సోమవారం, నవంబర్ 07, 2011

హేమపాత్ర-అశోకవర్దనుడు

తెలుగు సాహిత్యంలో 'విశాలనేత్రాలు' వంటి నిరుపమాన నవలల సృష్టికర్త పిలకా గణపతి శాస్త్రి రాసిన నవలికల జంట 'హేమపాత్ర' 'అశోకవర్ధనుడు.' వీటిలో మొదటి నవలిక కథా స్థలం దక్షిణ భారతదేశమైతే, రెండోది ఉత్తరభారత దేశంలో జరిగిన కథ. రెండూ కూడా అందరికీ తెలిసిన కథలే. అయినప్పటికీ ఆసాంతమూ చదివించేది పిలకా వారి శైలి. కథా స్థలంలో పాటుగా పాత్రల స్వభావాలనీ కళ్ళకి కట్టే వర్ణనా వైచిత్రి కారణంగా, కథ కేవలం చదువుతున్నట్టుగా కాక కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది.

'హేమపాత్ర' విప్రనారాయణుడి కథ. శ్రీరంగశాయి మీద భక్తితో సర్వ సుఖాలనీ త్యజించి, చిన్ననాడే ఇల్లు విడిచి శ్రీరంగం చేరిన నారాయణ దేవర కథ. లక్ష్మీదేవి, నారాయణావధాని దంపతులకి లేక లేక కలిగిన ఏకైక సంతానం దేవర. అతడు బాల్యం వీడి యవ్వనంలోకి ప్రవేశించగానే వివాహ ప్రయత్నాలు ఆరంభిస్తారు తల్లిదండ్రులు. అయితే దేవర ధోరణి వేరు. పరంపరాగతంగా వచ్చిన స్వామిపూజలో అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించే దేవర, శ్రీరంగేశుని సేవలో జీవితాన్ని గడపాలని నిశ్చయించుకుంటాడు.

పెళ్ళి చేసుకోమని తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి పెరగడంతో, ఇల్లు విడిచి శ్రీరంగం చేరుకొని అనునిత్యం శాయికి పూలమాలలు సమర్పించడం ఆరంభిస్తాడు. పూవుల నిమిత్తం ఓ పూలతోటని దానితో పాటుగా ఓ కుటీరాన్ని నిర్మించుకుంటాడు. ప్రశాంతంగా సాగిపోతున్న నారాయణ దేవర జీవితంలో తలవని తలంపుగా ప్రవేశిస్తుంది యవ్వనవతి నీలవేణి. గణిక వృత్తి పట్ల విరక్తి చెంది, స్వామి సేవకి జీవితాన్ని అంకితం చేయ నిశ్చయించుకుని ఆశ్రమాన్ని వెతుక్కుంటూ వచ్చానని నమ్మబలుకుతుంది. ఆశ్రయం ఇచ్చిన దేవరని లోబరుచుకుంటుంది.

నీలవేణి (అసలు పేరు దేవదేవి)ని విడిచి ఉండలేని స్థితికి చేరుకున్నాక గాని దేవరకి తెలియదు, తను ఎంతటి ఉచ్చులో చిక్కుకున్నాడో. సాక్షాత్తూ శ్రీరంగ శాయే దేవరకి సాయపడేందుకు రావడంతో కథ ముగింపుకి వస్తుంది. శ్రీరంగం నేపధ్యంగా సాగడం వల్ల, 'విశాల నేత్రాలు' పదే పదే జ్ఞాపకం వచ్చింది. అంతేనా? 'విప్రనారాయణ' కోసం భానుమతి పాడిన 'ఎందుకోయీ.. తోటమాలీ.. అంతులేనీ యాతనా..' పాట చెవుల్లో గింగురుమంటూనే ఉంది. గణికల స్వభావంతో పాటు, ఆనాటి పాలనా వ్యవస్థనీ సునిశితంగా చిత్రించారు రచయిత.

పాటలీపుత్ర పాలకుడు అశోకుడి కథ 'అశోకవర్ధనుడు.' అసలు అశోకుడు అనగానే మొదట గుర్తొచ్చే వాక్యం 'అశోకుడు చెట్లు నాటించెను.' అతగాడు నాటించిన మొక్కలు పెరిగి చెట్లయ్యాయి కానీ మనం మాత్రం చెట్లు నాటించెను అనే అంటాం! కళింగ యుద్ధం అనంతరం, అశోకుడు యుద్ధాల పట్ల విముఖుడై, బౌద్ధం పట్ల ఆకర్షితుడయ్యాడని చెబుతారు చరిత్రకారులు. ఆ యుద్ధానికి దారితీసిన పరిస్థితులు, అప్పటి అశోకుడి మనఃస్థితి
లాంటి విషయాలని విపులంగా విశదీకరించిన నవలిక 'అశోక వర్ధనుడు.'

మహానది ఒడ్డున ఉన్న తోసలీనగరం ఓ చిన్న సామంత రాజ్యం. ఆ రాజ్య పాలకుడు మహేంద్ర కేసరి పెద్ద కుమార్తె నాగావళి. మహేంద్ర కేసరికి కళింగ రాజ్యపు రాజు కళింగ మల్లుడు పక్కలో బల్లెం. ఎప్పుడెప్పుడు తోసలిని ఆక్రమిద్దామా అని ఎదురు చూసే కళింగ మల్లుడికి అశోకుడి దండయాత్ర పెద్ద అవకాశంగా కనిపిస్తుంది. చిన్న చిన్న సామంత రాజ్యాలన్నీ కలిసి అశోకుడిని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని వేగులు పంపుతూనే, మహేంద్ర కేసరి కి నాగావళిని తను వివాహం చేసుకుంటానంటూ రాయబారం పంపుతాడు.

వృద్ధుడైన కళింగ మల్లుడికి నాగావళిని ఇచ్చి వివాహం చేయడం ఏమాత్రం ఇష్టం ఉండదు మహేంద్ర కేసరికి. అంతకన్నా, అశోక చక్రవర్తి సహాయం ఆర్ధించి అతడికే నాగావళిని ఇచ్చి వివాహం చేయడం ఉత్తమం అన్న అభిప్రాయంలో ఉంటాడు. తనపై యుద్ధం ప్రకటించిన కళింగ మల్లుడిని ఎదుర్కొనేందుకు అశోకుడి సాయం కోరతాడు. వివాహ ప్రతిపాదననీ చక్రవర్తి ముందు ఉంచుతాడు. అశోకుడిపట్ల ఇష్టం పెంచుకున్న నాగావళి, కేవలం తన కారణంగా రాజ్యంలో ప్రజలందరూ కళింగ మల్లుడి వల్ల బాధలు పడడం భరించలేని ఆ యువతి మల్లుడిని వివాహం చేసుకోడానికి అంగీకారం తెలుపుతుంది.

అయితే కూతురి ప్రతిపాదనని ఏమాత్రం అంగీకరించడు మహేంద్ర కేసరి. అటు కళింగ బలగాలకీ, ఇటు పాటలీ పుత్ర సైన్యాలకీ మధ్య భీభత్సమైన యుద్ధం జరగడంతో కథ ముగింపుకి వస్తుంది. యుద్ధ తంత్రాన్ని అత్యంత శ్రద్ధగా చిత్రించారు రచయిత. అలాగే అశోకుడికి బౌద్ధం పట్ల సానుకూల ధోరణి ఏర్పడడానికీ, యుద్ధాల పట్ల విరక్తి ఏర్పడడానికీ దారితీసిన పరిస్థితులని క్లుప్తంగా చెప్పారు. చరిత్ర మీద మక్కువ ఉన్నవాళ్ళు తప్పక చదవాల్సిన రచన. రెండు నవలికలనీ ఒకే సంకలనంగా తీసుకొచ్చింది ఎమెస్కో. పేజీలు 168, వెల రూ. 60, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులతో పాటు ఏవీకెఎఫ్ లోనూ లభ్యం.

8 కామెంట్‌లు:

  1. ఇవి జంట నవలలు కావండీ!ఎమెస్కో వాడు కలిపి వేశాడు అంతే! ఇలా పిలకా వారి నవలలు చాలా వాటిని రెండుగా కలిపివేశాడు... నా దగ్గర పాత ప్రతులు ఉన్నాయి, ప్రతి నవలా విడిగా....

    రిప్లయితొలగించండి
  2. మీరు నమ్మరేమో కానీ మా అడిలైడ్ నగరంలో ఒక లైబ్రరీలో పిలకా గణపతి శాస్త్రి గారి అన్ని నవలలూ వున్నాయి! నేను ఇప్పటికే ఈ పుస్తకాన్నీ, విశాల నేత్రలూ చదివేసాను. ఈ సారి వెళ్ళినప్పుడు గృహిణి తీసుకొస్తాను.
    అక్కడికెళ్ళినప్పుడల్లా మీరు రాసిన రివ్యూలే గుర్తొస్తాయి!
    శారద

    రిప్లయితొలగించండి
  3. మురళి గారు గణిక వృత్తి అంటే వేశ్యా వృత్తి అనేనా ? నేనెక్కడా చదవలేదు ఈ మాట ఇంత వరకు .

    రిప్లయితొలగించండి
  4. సాహిత్య ప్రచురణల పై మీరూ చేస్తున్న సమీక్షలు బాగున్నాయి మురళి గారు.

    రిప్లయితొలగించండి
  5. @కౌటిల్య: తప్పు సరిదిద్దానండీ.. ధన్యవాదాలు.
    @శారద: గృహిణి మీద మరీ భారీ అంచనాలు పెట్టుకోకండి.. ఆసక్తి ఉంటే 'హరివంశం' చదవండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. @లలిత: అవునండీ.. సాహిత్యంలో చాలా చోట్లే ఉంది ఈ వృత్తి ప్రస్తావన... ధన్యవాదాలు.
    @చైతన్య దీపిక: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి