"రండీ ఓ మిత్రులార జెండా ఎగురవేయ.. మన జాతికి
గౌరవమీయ.." ఆడపిల్లలందరూ గదిలో ఓ మూల కూర్చుని పాట ప్రాక్టీసు
చేసుకుంటున్నారు చక్కగా. వాళ్ళకయితే అదొక్కటే పని. అదే మగపిల్లలకయితేనా..
పురికొసలు కాలవలోకి పట్టుకెళ్లి నానబెట్టి, ఆ తర్వాత ఎండబెట్టాలి. రంగు
రంగుల జెండా కాయితాలు మడతలు పెట్టి, మేష్టారు కత్తిరించడానికి రెడీగా
పెట్టాలి. ఎవరింట్లో కత్తెరలు ఉన్నాయో లెక్కేసి, వాళ్లలో ఎవరు తిట్టకుండా
ఎరువిస్తారో నిర్ణయించి, జెండా కాయితాలు కత్తిరించడడం కోసం అడిగి
పట్టుకురావాలి. మేష్టారు జెండాలు కత్తిరిస్తుంటే, ఆయనకి కోపం రాకుండా
చూసుకోవాలి. నోటిమీద వేలేసుకుని చూస్తూ ఉండాలి. అప్పుడు గనక ఏమన్నా
మాట్లాడామంటే, చెయ్యి తిరగెయ్యమని వేళ్ళ కణుపుల మీద రూళ్ళ కర్రతో
ఒక్కటేస్తారు మేష్టారు.
జెండాలు కత్తిరించడం అయిపోగానే కనీసం
ఇద్దరం వెళ్లి కత్తెరని తిరిగిచ్చేసి రావాలి. పురికొస తాడుని బడి బయట ఆ
చివర నుంచి ఈ చివరికి వరసలుగా కట్టి, రామారావు గారి ఇంటి దగ్గరనుంచి
తెచ్చిన వేడి వేడి లైపిండి తాడుకి పులమాలి. అప్పుడేమో మేష్టారొచ్చి
దగ్గరుండి జెండా కాగితాలు చిరిగిపోకుండా తాడుకి ఎలా అతికించాలో చూపిస్తారు.
కొంతమంది జెండాలు అంటిస్తుంటే, ఇంకొంతమంది రద్దు ఏరి బయట పడేసే పని,
బండిముందు ఇసుకలో నీళ్లు జల్లేపనీ చూడాలి. హమ్మయ్య పురికొస అంతా రంగురంగుల
జెండా కాగితాలతో నిండిపోయింది.. మిగిలిన జెండాలు గుమ్మాల పైనా, బోర్డు పైనా
అతికించేస్తే జెండాల పని అయిపోయినట్టే. ఈ పైన కట్టే పని మాత్రం పొడుగు
పిల్లలదే. వొచ్చే ఏడాదికైనా వాళ్లంతా పొడుగైపోతే బాగుండును అనిపించేస్తుంది
మనకి. సరే, ఇప్పుడింక ఆడపిల్లల పని మొదలవుతుంది. మధ్యాహ్నం బళ్లోకి వచ్ఛేప్పుడే తెల్ల ముగ్గు, రంగు ముగ్గులూ తెచ్చేసుకుంటారు కదా వాళ్ళు. వాటిలో తడిసిన ఇసక మీద రంగు ముగ్గులు పెట్టేస్తారు. మేష్టారు దగ్గరుండి జెండా కర్ర చుట్టూ రంగు ముగ్గు పెట్టించేస్తారు. ఆరిపోయిన జెండాల తాడుని క్లాసులో కట్టే పనీ, నేల బెంచీలు పైకెత్తి, ఇసకంతా తుడిచి, నీళ్లు జల్లే పనీ మళ్ళీ మగ పిల్లలవే. ఇవయ్యాక ఆడపిల్లలు షోగ్గా వచ్చి మేష్టారిచ్చిన రంగు సుద్దలతో గచ్చు నేలమీద ముగ్గులు పెట్టేస్తారు. ఆ ముగ్గులు ఆరిపోయాక నేల బల్లలు మళ్ళీ పరిచేయాలి. అన్నట్టు, అంతకన్నా ముందే, అప్పటికి వారం ముందు నుంచీ రోజూ చేయిస్తున్న 'ఎటేంషన్' 'స్టెండిటీజ్' అందరం కలిసి మళ్ళీ ఓ సారి చేసి చూపించాలి మేష్టారికి.
ముగ్గులతోనూ, జెండాలతోనూ బడి భలే కొత్తగా అయిపోతుంది కదా. అప్పుడేమో మేష్టారు, మర్నాడు పొద్దున్నే జెండాలో వెయ్యడానికి పువ్వులు అవీ ఎవరెవరు తేవాలో చెప్పేసి, పొద్దున్నే ఉతికిన బట్టలు కట్టుకుని ఆలీసం చెయ్యకుండా బడికొచ్చేయాలని, ఎవ్వరూ మానకూడదనీ చెప్పేసి ఇంటికి పంపిస్తారు. ఇంటికొచ్చేమంటే జెండా పండగ సగం అయిపోయినట్టే. ఇంక మర్నాడు తెల్లారిందంటే ఇంట్లో ఒకటే హడావిడి. మామూలు పండగల్లాగే తలంటేస్తుంది అమ్మ. కుంకుడు కాయ రసం కానీ కంట్లో పడిందంటే కళ్ళు ఎర్రగా అయిపోతాయి. "అబ్బే మా నాన్నగారు అస్సలు కొట్టలేదు.. కుంకుడ్రసం పడిందంతే" అని మనం చెప్పినా సరే, ఫ్రెండ్సులు అనుమానంగా చూస్తారు.
అది మొదలు పెద్ద మనుషులు
గాంధీ గారనీ, నెహ్రు గారనీ ఏవిటేవిటో మాట్లాడతారు. ఫ్రెండ్సులందరూ చక్కగా
కొబ్బరి ముక్కలూ అవీ ఎప్పుడు పెడతారో అని చూడొచ్చు కానీ, మనం మాత్రం పెద్ద
మనుషులు మాట్లాడేది శ్రద్ధగా వినాలి. ఇంటికెళ్ళాక ఎవరెవరు ఏమేం మాట్లాడారు
అని ప్రశ్నలు ఉంటాయి. సరిగ్గా కానీ చెప్పలేకపోయామా, పొద్దు పొద్దున్నే
ఫ్రెండ్సులకి వచ్చిన అనుమానాలు నిజమయిపోతాయి. ఎండలో నిలబడి వినగా వినగా,
మేష్టారు సైగ చేసినప్పుడల్లా చప్పట్లు కొట్టగా కొట్టగా, అప్పటికి
పూర్తిచేస్తారు వాళ్ళు మాట్లాడడం. గాంధీ గారు, నెహ్రు గారు జైలుకి వెళ్లారు
కాబట్టే మీరిలా చదువుకోగలుగుతున్నారు అని చెబుతారు వాళ్ళు. "వాళ్లంత
కష్టపడి జైలుకి వెళ్లకపోతేనేం" అనిపిస్తుంది కానీ, ఆ మాట పైకనేస్తే
పాతెయ్యరూ?
హమ్మయ్య! చిన్న
చిన్న కాగితం ముక్కల్లో కొబ్బరి ముక్కలూ అవీ ఇచ్చేశారు కదా.. ఎప్పటిలాగే
రామారావు గారు "పడెయ్యకూడదు.. గాంధీ గారి ప్రసాదం" అని కూడా చెప్పేశారు
కదా.. ఇంకా ఇంటికి వెళ్లిపోవచ్చు అనుకుంటున్నారా? అప్పుడే ఎక్కడ.. ఇంకా
కాంగ్రెస్ అరుగు దగ్గర జెండా ఎగరెయ్యద్దూ? అందరం రోడ్డుకి ఎడమవైపున
వరుసలుగా బయలుదేరతాం.. కాంగ్రెస్ అరుగు దగ్గరికి వచ్చేస్తే మనిల్లు దగ్గరే
కూడాను. ఆలా అని ఇంట్లోకి వెళ్లిపోకూడదు. అక్కడ మళ్ళీ కాసేపు 'ఎటేంషన్'
'స్టెండిటీజ్' చేశాక, వేరే పెద్దమనుషులు వచ్చి, కొబ్బరికాయలు కొట్టి జెండా
ఎగరేస్తారు. ఇక్కడైతే ఒకళ్ళో ఇద్దరో మాట్లాడతారంతే. పైగా, కొబ్బరి ముక్కలతో
పాటు తీబూందీ, కారబూందీ వేరేవేరే అరిటాకు ముక్కల్లో పెట్టి ఇస్తారు.
అంతేనా? గత సంవత్సరం ఎక్కువ మార్కులు వఛ్చిన విద్యార్ధులకి నగదు బహుమతుల పంపిణీ కూడాను. డబ్బులు తీసుకుని, ఆ పెద్దమనిషి ఎప్పుడూ మన ఇంటికొచ్చే నాన్న ఫ్రెండే అయినా అస్సలు నవ్వకుండా, ఆయనకీ, మేష్టారికి నమస్కారం చేసేసి, అప్పుడా డబ్బులతో ఏమేం చెయ్యొచ్చో ప్లాన్లు వేసేసుకోవచ్చు. బడికి దగ్గరగా ఇళ్లున్న వాళ్ళు వెనక్కి వెళ్తారు కానీ, మనం ఉండిపోవచ్చు ఎంచక్కా. వచ్చిన చిరుతిళ్లన్నీ ఒలికిపోకుండా జాగ్రత్తగా పట్టుకుని ఇంటికి వెళ్తామా? అమ్మ ముందుగా డబ్బులగురించి అడుగుతుంది. "నీ దగ్గరుంటే పారేసుకుంటావు.. నాన్నగారికి చెప్పి పోస్టాఫీసులో వేయిస్తాను" అని ఆమాటా ఈమాటా చెప్పి పుచ్చేసుకుంటుంది. బాగా చదువుకుని, వొచ్చే ఏడు కూడా బహుమతీ తెచ్చుకోవాలనీ, అప్పుడా డబ్బులు అమ్మకి అస్సలు ఇవ్వకుండా ప్రసాదం గారి కొట్లో బజ్జీలూ, వడలు అవీ కొనుక్కుని తినెయ్యాలనీ ప్లాన్లు వేసుకోడంతో ఆ ఏటికి జెండా పండగ అయిపోయినట్టే...
అంతేనా? గత సంవత్సరం ఎక్కువ మార్కులు వఛ్చిన విద్యార్ధులకి నగదు బహుమతుల పంపిణీ కూడాను. డబ్బులు తీసుకుని, ఆ పెద్దమనిషి ఎప్పుడూ మన ఇంటికొచ్చే నాన్న ఫ్రెండే అయినా అస్సలు నవ్వకుండా, ఆయనకీ, మేష్టారికి నమస్కారం చేసేసి, అప్పుడా డబ్బులతో ఏమేం చెయ్యొచ్చో ప్లాన్లు వేసేసుకోవచ్చు. బడికి దగ్గరగా ఇళ్లున్న వాళ్ళు వెనక్కి వెళ్తారు కానీ, మనం ఉండిపోవచ్చు ఎంచక్కా. వచ్చిన చిరుతిళ్లన్నీ ఒలికిపోకుండా జాగ్రత్తగా పట్టుకుని ఇంటికి వెళ్తామా? అమ్మ ముందుగా డబ్బులగురించి అడుగుతుంది. "నీ దగ్గరుంటే పారేసుకుంటావు.. నాన్నగారికి చెప్పి పోస్టాఫీసులో వేయిస్తాను" అని ఆమాటా ఈమాటా చెప్పి పుచ్చేసుకుంటుంది. బాగా చదువుకుని, వొచ్చే ఏడు కూడా బహుమతీ తెచ్చుకోవాలనీ, అప్పుడా డబ్బులు అమ్మకి అస్సలు ఇవ్వకుండా ప్రసాదం గారి కొట్లో బజ్జీలూ, వడలు అవీ కొనుక్కుని తినెయ్యాలనీ ప్లాన్లు వేసుకోడంతో ఆ ఏటికి జెండా పండగ అయిపోయినట్టే...
మిత్రులందరికీ డెబ్భయ్యో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!