ఆదివారం, ఏప్రిల్ 18, 2010

ప్రస్థానం

ప్రపంచంలో ఏ సూత్రాలకీ, సిద్ధాంతాలకీ లొంగనిది ఒకటి ఉంది. అది మనిషి మనసు. ఆమనసు మనిషి చేత ఎన్నో పనులు చేయిస్తుంది, రెండోసారి ఆలోచించడానికి కూడా అవకాశం ఇవ్వకుండా. మనం చాలా పనులు చేసేశాక, ఇలా ఎందుకు చేశామా? అని ఆలోచించుకుంటామే తప్ప, చేసేటప్పుడు ఇలా చేయొచ్చా? అని ఆలోచించం. మనం చేసేదానికి ఫలితం ఏమిటి? అన్న ఆలోచన ఆ క్షణంలో రాదు. శర్వానంద్ కథానాయకుడిగా దేవ (కౌశిక్) కట్టా రూపొందించిన 'ప్రస్థానం' సినిమా కథ చర్చించిన పాయింట్ ఇది.

ఎన్నో ఆశలతో అమెరికా వెళ్ళే భారతీయ యువత అక్కడ ఎదుర్కొనే సమస్యలు ఎలాంటివి? అన్న అంశానికి ఓ ప్రేమ కథని జోడించి తీసిన దేవ తొలి సినిమా 'వెన్నెల' అప్పట్లో నాకు బాగా నచ్చింది. తన నుంచి వచ్చిన సినిమా అనగానే 'ప్రస్థానం' చూడాలి అనిపించింది. ఓ వైవిధ్య భరితమైన సినిమా ఇస్తాడన్న నా నమ్మకాన్ని దేవ వమ్ము చేయలేదు. రాజకీయాల్ని నేపధ్యంగా తీసుకుని రూపొందించిన ఈ ఫ్యామిలీ డ్రామా ఆద్యంతమూ ఆసక్తికరంగా సాగింది.


కథ రాయలసీమ తరహా ముఠా కక్షలతో ప్రారంభమై, విజయవాడ రాజకీయం మీదుగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, వారసత్వ పోరు, నాయకుల పోరాటాల్లో నలిగిపోయే కార్యకర్తలు లాంటి ఎన్నో అంశాలని స్పృశిస్తూ సాగింది. ఓ ముఠా నాయకుడి అనుచరుడు లోకనాథం నాయుడు (సాయికుమార్) ఆ నాయకుడి కొడుకు మిత్రా (శర్వానంద్) ల కథ ఇది. నాయకుడి మరణానంతరం అతని కోరిక మేరకు, లోకనాథం మిత్రా తల్లిని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళిద్దరికీ పుట్టిన బిడ్డ చిన్నా (సందీప్).

మిత్రా అక్క (సురేఖావాణి) తన తల్లి రెండో పెళ్లిని అంగీకరించదు. కానీ మిత్రా లోకనాధాన్నితన తండ్రిగా అంగీకరిస్తాడు. విజయవాడ వచ్చిన లోకనాథం రాజకీయాల్లో చేరి ఎమ్మెల్యే కావడమే కాదు, వరుసగా ఐదుసార్లు గెలుస్తాడు కూడా. అతని రాజకీయ/వ్యాపార శత్రువు బాసిరెడ్డి (జీవా), ఎమ్మెల్యే కావాలని ఆశపడే పార్టీ 'యువ' నేత బంగారు నాయుడు (జయప్రకాష్ రెడ్డి).

లోకనాథం మిత్రాని తన రాజకీయ వారసుడిగా చూడాలని అనుకుంటాడు. రక్తం పంచుకుని పుట్టిన కొడుకుగా అది తన హక్కు అంటాడు చిన్నా. నాయకత్వం కేవలం వారసత్వం కాదు, అందుకు తగ్గ లక్షణాలు ఉండాలంటాడు లోకనాథం. తల్లి నీడ తన ఇంటి మీద పడ్డానికి కూడా ఇష్ట పడదు మిత్రా అక్క. ఆ రెండిళ్ళ మధ్యా వారధి మిత్రా. లోకనాధానికీ, తన ఇద్దరు పిల్లలకీ బంధం బల పరచడానికే చిన్నాని కన్నానంటుంది తల్లి ఒక సందర్భంలో. మరోపక్క చిన్నా రాజకీయాల్లోకి రాడానికి ససేమిరా అంటాడు లోకనాథం.

ఫలితంగా చిన్నాకి మిత్రా మీద చిన్నప్పుడే పుట్టిన అసూయ ఒక్కసారిగా పెరిగి పెద్దదవుతుంది. సరిగ్గా అప్పుడే ఎన్నికలు రావడం, పార్టీ అధిష్ఠానం లోకనాధాన్ని కాదని బంగారు నాయుడికి టిక్కెట్ కేటాయించడం, ఇండిపెండెంట్ గా పోటీలో నిలబడ్డ లోకనాధానికి చిన్నా చేసిన ఒక పని కారణంగా జనంలో వ్యతిరేకత పెరగడం.. ఇలా ఊహించని వేగంతో కథ సాగిపోతుంది. సినిమా మొదటి సగం అత్యంత ఉత్కంఠ భరితంగా సాగగా, రెండో సగానికి వచ్చేసరికి కథనంలో బిగి కొద్దిగా సడలింది. ఊహాతీతమైన ముగింపు ఒక మంచి సినిమా చూసిన అనుభూతిని మిగిల్చింది.

రెండో సగం స్క్రీన్ ప్లే విషయంలో మరికొంచం జాగ్రత్త తీసుకోడం తో పాటు, మిత్రా, అతని తల్లి పాత్రల మీద దర్శకుడు మరికొంచం దృష్టి పెట్టి ఉండాల్సింది. మామూలుగా మొదలైన చిన్నా పాత్ర రెండో సగంలో అత్యంత కీలకం గా మారింది. సందీప్ ఈ పాత్రని సమర్ధవంతంగా పోషించి మంచి మార్కులు కొట్టేశాడు. 'వెన్నెల' లో శర్వానంద్ పోషించిన పాత్ర ఛాయలు కొన్ని కనిపించాయి చిన్నా పాత్రలో. హీరొయిన్ పాత్రలో నూతన నటి రూబీ పరివార్ బాగానే ఉన్నప్పటికీ ఆమెకి చేయడానికి ఏమీ లేదు.

శేఖర్ కమ్ముల 'ఆనంద్' నుంచి కాకెంగిలి చేసిన పెళ్ళిచూపుల సన్నివేశం లేకపోయినా కథకేమీ నష్టం లేదు.. కాకపొతే అక్కడ ఓ పాట పెట్టినట్టున్నారు. రెండు పాటలని సినిమా థియేటర్లో ప్రొజెక్టర్ ఆపరేటర్ ఎడిటింగ్ చేశాడని సినిమా చూశాక తెలిసింది. ఇంకా ఏమన్నా ఎడిట్ చేశాడేమో తెలీదు. అయినప్పటికీ సినిమా నిడివి రెండు గంటల నలభై నిమిషాలు. ఎక్కడా బోర్ కొట్టక పోవడం, వాచీ చూసుకోవాల్సిన అవసరం రాక పోవడం దర్శకుడి ప్రతిభే. (ఈ థియేటర్లలో ఎడిటింగ్ మీద 'మురారి' టైం లో అనుకుంటా కృష్ణవంశీ విరుచుకు పడ్డాడు, నిడివి మరీ పెరిగిపోతే ఆపరేటర్లు మాత్రం ఏం చేస్తారు పాపం!)


జాగ్రత్త తీసుకోవాల్సిన మరో విభాగం సంభాషణలు. దర్శకుడే స్వయంగా రాసుకున్నాడు. కొన్ని డైలాగులు బాగున్నప్పటికీ, చాలా చోట్ల నాటకీయత శృతి మించింది. సినిమా చూస్తున్నట్టు కాక, నాటకం చూస్తున్నట్టు అనిపించింది. బహుశా వాటిని పలికిన సాయికుమార్ గొంతుని దృష్టిలో పెట్టుకుని రాసి ఉంటారు ఆ సంభాషణలని. సాయికుమార్ కి చాలా రోజుల తర్వాత ఒక మంచి పాత్ర దొరికింది. బాగా చేశాడు కూడా. మిత్రాగా శర్వానంద్ పర్వాలేదు. తల్లిగా చేసిన పవిత్ర లోకేష్ ఇంకా బాగా చేసి ఉండొచ్చు. చిన్న పాత్రే అయినా సురేఖా వాణి బాగా చేసింది.

మహేష్ శంకర్ సంగీతం లో పాటల కన్నా రి-రికార్డింగ్ బాగుంది. ఆకట్టుకున్న మరో అంశం ఫొటోగ్రఫి. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ దృశ్యాలని బ్లాక్ అండ్ వైట్ లో చిత్రీకరించడం, కీలక దృశ్యాలని చిత్రించిన తీరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎడిటింగ్ బాగున్నప్పటికీ నిడివి విషయంలో దర్శకుడే జాగ్రత్త తీసుకుని ఉండాల్సింది. "మనిషి తను పండించిన పంటని తనే కోస్తాడు" అనే నోట్ తో ముగిసే ఈ 'ప్రస్థానం' వైవిద్యభరితమైన సినిమాలని ఇష్టపడే వారు తప్పక చూడాల్సిన సినిమా.

19 కామెంట్‌లు:

 1. శర్వానంద్ మంచి కధల్ని ఎన్నుకుంటున్నాడు
  తప్పక చూడాల్సిన సినిమా అయితే

  thanks for the update

  రిప్లయితొలగించు
 2. మొత్తానికి చూడదగ్గ సినిమా. సాయికుమార్ గొంతుకోసమైనా తప్పకుండా చూడాలి అనుకున్నా. మరి సినిమా టొరెంట్ దొరికేదాకా వేచిచూడాల్సిందే. నేనుండె చోట తెలుగుసినిమాలు రిలీజ్ కావు ప్చ్

  రిప్లయితొలగించు
 3. ప్రస్థానం సినిమా ట్రైలర్స్ చూసినప్పుడే తెగ ఇంప్రెస్ అయిపోయాను. దేవకట్టా తన రెండో సినిమాకే ఇటువంటి సంక్లిష్టమైన కధని ఎన్నుకున్నందుకు, దానిని బాగా తీయగలిగినందుకు అభినందనీయుడు. మూసకధల్ని కాకుండా ఇలాంటి వైవిధ్యమైన సినిమాని అందించినందుకు నిర్మాత రవి వల్లభనేని ని కూడా మెచ్చుకోవాలి. మీ సమీక్ష బావుంది.

  రిప్లయితొలగించు
 4. నాకు అర్ధం కాని విషయాలు ఈ రాజకీయాలు. నేనెందుకో గాని రాజకీయ అంశాల సినిమాలు ఎప్పుడూ ఎవొయిడ్ చేస్తాను. కాని మీరు ఈ కథ చెప్పిన విధానం నాకు తప్పక చూడాలనిపిస్తోంది. బెట్టింగ్ బంగార్రాజే ఇంకా చూడలేదు. దీని టర్న్ ఎప్పుడొస్తుందో మరి.

  రిప్లయితొలగించు
 5. వెన్నెల సినిమా తర్వాత ఆ యునిట్ సభ్యులు వెరే ఏ సినిమాలో ఉన్నా చూస్తూ వస్తున్నా, ముఖ్యంగా శర్వానంద్ అంటే మరింత ఇష్టం ఏర్పడింది, ఇక ప్రస్థానం సినిమా గురించి చెప్పాలి అంటే నాకు బాగ నచింది. సాయికుమార్ కి ఇంత మంచి ముఖ్యమయిన పాత్ర అని ఊహించలేదు, ఇక శర్వానంద్ ఇరగ తీసాడు ...బాగుంది. తప్పక చూడండి

  రిప్లయితొలగించు
 6. నాకు కూడా ఇలాంటి వైవిధ్యభరిత కథలు ఉన్న సినిమాలు చూడడం ఇంట్రస్ట్ అండి.మీ రివ్యూ చదివాక తప్ప కుండా చూడాలనిపిస్తుంది.

  రిప్లయితొలగించు
 7. అయితే ఈ సినిమా తప్పక చూడాల్సిందే అన్నమాట! చూడాలి నాకెప్పుడు చూసే అవకాశం వస్తుందో! :-)

  రిప్లయితొలగించు
 8. మీరు కూడా ఆమోదముద్ర వేశారంటే చూడక తప్పదు మరి

  రిప్లయితొలగించు
 9. @హరే కృష్ణ: అవునండీ.. వైవిధ్యం కోసం ప్రయత్నిస్తున్నాడు.. చూడండి తప్పకుండా.. ధన్యవాదాలు.
  @సుబ్రహ్మణ్య చైతన్య: త్వరలోనే మీరు చూడగలగాలని కోరుకుంటున్నానండీ.. ధన్యవాదాలు.
  @మురారి: దేవ సొంత సినిమా అనుకున్నానండీ.. కానీ నిర్మాత బయటి వ్యక్తేనట, ప్రొడక్షన్ డిలే వల్ల ఖర్చు బాగా పెరిగిపోయిందిట.. నిజంగా అతన్ని కూడా అభినందించాలి.. ధన్యవాదాలండీ..

  రిప్లయితొలగించు
 10. @జయ: రాజకీయాలని, ఫ్యామిలీ డ్రామాని కలిపి అందంగా అల్లిన సినిమా అండీ ఇది.. కొద్దిపాటి హింస ఉంటుంది కానీ మరీ మోతాదు మించి కాదు.. ధన్యవాదాలండీ..
  @కృష్ణ: కొత్త నటుడు సందీప్ సాయికుమార్, శర్వానంద్ లతో పోటీ పడ్డాడండీ.. వీళ్లిద్దరితో పాటు నాకు అతని నటన కూడా నచ్చేసింది.. ధన్యవాదాలు.
  @విశ్వనాధ్: తప్పక చూడండి.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 11. @మధురవాణి: ఆ అవకాశం త్వరలోనే రావాలని కోరుకుంటున్నానండీ.. ధన్యవాదాలు.
  @కొత్తపాళీ: తప్పకుండా చూడండి.. సినిమా చాలా భాగం విజయవాడ లోనూ, కూచిపూడి లోనూ తీశారు కూడా.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 12. ఇలాంటి సినిమా వుందనే తెలియదు నాకు. కొత్త సినిమానేనా?

  రిప్లయితొలగించు
 13. http://navatarangam.com/2010/04/write-review-win-money/
  ప్రస్థానం సమీక్ష వ్రాయండి. బహుమతులు గెలుచుకోండి

  రిప్లయితొలగించు
 14. @భావన: అవునండీ కొత్త సినిమానే.. ధన్యవాదాలు.
  @కత్తి మహేష్ కుమార్: ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 15. పుస్తకాలతో పాటు సినిమాల లిస్టు కూడా పెంచేస్తున్నారు మురళీ గారూ..

  రిప్లయితొలగించు
 16. @ప్రణీత స్వాతి: తగ్గించుకోడం మీ చేతుల్లోనే ఉందండీ :-) ..ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 17. 'ప్రస్థానం' సినిమాకి మీ రివ్యూ చాలా బావుంది ...రొటీన్ సినిమాల మధ్య ఇటువంటి సినిమా తీయటం సాహసమనే చెప్పాలి .శర్వానంద్ సినిమా అంటే కాస్త డిఫరెంట్ గా ఉంటుందన్న నమ్మకం వమ్ముకాలేదు. చిన్నా పాత్రకూడా అబ్బాయి బాగా చేశాడు శర్వానంద్ , సాయికుమార్ లకు తీసిపోకుండా ....సినిమా చూస్తున్నప్పుడే నేను ఊహించా మీనుండి ఈ రివ్యూ :)

  రిప్లయితొలగించు
 18. సినిమా ఈమద్యే చూసా, మనిసి తత్వం, మానవత్వం లను విడివిడిగా బాగా చెప్పారు.

  రిప్లయితొలగించు
 19. @లక్ష్మి రమేష్: ధన్యవాదాలండీ..

  రిప్లయితొలగించు