మనకి చాలా బ్యాంకులున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, సహకార బ్యాంకులతో పాటు ఈమధ్యనే విస్తరిస్తున్న విదేశీ బ్యాంకుల వరకూ... ఓ మాదిరి పట్టణంలో కనీసం ప్రతి ప్రధాన వీధిలోనూ ఒకటి రెండు బ్యాంకు శాఖలు కనిపించే విధంగా బ్యాంకులు విస్తరించాయి. కానీ ఈ బ్యాంకుల్లో అప్పు పుట్టాలంటే విలువైన వస్తువో పత్రమో తనఖా పెట్టాలి. అప్పుడు మాత్రమే మనకి కావలసిన మొత్తాన్ని అప్పురూపంలో కళ్ళ చూడగలం. వడ్డీతో సహా బాకీ తీర్చేశాక మనం తనఖా పెట్టిన వస్తువునో పత్రాన్నో వెనక్కి తెచ్చేసుకోవచ్చు. ఇది అందరికీ తెలిసిన విషయమే.
సామాన్యుడి మొదలు టాటా బిర్లాల వరకూ (వీళ్ళ పక్కనే మన తెలుగు తేజం జగన్ని కూడా చేర్చాలన్న వాదన వినిపిస్తోంది) డబ్బు అవసరం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. తనఖా పెట్టగల శక్తి ఉన్నవాళ్ళ కోసం బ్యాంకు ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. మరి రెక్కల కష్టం తప్ప వేరే ఆధారం లేని వాళ్లకి? వడ్డీ వ్యాపారులు ఉంటారు (వీళ్ళనే ఒకప్పుడు ముద్దుగా కాబూలీవాలాలు అనేవాళ్ళు), వీళ్ళు అవసరానికి అప్పిస్తారు. వడ్డీ రేటు బాగా ఎక్కువగానే ఉంటుంది. చెప్పిన సమయానికి బాకీ కట్టకపోతే ఇంట్లో విలువైన వస్తువులతో పాటు, విలువ కట్టలేని పరువూ బజార్న పడుతుంది.
మేనేజ్మెంట్ పుస్తకాలు తిరగేస్తే మనకెన్నో విజయ గాధలు కనిపిస్తాయి. తోపుడు బండి మీద ఇడ్లీలు అమ్ముకున్న కుర్రాడు స్టార్ హోటల్ చైర్మన్ కావడం లాంటి నమ్మశక్యం కాని నిజాలెన్నో వాటిలో ఉంటాయి. రెక్కల కష్టాన్ని మాత్రమే నమ్ముకుని, చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్లకి తక్కువ వడ్డీకి అప్పిచ్చి, సులభ వాయిదాల మీద వాళ్ళ దగ్గరనుంచి బాకీ వసూలు చేసుకుంటే..? అప్పిచ్చిన సంస్థతో పాటు, అప్పు తీసుకున్న వాళ్ళూ క్రమంగా ఎదిగే అవకాశం ఉంది కదా? ఈ ఆలోచనే బంగ్లాదేశ్ కి చెందిన యూనస్ సుల్తాన్ కి వచ్చింది, ముప్ఫై నాలుగేళ్ల క్రితం. ఫలితం, గ్రామీణ బ్యాంకు స్థాపన.
ఈ గ్రామీణ బ్యాంకు విజయ గాధ ఆనోటా, ఆనోటా పాకి ప్రపంచానికంతటికీ తెలిసింది. యూనస్ కి నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. అంతే కాదు, ఈ గ్రామీణ బ్యాంకు పధకాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అమలు చేయాలని ఐక్యరాజ్య సమితి సూచించింది. ఫలితంగా సూక్ష్మ ఋణం (మైక్రో ఫైనాన్స్) మన దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రవేశించింది. సరిగ్గా అదే సమయంలో మన రాష్ట్రంలో ఏలిన వారికి మహిళా శక్తి మీద అపారమైన గురి కుదిరి ఊరూరా స్వయంశక్తి సంఘాలు (సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్) ప్రారంభించాలని సంకల్పించారు. రాజు తలచుకుంటే కానిదేముంది? స్వయంశక్తి సంఘాలకి ప్రభుత్వం లోన్లిచ్చింది. ఈ సంఘాల విజయాన్ని (కొన్ని) పత్రికలు వేనోళ్ళ పొగిడాయి. సూక్ష్మఋణ సంస్థలు చాపకింద నీరులా విస్తరించాయి.
అన్నీ సక్రమంగా జరిగిపోతే ఇంక రాజకీయాలు, రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ నాయకుల స్వప్రయోజనాలు ఇవన్నీ ఎలా? అందుకే ముసలం పుట్టింది. ముందుగా స్వయం శక్తి సంఘాలకి ఋణ సరఫరా ఆగిపోయింది. నిజానికి ఇలా ఆగిపోవడంలో ప్రత్యక్షంగా సంఘ సభ్యులదీ, పరోక్షంగా రాజకీయ నాయకులదీ పాత్ర ఉంది. ఉత్పాదకత ఉన్నా లేకున్నా సంఘం నుంచి నెలనెలా ఋణం తీసుకుని, సులభ వాయిదాలలో చెల్లించడానికి అలవాటు పడ్డ సంఘ సభ్యులకి బ్యాంకుల నుంచి లింకేజి లోన్లు అందకపోవడం ఊహించని పరిణామం. లోన్లు ఆగిపోయినా, అవసరాలు ఆగవు కదా.
సరిగ్గా ఇప్పుడే, ఇప్పటికే చాపకింద నీరులా విస్తరించిన సూక్ష్మ ఋణ సంస్థలు తమ ఏజెంట్లని ఊళ్ళ మీదకి వదిలాయి. బ్యాంకులకి బదులుగా ఈ సంస్థలు స్వయం శక్తి సంఘాలకి రుణాలిస్తాయి, రెండు షరతుల మీద. మొదటగా సంఘం పేరు మార్చి కొత్త గ్రూపుగా ఏర్పడాలి.. పేరులో ఏముంది?? రెండో నిబంధన వడ్డీ.. బ్యాంకుల కన్నా'కొంచం' ఎక్కువ వడ్డీ వసూలు చేస్తాయి. అవసరానికి చేతిలో డబ్బు ఆడడం ముఖ్యం కానీ, వడ్డీ కొంచం ఎక్కువైతే ఏమైంది??? ...ఈ ఆలోచనా ధోరణి సూక్ష్మ ఋణ సంస్థల పంట పండించింది.
మరోవైపు, స్వయంశక్తి సంఘాలకి వసూలవుతుందో లేదో తెలియని రుణాన్ని తక్కువ వడ్డీకి అందించడం కన్నా, అదే మొత్తాన్ని సూక్ష్మ ఋణ సంస్థలకి అప్పిస్తే కచ్చితంగా బాకీ వసూలవుతుందన్న హామీ ఉండడంతో బ్యాంకులు సైతం ఈ సంస్థలకి రుణాలివ్వడానికే మొగ్గు చూపుతున్నాయి. పైగా, నిబంధనల ప్రకారం ఈ సంస్థలకి ఋణం ఇవ్వడమూ 'సేవ' కిందకే వస్తోంది. సేవా సంస్థలన్న ముసుగు ఉండడం, నిన్న మొన్నటివరకూ వడ్డీ మీద ఎటువంటి నియంత్రణా లేకపోవడంతో ఈ సూక్ష్మ ఋణ సంస్థలది అక్షరాలా ఆడింది ఆట అయ్యింది. కాబూలీవాలాలే నయమనిపించేలా తయారయ్యింది పరిస్థితి.
కేవలం ఈ సంస్థలని మాత్రమే తప్పు పట్టడం సరికాదు. శక్తికి మించి అప్పులు తీసుకోవడం, ఆపై ప్రభుత్వం ఈ అప్పులని మాఫీ చేసుందన్న ధీమాతో బాకీలు చెల్లించకపోవడం అలవాటు చేసుకున్న ప్రజలూ ఉన్నారు మరి. ఋణ సంస్థలకైనా, బ్యాంకులకైనా కావాల్సింది వ్యాపారమే కాబట్టి వారి వారి వ్యాపార విస్తరణ వాళ్ళు చూసుకుంటున్నారు. సమస్య పరిష్కారం కన్నా, మీడియా కవరేజితో పూట గడవడమే ప్రతిపక్షాలకి ముఖ్యం కనుక వాళ్ళనీ ఏమీ అనలేం. మరి ప్రభుత్వం? "ఆయనే ఉంటే..." అన్న పాత సామెత గుర్తొస్తే తప్పు నాది కాదు.