే డాక్టర్ని పలకరించడం ఒక అలవాటు. తిరిగి 'హలో' అన్నవాళ్ళని వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు. తుమ్మల్లో  పొద్దుగూకినట్టుగా ముఖం పెట్టుకుని కూర్చోడం, పరమ సీరియస్ గా వాచీనో, మొబైల్ ఫోనో చూసుకోడం లేదా నర్సు మీద కేకలేయడం.. ఇది సాధారణ దృశ్యం. రోగి తన సమస్యలు చెప్పుకునే కనీస వాతావరణం కల్పించాలి అన్న ఆలోచన వీళ్ళకి ఎందుకు ఉండదో అనిపిస్తూ ఉంటుంది. ఇక మాట్లాడడం కూడా ఏ గోడమీద కేలండర్నో చూస్తూ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. 'ఈ డాక్టర్ నా ముఖం వైపు ఎందుకు చూడడంలేదు? నాకు కళ్ళకలక గానీ వచ్చిందా?' ఈ సందేహం నాకెన్నిసార్లు కలిగిందో లెక్కలేదు.

తొంభై శాతం మంది డాక్టర్లు పేషెంట్ ని ఎదురుగా పెట్టుకుని నర్సుతోనో, ఫోన్ లోనో, లేదా అప్పటికే టేబిల్ కి మరోవైపు కూర్చున్న తన ఫ్రెండ్ తోనో కబుర్లు చెబుతూ ఉంటారు. డాక్టర్ చెప్పింది పేషెంట్ వినాలి తప్ప ఏమీ అడక్కూడదు. పొరపాటున ఒకట్రెండు కన్నా ఎక్కువ సందేహాలు అడిగారో, పేషెంట్ల పని అయిపోయిందే.. "ఎక్కడినుంచి వస్తారో మన ప్రాణాలు తీయడానికి" అని వినీవినబడకుండా గొణుగుతారు జనాంతికంగా. ఇంజెక్షన్ అవసర పడితే, చేయాల్సిన బాధ్యత నర్సుదే. ఒకవేళ డాక్టరే చేస్తే మాత్రం, ఎటో చూస్తూ సూది జబ్బలో గుచ్చుతారు చాలా కాన్ఫిడెంట్ గా.

పేషెంట్ అనారోగ్యం మీద జోకులు వేసే డాక్టర్లూ ఉన్నారు. వీళ్ళని కనీసం మనుషులు అనుకోలేం. ఇక డైట్ గురించి డాక్టర్లు వేసే జోకులకి సిగ్గుతో చచ్చిపోవాలి. 'మనం మరీ తిండి తినడం కోసమే బతుకుతున్నామా?' అన్న అనుమానం వచ్చేస్తుంది. దానితోపాటే 'తినకపోతే చచ్చిపోతామా' అన్న వైరాగ్యం కూడా. డాక్టర్ ఏమన్నా టెస్ట్ లు రాస్తే పొరపాటున కూడా 'ఎందుకు?' అని అడగకూడదు. వాళ్ళ మనోభావాలు తీవ్రంగా గాయపడతాయి. 'ఫలానా మందు నాకు సరిపడదు, వేరేది రాయండి?' అన్నా సమస్యే.. 'డాక్టర్ నువ్వా? నేనా?' వరకూ వెళ్ళిపోతుంది విషయం. 'కానీ మందు మింగాల్సింది నేను కదా' అన్నామో, నర్సుకి పాపం తిట్లే తిట్లు.లోకంలో మంచి డాక్టర్లు లేరని కాదు. కానీ, మంచితనంలాగే వారి శాతం కూడా బహు స్వల్పం. ఈ కారణంగానే కావొచ్చు, మంచివారు కాని డాక్టర్ల పాల పడాల్సి వస్తోంది. సాధ్యమైనంత వరకూ డాక్టర్ దగ్గరికి వెళ్ళే పరిస్థితి రాకుండా చూసుకోవడం ఉత్తమమే కానీ, అన్నీ మన చేతిలో ఉండవు కదా. డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావు రాసిన 'హౌస్ సర్జన్' నవలలో మంచి డాక్టర్ల గురించి చదివినప్పుడు ఆశ్చర్యంతో పాటు ఆనందమూ కలిగింది. ఆయన తప్పు లేకుండా, మంచివారు కాని డాక్టర్ల గురించి కూడా రాశారు కొమ్మూరి ఆ నవలలో. వ్యక్తిగత సమస్యలో మరొకటో డాక్టర్లని ఇబ్బంది పెడుతూ ఉండి ఉండొచ్చు.. కాదనలేం. కానీ, ఆ చికాకుల్ని పేషెంట్ల మీద చూపించడం ఎంతవరకూ సబబు?

పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం అనుకుంటా.. వైద్యసేవలని వినియోగదారుల చట్టం పరిధిలోకి తేవాలని ప్రభుత్వం ఓ ప్రతిపాదన చేసింది. ఆ ప్రతిపాదన గురించి విన్న వెంటనే చాలా చాలా సంతోషం కలిగింది నాకు. కానీ, ఏం లాభం? డాక్టర్లందరూ సమ్మెలూ అవీ చేసి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఆ ప్రతిపాదనని విజయవంతంగా బుట్ట దాఖలు చేయించారు. ఆమధ్య ఓ సినిమాలో కార్పొరేట్ ఆస్పత్రి వైద్యులు శవానికి వైద్యం చేసి బిల్లు వేసినట్టుగా చూపిస్తే చాలామంది డాక్టర్ల మనోభావాలు దెబ్బతిన్నాయి. కొందరైతే ఆ సినిమాని నిషేధించాలని కూడా అన్నారు అప్పట్లో. కానీ, జనాభిప్రాయం మాత్రం సినిమాలో చూపించిన దాంట్లో అతి ఎంతమాత్రమూ లేదనీ, జరుగుతున్నదే చూపించారనీను.

ఏటా నవంబర్-డిసెంబర్ నెలలు వచ్చేసరికి 'జూడాల సమ్మె' తంతు మొదలవుతుంది. రకరకాల డిమాండ్లతో సమ్మె చేస్తూ ఉంటారు ఈ జూనియర్ వైద్యులు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక ధర్మాసుపత్రుల్లో రోగులని ఎలా చూస్తారో ఊహించడం కష్టం కాదు. రోగుల సంఖ్యకీ, డాక్టర్ల సంఖ్యకీ ఎప్పుడూ సమన్వయం కుదరని ధర్మాసుపత్రుల మీద ఈ జూడాల సమ్మె ప్రభావం అంతా, ఇంతా కాదు. ప్రభుత్వం ఒక్కో జుడా మీద ప్రజల సొమ్ము లక్షలకి లక్షలు ఖర్చు పెడుతున్నప్పుడు కొన్ని షరతులు విధించడంలో తప్పు కనిపించదు.

చదువు పూర్తవ్వగానే గ్రామీణ ప్రాంతాల్లో తప్పనిసరిగా పనిచేయాలి అన్న నిబంధన వాటిలో ఒకటి. కోర్సులో చేరినప్పుడు ఏమాత్రం అభ్యంతరంగా అనిపించని ఈ నిబంధన, చదువు పూర్తయ్యే సమయానికి వాళ్ళ 'హక్కులకి భంగం' గా కనిపిస్తుంది జూడా లకి. సమయం చూసుకుని సమ్మెకి దిగడం, నెలో, నెలన్నరో చదువునీ, పేషెంట్లనీ వదిలేసి రోడ్డు మీద ప్రదర్శనలు. ఒక పేషెంట్ గా డాక్టర్లతో  నాకున్న అనుభవాలవల్లో ఏమో తెలీదు కానీ, ఈ జూడాల సమ్మెని నేనేమాత్రం సమర్ధించలేను. వాళ్ళు అటు ప్రభుత్వాన్నీ, ఇటు పేద రోగులనీ కూడా 'గ్రాంటెడ్' గా తీసుకుంటున్నారని నా బలమైన నమ్మకం.

7 వ్యాఖ్యలు:

 1. This daridram in only in AP. Not in Chennai or other cities. Chennai and Bombay doctors treat people very well (personal experience). Only in AP this stupidity crops up VERY regularly. Reason - "AhamkAraM" and "Greed"

  ప్రత్యుత్తరంతొలగించు

 2. నేను సీనియర్ డాక్టర్ని.కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చాక వైద్యులకూ రోగులకు ఉండవలసిన సంబంధం పాడయింది,కాని చిన్నవూళ్ళలోను,స్వతంత్రంగా ప్రాక్టీసుచేస్తున్న డాక్టర్ల విషయం మీరనుకొన్నట్లు అధ్వాన్నంగా లేదని చెప్పదలుచుకొన్నాను.నేను వ్రాసిన నవల ' డాక్టర్ సుందరరావు ' చదవండి.ఇక సమయపాలన (punctuality) మన భారతీయులకు గిట్టని విషయం. ఇంగ్లండ్ ,అమెరికాల్లో అపాయింట్ మెంట్ని సీరియస్ గా తీసుకొంటారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. సరిగ్గా చెప్పారు. నూటికి తొంభైమంది అలానే ఉంటున్నారు. డాక్టర్ దగ్గరకు వెళ్ళేకంటే అనారోగ్యాన్ని భరించటమే నయమనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో డాక్టర్ దగ్గరకు వెళ్ళక తప్పదు. అప్పుడు మన ఖర్మ కాలి మనకు అనారోగ్యం వచ్చిందని ఎన్నిసార్లు అనుకుంటామో!

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ధన్వంతరిని, అశ్వినీ దేవతల్ని, శుశ్రుతుడినీ అవమానం చెయ్యటమెందుకు గాని, ఈనాడు వైద్యవృత్తిలో ఉన్నవారు చాలా వరకు ఇలాగే ప్రవర్తిస్తున్నారు. డాక్టరు దగ్గర్నుంచి నర్సు దగ్గర్నుంచి ప్రైవేట్ క్లినిక్ లో అయితే డాక్టర్ని కలవడానికి వచ్చిన రోగులకి టోకెన్లు ఇచ్చేవాడి వరకూ పొగరు, నిర్లక్ష్యం పేరుకుపోయినట్లు కనిపిస్తాయి. ఇక కార్పొరేట్ హాస్పిటల్ కి వెడితే వచ్చినవాడిని వీలయినంతవరకు ఆపరేషన్ టేబుల్ దాకా తీసుకువెళ్ళే ప్రయత్నంలో ఆ డాక్టర్ / సర్జన్ మహా తియ్యగా మర్యాదగా మాట్లాడతాడు. డబ్బులు వాళ్ళ జేబులో పడి ఆపరేషన్ పూర్తి అయిన తర్వాత అదే డాక్టర్ / సర్జన్ చూపించే నిర్లక్ష్యం మాట్లాడే పద్ధతిలో మార్పు తేలిగ్గా తెలిసిపోతుంది. మరి రోగులతో ఎల్లా వ్యవహరించాలో వీళ్ళకి మెడికల్ కాలేజ్ లో బోధించినది అంత త్వరగా మర్చిపోతారా అనిపిస్తుంది.

  జూడాల సంగతి చెప్పక్కర్లేదులెండి. మీరన్నట్లు వీళ్ళ వార్షిక సమ్మెలు, మధ్య మధ్యలో చేసే మెరుపు సమ్మెలు అందరినీ "గ్రాంటెడ్" గా తీసుకోవటమే కాదు, "హోల్డింగ్ ది గవర్నమెంట్ అండ్ పబ్లిక్ టు రాన్సం" అనవచ్చు. అసలు వీళ్ళు వేరే పేరేమన్నా పెట్టుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. జూడాలు అనే పేరు బైబిల్లో ఓ వ్యక్తి పేరుకు దగ్గరగా ఉన్నట్లు ధ్వనిస్తుంది.

  మీరేమనుకోకపోతే ఓ సలహా. వ్రాయటంలో టాలెంట్ ఉన్న మీలాంటి వారు ఇటువంటి సమకాలీన సమస్యల గురించి బ్లాగులోనే కాక పత్రికల్లో కూడా వ్యాసంగా వ్రాస్తుంటే ఇంకా ఎక్కువమంది జనాలకి చేరుతుందని నా అభిప్రాయం.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మునుపటి రోజులలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఉండేది.. అప్పుడు డాక్టర్-పేషెంట్ మధ్య ఒక మానవ సంబంధం ఉండేది.. చాలామంది వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ ను తమ ఫ్రెండ్ సర్కిల్లో ఒకరిగా చూసేవారు. కానీ ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ దెబ్బకు ఆ వ్యవస్థ పూర్తిగా దెబ్బ తినింది. ఇప్పుడు పేషెంట్ అంటే డబ్బు తెచ్చిపెట్టే ఒక మార్గం అంతే!

  ఈ డాక్టర్లు ఇలా ఉన్నారు కాబట్టి జనాలు చిట్కా వైద్యుల దగ్గరికి పోతున్నారు, టివీలో వచ్చే సలహాలు పాటిస్తున్నారు.. మొత్తంగా తెలిసి తెలియక ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. @DG: డాక్టర్ల సంఖ్య పెరిగితేనన్నా ఈ పరిస్థితిలో మార్పు వస్తుందన్న చిన్న ఆశ ఉందండీ.. డిమాండ్-సప్లై సూత్రం ఉంది కదా మనకి.. ..ధన్యవాదాలు.
  @కమనీయం: నేను సీనియర్ పేషెంట్ నండీ :)) దురదృష్టవశాత్తూ నా అనుభవాలు చిన్న ఊళ్ళో ఆరెంపీ డాక్టర్ మొదలు, పెద్ద నగరాల కార్పోరేట్ హాస్పిటళ్ళ వరకూ దాదాపు ఒకేలా ఉన్నాయి. మీ నవల చదవడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.
  @vallisarvani: నిజమండీ!! పెద్దగా చదువుకోని, పల్లెటూళ్ళ నుంచి వచ్చే పేషెంట్లని ఇంకెలా చూస్తారో ఈ డాక్టర్లు అనిపించేస్తూ ఉంటుంది.. ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. @విన్నకోట నరసింహారావు: జుడాల పేరు గురించి నాకూ ఇంచుమించు అలాగే అనిపిస్తుందండీ.. ఇక రాయడం గురించి.. బ్లాగులో కాబట్టి నాకు నచ్చినప్పుడు, నచ్చిన విషయంమీద నచ్చినట్టుగా రాసుకోగలుగుతున్నాను.. మీ అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలు!
  @కార్తిక్: చూస్తుండగా కళ్ళముందే అంతరించిపోతున్న వాటిలో 'ఫ్యామిలీ డాక్టర్' కాన్సెప్ట్ ఒకటండీ.. ఇది లేకపోవడం వల్ల జరుగుతున్న హాని తక్కువది కాదు.. ఇక టీవీ వైద్యం.. అదో ప్రత్యేకమైన విషయం.. తలనొప్పి వస్తే అమృతాంజనం రాసుకున్నంత సులువుగా టీవీ మందులు ఫాలో అయిపోతున్న వాళ్ళు నాకూ తెలుసండీ.. ఎవర్నీ ఏమీ అనలేం :( ...ధన్యవాదాలు

  ప్రత్యుత్తరంతొలగించు