కాలం నిరంతర స్రోతస్విని. ఎక్కడో ఒకచోట ఆగి 
వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు కాలం గడిచే కొద్దీ చోటుచేసుకున్న మార్పులు 
ఒక్కొక్కటిగా తెలిసివస్తాయి. 'ఇన్ని దాటుకుని వచ్చాం కదా' అన్న ఆశ్చర్యం, 
ఆనందం లాంటి భావాలెన్నో కలుగుతాయి. పదిహేడేళ్ల క్రితం కేలండర్లో మరో 
వందేళ్లు పూర్తయిన సందర్భంగా చాలా హడావిడే జరిగింది. ఇరవయ్యో శతాబ్దం 
ముగిసి ఇరవై ఒకటో శతాబ్దం రావడాన్ని వేడుకగా జరిపింది మన మీడియా. అదే 
సమయంలో వందేళ్ల కాలంలో తెలుగు సమాజంలో స్త్రీ జీవితంలో వచ్చిన మార్పును 
సునిశితంగా చిత్రిస్తూ మాలతీ చందూర్  రాసిన నవల 'శతాబ్ది సూరీడు.'
మరో
 ఐదేళ్ల కాలంలో ఇరవయ్యో శతాబ్దం ఆరంభం అవుతుందనగా ఏడేళ్ల సూరమ్మ 
పెళ్లికూతురయ్యింది. పట్టు పరికిణీ, పూలజెడా, ఒంటినిండా నగలూ, ఇంటినిండా 
బంధువులూ.. పెళ్లికూడా ఒక ఆటే అనుకుంది సూరమ్మ. వైభవంగా పెళ్లి జరిగింది. 
అటు తర్వాత, పుట్టింట్లో ఆమె ఆటపాటలు మామూలే. ఉన్నట్టుండి ఒకరోజు అత్తింటి 
నుంచి కబురొచ్చింది. సూరమ్మ తల్లిగారు బావురుమంది. అమ్మెందుకేడుస్తోందో 
అర్ధం కాలేదా అమ్మాయికి. కొత్త పెళ్ళికొడుకు అనారోగ్యం చేసి హఠాత్తుగా 
చనిపోయాడన్నది ఆ కబురు. వైభవంగా పెళ్ళిచేసిన కుటుంబ సభ్యులే, ఓ 
తెల్లవారుజామున వితంతువుని చేశారు సూరమ్మని. 
గంభీరమైన వితంతు
 జీవితం గడపడం, ఇంటెడు చాకిరీ చేసి ఒక్కపూట మాత్రమే భోజనం చేయడం, ఎవ్వరికీ 
ఎదురు పడకుండా తనపనులు చేసుకుంటూ, అవసరానికి మాత్రం అడ్డం పడుతూ రోజులు 
గడపడం మొదట్లో చాలా కష్టమే అయినా నెమ్మదిగా అలవాటు చేసుకుంది సూరీడుగా 
మారిన సూరమ్మ. ఆమె వ్యక్తురాలైన  కొన్నాళ్ళకి అత్తింటి నుంచి కబురు, ఆమెని 
అత్తింటికి పంపమని. ఆమె ఒక బిడ్డని దత్తత చేసుకుంటే మనవణ్ణి చూసుకుంటూ చివరి 
రోజులు గడపాలనుకుంటున్నారు అత్తమామలు. పుట్టింటి నిరాదరణ అనుభవంలోకి వచ్చిన
 సూరీడు, అత్తింటికి ప్రయాణం అయ్యింది. అక్కడి చేదు అనుభవాల కారణంగా, 
పుట్టిల్లు వెతుక్కుంటూ వెనక్కి రావాల్సి వచ్చింది. అయితే, అత్తింటి 
వారినుంచి ఆమెకి 'మనోవర్తి' మాత్రం వచ్చింది. 
వీరేశలింగం 
గారి వితంతు పునర్వివాహం ఊపందుకున్న ఆ రోజుల్లోనే, సూరీడుకి మళ్ళీ పెళ్లి 
చేయాలని ప్రతిపాదించాడు ఆమె చిన్నన్నయ్య. ఆ ఉమ్మడి కుటుంబంలో అతని మాటని 
సమర్ధించిన వాళ్ళు ఒక్కరూ లేరు. ఫలితం, ఎప్పటిలాగే సూరీడుకి గానుగెద్దు 
జీవితం. వదినలు కాపురాలకి రావడం, పురుళ్ళు, పుణ్యాలు, అక్కల పిల్లల 
పెళ్లిళ్లు, శుభకార్యాలు.. ఎక్కడ మావిడి తోరణం కట్టినా పెరటి దోవన సూరీడు 
వెళ్లాల్సిందే.. పనులన్నీ చక్కబెట్టి రావాల్సిందే. శుభాలకి మాత్రమే కాదు, 
అశుభాలప్పుడూ ఆమే వెళ్లి వండి వార్చాలి. రోజులు గడుస్తూ ఉండగా, ఆమె 
చిన్నక్క కూతురు ఓ ఆడబిడ్డని కని, పురిట్లోనే కన్నుముయ్యడంతో ఆ చంటిబిడ్డని
 చూసేవాళ్ళు ఎవరూ లేకుండా పోతారు. 
ఎవ్వరూ ఊహించని విధంగా ఆ 
పిల్లని తాను పెంచుకుంటాను  అని చెప్పి, అందరినీ ఒప్పించి, తనతో పాటు 
తెచ్చేసుకుంటుంది సూరీడు. పిల్లకి కమల అని పేరుపెట్టి, అల్లారుముద్దుగా 
పెంచడం ఆరంభిస్తుంది. చిన్నన్నగారు ఆమెకి కొంత సాయంగా నిలబడతాడు. మనోవర్తి 
ఆదాయం నిలబెట్టి ఆమెకో ఇల్లు ఏర్పాటు చేస్తాడు. 'పిల్లని చూసుకోవాలి' అని 
చెప్పి తనకి ఇష్టంలేని కొన్ని పనుల్ని తప్పించుకోవడం మొదలు పెడుతుంది 
సూరీడు. బంధువుల మూతివిరుపులు ఏమాత్రం పట్టించుకోదు.  చదువు ఎంత ముఖ్యమో 
అప్పటికే గ్రహించిన సూరీడు, కమలని బడికి పంపి చదివిస్తుంది. కమలకి పెళ్లీడు
 వచ్చేసరికి, ఆమె అమ్మమ్మ రంగప్రవేశం చేస్తుంది. కమలని తన కోడలిగా 
చేసుకుంటానని చెప్పి, సూరీడుని ఒప్పిస్తుంది. 
కమల సంతోషంగా 
గడపాలని సూరీడు ఎన్నో కలలు కన్నప్పటికీ, పద్మ పుట్టిన తర్వాత ఆమె వైవాహిక 
జీవితం విచ్చిన్నం అవుతుంది. చదువుని కొనసాగించి, ఉద్యోగంలో చేరి, పద్మని 
పెంచుతూ, సూరీడునే కాక, తన పంచనే చేరిన చిన్నమ్మమ్మ (అత్తగారు కూడా) 
ఆదరిస్తూ రోజులు గడుపుతూ ఉంటుంది కమల. పద్మ పెంపకంలో, సూరీడు, కమలల 
అనుభవాలు ఏ మేరకు ఉపయోగ పడ్డాయి? పద్మకూతురు సౌజన్య పెద్ద చదువులు 
చదవడానికి విదేశాలు వెళ్ళడానికి సూరీడు మనోవర్తి సొమ్ము ఎలా ఉపయోగ పడింది? 
అన్న ప్రశ్నలకి జవాబులతో పాటు, నాలుగు తరాల కాలంలో తెలుగు మధ్యతరగతి 
కుటుంబాల్లో స్త్రీల జీవితాలలో వచ్చిన మార్పులని వివరిస్తూ ముగుస్తుంది 
'శతాబ్ది సూరీడు' నవల. బరువైన, సుదీర్ఘమైన కథని కేవలం 192 పేజీల్లో 
చెప్పేయడం మాలతీ చందూర్ కథన కౌశలానికి నిదర్శనం. (క్వాలిటీ ప్రచురణలు, వెల 
రూ. 70, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు). 

 
