మంగళవారం, డిసెంబర్ 21, 2010

హాస్య కథలు

పుస్తకం పేరే 'హాస్య కథలు' పైగా రాసిందేమో 'శ్రీవారికి ప్రేమలేఖ' లాంటి అద్భుత హాస్య చిత్రానికి కథ అందించిన శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి. ఇక, కథలు ఎలా ఉంటాయన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా. రెండేళ్ళ క్రితం ఈనాడు ఆదివారం లో వారానికో కథ చొప్పున ప్రచురితమైన ఈ కథలని శ్రీధర్ కార్టూనులతో సహా పుస్తకంగా ప్రచురించారు ఎమెస్కో వారు. మొత్తం ఇరవైనాలుగు కథల విందు భోజనం ఈ చిరు పొత్తం.

కథలన్నీ రచయిత్రి బాల్య జ్ఞాపకాలే. చిన్నారి విజయ చేసే చిలిపి పనులతో పాటు అమ్మమ్మ, ఆవిడ స్నేహితురాళ్ళ చాదస్తాలు, తాతగారి పాట్లు, బంధువుల చిత్ర విచిత్రమైన అలవాట్లు, వాటి కారణంగా విజయతో సహా చిన్న పిల్లలు పడ్డ పాట్లు.. ఇలా ప్రతి జ్ఞాపకాన్నీ ఓ అందమైన కథగా మలిచారు విజయలక్ష్మి. కొన్ని కథలు పూర్తి చేశాక ఓసారి ఆలోచిస్తే, అసలు ఈ జ్ఞాపకాన్ని కథగా మలచవచ్చు అన్న ఆలోచన ఎలా వచ్చి ఉంటుందబ్బా? అనిపించక మానదు.

అల్లుడుగారు రేడియో పంపించారు. వినకపోతే మర్యాద కాదు. కానీ వింటూ కూర్చుంటే ఇంట్లో పనులు జరగడం లేదు. ఎలా? అన్నది అమ్మమ్మ సమస్య. పక్కింటి వాళ్ళని బతిమాలి వాళ్ళని రేడియో ముందు కూర్చోపెట్టి తను వంట చేయడానికి వెళ్ళే ప్రహసనాన్ని ఆనందించొచ్చు 'ఆలిండియా రేడియో' కథలో. ఇంటికి కరెంటీ పెట్టించుకున్న అమ్మమ్మ పాట్లు, సెకండ్ హ్యాండ్ కారు కదలక మొరాయిస్తున్నా ఆ ప్రయాణానికే సంతోష పడిపోతూ 'కారాగిపోయినప్పుడు పిల్లలు తింటారు' అంటూ చిరుతిళ్ళు కట్టివ్వడం 'కారులో షికారు' కథ.

వియ్యంకుడు తెచ్చిన 'ఇంగ్లీష్' కూరలని ఇరుగుపొరుగు వాళ్లకి చూపించడం కోసం అమ్మమ్మ పడే ఆరాటం 'ఇంగ్లీష్ కూరలు' కథ చెబితే, కొత్తగా వెలిసిన అట్ల దుకాణం ఆవిడ కాపురంలో రేపిన కలతలేమితో 'దొంగ అట్లు' కథ చెబుతుంది. హోటల్ వాళ్ళు రేట్లు పెంచినా, ఇంట్లో వాళ్ళు పాత రేట్లే ఇచ్చి పిల్లల్ని పంపిస్తే అప్పుడు హోటల్ వాళ్ళు ఏంచేస్తారు? గుంటూరు శంకర్ విలాస్ యజమాని ఏం చేశాడో చెప్పే కథ 'పదిహేను పైసలకి ఆరుగురు పిల్లలు.'

మొత్తం మీద ఈ తొంభై ఆరు పేజీల పుస్తకం చదివిన వాళ్లకి డాక్టర్ సోమరాజు సుశీల రాసిన 'ఇల్లేరమ్మ కతలు' గుర్తు రాకుండా ఉండడం అసాధ్యం. అలా అని ఈ కథలు సుశీల కథలకి అనుకరణా కాదు. రెంటిలోనూ బాల్యమే కథ వస్తువు కావడం ఒక్కటే పోలిక. అలాగే వయసుతో పాటు రచయిత్రి ఆలోచనల్లో వచ్చే పరిణతినీ రెండు పుస్తకాలూ పఠితలకి పట్టిస్తాయి. (వెల రూ. 40, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు.)

11 కామెంట్‌లు:

 1. బాల్యం ఎప్పుడూ అమూల్యం
  బాల్యం ఎప్పుడూ మధురం
  బాల్యం ఎప్పుడూ స్మరణీయం
  ఎవరుచెప్పినా ఎలా చెప్పినా అది ప్రత్యేకం.
  మంచి పుస్తకం పరిచయం చేసారు ధన్యవాదములు

  రిప్లయితొలగించు
 2. బాగుందండి.మీరు రాసింది చదువుతుంటే ఎప్పుడో చదివిన కథలు గుర్తొస్తున్నయండి.అప్పుడు ప్రతి ఆదివారం మిస్సవకుండా చదివాను.నాకు హాస్యకథలు ఇష్టం .పుస్తకం కొనాలి.

  రిప్లయితొలగించు
 3. మురళి గారు మొన్నే బెంగుళురు పుస్థకోత్సవంలో ఈ పుస్థకం కొన్నాను. ఈ ఆదివారమే చదివాను. ఆదివారం అనుభందంలో కథలు వొచ్చినపుడె అనుకునేదాన్నండి ఎప్పుడైన ఈ పుస్థకం వొస్తుందా అని. మంచి కథలు చక్కటి హాస్యం. పరిచయం చేసిన మీకూ ధన్యవాదాలు.అలాగే మీకు కుదిరితే ఈ ధనుర్మాసాన్ని గురించి కూడా ఒక టపా రాయండి. ఇంకొన్ని బాల్య మధురానుభూతులు మాతో పంచుకోండి.

  రిప్లయితొలగించు
 4. మంచి పుస్తకం గురించి బాగా చెప్పారండీ...ఇది నా విష్లిస్ట్లో చేరిపోయింది.ఈసారి ఎలాగైనా కొనాలి.నాకు హాస్యంతో కూడినా సాహిత్యం ఇష్టం.అలుపు లేకుండా అలా అలవోకగా చదివేస్తాము.కాబట్టి ఇది మిస్ అవకూడదు నేను.ఇంతమంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు :)

  రిప్లయితొలగించు
 5. హ హ మీరు చెప్పిన కథల గురించి చూస్తుంటే అర్జంట్ గా ఈ పుస్తకం కొనేయాలనిపిస్తుందండి. శ్రీవారికి ప్రేమలేఖ కథ వేరే రచయితా.. ఇంతవరకు జంధ్యాల గారేమో అనుకుంటున్నాను. స్క్రీన్‍ప్లే ట్రీట్ మెంట్ మాత్రం వారిదే అయి ఉండాలి.

  రిప్లయితొలగించు
 6. ఈ కథల టైటిల్స్ చాలా సరదాగా ఉన్నాయి, కనీసం ఆ సరదా కోసమన్నా చదవాలి. కానీ ఈ బుక్ నా దగ్గిర లేదే! పోనీ ఉన్నవేవో ముందు పూర్తి చేయమంటారా.

  రిప్లయితొలగించు
 7. బాగుంది.
  "అసలు ఈ జ్ఞాపకాన్ని కథగా మలచవచ్చు అన్న ఆలోచన ఎలా వచ్చి ఉంటుందబ్బా?"
  ఈ విషయంలో మీరు మాత్రం తక్కువ తిన్నారేమి? :) అన్నట్టు ఈ మధ్య బాల్యపు కథలు రాయడం తగ్గించారు మీరు.

  రిప్లయితొలగించు
 8. @ఆత్రేయ: ధన్యవాదాలండీ..
  @సవ్వడి: తప్పక చదవండి.. ధన్యవాదాలు.
  @రాధిక (నాని): చదివేసిన కథలే అయినా మళ్ళీ మళ్ళీ చదివినా బోర్ కొట్టవండీ.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 9. @స్ఫూర్తి: 'ధనుర్మాసం..' రాయాలనే అనుకుంటున్నానండీ.. ధన్యవాదాలు.
  @ఇందు: అయితే మీకు తప్పక నచ్చుతుందండీ.. ధన్యవాదాలు.
  @వేణూ శ్రీకాంత్: అప్పట్లో 'చతుర' లో వచ్చిన మినీ నవలని సినిమాగా మలిచారండీ.. మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం జంధ్యాల.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 10. @జయ: బహు చిన్న పుస్తకం అండీ, ఇట్టే చదివేయొచ్చు, ఒట్టు:):) ..ధన్యవాదాలు.
  @కొత్తపాళీ: అయ్యబాబోయ్...యెంత పెద్ద పోలిక!! మొత్తమ్మీద రాయడం తగ్గిందండీ నా బ్లాగులో, అందుకే జ్ఞాపకాలూ తగ్గాయి.. మొన్ననే 'ఉపోషం' ఉన్నాను కదా.. రాస్తాను.. ధన్యవాదాలు..

  రిప్లయితొలగించు