తెలుగునాట గిలిగింతలు పెట్టే హాస్యంతో వచ్చిన సినిమాల జాబితా వేయాలంటే ఈనాటికీ మొదటివరుసలో ఉండే పేరు విజయా వారి 'మిస్సమ్మ'. నిర్మాణ విలువలకి పెట్టింది పేరైన విజయ సంస్థ, చక్రపాణి స్క్రిప్టు, ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం, సావిత్రి, రామారావు, యస్వీ రంగారావు, జమున, నాగేశ్వర రావు, రేలంగి వంటి ఉద్దండపిండాల అసమాన నటవైదుష్యం, పింగళి నాగేంద్ర రావు మాటలు, సాలూరి రాజేశ్వర రావు సంగీతం... వీటన్నింటి కలబోతే యాభై ఐదేళ్ళ నాటి ఆణిముత్యం 'మిస్సమ్మ.'
ఓ చిన్న కథని రెండున్నర గంటల నిడివి ఉన్న సినిమాగా మలచడంలో ఆ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో చేసిన కృషి ఈ సినిమాని చిరంజీవిని చేసింది. స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో దేశం ఎదుర్కొన్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి. బ్రిటిష్ వారి పుణ్యమా అని ఆంగ్ల విద్యా బోధన పెరగడంతో ఊరూరా బీయేలు పెరిగిపోయారు. మరోపక్క వారికి ఉద్యోగాలు చూపించగల స్థితిలో లేదు ప్రభుత్వం. ఈ నిరుద్యోగ సమస్యని ఉన్నదున్నట్టుగా చూపిస్తే అది డాక్యుమెంటరీ అవుతుంది కానీ కలకాలం నిలిచిపోయే సినిమా అవ్వదు కదా.
అందుకే ఈ కథకి "చిన్నప్పుడు తప్పిపోయిన పిల్లకోసం వెతకడం" అనే ఫ్యామిలీ డ్రామాని జత చేసి ఎవ్వరికీ ఎక్కడా విసుగు కలిగించని విధంగా ఆసక్తికరమైన సినిమాగా మలిచారు నాగిరెడ్డి-చక్రపాణి మరియు ఎల్వీ ప్రసాద్ లు. కథ విషయానికొస్తే, మదరాసు మహా నగరంలో ఎం. టి. రావు (ఎన్టీ రామారావు) ఓ అనాధ. బీఏ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ వెతుకులాటలో అతనికి మిస్ మేరీ (సావిత్రి) తో పరిచయం అవుతుంది. ఆమె కూడా బీఏ, ఉద్యోగం ఆమెకి కూడా అవసరం, వృద్ధులైన తల్లిదండ్రులకి ఆమె ఒక్కర్తే ఆసరా. అదీకాక అవసరానికి అప్పిచ్చి, ఆపై పెళ్ళిచేసుకుంటానని వేధిస్తున్న డేవిడ్ (రమణారెడ్డి) ని వదిలించుకోడానికైనా ఆమెకి డబ్బు, అందుకోసం ఉద్యోగం అవసరం.
మదరాసుకి కొన్ని వందల మైళ్ళ దూరంలో ఆంధ్రదేశంలో అప్పాపురం అనే ఓ పల్లెటూళ్ళో గోపాలరావు (యస్వీ రంగారావు) ఓ ధనవంతుడు. భార్య (ఋష్యేంద్ర మణి), కూతురు సీతాలక్ష్మి (జమున), మేనల్లుడు 'డిటెక్టివ్' రాజు (నాగేశ్వర రావు) ఇదీ అతని కుటుంబం. పదహారేళ్ళ క్రితం మహాలయ అమావాస్య నాడు సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు అప్పటికి నాలుగేళ్ల పిల్లగా ఉన్న పెద్ద కూతురు మహాలక్ష్మి జనసందోహంలో తప్పిపోతుంది. ఆమె పేరిట ఊళ్ళో ఓ ఎలిమెంటరీ స్కూలు నడుపుతూ ఉంటాడు గోపాలరావు.
మేష్టార్లు సరిగా పాఠాలు చెప్పని కారణంగా బడి మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఇష్టం లేని గోపాల రావు ఇద్దరు బీయేల కోసం పేపర్లో ప్రకటన ఇప్పిస్తాడు. వారిలో ఒకరుసంగీతం వచ్చిన స్త్రీ అయితే, ఆమె దగ్గర సీతాలక్ష్మికి సంగీతం నేర్పించవచ్చునన్నది ఆయన ఆలోచన. కూతుర్ని ఎలాగైనా బీయే ని చేయాలన్నది ఆయనకున్న మరోకోరిక. మేష్టర్లిద్దరికీ తనే వసతి ఏర్పాటు చేసి, మంచి జీతలివ్వాలనుకుంటాడు. "వాళ్ళిద్దరూ భార్యా భర్తలై ఉండాలని రూలు పెడితే, ఒకే వసతి సరిపోతుంది కదా" అన్న రాజు సలహా మేరకు ప్రకటనలో ఆ మేరకు మార్పు చేయిస్తాడు గోపాలరావు.
సరిగ్గా అప్పుడే "నీ డిటెక్టివ్ పని చేసి, తప్పి పోయిన మా అక్కని వెతికి పెట్టొచ్చు కదా బావా" అన్న సీతాలక్ష్మి ప్రతిపాదన, రాజు లోని డిటెక్టివ్ ని ఉత్సాహ పరుస్తుంది. అప్పటికే పీకల్లోతు ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న రావు, మేరీ ఆ ప్రకటన చూసి ఉద్యోగాల కోసం భార్యాభర్తలుగా నటించడానికి సిద్ధపడి, దరకాస్తు చేస్తారు. సర్టిఫికేట్లైనా చూడకుండానే వాళ్లకి ఉద్యోగం ఇచ్చేస్తాడు గోపాలరావు. మిసెస్ రావు ని (కనీసం ఆమె పేరైనా అడగరు వాళ్ళు) చూడగానే తెలియని వాత్సల్యం పుడుతుంది గోపాలరావు దంపతులకి. మేరీనే మహాలక్ష్మి ఎందుకు కాకూడదు అన్న సందేహం మొదలవుతుంది రాజుకి.
ఓపక్క తనకి ఏమాత్రం ఇష్టం లేని హిందూమత సంప్రదాయాలని పాటిస్తూ, అస్సలు ఇమడలేని కొత్త వాతావరణంలో ఇబ్బందులు పడే మేరీ, మరోపక్క ఆమెలో తమ కూతుర్ని చూసుకుని ఆపేక్ష చూపించే గోపాలరావు దంపతులు, ఇంకోపక్క మేరీయే మహాలక్ష్మి అన్న అనుమానంతో పరిశోధన చేసే రాజు. రావు, మేరీల మధ్య వచ్చే తగువులకి ప్రత్యక్ష సాక్షి రావు స్నేహితుడు దేవయ్య (రేలంగి). రావు, మేరీల కథంతా తెలుసు దేవయ్యకి. ఇదిగో ఈ దేవయ్యనే ఉపయోగించుకుని పరిశోధన చేయాలనుకుంటాడు రాజు.
కానీ చేతిలో 'తైలం' పడందే పెదవి విప్పుడు దేవయ్య. (ఈ సినిమా విడుదలైన రెండు దశాబ్దాల తర్వాత వచ్చిన 'అందాల రాముడు' లో అల్లు రామలింగయ్య 'ఆమ్యామ్యా' ని పరిచయం చేసేవరకూ, లంచానికి ముద్దు పేరుగా కొనసాగింది ఈ తైలమే) పోనీ తైలం పడ్డాకైనా నిజం చెబుతాడా అంతే, అదీ లేదు. అమాయకురాలైన సీతాలక్ష్మి చేష్టల పుణ్యమా అని రావు మేరీల మధ్య స్పర్ధలు పెట్టి, ప్రేమ పెరగడానికి దోహదం చేస్తాయి. రావు-మేరీల నాటకం గోపాలరావుకి తెలిసిందా? మహాలక్ష్మి దొరికిందా? తదితర ప్రశ్నలకి జవాబిస్తూ సినిమా ముగుస్తుంది.
నటీనటుల గురించి చెప్పాలంటే మొదటగా చెప్పాల్సింది టైటిల్ పాత్ర పోషించిన సావిత్రి గురించే. బొట్టూ, పూలూ ధరించడంలో అయిష్టత చూపడం మొదలు, అమాయకురాలైన సీతాలక్ష్మి రావుతో చనువుగా ఉంటే భరించలేక ఆవేశ పడడం వరకూ ప్రతి సన్నివేశంలోనూ ప్రతి చిన్న హావభావాల్నీ అత్యంత సమర్ధంగా పోషించి, మిస్సమ్మ ని సజీవంగా కళ్ళముందు నిలిపింది సావిత్రి. 'సీమంతం' అంతే ఏమిటో తెలియకుండా సీమంతం జరిపించేసుకునే సన్నివేశం, రాజు వద్దు వద్దంటున్నా వినిపించుకోకుండా అతనికి సంగీతం నేర్పించే సన్నివేశాలని మర్చిపోవడం అంత సులభం కాదు. రావు పాత్రని తెర మీద చూసినప్పుడల్లా 'కన్యాశుల్కం' గిరీశం రేఖామాత్రంగా గుర్తొస్తాడు నాకు. తనకీ, మేరీకీ మధ్య జరిగిన తగువుల్ని గోపాలరావు దగ్గర 'మేనేజ్' చేసే సన్నివేశాల్లో రావుగా ఎన్టీఆర్ నటన గుర్తుండి పోతుంది.
పల్లెటూరి దంపతులుగా ప్రేమనీ, ఆపేక్షనీ కలబోసి చూపే పాత్రల్లో యస్వీఆర్, ఋష్యేంద్రమణి జీవించారనే చెప్పాలి. ఈ దంపతులు రావుని ఎంతగా నమ్మారంటే, ఒకసందర్భంలో సహనం కోల్పోయిన మేరీ "నేను క్రిష్టియన్ని, నా పేరు మేరీ, నాకింకా పెళ్ళికాలేదు" అని చెబితే, పంతులమ్మకి దెయ్యం పట్టిందనుకున్నారే తప్ప, ఆమె నిజమే చేబుతోందేమో అన్న అనుమానం లేశమైనా కలగలేదు వాళ్లకి. రావు-మేరీలని అమ్మాయి-అల్లుడు అంటూ ఆప్యాయంగా పిలవడం మొదలు, వాళ్లకి ఇబ్బంది కలగ కూడదనుకుంటూ వీళ్ళు చేసే పనుల వల్ల వాళ్లకి కలిగే ఇబ్బందులు, అప్పుడు పుట్టే హాస్యం తెర మీద చూడాల్సిందే.
పల్లెటూరి పిల్లగా జమున నటన గురించి చెప్పాలంటే మచ్చుకి ఒక సన్నివేశాన్ని గుర్తు చేయాలి. పంతులమ్మ దగ్గర సంగీతం నేర్చుకోడానికి మేష్టారింటికి వెళ్తుంది సీతాలక్ష్మి. పంతులమ్మ లోపలెక్కడో ఉంటుంది. మేష్టారి పక్కన సోఫాలో చనువుగా కూర్చుని కుశలాలు మొదలుపెడుతుంది సీతాలక్ష్మి. "కాఫీ తాగుతావా?" అని మేష్టారంటే "వద్దు మేష్టారూ, ఇప్పుడే చద్దన్నంలో పెరుగేసుకుని తినొచ్చా" అని చెబుతుంది. కాసేపట్లో పంతులమ్మ వచ్చి, మేష్టారి పక్కన కూర్చున్నందుకు భగ్గున మండి, సోఫాలో నుంచి లెమ్మంటే "ఇది మా సోఫా, నేనిక్కడే కూర్చుంటా"నంటుంది. అంతలోనే పంతులమ్మ "తెలుసుకొనవె చెల్లీ.." అని పాఠం మొదలెడితే, అలక మర్చిపోయి పాఠానికి వెళ్ళిపోతుంది.
రావు-మేరీ పాత్రలని ఇరుసు-చక్రం అనుకుంటే, ఆరెంటినీ సరిగ్గా పనిచేయించే కందెన దేవయ్య. ఈ పాత్రలో రేలంగి ఇచ్చే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ని మర్చిపోవడం అంత సులువు కాదు. తన పని కోసం వీళ్ళ చుట్టూ తిరిగే డిటెక్టివ్ రాజు గా నాగేశ్వరరావు నవ్విస్తాడు. రేలంగి-నాగేశ్వర రావు ల మధ్య వచ్చే సన్నివేశాలు, ఆ సన్నివేశాల్లో నాగేశ్వరరావు సహాయకుడిగా నటించిన నటుడి హావభావాలు... ఇలా ఒకటేమిటి? సినిమా మొత్తాన్ని గుర్తు చేసుకోవాల్సిందే. స్క్రిప్టు పకడ్బందీగా ఉండడం, ఎక్కడా ఏ సన్నివేశమూ అనవసరం అనిపించక పోవడం చక్రపాణి గొప్పదనం అనే చెప్పాలి. ఈ సినిమాకి మూలం ఓ బెంగాలీ సినిమా అంటోంది
వికీపీడియా.
రాజేశ్వర రావు సంగీతంలో పాటలని గురించి చెప్పకుండా ఈ సినిమా గురించి చెప్పడం పూర్తి కాదు. ఏ.ఏం. రాజా, లీల, సుశీల పాడిన పాటల్లో 'ఆడువారి మాటలకు..,' 'రావోయి చందమామ...,' 'బృందావనమిది అందరిదీ..,' 'కరుణించు మేరి మాతా..' ఇంకా 'బాలనురా మదనా..' పాటలు సంగీత ప్రియుల కలెక్షన్లలో శాశ్విత స్థానం పొందాయి. ఈ సినిమా ప్రారంభ సన్నివేశాల్లో వచ్చే నేపధ్య సంగీతానికీ, రెండేళ్ళ తర్వాత విజయ సంస్థ తీసిన 'మాయా బజార్' సినిమాలోని 'భళి భళి భళి భళి దేవా..' పాట ట్యూన్ కీ దగ్గర పోలికలు వినిపిస్తాయి. మనసు బాగోనప్పుడు 'మిస్సమ్మ' సినిమా చూడడం కన్నా మంచి మందు మరొకటి ఉండదు.