గురువారం, మార్చి 11, 2010

గోపాత్రుడు

అప్పటివరకూ ఒకే మాటగా ఏకతాటి మీద ఉన్న అలమండ గ్రామం మొత్తం ఆ పూట రెండు గ్రూపులుగా విడిపోయింది. ఓ గ్రూపులో అలమండ ఊరు మొత్తం. రెండో గ్రూపులో ఒకే ఒక్కడు. మచిలీపట్నం గోపాత్రుడు, ఆ ఊరి ఏకైక వైద్యుడు. అలా విడిపోడానికి కారణం ఒక తగువు, ఆ తగువు మొదలయ్యింది గోపాత్రుడి వల్లే.

తగువు జరిగింది రామ కోవెల దగ్గరున్న బొబ్బిలి రాజుగారి కిళ్ళీ కొట్టు దగ్గర. పట్నంలో చదువుకుంటున్న చింతలపాటి వారి చిన్న రాజు జాగ్రఫీ పాఠాల గురించి లెక్చరు దంచుతుంటే "బాబూ భూమి ఎలాగుంటుందోయ్" అని అడిగాడు గోపాత్రుడు. "గుండ్రంగా ఉంటుం"దన్నాడు చిన్నరాజు. "బల్లపరుపుగా" ఉంటుందని వాదించాడు గోపాత్రుడు. అంతే.. ఊరు మొత్తం అగ్గి ఫైరై పోయింది.

ఊరంతా ఒక మాట మీద ఉంటే బాగుంటుంది కాబట్టి, అభిప్రాయం మార్చుకోమన్నారు ఊరి వాళ్ళు. అభిప్రాయం మార్చుకోనని తెగేసి చెప్పాడు గోపాత్రుడు. ఊరి వాళ్ళ అభిప్రాయంతో తనకి ఎలాంటి పేచీ లేదన్నాడు. కానీ ఊరు ఊరుకోలేదు. గోపాత్రుడిని ఒంటరివాడిని చేసి నలుగురూ నాలుగు మాటలు అంటున్న వేళ, తోకూపుకుంటూ వచ్చింది వీరబొబ్బిలి.

గోపాత్రుడికి మద్దతు పలకడమే కాదు, "మూర్ఖ జనంతో జెట్టీకి దిగొద్ద"ని సలహా కూడా ఇచ్చింది వీరబొబ్బిలి. గోపాత్రుడు అసలెందుకు భూమి ఆకారం గురించి ఊరితో వాదనకి దిగాడు? అందుకు కారణం అతని తండ్రి పెదపాత్రుడు, వైద్యం రాకపోయినా ఆ ఊళ్ళో వైద్యుడిగా చలామణీ అయిన వాడు. తన చివరి క్షణాల్లో కొడుకుని పిలిచి పెదపాత్రుడు అతని చెవిలో చెప్పిన మాటల్లో ముఖ్యమైనది "ఎప్పుడూ భూవి గుండ్రంగా ఉందని ఒప్పుకోవద్ద"ని.

"దిడ్డీ పెట్టె లో ఉన్న పుస్తకాలు చదవక పోయినా పర్వాలేదు, నీకు వైద్యం వచ్చని జనాన్ని నమ్మించ గలిగితే నువ్వు వైద్యుడిగా చెలామణి అయిపోవచ్చు" అని కూడా చెబుతాడు పెద పాత్రుడు. అందుకే, ఊరు ఊరంతా గోపాత్రుడిని "ఎవరొచ్చి చెబితే భూమి గుండ్రంగా ఉందని నమ్ముతావు?" అని బతిమాలి నప్పుడు ఏ మాత్రం తొణక్కుండా "మా నాయన వచ్చి చెబితే" నమ్ముతానన్నాడు.



'సాక్షి' కోసం అన్వర్ గారు గీసిన గోపాత్రుడి చిత్రం
వీరబొబ్బిలిని పోషిస్తున్న ఉప్పలపాటి ఫకీర్రాజుకి గోపాత్రుడితో మంచి స్నేహం. ఇద్దరూ కలిసి ఊరి జనానికి వైద్యం చేస్తూ ఉంటారు. అదిగో ఆ ఫకీర్రాజు కూడా, జరిగిన గొడవ సావధానంగా విని, భూమాత ఆకారం గురించి తన అభిప్రాయం వెంటనే చెప్పకుండా "రాజులేవన్నారోయ్.. వెలమలేవన్నారోయ్.." అని వాకబు చేసి, ఊరి వాళ్ళతో తనకి కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి, భూవి గుండ్రంగానే ఉందని నమ్ముతున్నానని చెప్పేస్తాడు.

అప్పుడు కూడా పాత్రుడు తొణకడు, బెణకడు. తన అభిప్రాయం ఏమాత్రం మార్చుకోడు. ఆవేల్టి సాయంత్రానికే అనూహ్యంగా పాత్రుడికి మద్దతు పలుకుతాడు ఫకీర్రాజు. అతని వెంటే అలమండ రాజులు, కొందరు ఇతర కులాల వాళ్ళు. ఒక్క వెలమలు మాత్రం భూమి గుండ్రంగా ఉందంటారు. సమితి ప్రెసిడెంట్ లగుడు ముత్తేలు నాయుడు వాళ్లకి నాయకత్వం. నాయుడితో పనులున్న వాళ్ళు అతని పంచన చేరతారు.

ముత్తేల నాయుడంటే పడని మరో వెలమ నాయకుడు రొంగలి బుజ్జి మాత్రం రాజులకి మద్దతు ఇస్తాడు. ఎప్పటికైనా సమితి ప్రెసిడెంట్ కావాలని బుజ్జి ఆశ. భూమాత ఆకారం విషయమై అలమండ రాజకీయాలు పూట పూటకీ మారిపోతూ ఉంటాయి. రాజులు-వెలమల గ్రూపుల్లో ఇతర కులాల వాళ్ళు అటూ ఇటూ మారుతూ ఉంటారు. చేతి వృత్తుల వాళ్ళెవరూ భూవి గుండ్రంగా ఉందని వాదించే వాళ్లకి పనులు చేయరాదని పెద రాజులు ఆర్డరేస్తారు.

భూవి గుండ్రంగా ఉందన్న వాళ్ళ గడ్డాలు మాసిపోతాయి, ఇళ్ళలో మాసిన బట్టలు మోపులు కడతాయి. అయినా వాళ్ళెవరూ తమ అభిప్రాయాలు మార్చుకోరు. చివరికి ఊరి బయట రావి చెట్టుకింద రెండు గ్రూపులూ యుద్ధం చేసుకుని ఎవరి అభిప్రాయం గొప్పదో తేల్చేసుకోవాలని నిర్ణయానికి వస్తాయి. యుద్ధం సగంలో ఉండగానే జామి పోలీసులు వచ్చి రెండు గ్రూపులనీ అరెస్టు చేయడం, మేస్ట్రేటు గంగాధరం గారు గోపాత్రుడిని మెచ్చుకోవడం తర్వాతి కథ.

కే.ఎన్.వై. పతంజలి రచనల్లో 'గోపాత్రుడు' ఒక గొప్ప రచన. ఎందుచేత గొప్పదో నవల చదివి తెలుసుకోవాల్సిందే. గోపాత్రుడు, అతన్ని సమర్ధించే, వ్యతిరేకించే జనం మనకి అన్ని చోట్లా కనిపిస్తారు. పతంజలి మనకి దూరమై నేటికి ఏడాది పూర్తయ్యింది.

14 కామెంట్‌లు:

  1. మరోసారి మా "బొబ్బిలి "పౌరుషం గుర్తు చేసారండీ .అన్నట్లు నేను బొబ్బిలి ఒకటే ,యిట్టె సర్దుకుపోతాం అదే దులిపెసుకుంటాం -:):)మా పౌరుషం అట్టాంటి ఇట్టాన్టిది కాదాయె .

    రిప్లయితొలగించండి
  2. ఇంత చక్కగా ఎలా చెప్పగలరు మీరు?

    రిప్లయితొలగించండి
  3. ఈ నవలికలోని సెటైరుని అర్ధం చేసుకోడం అంత సులభం కాదు. పైపైన మనకి కితకితలు పెట్టి నవ్వు పుట్టించే హాస్యంతోనే సర్దుకు పోతారు బహుశా 90% పాఠకులు. మన సమాజంలోని మూర్ఖత్వాన్ని, రాజకీయాల్లోని డొల్లతనాన్ని, మనుషుల మధ్య సంబంధాల్లోని వ్యాపార ఆలోచనల్నీ రసం మొత్తం ఈ రచనలో పిండేశారు పతంజలి.
    చక్కటి పరిచయం. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. తన ఒక్కడికే అబ్బిన వ్యంగ్య రచనా శైలితో మనుషుల మనసుల మధ్యనున్న అనేక ఖాళీలను ఎత్తిచూపిన మహా రచయిత పతంజలి గారికి మీ నివాళి చాలా బాగుంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. పతంజలి గారి జ్ఞాపకార్ధం "గోపాత్రుడు" పరిచయం బావుందండీ ....ఆయనకు నివాళులు !

    రిప్లయితొలగించండి
  6. బాగుందండీ పరిచయం. చాలా టపాలున్నాయి...అన్నింటికీ రాయలేను కానీ కొన్నింటికి వ్యాఖ్యలు రాసానండీ..:)

    రిప్లయితొలగించండి
  7. @చిన్ని: వీర బొబ్బిలి ఎప్పుడూ తనని మాటన్న వాడి విలువ యెంత అని ఆలోచిస్తుందండీ.. అనర్హుల చర్యలకి బాధ పడక్కర్లేదని కూడా అనుకుంటుంది.. నిజంగా చాలానే నేర్చుకోవాలి తన నుంచి.. ధన్యవాదాలు.
    @సృజన: పతంజలి రాసిన నవలని గురించి ఇక్కడ రాశానండీ.. మీకు నచ్చితే ఆ గొప్పదనం పతంజలి గారిదే.. ధన్యవాదాలు.
    @కొత్తపాళీ: 'బట్టలిప్పి నిలబెట్టడం' అంటారు చూడండి.. అలా ఉంటుంది.. నిజానికి ఇది పంచదార కోటింగ్ వేసిన చేదు మాత్ర.. హాస్య చతురతకీ, వ్యంగ్యానికీ నవ్వుకున్నా కొంచమైనా ఆలోచించకుండా ఉండరని అనిపిస్తుందండీ నాకు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. @కేక్యూబ్ వర్మ: "తన ఒక్కడికే అబ్బిన వ్యంగ్య రచనా శైలితో మనుషుల మనసుల మధ్యనున్న అనేక ఖాళీలను ఎత్తిచూపిన మహా రచయిత పతంజలి.." చాలా బాగా చెప్పారండీ.. ధన్యవాదాలు.
    @పరిమళం: ధన్యవాదాలండీ..
    @తృష్ణ: ముందుగా మీరు మీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి.. పూర్తిగా కోలుకున్నాక అప్పుడు చదువుదురు గాని బ్లాగులూ అవీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. పతంజలి గారికి నా నివాళి

    పతంజలి గారు పోయి అపుడే ఏడాది అయిపోయిందా!
    సరిగ్గా ఏడాది క్రితం మేం నర్సీపట్నం దగ్గర గినుతూరు పెళ్ళికి వెళ్ళాం. మా వెనకే కూర్చున్న ఇదరు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నారు . పతంజలి పేరు విని గిర్రున వెనక్కి తిరిగాను. పతంజలి అంటే....వేటకధలు రాసారు ఆయనేకదండీ ( అప్పటికి ఆయన మామూలు రచయిత గానే తెలుసు) అవునమ్మా.......సాక్షి లో పనిచేస్తున్నాడు . ఎంత గొప్పగా రాసేవోడో ....అంటూ ఇంకా ఏదేదో చెప్పారు.
    చిత్రంగా ఆయన ఈ భూమ్మీంచి వెళ్ళిపోయిన ఆ రోజుల్లోనే నాకు ఆయన గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. ఆయన రచనలన్నీ చదవాలనే అభిలాష పెరిగింది. ఈ మధ్యనే " పతంజలి భాష్యం " చదివాను. చురకత్తుల్లా వున్నాయి ఒక్కో వ్యాసమూనూ. ఇవన్నీ వివిధ దినపత్రికల్లో వచ్చినవే. రాజుల లోగిళ్ళు అనే అసంపూర్తి నవల(బంధువుల ద్వారా ) ఎక్కడైనా దొరుకుతుందేమో అని ప్రయత్నాలు మొదలుపెట్టాను. నా చిన్నతనమంతా అటువంటి ఓ లోగిలి లోనే గడిచిందేమో ఆయన ఏం రాసుంటారో అని ఉబలాటం .
    మురళీ గారూ ఆ మహా రచయితని ఇలా జ్ఞాపకం చేసుకోవాల్సిరావటం బాధగా వుందండీ

    రిప్లయితొలగించండి
  10. పతంజలి గారి రచనా సర్వస్వం చెన్నయ్ లో శరవేగంగా ముద్రితమవుతుందనీ గతంలో పుస్తకరూపంలో రానివీ అందులో పొందుపరుస్తున్నారని సమాచారం.అయితే ఆ సంకలకర్తలు ఎవరు,ఎప్పుడు విడుదల అవుతుంది అన్నది ప్రస్తుతానికి నాకు తెలీదు.
    ఆయన కన్నుమూసిన,ఆయన పాత్రికేయజీవితం మొదలుపెట్టిన,ఆయన కుటుంబం నివాసముంటున్న,ఆయన కన్నుమూసిన విశాఖపట్నం లో నిన్న ఆయన ప్రధమ వర్ధంతి సందర్భంగా చాలా కార్యక్రమాలు జరుగుతాయని ఊహించి భంగపడ్డాను.
    @లలిత గారు,
    మీరన్న ఊరి పేరు గిడుతూరు అండి
    @మురళి గారు,ప్రతిసారి బాగా రాసారు అనను :)

    రిప్లయితొలగించండి
  11. @లలిత: 'రాజుల లోగిళ్ళు' నేను సీరియల్ గా వచ్చినప్పుడు చదవ గలిగానండీ.. చాలా పెద్ద నవల ప్లాన్ చేశారట.. కొంచం మాత్రమే రాయగలిగారు. పూర్తి చేయలేక పోయారు, మన దురదృష్టం. 'రాజుగోరు' 'వీరబొబ్బిలి' 'గోపాత్రుడు' 'పిలక తిరుగుడు పువ్వు' 'అప్పన్న సర్దార్' 'మేరా భారత్ మహాన్' 'ఖాకీ వనం' 'పెంపుడు జంతువులు' .. ప్రతి నవలా గొప్పదే.. తప్పక చదవండి.. ధన్యవాదాలు.
    @రాజేంద్రకుమార్ దేవరపల్లి: సాక్షి వాళ్ళ తీరు కూడా నన్ను నిరాశ పరిచిందండీ.. గత వారం సాహిత్యం పేజీలో అదృష్ట దీపక్ వ్యాసం, మొన్న వేట కథల్లోని ఒక కథా.. అంతే.. విశాఖ లో కార్యక్రమాలు జరుగుతాయని నేనూ అనుకున్నానండి.. కారా మేష్టారు వాళ్ళైనా ఏదన్నా కార్యక్రమం చేశారేమో అని పేపర్లు వెతికాను :( ...ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  12. :-) :-) అందరు కామెంటేసారు, ప్రత్యేకం గా ఇంకా చెప్పేందుకేమి లేదు చిన్న చిరునవ్వు తో, చిక్కటి భావం తో....ఆయన రచనలలోని హాస్యాన్ని, సమాజపు బోలుతనాన్ని తలుచుకుని ముందు నవ్వి, ఆనక గుండెలో ముల్లై గుచ్చుతుంటే... తలచుకుని మన అజ్నానానికి ఒక నిట్టూర్పు విడవటం తప్ప.

    రిప్లయితొలగించండి
  13. @భావన: "తలచుకుని మన అజ్నానానికి ఒక నిట్టూర్పు విడవటం తప్ప.." ..నిజం చెప్పారు.. ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  14. మంచి పరిచయం .పతంజలి గారి ప్రతి రచన ఎంతో బాగుంటుంది..దేనికదే ..గోపాత్రుడు చక్కని పాత్ర .మీరు చాలా బాగా వివరించారు.

    రిప్లయితొలగించండి