దినపత్రికల ఆదివారం అనుబంధాల్లో మంచి కథలకోసం వెతికే వాళ్ళని
'ఆంధ్రజ్యోతి,' 'సాక్షి' సాధారణంగా నిరాశపరచవు. తరచుగా మంచి కథలు,
అప్పుడప్పుడూ గొప్ప కథలూ వస్తూ ఉంటాయి ఈ రెండు పత్రికల్లోనూ. కథల ఎంపికలో
వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని వాళ్ళ ఎంపిక తెలియజెపుతూ ఉంటుంది.
అయితే, ఇవాళ్టి ఆదివారం ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథ మాత్రం ఆశ్చర్యానికి
గురిచేసింది. ఫక్తు కాపీ కథ ప్రచురితమవ్వడం, అదికూడా ఆంధ్రజ్యోతిలో కావడం ఓ
పట్టాన మింగుడు పడ్డం లేదు. ఆ కథను గురించి చెప్పేముందు మూలకథని ఓసారి
తల్చుకోవాలి.
'మా పసలపూడి కథలు'కి ముందు వంశీ రాసిన కథలతో
వచ్చిన సంకలనం పేరు 'ఆనాటి వానచినుకులు.' రంగుల బొమ్మల హడావిడి లాంటి
హంగులేవీ లేకుండా ఎమెస్కో ప్రచురించిన ఆ పుస్తకానికి శీర్షికగా ఉంచిన కథ
పేరు 'ఆనాటి వానచినుకులు.' ఈ కథలో ప్రధాన పాత్ర పతంజలి అహంభావిగా
కనిపిస్తాడు. తాను నమ్మింది మాత్రమే జీవితమనీ, అందంగా జీవించాలంటే అందమైన
పరిసరాల్లో, చక్కని సంగీతం వింటూ, ఇంచక్కని కవిత్వం చదువుకోడమే మార్గమనీ,
అలాంటి వాళ్లకి మాత్రమే భావుకత్వం అలవడుతుందనీ బలంగా నమ్ముతాడు. మద్రాసు మహానగరంలో నివాసముండే పతంజలి అనుకోకుండా ఓ మారుమూల పల్లెటూరికి అవస్థలతో కూడిన ప్రయాణం చేయాల్సి రావడం, ఆ యాత్రలో అతడి చివరి ప్రయాణ సాధనమైన రిక్షాని చూడగానే అతడు భావుకత్వాన్ని గురించి అన్నాళ్ళుగా నమ్ముతూ వచ్చిన విషయాలన్నీ తప్పేనన్న ఎరుక ఒక్కసారిగా కలగడంతో కథ ముగుస్తుంది. ఆ మారుమూల కుగ్రామంలో రిక్షా నడుపుకునే గోపాలం అత్యంత సామాన్యుడు. తన ఒంటినీ, రిక్షాన్నీ పరిశుభ్రంగా ఉంచుకున్న వాడు. అంతే కాదు, రిక్షా వెనుక తన స్వహస్తాలతో 'ఆనాటి వానచినుకులు' అని రాసుకున్న వాడూను.
చదువుకీ,
సంస్కారానికే కాదు, చదువుకీ భావుకత్వానికీ కూడా పెద్దగా సంబంధం లేదని
నిరూపించే ఈ కథలో ముగింపు ఒక మాస్టర్ స్ట్రోక్. 'ఆనాటి వానచినుకులు' అనే
వాక్యం ఎందుకు రాసుకుని ఉంటాడో అనే ఊహని పాఠకులకే వదిలేయడం వల్ల ఈ కథకి
సంపూర్ణత్వం వచ్చిందనిపిస్తూ ఉంటుంది నాకు. ఇక, ఇవాళ్టి ఆదివారం
ఆంధ్రజ్యోతి కథపేరు 'ఆనాటి చెలిమి ఒక కల.' అమెరికాలో మొదలయ్యి, అమెరికాలో
ముగిసే ఈ కథలో ప్రధానమైన భాగం అంతా అమలాపురం, ఆ చుట్టుపక్కల పల్లెటూళ్లలో
జరుగుతుంది, అదికూడా ఓ నాలుగు దశాబ్దాల క్రితం.
కథకుడి
స్నేహితుడి బంధువు రాజు రిక్షా నడుపుకుంటూ ఉంటాడు. కవిత్వం అంటే ఇష్టం
కూడా. నెమ్మదిగా కథకుడికి తన స్నేహితుడి కన్నా, రాజు దగ్గరవాడు అయిపోతాడు.
సర్వవేళలా ఇస్త్రీ బట్టలు ధరించే రిక్షా రాజు, తన రిక్షాని అరిగిపోయేలా
తుడుస్తూ ఉండడమే కాదు, రిక్షా వెనుక ప్రతినెలా ఓ వాక్యం రాయిస్తూ ఉంటాడు ఓ
పెయింటర్ చేత. సాధారణంగా సినిమా పాటల పల్లవులు, అప్పుడప్పుడూ కవితా
పంక్తులు అతని రిక్షా వెనుక దర్శనమిస్తూ ఉంటాయి. వచ్చే నెల ఏ వాక్యం అనే
విషయం మీద కథకుడు, అతని స్నేహితుడూ పందేలు వేసుకుంటూ ఉంటారు కూడా.
రిక్షా
రాజు రాయించిన ఒకానొక వాక్యం 'ఆనాటి వానచినుకులు.' ఈ వాక్యం ఎందుకు
రాయించాడో కథకుడికి తెలియక మునుపే, కథకుడు మొదట చదువు కోసం, ఆ తర్వాత
ఉద్యోగం కోసం ఊరికి దూరంగా వెళ్లి, ఆ తర్వాత శాశ్వతంగా ఊరితో సంబంధాలు
కోల్పోవడం జరుగుతుంది. కథకుడి కొడుకు 'ఆడి' కారు వెనుక అతికించిన బంపర్ స్టికర్ లో ఉన్న వాక్యం చూడగానే రాజు
గుర్తొచ్చి ప్రత్యేకంగా ఇండియా ప్రయాణంలో రాజుని కలిసి 'ఆనాటి
వానచినుకులు' వెనుక కథని తెలుసుకోవడంతో బోల్డంత నాటకీయతతో ముగుస్తుందీ కథ.
వంశీ
రాసిన 'ఆనాటి వానచినుకులు' కథ లేకపోతే, ఈ కథ లేదన్న విషయం రెండు కథలూ
చదివిన వాళ్లకి సులభంగా అర్ధమయ్యే విషయం. ఎటొచ్చీ వంశీ కథలో పాత్రలు నేలమీద
నడిస్తే, తాజా కథలో పాత్రలు నేల విడిచి కనిపిస్తాయి. గోపాలాన్ని రిక్షా
నడుపుకునే వ్యక్తిగా అంగీకరించగలం కానీ, రాజు వేషభాషలకీ అతని వృత్తికీ
ఏమాత్రం పొసగదు. గోపాలం తనకి ఇష్టమైన వాక్యాన్ని తన వంకర టింకర అక్షరాలతోనే
రిక్షా వెనుక రాసుకున్నాడు. రాజు మాత్రం, నెలకో వాక్యం - అది కూడా 'ఆనాటి
వానచినుకులు' మినహా మిగిలినవన్నీ కవులవీ, సినీ కవులవీ - డబ్బిచ్చి రాయిస్తూ
ఉంటాడు. రెండు కథల మధ్యా పోలిక కేవలం యాదృచ్చికం అని సరిపెట్టుకుందాం అని
చాలా ప్రయత్నించాను కానీ, నావల్ల కాలేదు.
ఆదివారం ఆంధ్రజ్యోతి వాళ్ళు పాఠకుల నమ్మకాన్ని నిలబెట్టుకునే విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.