తనకి కరోనా పాజిటివ్ వచ్చిందనీ, ముందు జాగ్రత్త కోసం ఆస్పత్రిలో చేరుతున్నాననీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సెల్ఫీ వీడియో విడుదల చేసినప్పుడు, "ఒకసారి ట్రీట్మెంట్ చేయించుకుని వచ్చేస్తే ఇక పాడుతా తీయగా, స్వరాభిషేకం ప్రోగ్రాం షూటింగులు పెట్టేసుకుంటారు కాబోలు" అనుకున్నాను. వైద్యం అలా కొనసాగుతూ ఉన్నప్పుడు కూడా అదే నమ్మకం, "ఇవాళ కాకపోతే రేపు.. 'నా ఆరోగ్యం కోసం ప్రార్ధించిన మీ అందరికీ అనేక నమస్కారాలు' అంటూ టీవీలో కనిపించేస్తాడు" అనుకున్నా. కోలుకుంటున్న కబురులు వినిపిస్తూనే, ఉన్నట్టుండి పరిస్థితి విషమం అనీ, అటుపైన 'ఇకలేరు' అనీ చెప్పేశారు హాస్పిటల్ వాళ్ళు. వాళ్ళు చెప్పే వరకూ కూడా ఆగకుండా సోషల్ మీడియాలో నివాళులు హోరెత్తడం మొదలుపెట్టేశాయి. నివాళులు అర్పించడంలో మనమే ముందుండాలనే సోషల్ మీడియా రష్ బాలూని కొన్ని గంటల ముందుగానే స్వర్గస్తుణ్ణి చేసేసింది. ఇది విషాదంలోని మరో విషాదం.
బాలూ అంటే నాకు మా ఇంట్లో ఉండే కరెంట్ రేడియో. తర్వాతి కాలంలో విరివిగా వచ్చిన పోర్టబుల్ టీవీ సైజులో ఉండే ఆ రేడియోలోనే బాలూ పేరుని, పాటని మొదటగా వినడం. అరుదుగా పత్రికల్లో ఇంటర్యూలు వచ్చేవి. తను కాస్త బొద్దుగా మారిన రోజుల్లో ఓ కాలేజీ అమ్మాయి తన దగ్గరికి వచ్చి 'లవ్ బాలూ' అందనీ, తనేమో 'లవ్ బాలూ కాదమ్మా లావు బాలూ' అన్నాననీ చెప్పిన ఇంటర్యూ బాగా గుర్తుండిపోయింది. సినిమాల్లో అడపాదడపా వేషాలు, డబ్బింగులు ఇవన్నీ ఓ వైపైతే పాతికేళ్ల క్రితం మొదలైన ప్రయివేటు తెలుగు చానళ్ళు, వాటిల్లో తరచుగా కనిపిస్తూ, పాడుతూ, మాట్లాడుతూ ఉండే బాలూ మరోవైపు. ఘంటసాల తర్వాతి తరంలో వచ్చిన పాటల్లో నూటికి తొంభై బాలూవే అవ్వడం వల్ల కూడా కావొచ్చు, వైవిధ్యంగా ఉండే జేసుదాసు గొంతు నాకు అభిమాన పాత్రమయ్యింది. దీనర్ధం బాలూ పాట ఇష్టం లేదని కాదు. అసలు బాలూ పాటని ఇష్టపడకుండా ఉండడం సాధ్యపడదేమో కూడా.
టీవీ చానళ్ళు-బాలూ అనగానే అందరికీ మొదట గుర్తొచ్చేది 'పాడుతా తీయగా' కార్యక్రమం. నేను టీవీ తెరమీద బాలూని దగ్గరగా గమనించింది మాత్రం అదే సమయంలో జరిగిన ఓ సినిమా కార్యక్రమంలో. అందరూ చిన్న పిల్లలతో ఎమ్మెస్ రెడ్డి మల్లెమాల పతాకం మీద నిర్మించిన 'రామాయణం' (జూనియర్ ఎన్ఠీఆర్ మొదటి సినిమా) చిత్రాన్ని ప్రమోట్ చేయడం కోసం బాల నటీనటులతో జెమినీలో ఓ ఇంటర్యూ వచ్చింది. ఆశ్చర్యంగా, ఆ ఇంటర్యూ నిర్వహించింది బాలూనే. రాముడి పాత్ర కాకుండా నీకు ఇష్టమైన ఇంకో పాత్ర ఏమిటి అని బాలూ అడిగినప్పుడు, 'రావణాసురుడు' అని జూనియర్ చెప్పడమూ, "మీ తాతయ్యకి కూడా రావణబ్రహ్మ పాత్రంటే చాలా ఇష్టమయ్యా" అంటూ బాలూ నవ్వడమూ అలా గుర్తుండిపోయాయి. నావరకూ, బాలూ నవ్వు అంటే ఇప్పటికీ ఆ క్షణంలో నవ్విన నవ్వే.
(Google Image) |
అదే సమయంలో, అదే ఛానల్ కోసం చేసిన ఓ సరదా కార్యక్రమంలో (ఓ హిట్ పాట ట్యూన్ లో మరో హిట్ పాటని అప్పటికప్పుడు ప్రేక్షకుల ఫోన్ కోరిక మేరకు పాడడం) 'శంకరా.. నాద శరీరా పరా' ని వేరే ట్యూన్ లో పాడినప్పుడు 'ఇలా చేయకుండా ఉంటే బాగుండేది' అనిపించింది. రానురానూ టీవీలో బాలూ కనిపించడం పెరిగే కొద్దీ ఈ 'ఇలా చేయకుండా ఉంటే బాగుండేది' జాబితా కూడా పెరుగుతూ వచ్చింది. పాట ట్యూన్ లో కిట్టింపులు చేయడం నన్ను బాగా ఇబ్బంది పెట్టిన విషయం (సినిమాలో పాడినట్టు కాకుండా కొంత మార్పు చేయడం - తగినంత ప్రాక్టీసు లేకనా లేక కావాలని చేస్తూ వచ్చిందా అన్నది ఇప్పటికీ సందేహమే). అలాంటి సందర్భాల్లో కో-సింగర్ల ఇబ్బంది స్పష్టంగా కనిపిస్తూ ఉండేది మొదట్లో (రానురాను వాళ్ళూ అలవాటు పడిపోయారు).
తను వేలల్లో పాటలు పాడిన కాలంలో పదుల సంఖ్యలో మాత్రమే పాటలు పాడిన గాయకుల్ని 'పాడుతా తీయగా' కి అతిధులుగా పిలిచి, వాళ్ళు పాడిన ఆ కొన్ని పాటలూ కూడా తను మిస్ అయినందుకు వాళ్ళ సమక్షంలోనే బాధ పడడం ("ఇంకానా బాలూ? ఇంకా ఎన్ని పాటలు పాడాలి? ఇంకెవరూ పాడకూడదా?"), రెండు మూడు సినిమాల్లో హీరో వేషాలు వేసి తర్వాత అవకాశాల కోసం తిరుగుతున్న వాళ్ళని అతిధులుగా పిలిచి "అందరు హీరోలకీ పాడాను. మీకూ పాడాలని ఉంది, కనీసం ఒక్క పాట" అని కోరడం (మాడెస్టీ అని తను అనుకుని ఉండొచ్చు గాక) లాంటివి చూసినప్పుడు 'అబ్బా' అనిపించడం - వీటితో పాటు మరికొన్ని కారణాల వల్ల ఆ ప్రోగ్రాం మీదే ఆసక్తి సన్నగిల్లింది. - మాత్రమే కాదు, "అసలు బాలూ టీవీలో కనిపించకుండా ఉంటే బాగుండేదేమో" అనిపించేది. నిజానికి 'పాడుతా తీయగా' 'పాడాలని ఉంది' లాంటి కార్యక్రమాలు ఎందరికో ప్లాట్ఫార్మ్ ని, కెరీర్నీ ఇచ్చాయి.
బాలూ తనని తాను కొంచం ఎక్కువగా ఆవిష్కరించుకున్న కార్యక్రమం 'మా' టీవీ కోసం ఝాన్సీ చేసిన 'పెళ్లి పుస్తకం.' ఆసాంతమూ ఆసక్తిగా సాగే ఆ కార్యక్రమం చివర్లో, "మేం చాలా నిజాయితీగా మాట్లాడాం. ఈ కార్యక్రమంలో పాల్గొనే అన్ని జంటలూ ఇలాగే నిజాయితీగా మాట్లాడాలి" అని సందేశం ఇవ్వడం బాలూ మార్కు చమక్కు. తను అడపాదడపా మాత్రమే తెరమీద కనిపించే రోజుల్లో బాలూ ఎలా చేశాడో చూడడం కోసం 'ఓపాపా లాలి' లాంటి సినిమాలకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి కానీ, టీవీలో తరచూ కనిపించడం బాగా పెరిగిన కాలంలో వచ్చిన 'మిథునం' నాటికి మాత్రం బాలూ ఎలా చేశాడన్న కుతూహలం కన్నా, సినిమా ఎలా తీసి ఉంటారన్న ఆసక్తే ఎక్కువైంది. (తెలియకుండానే తన నటన మీద ఓ అంచనా వచ్చేసిందేమో బహుశా). బాలూని నాలుగడుగుల దూరం నుంచీ చూసిన సందర్భాలు నాలుగైదు ఉన్నాయి కానీ, ఒక్కసారి కూడా దగ్గరకి వెళ్లి పలకరించాలనిపించలేదు - బహుశా టీవీ వల్లే.
కొన్నాళ్ల క్రితం నేనూ, నా మలయాళీ మిత్రుడూ సినిమా పాటల గురించి ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నాం. జేసుదాస్, విజయ్ ఏసుదాస్ పాటల గురించి నేనూ, 'ఎస్పీబీ సర్' పాటల్ని గురించి తనూ. "హీ ఈజ్ వెరీ హంబుల్. డౌన్ టు ఎర్త్..." అంటూ చాలా సేపు మాట్లాడాడు. నేను 'బాలూ' అని రిఫర్ చేస్తే, కాసేఫు తెలుగులో బాలూ అనే ఇంకో గాయకుడు ఉన్నాడనుకుని పొరబడ్డాడు తను. 'బాలూ, ఎస్పీబీ సర్ ఒక్కరే' అని నేను చెప్పినప్పటి తన రియాక్షన్ ఇప్పటికీ గుర్తే. "హౌ కెన్ యు కాల్ హిం బాలూ?" అంటూ తగువేసుకున్నాడు. ఏళ్లతరబడి మన జీవితంలో ఓ భాగమైపోయిన వాళ్ళని ఇంకెలా పిలుస్తాం? అదే విషయం చెప్పడానికి ప్రయత్నించా. 'ఎస్పీబీ సర్' ని ఒక్కసారైనా కలవాలన్న నా మిత్రుడి కోరిక తీరకుండానే, కరోనా మహమ్మారి బాలూని బలి తీసుకుంది. 'నీవు లేవు నీ పాట ఉంది' అంటూ ఏనాడో కవికుల తిలకుడు దేవరకొండ బాలగంగాధర తిలక్ చెప్పిన కవితా వాక్యం బాలూ విషయంలో అక్షర సత్యం. బాలూ పాట ఎప్పటికీ మార్మోగుతూనే ఉంటుంది.