అనగనగా ఓ పచ్చటి పల్లెటూరు. పేరు రామాపురం. ఆ ఊళ్ళో అందమైన, చదువుకున్న, బుద్దిమంతులైన ఇద్దరు పెళ్ళికొడుకులు. అన్నదమ్ముల్లాంటి వాళ్ళు. ఓ కుర్రాడు డబ్బున్నవాళ్ళ గారాల పుత్రుడైతే, రెండో వాడిది మధ్యతరగతి మందహాసం.'అన్నీ ఉన్నా..' సామెతలాగా ఓ కుర్రాడికి పెళ్లి సంబంధాలే రావు.. రెండో వాడికి పెళ్లి చేసుకోవాలన్న ధ్యాసే లేదు.
మళ్ళీ అనగనగా అంతే అందమైన మరో పల్లెటూరు. పేరు సీతాపురం. ఇద్దరు అందమైన, చదువుకున్న అమ్మాయిలు. సయానా కాకపోయినా అక్కచెల్లెళ్ళు. ఓ పిల్లకి బొత్తిగా పెళ్లి ధ్యాసే లేదు. రెండో పిల్లకి వచ్చిన సంబంధం ఏదీ నచ్చడం లేదు. ఈ రెండు జంటలూ ఎలా ఒకటయ్యాయి అన్నదే పొత్తూరి విజయలక్ష్మి రాసిన 'శ్రీరస్తు శుభమస్తు' నవల.
జంధ్యాల వడ్డించిన నవ్వుల విందు 'శ్రీవారికి ప్రేమలేఖ' సినిమాకి ఆధారమైన 'ప్రేమలేఖ' నవల రచించి, తర్వాతి కాలంలో మరెన్నో కథల్ని తన ఖాతాలో వేసుకున్న రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి పేరు వినగానే మొదట గుర్తొచ్చేది హాస్యమే. సున్నితమైన, గిలిగింతలు పెట్టే హాస్యాన్ని పండించడంలో చేయితిరిగిన రచయిత్రి, ఈ నవల్లోనూ నిరాశ పరచలేదు. కళ్ళనీళ్ళు తిరిగేట్టుగా నవ్వించే సన్నివేశాలు నాలుగైదు ఉండగా, మిగిలిన చోట్ల హాసానికీ, దరహాసానికీ లోటుండదు.
రామాపురం జమీందారు రాజశేఖరం గారబ్బాయి చంద్రశేఖరం బొత్తిగా తల్లిచాటు బిడ్డ. లేకలేక కలిగిన కొడుకంటే పంచ ప్రాణాలు కృష్ణవేణి గారికి. కొడుకుని బళ్ళో వెయ్యొద్దనీ, మేష్టర్లనే ఇంటికి రప్పించమనీ భర్తతో దెబ్బలాడి, అలా వీలు కాకపోవడంతో తనే స్వయంగా రోజూ కొడుకుని స్కూల్లో దింపి అతగాడు తిరిగి వచ్చేలోగా చుట్టూ ఉన్న గుళ్ళూ గోపురాలూ దర్శించేవారు. చంద్రం స్కూలు చదువు అయ్యేసరికి, ఆ ప్రాంతంలో ఉన్న దేవుళ్ళందరికీ నగానట్రా అమిరాయి.
అంత గారాబంగా పెరిగిన చంద్రాన్ని పెళ్లి చేసుకోడానికి ఏ ఆడపిల్లా బొత్తిగా సిద్ధపడడం లేదు. కొడుకు ఎక్కడికో దూరం వెళ్లి ఉద్యోగం చేయడం కృష్ణవేణి గారికి ఇష్టం లేదు మరి. రాజశేఖరం గారి స్నేహితుడు నరసింహం గారబ్బాయి రవి, చంద్రం ఈడు వాడే. ఉద్యోగం చేయడం బొత్తిగా ఇష్టం లేదు. సొంతంగా ఏదన్నా కనిపెట్టి ఒకేసారి పేరు, డబ్బు బాగా సంపాదించాలని కోరిక అతనికి.
ఇక సీతాపురం అక్క చెల్లెళ్ళు సరోజ, దుర్గలది వేరే కథ. సరోజకి ప్రతిరోజూ కొత్తగా ఉండాలి. ప్రతిపనిలోనూ వైవిధ్యం ఉండాలి. దుర్గకి తన కాళ్ళ మీద తను నిలబడాలి అన్నదే ఆశయం. రామాపురం కుర్రాళ్ళు ఇద్దరూ సీతాపురం చేరడంతో మొదలయ్యే అసలు కథ అనేకానేక సినిమాటిక్ మలుపులతో సాగి, హాయిగా ముగుస్తుంది. 'గుండమ్మ కథ''సరదాగా కాసేపు' లాంటి సినిమాలు గుర్తొస్తూనే ఉంటాయి, నవల చదువుతున్నంత సేపూ.
ఒక్కమాటలో చెప్పాలంటే, లాజిక్ ని పక్కన పెట్టేసి చదివితే బహుచక్కని స్ట్రెస్ బస్టర్. జంధ్యాల సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుంది, పేజీలు తిరుగుతూ ఉంటే. ('శ్రీరస్తు శుభమస్తు,' సాహితి ప్రచురణ, పేజీలు 240, వెల రూ. 60, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).
పేపరు, టీవీ, ఆన్లైన్.. ఎక్కడ చూసినా వేటూరి స్మరణ కనిపిస్తూ ఉంది ఉదయం నుంచీ.. జయంతి కదా. ఇవన్నీ కలగలిసి వేటూరి పాటల్ని గురించి కాసేపు ఆలోచించేలా చేశాయి నన్ను. వేటూరి రాయలేని పాట ఏదైనా ఉంటే కదా అసలు?! ఒకానొక దశలో ఆచార్య ఆత్రేయ ని 'బూత్రేయ' అన్నట్టే, 'పాటని బూతుతో నింపుతున్నాడు' అన్న విమర్శ వేటూరికీ తప్పలేదు.
శ్రీరాముడి కాలు తాకగానే రాయి రమణిగా మారిపోయినట్టు, వేటూరి సుందర రాముడి కలం స్పర్శతో బూతు కూడా శృంగారం గా మారిపోతుందేమో అనిపించేస్తూ ఉంటుంది కొన్ని పాటలు వింటున్నప్పుడు. బూతుకీ, శృంగారానికీ తేడా ఏమిటీ అంటే.. ఉద్రేక పరిచేది బూతు, ఉత్సాహ పరిచేది శృంగారం అని భాష్యం చెప్పుకోవచ్చేమో.. అందరికీ అర్ధమైతే బూతు, కొందరికే అర్ధమైతే శృంగారం అని కూడా విన్నాను ఆ మధ్య ఎక్కడో..
వేటూరి మీద విమర్శలని పెంచిన పాట 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరీ..' ఎన్టీఆర్ లాంటి కమర్షియల్ హీరో సినిమాలో, జయప్రద అంతటి సౌందర్యవతి నాయికగా ఉండగా.. బలమైన సందర్భం ఏమీ లేకుండానే వాళ్ళిద్దరి మధ్యనా ఓ యుగళగీతం కావాల్సి వచ్చింది 'అడవి రాముడు'కి. 'ఈ పాటలో బూతేముందీ?!' అని ఎస్పీ బాలూ లాంటి వాళ్ళు ఇప్పుడు ఆశ్చర్యపోతే పోవచ్చు గాక.. ఎవరికి కావాల్సింది వాళ్ళు ఎప్పుడో వెతికేసుకున్నారు. 'నా పాట ఈ పూట నీ పైటలా దాచేసుకోనీ నీ పొంగులా' లాంటి మెరుపులూ ఉన్నాయీ పాటలో!
మొదటిరాత్రి సన్నివేశానికి పాట అంటే ఏముంటుంది, శృంగారం తప్ప? ఈ సందర్భానికి వేటూరి రాసిన పాటలే కోకొల్లలు. 'పల్నాటి సింహం' సినిమాలో 'ముక్కుపుడక పెట్టుకో మహలక్ష్మిలా' వాటిలో ఒకటి.. ఇలాంటి గీతంలో 'ముక్కుపుడక ఎందుకూ మనసుండగా?' అని నాయిక చేత అడిగించడం ఇంకెవరికి సాధ్యం? చిరంజీవి సినిమాకి రాసిన 'అబ్బనీ తియ్యనీ దెబ్బ...' పాట మీద వచ్చిన విమర్శలు అన్నీ ఇన్నీ కాదు.. ఈ పాటలో 'అడగక అడిగినదేమిటో... లిపి చిలిపిగ ముదిరిన కవితగా' లాంటి లైన్లు విడిచి పెట్టవు ఓ పట్టాన.
'సూపర్ పోలీస్' సినిమాలో ఓ పాటలో 'పక్కా జెంటిల్ మేన్ని..' అని హీరో అంటే, 'పుణ్యం కొద్దీ పురుషా.. పట్టె మంచం కొద్దీ మనిషా'అంటుంది నాయిక!!'మనసు ఆగదు వయసు తగ్గదు ఓలమ్మో ఒంటిగా నిదుర పట్టదు' అని చెబుతూనే 'ప్రేమంటేనే పేచీలు.. రాత్రికి మాత్రం రాజీలు.. గిల్లీగిచ్చీ కజ్జాలు.. లవ్లీ లావాదేవీలు' తత్త్వం బోధించేశారు 'బంగారు బుల్లోడి' కి.
'రాజసింహం' సినిమాలో బొత్తిగా సందర్భంలేని ఓ సందర్భోచిత యుగళంలో నాయకుడు నాయికను 'దాయీ దాయీ దాయి దాక్షాయణీ' అంటే, నాయిక ఏమాత్రం తగ్గకుండా 'వద్దూ వద్దూ వద్దూ వాత్సాయనా' అంటుంది. యుగళాలు మాత్రమేనా? వ్యాంప్ తరహా గీతాల్లోనూ వేటూరి ముద్ర ప్రత్యేకం.. 'అ అంటే అమలాపురం' అంటూ 'ఆర్య' ని కవ్వించే అమ్మాయి 'యానాము దాటినా ఈనాము మారునా.. ఫ్రెంచీ ఫిడేలు ఆగునా' అంటుంది. ఎవరికి ఏ అర్ధం కావలిస్తే అదే దొరకడం వేటూరి పాటల ప్రత్యేకతగా చెప్పుకోవాలి..
'జీవితంలోని ఖాళీలని పూరించేది సాహిత్యం' అన్నారు మానవ హక్కుల కార్యకర్త కె. బాలగోపాల్. ఒక్క సాహిత్యం అని మాత్రమే కాదు, ఏ కళా రూపమైనా తనదైన పాత్రని పోషిస్తుంది ఈ ఖాళీలని పూరించడంలో. నడి వయసు పెద్ద మనిషి జాన్ క్లార్క్ జీవితం ఇందుకు ఓ పెద్ద ఉదాహరణ. తన జీవితంలో పైకి కనిపించని వెలితి ఏదో అనుభవంలోకి రాగానే, దాన్ని పూరించుకోడం కోసం క్లార్క్ ఏం చేశాడు? అతని చర్య తాలూకు పర్యవసానాలు ఏమిటన్నదే పదేళ్ళ క్రితం విడుదలైన రొమాంటిక్ కామెడీ హాలీవుడ్ చిత్రం 'షల్ వి డాన్స్?'
మిరామాక్స్ సంస్థ నిర్మించిన 'షల్ వి డాన్స్?' కి మాతృక ఇదే పేరుతో 1996 లో విడుదలైన జపనీస్ చిత్రం. మాతృక లాగే ఈ హాలీవుడ్ సినిమా కూడా విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఇది జాన్ క్లార్క్ (రిచర్డ్ గెరె) అనే ఓ నడివయసు న్యాయవాది కథ. అందమైన భార్య బెవర్లీ (సూజన్ సరండన్), టీనేజ్ కి వచ్చిన కొడుకూ, కూతురూ క్లార్క్ ని ఎంతగానో ప్రేమిస్తారు. ఎలాంటి అరమరికలూ లేని కుటుంబం వాళ్ళది. క్లార్క్, బెవర్లీల మధ్య అయితే చిన్న రహస్యం కూడా లేదు.
రోజులు సంతోషంగా గడుస్తూ ఉండగా, క్లార్క్ కి తను గడుపుతున్న జీవితంలో ఏదో వెలితి కనిపిస్తుంది. అదేమిటో అతనికి పూర్తిగా అర్ధం కాకపోయినా, తనకోసం తను ఏదైనా చేయాలన్నకోరిక రోజురోజుకీ బలపడుతూ ఉంటుంది. ఆఫీసునుంచి లోకల్ ట్రైన్లో ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ఒకరోజు యధాలాపంగా బయటికి చూస్తూ ఉండగా, చికాగో లో రహదారి పక్కనే ఉన్న ఓ డాన్స్ స్టూడియో బాల్కనీలో నిలబడి దీర్ఘాలోచనలో ఉన్న ఓ అందమైన అమ్మాయి కనిపిస్తుంది. అది మొదలు ప్రతిరోజూ ఆమెని గమనిస్తూ ఉంటాడు, కేవలం కొన్ని క్షణాలు మాత్రమే. అయితేనేం, బెవర్లీ నుంచి అతను దాచిన తొలి రహస్యం ఇది.
రోజులు గడిచే కొద్దీ ఆ అమ్మాయిని గురించి కుతూహలం పెరిగిపోతుంది క్లార్క్ లో. ఒక రోజు ఉండబట్టలేక చికాగో స్టేషన్ లో రైలు దిగి నేరుగా డాన్స్ స్టూడియోకి వెళ్ళిపోతాడు. మిస్ మిట్జీ అనే వృద్ధురాలు నడుపుతున్న ఆ స్టూడియో లో తను రోజూ గమనిస్తున్న అమ్మాయి కనిపిస్తుంది. ఆమె పేరు పౌలీనా (జెన్నిఫర్ లోపెజ్). ఆ స్టూడియో లో ఇన్ స్ట్రక్టర్. కేవలం ఆమెకోసం బాల్ రూం డాన్స్ క్లాసుల్లో చేరిపోతాడు క్లార్క్. ప్రతి బుధవారం ఆఫీసు అవ్వగానే డాన్స్ క్లాస్. కానీ, క్లార్క్ కి క్లాసులు తీసుకునే ఇన్ స్ట్రక్టర్ పౌలీనా కాదు. నిరాశ పడడు క్లార్క్. ఇష్టంగా డాన్స్ నేర్చుకోవడం మొదలు పెడతాడు.
ఎవరినీ దగ్గరికి రానిచ్చే స్వభావం కాదు పౌలీనాది. ఆమె చాలా రిజర్వుడు. క్లార్క్ తో కూడా కేవలం 'హెలో' మాత్రమే.. అది కూడా ముఖం చాలా సీరియస్ గా పెట్టుకుని. అయితేనేం.. ఇటు పౌలీనా, అటు డాన్స్, ఈ రెండూ క్లార్క్ లో పేరుకుంటున్న స్థబ్దతని కరిగించడం మొదలు పెడతాయి. తనలో పెరుగుతున్న ఉత్సాహాన్ని అదుపులో పెట్టుకోవాలన్న స్పృహ కూడా కలగదు క్లార్క్ కి. అతనిలో వచ్చిన మార్పుని మొదట గమనించింది బెవర్లీ. కూతురు కూడా తల్లి ఆలోచనతో ఏకీభవిస్తుంది. ఆలస్యం చేయకుండా ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ని సంప్రదిస్తుంది బెవర్లీ.
డాన్స్ స్టూడియో లో జరిగిన కొన్ని సంఘటనలు పౌలీనా ని క్లార్క్ కి దగ్గర చేస్తాయి. ఎవరితోనూ పంచుకోడానికి ఇష్టపడని తన గతాన్ని, తన లక్ష్యాన్ని క్లార్క్ తో పంచుకుంటుంది పౌలీనా. భర్తని అనుమానించాలా, వద్దా? అన్న సందిగ్ధం లో ఉన్న బెవర్లీ కి డిటెక్టివ్ ఇచ్ఛిన రిపోర్టు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. తన భర్త డాన్స్ క్లాసులకి వెళ్తున్నాడు తప్ప, మరో మహిళతో గడపడం లేదని తెలియడం ఆమెకి ఉపశమనం ఇచ్చినా, డాన్స్ విషయాన్ని తన దగ్గర దాచడం ఎందుకో మింగుడు పడదు బెవర్లీకి. మరోపక్క, ప్రతిష్ఠాత్మకంగా జరిగే డాన్స్ పోటీల్లో పాల్గొన వలసిందిగా క్లార్క్ ని ప్రోత్సహిస్తుంది పౌలీనా.
క్లార్క్ ఆ పోటీలో పాల్గొన్నాడా? పౌలీనా తో అతని స్నేహం ఎంత దూరం వెళ్ళింది? క్లార్క్ నుంచి పౌలీనా ఏం నేర్చుకుంది? వాళ్ళ సాన్నిహిత్యం ప్రభావం క్లార్క్-బెవర్లీల సంసార జీవితం మీద ఏమేరకు పడింది? ఈ ప్రశ్నలకి జవాబిస్తూ ముగుస్తుంది 106 నిమిషాల నిడివి ఉన్న 'షల్ వి డాన్స్?' మసయుకి సుయో, ఆడ్రే వెల్స్ సమకూర్చిన కథని అందంగా తెరకెక్కించారు దర్శకుడు పీటర్ చెల్సామ్. సరదాగా సాగిపోతూనే, ఆలోచనల్లోకి నెట్టేసే సినిమా ఇది. మొదటగా ఆకర్షించేది పౌలీనా గా నటించిన జెన్నిఫర్ లోపెజ్. ఎక్కడా ఆమె నటించినట్టుగా అనిపించదు. వెంటనే చెప్పుకోవలసింది క్లార్క్ గా నటించిన రిచర్డ్ గెరె. ఎమోషన్స్ ని ఎంత బాగా పలికించాడో, అంతబాగానూ డాన్స్ చేశాడు. బెవర్లీ పాత్ర పోషించిన సూజన్ ఎంత నచ్చేసిందంటే, ఆమె సినిమాలు ఇంకా ఏమేం ఉన్నాయా అని వెతికేంత.
కొన్ని హాస్య సన్నివేశాలు కృతకంగా అనిపించినా, సెంటిమెంట్ సీన్స్ చాలా బాగా పండాయి. క్లార్క్ ఆలోచనల్లో వచ్చే మార్పులు, భర్త గురించి బెవర్లీ కి కలిగే సందేహాలు, ఆమె సంఘర్షణ, పౌలీనా పాత్ర చిత్రణ.. ఇవన్నీ ఈ సినిమాని గుర్తు పెట్టుకునేలా చేస్తాయి. జాన్ ఆల్ట్మాన్, గేబ్రియల్ యారెడ్ ల సౌండ్ ట్రాక్ గురించి ప్రస్తావించకపోతే ఎలా? సంగీతం కథలో భాగంగా కలిసిపోయింది. సరదాగా సాగిపోయే సీరియస్ సినిమా ఇది. అటు కామెడీలు ఇష్టపడేవారు, ఇటు సీరియస్ సినిమాలని మెచ్చేవారిని కూడా అలరిస్తుంది. మళ్ళీ బాలగోపాల్ మాటలు గుర్తు చేసుకుంటే, ఖాళీలని పూరించుకునే కళారూపాల జాబితాలోకి సినిమా కూడా చేరుతుంది, నిరభ్యంతరంగా.
ఐదేళ్ళ నాడు మొదలు పెట్టిన బ్లాగు ప్రయాణం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. రాస్తుండగానే 'నెమలికన్ను' కి ఐదో పుట్టినరోజు వచ్చేసింది!! యథా ప్రకారం, సింహావలోకనం.. నాలుగో పుట్టినరోజు అయిన వెంటనే అభిమాన గాయని ఎస్. జానకి కి ప్రభుత్వం 'పద్మ భూషణ్' ప్రకటించిందన్న కబురు తెలియడంతో 'పరిమళించిన పద్మం' టపాతో ఐదో సంవత్సరానికి శుభారంభం జరిగింది. సంవత్సరం చివరిలో 'జానకి పాటలు' సిరీస్ రాయడం కేవలం యాదృచ్చికం..
మునుపటి సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు టపాల సంఖ్య కొంచం మెరుగు పడింది. కానైతే, బ్లాగింగ్ మీద శీతకన్ను వేస్తున్నానన్న హెచ్చరికని మిత్రులనుంచి చాలాసార్లే అందుకున్నాను. కొని, చదవకుండా ఉంచిన పుస్తకాలు చాలానే కనిపిస్తున్నాయి కాబట్టి, పుస్తకాలు బాగానే చదివాను అని చెప్పలేను. చదివిన వాటిలో బాగా నచ్చినవి అంటే మళ్ళీ ఆత్మకథలే కనిపిస్తున్నాయి. బుచ్చిబాబు 'నా అంతరంగ కథనం' ఒకందుకు నచ్చితే, జ్యోతిరెడ్డి రాసిన '...ఐనా, నేను ఓడిపోలేదు!'మరొకందుకు గుర్తుండిపోయింది.
చూసిన సినిమాలే బాగా తక్కువ.. ఇక వాటిలో నచ్చినవంటూ ఏవీ లేవనే చెప్పాలి. వెనక్కి తిరిగి బ్లాగుని చూసుకుంటే నాకు ప్రత్యేకంగా అనిపించిన టపాలు 'అబ్బాయి తండ్రికి...''అందుకో నా లేఖ...' రెండూ కూడా అనుకోకుండా రాసినవే.. వీటిలో మొదటిది 'నేనే రాశానా!' అన్న ఆశ్చర్యం కలుగుతోంది ఇప్పుడు చదువుకుంటే. 'పురుషార్ధం' అనే చిన్నకథ కూడా అనుకోకుండా మొదలుపెట్టి ఏకబిగిన రాసిందే. ఆలోచనలు చాలానే ఉన్నాయి కానీ, అక్షరాల్లో పెట్టడం వాయిదా పడుతూ వస్తోంది.
మిత్రులు చాలామంది ఈ బ్లాగుని తలచుకోగానే 'జ్ఞాపకాలు' పోస్టులే గుర్తొస్తాయి అని చెబుతూ ఉంటారు మెయిలుత్తరాలలో. వాటిలో కూడా రాయాల్సినవి చాలానే ఉన్నాయి. బ్లాగు ప్రయాణం సాగుతూ ఉంది కాబట్టి, రాయాల్సిన వాటన్నింటికీ ఒక్కోరోజు వస్తుందనే అనుకుంటున్నాను. నన్ను దగ్గరకు తీసుకున్న పరకాల పట్టాభి రామారావు,ధర్మవరపు సుబ్రహ్మణ్యాలని తనతో తీసుకుపోయింది పోయిన సంవత్సరం. వైరాగ్యపు అంచులవరకూ వెళ్లి, కర్తవ్యాలు గుర్తుచేసుకుని వెనక్కి రావడం.. అంతే చేయగలిగేది.
బ్లాగు ప్రయాణం దగ్గరికి వస్తే, సాఫీగానే సాగుతోంది.. అడపా దడపా మిత్రులు మెయిల్ లో పలకరిస్తున్నారు. రోజువారీ కబుర్లకి గూగుల్ ప్లస్ ఉండనే ఉంది. అసలు 'జానకి పాటలు' పుట్టింది ప్లస్ లోనే. రాబోయే సంవత్సరంలో ఈ బ్లాగులో టపాలు ఉధృతంగా వచ్చి పడతాయా లేక అడపా దడపా పలకరిస్తాయా అన్నది ఇప్పుడు చెప్పలేని విషయం. ఇదివరకోసారి నేనే రాసినట్టు, బ్లాగింగ్ అన్నది కేవలం ప్లానింగ్ ఉన్నంత మాత్రానే జరిగిపోయేది కాదు.. ఇంకా చాలా చాలా కలిసిరావాలి.
చెయ్యాల్సిన పనులు, చదవాల్సిన పుస్తకాలు, చూడాల్సిన సినిమాలు ఇవన్నీ ఎదురు చూస్తున్నాయి. ఒక్కొక్కటిగా పూర్తిచేయాలి. వీటిలో చాలా వరకూ వాయిదా వెయ్యగలిగే పనుల జాబితాలో చేరిపోతూ వస్తున్నాయి. బ్లాగింగుదీ అదే దారి అయిపోతోంది ఒక్కోసారి. ఇలా సింహావలోకనం చేసుకున్నప్పుడల్లా 'బ్లాగింగు కి కొంచం ఎక్కువ సమయం కేటాయించాలి' అని బలంగా అనిపిస్తూ ఉంటుంది. ఆచరణ విషయానికి వస్తే, ఎప్పుడూ ఒకేలా ఉండదు కాబట్టి... చూడాలి. ఐదేళ్ళ పాటు బ్లాగు రాయడానికి, ఇంకా రాయాలన్న ఉత్సాహాన్ని మిగుల్చుకోడానికి కారకులైన మీ అందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు!!
(మరో యాదృచ్చికం.. పోస్టుల సంఖ్య ఆరువందలు అయ్యింది ఈ టపాతో!!)
పెళ్లింట్లో సందడికి లోటేం ఉంటుంది కనుక.. చుట్టాలతో పక్కాలతో కిసకిసలాడుతూ పచ్చి తాటాకు పందిళ్ళూ, మామిడాకు తోరణాలు, పసుపు కుంకాలు, మల్లి పూలూ, గంధం, ఐరేని కుండల సొంపు, పిల్లల పరుగులు, పెద్దల చిరునవ్వులు, వరసైన వాళ్ళ సరసాలు - పెళ్లి నిండుతనమంతా పందిరి పలవరిస్తోంది. కానీ, పెళ్ళికూతురు అలివేలు మాత్రం ఆ పగలంతా కన్నీరు మున్నీరుగా ఏడుస్తూనే ఉంది. ఆమెకి తోడుగా ఆకాశం కూడా. అకాలపు వానకి పెళ్ళికి వేసిన ప్రహరీ బచ్చళ్ళు తుడుచుకు పోయాయి.
అయితే, అలివేలు ఏడుపుకీ కురుస్తున్న అకాల వర్షానికీ ఏమాత్రం సంబంధం లేదు. అసలు అలివేలు మనసు ఆ పెళ్లి పందిట్లో లేనే లేదు. ఆమె మనసంతా సత్యం చుట్టూ తిరుగుతోంది. తన ఊరి వాడే.. వరసైన వాడే.. ప్రాణ స్నేహితురాలు జానకికి స్వయానా అన్న. కంచంలో పాలు పోసి, అంచున వెన్న పెట్టి పెంచింది సత్యాన్ని వాళ్ళమ్మ సీతమ్మగారు. అంత గారాబంగా పెరిగాడు కనుకే, మేష్టారితో పేచీ వచ్చిన వెంటనే చదువు మానేశాడు. వ్యవసాయంలోకి దిగాడు.
సత్యం పద్ధతులు ఊళ్ళో వాళ్లకి అస్సలు నచ్చలేదు. అలివేలు తండ్రి రమణయ్య గారికైతే బొత్తిగా మింగుడు పడలేదు. సత్యం పనివాళ్ళ తరపున మాట్లాడతాడు, పాడి పశువుల యెడల దయతో మసలుకుంటాడు. అలివేలు, సత్యం మధ్యన చిన్ననాటి స్నేహం వాళ్ళతో పాటే పెరిగి పెద్దదయ్యి, వాళ్ళకే తెలియకుండా 'ప్రేమ'గా రూపాంతరం చెందింది. ఉన్నట్టుండి ఒకరోజు "కలిగిన వాళ్ళ కోసం వెతుకుతున్నాడంట గా మీ అయ్య? నిజమేనా?" అని అలివేలుని అడిగాడు సత్యం. "ఉన్న ఆస్తి చాలదూ మీకు?" అని కూడా అడిగాడు. అలివేలు కళ్ళనీళ్ళు చెప్పాయి జవాబుని.
ఉన్నట్టుండి సత్యానికి జమీందారు రంగారావు గారితో స్నేహం కుదిరింది. అది కూడా చాలా చిత్రంగా. ఆయన పక్కా కాంగ్రెస్ వాది. గాంధీ గారి శిష్యుడు. రంగారావు గారి ప్రభావంతో సత్యం కూడా కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధ పడ్డాడు. ఒకనాడు, ఆకుమళ్ళ రోజుల్లో, అలివేలూ, జానకీ కోడిగట్ల మీద కాళ్ళ గోరింటాకు కడుక్కుంటూ ఉండగా వచ్చాడు సత్యం. "మీ అయ్య గుణం నాకు నచ్చలేదు. కుమ్మరి ఆవం లో ఇత్తడి కుండ పుట్టినట్టూ నువ్వు పుట్టుకొచ్చావు ఆ పుణ్య శాలికి. అంతేగాని అతనికి డబ్బే దేవుడు. ఏమైనా సరే, అతనిని నేనుగాని, నా వాళ్ళు గాని వెళ్లి బ్రతిమాలతారన్న మాట బ్రహ్మ కల" ...అనేసి ఊరుకోలేదు..
"తీరా మేమడిగాక లేదూ కూడదని అతనంటే - నేనసలు ఉగ్గబట్టలేని మనిషిని. శ్రుతి మించుకొస్తుంది," అని ముక్తాయించాడు. మండుటెండల్లో లేగని వెతుక్కుని రాబోయి ఎండదెబ్బ తిన్నాడు సత్యం. అలివేలుకి దూరపు వేలు విడిచిన మేనరికం సంబంధం చూశారు. పెళ్లి పనులు జరుగుతున్నాయి. "సీతమ్మగారి కనిష్టుడి మాట నమ్మకం లేదంట మ్మా, గుణం కూడా పుట్టు కొచ్చిందంట!" ఈ మాటలు చెవిన పడంగానే అలివేలుకి కళ్ళు చీకట్లు కమ్మినాయి. యజ్ఞ పశువులా పెళ్లి సరంజాలన్నీ అనుభవిస్తోంది.
తర్వాత ఏం జరిగింది? ఈ ప్రశ్నకి సమాధానమే నిడుమోలు కళ్యాణ సుందరీ జగన్నాథ్ రాసిన 'చిఱు చెమటలు, చందనం' కథ!! డెబ్భై ఎనభై ఏళ్ళ క్రితం నాటి పల్లెటూరి వాతావరణం లోకి పాఠకులని అలవోకగా చేయిపట్టి తీసుకు పోగల కథన కౌశలం కళ్యాణ సుందరి సొత్తు. ఆమె కథా సంకలనం 'అలరాస పుట్టిళ్ళు' సంకలనం లో ఉందీ కథ. చదువుతున్నంతసేపూ కథా స్థలం చిరపరిచితం గా అనిపించినా, కథ పూరయ్యాక కూడా ఆ పాత్రలు వెంటాడినా అది కేవలం రచయిత్రి ప్రతిభకి ఓ చిన్న తార్కాణం మాత్రమే. 'మాడంత మబ్బు' లాంటి మంచి కథలెన్నో ఉన్న ఈ సంకలనం, చాలా ఏళ్ళ తర్వాత 'పాలపిట్ట' ప్రచురణలు ద్వారా మళ్ళీ అచ్చులోకి వచ్చింది.
"ప్రజలందరూ నాకు ఆశీర్వాద బలాన్నిస్తే సెంచురీ కొట్టేస్తాను.." అక్కినేని నాగేశ్వర రావు ఇంటర్యూ నిన్ననో మొన్ననో చూసినట్టుగా ఉంది టీవీలో. ఇంతలోనే 'అక్కినేని ఇకలేరు' అంటూ అదే టీవీలో వార్త.. ఎంత చిత్రమైనదో కదా జీవితం అనిపించిన క్షణం అది. తను కోరుకున్న నూరేళ్ళకి, తొమ్మిదేళ్ళు తక్కువగా జీవితాన్ని చూసిన అక్కినేని గురించి ఆలోచనలు ఏ పని చేస్తున్నా ఓ ప్రవాహంలాగా సాగుతూనే ఉన్నాయి.
అక్కినేని నాగేశ్వర రావు పుట్టుకతోనే నటుడు కాదు. రంగస్థలం ఎక్కాక నటన నేర్చుకోవడం మొదలుపెట్టి సినిమా రంగానికి వచ్చాక నిరంతరం తన నటనా పటిమకి మెరుగులు పెట్టుకోడానికి శ్రమించిన వ్యక్తి. తొలినాళ్ళలో స్వరం మెరుగుపరుచుకోమని దర్శక నిర్మాతలు ఇచ్చిన సూచనని అమలులో పెట్టే క్రమంలో తెల్లవారుజామునే సముద్రపు ఒడ్డుకు వెళ్లి, ఖాళీ కుండని నోటి ముందు ఉంచుకుని అనేక స్థాయిల్లో మాట్లాడుతూ కావాల్సిన ఫలితాన్ని సాధించడం ఆయనలోని శ్రమించే తత్వాన్ని చెబుతుంది.
"మొదట్లో అక్కినేని నాగేశ్వరరావుకి నటన వచ్చేది కాదు. బెంగాలీ సినిమాలు చూపించి నటన నేర్పించాం" అని సహనటి భానుమతీ రామకృష్ణ అనేక సందర్భాల్లో చేసిన వ్యాఖ్యని ఏనాడూ ఖండించలేదు అక్కినేని. పైగా, నటనలో తను నిత్య విద్యార్దినని చెప్పేవారు. ఒక్క బెంగాలీ సినిమాల నుంచే కాదు, అవకాశం ఉన్న ప్రతి చోటినుంచీ నేర్చుకునే ప్రయత్నం చేశారు. "నటన నా వృత్తి," అని పదేపదే చెప్పడం వెనుక, వృత్తిపట్ల నిబద్ధత కనిపిస్తుంది.
అక్కినేని అనగానే గుర్తొచ్చేది 'జాగ్రత్త.' అవును, అన్ని విషయాల్లోనూ జాగ్రత్త చాలా ఎక్కువ అక్కినేనికి. అది ఆరోగ్యం కావొచ్చు, సంపాదించుకున్న పేరునీ డబ్బునీ నిలుపుకోవడం లో కావొచ్చు. 'అందాల రాముడు' షూటింగ్ అప్పుడు, యూనిట్ వాళ్ల కోసం చుట్టుపక్కల ఊళ్ళకి కుర్రాళ్ళని సైకిళ్ళ మీద పంపి, అప్పుడే పితికిన పాలని బిందెలతో తెప్పించే ఏర్పాటు చేశారట నిర్మాతలు. మెస్ వాళ్ళు ఆ చిక్కని పాలని కాచేసరికి అరచేతి మందాన మీగడ కట్టేదిట. రోజూ ఉదయాన్నే ఆ మీగడతో ఫేస్ ప్యాక్ వేసుకోవడమే కాదు, "చాలా రోజులకి చక్కని మీగడ దొరికింది" అంటూ అన్నం లోనూ కలుపుకునే వారట అక్కినేని.
ఒకరోజు ఉన్నట్టుండి ఛాతీలో నొప్పిగా అనిపిస్తే, ఆ వెంటనే ఆయన చేసిన మొదటి పని మీగడ తినడం మానేయడం! అదికూడా ఏ డాక్టరూ చెప్పకమునుపే!!ముళ్ళపూడి వెంకటరమణ 'కోతి కొమ్మచ్చి' లో పంచుకున్న కబురు చదివినప్పుడు సరదానే అనిపించినా, ఆలోచించినప్పుడు అక్కినేనిలో కొత్త కోణాలు ఎన్నింటినో చూపించింది. ఆరోగ్యంతో పాటు శరీరాకృతిని అదుపులో ఉంచుకోడం, సినిమా పరిశ్రమలో కొత్తగా వస్తున్న మార్పులని ఒడిసిపట్టుకుని వాటికి అనువుగా తనని తాను మలుచుకోవడం వెండితెర మీద అక్కినేని లాంగ్ ఇన్నింగ్స్ కి ఎంతగానో సహాయ పడ్డాయి. తెలుగు తెరకి స్టెప్పులని పరిచయం చేసిన ఘనత అక్కినేనిదే. "అక్కినేని వేస్తేనే స్టెప్పులు" అన్న నానుడి కూడా వచ్చేసింది అప్పట్లో.
"అన్నపూర్ణా స్టూడియో లో అక్కినేని ఆఫీసు రూములో కూర్చుని ఆయనతో మాట్లాడుతున్నా. ఇంతలో ఎవరో ప్రొడ్యూసర్ తాలూకు మనిషి వచ్చి ఆయన చేతికి కొంత డబ్బు ఇచ్చాడు. అక్కినేని ఆ నోట్ల కట్టని ఎంతో జాగ్రత్తగా అందుకుని, లెక్క చూసుకుని, అప్పుడు ఇచ్చినతనకి వెళ్ళిరమ్మని చెప్పారు" అక్కినేనితో సన్నిహితంగా మసలిన మిత్రులొకరు చాలా రోజులక్రితం పంచుకున్న విశేషం ఇది. "కష్టపడి పైకొచ్చిన వాళ్లకి ఆ కష్టం విలువ తెలుస్తుంది. డబ్బు జాగ్రత్త తెలుస్తుంది. వాళ్ళు డబ్బుని ఎడమచేత్తో అందుకుని సొరుగులొకి గిరాటెయ్యలేరు." ఈ ముక్తాయింపు కూడా ఆ మిత్రుడిదే.
అక్కినేని తాతయ్య వేషాలకి ప్రమోట్ అయ్యాక, ఓ కాలేజీ ఫంక్షన్ కి వచ్చారు. ఆడపిల్లల కాలేజీ అది. వాళ్ళని చూసిన ఉత్సాహంలో కాబోలు, అక్కినేని ఉపన్యాసం సరదా సరదాగా సాగుతోంది. ఇంతలో ఓ అమ్మాయి లేచి "మీరో రెండు స్టెప్పులు వేస్తే చూడాలని ఉంది" అని అడిగింది. వెంటనే అక్కినేని "స్టెప్పులు వెయ్యడం నా వృత్తిలో భాగం. సినిమాల్లో అలా వేసినందుకు నిర్మాతలు నాకు డబ్బులిస్తారు. నా పారితోషికం నాకు ఇస్తే ఇక్కడ వెయ్యడానికి కూడా నాకేమీ అభ్యంతరం లేదు" అని గంభీరంగా చెప్పగానే అంత పెద్ద ఆడిటోరియమూ ఒక్క క్షణం మూగబోయింది.
చాలామంది సెలబ్రిటీల కుటుంబాలు ఓసారి కాకపొతే మరోసారి రోడ్డుకెక్కాయి. వాళ్ళ ఇంటి విషయం ఊరందరి విషయమూ అయ్యింది. అక్కినేని కుటుంబం ఇందుకు మినహాయింపు. పైకి కనిపించని క్రమశిక్షణ ఒకటి ఆ కుటుంబంలో కనిపిస్తూ ఉంటుంది. దాన్ని నెలకొల్పిన, కొనసాగించిన ఘనత పూర్తిగా అక్కినేనిదే కాకపోవచ్చు.. కానీ ఆయనకీ భాగం ఉందన్నది వాస్తవం. నేర్చుకోవాలి అనుకునే వాళ్లకి అక్కినేని వ్యక్తిత్వం చాలా విషయాలనే నేర్పుతుంది.. నటన మీదా, జీవితం మీదా తనదైన ముద్రని వేసిన అక్కినేని నాగేశ్వరరావు కొన్ని తరాలపాటు తెలుగువారి హృదిలో చిరంజీవి!!
కొండకోనల్లో పుట్టి పెరిగిన అడవిమల్లి ఆ చిన్నది. నాగరికత వాసనలేవీ తెలియనే తెలియవు. మనసులో ఏదో దాచుకుని, పైకి మరేదో మాట్లాడాల్సిన అవసరం ఏమాత్రమూ లేని ప్రపంచం ఆమెది. చెట్టూ చేమల మధ్య ఆడుతూ పాడుతూ పెరిగిన ఆ అమ్మాయి, తనకి వయసొచ్చిన విషయం గ్రహించుకుంది. తోడు కావాలన్న తొందర ఆమెలో మొదలయ్యింది. ఓ చక్కని జానపదం అందుకుంది. తన చుట్టూ ఉన్న ప్రకృతితో పాట రూపంలో సంభాషించింది.
యవ్వనం వస్తూ వస్తూ తనతోపాటు ఉరిమే ఉత్సాహాన్ని తీసుకు వస్తుంది. ప్రపంచంలో ఉన్న అందమంతా తన చుట్టూనే ఉన్నట్టు, సంతోషం మొత్తం తనలోనే నిక్షిప్తమైనట్టూ అనిపించడం, యవ్వనారంభంలో అందరికీ సహజమే. ఇందుకు ఆ అడవిమల్లి మినహాయింపు కాదు. ఆమెలో కొత్త ఉత్సాహం పెల్లుబుకుతోంది. నవ్వు దాగనంటోంది. ప్రకృతిలో తననీ, తనలో ప్రకృతినీ చూసుకుంటూ తనకి తగ్గ జతగాడి కోసం ఎదురు చూస్తోంది.
'మౌనపోరాటం' (1989) సినిమాలో ఈ సన్నివేశానికి మన్యపు సౌందర్యాన్ని, గిరిజనపు వాడుకలనీ మేళవించి ఓ అందమైన పాట రాశారు వేటూరి సుందర రామ్మూర్తి. సంగీత దర్శకత్వం మరెవరో కాదు, ఎస్. జానకి!! గాయనిగా క్షణం తీరిక లేకుండా ఉన్న సమయంలో, జానకి ఎంతో ఇష్టంగా ప్రత్యేకించి సమయం కేటాయించుకుని మరీ సంగీత దర్శకత్వం వహించిన సినిమా ఇది. 'యాల యాల యాలగా ఇదేమి ఉయ్యాల...'అంటూ తొలి యవ్వనపు గిరితనయ లోకి పరకాయ ప్రవేశం చేసి, ఈ పాట పాడేనాటికి జానకి వయసు అక్షరాలా యాభయ్యేళ్లు!
జానకి గొంతులో వినిపించే చిలిపితనం, మధ్యమధ్యలో నవ్వులు, 'ఉప్పొంగి పోయింది మా తేనె గంగమ్మ... ముక్కంటి ఎంగిలి సోకని గౌరమ్మ..' పలికిన తీరు, కోయిలతో పోటీ పడడం.. ఇవేవీ మరో గాయని నుంచి ఆశించలేం..
మనుషులకుండే కట్టుబాట్లు, పట్టింపులకి అతీతురాలు ఆ యక్షిణి. మనసు పడ్డది ఏదైనా సాధించుకునే నేర్పు ఆమెకి సొంతం. ఆ యక్షిణి ఓ మానవ మాత్రుడిని మోహించింది. కార్యార్ధియై ఆమె దగ్గరకి వెళ్ళాడు అతడు. అందగాడు, యువకుడు అయిన అతన్ని చూడగానే ఆమెలో మోహం పొంగులెత్తింది. అతన్ని తన సరసకు, సరసానికి ఆహ్వానించింది.
మానవమాత్రుడు కదూ అతను. కట్టుబాట్లు పట్టి ఆపుతున్నాయి అతన్ని. అలాగని, ఆమె కోరికని తిరస్కరించి కోపానికి గురయ్యే సాహసం చెయ్యలేడు. అతడు నెరవేర్చాల్సిన కార్యానికి ఆమె సాయం కీలకం మరి. అందుకే ఆమె ఆహ్వానానికి అతడు 'అవున'ని చెప్పలేదు. 'కాద'ని ఆమెని దూరంగా నెట్టనూ లేదు. ఆమెని కవ్విస్తూనే, తను వచ్చిన పని పూర్తి చేసుకునే పనిలో నిమగ్నమై ఉన్నాడు అతగాడు.
'భైరవద్వీపం' (1994) జానపద చిత్రం లోని ఈ సన్నివేశానికి తగ్గట్టుగా ఓ శృంగారభరిత గీతాన్ని రాశారు వేటూరి సుందర రామ్మూర్తి. ('జావళి' అనడం సబబేమో!) యక్షిణి కాంక్షని తన గొంతులో నింపుకుని పాటని ఆలపించే గాయని కావాలి. కథానాయకుణ్ణి కవ్వించాలి. యక్షిణి కోర్కెని వెల్లడించి, అతనిలో కదలిక తేవాలి. పాటలోని ప్రతి అక్షరంలోనూ శృంగారాన్ని ఒలికించాలి. యాభై ఐదేళ్ళ జానకి గొంతులో శృంగార రసం పలికిన తీరుని 'నరుడా ఓ నరుడా ఏమి కోరిక?' పాటలో వినాలే తప్ప, మాటల్లో చెప్పడం కష్టం..
కలలు అందరికీ ఉంటాయి.. కానీ వాటిని పదిమందితో పంచుకోగలిగే వాళ్ళు బహుతక్కువ. అందరూ ఏమనుకుంటారో అన్న బెరుకు, కలలేవీ నెరవేరకపోతే నవ్వుతారేమో అన్న భయం.. ఇవన్నీ పట్టి ఆపుతూ ఉంటాయి చాలామందిని. కానీ, ఆ టీనేజ్ అమ్మాయి అలా కాదు. అందరిలో ఒక్కర్తె గా బతకడానికి ఆమె వ్యతిరేకి.. అందరిలోనూ ప్రత్యేకంగా నిలబడాలి, తనగురించి అందరూ చెప్పుకోవాలి అన్నది ఆమె కల. తనకంటూ ఓ స్థానం సంపాదించుకోవాలన్నది ఆమె కోరిక, ఆశ, ఆశయం..
ఎవరేం అనుకుంటారో అన్న బెరుకు ఏ కోశానా లేని ఆ అమ్మాయి తన కలలని గురించి ఎలా చెబుతుంది? గొంతెత్తి చెబుతుంది.. ధైర్యంగా చెబుతుంది.. ఆత్మ విశ్వాసం తొణికిసలాడే స్వరంతో చెబుతుంది. కేవలం ఆశల్ని మాత్రమే ప్రస్తావించి ఊరుకోదు. వాటిని నెరవేర్చుకునే మార్గాల గురించీ, అందుకు పడాల్సిన శ్రమని గురించీ కూడా చెబుతుంది. అలా శ్రమ పడడానికి తను సిద్ధంగా ఉన్నానని చెప్పడానికి ఏమాత్రం మోమాట పడదు కూడా.. ఈ చెప్పడం అన్నది మాటల్లో కాక పాటగా అయితే?
'రంగేళి' (1995) అనువాద చిత్రంలో ఈ సన్నివేశానికి పాటని సిద్ధం చేశారు 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి. కుర్రకారుకి హుషారెక్కించే బాణీతో ఎదురు చూస్తున్నారు సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్. గొంతులో పడుచుదనాన్ని పరవళ్ళు తొక్కించే గాయని కావాలి. ఎవరున్నారు? అన్న ప్రశ్నకి సమాధానం యాభయ్యారేళ్ళ ఎస్. జానకి. వయసుతో నిమిత్తం లేకుండా, ఆమె గొంతు పదహారు లోనే ఆగిపోయిందని ఒప్పుకోక తప్పదు, 'యాయిరే.. యాయిరే.. వారెవా ఇది ఏం జోరే..' పాట వింటూంటే.. 'వారెవా' వచ్చిన చోటల్లా ఒక్కోసారి ఒక్కోలా పలకడం, స్పూర్తివంతంగా ఉండే రెండో చరణాన్ని పాడిన తీరు ప్రత్యేకంగా గమనించాలి..
దేవుడు అనగానే మొదట గుర్తొచ్చేది సాత్వికమైన రూపం, చెదరని చిరునవ్వు. అదే, దేవత అనుకోగానే కళ్ళముందు మెదిలేది ఉగ్ర రూపమే.. దేవతలలో ప్రేమ, కరుణ, వాత్సల్యం ఇవన్నీ ఉన్నా ఒకలాంటి ఆవేశమే గుర్తొస్తుంది మొదట. అందుకే కాబోలు, దేవుళ్ళ స్తోత్రాల్లో మంద్రస్వరం వినిపిస్తే, దేవతలని స్తుతించే స్వరంలో ఆవేశం వినిపిస్తుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకి కనకదుర్గమ్మ పెట్టింది పేరు. అటు ఉగ్రంగానూ, ఇటు కరుణ పూరితంగానూ తన భక్తులకి కనిపించగల దేవత ఆమె.
మరి, అటువంటి దేవతని స్తుతించే గొంతు ఎలా ఉండాలి? ఆవేశమూ, కరుణా సమపాళ్ళలో రంగరించి ప్రార్ధించి ప్రసన్నం చేసుకోవాలి. మనసులో ఆ మూర్తిని నిలుపుకున్నప్పుడు తెలియకుండానే భక్త్యావేశం ఆవహిస్తుంది. 'దేవుళ్ళు' (2001) సినిమాలో ఇంద్రకీలాద్రి పై వెలసిన కనకదుర్గని ప్రార్ధించే సన్నివేశం కోసం ఓ భక్తిగీతాన్ని రచించారు జొన్నవిత్తుల. ఆవేశపూరితంగా వినిపించే బాణీని అందించారు సంగీత దర్శకుడు 'వందేమాతరం' శ్రీనివాస్.
భక్త్యావేశాన్ని కరుణ రసంతో రంగరించి అరవై రెండేళ్ళ జానకి పాడిన పాట 'మహా కనకదుర్గా...'ఈ పాట వింటూ ఉంటే తన భక్తులని రక్షించుకోడానికి కనకదుర్గమ్మ కొండ దిగి వస్తున్న భావన కలుగుతుంది.. ముఖ్యంగా రెండో చరణం పాడిన తీరు అనితరసాధ్యం.
(ఐదు దశాబ్దాలకి పైగా అనేక వేల పాటలు పాడి, ఒక్క తెలుగే కాక దక్షిణాది సినీ సంగీతం మీద తనదైన సంతకం చేసిన నిరుపమాన గాయని ఎస్. జానకి స్వరానికి వినమ్ర అక్షరాంజలి!!)
అంజలీదేవి.. ఈ పేరు తలచుకోగానే ఎన్ని జ్ఞాపకాలో.. జీవితాన్ని ఎనభై ఆరేళ్ళ పాటు పరిపూర్ణంగా జీవించి ఆమె ఈ లోకం నుంచి సెలవు తీసుకుందని తెలిసిన క్షణం నుంచీ, అంజలికి సంబంధించిన జ్ఞాపకాలన్నీ కలగాపులగంగా నెమరుకొస్తూనే ఉన్నాయి.. ఎక్కడినుంచి మొదలు పెట్టడం? వెండితెర కబుర్లా.. వ్యక్తిగత విశేషాలా...??
'సువర్ణ సుందరి' సినిమా మొదటిసారి చూసిన జ్ఞాపకం ఇంకా తడి ఆరలేదు. 'దేవకన్య అంటే అచ్చం ఇలాగే ఉంటుంది కాబోలు' అనిపిస్తూనే ఉంది, సినిమా చూస్తున్నంతసేపూ. అంతటి దేవకన్యా మానవమాత్రురాలిగా మారిపోవడం, అలవికాని కష్టాలు అనుభవించడం.. సినిమా కథని ముందుకి నడిపాయేమో కానీ.. ఉహు.. నచ్చలేదు ఎందుకో..అంజలి అంటే 'పిలువకురా..' పాడుతున్న అంజలే.
ఆ తర్వాత 'అనార్ కలి'..ముద్దకట్టిన అమాయకత్వం కదూ ఆ నాయిక?! 'జీవితమే సఫలమూ..' అంటూ అనారు పూల తోటలో విహరిస్తూ ఆమె పాడుతూ ఉంటే, రెండు కళ్ళూ చాలతాయా చూడ్డానికి? ఇక, 'రాజశేఖరా.. నీపై మోజు తీరలేదురా..' జావళి మరీ? 'వేగరారా' అని ఆమె పాడుతూ ఉంటే, సినిమా హాల్లో సీటుకి అంటిపెట్టుకునే ఉండాల్సి రావడం ఎంత దుర్భరం!!
ఆశ్చర్యం ఏమిటంటే, అంతటి అందగత్తే సీతా మహాసాధ్వి పాత్రలోకి సులువుగా పరకాయ ప్రవేశం చేసేసింది, 'లవకుశ' సినిమాకోసం. 'సందేహింపకుమమ్మా..' పాట చూస్తూ, ఆమె జానకి కాదు, అంజలి అంటే నమ్మగలమా అసలు? 'భక్త తుకారాం' లో పూర్తి నాస్తికురాలి పాత్ర! చూస్తుండగానే అమ్మగానూ, అటుపై బామ్మగానూ మారిపోయింది వెండితెరమీద. ఏ పాత్ర చేసినా తన మార్కు సారళ్యం కనిపించి తీరేది.
దగ్గరలోనే ఉన్న పెద్దాపురం కదూ అంజలి స్వస్థలం.. అలా ఆమె గురించిన కబుర్లు కూడా తరచూ వినిపించేవి. ఆదినారాయణ రావుతో ప్రేమ, పెళ్లి.. కాకినాడ యంగ్మెన్స్ హేపీ క్లబ్ లో నాటకాల రిహార్సల్స్ కి వాళ్ళిద్దరూ కలిసి సైకిలు మీద వెళ్ళడం.. అటుపై మదరాసు ప్రయాణం.. సినిమా అవకాశాలు.. ఇలా ఎన్ని కబుర్లో.. ఎన్నెన్ని సార్లు విన్నానో.. "మనంజమ్మ" అని మాట్లాడేవాళ్ళు మావైపు వాళ్ళు, అభిమానంగా.
నటిగానూ, నిర్మాతగానూ వరుస విజయాలు చూసిన అంజలి ఉన్నట్టుండి నష్టాల బారిన పడింది. "లంకంత ఇల్లు కట్టింది మదరాసులో.. కానీ ఇంట్లోనే దేవుడి గుడి కూడా కట్టేసింది.. పూజా మందిరం పెట్టుకోవాలి కానీ, గుడి కట్టేస్తారా ఇంట్లో? అందుకే ఇబ్బందుల్లో పడింది" అని నొచ్చుకున్నారు కొందరు. కొన్నేళ్ళ తర్వాత, పెద్దాపురం లో ఉన్న పాతిల్లు అమ్మకానికి పెట్టినప్పుడు, చాలామంది అమ్మొద్దని సలహా ఇచ్చారు కానీ, ఎందుకో మరి..ఆమె వినిపించుకోలేదు.
ఆదినారాయణ రావు మరణం తర్వాత, సినిమాలు చేయడం తగ్గింది. పుట్టపర్తి బాబాకి భక్తురాలు. ఆయనవల్లే తన కష్టాలు గట్టెక్కాయని గట్టి నమ్మకం ఆమెకి. సినిమా నటుల గురించి, మరీ ముఖ్యంగా నటీమణుల గురించి జరిగే ప్రైవేటు సంభాషణల్లో సహజంగానే ఒకింత చులకన స్వరం వినిపిస్తూ ఉంటుంది. ఇందుకు అంజలి మినహాయింపు. ఆమె మాట మన్నన, ఎదుటివారికి ఇచ్చే గౌరవం ఇందుకు కారణం కావొచ్చు. సినిమా పరిశ్రమలో అంజలీదేవి అజాతశత్రువు. ఆమె పరిపూర్ణ నటి మాత్రమే కాదు, పరిపూర్ణ జీవితం గడిపిన మహిళ కూడా..
లోకులు ఆమెని కాకుల్లా పొడుస్తున్నారు.. ఏకాంతం అన్నది ఆమెకి ఎండమావిగా మారింది. ఏ రహస్యాన్నైతే ఆమె తన ప్రాణం కన్నా ఎక్కువగా దాచుకుందో, అది ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. ఆమెకి మనశ్శాంతి కరువయ్యింది. మనుషుల మీద నమ్మకం పూర్తిగా పోయింది. బతకాలన్న ఆశ తుడిచిపెట్టుకుపోయింది. లోకం ఆమెని మరణించనివ్వడం లేదు.. అలాగని, జీవించి ఉండడానికీ అడుగడుగునా అడ్డుపడుతూనే ఉంది.
జరిగిన దానిలో ఆమె తప్పు ఏముంది అసలు? ఆ పాతికేళ్ళ అమ్మాయి తన ప్రాణం పోయినా సరే, తన గతం ఏమిటన్నది మరొకరికి తెలియకూడదు అనుకుంది. పెద్దగా ప్రయత్నం లేకుండానే రాత్రికి రాత్రే వెండితెర కలలరాణి గా అవతరించింది. లక్షలాది మంది అభిమానులని సంపాదించుకుంది. సరిగ్గా ఈ తరుణంలో, ఆమె గతం తాలూకు రహస్యం లోకానికి తెలిసిపోయింది. ప్రపంచానికి ఓ పెద్ద వినోదం దొరికింది. ఎక్కడికి వెళ్ళినా అవే ప్రశ్నలు.
తనకంటూ ఎవరూ లేరనీ, కనీసం తన ప్రాణం తీసుకునే అవకాశం కూడా తనకి లేదనీ అర్ధమైంది ఆమెకి. అపనమ్మకం, నిరాశ, నిస్పృహల నుంచి ఓ ఆవేశం పుట్టింది.. అది పాటగా మారింది.'సితార' (1984) సినిమాలోని ఈ సన్నివేశం కోసం వేటూరి సుందర రామ్మూర్తి రచించిన కవితాత్మక వచనానికి, క్లిష్టమైన బాణీ కట్టారు ఇళయరాజా.
ఆ అమ్మాయి ఉన్న పరిస్థితులు, ఆమె నిరాశా నిస్పృహలు, అపనమ్మకం, విరక్తి... ఇవన్నీ గాయని గొంతులో ప్రతిఫలించాలి. ఆరంభంలో వచ్చే ఆలాపన, 'జీవిత వాహిని అలలై...' దగ్గర మొదలైన ఆవేశం 'పూల తీవెలో' దగ్గరకి వచ్చేసరికి ఆవేదనగా మారడం, 'నిన్నటి శరపంజరాలు..' చరణం పాడిన తీరు, ఒలికించిన విషాదం... ఒక్కటేమిటి? పాట మొత్తాన్ని చెప్పుకోవాల్సిందే.. నలభై ఐదేళ్ళ జానకి పాడిన 'వెన్నెల్లో గోదారి అందం..' పాట ఆమెకి జాతీయ అవార్డుని సంపాదించి పెట్టింది...
ఆమె ఓ కళాశాల అధ్యాపకురాలు. ఎక్కడ అన్యాయం కనిపించినా ప్రశ్నించడం ఆమె నైజం. ఆమెభర్త న్యాయవాది. కాకపొతే అతని తీరువేరు. న్యాయం అంటే కోర్టుకి మాత్రమే సంబంధించిన విషయం అతనికి. తన సహజ ధోరణిలో ఓ రౌడీని ఎదిరించి మాట్లాడింది ఆమె. ఆ రౌడీ అవమానంతో రగిలిపోయాడు. నడిరోడ్డు మీద ఆమెని వివస్త్రని చేశాడు. ఆమె భర్తతో సహా యావత్ ప్రపంచం కేవలం ప్రేక్షక పాత్ర పోషించింది ఆ క్షణంలో.
ఓ వీధి రౌడీ చేతిలో అవమానింపబడిన భార్య తన ఇంట్లో ఉండడం తనకి అవమానం అనుకున్నాడు భర్త.
ఆమె రోడ్డు మీదకి నడిచింది. ఎప్పటిలాగే కాలేజీకి వెళ్ళింది. తరగతి గదిలో తను పాఠాలు చెప్పవలసిన బ్లాక్ బోర్డు మీద స్త్రీ నగ్నచిత్రాలు. మీసాలు, గెడ్డాలు మొలిచిన 'మగ' విద్యార్ధుల నుంచి అవహేళనలు. దారుణమైన అవమానం ఆమెకి. అంతకు మించిన ఆక్రోశం ఆమెలో.. తరగతి గదిలో ఒక్కో విద్యార్ధీ కాబోయే రౌడీలా కనిపించాడు ఆమెకి. బొమ్మలు గీసిన వాళ్ళకి ఘాటైన సమాధానం చెప్పింది, మాటలతో కాదు. ఒక పాటతో..
'ప్రతిఘటన' (1986) సినిమాలో ఈ సన్నివేశానికి పదికాలాల పాటు నిలబడిపోయే పాటని రాశారు వేటూరి సుందర రామ్మూర్తి. క్షణాల్లో బాణీ కట్టారు సంగీత దర్శకుడు చక్రవర్తి. అవమానాన్ని భరిస్తూ, అవహేళనని ప్రశ్నిస్తూ, అదే సమయంలో దారితప్పుతున్న యువతకి దిశా నిర్దేశం చేయాల్సిన పాట. గాయని మీద ఉన్న బాధ్యత చాలా పెద్దది. కథానాయిక భావసంచలనాన్ని ఆవాహన చేసుకుని, ఏమాత్రం సంయమనం కోల్పోకుండా ఆలపించాలీ పాటని.
నలభై ఏడేళ్ళ జానకి గొంతులో ఖంగున మోగింది 'ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో..' పాట. తుపాకీ గొట్టం చివరినుంచి పొగలు కక్కుతూ బయటికి వచ్చే గుళ్లని తలపిస్తాయి పదాలు. 'కన్న మహాపాపానికి ఆడది తల్లిగ మారి..' చరణం ఒక్కటి చాలేమో, జానకి మాత్రమే ఈ పాటని ఎందుకు పాడాలో.. పాట మొత్తానికి ఒకే వాక్యాన్ని ఎంచుకోమంటే, నేను చెప్పేది 'ప్రతి భారత సతిమానం.. చంద్రమతీ మాంగల్యం...' వేటూరి-జానకి ల నుంచి తప్ప మరొకరి నుంచి కనీసం ఊహించలేం..
ఆమె పదహారణాల తెలుగింటి అమ్మాయి. సంప్రదాయం నరనరాల్లోనూ జీర్ణించుకున్న తండ్రికి తనయ. తండ్రి ఉద్యోగ రీత్యా విదేశంలో స్థిరపడాల్సి వచ్చినా తలుగింటి కట్టునీ, బొట్టునే కాదు తెలుగు సంగీతాన్నీ మర్చిపోలేదు ఆమె. ఏదేశమేగినా తెలుగింటి అమ్మాయే తను. ఆమె ఇంటికి దగ్గరలో ఉన్న ఇద్దరు విదేశీ యువకులతో ఆమెకి స్నేహం మొదలైంది. వాళ్ళలో ఒకరు అమెరికన్, మరొకరు ఆఫ్రికన్.
ఉన్నట్టుండి ఒకరోజు యువకులిద్దరూ ఆమెని ప్రేమిస్తున్నామని చెప్పారు. ఇందుకు ఆమె నుంచి అభ్యంతరం ఏమీ లేదు. ఎందుకంటే ఆమె దృష్టిలో ప్రేమ, పెళ్లి అనేవి మనసుకి సంబంధించినవి, సంప్రదాయానికి సంబంధించినవి కానే కాదు. ఇంతకీ ఆ ఇద్దరిలో తను ఎవరిని ప్రేమిస్తున్నట్టు? ఇదీ ఆమె ముందున్న ప్రశ్న.
పెద్దగా కష్ట పడక్కర్లేకుండానే ఆమెకి జవాబు దొరికేసింది. తను ప్రేమిస్తున్నది అమెరికన్ కుర్రాడినని. అతనిచ్చిన కానుకని తాకి చూడగానే, ఆరడుగుల అమెరికన్ కుర్రాడూ ఆమె కళ్ళకి బాలకృష్ణుడి లాగా కనిపించాడు.
సంప్రదాయాన్ని మరచిపోని అమ్మాయి కదూ.. అందుకే ఓ సంప్రదాయ కీర్తనలో ఆ అమెరికన్ బాలకృష్ణుడి లీలలని ఊహించుకుంది.
'పడమటి సంధ్యారాగం' (1987) లోని ఈ సన్నివేశం కోసం అన్నమాచార్య కీర్తనని ఉపయోగించుకున్నారు దర్శకుడు జంధ్యాల. సంగీత దర్శకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కీర్తన సౌందర్యం ఏమాత్రం చెడని విధంగా, సినిమాకి తగినట్టు ఉండేలాగా స్వరాన్నిచ్చారు. బాలకృష్ణుడి చిలిపి చేష్టలని మధుర భక్తితో గానం చేయగలిగే గాయని కావాలి. ఆ గొంతులో ప్రేమ, భక్తి పారవశ్యాలకి రవ్వంత చిలిపిదనం మేళవించాలి.
నలభై ఎనిమిదేళ్ళ జానకి ఆలపించిన 'ముద్దుగారే యశోదా..' కళ్ళు మూసుకుని వింటుంటే, బాలకృష్ణుడు కళ్ళముందు ప్రత్యక్షం అవ్వడూ?? జానకి మేజిక్ తో పాటు, మిమిక్రీనీ వినాలి, పాట మధ్యలో...
ఆమె అతన్ని మనస్పూర్తిగా ప్రేమించింది. ఆ ప్రేమని ప్రకటించింది కూడా. ఆ తర్వాత తెలిసింది, అతనో పెద్ద అబద్ధం చెప్పాడని. అది కూడా కేవలం ఆమె ప్రేమని గెలుచుకోవడం కోసమే చేశాడనీ. తను చేసిన పనిని అతను నిజాయితీగా ఒప్పేసుకున్నాడు. ఏం చేసి అయినా సరే, అనుకున్నది సాధించుకోవడం తన తత్వమనీ, చిన్నప్పటినుంచీ ఎన్నో చోట్ల అబద్ధాలు చెప్పాల్సి వచ్చిందనీ చెప్పుకున్నాడు.. అంతేకాదు, నిజం తెలిసిన తర్వాత ఆమె తీసుకునే ఏ నిర్ణయమైనా తనకి సమ్మతమే అని చెప్పేశాడు.
ప్రేమకి పునాది నమ్మకం అయితే, ఆ పునాది సమూలంగా కూలిపోయే సందర్భం ఇది. అతను నిజం దాచి తనని మోసం చేసిన కారణానికి దూరం పెట్టాలా? నిజాయితీగా జరిగింది ఒప్పుకున్నందుకు క్షమించాలా? ఇదీ ఆమె ముందున్న ప్రశ్న. ఆమె ప్రేమ గొప్పది.. నిజం చెప్పాలంటే, అతని ప్రేమకన్నా గొప్పది. కాబట్టే, అతన్ని వదులుకోడానికి సిద్ధపడలేదు ఆమె.. అతను తనకి కావాలి.. అతని తోడిదే తన జీవితం కావాలి.. ఈ విషయం అతనికి చెప్పాలి.. ఎలా??
ఆమె మామూలు ఆడపిల్ల కాదు.. పిన్న వయసులోనే గొప్ప పేరు తెచ్చుకున్న శాస్త్రీయ నృత్య కళాకారిణి.. అతనూ సామాన్యుడు కాదు.. వేణుగాన విద్వాంసుడు. అతనికి తన మనసు చెప్పడానికి మాటలు చాలవు కదా.. అందుకే ఆమె పాటని ఆశ్రయించింది.. అది కూడా సద్గురు త్యాగరాజ స్వామి కీర్తనని.. అతను తనకి దూరంగా వెళ్ళాల్సిన అవసరం లేదని, అతనికి తప్ప మరొకరికి తన మనసులో స్థానం లేదనీ పాట ద్వారా చెప్పింది..'సప్తపది' (1981) సినిమాలోని ఈ కీలక సన్నివేశంలో ప్రేమ పరీక్షని ఎదుర్కొన్న ఆ ముద్దరాలి పాటకి కెవి మహదేవన్ స్వరం సమకూర్చగా, గొంతు ఇచ్చింది నలభై రెండేళ్ళ ఎస్. జానకి.
గుండె లోతుల్లోనుంచి పొంగి వచ్చే అమాయకమైన ప్రేమని ప్రకటించడంలో జానకి గొంతుది ఓ ప్రత్యేకమైన ఒరవడి. తెరపై దృశ్యం చూస్తున్న ప్రేక్షకులకి, ఆ అమ్మాయి తన గుండెని అతని దోసిట్లోకి జారవిడుస్తోందనిపించేలా చేయడం జానకికి మాత్రమే సాధ్యం.. జానకి ఆలపించిన 'మరుగేలరా ఓ రాఘవా' కీర్తనలో ప్రతి పదం దేనికదే ప్రత్యేకం అయినప్పటికీ 'అన్ని నీవనుచు.. అంతరంగమున..' 'నిన్నెగాని మదిని ఎన్నజాల నొరుల...' వింటుంటే మన గుండె చప్పుడులో తేడా మనకే స్పష్టంగా తెలుస్తుంది.. ఒకసారి కాదు.. పాట విన్న ప్రతిసారీ...
తనను ప్రాణంగా ప్రేమిస్తున్న మనిషి, తనకి కూడా ఇష్టమైన మగాడు, ఎదురుగా నిలబడి "మనం పెళ్లి చేసుకుందాం" అంటే ఏ అమ్మాయి అయినా ఎగిరి గంతేయాలి. కానీ ఆమె వేరు.. ఆమె పరిస్థితులు పూర్తిగా వేరు.. అతనికి ఆమె "అలాగే" అని సమాధానం చెప్పలేకపోయింది.. అలా అని "కాదు" అనీ చెప్పలేదు. కాదని చెప్పడానికి కారణం లేదు.. అవుననడానికి మాత్రం ఓ పెద్ద అడ్డంకే ఉంది. అదేమిటో అతనికి చెప్పలేదు.. చెప్పకుండా ఉండనూ లేదు.. ఎందుకంటే, ఆమెకీ అతనంటే ఇష్టమే..
తన వెంటపడ్డ ఐదుగురు ఆకతాయి కుర్రాళ్ళ ఆలోచనల్లో మార్పు తెచ్చి, వాళ్ళు సక్రమమైన దారిపట్టేలా చేసిన ఆ అమ్మాయి.. వాళ్ళలో ఓ కుర్రాడు తనని ప్రేమిస్తున్నాడని సులువుగానే అర్ధం చేసుకుంది.. ఆడపిల్ల, అందులోనూ దగ్గర స్నేహితురాలు.. ఆమాత్రం అతని మనసు అర్ధం చేసుకోలేదూ? అయినా ఉలకలేదు, పలకలేదు. చివరికి అతనే ఒకరోజు ఆ ప్రస్తావన తీసుకొచ్చాడు. డొంక తిరుగుడు లేకుండా నేరుగా విషయం చెప్పేశాడు.. ఆమె స్పందన కోసం ఎదురు చూశాడు.. మాట్లాడాల్సిన ఆమె, పాటని అందుకుంది..
'మంచుపల్లకీ' (1982) సినిమాలోని ఈ సన్నివేశానికి బలాన్ని చేకూర్చే పాట రాశారు వేటూరి సుందర రామ్మూర్తి. ఆ అమ్మాయి మనసునీ, అందులో గూడు కట్టుకున్న వేదననీ అలవోకగా పాట కట్టేశారు. వడ్డించిన విస్తరిలాంటి భవిష్యత్తు తనకోసం ఎదురు చూస్తున్నా, పరిస్థితుల కారణంగా "వద్దు" అని చెప్పవలసి వచ్చిన ఓ ఆడపిల్ల లో చెలరేగే మానసిక సంఘర్షణ ఎలా ఉంటుంది? ఆమెది కన్నీళ్లు పెట్టుకునే తత్త్వం కాదు.. అందుకే పాటలో ఎక్కడా కన్నీళ్లు ఉండవు.. కానీ పాట ఆసాంతమూ ఆ అమ్మాయి పడే వేదన ప్రతిఫలిస్తూ ఉంటుంది..
నలభై మూడేళ్ళ జానకి పాడిన 'మేఘమా.. దేహమా..' పాట వినే శ్రోతలకి తెలియకుండానే మనసు బరువైపోతుంది.. గాయని గొంతులో వినిపించే ఆర్ద్రత, నీటి చుక్కగా మారి శ్రోతల కనుకొనల్ని చేరుతుంది. 'నాకొక పూమాల తేవాలి నీవు.. అది ఎందుకో...' వింటూ ఉన్నప్పుడు, ఆ నీటి చుక్క కంటి నుంచి బయట పడడానికి అక్షరాలా ఓ పెద్ద యుద్ధమే చేస్తుంది.. రాజన్-నాగేంద్ర స్వరపరిచిన ఈ పాటని ఓసారి విన్న తర్వాత మర్చిపోవడం అసాధ్యం.. ఎందుకంటే అలా వెంటాడుతూనే ఉంటుంది..
గెడసాము చేసే ఇంట్లో పుట్టింది ఆ పిల్ల. తలమీద నీళ్ళ చెంబు, చేతిలో గెడ తో, తల్లిదండ్రుల డప్పుల దరువులకి లయబద్ధంగా తాడు మీద నడుస్తూ, ఓ నాట్యాచార్యుడి కంట పడింది. అలాంటి పిల్లకోసమే వెతుకుతున్నాడు ఆయన. ఆమె తల్లిదండ్రులని ఒప్పించి, అగ్రహారాన్ని ఎదిరించి, ఇంటికి దూరంగా ఊరి చివర ఇల్లు కట్టుకుని మరీ అత్యంత శ్రద్ధగా ఆమెకి నాట్యం నేర్పించాడు. ఆమె నాట్య కళాకారిణి గా అగ్రహారీకుల చేత అవును అనిపించుకున్ననాడే ఆచార్యుడు తిరిగి అగ్రహారంలో ప్రవేశించగలుగుతాడు.
తన పనులు తనే చేసుకోడం తెలియని పసితనం ఆమెది. గురువుగారికి నాట్యం నేర్పడం తప్ప మరో ధ్యాస లేదు. అదిగో, అప్పుడు వచ్చారు, గురువుగారి తండ్రి. వయో వృద్ధుడు. గురువు యెడల భయంతో దూరంగా మసలిన ఆ పిల్ల, తాతయ్యకి ఇట్టే చేరువయ్యింది. స్నాన పానాదుల మొదలు, జడ వేసుకోడం, ఇల్లు చక్కదిద్దుకోవడం ఇవన్నీ అలవోకగా నేర్చేసుకుంది, తాతయ్య సాహచర్యంలో.
కాల చక్రం గిర్రున తిరిగి పసిపిల్ల పదారేళ్ళ పడుచు అయ్యింది.. శాస్త్రీయ నృత్యంలో గురువు అంచనాలనీ అందుకుంది.
అగ్రహారానికి కబురు వెళ్ళింది. ఆమెకి విద్యా పరీక్ష. ఓ అగ్రహారపు విద్యార్ధికీ, ఆమెకీ మధ్య పోటీ.. ఆమె గెలిస్తే గురువుకి అగ్రహర ప్రవేశం, ఓడిపోతే శాశ్వత బహిష్కరణ. తాతయ్య ధైర్యం చెప్పారు. గురువు ఆశీర్వదించారు.. ప్రదర్శన ఏర్పాటు అయ్యింది. పోటీ మొదలైన కాసేపటికి తాతయ్య సభాస్థలి వదిలి వెళ్ళిపోవడం ఎవరూ గమనించలేదు.. పోటీ సగానికి వచ్చేసరికల్లా తాతయ్య మరిలేరన్న కబురు తెలిసింది. పోటీ ఆగడానికి వీలు లేదంది అగ్రహారం. విషమ పరీక్ష... గురువుకీ, ఆమెకీ కూడా. గురువు నట్టువాంగం, గాయని గాత్రం, ఆమె పద నర్తనం... అన్నింటిలోనూ మార్పు.. కొట్టొచ్చినట్టు కనిపించే విషాదం.
'ఆనంద భైరవి' (1983) సినిమాలో ఈ సన్నివేశానికి అద్భుతమైన గీతాన్ని రచించారు దేవులపల్లి కృష్ణశాస్త్రి. అంతే అద్భుతంగా స్వరపరిచారు రమేష్ నాయుడు. ఇవాల్టికీ, కూచిపూడి సంప్రదాయంలో జరిగే నృత్య ప్రదర్శనల్లో ఈ పాట, ఇదే బాణీలో వినిపిస్తుందంటే అర్ధం చేసుకోవచ్చు, పాట గొప్పదనం. గాయని ముందున్న సవాలు చిన్నదేమీ కాదు. నట్టువాంగానికి అనుగుణంగా స్వరం ఇవ్వాలి.. భావ గర్భితంగా ఉండాలి.. పాట ప్రధమార్ధం లో గొంతులో ఉత్సాహం ఉరకలు వెయ్యాలి.. ద్వితీయార్దానికి వచ్చేసరికి, బాధ, అసహాయత, ఆవేశం మిళితమవ్వాలి.
యవ్వనం.. జీవితం మొత్తంలో ఓ అందమైన భాగం. వీడని బాల్య చాపల్యం, ఒక్కసారిగా వచ్చి పడే పెద్దరికం..రెండూ కలిసి ఉక్కిరిబిక్కిరి చేసే సమయం. అంతేకాదు, చుట్టూ ఉన్న ప్రపంచం ఎంతో అందంగా కనిపించడం మొదలవుతుంది.. ప్రకృతిలో అంతకు మునుపు గోచరించని కొత్త అందాలు ఎన్నో సాక్షాత్కరిస్తూ ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే సృష్టి మొత్తం సౌందర్య భరితంగా కనిపించే కాలం అది.ఏ చీకూ చింతా లేని భద్ర జీవితం గడిపే ఓ అమ్మాయి యవ్వనంలోకి అడుగు పెట్టినప్పుడు, అప్పటివరకూ తెలియని ప్రపంచం ఏదో పరిచయం అయినప్పుడూ ఆమె మనఃస్థితి ఎలా ఉంటుంది?
అత్యంత సహజంగానే పగలే వెన్నెలలు కనిపిస్తాయి.. జగమే ఊయలగా మారిపోతుంది.. ఊహలు రెక్క తొడుగుతాయి.
సినీ గేయరచయితగా అప్పుడప్పుడే కుదురుకుంటున్న యువకవి సింగిరెడ్డి నారాయణ రెడ్డి (సినారె) సమస్త ప్రకృతి సౌందర్యాన్నీ ఆవాహన చేసుకుని అక్షరరూపం ఇస్తే, (ర)సాలూరు రాజేశ్వర రావు బహు చక్కని బాణీ కట్టారు. జీవితాన్ని గురించి అందమైన కలలుకనే ఓ అమ్మాయి పాడుకునే పాట సిద్ధం అయిపొయింది.
పాట పాడే గాయని, సాహిత్యం లోని అనుభూతిని తను ఆస్వాదించి, తన గొంతు ద్వారా శ్రోతలకి అందించాలి. జీవితపు సౌందర్యాన్నీ, భవిష్యత్తు తాలూకు అందమైన స్వప్నాలనీ తన స్వరంలో కనిపింపజేయాలి. కత్తిమీద సామే కదూ? కానీ, పాతికేళ్ళ జానకి ఎంతో అలవోకగా పాడేసింది ఆ పాటని.. కళ్ళుమూసుకుని పాటని వినే శ్రోతలకి ప్రకృతి లోని అందమంతా కట్టెదుట నిలిస్తే, కళ్ళు తెరిచి దృశ్యం చూసే ప్రేక్షకులకి పియానో మోగిస్తున్న 'హంపీ సుందరి' జమున సౌందర్యం కనువిందు చేస్తుంది.
'పూజా ఫలము' (1964) సినిమా కోసం జానకి ఆలపించిన మధురగీతం 'పగలే వెన్నెలా...' మొదట వచ్చే ఆలాపన, చివర్లో 'మనసే వీణగా' దగ్గరి గమకం, భావాన్ని అనుభవిస్తూ పాడడం, ఇవన్నీ మరోగాయని నుంచి ఆశించ లేమేమో..
సృష్టిలో తీయనిది స్నేహం.. ఇద్దరు మనుషుల మధ్య స్నేహబంధం ఏ వయసులో అయినా ఏర్పడవచ్చు. కానీ, బాల్యంలో మొదలయ్యే స్నేహాలు, అప్పటి స్నేహితులు ఎప్పటికీ ప్రత్యేకమే! పాలలాంటి స్వచ్చమైన మనసుతో ప్రపంచాన్ని చూసే పిల్లలు, స్నేహితులని వెతుక్కోవడం వెనుక ఎలాంటి లెక్కలూ ఉండవు. ఈర్ష్యాసూయలు, తరతమబేధాలు తెలియని వయసులో ఏర్పడే స్నేహం కలకాలం మనడం వెనుక రహస్యం మరేమీ లేదు..కేవలం ఆ స్నేహం వెనుక ఉన్న స్వచ్చత మాత్రమే!!
ఇద్దరు అబ్బాయిలు.. ఓ ఊరి వాళ్ళే, ఒకే బళ్ళో చదువుకుంటున్నారు. ఇద్దరిమధ్యనా చక్కని స్నేహం. వాళ్ళ స్నేహం మిగిలిన ప్రపంచానికి మాత్రం పెద్ద వింత. ఎందుకంటే, ఇద్దరిలోనూ ఓ కుర్రాడు భూస్వామి కొడుకైతే, రెండో కుర్రాడి తండ్రి కూలి పనితో పొట్ట పోసుకుంటున్నాడు. స్నేహం కుదిరిన ఇద్దరికీ అందులో అభ్యంతరం ఏమీ కనిపించలేదు. కానీ, "మీ ఇద్దరికీ స్నేహం ఏమిటి?" అన్న ప్రశ్న వాళ్ళకి ఎదురవుతూనే ఉంది.
ఈ నేపధ్యంలో, స్నేహం గొప్పదనాన్ని ఓ పాటగా పాడి వినిపించే అవకాశం దొరికింది ఇద్దరిలో ఓ అబ్బాయికి.
మేష్టారు పాడమని అడగ్గానే, ఎప్పుడూ తిరిగే తోటలు గుర్తొచ్చాయి.. గున్నమావి కొమ్మమీద గూళ్ళు కట్టుకున్న కోయిల, రామచిలుక కళ్ళముందు కదిలాయి. వాటిమధ్య ఎన్నో అంతరాలున్నా, స్నేహం చెక్కు చెదరలేదన్న విషయాన్ని ఓ అందమైన పాట ద్వారా కళ్ళకి కట్టి, అందరి అభినందనలూ అందుకున్నాడు 'బాల మిత్రుల కథ' (1972) సినిమాలో సందర్భం ఇది. పదేళ్ళ కుర్రవాడి కోసం పాట అంటే, గాయకుడి చేత పాడించడం సాధ్యం కాదు.. ఎందుకంటే ఆ వయసుకి 'మగ' గొంతు పూర్తిగా విచ్చుకోదు.. అలా అని ఆడగొంతు ప్రయత్నిస్తే, మరీ లేతగా ఉంటుంది..
ఓ చిన్న జీర ఉండాలి గొంతులో.. బాల్యం లోని అమాయకత్వం అంతా ఆ గొంతులో ఉండాలి.. కోయిల, రామచిలుకల మధ్య స్నేహాన్ని వర్ణించ గలిగే స్వచ్చత, తన్మయత్వం కావాలి.
సింగిరెడ్డి నారాయణ రెడ్డి (సినారె) రచనకి, చెళ్ళపిళ్ళ సత్యం స్వరాన్ని సమకూర్చారు.. ఈ పాటకి పూర్తి న్యాయం చెయ్యగల ఒకే ఒక్క గాయని ఎస్. జానకి.. వేరెవరైనా పాడితే, ఆ గొంతులో బాల్యం 'కనిపించడం' సందేహమే.. ముప్ఫై ఐదేళ్ళ జానకి పాడిన 'గున్నమావిడీ కొమ్మ మీదా...' పాటలో ఆరంభంలో వచ్చే ఆలాపన, 'చివురులు ముట్టదు చిన్నారి కోయిల..' 'చిలుకా కోయిల చేసిన చెలిమి.. ' ఇంకా చివరిలో వచ్చే ఆలాపన చెబుతాయి, ఈ పాటని జానకి మాత్రమే ఎందుకు పాడాలో..
కొందరుంటారు.. ప్రతి చిన్న విషయానికీ బెంబేలు పడిపోతూ, చుట్టూ ఉన్నవాళ్ళని కంగారు పెట్టేస్తూ ఉంటారు.. వీళ్ళకి ఏం జరిగినా ఓదార్చేందుకు ఎప్పుడూ ఓ భుజం అవసరం. మరికొందరు ఇందుకు పూర్తిగా విరుద్ధం. వాళ్లకి వచ్చిన ఏ ఇబ్బందినీ - అది ఎంత పెద్దదైనా సరే - ఎవరితోనూ పంచుకోడానికి ఇష్టపడరు. అవతలి వారు ఎంత దగ్గరి వారైనా సరే.. ఇవతల గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా సరే.. విషయం పెదవి దాటదు. ఇదిగో ఈ రెండో కోవకి చెందిన ఓ పాతికేళ్ళ అమ్మాయి. తనకంటూ భర్త, పిల్లలు, సంసారం ఉండాలి అన్నది ఆమె కల.
ఆమెని పెళ్లి చేసుకోవాలనే కోరికతో, కేవలం ఆమె అనుమతి కోసం ఎదురు చూస్తున్న వ్యక్తీ ఉన్నాడు. కానీ ఆమె సరేననడం లేదు. ఇందుకు కారణం ఆమె మీద ఉన్న బాధ్యతలు. కన్నతండ్రి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే, తోడబుట్టిన అన్న బాధ్యత తప్పించేసుకుంటే తనకి తప్పక ఇంటి బాధ్యతని మోస్తోంది ఆ అమ్మాయి. ఎప్పటికైనా ఇంటి బాధ్యత తీసుకునే మనిషి ఎదురైతే, తనదైన జీవితాన్ని నిర్మించుకోవాలన్నది ఆమె కోరిక. అలాగని తండ్రి లాగా, అన్నలాగా బాధ్యత నుంచి పారిపోడానికి వ్యతిరేకి ఆమె.
ఆమెకోసం ఎదురుచూస్తున్న అతను ఎన్నాళ్ళు వేచి ఉండగలడు? అతనికీ సహనం నశించింది. ఇంకా ఎన్నాళ్ళని నిలదీశాడు.. అదిగో, అప్పుడు గొంతు విప్పింది ఆమె.. గుండెల్లో దాగిన అగ్నిపర్వతం బద్దలయ్యింది. "నాలో ఉన్న మనసూ నాకుగాక ఇంకెవరికి తెలుసు?" అని అడిగింది సూటిగా. అన్నేళ్ళు గుండెల్లో దాచుకున్న బాధ ఒక్కసారిగా బయట పడే సందర్భం. అప్పుడు కూడా ఆమె తన సమస్య ఇదీ అని చెప్పేందుకు సిద్ధంగా లేదు.. అలా చెప్పడం ఆమె పద్ధతీ కాదు. కానీ, చెప్పాల్సిన విధంగా చెప్పింది.
'అంతులేని కథ' (1976) సినిమాలోని ఈ సన్నివేశం కోసం తేలికైన మాటలతో బరువైన పాటని రాశారు ఆచార్య ఆత్రేయ. సజీవమైన బాణీ కట్టారు ఎమ్మెస్ విశ్వనాథన్. ఈ పాటకి గొంతు ఇచ్చి జీవం పోయాల్సిన గాయని ముందు ఉన్న బాధ్యత ఏమిటి? ఆ పాతికేళ్ళ అమ్మాయిని ఆవాహన చేసుకోవాలి.. ఆమె మోస్తున్న బరువుని అర్ధం చేసుకోవాలి.. ఆమె మనఃస్తితితో మమేకం కావాలి. ఆవేదన, దుఃఖంగా మారకూడదు.. ఎక్కడా సంయమనం కోల్పోకూడదు.. మరో గాయనికైతే ఇదో పెద్ద సవాలే.. కానీ పాడింది ఎస్. జానకి కదా.. అలవోకగా సాగిపోయింది ఆమె గళం.. ముప్ఫై ఎనిమిదేళ్ళ జానకి పాడిన 'కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసూ..' పాటలో ప్రత్యేకంగా వినాల్సినవి, కథానాయిక వ్యక్తిత్వానికి అద్దం పట్టేవీ, రెండు చరణాలు.. మరీ ముఖ్యంగా 'జరిగేనాడే జరుగును అన్నీ... జరిగిన నాడే తెలియును కొన్నీ..' లైన్స్..
విరహం.. ప్రియమైన వారి ఎడబాటు మిగిల్చే భావన.. ఇష్టమైనది ఎంతమాత్రం కాదు, చాలా కష్టమైనది. ఈ విరహాన్ని గొంతులో పలికించడం అంత సులభం ఏమీ కాదు. ఎందుకంటే, శ్రోతలు ఆ భావనతో మమేకం కావాలి. క్లిష్టమైన ఈ భావనని అలవోకగా తన గొంతులో పలికించిన గాయని ఎస్. జానకి.. జానకి పేరు చెప్పగానే గుర్తొచ్చే పాటల్లో మొదటి వరుసలో ఉండే పాట 'నీలి మేఘాలలో..' ఆరుద్ర రాసిన ఈ పాటని పెండ్యాల నాగేశ్వర రావు స్వరపరిచారు, 'బావామరదళ్ళు' (1960) సినిమా కోసం.
తన పద్దెనిమిదో ఏట సినీ నేపధ్య గాయనిగా కెరీర్ మొదలుపెట్టిన జానకి, ఇరవై రెండో ఏట పాడారు ఈ పాటని.. సన్నగా, తీగలా అనిపించే గొంతు, మెరిసే గమకాలు, వెంటాడే విరహం... ఇవన్నీ ఈ పాటని మళ్ళీ మళ్ళీ వినేలా చేస్తాయి.. ఒక్క విరహానికి సంబంధించే లెక్కకు మిక్కిలి పాటలు పాడిన జానకి, ఏ రెండు పాటలకీ పోలిక ఉండని విధంగా జాగ్రత్త తీసుకున్నారు.. 'ఎందుకో చేరువై.. దూరమవుతావు..' అన్న దగ్గర జానకి ఎక్స్ ప్రెషన్, మరో గాయని నుంచి ఊహించలేం. మనసుని నీలి మేఘాలలో తేలియాడించే ఈ పాటని ఇక్కడ వినొచ్చు.. ఇదే పాట మేల్ వర్షన్ ని ఘంటసాల ఆలపించారు..
నాదస్వరం.. దక్షిణ భారతదేశంలో పరమ పవిత్రంగా భావించే వాయిద్యం. గుమ్మానికి తోరణం, చెవికి ఇంపుగా సన్నాయి లేనిదే ఏ శుభకార్యమూ పూర్తికాదు.. మరి ఇలాంటి నాదస్వరం ఇతివృత్తంగా సినిమా అంటే అది సంగీత భరిత చిత్రమనే కదా అర్ధం.. నిజజీవిత దంపతులు సావిత్రి, జెమిని గణేశన్ జంటగా 1962 లో ఎమ్వీ రామన్ దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా 'కొంజుం సలంగై.' సావిత్రి వందో సినిమా ఇది. కథానాయకుడు నాదస్వర విద్వాంసుడు. ఓ సందర్భంలో నాయిక గాత్రంతో పోటీగా అతడు నాదస్వరం వాయించాలి.. నాయిక కూడా అతనికి ఏమాత్రం తగ్గకుండా, నాదస్వరానికి పోటీగా తన స్వరం అందించాలి... ఆమె ఆరంభించింది భక్తిగీతం.. భక్తికీ నాదస్వరానికీ అవినాభావ సంబంధం మరి.. గొంతులో భక్తిభావం ఏమాత్రం తగ్గకుండా, సన్నాయితో పోటీ పడుతూ అటు తమిళం లోనూ, ఇటు తెలుగులోనూ పాడగలిగే గాయని కావాలి.
అప్పటికే బాగా పేరు తెచ్చుకున్న గాయనీమణులు ఆ పాట పాడడం తమవల్ల కాదని తేల్చి చెప్పడంతో, . నేపధ్య గాయనిగా అప్పుడప్పుడే కుదురుకుంటున్న ఇరవై మూడేళ్ళ జానకిని వెతుక్కుంటూ వచ్చింది అవకాశం. సినిమాకి సంగీతం అందించిన ఎస్సెం సుబ్బయ్య నాయుడు, నాదస్వరం అందించిన కారుకురుచ్చి అరుణాచలం ఇద్దరూ వారి రంగాల్లో నిష్ణాతులు.. వీరిమధ్య అప్పుడప్పుడే గొంతు విప్పుకుంటున్న జానకి.
'మురిపించే మువ్వలు' పేరుతో తెలుగులోకి డబ్ అయిన సినిమా కోసం ఆరుద్ర రాసిన ఆ పాటని ఇవాల్టి వరకూ కూడా ఇంతకన్నా బాగా పాడడం అసాధ్యం అనిపించే రీతిలో ఆలపించి, తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో గాయనిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది జానకి.. ఐదు నిమిషాల నిడివి ఉండే పాటలో గాయనిగా జానకి విశ్వరూపం కనిపించేది చివరి చరణంలో.. ఇవాల్టికీ టీవీ చానళ్ళలో జరిగే పాటల పోటీల్లో ఎంతటి గాయకులైనా పాడడానికి అంతగా ధైర్యం చెయ్యని -- ఎవరన్నా పాడుతుంటే జడ్జీలు సైతం పూర్తి అప్రమత్తతతో వినే -- ఆ పాటే 'నీ లీల పాడెద దేవా...'
పాండవ మధ్యముడు పరాక్రమ వంతుడు మాత్రమే కాదు, అందగాడు కూడా.. ఆ అందాన్ని చూసి ఒక్క రాచ కన్నెలే కాదు, ముల్లోకాలలోని సుందరీమణులూ మోహంలో మునిగి తేలారు. స్వర్గలోకపు నర్తకి, అపూర్వ సౌందర్యరాశి ఊర్వశి ఇందుకు మినహాయింపు కాదు. ఆ దేవకాంత, మానవమాత్రుడిని మోహించింది సరే.. మరి ప్రకటించడం ఎలాగ?
స్వర్గాధిపతి దేవేంద్రుడి ఆహ్వానం అందుకుని ఇంద్రసభకి అతిధిగా వచ్చాడు అర్జునుడు. స్వాగత నృత్యంతో అతిధిని అలరించే బాధ్యతని ఊర్వశి మీదే పెట్టాడు దేవేంద్రుడు.. ఇకనేం.. ఊర్వశికి కావాల్సిందీ అదే.. అర్జునుడి పరాక్రమాన్ని పాటగా అల్లి, తన మెరుపు నృత్యాన్ని జతచేసి, ఎంతో నేర్పుగా తన మనసులో మాటని బయట పెట్టింది.
ఊర్వశిగా నాట్యం చేసిన పద్మినీ ప్రియదర్శిని గురించి ఇక్కడ కొంచం చెప్పుకోవాలి. 'ట్రావెన్కోర్ సిస్టర్స్' గా దేశమంతా పేరుతెచ్చుకున్న భరతనాట్య కళాకారిణులు లలిత, పద్మిని, రాగిణి త్రయంలో ఒకరీమె. (నిన్నటి తరం కథానాయిక, ప్రముఖ భరతనాట్య కళాకారిణి శోభన, ఈ ముగ్గురికీ ముద్దుల మేనకోడలు!!)సరే, ఊర్వశి పాడే పాట ఎలా ఉండాలి? అర్జునుడి పరాక్రమాన్ని మెచ్చుకుంటూనే, అతడిపై తను మరులుగొన్న విషయాన్ని ప్రకటించాల్సిన సందర్భం. 'జావళి' ఛాయలు కనిపించే లలిత శృంగార గీతం. సముద్రాల రచనకి, సుసర్ల దక్షిణామూర్తి సుస్వరాలని అద్దారు. (ఊర్వశి, అర్జునుణ్ణి 'జాణ' అని సంబోధిస్తుంది!).
మరి, ఊర్ధ్వ లోకపు ఊర్వశికి గొంతు ఇచ్చేది ఎవరు? ఇంకెవరు, ఎస్. జానకి. రాజ్యం పిక్చర్స్ నిర్మించిన 'నర్తనశాల' (1963) సినిమాకోసం ఇరవై నాలుగేళ్ల జానకి పాడిన 'నరవరా.. ఓ కురువరా..' పాట, ఆమె ఆల్ టైం హిట్స్ లో ఒకటి. 'అర్జున ఫల్గుణ పార్థ కిరీటి...' దగ్గర పలికే గమకం విని తీరాలి..
సినిమా పరిశ్రమ అంత చిత్రమైన పరిశ్రమ మరొకటి ఉండదేమో.. అప్పటివరకూ ప్రపంచానికి తెలియని ఓ అనామకుడిని ఒక్క రాత్రిలోనే సూపర్ స్టార్ ని చేసేస్తుంది. కలలో కూడా ఊహించనంత పేరునీ, డబ్బునీ పాదాల ముందు ఉంచుతుంది. ఇరవయ్యేళ్ళ కుర్రాడు ఉదయ్ కిరణ్ ఇందుకు సాక్ష్యం.. ఇది పదమూడేళ్ళ క్రితం మాట. ఓ మామూలు మధ్య తరగతి కుర్రాడు.. ఆటోల్లో తిరగడం అతనికి లగ్జరీ.. సిటీ బస్సుల్లో తిరిగే కుర్రాడి కోసం సినిమా కంపెనీ అంబాసిడర్ కారు వచ్చి ఇంటి ముందు నిలబడ్డం ఉదయ్ జీవితంలో మొదటి మలుపు.
బూతుని దట్టించి నీతి ముసుగు తొడగడం వల్లో, అప్పటివరకూ వచ్చి పడుతున్న పరమ రొటీన్ సినిమాల కన్నా భిన్నం గా ఉండడం వల్లో.. మొత్తానికి జనం బ్రహ్మరథం పట్టారు ఆ సినిమాకి. గల్లీ కుర్రాడు వాల్ పోస్టర్ల మీదా, టీవీ చానళ్ళ లోనూ సందడి చేయడం మొదలుపెట్టాడు. మధ్యతరగతి జీవితంలో పెద్దగా మార్పు లేదు కానీ, సినిమానే తన కెరీర్ అన్న భావన మాత్రం స్థిరపడింది. రెండో సినిమా బ్రహ్మాండమైన హిట్.. అవకాశాలు వెల్లువెత్తడం మొదలయ్యింది.
ఇక మూడో సినిమా అయితే, సినిమా పరిశ్రమ ఆశ్చర్యపోయే అంతటి విజయం సాధించింది. క్లీన్ సినిమా అవ్వడంతో కుర్రాడిని ఒక్క యువతకి మాత్రమే కాక, వాళ్ళ కుటుంబాలకీ చేరువ చేసింది. ఉత్తరాది ప్రముఖ కథానాయకుడితో పోల్చి కథనాలు రాశాయి పత్రికలు. అప్పటికి అగ్రశ్రేణి కథానాయకుడిగా వెలుగుతున్న ఇప్పటి రాజకీయ నాయకుడు ఒకరు ఉదయ్ ని తన అల్లుడిగా చేసుకుంటానని ప్రకటించి, పనిలో పనిగా తనకి 'కులం' లాంటి సంకుచిత భావాలు ఏమాత్రం లేవని కూడా వాక్రుచ్చారు.
ఉదయ్ హోదా అంతా ఇంతా పెరగలేదు.. మూడు వరస హిట్లు, అత్యంత ప్రముఖ కథానాయకుడికి కాబోయే అల్లుడు.. తను సమకూర్చుకున్న ఇల్లు, కారు.. తన ఖాతాలో ఉన్న విజయాలు. చేతిలో ఉన్న అవకాశాలు.. అప్పటికి తన వయసు ఎంతనీ? పట్టుమని ఇరవై మూడేళ్ళు. ఓ మధ్య తరగతి కుర్రాడిని ఉక్కిరిబిక్కిరి చేసేసే మార్పు. తట్టుకోడం ఏమంత సులభం కాదు. అందులోనూ, ఓ సున్నిత మనస్కుడికి.
తెరవెనుక కారణాలు ఏమైనప్పటికీ, పెద్ద హీరోగారి అమ్మాయితో జరిగిన నిశ్చితార్ధం రద్దయ్యింది. చేసిన సినిమాలు పరాజయం పాలయ్యాయి. చేతిలో ఉన్నాయనుకున్న సినిమాలు వెనక్కి వెళ్ళిపోయాయి. సినిమా పరిశ్రమ ఎంత చిత్రమైనది కాకపొతే, ఓ అనామకుణ్ణి అగ్ర కథానాయకుడిగా చేస్తుంది? ఎంత విచిత్రమైనది కాకపొతే ముచ్చటగా మూడేళ్ళు తిరిగేలోగానే అతన్ని సమస్యల సుడిగుండంలో తోసేసి కీర్తినీ, డబ్బునీ వెనక్కి లాగేసుకుంటుంది??
సంకల్ప బలం కావొచ్చు, అదృష్టం కావొచ్చు, ఎడతెగని కృషి కావొచ్చు.. ఢక్కా మక్కీలు తినాల్సిన వయసులో పూలు పరిచిన జీవితం స్వాగతం పలికింది. కొత్త జీవితానికి పూర్తిగా అలవాటు పడ్డాక, స్థిత ప్రజ్ఞత అలవర్చుకోక తప్పని పరిస్థితుల్లోకి నెట్టేసింది.. దీనికి విధి అనో, మరొకటనో పేరు పెట్టుకోవచ్చు. దురదృష్టం.. తన వాళ్ళు వెనక ఉండి ధైర్యం చెప్పాల్సిన సమయంలో, కన్నతల్లి అకాల మరణం.. కుటుంబ పరమైన ఇబ్బందులు.. తనకంటూ ఎవరూ లేరన్న అభద్రత. జీవితంతో పోరాటం.. కెరీర్ కోసం పోరాటం.. మనుగడ కోసం పోరాటం..
ఒక్కసారిగా వచ్చి పడిపోయే విజయాన్ని తట్టుకోడానికి, తట్టుకుని నిలబడడానికి ఎంత శక్తి అవసరమో చెబుతుంది ఉదయ్ జీవితం. అభద్రత అనేది మనిషిని ఎక్కడి వరకూ తీసుకు వెళ్ళగలదో నిరూపిస్తుంది. పరిస్థితులని ఎదుర్కోగలిగే మానసిక ధృడత్వం ఎంత అవసరమో చెప్పకనే చెబుతుంది. సినిమా పరిశ్రమ ఆటుపోట్లని తట్టుకోలేక తమ జీవితాలకి మరణ శాసనం రాసుకున్న వాళ్ళు, పరాజయాలతో పోరాడలేక అస్త్ర సన్యాసం చేసేవాళ్ళు ప్రపంచానికి చెప్పేది ఒక్కటే.. బతకడానికి కావాల్సిన వాటిలో కాస్తంత 'స్థిత ప్రజ్ఞత' ని కూడా చేర్చుకోమని...