"శిల కూడా చిగురించే విధి రామాయణం
విధికైనా విధి మార్చే కథ ప్రేమాయణం ..."
మంచి సాహిత్యం, దానికి సరిపడే సంగీతం, తగిన సన్నివేశం.. ఇవన్నీ కుదిరినప్పటికీ కొన్ని పాటల విషయంలో కొన్ని కొన్ని అసంతృప్తులు అలా మిగిలిపోతూ ఉంటాయి. శేఖర్ కమ్ముల 'ఆనంద్' (2004) సినిమా కోసం వేటూరి రాసిన 'ఎదలో గానం..' పాట ఆ కొన్నింటిలో ఒకటి. ప్లే లిస్టులో పెర్మనెంటు మెంబరుగా ఉండిపోవాల్సిన ఈ పాట కేవలం గాయకుడి ఉచ్ఛారణ కారణంగా అతిథిలా అప్పుడప్పుడూ వచ్చి పోతూ ఉంటుంది. చాన్నాళ్ల తర్వాత ఈ మధ్యనే మళ్ళీ వచ్చింది.
ఈ పాట నాయికా నాయకుల యుగళగీతం కాదు, కథలో కీలక సన్నివేశాలు జరుగుతుంటే నేపథ్యంలో వినిపించే పాట. సినిమాలో ఉన్న ముఖ్య పాత్రలన్నీ ఈ పాటలో కనిపిస్తాయి. కె ఎం రాధాకృష్ణన్ ఫ్యూషన్ సంగీతంతో బాణీ కట్టారు.
"ఎదలో గానం పెదవే మౌనం
సెలవన్నాయి కలలు సెలయేరైన కనులలో
మెరిసెనిలా శ్రీ రంగ కావేరి సారంగ వర్ణాలలో అలజడిలో"
శ్రీరంగ కావేరి ఒక్కో ఋతువులోనూ ఒక్కో అందంతో మెరుస్తుంది. 'సారంగ' అంటే 'చిత్ర వర్ణము కలది' అంటున్నారు వావిళ్ళ వారు. కనులు సెలయేరులైనప్పుడు కలలు 'సెలవు' తప్ప ఇంకేం అనగలవు? పాటని అద్భుతంగా ఎత్తుకున్నప్పటికీ, హరిహరన్ "ష్రిరంగ కావేరి.." అంటుంటే పంటికింద మొదటి రాయి 'ఫట్' మంటుంది.
"కట్టు కథలా ఈ మమతే కలవరింత
కాలమొకటే కలలకైనా పులకరింత
శిల కూడా చిగురించే విధి రామాయణం
విధికైనా విధి మార్చే కథ ప్రేమాయణం
మరవకుమా వేసంగి ఎండల్లొ పూసేటి మల్లెల్లొ మనసు కథ"
పల్లవిలో 'సెలవన్నాయి కలలు' అనేశారు కదా. ఇప్పుడేమో 'కాలమొకటే కలలకైనా పులకరింత' అంటున్నారు. ఒకే కల మళ్ళీ మళ్ళీ రావచ్చు.. లేదూ, ఎప్పటి కలలనో తల్చుకుని ఇప్పుడు పులకరించనూ వచ్చు. "శిల కూడా చిగురించే విధి రామాయణం.. విధికైనా విధి మార్చే కథ ప్రేమాయణం" వేటూరి మాత్రమే రాయగలిగే లైన్లైవి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన సంతకం. ఎండల్లో మల్లెలు పూస్తాయి, క్లిష్ట పరిస్థితుల్లో అద్భుతాలు జరుగుతాయి..
పంటి దగ్గరికి వస్తే 'కట్టుకద' 'విది' 'ఖద' వరుసగా రాళ్లే రాళ్లు. ఒక్క చరణంలో ఇన్ని తప్పులు ఎలా పాడించ గలిగారా అని ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది, విన్నప్పుడల్లా. హరిహరన్ కి తెలుగు రాదు సరే, మిగిలిన బృందంలో ఎవరికీ తెలుగు తెలియదా? హరిహరన్ కి సరితూగే తెలుగు గాయకుడు దొరకలేదని సరిపెట్టుకున్నా, కనీసం ఈ ఒక్క చరణం మళ్ళీ రికార్డు చేసి ఉండకూడదా అనేది సరిపెట్టుకోలేని సంగతి నాకు.
"శ్రీ గౌరీ చిగురించే సిగ్గులెన్నొ
పూచే సొగసులో ఎగసిన ఊసులో
ఊగే మనసులో అవి మూగవై
తడి తడి వయ్యారాలెన్నొ
ప్రియ ప్రియ అన్న వేళలోన.. శ్రీ గౌరీ..."
సినిమా చూడకపోయినా, సందర్భం తెలియకపోయినా కూడా ఈ చరణం వినగానే ఓ కొత్త పెళ్లికూతురు కళ్ళముందు మెదులుతుంది. చిత్రీకరణ పరంగా కూడా ఈ చరణం కొంచం ప్రత్యేకంగానే ఉంటుంది. నేనైతే ఈ చరణం కోసం ఎదురు చూస్తాను, పాట వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడూ కూడా. పరభాషా గాయనే అయినా చిత్ర ఉచ్ఛారణకి వంక పెట్టడానికి ఉండదు సాధారణంగా. 'శ్రీ గౌరీ' ఒక్కటీ మాత్రం 'ష్రి గౌరీ' లా వినిపిస్తూ ఉంటుంది నాకు. పల్లవి, తొలి చరణం ప్రభావమేమో మరి.