శుక్రవారం, జనవరి 31, 2014

శ్రీరస్తు శుభమస్తు

అనగనగా ఓ పచ్చటి పల్లెటూరు. పేరు రామాపురం. ఆ ఊళ్ళో అందమైన, చదువుకున్న, బుద్దిమంతులైన ఇద్దరు పెళ్ళికొడుకులు. అన్నదమ్ముల్లాంటి వాళ్ళు. ఓ కుర్రాడు డబ్బున్నవాళ్ళ గారాల పుత్రుడైతే, రెండో వాడిది మధ్యతరగతి మందహాసం.'అన్నీ ఉన్నా..' సామెతలాగా ఓ కుర్రాడికి పెళ్లి సంబంధాలే రావు.. రెండో వాడికి పెళ్లి చేసుకోవాలన్న ధ్యాసే లేదు.

మళ్ళీ అనగనగా అంతే అందమైన మరో పల్లెటూరు. పేరు సీతాపురం. ఇద్దరు అందమైన, చదువుకున్న అమ్మాయిలు. సయానా కాకపోయినా అక్కచెల్లెళ్ళు. ఓ పిల్లకి బొత్తిగా పెళ్లి ధ్యాసే లేదు. రెండో పిల్లకి వచ్చిన సంబంధం ఏదీ నచ్చడం లేదు. ఈ రెండు జంటలూ ఎలా ఒకటయ్యాయి అన్నదే పొత్తూరి విజయలక్ష్మి రాసిన 'శ్రీరస్తు శుభమస్తు' నవల.

జంధ్యాల వడ్డించిన నవ్వుల విందు 'శ్రీవారికి ప్రేమలేఖ' సినిమాకి ఆధారమైన 'ప్రేమలేఖ' నవల రచించి, తర్వాతి కాలంలో మరెన్నో కథల్ని తన ఖాతాలో వేసుకున్న రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి పేరు వినగానే మొదట గుర్తొచ్చేది హాస్యమే. సున్నితమైన, గిలిగింతలు పెట్టే హాస్యాన్ని పండించడంలో చేయితిరిగిన రచయిత్రి, ఈ నవల్లోనూ నిరాశ పరచలేదు. కళ్ళనీళ్ళు తిరిగేట్టుగా నవ్వించే సన్నివేశాలు నాలుగైదు ఉండగా, మిగిలిన చోట్ల హాసానికీ, దరహాసానికీ లోటుండదు.


రామాపురం జమీందారు రాజశేఖరం గారబ్బాయి చంద్రశేఖరం బొత్తిగా తల్లిచాటు బిడ్డ. లేకలేక కలిగిన కొడుకంటే పంచ ప్రాణాలు కృష్ణవేణి గారికి. కొడుకుని బళ్ళో వెయ్యొద్దనీ, మేష్టర్లనే ఇంటికి రప్పించమనీ భర్తతో దెబ్బలాడి, అలా వీలు కాకపోవడంతో తనే స్వయంగా రోజూ కొడుకుని స్కూల్లో దింపి అతగాడు తిరిగి వచ్చేలోగా చుట్టూ ఉన్న గుళ్ళూ గోపురాలూ దర్శించేవారు. చంద్రం స్కూలు చదువు అయ్యేసరికి, ఆ ప్రాంతంలో ఉన్న దేవుళ్ళందరికీ నగానట్రా అమిరాయి.

అంత గారాబంగా పెరిగిన చంద్రాన్ని పెళ్లి చేసుకోడానికి ఏ ఆడపిల్లా బొత్తిగా సిద్ధపడడం లేదు. కొడుకు ఎక్కడికో దూరం వెళ్లి ఉద్యోగం చేయడం కృష్ణవేణి గారికి ఇష్టం లేదు మరి. రాజశేఖరం గారి స్నేహితుడు నరసింహం గారబ్బాయి రవి, చంద్రం ఈడు వాడే. ఉద్యోగం చేయడం బొత్తిగా ఇష్టం లేదు. సొంతంగా ఏదన్నా కనిపెట్టి ఒకేసారి పేరు, డబ్బు బాగా సంపాదించాలని కోరిక అతనికి.

ఇక సీతాపురం అక్క చెల్లెళ్ళు సరోజ, దుర్గలది వేరే కథ. సరోజకి ప్రతిరోజూ కొత్తగా ఉండాలి. ప్రతిపనిలోనూ వైవిధ్యం ఉండాలి. దుర్గకి తన కాళ్ళ మీద తను నిలబడాలి అన్నదే ఆశయం. రామాపురం కుర్రాళ్ళు ఇద్దరూ సీతాపురం చేరడంతో మొదలయ్యే అసలు కథ అనేకానేక సినిమాటిక్ మలుపులతో సాగి, హాయిగా ముగుస్తుంది. 'గుండమ్మ కథ' 'సరదాగా కాసేపు' లాంటి సినిమాలు గుర్తొస్తూనే ఉంటాయి, నవల చదువుతున్నంత సేపూ.

ఒక్కమాటలో చెప్పాలంటే, లాజిక్ ని పక్కన పెట్టేసి చదివితే బహుచక్కని స్ట్రెస్ బస్టర్. జంధ్యాల సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుంది, పేజీలు తిరుగుతూ ఉంటే. ('శ్రీరస్తు శుభమస్తు,' సాహితి ప్రచురణ, పేజీలు 240, వెల రూ. 60, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

5 కామెంట్‌లు:

  1. @ఎగిసే అలలు: ధన్యవాదాలండీ
    @పచ్చల లక్ష్మీ నరేష్: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  2. Thanks andi...meevalla inko mithrudu parichayam ayyaru..ade a good book is mans best friend annaru kadaa

    రిప్లయితొలగించండి

  3. @శ్రీనిధి: ధన్యవాదాలండీ.. మీ బ్లాగు బాగుంది.. కానీ, కామెంట్ రాయడానికి ఫేస్ బుక్ అకౌంట్ అడుగుతోంది!!

    రిప్లయితొలగించండి