మంగళవారం, జులై 01, 2014

... వంటి కూరయు ...

ఏ కూరగాయని చూస్తే వంట రానివాడికి కూడా వలలుడి అవతారం ఎత్తేయాలి అనిపిస్తుందో.. ఏ కూరగాయనైతే ఎలా వండినా రుచిగా లేకపోవడం అన్నది ఉండనే ఉండదో ఆయొక్క కూరగాయ నా చేతికి చిక్కింది. కొబ్బరి ముక్క లాంటి కిచెనూ ఖాళీగా కనిపించేసింది. మంచి తరుణం మించిన దొరకదని, ఆలస్యం చేస్తే అమృతం లాంటి తాజా కూరగాయ అదేదో అయిపోతుందేమో అనే భయం చేతనూ ఘడియ సేపు గరిటె ధారిని అయ్యాను.. అప్పుడేం చేశానంటే...

చిన్న చిన్న వంకాయలు కొరుక్కు తినెయ్యాలనిపించేలా ఉన్నాయి. శివంగి పులుసు అనే మహా వంటకం చేద్దామని బుద్ధి పుట్టింది. కావాల్సిన దినుసుల్లో కాసిన్ని కనిపించలేదు. సరే, ఏమున్నాయో చూసుకుని ఆ ప్రకారం ముందుకు పోదాం అనుకుంటూ వెతికితే టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కులదైవం కొత్తిమీర కనిపించాయి. పెద్దగా ఆలోచించకుండా స్టవ్ వెలిగించేశాను. బాండీ లో కాస్త నూనె పోసి, అది కాగేలోగా వంకాయలు కడిగి, ముచికలు సగానికి కోసి ఓ పక్కన పెట్టాను.


కాగిన నూనెలో ధనియాలు, శనగ పప్పు, మినప్పప్పు, వేరుశనగ గుళ్ళు, ఆవాలు, జీలకర్ర వేసి వేగ నిచ్చా. ఈలోగా రెండు పెద్ద పెద్ద ఉల్లిపాయల్ని ముక్కలుగా కోసి సిద్ధం పెట్టాను. వేగిన పప్పులన్నింటినీ ఓ గిన్నెలోకి తీసి పెట్టి, నూనెలో ఉల్లిపాయ ముక్కల్ని జార విడిచాను. ఐదారు పచ్చి మిరపకాయలు, రెండు పెద్ద టమాటాలు కూడా తరిగి పక్కన పెట్టాను. తదుపరి పని మిక్సీతో. అప్పుడే అస్సలు ఊహించని ట్విస్టు.. మిక్సీ కనిపించుట లేదు.

చెవుల్లో 'శ్రీనగజా తనయం' పాడుతున్న ఘంటసాల మేష్టారు కూడా సమయం చూసుకున్నట్టు 'ఫెళ్ళు మనె విల్లు గంటలు ఘల్లు మనే...ఘుభిల్లుమనె గుండె నృపులకు..ఝల్లు మనియె జానకీ దేహమూ...' అంటూ ఉంటే నాక్కూడా గుండె గుభిల్లుమంది, మిక్సీ కనిపించకపోతే ఏవిటి సాధనం? అసలే ఆ మధ్యెప్పుడో 'మిక్సీ మార్చాలి' అన్న విధాన ప్రకటన వచ్చింది కూడాను.. కృష్ణకుమారిని ఓ సారి తల్చుకుని కిచెన్ నాలుగు పక్కలా చూస్తే ఓ కబోర్డ్ లో ఉంది. టమాటా, పచ్చి మిర్చి ముక్కల్ని కూడా బాండీలో జారవిడిచి, మిక్సీలో వేగిన ధనియాల సహిత పప్పుల్ని పొడికొట్టి చిన్న జార్ లోనే ఉంచేశా.

బాండీలో కాస్త ఉప్పూ, పసుపూ వేసి కలియబెట్టి స్టవ్ ఆపేశాను. ఇల్లేరమ్మ వాళ్ళ నాన్న చేసే బంగాళా ఉల్లిఖారం కూరైతే మధ్యలో సిగరెట్టు కాల్చకుండా చెయ్యడం కష్టం. కానీ నేను చేస్తున్నది ఆ కూర కాదు కదా, కాబట్టి సిగరెట్టుతో పనిలేదు. అందుకని పక్క స్టవ్ మీద టీ పెట్టేశా. టీ తాగడం అయ్యేసరికి బాండీలో పదార్ధం కాస్త చల్లారింది. మరికాస్త చల్లారడం కోసం దాన్ని మిక్సీ జార్లోకి బదలాయించి, మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీలో నూనె పోసి, వేడెక్కుతూ ఉండగానే ఒక్కో వంకాయనీ గుత్తి వంకాయలా చీరి నూనెలోకి వదిలా.



కొంచం అల్లాన్ని ముక్కలుగా కోసి వేగిన మిశ్రమంతో కలిపి గ్రైండ్ చేసేశా. వంకాయలు కాస్త వేగాక కొంచం ఉప్పు వేసి, మరికొంచం వేగాక పప్పుల పొడి వేసి, ఒక్క క్షణం మూత పెట్టా. మూత తీసి, జార్లో ఉన్న గ్రేవీని బాండీలోకి ఒంపి, జార్లో కాసిన్ని నీళ్ళు పోసి మిక్సీ మరో తిప్పి ఆ నీళ్ళు కూడా బాండీలో పోసి, ఓసారి కలిపేసి, బాండీ మీద మూత పెట్టి, ఆ మూత మీద కాసిన్ని నీళ్ళు పోశా. 'నా కంటి పాపలో నిదురపోరా..' పూర్తవుతూండగా మూత తీసి చూస్తే అక్కడక్కడా నూనె తేలుతూ, నోరూరిస్తూ వంకాయ కూర సిద్ధం. కొంచం ఎక్కువగానే కొత్తిమీర చల్లేసి సర్వింగ్ బౌల్ లోకి మార్చేశా. కొంత బగారా బైగన్ రుచి మరికొంత గుత్తి వంకాయ రుచీ వచ్చింది కూరకి.

11 కామెంట్‌లు:

  1. వంకాయ తో కొత్త రెసిపీ బాగుందండీ ..
    కానీ అంత కారమా ! చూడటానికి ఆవకాయ లాగా వుంది ..
    దీన్ని "వంకాయ ఆవకాయ" అని వంటల బ్లాగ్ లో పెట్టటానికి అనుమతి ఇస్తారా ..

    రిప్లయితొలగించండి
  2. :) రుచి సంగతేమోగానీ మీరు చేసిన విధానం భలే చెప్తారండీ.

    రిప్లయితొలగించండి
  3. @రాజి: అయ్యో.. కారం కాదండీ.. గ్రేవీ కోసం టమాటా వాడడం వల్ల ఎర్రగా వచ్చింది కూర. కేవలం అల్లం, పచ్చిమిర్చి మాత్రమే వాడి చేసిన కూర.. 'వంకాయ ఆవకాయ' ఆలోచన బావుందండీ.. ఓ కొత్త రకం ఆవకాయ కనిపెట్టి ఏ 'నెమలావకాయ' అనో పేరు పెట్టేస్తే ఎలా ఉంటుందా అన్న ఆలోచన వచ్చింది :)) .. ధన్యవాదాలు!!
    @రాధిక (నాని): ధన్యవాదాలండీ..
    @శిశిర: రుచి సంగతి కూడా బావుందండోయ్.. (గూగుల్ వాడు ఏ 'గూగుల్ టేస్ట్' లాంటిదో కనిపెడితే బావుండు) :)) ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  4. హహహ బాగుందండీ కొత్త రెసిపీ దానిని మీరు వర్ణించిన విధానం కూడా, కూర కూడా చూడటానికి బ్రహ్మాండంగా ఉంది.. గూగుల్ వాడు మీరిచ్చిన ఐడియా చూసి ఆ దిశగా ప్రయత్నించాలని కోరుకుందాం :-))

    రిప్లయితొలగించండి
  5. "నెమలావకాయ" అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తారు జాగ్రత్త.

    రిప్లయితొలగించండి
  6. @వేణూ శ్రీకాంత్: ఎప్పుడైనా కూర ప్రయత్నం చేసి అప్పుడు చెప్పాలండీ :)) ..ధన్యవాదాలు.
    @నరసింహారావు విన్నకోట: అయ్యో, నెమలి కేవలం 'నెమలికన్ను' కి సింబాలిక్ అండీ.. ట్రేడ్ మార్క్ కోసం అన్నమాట :) ..నిజవే, మీరన్న ప్రమాదం కూడా ఉంది.. అమలా వగయిరాలు కూడా రావొచ్చు :)) .. ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  7. @హిమబిందు: :)) ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  8. అదేవిటండీ అదెదో శివంగి పులుసు అని స్తార్ట్ చెసారుకదా అవుట్-పుట్ కూర వచ్చిందేవిటీ...

    రిప్లయితొలగించండి
  9. @నాగ శ్రీనివాస పేరి: "శివంగి పులుసు అనే మహా వంటకం చేద్దామని బుద్ధి పుట్టింది. కావాల్సిన దినుసుల్లో కాసిన్ని కనిపించలేదు. సరే, ఏమున్నాయో చూసుకుని ఆ ప్రకారం ముందుకు పోదాం అనుకుంటూ..." అదండీ సంగతి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి