మనం ఏదన్నా అడవి మీదుగా ప్రయాణం చేసేటప్పుడు కిటికీ లోంచి కనిపించే మనుషులనీ, దృశ్యాలనీ రెప్ప వాల్చకుండా చూస్తాం. ప్రయాణం ముగిశాక కూడా ఆ జ్ఞాపకాలు ఓ పట్టాన వదలవు. అదాటున చూసిన మనుషులు పెద్దగా గుర్తుండక పోవచ్చేమో కానీ, చెట్టూ చేమనీ, పశు పక్ష్యాదులనీ ఓ పట్టాన మర్చిపోలేం. వంశీ నవల 'మన్యంరాణి' పూర్తి చేసి పక్కన పెట్టాక కూడా అంతే. నవలలో పాత్రలు, కథా గమనం కన్నా కూడా రచయిత చేసిన ప్రకృతి వర్ణనలు పదే పదే గుర్తొస్తాయి. కథమీద కన్నా కూడా, ఈ వర్ణనల మీద రచయత ఎక్కువగా దృష్టి పెట్టడమే ఇందుకు కారణం.
ఇప్పటివరకూ, 'మా పసలపూడి కథలు' 'మా దిగువ గోదారి కథలు' సంపుటాల్లో తూర్పు గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలని పరిచయం చేసిన వంశీ, ఈ నవలకి నేపధ్యంగా అదే జిల్లాలోని మారేడుమిల్లి అడవులని ఎంచుకున్నారు. అడవి అందాలు, గిరిజనుల జీవితం, ఆచార వ్యవహారాలూ, అడవితో వారికి పెనవేసుకుపోయే అనుబంధం, అదే అడవిని దోచుకునేందుకు రకరకాల మనుషులు చేసే రకరకాల కుట్రలు, వీటికి ఊహకందనంత నాటకీయత తోడైతే అదే 'మన్యంరాణి' నవల. అడవికి అంతకీ పెద్దయిన కొమరం లచ్చన్నమావ కథ, ఆయన కూతురు మన్యం మొత్తానికి అద్భుతమైన సౌందర్యవతీ అయిన రాజమ్మల కథ ఇది.
ఆ అడవిలో లచ్చన్న మావ మాట వేదం. మూలికల వైద్యం చేసే లచ్చన్న మావ గీసిన గీటు దాటరు ఎవరూ. వయసొచ్చిన రాజమ్మ అద్దంలోనూ, నీటి చెలమల్లోనూ తన అందమైన ప్రతిబింబాన్ని చూసుకుని మురుసుకుంటూ ఉంటుంది. ఓ సందర్భంలో రాజమ్మని చూసిన ముగ్గురు యువకులు ఆమెతో పీకలోతు ప్రేమలో మునిగిపోతారు. మరోపక్క, కలప స్మగ్లర్ల బారినుంచి అడవితల్లిని కాపాడుకోడానికి తీవ్రంగా కృషి చేస్తూ ఉంటాడు లచ్చన్న మావ. ఆ ముగ్గురు కుర్రాళ్ళ ప్రేమకథ ఏమయ్యింది? లచ్చన్న మావ ఆశయం నెరవేరిందా, లేదా? అన్నది నవల ముగింపు.
వంశీ కథల్లో తగుమాత్రంగా కనిపించే నాటకీయత, నవలల దగ్గరికి వచ్చేసరికి అంతా తానే అయిపోతూ ఉంటుంది. నవలల్లో సిని ఫక్కీ మలుపులు చేర్చడం పట్ల వంశీకి ఉన్న మక్కువ ఇందుకు కారణం అయ్యి ఉండొచ్చు. మిగిలిన నవలల్లోలాగానే, ఈ 'మన్యంరాణి' లోనూ నాటకీయత శృతి మించడం వల్ల కథా, కథనాలకి ఓ తీరూ తెన్నూ లేకుండా పోయింది. ప్రతి పాత్రకీ ఓ ఐడెంటిటీ ని ఇవ్వడంలో రచయిత కృతకృత్యుడు కాలేకపోయాడు. అలాగే, లచ్చన్న మావ పాత్ర మీద పెంచుకున్న ప్రేమ వల్ల, మిగిలిన పాత్రలు అంగుష్ఠమాత్రంగా మిగిలిపోయాయి. కథని వంశీ మార్కు హడావిడి ముగింపుకి తేవడం వల్ల, కనీసం లచ్చన్న మావ పాత్ర కూడా పాఠకుల మీద బలమైన ముద్ర వేయలేకపోయింది.
గత సంకలనాల్లో గోదారి ప్రాంతపు మాండలీకానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన వంశీ, 'మన్యంరాణి' కి వచ్చేసరికి గిరిజనుల చేత 'పేపరు భాష' మాట్లాడించేయడం విషాదం. అసలు లచ్చన్న మావ పాత్ర ఎప్పుడూ ఉపన్యాస ధోరణిలోనే మాట్లాడుతూ ఉంటుంది. అలాగే, మిగిలిన పాత్రల సంభాషణలు కూడా చాలాచోట్ల కృతకంగా అనిపిస్తాయి. గిరిజనులకి ప్రత్యేకమైన ఓ భాష ఉంది.. అలాగే తెలుగు మాట్లాడినా వాళ్ళకో ప్రత్యేకమైన మాండలీకం ఉంది. ఆచార వ్యవహారాలూ, వంటలు, పిండి వంటలని ఒడిసి పట్టుకుని వర్ణించిన వంశీ, ఈ యాసని ఎందుకు పట్టుకోలేదో మరి. అడవిలో కుగ్రామాల్లో ఉండే గిరిజనులు కూడా 'కోట్ల రూపాయల' గురించి మాట్లాడ్డం కొరుకుడు పడదు.
వంశీ రచనలంటే బాపూకి ఎంతో ప్రేమ. రచనకి వంశీ పడే కష్టానికి సమంగా కష్టపడి బొమ్మగీస్తారు బాపూ. ఈ నవలకి వచ్చేసరికి, వంశీ కన్నా కూడా బాపూనే ఎక్కువ కష్ట పడ్డారని అనిపించక మానదు. ఒక్కో పేజీ తిప్పుతుంటే బాపూ గీసిన బొమ్మలు ప్రాణం పోసుకుని కళ్ళ ముందు నిలబడ్డాయేమో అనిపించేస్తుంది. చక్కని ఆర్టు పేపరు మీద, సుందరంగా ముద్రించడం వల్ల మరింత అందం వచ్చేసింది ఆ బొమ్మలకి. కథ, కథనాల మాట ఎలా ఉన్నా, మనకి ఏ మాత్రం తెలియని అడవి గురించీ, అక్కడి చెట్టూ పుట్టా గురించీ, ఒక్కో కాలంలో ఒక్కోలా ప్రవర్తించే జంతువులూ, పక్షుల గురించీ తెలుసుకొడానికీ, వీటన్నింటినీ మించి అందమైన బాపూ బొమ్మలని మరింత బాగా అర్ధం చేసుకోడానికీ చదవాలి 'మన్యంరాణి' ని. (ఇలియాస్ ఇండియా ప్రచురణ, పేజీలు 196, వెల రూ. 250, అన్ని పుస్తకాల షాపులు).