మనమెంత 'సమయమా...చలించకే...' అని పాడుకున్నా, కాలం దాని పని అది చేసుకుపోతూ ఉంటుంది. మనమంత కచ్చితంగా మన పనులు చేసుకోలేం కాబట్టి టైం సరిపోవడం లేదు అని తప్పించేసుకుంటూ ఉంటాం. గడియారానికున్న కచ్చితత్వం మనకి లేదన్నది ఎంత నిజమో, ఒక యంత్రం పనిచేసినంత కచ్చితంగా మనుషులెవరూ పని చేయలేరన్నది కూడా అంతే నిజం. అలా చేసేస్తే ఇంక మనిషికీ, యంత్రానికీ తేడా ఏం ఉంటుంది కనుక?
మనం ఎక్కాల్సిన బస్సులూ, రైళ్ళూ మొదలు, చూడాల్సిన సినిమాల వరకూ ఏవీ కూడా టైముని పాటించవు. రైళ్ళ విషయంలో 'జీవితకాలం లేటు' లాంటి జాతీయాలే పుట్టేశాయి. మరీ హౌస్ ఫుల్లుగా నడుస్తున్న కొత్త సినిమాలు మినహాయిస్తే, మిగిలిన సినిమాలు కచ్చితంగా షెడ్యూలు సమయానికి మొదలవ్వడం తక్కువ. ఓ ఐదునిమిషాలు ఆగితే మరో పది మందన్నా వస్తారేమో అన్న ఆశ థియేటర్ వాళ్ళని అలా ఆలస్యంగా నడిపిస్తుంది.
చాలా ఆఫీసుల్లో జరగాల్సిన పని, జరగాల్సిన సమయానికి పూర్తిపోవడం అన్నది అత్యంత అరుదైన వ్యవహారం. కారణాలు ఏవిటా అని ఆలోచిస్తే, ఆసమయంలో పూర్తికావడం అసంభవం అనిపించే విధంగా డెడ్ లైను ఉండడం, పనిని పూర్తి చేయాల్సిన బృందంలోని మెజారిటీ సభ్యులకి సమయపాలన లేకపోవడం, 'ఈ పని పూర్తి చేసేస్తే ఇంతకన్నా ఎక్కువ పని వచ్చిపడుతుంది' తరహా ఆలోచనా ధోరణి, చివరిక్షణం వరకూ తాత్సారం చేసి అప్పుడు ఎవరో ఒకరి మీద పడేయెచ్చునన్న ఎస్కేపిస్టు విధానం.. ఇలా అనేకం కనిపిస్తాయి.
కలవాల్సిన వ్యక్తులని చెప్పిన సమయానికి కచ్చితంగా కలవడం అన్నది దాదాపు అసంభవం. బస్సులు, రైళ్ళ ఆలస్యం మొదలు ట్రాఫిక్ జాముల వరకూ ఎన్ని కారణాలన్నా చెప్పుకోవచ్చు. వీటితో పాటు సరిగ్గా సమయానికి వెళ్ళాలన్న సీరియస్ నెస్ లోపించడమూ ఓ ముఖ్య కారణమే. ఎంసెట్ లాంటి పరీక్షలకి 'ఒక్క నిమిషం' నిబంధన విజయవంతంగా అమలు చేస్తున్న తర్వాత కూడా ఆలస్యంగా పరిక్షకి వచ్చి వెనక్కి వెళ్ళే విద్యార్ధులు దీనిని రుజువు చేస్తూ ఉంటారు. పరీక్ష హాల్లో ఉన్న వందల మంది సమయానికే వచ్చినప్పుడు, ఈకొందరు ఎందుకు రాలేకపోయారు? అనిపించక మానదు.
చాన్నాళ్ళ క్రితం ఓ నట వారసుడిని భారీగా లాంచ్ చేశారు. టీవీ చానళ్ళు అతగాడితో ఇంటర్వ్యూలు గుప్పించాయి. "మీ తాతగారు మీకు ఏం చెప్పేవారు?" ఒకానొక టీవీ ఛానల్ వారి ప్రశ్న. తాతగారు పరమపదించే నాటికి మనవడుగారింకా బాలుడు. "తాతియ్యెప్పుడూ టయానికి తినాలి.. టయానికి పడుకోవాలి... అని చెప్పేవారు" నుదురు మీద పడని జుట్టుని వెనక్కి తోసుకుంటూ కుర్రహీరో గారి జవాబు. "ఓహో.. టైం మేనేజ్మెంట్ గురించి చెప్పేవారన్న మాట," అచ్చ తెలుగు అంతగా రాని యాంకరిణి ఇంగ్లిష్ లో సర్దుబాటు చేసేసింది.
ఆమధ్య చదివిన ఓ కథలో కొడుకు ఓ మల్టి నేషనల్ కంపెనీలో పై స్థాయి ఉద్యోగి. ఉద్యోగానికి వేళా పాళా ఉండదు. "రోజూ అంతంత సేపు ఎందుకు పని చేయాలి? నిర్దిష్టమైన పని గంటలు మాత్రమే పని చేస్తానని కచ్చితంగా చెప్పెయ్. అందుకు ఎంత జీతం ఇస్తే, అంతే తీసుకో" అంటుంది అతగాడి తల్లి. కొడుకు నిర్ణయం మాట ఎలా ఉన్నా, సమయ పాలన ఎందుకు జరగడం లేదన్న దానికి ఇదో ఉదాహరణ. ఆఫీసు ప్రారంభించే సమయమే తప్ప, ముగించడానికి నిర్దిష్టమైన వేళ ఉండకపోవడం వల్ల కూడా పనుల్లో జాప్యం పెరుగుతోందనుకోవాలి.
అసలు మనం టైం సరిపోవడం లేదు అని ఎందుకు అనుకుంటాం? నాకైతే ఒకటి అనిపిస్తుంది. ఏదన్నా తప్పు చేసినా ఒప్పుకోక పోవడం, దాన్ని మరొకరి మీదకి తోసేయాలని ప్రయత్నించడం మానవ నైజం. ఎవరూ కూడా అతీతులు కాదు కదా. అలా మనం మనకి చేయాలని ఉన్న పనులని చేయలేక పోతున్నప్పుడు, అందుకు ఎవరో ఒకరిని బాధ్యులని చేసేయాలి కాబట్టి నోరూ వాయీ లేని కాలం మీదకి ఆ తప్పుని తోసేసి తప్పుకుంటున్నామేమో కదూ..