శుక్రవారం, డిసెంబర్ 24, 2010

రైలు ప్రయాణం

జీవితాన్ని రైలు ప్రయాణంతో పోలుస్తారు చాలామంది. చూసే ఓపిక, ఆసక్తీ ఉండాలే కాని రైలు ప్రయాణంలోనే జీవితం మొత్తం కనిపించేస్తుంది మనకి. రకరకాల మనుషులు. ఎవరి ప్రయాణం ఎక్కడ మొదలవుతుందో ఎక్కడ ఆగుతుందో మరొకరికి తెలీదు. అయినా కలిసిన ఆ కాసేపట్లోనే అపరిచితుల మధ్య ఎన్నో సంభాషణలు నడిచిపోతూ ఉంటాయి. కొండొకచో పోట్లాటలు కూడా. చొరవగా మాట కలిపేవాళ్ళు కొందరైతే, మౌన ప్రేక్షకులుగా మిగిలిపోయే వాళ్ళు మరికొందరు.

మనుషులు ఎంత ఎదిగినా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇష్టంగా గుర్తొచ్చే మొదటి జ్ఞాపకం బాల్యం. ఆ బాల్యంలో ఆడిన తొలి ఆటల్లో 'ఛుక్ ఛుక్ రైలు వస్తోంది..' లేకుండా ఉంటుందా? అలా రైలుకీ బాల్యానికీ అవినాభావ సంబంధం. నావరకు నాకు తొలి రైలు ప్రయాణం ఓ అపురూప జ్ఞాపకం. రైలంటే ఎలా ఉంటుంది? మొదలు, రైలు ఎందుకు కూత పెడుతుంది? వరకూ సవాలక్ష సందేహాలు అప్పట్లో. పెద్దైపోయాక ఎవరినీ అడగక్కర్లేకుండానే జవాబులు తెలుసుకునే వీలున్నప్పుడు బుర్రలో ప్రశ్నలే పుట్టవెందుకో.

రైల్వే ట్రాక్ ల పక్కన బాల్యాన్ని గడిపిన భాగ్యశాలుల రైలు జ్ఞాపకాలు రాయడం మొదలు పెట్టారంటే అది అలా ఎక్ష్ప్రెస్ రైలులా సాగిపోవలసిందే. ట్రాక్ మీద నాణాన్ని ఉంచి నాణెం నాణ్యతని పరిశీలించడం మొదలు రైల్లో వెళ్ళే ముక్కూ మోహం తెలియని వందలాదిమందికి వీడ్కోలు చెప్పడం వరకూ వీళ్ళు ఆడని ఆట ఉండదు. నా చిన్నప్పుడు మా బాబాయ్ వాళ్ళు కొన్నాళ్ళ పాటు రైల్వే ట్రాక్ పక్కన ఉన్నారు. అప్పట్లో నేనూ ఈ ఆటలన్నీ ఆడానని చెప్పడానికి గర్వ పడుతున్నాను.

అన్నట్టు రైలు పెట్టెలు లెక్క పెట్టే ఆట ఎంత బాగుంటుందో. కొత్తగా అంకెలు నేర్చుకునే వాళ్ళ చేత గూడ్సు బండి పెట్టెలు లెక్క పెట్టించాలి. అప్పుడింక వాళ్లకి అంకెలు, సంఖ్యల్లో తిరుగుండదు. కాకపొతే, మామూలు రైలు పెట్టెలని లెక్క పెట్టడంలో ఉండే సరదా, గూడ్సు రైలు పెట్టెలని లెక్క పెట్టడంలో ఉండదుగాక ఉండదు. తిరిగి నవ్వే, చెయ్యూపే ఒక్క ముఖమూ కనిపించక పోతుంటే అలా మన పాటికి మనం పెట్టెలు లెక్కెట్టుకోడం భలే విసుగు.


రైలు ప్రయాణంలో కలిసే బంధుత్వాలు భలే చిత్రంగా ఉంటాయి. నిమిషాల్లో ప్రాణ స్నేహితులు అయిపోయిన వాళ్ళే, రైలు దిగిన మరుక్షణం పరాయివాళ్ళు అయిపోతారు. కొండొకచో రైలుబండి నిజమైన స్నేహాలనీ కూర్చి పెట్టినప్పటికీ, అధికశాతం రైలు స్నేహాలు అవసరార్ధపు స్నేహాలే. అసలు ఈ రైలు పరిచయాల్లో తమ తమ నిజ వివరాలని పంచుకునే వాళ్ళు ఎందరు ఉంటారా అనే విషయం మీద ఓ చిన్న పరిశోధన చేస్తే ఎలా ఉంటుందా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి.

రైల్లో పైతరగతి ప్రయాణాల కన్నా జనరల్ కంపార్ట్మెంట్ ప్రయాణాలు భలే బాగుంటాయి. నాకైతే సరదాగా కూడా అనిపిస్తాయి. అయితే ప్రయాణ కాలం ఓ రెండు గంటలు మించకూడదు. పైతరగతి పెట్టెల్లో ప్రయాణికులు మూతులు బిగించుకుని కూర్చుంటే, జనరల్లో ప్రయాణికులు కాసేపు వీళ్ళు మౌనంగా ఉంటే బాగుండు అనిపించే విధంగా మాట్లాడుతూనే ఉంటారు. అసలిక్కడ దొర్లని టాపిక్ అంటూ ఉండదు. ఉన్న ఆ కొంచం జాగాలోనే కూసింత సర్దుకుని నిలబడ్డ వాళ్లకి సీటివ్వగల ఔదార్యం జనరల్ ప్రయాణికుల సొంతం.

అయితే, కొంచం ముందుగా బండెక్కిన ఒకే ఒక కారణానికి సామాను పరుచుకుని సీట్లు ఆక్రమించుకుని నిద్ర నటించే వాళ్ళూ ఇక్కడ కనిపిస్తారు. సమస్త వ్యాపారాలు చేసేవాళ్ళూ తమ తమ వస్తువులని 'కారు చౌక'గ అమ్మేది జనరల్ కంపార్ట్మెంట్ లోనే. తాజా కూరలు, పళ్ళు మొదలు పైరేటెడ్ డిస్కుల వరకూ ఏం కావాలన్నా దొరికే సూపర్ మార్కెట్ ఈ జనరల్ కంపార్ట్మెంట్. రౌడీయిజం మొదలు రాజకీయాల వరకూ ఏ విషయాన్ని గురించైనా అలవోకగా చెప్పేయగల ఎన్ సైక్లోపీడియా కూడా ఇదే.

మన సినిమాలు, సాహిత్యం రైలు ప్రయాణాన్ని ఏమాత్రం చిన్నచూపు చూడలేదు. అలా చేస్తే రైలుబండిని ప్రేమించే జనం తమని చిన్న చూపు చూస్తారేమోనన్న భయసందేహం ఇందుకు కారణం కావొచ్చు. అందుకే ఎందరో నాయికా నాయకులు రైలు ప్రయాణంలో కలుసుకున్నారు. మరికొందరు విడిపోయారు. ఇంకొందరి జీవితాలు ఊహించని మలుపు తిరిగి పాఠ/ప్రేక్షకులని ఉక్కిరిబిక్కిరి చేశాయి. రైలు ప్రయాణాల నేపధ్యంలో వచ్చిన కథలు, కార్టూనులకైతే లెక్కేలేదు. అసలు రైలు ప్రయాణాన్ని ఇష్టపడని వాళ్ళు ఎవరన్నా ఉంటారా?

19 కామెంట్‌లు:

  1. >>కాకపొతే, మామూలు రైలు పెట్టెలని లెక్క పెట్టడంలో ఉండే శారద, గూడ్సు రైలు పెట్టెలని లెక్క పెట్టడంలో ఉండదుగాక ఉండదు.<<

    ఈ శారద ఎవరండోయ్ :-P శంకరాభరణం పాటలు వింటూగానీ రాశారా ఏమిటి :-)

    వ్యాసం బాగుందండి. రకరకాల అంశాలను కవర్ చేస్తు బాగారాశారు.

    రిప్లయితొలగించండి
  2. హ్మ్! రైలు ప్రయాణం గురించి అందంగా ...అంతే అలవోకగా చెప్పేసారుగా! నాకు మీలాగే జనరల్ కంపార్ట్మెంట్ ఐతేనే బాగుండనిపిస్తుంది....ఏసీ కంపార్ట్మెంటుల్లో...ఎవరికివారు..లాప్టాపు...లేదంటే బుక్కు పట్టుకుని స్టైల్ కొట్టేవారే! పలకరింపు నవ్వులు కూడా ఉండవ్! రైల్లో పరిచయాలు కూడా చిత్రంగానే ఉంటాయ్! ఇలా కలిసి అలా విడిపోయే ఈ స్నేహాలు....మన గ్నాపకాలపొరల్లో భద్రంగా చేరిపోతాయ్ కదా! మీ టపా చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  3. ఎంతో చక్కగా పోల్చి చెప్పారండి!!!

    రిప్లయితొలగించండి
  4. @వేణూ శ్రీకాంత్: 'సరదా' కి వచ్చిన తిప్పలండీ.. రెండోసారి చూసినా ఎలాగో ఒవర్లుక్ అయ్యింది.. సరిచేసినందుకు బహుదా కృతజ్ఞతలు.
    @ఇందు: రాసేకొద్దీ రైలు ప్రయాణాన్ని గురించి ఇంకా ఇంకా సంగతులు గుర్తొస్తూనే ఉంటాయండీ.. ధన్యవాదాలు.
    @పద్మార్పిత: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  5. ఇంకో విషయం మర్చిపోయారు మాష్టారూ. ఎక్కేముందు మన చేతిలో ఉన్న వారపత్రిక కానీ దినపత్రిక కానీ దిగేముందు మన చేతిలో ఉండదు.
    చాలా బాగా వ్రాసారు. మళ్ళీ ఒక మారు రిజర్వేషను లేని పాసెంజరు బండి ఎక్కి ప్రయాణించాలని అనిపిస్తోంది.

    రిప్లయితొలగించండి
  6. రైలు ప్రయాణాలు బాల్యం లోనూ, యవ్వనం లోనే బాగుంటాయండీ.
    అప్పుడైతే పెద్దగా బాధ్యతలు లేకుండా సరదాగా ప్రయాణిస్తాం.
    ఇక ఆ తరువాత అన్నీ అవసరార్థ ఒంటరి ప్రయాణాలే. (హాలీడే ట్రిప్పులు తప్ప)
    అందుకే బాగా బోరుకొడతాయి.

    రిప్లయితొలగించండి
  7. మురళి గారు, చాలా బాగుంది రైలు టపా ప్రయాణం:) నాక్కూడా జనరల్ కంపార్ట్మెంట్‌లో ప్రయాణమే ఇష్టం. బోల్డంత టైంపాస్:)

    సుబ్రహ్మణ్యం గారు,
    >>ఎక్కేముందు మన చేతిలో ఉన్న వారపత్రిక కానీ దినపత్రిక కానీ దిగేముందు మన చేతిలో ఉండదు.
    హహ్హహ్హా.. నిజమేనండోయ్..

    రిప్లయితొలగించండి
  8. మొత్తానికి రైలు ప్రయాణాల గురించి మీరు చెప్పిన కబుర్లు చదువుతుంటే ఈ ప్రయాణాల్లో మీకు చాలా అనుభవమే ఉందనిపిస్తుంది:) నేను ఒకసారి బరోడా నుంచి గయ కి... ఒకటిన్నర రోజు రైలు ప్రయాణం లో దొరికిన ఒక స్నేహితురాలు నాకు ఇప్పటికీ ప్రాణస్నేహితురాలైపోయింది. బాంబే రైల్వే స్టేషన్ లో టాటా చెప్పిన నా ఫ్రెండ్ ని ఈనాటికీ కలుసుకోలేకపోయాను. అంతటి స్నేహితురాలి అడ్రెస్ ఇప్పటికీ నాకు తెలియలేదు. అందుకేనేమో జీవితాన్ని రైల్ ప్రయాణం తో పోలుస్తారు.

    రిప్లయితొలగించండి
  9. మురళి గారు :-) హ హ అదే అనుకున్నాను లెండి. నేనుకూడా అప్పుడప్పుడూ శరదాపడుతుంటాను కానీ దీర్ఘంతో సహా చూసేప్పటికి నవ్వొచ్చి అలా చెప్పాను :)

    రిప్లయితొలగించండి
  10. మురళి గారు ఈసారి స్కూలు రోజులతో పాటు కాలేజి రోజులను కూడా గుర్తు చేసారండోయ్. నేను నా పీజీ కోసం మా టౌను నుండి పక్కనే ఉన్న సిటీకి అప్ అండ్ డౌన్ చేసేదానిని రైలులో. పీజీ రెండు ఏండ్లల్లొ దాదాపుగా సంవత్సరం పాటుగ రైలు ప్రయాణమే. మా గ్రూపులో ఇంటర్ చదివే వాల్ల దగ్గరి నుండి ఉధ్యోగాలు చేసే ఆంటీల వరకు ఉండేవాల్లు.రోజు చేసే ఆ గంట ప్రయాణం లొనే ఆటలు, పాటలు, కథలు కవితలు, కుట్లు అల్లికలు ఇట్ల ఎన్నొ ఎన్నెన్నొ. ఏండ్లు గడిచిపోయి అందరు దురమయిపొయిన అప్పుడప్పుడు ఆ ఙ్నాపకాలన్ని గుర్తొచి సంతొషాన్ని ఇస్తునే ఉంటాయ్

    రిప్లయితొలగించండి
  11. మురళి గారు, ఈ నూతన సంవత్సర సందర్భంలో మీరిలా మాయమైపోవటం బాగాలేదు. మీకు నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  12. రైలు ప్రయాణం ఇష్టం లేనివారు ఉండరేమోనండీ ....ఒకవేళ ఉన్నా నేనొప్పుకోను :) ఎందుకంటే నేనసలే రైల్వేవాళ్ళ అమ్మాయిని మరి :)
    *ఈ నూతన సవత్సరం మీకు మీ కుటుంబానికీ సకల శుభాలనీ కలుగచేయాలని కోరుకుంటూ శుభాకాంక్షలు మురళిగారు!

    రిప్లయితొలగించండి
  13. 2011 వ సంవత్సరం మీకూ, మీ కుటుంబ సభ్యులందరికి శుభప్రదం గానూ, జయప్రదంగానూ, ఆనందదాయకం గానూ ఉండాలని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  14. @బులుసు సుబ్రహ్మణ్యం: నాకు రైలు ప్రయాణాల్లో పుస్తకాలు, పత్రికలూ చదవడం పెద్దగా ఇష్టం ఉండదండీ.. అన్నట్టు మీకు, మీ కుటుంబ సభ్యులకి హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.. ధన్యవాదాలు.
    @బోనగిరి: వయసు పెద్ద అడ్డంకి కాదని నా అనుభవం అండీ.. ధన్యవాదాలు.
    @మనసు పలికే: నిజమేనండీ.. టైం పాస్ కి లోటుండదు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. @జయ: అనుభవం.. పర్లేదండీ.. బానే ఉంది :-) ఇక మీ అనుభవం.. జీవితంలోనూ, రైలు ప్రయాణంలోనూ ఏమైనా జరగవచ్చు.. మీకు, మీ కుటుంబ సభ్యులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు.. ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: మీరు చెప్పిన తీరు..భలే నచ్చేసిందండీ.. మరోమారు ధన్యవాదాలు.
    @సవ్వడి: ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. @స్ఫూర్తి: నిజమేనండీ.. రైలు ప్రయాణం అంటేనే జ్ఞాపకాల పుట్ట.. ధన్యవాదాలు.
    @పరిమళం: అవునండోయ్.. మీ రైల్వే అనుబంధం గుర్తుంది నాకు.. రాస్తూ కూడా అనుకున్నా.. మీకు, మీ కుటుంబ సభ్యులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  17. ఇంజనీరింగ్ అయ్యేవరకూ ఊరువదలని నాకు ఒక్కసారిగా రెక్కలొచ్చి రెండువేల కిలోమీటర్లు వెళ్ళాను. పీజీ అడ్మిషన్స్ కి ఐఐటీల్లో ఇంటర్వ్యూలతో మొదలయ్యింది లోహబంధం. ఇప్పుడు దాదాపూ అన్ని ముఖ్యలైన్లలో ఎక్కడ ఇంజన్ మాఉస్తారు? ఎక్కడ క్రూ మారుతుందన్న దానితో సహా పూర్తివివరాలు నాకు అందుబటులో ఉంటాయి ;).
    ఎన్నెన్నో జ్ఞాపకాలు. రాయలంటే విడిగ బ్లాగు తెరవాలి. ఈమద్యన ఏసీల్లో మద్యతరగతి ప్రయాణీకులు పెరిగాక అక్కడి వాతావరణం మారిందండీ మూడేళ్ల క్రితం ఏసీహోగీ ఎక్కినప్పుడు ఏమీతోచక నాగపూర్లో స్లీపర్కి వచ్చేసి మళ్ళీ వరంగల్లులో వచ్చాను. నాకు ట్రైను తప్పిపోయిందనుకున్నారు అంతా.
    నాకు ఉన్న పెద్దసమస్య గూడూరు కోటా చెన్నైకోటాతో కలిసిపోయి కొన్నిసార్లు అంతాసాంబాఉ బాచీ తగుల్తుంది. కొద్దిగా మనేజ్ చెయ్యడం ఇబందే

    రిప్లయితొలగించండి
  18. @సుబ్రహ్మణ్య చైతన్య: ఇంకెందుకు ఆలస్యం.. సిరీసో, బ్లాగో మొదలెట్టేయండి.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి