శనివారం, మార్చి 10, 2012

లవ్ ఫెయిల్యూర్

చాలా రోజుల తర్వాత థియేటర్లో సినిమా చూశాను. కొంచం అరవ వాసన వేసిన డబ్బింగ్/ద్విభాషా చిత్రం పేరు 'లవ్ ఫెయిల్యూర్.' పేరు లాగానే, సినిమాలో సంభాషణలు కూడా ఎక్కువగా ఇంగ్లిష్ కలిసిన, అప్పుడప్పుడూ అరవంలాగా అనిపించే తెలుగులో వినిపించాయి. తొమ్మిదేళ్ళ క్రితం శంకర్ తీసిన 'బోయ్స్' మొదలుకొని ఇప్పటివరకూ కాలేజీ కుర్రాడి పాత్రలోనే ఎక్కువగా కనిపిస్తున్న సిద్ధార్థ కథానాయకుడు. నాయిక అమలపాల్. వీళ్ళిద్దరూ ఇంజనీరింగ్ విద్యార్ధులు. వీళ్ళు ప్రేమించుకోవడం అది విఫలమవుతూ ఉండడమే ఈ సినిమా.

అరుణ్ (సిద్ధార్థ్)ది చూడ చక్కని కుటుంబం. తండ్రి లాయర్, తల్లి మాటకి ఎదురు చెప్పనివాడు. ఈ కారణానికి అరుణ్ ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. పార్వతి (అమలా పాల్) నేపధ్యం ఇందుకు విరుద్ధం. తల్లిదండ్రులు (అలనాటి అందాల హీరో సురేష్, కేరక్టర్ నటి సురేఖా వాణి) ఎప్పుడూ గొడవలు పడుతూ, విడిపోయేందుకు మానసికంగా సిద్ధపడిపోయి ఉంటారు. రెండు జంటలదీ ప్రేమ వివాహమే. అరుణ్, పార్వతి అనుకోకుండా ఒకరికొకరు పరిచయమై, అనుకుని స్నేహితులై ఆ తర్వాత ప్రేమికులవుతారు. ఏడాది తిరక్కుండానే అరుణ్ ప్రేమలో ఓడిపోతాడు.

అరుణ్, తగు మాత్రం ఉపన్యాసాలతో తన ప్రేమ కథని ప్రేక్షకులతో పంచుకోవడమే రెండుగంటల సినిమా. అరుణ్ ప్రకారం, పార్వతికి సహనం తక్కువ. తన మాటే నెగ్గాలంటుంది, నెగ్గించుకుంటుంది. ఇతగాడు మిక్కిలి ఓరిమితో భరిస్తున్నప్పటికీ, ఎప్పుడూ ఏదో ఒక కొత్త తగువు తెస్తూ ఉంటుంది. అరుణ్ లో తప్పులు వెతకడానికి ఉత్సాహ పడే పార్వతి, తన దగ్గర తప్పులున్నాయనే విషయాన్ని ఒప్పుకోనే కోదు. కథని అరుణ్ కోణం నుంచి చూపడం వల్ల అనుకుంటా, పార్వతి ఓ తెలివి తక్కువ అమ్మాయిలాగా అనిపించింది.


ప్రేమలో ఓడిపోయిన అరుణ్, తన మిత్రుల ప్రేమ ప్రయత్నాలు చూస్తూ, తోచిన వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటాడు. పార్వతికి పాపం ఇంటి గొడవలకే ఎంత సమయమూ చాలదు. అదీ కాకుండా, ఆ అమ్మాయి కెరీర్ ఓరియంటెడ్. స్టేట్స్ వెళ్లి పై చదువులు చదవాలన్న లక్ష్యం ఒకటి ఉంటుంది. అరుణ్ కి ఈ శషభిషలేవీ లేవు కాబట్టి పార్వతి కబుర్లు చెబుతూ కాలక్షేపం చేసేస్తూ ఉంటాడు. పార్వతి తల్లిదండ్రుల కథ, అరుణ్ మిత్రుల ప్రేమకతలతో పాటు, పార్వతి-అరుణ్ ల ప్రేమ కథ కూడా ఓ మలుపు తిరగడమే సినిమా ముగింపు.

కథలో కొత్తదనం ఏమీ లేదు. కథనంలో కొత్తదనం చూపించడం కోసం ప్రయత్నించాడు దర్శకుడు బాలాజీ మోహన్. మరికొంచం గట్టి ప్రయత్నం చేసి ఉండాల్సింది. సిద్ధార్థ్ ని కాలేజీ విద్యార్ధిగా చూడగానే, "నే బీయే పాసయ్యానమ్మా" అంటూ గాద్గదికంగా పలికే 'అన్నగారు' గుర్తొచ్చారు. హీరోయిన్ ని చూస్తున్నంతసేపూ ఒకే కోరిక పదే పదే కలిగింది. ఓ దువ్వెన, సబ్బు, తువ్వాలు ఆ అమ్మాయి చేతిలో పెట్టి "కాస్త తల దువ్వుకుని, ముఖం కడుక్కురా అమ్మాయ్" అని చెప్పాలని. ప్రేమకథలకి సంగీతమే బలం అంటారు కానీ, ఈ సినిమాకి ఆ బలంకూడా లోపించింది.

సాంకేతిక విభాగాల్లో, ఫోటోగ్రఫీ బాగుంది. మొదటి సగం బాగా సాగతీతగా అనిపించడానికి ఎడిటింగ్ కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు. ప్రత్యేకంగా కామెడీ ట్రాక్ గానీ, హాస్యనటులు కానీ లేరు. అరుణ్ స్నేహితుడు విగ్నేశ్ ప్రేమకథని హాస్య భరితంగా చూపించే ప్రయత్నం చేశారు. మిగిలిన విభాగాల గురించి పెద్దగా చెప్పుకోడానికి ఏమీలేదు. అనేకానేక ఉపన్యాసాల తర్వాత, సినిమా చివర్లో ఇచ్చే ఉపన్యాసంలో ఒక్కసారైనా ప్రేమలో పడ్డవాళ్ళకి తన కథ నచ్చి తీరుతుందనే అర్ధం వచ్చేలా మాటాడాడు అరుణ్. బహుశా, నేనింకా ప్రేమలో పడలేదేమో...

20 వ్యాఖ్యలు:

 1. హీరోయిన్ ని చూస్తున్నంతసేపూ ఒకే కోరిక పదే పదే కలిగింది. ఓ దువ్వెన, సబ్బు, తువ్వాలు ఆ అమ్మాయి చేతిలో పెట్టి "కాస్త తల దువ్వుకుని, ముఖం కడుక్కురా అమ్మాయ్" అని చెప్పాలని

  andaru amala paul baaga chesaanu ante endo anukunnaa.... choosaaka telisindi........baaboy

  ప్రత్యుత్తరంతొలగించు
 2. " ఓ దువ్వెన, సబ్బు, తువ్వాలు ఆ అమ్మాయి చేతిలో పెట్టి "కాస్త తల దువ్వుకుని, ముఖం కడుక్కురా అమ్మాయ్" అని చెప్పాలని."
  :):)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. చాలా కాలం తరువాత కుటుంబ సభ్యులందరితోనూ ఈ సినిమా చూడటం జరిగింది. సినిమా తీసిన విధానం, కథను తిరగేసి చెప్పటం వైవిధ్యంగా ఉండి బాగున్నది సినిమా.

  వాడెవడో దాదాపు అరవై ఏళ్ళు వచ్చి అదేదో ప్రాంతం పౌరషాలు, ఇంకేదో కక్షలు, కార్పణ్యాలు, ఊరి వాళ్ళకు న్యాయం చెప్పటం, దానికోసం ఎప్పుడు చూసినా విపరీతమైన కానిస్టిపేషన్ తో బాధపడుతున్నవాడిలా మొహం పెట్టుకు తిరగటం, ఆ పైన ప్రతిదానికీ ఊహూ చించుకుంటూ డైలాగులు చెప్పే సినిమాల కంటే ఈ సినిమా ఎన్నో రెట్లు హాయిగా ఉన్నది. సినిమా ఎక్కడా విసుగు పుట్టలేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. అయితే చూడక్కర్లేదన్నమాట!!Thank Q!

  ప్రత్యుత్తరంతొలగించు
 5. baagundandi...mee review..avunu, heroinelu tala duvvukovadam marchi potunnaru ee madhya..same pinch, ikkada..Kahani bagundi..veelau aytihe cinemaa hall lone choodandi.

  vasantham.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. meeru ee cinema theater lo choosarante, meeru kooka love lo fail ayyuntaru.. nijam cheppandi murali garu, veelaithe oka tapa rayandi pls...

  ప్రత్యుత్తరంతొలగించు
 7. మీరు రివ్యును బాగా రాశారు.మీరు రాసిన ప్రతి లైనుతో ఏకీభవిస్తాను. మగవారికి ఈ సినేమా నచ్చదేమో! ఈ సినేమాను తెలుగు బ్లాగులో ఒక ఆవిడా రాసిన రివ్యును చదివి, బాగుందని చెపితే వెళ్లి చుసాను. ఇంటర్వేల్ తరువాత సినేమా ఆసక్తికరంగానే లేదు. ఏదో సైకోఅనాలిసిస్ డాక్యుమెంటరి చూసినట్లు ఉండింది. కాని సినేమా సమకాలిన సమజాన్ని ప్రతిబింబించే చిత్రం. ఒక్కడే కొడుకు,బాగా డబ్బులు సంపాదించే తండ్రి, పిల్ల వాడికి చదువు పూర్తి అయితే ఒక ఉద్యోగం వస్తుంది అనే నమ్మకం. సమాజం గురించి ఆలోచించవలసిన అవసరమేలేని, భరోసాగల జీవితం. అలాగే తల్లిదండృలకు వేరే పని ఉండదు. పిల్ల వాడు ఎవరినైనా ప్రేమించితే, ఆ అమ్మాయినిచ్చి పెళ్లిచెస్తే వారి కో పనైపోతుంది అనే భావన. కాని హీరో, హీరొయిన్ ల కే జీవితం మీద క్లారిటి లేక కొట్టుకొంట్టూ ఉంటారు. ఇక హీరొయిన్ ఒక్కతే కూతురు, కేరిర్ ఓరియెంటేడ్. అమేరికాకి వెళ్లి చదివాలని ప్రయత్నిస్తుంటుంది. ఎవరైన చిక్కితే, పెళ్లికి అడ్వాన్సేడ్ బుకింగ్ చేసుకొంవాలనే కోరిక, వాడితో టైంపాస్గా తిరగాలనే తృష్ణ ఆమేలో కనిపిస్తుంది. ఈ సినేమా మొత్తం 4-5 అబ్బాయిలు, 2-3 అమ్మాయిలు వారిని వీరు, వీరిని వారు పలు కోణాలలో అర్థం చేసుకోవటానికి చేసిన ప్రయత్నమే ఈ సినేమా కథ. రానున్న కాలంలో ఒక్కరే సంతానం ఉంటారు కనుక, ప్రతి తల్లిదండృలకు ఎలాగూ రెండు, మూడు ఇళ్లు అంతో ఇంతో సొమ్ములుంటాయి. చూడబోతే ఐదవతరగతిలోనే పెళ్లి ఏర్పాట్లు మొదలుపెడతారేమొ అన్న అనుమానం ఈ సినేమాను చూసిన తరువాత వచ్చింది. డబ్బులు బాగా ఉండి, చదువుకొన్న వారు ఎటువంటి సామాజిక బాధ్యత లేకుండా జీవిస్తే చేయతగ్గ పనులు ఎమీ ఉండవు. ప్రేమ పేరుతో టైంవేస్ట్ చేయటం తప్ప.

  ఇదే విధమైన జీవన శైలి కలిగిన (చీకూ చింతా లేని జీవితం,చేతినిండా డబ్బులు )తెలుగు బ్లాగర్లు కొంతమంది ఉన్నారు. వారికి కొత్త సినేమా వాల్ పోస్టర్ కనపించితే, ఆసినేమాను మొదటి ఆట చూసి బ్లాగులో రాయాలని కోరిక చాలా ఉన్నట్లు ఈ సినెమా చుసినతరువాత అర్థమైంది. ఈ నాసిరకం సినేమాకి ఆ బ్లాగును చదివి వెళ్లినందుకు ఒక వంద రూపాయల ఖర్చు, టైంవేస్ట్, చిన్న పిల్లల దగ్గర ప్రేమ గురించి,అమ్మాయిల మనసు అర్థం చేసుకోవటం మీద క్లాసులు విన/చుడవలసిన దుర్గతి పట్టింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. హిట్టు టాక్ సినిమాలు "సూపర్ హిట్టు" సినిమాలు నచ్చట్లేదంటే పెద్దవాళ్ళయిపోయినట్లే :)

  ప్రత్యుత్తరంతొలగించు
 9. హీరోయిన్ ని చూస్తున్నంతసేపూ ఒకే కోరిక పదే పదే కలిగింది. ఓ దువ్వెన, సబ్బు, తువ్వాలు ఆ అమ్మాయి చేతిలో పెట్టి "కాస్త తల దువ్వుకుని, ముఖం కడుక్కురా అమ్మాయ్" అని చెప్పాలని


  5+
  *****

  ప్రత్యుత్తరంతొలగించు
 10. @వినయ్ చక్రవర్తి: నాకైతే అలాగే అనిపించిందండీ మరి.. ధన్యవాదాలు.

  @జ్యోతిర్మయి: :-) :-) ధన్యవాదాలు.

  @శివరాం ప్రసాద్: మీరు చెప్పిన సదరు 'హింసాత్మక' సినిమాలు నేను చూడలేదండీ.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. @పద్మార్పిత: నా అభిప్రాయం అండీ .. ధన్యవాదాలు.

  @వసంతం: తప్పక ప్రయత్నిస్తానండీ.. ధన్యవాదాలు.

  @Tollywood Spice : ఈ సినిమా దర్శకుడి ప్రకారం అసలు ప్రేమ అంటే ఏమిటో, ప్రేమ విఫలమవ్వడం అంటే ఏమిటో.. అంతా కన్ఫ్యూజన్ గా ఉందండీ నాకు... ధన్యవాదాలు..

  ప్రత్యుత్తరంతొలగించు
 12. @శ్రీనివాస్: మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలండీ.. ఈ మధ్య నాకు బ్లాగులు చదవడం వీలవ్వడం లేదు :( ఏమైనప్పటికీ, మీరు బ్లాగర్ల ప్రస్తావన తీసుకురాకుండా ఉండాల్సిందేమో.. అందరి అభిప్రాయాలూ ఒకేలా ఉండవు కదా..

  @రిషి: అందుకోసమే అయితే ఈ సినిమా చూడాలా చెప్పండి?!! ధన్యవాదాలు.

  @శ్రీ: ధన్యవాదాలండీ..........

  ప్రత్యుత్తరంతొలగించు
 13. పెద్దవాళ్ళయిపోయారు అని సరదాగా అన్నానండీ. నొచ్చుకున్నట్లయితే క్షమాపణలు. మీ సమాధానం చూసాకా నొచ్చుకున్నారేమో అనిపించి..

  ప్రత్యుత్తరంతొలగించు
 14. @రిషి: భలే వారేనండీ.. ఇందులో నోచ్చుకోడానికి ఏముంది చెప్పండి? సినిమా చూడకపోయినా ఒప్పేసుకుని ఉందును అన్న టోన్లో అన్నానండీ.. (చూసే శిక్ష తప్పేది కదా అని నా హృదయం) ... కాబట్టి వెనక్కి తీసేసుకోండి....

  ప్రత్యుత్తరంతొలగించు
 15. హీరోయిన్ ని చూస్తున్నంతసేపూ ఒకే కోరిక పదే పదే కలిగింది. ఓ దువ్వెన, సబ్బు, తువ్వాలు ఆ అమ్మాయి చేతిలో పెట్టి "కాస్త తల దువ్వుకుని, ముఖం కడుక్కురా అమ్మాయ్" అని చెప్పాలని.
  super like....:);)
  వాల్ పోస్టర్లలో చూసిన నాకే అలా అనిపిస్తే సినిమాలో భరించిన మీకు అనిపించడంలో తప్పులేదు.
  ఐనా ఆ హీరో క్యారెక్టర్ అంత బాధపడుతూ అలాంటి అమ్మాయిని ప్రేమించే ఖర్మేంటని వదిలెయ్యొచ్చుగా. మనకి ఎందుకీ హింస.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. హీరోయిన్ ని చూస్తున్నంతసేపూ ఒకే కోరిక పదే పదే కలిగింది. ఓ దువ్వెన, సబ్బు, తువ్వాలు ఆ అమ్మాయి చేతిలో పెట్టి "కాస్త తల దువ్వుకుని, ముఖం కడుక్కురా అమ్మాయ్" అని చెప్పాలని

  navvi navvi chachanu ee sentense ki :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 17. @పక్కింటబ్బాయి: నిజమే కదండీ.. వదిలేసి ఉంటే పీడా పోయేదనిపించింది.. ధన్యవాదాలు..
  @కరుణ: :-) :-) ధన్యవాదాలండీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 18. హీరోయిన్ ను చూస్తున్నంతసేపు ఒకే కోరిక పదే పదే కలిగింది. "ఒక దువ్వేన, సబ్బు, తువాలు ఆమె చేతిలో పెట్టి కాస్త తలదువ్వుకొని, ముఖం కదుక్కొనిరా అమ్మయ్" అని చెప్పలని. కదా. నాకు సేం ఫీలింగ్ అండీ. కాని అమ్మాయి అసలే ఫ్యామిలీ ప్రొబ్లంస్ తో ఉంది కదా అందుకే తనగురించి కేర్ తీసుకొవడం లేదని సర్ధుకుపోయాను. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 19. @David Raj: హహహా.. నేనిలా ఆలోచించలేదండీ.. కొత్త పాయింట్!! ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు