మన పుట్టుక మన చేతిలో ఉండదు.. మన ప్రమేయం ఉండదు.. మన
నిర్ణయాల ప్రకారం ఉండదు. మనం కారణం కాని విషయాలని గురించి గర్వ పడడం
అనవసరం. కానీ, కోనసీమనీ గోదారినీ తలచుకున్నప్పుడల్లా ఏదో తెలియని ఉద్వేగం.
ఓవైపు గలగలా గోదారి, మరోవైపు గంభీర కెరటాల సముద్రం.. చుట్టూ ఆకుపచ్చని
గొడుగులు పాతినట్టుగా ఆకాశంలో పచ్చాపచ్చని గూళ్ళు అల్లే కొబ్బరి చెట్లు..
మధ్య మధ్యలో అరటి చెట్లు, అల్లంత దూరాన సరిహద్దులు గీసే తాడిచెట్లు,
పచ్చని పొలాలకి పాపిడి తీసినట్టుండే గట్లు.. వాటి వెంబడి పూల మొక్కలూ, పళ్ళ
చెట్లూ.. ఎంత భాష సరిపోతుంది కోనసీమని వర్ణించడానికి?!!
ఊహతెలిసినప్పటినుంచీ
తెలిసిన ప్రపంచం అంతా సప్తవర్ణ శోభితమే. నిద్రలేస్తూనే వీధిలోకి వస్తే
ఎదురుగా చెరువు మీద ఉదయించే సూర్యుడు, తల పక్కకి తిప్పితే ఎత్తైన ధ్వజ
స్థంభం అంతకన్నా ఎత్తైన గోపురంతో గుడీ, అటుపై ఎటు పక్కకి తలతిప్పినా
దట్టమైన కొబ్బరి అడవి. పెరట్లో అరటి చెట్లు, దబ్బ చెట్టు, కూరగాయ మడులు..
దాటి కొంచం ముందుకు వెడితే కొబ్బరి తోట. ఓ పక్క మావిడి చెట్టు, మరోపక్క వేప
చెట్టు, ఇంకోపక్క వెలగచెట్టు. సరిహద్దులో పాముపుట్టని ఆనుకుని సంపెంగ పొద,
అనాస పొదలూ. ఆవెంటే కనకాంబరాలలాంటి ఆకుపచ్చని పూలు పూసే పేరుతెలియని
మొక్కలు.
అటుగా ఓ అడుగేస్తే పక్క వాళ్ళ తోటలో ఈత చెట్లూ, నేరేడు
చెట్లూ. కాకులు, చిలకలు, పాలపిట్టలతో పాటు పేరు తెలియని పక్షులెన్నో. ఇక
సీతాకోకచిలుకలైతే ఏరకం పూలమీద ఏ చిలుక వాలుతుందో నిద్రలో లేపినా చెప్పేసేంత
జ్ఞానం!! పసుపురంగు కోల రెక్కలుండే సీతాకోకచిలుకలైతే ఎలాంటి పూల మీదైనా
వాలేస్తాయి. అదే నలుపు మీద తెలుపు, ఎరుపు చుక్కలుండే పెద్ద రెక్కలవైతే
మందారాలని విడిచి పక్కకి చూడవు. నల్లరెక్కల మీద తెల్లని చారలుండే బుజ్జి
పిట్టలు సీతాఫలాలని బతకనివ్వవు. పిందె పండుగా మారుతూ ఉండగానే ఈతాకు బుట్టలు
కట్టేయాల్సిందే.
దొండ పాదుకి రోజూ కోసినా కాయలు కాస్తూనే ఉంటాయి.
పొట్ల పాదు పూత నిలబడగానే చిన్న చిన్న రాళ్ళకి పురికొస తాళ్ళు కట్టి సిద్ధం
పెట్టుకోవాలి, కాయలు వంకర్లు తిరిగిపోకుండా కాసుకోడం కోసం. శీతాకాలపు
ఉదయాలు, వేసవి కాలపు సాయంత్రాలు, వర్షాకాలపు మధ్యాహ్నాలు మరింత అందంగా ఉండే
ప్రపంచం కదూ అదీ. మంచు తెరల్ని చీల్చుకుంటూ పచ్చని చెట్ల మీద ఉదయించే
సూర్యుడూ, రోజంతా గాడ్పుల తర్వాత ఒక్కసారిగా చల్లబడే సాయంత్రాలూ,
ముసుగేసుకుని పడుకోవాలనిపించే ముసురేసిన మధ్యాహ్నాలూ ఎక్కడైనా బావుంటాయి
కానీ, కోనసీమలో అయితే అద్భుతంగా ఉంటాయి.
మొదటిసారి గోదారిని
చూసిన అనుభవం ఎప్పటికీ తడి ఆరని ఓ జ్ఞాపకం. సైకిలు మీద నాన్నతో కలిసి
ఏటిగట్టు మీద ప్రయాణం. నాన్న సైకిలు తొక్కుతూ ఉంటే చెరువు కన్నా ఎన్నో
రెట్లు పెద్దగా ఉన్న గోదారిని కళ్ళు విప్పార్చుకుని గోదారిని చూడడం బాల్య
జ్ఞాపకం అయితే, భాద్రపద మాసపు వరద గోదారిమీద వెన్నెల రాత్రులలో చేసిన పడవ
ప్రయాణాలు యవ్వనాన్ని వెలిగించాయని చెప్పుకోడానికి అభ్యంతరం ఏముంటుంది? వరద
పోటెత్తుతూ, క్షణ క్షణానికీ గోదారొచ్చేస్తూ ఉంటే నీళ్ళ మీద బరువుగా కదిలే
పడవ. పైన మబ్బుల్లేని ఆకాశంలో ఇట్టిట్టే కళలు పెంచుకునే శుక్ల పక్షపు
చంద్రుడు. అప్పుడు కలిగే అనుభూతికి పేరు పెట్టడం ఎవరి తరం??
వినగలగాలే
కానీ గోదారి ఎన్నెన్ని కబుర్లు చెబుతుందో. ఎంత చక్కని వక్తో, అంతకి మించిన
శ్రోత కూడా. చెప్పడం చేతనవ్వాలి ఎటొచ్చీ.. చూడ్డానికి ఎంత ప్రశాంత
గంభీరంగా ఉంటుందో, అంతకు అనేకరెట్లు లోతైన నది కదా మరి. గోదారితో ప్రేమ
పుట్టుకతో వచ్చేదని చెప్పడం సాహసం.. కానీ, ఒక్కసారి మొదలయ్యిందో.. కడవరకూ
సాగాల్సిందే ఇక. వినగలగాలే కానీ గోదారి గలగలల్లో సంగీతం వినిపిస్తుంది..
చూడగలిగితే సాహిత్యం కనిపిస్తుంది. ఓ సంగీత రూపకం లానో, గేయ కావ్యంలాగో
అనిపిస్తుంది. చూసే కళ్ళకి గోదారి నడకల్లో నాట్యం కనిపిస్తుంది. ఒంపుసొంపుల
గోదారి ఏ నాట్యకత్తెకి తక్కువ?
కోనసీమనుంచీ, గోదారి నుంచీ సెలవు
తీసుకోవాల్సి రావడం జన్మానికెల్లా అతిపెద్ద శాపం. ఆ విరామం తాత్కాలికమే
కావొచ్చు కానీ దూరంగా ఉండాల్సి రావడం ఎంత కష్టం?! రేపేవిటో తెలియని బతుకని
అనుక్షణం నిరూపితమవుతున్నప్పుడు రేపటి మీద అంత పెద్ద ఆశ పెట్టుకోవడం
సాధ్యమేనా? ఎప్పటి పుణ్యమో కోనసీమకీ గోదారికీ దగ్గర చేసి, పండకుండా
మిగిలిపోయిన పాపమేదో అంతలోనే దూరం చేసేసి ఉంటుందని సరిపెట్టుకోడాన్ని
మించిన జోలపాట ఉంటుందా ఈ జీవితానికి???
(Pics courtesy: Google)
శీతాకాలపు ఉదయాలూ,వేసవికాలపు సాయంత్రాలూ, వర్షాకాలపు మధ్యాహ్నాలూ ఎక్కడయినా బావుంటాయి,అదే కోనసీమలో అయితే "అద్భుతంగా" ఉంటాయి
రిప్లయితొలగించండిమొదటిసారి గోదారిని చూసిన అనుభవం ఎప్పటికీ తడి ఆరని ఓ జ్ఞాపకం
సామీ బింగో
ఎంతో పుణ్యం చేసికుంటేనో గోదారమ్మ ఒడిలో పుట్టిపెరగటంకదా. నేను మీపోస్టుచదవటమొదలుపెట్టగానే అనుకున్నా నామాట. బోగభాగ్యాలు,అష్ట ఐశ్వర్యాలకోసంకాదుమరుజన్మ ఆతల్లి గోదావరి అందాలు,చక్కని ప్రకృతినడుమ జీవిస్తేచాలు జన్మధన్యం.ఆ అందాలకు దూరంకావడం నిజంగా శాపమే. గోదారమ్మతోఉన్న మీ అనుబంధాని చాల టచ్చింగా చెప్పారు. అవే మనంకోల్పోతున్న సిరిసంపదలు అనిపించింది.ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిపుట్టిపెరిగిన ఊరు స్వర్గాన్ని మించినదన్నాడు కదండీ రాముడు. అందరికంటే గోదారి ఒడ్డున పుట్టిన వాళ్ళలోను, ఊళ్ళలోనూ ఈ మమకారం రవంత ఎక్కువే ఉండడం ఆ నీళ్ళ మహత్యమేమో! :)
రిప్లయితొలగించండికోనసీమంత beautiful post.
కళ్ళల్లో నీళ్ళు వచ్చాయండి..
రిప్లయితొలగించండిఎంతైనా కోనసీమ నించి దూరమైన గోదారి బిడ్డను కదూ
రాజమంద్రం గోదావరి ఇసుక ర్యాంపుల దగ్గర పడవలెక్కి కూచుని దగ్గరగా ఉన్న మూడు బ్రిడ్జీలనీ దూరంగా ఉన్న ధవళేశ్వరం బ్యారేజీ ఛాయల్నీ పైన ఆకాశంలో వెన్నెలముద్దనీ చూస్తూ ఆవకాయ నుంచి అమెరికా దాకా ఎన్నెన్నో కబుర్లు చెప్పుకున్న స్నేహ పరీమళాలు శ్రీపాదవారి గులాబి అత్తరులా శాశ్వతంగా మిగిలిపోయాయి.
రిప్లయితొలగించండిఅప్పుడప్పుడే సమైక్యం గానం వదులుకుంటూ ప్రత్యేక రాగం అందుకుంటున్న ఓ పెద్దాయన గోదావరంటే మీ తూగోజీ వాళ్ళ సొత్తేనా, మా నిజామాబాదు వాళ్ళకీ ప్రాణమే అంటూ పక్కనే ఉన్న ఆ జిల్లా బిడ్డణ్ణి ఇరికించబోతే ఆ పిలగాడూ నేనూ రెండురకాలుగా ఇబ్బంది పడ్డాం. కానీ మా భావోద్వేగోదావరి గొప్పే అని గొణుక్కున్నాననుకోండి.
గోదావరి నీళ్ళు తాగిన ప్రతీఒక్కడూ కవిత్వం చెబుతాడట... ఎంత మాదకత తలకెక్కినా గోదావరితో అనుబంధాన్ని కవిత్వీకరించడం నిజంగా సాధ్యమేనా అని నాకెప్పుడూ అనుమానమే.
కొనసీమలో మూణ్ణాలుగుసార్లు మాత్రం అడుగుపెట్టి మైమరచిపోవడం తప్ప పూర్తిస్థాయి అనుబంధం లేదు నాకు. అయినా ఎక్కడిదయినా నా వరకూ నాకు గోదావరి తరవాతే ఏదయినా... (అందుకే దాదాపు మీ గోదావరి రెండు పేరాలంతగానూ వ్యాఖ్య)
Murali garu..awesome post..thank you
రిప్లయితొలగించండితల్లి గోదావరి తో మీకు ఉన్న మధురమైన జ్ఞాపకాలను మరియు అనుభందాన్ని చాలా బాగా చెప్పారు...... ధన్యవాదములు......
రిప్లయితొలగించండిమురళి గారు, ఈ మధ్య బ్లాగులకీ కామెంటులకీ దూరంగా ఉంటున్నా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల, కానీ మీ టపా మాత్రం నన్ను కామెంటేలాగ నిర్బంధించేసిందండీ. ఒక్కసారి తొంభయ్యవ దశకంలోకి తీసుకెళ్ళిపోయారు. నేను పుట్తి పెరిగింది కోనసీమలో కాదు కానీ మూలాలు అక్కడే ఉండటంతో ఎన్ని వేసంగులు గోదారమ్మ గలగల్లల్లో గడిచిపోయాయో. గోదావరి ఎక్స్ ప్రెస్ తెల్లవారకట్ల రాజనండ్రీ కి వచ్చేది ఐనా సరే బ్రిద్జ్ మీదకి రాగానె ఆ లయకే మెలకువ వచ్చేసేది. వెంటనే చిల్లర డబ్బులు కిటికీలోంచి వేసి భక్తిగా దణ్ణం పెట్టుకోటం తడి ఆరని జ్ఞాపకం. ఆ చుట్టుపక్కల పల్లెల్లో అమ్మమ్మ ఇంట్లోనో, మామ్మ ఇంట్లోనో, అత్తల దగ్గరో గడిపిన అపురూపమైన క్షణాలని కళ్ళ ముందు మళ్ళీ ఆవిష్కరింపచేసారు, వేనవేల ధన్యవదాలు
రిప్లయితొలగించండి@శ్రీనివాస్ పప్పు: మీరు 'అత్యద్భుతంగా' అంటారనుకున్నానండీ :)) ..ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@స్వరాజ్యలక్ష్మి: అవునండీ.. అక్కడ పుట్టడం వరం, దూరం కావాల్సి రావడం శాపం అనిపిస్తోంది నాకు. ధన్యవాదాలు.
@కొత్తావకాయ: రాముడు కదూ.. ఆ డైలాగు మీద పేటెంట్ దాసరిది అయిపోయింది కదండీ :))
'కోనసీమంత' నిజంగా!! ..ధన్యవాదాలు..
@ధాత్రి: రాస్తుండగా నా పరిస్థితీ ఇంచుమించు అంతేనండీ.. ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి@పురాణపండ ఫణి: ఎన్నిసార్లు చదువుకున్నానో మీ వ్యాఖ్య!! ధన్యవాదాలండీ
@మానస చామర్తి: ధన్యవాదాలండీ..
@వెంకటేశ్వర రావు: ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@లక్ష్మి: "చాలారోజుల తర్వాత" అనుకున్నానండీ మీ పేరు చూడగానే. మీరూ అదేమాట చెప్పారు.. మీ వ్యాఖ్య చదువుతుంటే మీ బ్లాగు పోస్టులు కొన్ని గుర్తొచ్చాయి.. ధన్యవాదాలు..
నాకు గోదారన్నా, ఆ తూగో జిల్లాలన్నా చాలా ఇష్టం. ఎందుకూ అని అడిగినా, ఎప్పటి నుండి అని అడిగినా నా దగ్గర సమాధానం ఉండదు. ఎందుకో తెలుగు పుస్తకాల్లో ప్రస్తావించిన బావుకతతో కూడిన విషయాలు ఎప్పుడు చదివిన కళ్ళ ముందు మెదిలే ఊహా చిత్రం గోదారి నేపధ్యంలోనే కనపడుతుంది..ఆ ప్రాంతంతో నాకు అనుభందం వుంటే ఎంత బాగుంటుందో అని ఎన్ని సార్లు అనుకున్నానో....కనీసం పెళ్ళి వల్ల అయిన ఆ కోరిక తీరుతుందనుకున్నా...ప్చ్...ఎంత వరకు నిజమో తెలీదు కానీ మా తాతగారు ఎప్పుడూ అంటుండేవారు అంట...నీళ్ళకి దగ్గరగా వున్న ప్రాంతాల్లో నేను చాలా ప్రశాంతంగా వుంటానని...అయినకి కొంచం జాతకాలు అవీ చూసే హాబీ వుండేది...ఇంతమంది స్నేహితులున్నా ఒక్కడిది కూడా గోదారి ప్రాంతం కాదాయె...మీరు చాలా లక్కీ...
రిప్లయితొలగించండి@శేఖర్ పెద్దగోపు: బ్లాగుల్లో గోదారి మిత్రులం ఉన్నాం కదండీ.. ఇంకేం చెప్పాలో తెలియడం లేదు.. ..ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి