మూడున్నర దశాబ్దాల క్రితం ఆయన మా ఊరికి వచ్చారు. భార్య, పదేళ్ళ కూతురితో కలిసి మా ఇంటికి నాలుగిళ్ళ అవతల ఖాళీగా ఉన్న ఓ ఇంటి పక్క వాటాలో దిగారు. రెండు గోతాలతో సామాను, ఓ ట్రంకు పెట్టెతో వాళ్ళు ముగ్గురూ ఒంటెద్దు బండి దిగడాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. వద్దనుకున్నా ఒకరి వివరాలు మరొకరికి తెలిసిపోతూ ఉండడం పల్లెటూళ్ళ ప్రత్యేకత. అలా మర్నాటికి వాళ్ళ గురించి కొన్ని వివరాలు తెలిశాయి.
వాళ్ళు బతుకు తెరువు వెతుక్కుంటూ మా ఊరికి వచ్చారు. ఓ పదెకరాల భూస్వామి దగ్గర రైతుగా చేరాడాయన. వాళ్లకి పిల్లలు లేరు. ఆవిడ చెల్లెలి కూతురిని పెంచుకుంటున్నారు. మా ఊరోచ్చిన మర్నాడే ఆవిడ తన మెళ్ళో గొలుసు తాకట్టు పెట్టించి రెండు గేదెల్ని కొనిపించింది. వాళ్ళ చిన్న వాటా వెనుక ఉన్న కాసింత ఖాళీ స్థలం లోనే వాటికోసం ఒక పాక వేయించింది. ఆయన పొలం పనులకి వెళ్తే, ఆవిడ గేదెల సంరక్షణ చూసుకునేది. ఇంటి పనంతా ఆ పిల్లదే.
వాళ్ళ ఇంటికి ఐదారు ఇళ్ళ అవతలే సాటి కులస్తులు ఓ పదిహేను కుటుంబాలుగా ఉన్నారు. అప్పటికే వాళ్ళు పచ్చగా ఉండడంతో వీళ్ళని పట్టించుకోలేదు. వాళ్ళ వాళ్ళు అని చెప్పుకోడానికి సిగ్గు పడ్డారు. "కులం ఒకటే కానీ, బంధుత్వం లేదు" అని భుజాలు తడుముకున్నారు. సైకిలుకి పాల బిందె కట్టుకుని పొరుగూళ్లో ఉన్న కాఫీ హోటళ్ళకి పాలు పోసి రావడంతో ఆయన దినచర్య ప్రారంభమయ్యేది. ఆ పని అవ్వడంతోనే పొలం వెళ్ళిపోయే వాడు. మళ్ళీ ఏ రాత్రికో తిరిగి రావడం.
పాల మీద వచ్చిన డబ్బుతో ఆవిడ వడ్డీ వ్యాపారం మొదలు పెట్టింది. డబ్బు దగ్గర ఆవిడ నిక్కచ్చి మనిషి. శుక్రవారమైనా అప్పిస్తుంది, కానీ వడ్డీ మిగిలిన రోజుల కన్నా కొంచం ఎక్కువ వసూలు చేస్తుంది. ఆవిడ ఒంటి మీద చిన్నగా నగలు అమురుతున్నాయి. అరకల కాలంలో ఊళ్ళోనూ, పొరుగూళ్ళ లోనూ అరకలకి డిమాండ్ ఉండడం గమనించాడాయన. ధైర్యం చేసి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొన్నాడు. మా ఊళ్ళో మొదటి ట్రాక్టర్.
రెండేళ్ళు గడిచేసరికి పొలం యజమాని పొలంలో కొంత భాగాన్ని అమ్మకానికి పెడితే ఆయనే కొన్నాడు. మరో పక్క నల్లని ఆవిడ మెడ బంగారంతో పచ్చబడుతోంది. పెంపుడు కూతురికి పెళ్లీడు రావడంతో తన చెల్లెలి కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసి, అతన్ని తన దగ్గరికే తెచ్చుకుని వ్యాపారం పెట్టించాడాయన. ట్రాక్టర్ల సంఖ్య మూడుకి పెరిగింది. ఆవిడ పాల వ్యాపారం, వడ్డీ వ్యాపారమూ అదే స్థాయిలో పెరిగాయి. చూస్తుండగానే పొలం యజమాని నుంచి మిగిలిన పొలాన్నీ, ఇంటినీ కొనేశాడాయన.
కూతురికి పిల్లలు బయలుదేరి, వాళ్ళు కొంచం పెద్దవాళ్ళు అయ్యే నాటికి పాత ఇల్లు స్థానంలో మేడ వెలిసింది. అప్పటికే ఊళ్ళో పెద్ద మనిషిగా వెలిగిపోతున్న ఆయన, రాజకీయాల మీద దృష్టి పెట్టాడు. పార్టీలని నమ్ముకోలేదు, నాయకులకి మద్దతు ఇచ్చాడు. ఒకప్పుడు వాళ్ళని తమవాళ్ళు అని చెప్పుకోడానికి సిగ్గు పడ్డ వాళ్ళని ఆయనిప్పుడు లెక్కే చేయడం లేదు. వాళ్ళు మాత్రం ఆయన ప్రాపకం కోసం పాకులాడుతున్నారు.
ఈ వారంలో జరగబోతున్న ఆయన మనవరాలి పెళ్ళికి ఇద్దరు ప్రముఖ రాజకీయ నాయకులు రాబోతున్నారానీ, అందుకోసం మా పంచాయితీ వారు యుద్ధ ప్రాతిపదికన రోడ్లకి మరమ్మతులు చేస్తున్నారనీ మా ఊరి నుంచి ఇప్పుడే అందిన తాజా వార్త.