మంగళవారం, మార్చి 28, 2023

బలగం

అతను మొదట 'వేణు వండర్స్' గా పరిచయం. ధారాళమైన బూతులకి మరికొన్ని అవలక్షణాలు గుదిగుచ్చి 'జబర్దస్త్' అని పేరిచ్చిన ఒకానొక టీవీ షోలో ఒకానొక టీం లీడర్ అప్పుడతను. ఆ మొత్తం షో ని భరించాల్సిన అవసరం లేకుండా, ఉన్నంతలో శుభ్రంగానూ, ఏదో ఒక ప్రత్యేకతతోనూ స్కిట్లు చేసే టీం లీడర్లని ఎంచుకుని, టీవీ కి బదులుగా యూట్యూబులో చూసే అవకాశం వచ్చినప్పుడు నేను షార్ట్ లిస్ట్ చేసుకున్న కొద్దిమంది టీం లీడర్లలో అతనూ ఒకడు. అప్పటికే వేణు సినిమాల్లో చిన్న వేషాలు వేసి ఉన్నాడని నెమ్మదిగా తెలిసింది. కాలక్రమంలో అతను ఇతర చానళ్లకు మళ్ళినా, యూట్యూబ్ లో దొరికిన కంటెంట్ ని చూస్తూనే ఉన్నాను. హాస్యంతో పాటుగా జానపద కళల మీద వేణుకి ఉన్న మక్కువ, అతని స్కిట్లు ప్రత్యేకంగా అనిపించడానికి, గుర్తుండడానికీ కారణమని అర్ధమవ్వడానికి చాలారోజులు పట్టింది. 

ఆలోగా అతను బుర్రకథ మొదలు, ఒగ్గు కథ వరకూ ఎన్నింటినో తన స్కిట్లలో వాడుకున్నాడు, ఆయా కళల్ని ఏమాత్రం కించ పరచకుండా, వాటిని మరింతగా గౌరవిస్తూ... "వేణు సినిమా తీస్తున్నాడు" అని విన్నప్పుడు కచ్చితంగా కామెడీ సినిమానే అయి ఉంటుంది అనుకున్నాను. ఆ సినిమా, 'బలగం', విడుదలై మంచి పేరు తెచ్చుకుందని తెలిసి సంతోషం కలిగింది. మొదట తక్కువ థియేటర్లలో విడుదల చేసినట్టున్నారు, దగ్గర థియేటర్లలో కనిపించలేదు. కేవలం సినిమాకి పెరిగిన ఆదరణ వల్ల థియేటర్లు పెంచారు. ముందుగా చేసుకున్న ఒప్పందం వల్ల అమెజాన్ ప్రైమ్ లోనూ విడుదల చేసేశారు. ఓపక్క ఉచితంగా ఓటీటీలో దొరుకుతున్నా, జనం టిక్కెట్లు కొనుక్కుని హాళ్ళకి వెళ్తూ ఉండడం బహుశా ఈ సినిమాకి మాత్రమే దొరికిన గౌరవం. 

ప్రియదర్శి మినహా పేరున్న నటీనటులెవరూ లేరు. జబర్దస్త్ లో వేణుతో పాటు కనిపించిన కొందరు కమెడియన్లతో మాత్రం జనానికి ముఖ పరిచయం. కథా స్థలం తెలంగాణ పల్లె. కథేమో ఆ పల్లెలో జరిగే ఒక చావు. చాలా మామూలుగా మొదలై, చిన్నగా నవ్విస్తూ సాగే కథనం మనకి తెలియకుండానే సీరియస్ గా మారుతుంది. సినిమా చూస్తున్న మనం ప్రేక్షకులం అనే విషయం మర్చిపోయి, ఆ ఊళ్ళో మనుషులం అయిపోతాం. ఇంటి పెద్దని పోగొట్టుకున్న ఆ కుటుంబానికి ఊహించని సమస్య రావడంతో, దాన్నుంచి వాళ్ళు ఎలా బయట పడతారా అని కుతూహల పడతాం. మెడమీద వేలాడే 'పదిలక్షల అప్పు' అనే కత్తి బారి నుంచి కథానాయకుడు (?) ఎలా తప్పించుకుంటాడో అని ఆందోళన పడతాం. చివరికొచ్చేసరికి తెరమీద కనిపించే మిగిలిన పాత్రలతో పాటు మనం కూడా 'హమ్మయ్య' అని ఊపిరి పీల్చుకుంటాం. 

ఆ పల్లెటూళ్ళో సాయిలు (ప్రియదర్శి) ఓ రైతు కొడుకు. పాతికేళ్ళు ఉంటాయి. చదువుకున్నాడు కనుక వ్యవసాయం మీద ఆసక్తి లేదు. వ్యాపారం చేయాలని కోరిక. తండ్రిది బొత్తిగా సహాయనిరాకరణ. అప్పులు చేసి మొదలు పెట్టిన వ్యాపారాలేవీ ఆ పల్లెటూళ్ళో క్లిక్కవ్వలేదు. అప్పు మాత్రం, వడ్డీలతో కలిపి పది లక్షలయ్యింది. పదిహేను లక్షల కట్నంతో పెళ్లి కుదరడం సాయిలుకి పెద్ద ఊరట. రెండు రోజుల్లో వరపూజ (ఎంగేజ్మెంట్) అనగా సాయిలు తాత కొమరయ్య హఠాత్తుగా కన్నుమూస్తాడు. ఇక, చావు చుట్టూ జరిగే రాజకీయాలు మొదలు. ముసలాయన పోయినందుకు సాయిలుతో సహా మనస్ఫూర్తిగా బాధపడేవాళ్లు ఎవరూ లేరు, సాయిలు మేనత్త లక్ష్మి పరుగున వచ్చే వరకూ. ఇరవై ఏళ్ళ తర్వాత పుట్టింట్లో అడుగు పెట్టింది ఆమె. అది కూడా, తండ్రి కడసారి చూపు కోసం. 

పెళ్ళైన తర్వాత వచ్చిన తొలి దసరా పండుగకి పుట్టింట్లో లక్ష్మి భర్త నారాయణకి, లక్ష్మి సోదరుల (సాయిలు తండ్రి, చిన్నాన్న) చేతిలో జరిగిన అవమానం ఫలితంగా ఇరవయ్యేళ్లు ఆమె పుట్టింటి గడప తొక్కలేదు. పుట్టెడు దుఃఖంతో వచ్చిన ఆమెని మనస్ఫూర్తిగా అక్కున చేర్చుకున్నది సాయిలు తల్లి మాత్రమే. నాటి అవమానాన్ని నారాయణ ఇంకా మర్చిపోలేదు. బావమరుదులూ మర్చిపోలేదు. వాళ్ళు అతన్ని కనీసం పలకరించలేదు. లక్ష్మి కూతురు సంధ్య (కావ్య కళ్యాణ్ రామ్) కి ఇదంతా కొత్త. తాతగారింటికి తొలిసారి వచ్చిందామె. అది కూడా ఇలాంటి సందర్భంలో. ఇంజినీరింగ్ చదువుకుంటోన్న ఆ అమ్మాయి జరుగుతున్న వాటిని మౌనంగా గమనిస్తూ ఉంటుంది, తప్పొప్పుల తీర్పుల జోలికి పోకుండా. 

చిన్న దినంలో కొమరయ్యకి పెట్టిన భోజనాన్ని కాకి ముట్టకపోవడంతో కథ పాకాన పడుతుంది. కాకి వస్తుంది, కొమ్మ మీద కూర్చుంటుంది తప్ప విస్తరిని కన్నెత్తి చూడదు. కొమరయ్య తీరని కోరిక ఏమిటన్నది ఎవరికీ తెలీదు. అది పల్లెటూరు కావడంతో జరుగుతున్న వాటిని ఊరు బాగానే పట్టించుకుంటూ ఉంటుంది. పదకొండో రోజున జరిగే పెద్ద దినం నాడు కూడా కాకి ముట్టకపోతే అది ఊరికి అరిష్టం. అదే కనుక జరిగితే పంచాయితీ వేసే శిక్షని ఆ కుటుంబం భరించాలి. సినిమా మొదట్లో ఏ ప్రాముఖ్యతా లేని కొమరయ్య, పోయాక కథలో ముఖ్యపాత్ర అయిపోతాడు. పోయినప్పుడు కూడా పెద్దగా మాట్లాడుకోని వాళ్ళు ప్రతి క్షణం అతన్ని తల్చుకుంటూ ఉంటారు. సాయిలు అప్పు గొడవ, బావ-బావమరుదులు ఇగో క్లాషెస్, ఇవి చాలవన్నట్టు అన్నదమ్ముల (సాయిలు తండ్రి, చిన్నాన్న) మధ్య ఆస్తి తగాదాలు. 

చాలా సీరియస్ గా వినిపించే ఈ కథని వ్యంగ్యాత్మకంగా తీశాడు వేణు. తెరమీద సీరియస్ సన్నివేశాలు నడుస్తున్నా చూస్తున్న ప్రేక్షకులకి చాలాచోట్ల నవ్వొస్తుంది, అక్కడక్కడా ఏడుపొస్తుంది. సాయిలు హీరో కాబట్టి, కుటుంబ సభ్యులందరికీ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేసి, అందరినీ కలిపేసి, అవసరమైతే కాకికి కూడా పంచ్ డైలాగులతో బ్రెయిన్ వాష్ చేసేసి ముద్ద తినిపించేస్తాడేమో అని భయపడ్డాను. కానైతే, అవేవీ జరగలేదు. ఏం చేస్తే తాత ఆత్మ శాంతిస్తుందో తన వాళ్ళకి సింబాలిక్ గా చెప్పాడు. అందులో కూడా తన డబ్బు సమస్య నుంచి బయట పడే దారిని వెతుక్కున్నాడు. ఈ కథకి కీలకం లక్ష్మి పాత్ర. ఎంతో అనుభవం ఉన్న నటి వేయాల్సిన బరువైన పాత్ర. రూపాలక్ష్మి అనే ఆవిడ చాలా అలవోకగా పోషించింది. ఆ మాటకొస్తే అన్ని పాత్రలూ అంతే. పేరున్న నటులు కాకపోవడం వల్ల, పాత్రలు మాత్రమే కనిపించాయి. 

తేలికపాటి సన్నివేశాలతో కూడిన బరువైన సినిమా 'బలగం'. వేణు తన అభిరుచికి తగ్గట్టుగా ఒగ్గుకథ మొదలు అనేక తెలంగాణ కళా రూపాలని కథలో భాగం చేశాడు. క్లైమాక్స్ లో వచ్చే పాట థియేటర్లలో ఒక సామూహిక దుఃఖ ప్రకటనగా మారుతోంది. అలా తేలిక పడడంకోసమే జనం ప్రత్యేకంగా సినిమా హాళ్ళకి వెళ్ళి చూస్తున్నారేమో అనిపించింది. చావింటిలో టీల పంపిణీ మొదలు ప్రతి చిన్న విషయాన్నీ జాగ్రత్తగా కథలో భాగం చేసుకున్నాడు దర్శకుడు. రెండు గంటల సినిమాలో ఎక్కడో అక్కడ ఏదో ఒక పాత్రలో తమని తాము చూసుకోని ప్రేక్షకులు ఉండరేమో. సంగీతం, కెమెరా, ఎడిటింగ్.. ఇలా సాంకేతిక విభాగాలన్నీ వంక పెట్టడానికి వీల్లేని విధంగా పనిచేశాయి. తెలిసిన కథలా అనిపిస్తూనే, తర్వాత ఏమిటన్న కుతూహలాన్ని ఆసాంతమూ కొనసాగించింది. నేల విడిచి సామన్నది ఎక్కడా కనిపించలేదు. బహుశా, 'బలగం' విజయ రహస్యం అదేనేమో.

బుధవారం, మార్చి 22, 2023

రంగమార్తాండ

నాటకరంగం వేరు.. జీవిత రంగం వేరు..
ఏ వేషం వేస్తున్నావో  తెలిసే చోటు అది..
ఏ నిమిషం ఏం చెయ్యాలో తెలియని ఆట ఇది... 

మన దగ్గర సినిమా నటీనటులకి ఉన్నంత క్రేజ్ నాటకాల్లో నటించే వాళ్ళ విషయంలో లేక పోవడం వల్ల నాకో మేలు జరిగింది. నాటక ప్రదర్శన అయ్యాక ఆయా నటీనటులతో నేరుగా మాట్లాడే అవకాశం చాలాసార్లు దొరికింది. కొందరితో స్నేహమూ కుదిరింది. ఈ క్రమంలో నాటకానికన్నా ముందు గ్రీన్ రూమ్ కి వెళ్లి కబుర్లు చెప్పడం తెలియకుండానే అలవాటయ్యింది. వేషం వేసుకున్నప్పుడూ, పూర్తి చేశాక కూడా వాళ్ళు మామూలు మనుషులే. కానీ, ఒక్కసారి స్టేజీ ఎక్కగానే పోషించే పాత్రలుగా మారిపోతారు. నాటకం ముగిసి, వేషం తుడుచుకోడానికి మళ్ళీ గ్రీన్ రూమ్ లోకి వస్తూనే మామూలు మనుషులైపోతారు. ఈ భేదం మొదట్లో చాలా ఆశ్చర్య పరిచేది. రానురానూ అలవాటైపోయింది. 

ఈ భేదాన్ని బహు చక్కగా పట్టుకున్నారు ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం. ఈ సూక్ష్మాన్ని అంతే చక్కగా తెరకెక్కించాడు కృష్ణవంశీ. 'రంగమార్తాండ' సినిమా చూస్తున్నంత సేపూ, చూడడం పూర్తయ్యాక కూడా నాకు తెలిసిన థియేటర్ ఆర్టిస్టులందరూ గుర్తొస్తూనే ఉన్నారు. 'రంగస్థల రంగమార్తాండ' రాఘవరావు పాత్రలో ప్రకాష్ రాజ్ జీవిస్తే, 'నాకు అంతకన్నా ఒక మార్కన్నా ఎక్కువ ఇవ్వాల్సిందే' అన్నంతగా మరో నటుడు చక్రపాణి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు బ్రహ్మానందం. రాఘవరావు భార్య రాజుగారు గా రమ్యకృష్ణ మూడో స్థంభం అయితే, మిగిలిన నటీనటులు, సాంకేతిక బృందమంతా కలిసి నాలుగో స్థంభం. దర్శకుడితో పాటు సంభాషణల రచయిత (ఆకెళ్ళ శివప్రసాద్), సంగీత దర్శకుడు (ఇళయరాజా), గీత రచయితలు (సిరివెన్నెల తదితరులు) కెమెరా (రాజ్ కె నల్లి), ఎడిటింగ్ (పవన్)  విభాగాలకీ క్రెడిట్ ఇవ్వాలి. 

ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్ ని వాడుకుని తీసిన ఈ సినిమాలో అసలు కథ రాఘవరావు రిటైర్మెంట్ తో ప్రారంభమవుతుంది. అతడు స్టేజిమీద నటించిన సీన్ ఒక్కటన్నా చూపించలేదన్న కొరతని బ్రహ్మానందం హాస్పిటల్ సీన్ కొంతవరకూ తీర్చింది. నిజానికి ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం.. వీళ్ళు ముగ్గురూ కూడా మంచి పాత్ర దొరికితే ఒళ్ళు మర్చిపోయి నటించేస్తారు. దర్శకుడు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా, వీళ్ళ నటన పాత్ర పరిధిని దాటేస్తుంది. అలా దాటకుండా కృష్ణవంశీ కాసుకున్నాడు. (వీళ్ళ ముగ్గురి ముందూ శివాత్మిక నటన లౌడ్ గా అనిపించిందంటే చాలదూ, వీళ్ళు ఎంత సటిల్డ్ గా చేశారో చెప్పడానికి). గత  కొన్నేళ్లుగా కృష్ణవంశీకి తన సినిమాల్లో సందేశాలు ఇమడ్చాలన్న తపన బాగా పెరిగింది. భాష గురించి, సంస్కృతి గురించి సందేశాలని ఈ సినిమాలోనూ చేర్చాడు. వాటి నిడివి పెరిగి ప్రేక్షకులకి విసుగు రాకుండా, క్రిస్ప్ గా కట్ చేయడం ద్వారా ఎడిటింగ్ టీం కృష్ణవంశీని కాసుకుంది. 

రంగస్థల నటుల వ్యక్తిగత జీవితం అనే పాయింట్ తీసేస్తే, ఈ కథ ఏ మధ్య తరగతి ఇంట్లో అయినా జరగడానికి వీలున్నదే. కానైతే, ఈ కథలా జరగదు. అందుకు కీలకం రంగస్థల నటుల వ్యక్తిగత జీవన శైలి. ఎక్కువమందిలో కనిపించేవి భోళాతనం, మనుషుల్ని తేలిగ్గా నమ్మేసే గుణం, తమ మీద తమకి విపరీతమైన ఆత్మవిశ్వాసం, తమ జడ్జిమెంట్ తప్పక నిజమవుతుందనే నమ్మకం... రాఘవరావు కి ఉన్న ఈ లక్షణాల వల్లే అతని జీవితం ఇల్లు దాటి రోడ్డున పడింది. మొదటినుంచీ హెచ్చరిస్తూ వచ్చిన భార్య మాత్రం అతడి వెనుక గట్టిగా నిలబడింది, అతన్ని నిలబెట్టేందుకు తన శక్తినంతటినీ పోగుచేసుకుంది. సినిమా చూసే ప్రేక్షకులు రాఘవరావుని ఎలా అర్ధం చేసుకుంటారో, సినిమా వాళ్ళకి అలా అర్ధమవుతుంది. ఇందుకోసం నాటకాలతో పరిచయం ఉండాల్సిన అవసరం లేదు. రంగస్థల రంగమార్తాండుడితో సహానుభూతి చెందగలిగితే చాలు. 


మహానటుడు ఎస్వీ రంగారావు ఆశీస్సులతో రంగస్థల నటుడిగా జీవితం మొదలు పెట్టిన రాఘవరావు, తన కొడుక్కి (ఆదర్శ్ బాలకృష్ణ) ఆ నటుడి పేరే పెట్టుకున్నాడు. కానీ అతన్ని ఎస్వీఆర్లా పెంచలేకపోయాడు. ఫలితం, భార్య (అనసూయ భరద్వాజ్) చాటు భర్తగా మిగిలిపోయాడు రంగారావు. రాఘవరావు కూతురు శ్రీ (శివాత్మిక) మాత్రం తండ్రి కళా వారసత్వాన్ని కొనసాగిస్తూ ఫ్యూషన్ మ్యూజిక్ లో భవిష్యత్తుని వెతుక్కోవడం మొదలుపెట్టింది. సహ గాయకుడు రాహుల్ (రాహుల్ సిప్లిగంజ్) ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తనకి స్వర్ణకంకణం ప్రదానం చేసిన సన్మాన  సభలోనే నటుడిగా తన రిటైర్మెంట్ ప్రకటించాడు రాఘవరావు, చూసుకోడానికి పిల్లలు ఉన్నారన్న నమ్మకంతో. ఆ రాత్రే తన ఆస్తిపాస్తుల్ని పిల్లలకి పంచేశాడు, భార్యకి మాటమాత్రమైనా చెప్పకుండా. ఆ తర్వాత, అసలు కథ మొదలైంది. 

ఇక, చక్రపాణి (బ్రహ్మానందం)ది ఓ శాపగ్రస్త జీవితం. (అందుకే సింబాలిక్ గా కర్ణ పాత్ర వేయించాడేమో కృష్ణవంశీ). రంగస్థలం మీద రాఘవరావుని మించిన నటుడే అయినా (ఈ మాట రాఘవరావే ఒప్పుకుంటాడు), తగినంత పేరు రాక వెనుక వరసలో నిలబడిపోయాడు. వ్యక్తిగత జీవితంలో ఉన్న లోటు సరేసరి. చక్రపాణిగా బ్రహ్మానందాన్ని చూశాక 'ఇంతటి నటుడిని ఇన్నాళ్లూ కామెడీకి మాత్రమే పరిమితం చేశారే' అనిపించింది. కామెడీ తక్కువ అని కాదు, ఏ పాత్ర ఇచ్చినా అవలీలగా చేసి ఉండేవాడు కదా అని. నిజం చెప్పాలంటే తెరమీద చక్రపాణి మాత్రమే కనిపించాడు, నవ్వించినప్పుడు కూడా. చక్రపాణి భార్య సుబ్బుగా జయలలిత కనిపించింది. ఆమెకి నటించే అవకాశం దొరకలేదు. 

రమ్యకృష్ణ కి తన ట్రేడ్ మార్క్ అరుపులు లేని పాత్ర. లోపల అగ్నిపర్వతాలు బద్ధలవుతున్నా, చాలా మామూలుగా కనిపించేందుకు ప్రయత్నించే ఇల్లాలిగా ఆమె బదులు మరొకరిని ఊహించలేం. "కళ్ళతోనే నటించింది" అని ఇంటర్యూలలో కృష్ణవంశీ చెబితే ఏమో అనుకున్నా కానీ, నిజమే. రాఘవరావుని పూర్తిగా అర్ధం చేసుకున్న 'రాజుగారు' ఆమె. వీళ్ళ ముగ్గురూ తెరమీద కనిపిస్తుంటే, వీళ్ళతో పాటు కనిపిస్తూ మెప్పించడం ఎవరికైనా కష్టమే. అనసూయ, శివాత్మిక, రాహుల్, ఆదర్శ్ లు కేవలం సెట్ ప్రాపర్టీలుగా మిగిలిపోకుండా తాము చేయగలిగింది చక్కగా చేశారు. తెలుగు రంగస్థల చరిత్రని సందర్భోచితంగా ప్రస్తావిస్తూ రాసిన డైలాగులు ఈ సినిమాకి అదనపు బలం. అలాగే, రంగస్థల నటుల జీవితాలు ఎలా ఉంటాయన్నదీ ప్రస్తావించారు. 

ఓ సందర్భంలో రాఘవరావు "కోట్లు సంపాదించాను, తగలేశాను" అంటాడు. ఇది అర్ధసత్యం. తెలుగునాట రంగస్థలం అంత పే చెయ్యదు. మొత్తం సంపాదన లక్షల వరకూ వెళ్లే వాళ్లే తక్కువ. అయితే, తగలేయడం మాత్రం నూటికి తొంభై మంది నటుల విషయంలో నిజం. చప్పట్లు ఇచ్చే మత్తు, ఫలితంగా మారే జీవన శైలి, ఇన్ఫీరియారిటీ - సుపీరియారిటీ కాంప్లెక్సుల మిశ్రమంగా మారే వ్యక్తిత్వం, వీటినుంచి పుట్టే నిర్లక్ష్యం.. వీటన్నంటివల్లా కావొచ్చు థియేటర్ నుంచి సంపాదించింది నిలబెట్టుకున్న వాళ్ళు బహు తక్కువ. సినిమా రంగంలోనూ ఈ సమస్య ఉన్నా, అక్కడ సంపాదన ఎక్కువ, జాగ్రత్త పరుల సంఖ్యా ఎక్కువే. ఇళయరాజా స్వయంగా పాడిన నేపధ్య గీతంతో సహా పాటలన్నీ బాగున్నాయి. 'దమిడి సేమంతి' పాట చూస్తుంటే 'సాగర సంగమం' లో 'తకిట తధిమి' గుర్తొచ్చింది అప్రయత్నంగా. 

టైటిల్స్ రన్నయ్యేప్పుడు చిరంజీవి గొంతులో 'నేనొక నటుణ్ణి' కవిత వినిపిస్తూ తెలుగు సినిమా నటుల ఫోటోలు చూపించారు. నాటకం గురించిన సినిమాలో సినిమా నటుల్ని చూపించడం ఏమిటన్నది ఒక ప్రశ్నయితే, ఎన్టీఆర్, ఏఎన్నార్లతో మొదలుపెట్టడం మరోప్రశ్న. వాళ్లకన్నా ముందు వాళ్ళయిన నారాయణ రావు, నాగయ్య లాంటి నటుల్ని ప్రస్తావించక పోవడం కృష్ణవంశీ చేయదగ్గ పని కాదు. వాళ్ళ ఫోటోలు దొరకనివీ కాదు. నటుల్ని గురించి చక్కని సినిమా తీసిన దర్శకుడికి, ఎన్టీఆర్, ఏఎన్నార్లకి ముందు కూడా తెలుగు సినిమా చరిత్ర ఉందని గుర్తు చేయాల్సి రావడం బాధాకరం. సినిమా చూసిన ప్రేక్షకుడిగా రాఘవరావుని అర్ధం చేసుకోగలిగాను కానీ, చక్రపాణిని  అర్ధం చేసుకోవాల్సింది ఇంకా చాలా ఉందనిపిస్తోంది. చాన్నాళ్ల తర్వాత మంచి సినిమా ఇచ్చిన కృష్ణవంశీకి అభినందనలు!! (కృష్ణవంశీ రీమేక్ చేస్తున్నాడని తెలిసి మరాఠీ 'నటసామ్రాట్' చూడలేదు ఇన్నాళ్లూ, ఇప్పుడు చూస్తే తెలుగుతో పోలిక వస్తుందేమో?) 

నీ నిలయమేది.. నర్తనశాలే కాదా.. 
నీ కొలువు ఏది.. విరాట పర్వం కాదా..
ముగిసిందా నీ అజ్ఞాతవాసం ??? 

సోమవారం, మార్చి 06, 2023

గ్లాచ్చు మీచ్యూ 

అసలు పుస్తకం పేరే భలే చమత్కారంగా ఉంది కదా అనుకుంటూ చేతిలోకి తీసుకుంటే, 'నా పర్సనల్ స్టోరీలు' అనే ఆకర్షణీయమైన ఉపశీర్షిక పుస్తకాన్ని బిల్లింగ్ కౌంటర్ వైపు నడిపించింది. పుస్తకం మీద దృష్టి పడడానికి కారణమేమో కవర్ పేజీ మీద రచయిత 'జయదేవ్' పేరు మరియు పోర్ట్రైట్. జయదేవ్ కార్టూనులు తెలుగు నాట మాత్రమే కాదు, అంతర్జాతీయంగానూ పేరు పొందాయి. తెలుగు వ్యాఖ్యల కార్టూన్లు పత్రికలు చదివే తెలుగు వాళ్ళని గిలిగింతలు పెడితే, క్యాప్షన్ లెస్ కార్టూనులు అంతర్జాతీయ పోటీల్లో ఆయనకి బహుమతులు తెచ్చిపెట్టాయి. కార్టూన్ రేఖలు మాత్రమే కాదు, జయదేవ్ వాటికి రాసే వ్యాఖ్యలూ బహు పొదుపుగా ఉంటాయి. ఒక్కోసారి రెండోసారి చదువుకుని అర్ధం చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఇదిగో ఈ పర్సనల్ స్టోరీలని కూడా రెండో సారి చదవాల్సిందే - అర్ధం చేసుకోడానికి కాదు, మరింతగా ఆస్వాదించడానికి. 

మద్రాసు చాకలి వీధిలో 'రేడియో కారమ్మ' మనవడిగా బాల్యాన్ని గడిపారు జయదేవ్. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో మొదట రేడియో కొనుక్కున్నది వీళ్ళే కావడంతో, ఇంటి యజమానురాలి పేరు మీద 'రేడియో కారమ్మ ఇల్లు' గా పేరు స్థిరపడి పోయింది. ఎక్సయిజ్ డిపార్ట్మెంట్ లో పని చేసే తండ్రి గారిది బదిలీల ఉద్యోగం కావడంతో, నాయనమ్మ, చిన్నాన్నల దగ్గర ఉండి చదువుకున్నారు జయదేవ్. వీళ్ళతో పాటు మేనత్త 'అనసూయమ్మఆంటీ' .. ఈవిడ దాదాపు జయదేవ్ ఈడుదే. మధ్యతరగతి మందహాసం, పైగా మద్రాసు నగరంలో.. ఇక సరదా కబుర్లకి లోటేం ఉంటుంది? వందకి పైగా ఉన్న స్టోరీలని ఒక ఆర్డర్ లో చెప్పాలనే శషభిషలేవీ పెట్టుకోలేదు రచయిత. అలాగని కొమ్మచ్చులూ ఆడలేదు. ఒక్కో స్టోరీని రెండు మూడు పేజీలకి మించకుండా క్లుప్తంగా చెబుతూనే, ఎక్కడా చర్విత చర్వణం కాకుండా జాగ్రత్త పడ్డారు. 

చిత్రకళ మీద లోపలెక్కడో ఉన్న ఆసక్తి బడి రోజుల్లో బయట పడింది. బళ్ళో మేష్టర్ల తో పాటు ఇంట్లో సభ్యులూ ప్రోత్సహించడంతో మెరుగులు దిద్దుకునే అవకాశం దొరికింది. కెరీరిజం ఊపందుకోని పంతొమ్మిది వందల యాభైల నాటి రోజులు కదా. రేఖలు సాధన చేస్తూనే, కార్టూనులు గీసి పత్రికలకి పంపడం, అవి అచ్చయ్యి పారితోషికాలు వస్తూ ఉండడం త్వరలోనే మొదలయ్యింది. కాలేజీ చదువుకు వచ్చే నాటికి, కార్టూన్ మానియార్దర్లు ఖర్చులకి సరిపోయేవి. పేరొచ్చేసినా సాధనని ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదు. ప్రతినెలా కార్టూనులు మీద వచ్చిన డబ్బులో కొంతభాగం డ్రాయింగ్ పేపర్లు, రంగుల కోసం, మరికొంత భాగాన్ని అంతర్జాతీయ పత్రికలు కొనడం కోసం క్రమం తప్పకుండా వెచ్చించేవారు జయదేవ్. అదిగో, ఆ పత్రికలు చదివే అలవాటే అంతర్జాతీయ కార్టూన్ రంగంలో అడుగు పెట్టడానికి దారి చూపింది. 

చదువుకున్న కాలేజీలోనే జువాలజీ డిమాన్ స్ట్రేటర్ ఉద్యోగం రావడంతో మద్రాసు వదిలి వెళ్లాల్సిన అవసరం కనిపించలేదు. కార్టూనింగ్ నే కాదు, చదువునీ విడిచిపెట్టలేదు. పులికాట్ చేపల మీద జయదేవ్ చేసిన పరిశోధన విశేషాలు ఎంత ఆసక్తిగా చదివిస్తాయో, ఆయన స్నేహితుడు పులికాట్ జలగలు మీద చేసిన పరిశోధన విశేషాలు అంతకు మించి చదివిస్తాయి. ఎంత ఘాటు విషయాన్నైనా అలవోకగా నవ్విస్తూ చెప్పడం ఆయనకి బాగా అలవాటైపోయింది మరి. సరదా సంభాషణ, స్నేహశీలత జయదేవ్ వ్యక్తిత్వంలో ప్రత్యేకతలు అనిపిస్తుంద కాలేజీలో లెక్చరర్లకు ఇళ్ల నుంచి కేరేజీలు తెచ్చే అమ్మాయికి 'క్లియోపాత్రా' అనే ముద్దు పేరు పెట్టి, ఆమెకో ప్రేమకథ సృష్టించి కార్టూన్లు వేయడం లాంటి చమక్కులు అసలు కథలో సరదాగా కలిసిపోయే కొసరు కథలు. స్టాఫ్ రూమ్ బోర్డు మీద రోజూ కార్టూన్ స్ట్రిప్ గా గీసే ఆ ప్రేమకథ కోసం లెక్చరర్లందరూ ఎదురు చూసేవారట. 

చిత్రకారులు, కార్టూనిస్టులు అందరితోనూ స్నేహం చేసి, దాన్ని నిలబెట్టుకున్నారు జయదేవ్. చిన్నా పెద్దా భేదాలు చూడలేదు. తనకి కావాల్సిన విషయాలు నేర్చుకోడానికి, తనకి తెలిసినవి నేర్పడానికి వెనకాడలేదు. ఆ అనుభవాలని అక్షరబద్ధం చేయడంలో ఎక్కడా ఆత్మస్తుతికి, పరనిందకీ చోటివ్వలేదు. (ఈమధ్యే మరో చిత్రకారుడి పరనిందా పూరితమైన ఆత్మకథ - బాలి 'చిత్రమైన జీవితం' - చదివానేమో, ఈ పుస్తకం మరింత హాయిగా అనిపించింది. సెన్సారు బోర్డు సభ్యుడిగా పనిచేసిన నాటి విశేషాల మొదలు, బాపూ-రమణల టెలిస్కూల్ పాఠాల కబుర్ల వరకూ ఏళ్ళ నాటి ముచ్చట్లని హాయిగా చెప్పారు. కార్టూనిస్టులందరినీ ఏకతాటి మీదకి తెచ్చి సభలు నిర్వహించడం లాంటి కబుర్లు ఆసక్తిగా అనిపించాయి. మద్రాసు జీవితం, తరచూ వచ్చే అనారోగ్యాలు, వాటికి చేయించుకునే వైద్యాలు లాంటి బరువైన విషయాలని కూడా తేలిగ్గా చెప్పారు. 

ముందుమాట రాసిన మాలతీ చందూర్ (ఈ పుస్తకం తొలి ముద్రణ 2009) "వీరేశలింగం గారి 'స్వీయ చరిత్ర', గురజాడ వారి డైరీలు, శ్రీపాద వారి 'కథలు-గాధలు' ..." అంటూ జాబితా రాశారు. 'కథలు-గాధలు' రచన శ్రీపాద వారిది కాదు, చెళ్ళపిళ్ళ వారిది. ప్రకాశకులైనా సరిదిద్ది ఉంటే బాగుండేది. కాస్త తక్కువగా నాలుగొందల పేజీలున్న ఈ పుస్తకంలో ప్రతి స్టోరీకీ జయదేవ్ స్వయంగా వేసుకున్న రేఖా చిత్రం ప్రత్యేక ఆకర్షణ. ఆపకుండా చదివించే కథనం, శైలి. జయదేవ్ జీవితంతో పాటు, తెలుగునాట కార్టూన్ పరిణామ క్రమాన్ని గురించి కూడా రేఖా మాత్రపు అవగాహనని ఇచ్చే రచన ఇది. (వియన్నార్ బుక్ వరల్డ్, చౌడేపల్లి, చిత్తూరు వారి ప్రచురణ. వెల రూ. 250).