ఆదివారం, డిసెంబర్ 08, 2013

ధర్మవరపు ...

పది పన్నెండేళ్ళ క్రితం సంగతి.. అప్పటికి వరకూ ధర్మవరపు సుబ్రహ్మణ్యం అంటే దూరదర్శన్ లో చూసిన 'ఆనందో బ్రహ్మ,' సినిమాల్లో చిన్న చిన్న వేషాలు.. తేజ తీసిన 'నువ్వు-నేను' సినిమా హిట్ అవ్వడంతో అందులో లెక్చరర్ వేషం వేసిన ధర్మవరపు హాస్యనటుడిగా బాగా బిజీగా మారిన సమయం అది. యూత్ సినిమాల్లో లెక్చరర్లని మరీ బఫూన్లు గా చూపిస్తున్నారన్న విమర్శ మొదలైంది కూడా అప్పుడే.. సరిగ్గా ఆసమయంలో ధర్మవరపు తో ప్రత్యక్ష పరిచయం. మొదటి సమావేశంలోనే ఓ ఆత్మీయ వాతావరణం ఏర్పడింది అనడం కన్నా, ధర్మవరపు ఏర్పరిచారు అనడం సబబు.

కొన్ని నెలల పాటు మరీ తరచుగా కాకపోయినా అప్పుడప్పుడూ కలిసే వాళ్ళం. సినిమా విషయాలు అని మాత్రమే కాదు, సమస్త విషయాలూ కబుర్లలో అలవోకగా దొర్లిపోయేవి. ఎంత అలసటగా ఉన్నా సరే, కబుర్లు మొదలు పెట్టారంటే నవ్వులు పూసేవి. ప్రాసకోసం పాకులాట అవసరం లేదు, మామూలు మాటనే కాస్త విరిచి పలికితే చాలు అప్రయత్నంగానే నవ్వొచ్చేస్తుంది, తెరమీదే కాదు, తెరవెనుక కూదా ధర్మవరపు తీరు అదే. పేరు, అవకాశాలు ఒకేసారి చుట్టుముట్టినా ఆ ప్రభావం మనిషి మీద పడినట్టుగా అనిపించలేదు.

ఒంగోలు అన్నా, శర్మ కాలేజీ అన్నా, మిత్రుడు టి. కృష్ణ అన్నా తగని అభిమానం ధర్మవరపుకి. ఈ మూడు విషయాలూ తప్పకుండా తలపుకి వచ్చేవి, ఎంత చిన్న సమావేశం అయినా. వామపక్ష భావజాలం అంటే గౌరవం తనకి. ప్రజా నాట్యమండలి తో అనుబంధం ఉంది కూడా. పాత సినిమాలు విపరీతంగా చూసే అలవాటు, ఎవరినైనా ఇట్టే అనుకరించేసే టాలెంటు వృత్తిలో తనకి ఎంతగానో ఉపయోగ పడ్డాయి. రోజులు గడుస్తూ ఉండగానే, ఇక ధర్మవరపు ని రెగ్యులర్ గా కలవాల్సిన అవసరం లేని రోజు ఒకటి వచ్చేసింది. ఆ విషయం చెప్పగానే తన స్పందన "వచ్చే ఆదివారం మనం కలిసి భోజనం చేస్తున్నాం... మా ఇంట్లో."


చాలా పనులు, షూటింగులు.. తనకి గుర్తుంటుందా, వీలవుతుందా అనుకున్నా.. ఆ విషయం మర్చిపోయాను.. శనివారం ఫోన్ వచ్చింది.. "వచ్చేస్తారా? వచ్చి పికప్ చేసుకోనా?" ఆశ్చర్యం అనిపించింది, "డ్రైవర్ ని పంపనా?" అనకుండా "వచ్చి పికప్ చేసుకోనా?" అన్నందుకు.. నేనే వస్తానని చెప్పి అడ్రస్ తీసుకున్నాను. ఓ వెలుగు వెలుగుతున్న హాస్యనటుడి ఇల్లు అంటే ఎంత హంగామా ఉంటుందని ఊహించుకోవచ్చో అంతా ఊహించుకుంటూ ఇంట్లోకి అడుగు పెట్టాను. ఉహు, మామూలు మధ్యతరగతి ఇల్లు.. లుంగీ, లాల్చీతో సోఫాలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్న ధర్మవరపు. పెద్దబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు.. చిన్నవాడు స్కూలింగ్.

"సభకి నమస్కారం" అన్నాను, 'తోకలేనిపిట్ట' సినిమాలో జయలలిత ని అనుకరిస్తూ. ధర్మవరపు దర్శకత్వం, సంగీతం అందించిన సినిమా అది. పెద్దగా ఆడలేదు. కాసేపు సరదా కబుర్లు అయ్యాయి. చిన్నబ్బాయి తో కబుర్లు చెబుదామంటే, ఆ పిల్లవాడు నోరు విప్పడంలేదు. "పలుకే బంగారమా?" అన్నానో లేదో, "అబ్బే అదేమీ లేదు.. ఇందాకే వాడికి పన్నూడింది.. ఆ అవమాన భారంతో కుంగిపోతున్నాడు" అన్నారు ధర్మవరపు. హాల్లో ఎక్కడా షీల్డులు, సినిమా వాళ్ళతో ఫోటోలు కనిపించలేదు. కబుర్లు అవుతూ ఉండగానే భోజనానికి పిలుపు వచ్చింది.ఆవిడే స్వయంగా వడ్డించారు.. నేను ఆశ్చర్యంగా చూస్తుండగా "వంటకూడా ఆవిడే.. మా ఇంట్లో వంటవాళ్లు, పనివాళ్ళు ఉండరు" అన్నారు ధర్మవరపు.

ఆవిడ మితభాషి.. కానీ, తినేవాళ్ల ఆకలి గుర్తెరిగి వడ్డించే (నేను చూసిన) అతి తక్కువ మంది ఇల్లాళ్ళ లో ఒకరు. భోజనం అవుతూ ఉండగానే నేను ఏమాత్రం ఊహించని ప్రశ్న వచ్చింది ధర్మవరపు నుంచి. "ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన వేషం ఏది?" జవాబు చెప్పడానికి ఆలోచించలేదు ఏమాత్రం. "స్వాతికిరణం లో మంజునాథ్ తండ్రి పాత్ర.. హోటల్ నడుపుకునే బాబాయ్.." తన మోహంలో కనిపించిన వెలుగు ఇప్పటికీ గుర్తుంది నాకు. "మహానుభావుడు విశ్వనాధ్ గారు.. ఆయనే చేయించుకున్నారు.. ఏమీ అనుకోనంటే ఓ మాట.. మీతో కలిసి భోజనం చేయడం ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంది నాకు.." నేనేమీ మాట్లాడలేదు.

పెద్దబ్బాయి నాతోపాటు బయటికి వచ్చాడు. నవతరం వారసులు రాజ్యం ఏలడం మొదలుపెట్టిన కాలం కదా.. సహజంగానే "మీరెప్పుడు హీరో అవుతున్నారు?" అని అడిగాను నవ్వుతూ.. ఎటూ పాస్పోర్ట్ ఉందికదా అని.. "నేను రోజూ అద్దంలో చూసుకుంటానండీ" అని నవ్వేసి "లేదండీ..నాకు ఇంట్రస్ట్ లేదు.. చదువయ్యాక ఉద్యోగం.. లేదంటే బిజినెస్ అంతే.." ఆ తర్వాత చాలా ఏళ్ళ తర్వాత రెండు వేర్వేరు సందర్భాలలో అనుకోకుండా ధర్మవరపు ని కలవడం తటస్తించింది. రెండుసార్లూ కూడా తనే వచ్చి పలకరించడం మాత్రం ఎప్పటికీ ఆశ్చర్యమే నాకు. ఉదయం పేపర్లో 'ధర్మవరపు ఇక లేరు' అన్న వార్త చూసినప్పటి నుంచీ ఏపని చేస్తున్నా ఇవే జ్ఞాపకాలు.. దింపుకో గలిగే బరువు కాదు కదూ ఇది.. ధర్మవరపు కి నివాళి..

9 కామెంట్‌లు:

  1. ఏమిటో ఒక్కొక్కరుగా సెలవు తీసుకుంటున్నారు మొన్న ఏవీఎస్,నిన్న ధర్మవరపు(ఈయన కూడా జంధ్యాల కుటుంబీకుడే కదండీ).నిండా 53 ఏళ్ళకే నిండు నూరేళ్ళు నిండాయి పాపం. నిజమే అటువంటి మిత్రుడ్ని కోల్పోవడం దింపుకోగలిగే బరువు కాదు భారమే మరి

    నాకు కూడా స్వాతి కిరణం సినిమాలో పాత్రే నచ్చుతుంది మిగతా అన్నిటికన్నా

    రిప్లయితొలగించండి
  2. manchi nivali. meedaina brand kaligina hrydayanni kadilinche nivali, murali garoo...
    --Bhasker Koorapati

    రిప్లయితొలగించండి
  3. ధర్మవరపు చాలా మంచివారు మురళి గారు. ఆయనతో నాకు వ్యక్తిగత పరిచయం వుంది. వర్తమాన సినిమా విషయాల కంటే సాహిత్యం గురించీ, పాత సినిమా పాటల గురించీ, గ్రామీణ జీవనం గురించీ బాగా మాట్లాడేవారు. నటుడు ప్రకాష్ రాజ్ తెలుగు బాగా నేర్చుకోవడానికి ప్రధాన కారకులు ధర్మవరపు గారే. ఆయన మూలంగానే ప్రకాష్ రాజ్ తెలుగు చదవడం, మన రచయితల గురించి తెలుసుకోవడం జరిగింది.
    మీ స్మృతి రచన ధర్మవరపు గారి మంచితనాన్ని మరోమారు చూపింది

    రిప్లయితొలగించండి
  4. నాకు స్వాతి కిరణం సినిమాలో పాత్రే నచ్చుతుంది. ధర్మవరపు గారికి నివాళి

    రిప్లయితొలగించండి
  5. మురళి గారికి
    ధర్మవరపు గురించి నెమలికన్నులో రాసిన మీ అనుభవాలు చదివాను. ఆయన్ని గురించి చాలా నిజాయితీగా రాసిన ఎన్నో విషయాలు నాకు బాగా నచ్చాయి. మీరన్నట్టు దింపుకుంటే దిగిపోయే బాధ కాదు. కొన్నేళ్ళు అలా 'సెల' వేసినట్టు బాధ పెడుతూనే వుంటుంది.తప్పదు.
    నమస్కారాలతో -
    - భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి
  6. నవ్వుకు దిష్టి తగిలింది
    http://bhandarusrinivasarao.blogspot.in/
    నిన్న కాక మొన్న ఏవీఎస్
    మళ్ళీ ఈరోజు ధర్మవరపు సుబ్రహ్మణ్యం
    ఇలాటి నవ్వులరేడులు అందరూ నవ్వుల్ని మనకు వొదిలేసి నవ్వుకుంటూ అలా వెళ్ళిపోతున్నారు. ఇదొక విషాదం.
    సుబ్రహ్మణ్యం గారు తెలియనివాళ్ళు వుండరు. కానీ ఆయనతో మా పరిచయం యెలా జరిగిందో గుర్తులేదు కానీ ఆ పరిచయం అలా పెరిగిపోయి మా కుటుంబాల్లో అందరికీ గుర్తుండి పోయింది. నేనూ జ్వాలా ఆయనతో చేసిన అసంఖ్యాక ‘సాయంకాలక్షేపాలు’ ఇంకా కళ్ళల్లో సుడులు తిరుగుతూనే వున్నాయి. ఆయన సినిమాల్లో చూపించిన హాస్యం చూసి జనమంతా కడుపుబ్బానవ్వుకున్నారు. కానీ హాస్య నటులు తెర మీదే కాదు నలుగురితో కూర్చున్నప్పుడు కూడా నవ్వుల పువ్వులు పూయించగలరని జంధ్యాల, ధర్మవరపు నిరూపించారు.
    ఇంత చిన్న వయస్సులోనే అంతటి నవ్వుల చక్రవర్తులు అందరినుంచి సెలవు తీసుకుంటూ వున్నారంటే ఎక్కడో ఏ లోకంలోనో నవ్వులు తక్కువయ్యాయని అనుకోవాలి. అందుకే కాబోలు ఈ అర్ధాంతర, హడావుడి ప్రయాణాలు.
    మిత్రుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారికి నా శ్రద్ధాంజలి
    (07-12-2013)

    రిప్లయితొలగించండి
  7. @శ్రీనివాసరావు పప్పు: ధన్యవాదాలండీ..
    @భాస్కర్: ధన్యవాదాలండీ
    @చక్రవర్తి: అవునండీ ధర్మవరపు, భరణి ఇద్దరూ ప్రకాష్ రాజ్ కి తెలుగు సాహిత్యం పరిచయం చేశారు.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  8. @శృతి: ధన్యవాదాలండీ..
    @భండారు శ్రీనివాస రావు: నిజమేనండీ.. నవ్వుకి దిష్టి తగిలింది :( .. ధన్యవాదాలు..
    @నారాయణ స్వామి: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి