గురువారం, ఫిబ్రవరి 18, 2016

కృష్ణగాడి వీర ప్రేమగాథ

తొలి సినిమా 'అందాల రాక్షసి' తో "అచ్చం మణిరత్నం లాగా తీశాడు" అనిపించుకున్న దర్శకుడు హను రాఘవపూడి, రెండో సినిమా "కృష్ణగాడి వీర ప్రేమగాథ" మీద మాత్రం తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేశాడు. రెండున్నర గంటలకి కొంచం తక్కువ నిడివి ఉన్న సినిమా చూడడం పూర్తి చేయగానే మొదట గుర్తొచ్చింది దర్శకుడే. తెలుగు సినిమా దర్శకుడి ఇంటి పేరైన కథ-స్క్రీన్ ప్లే బాధ్యతల్ని కూడా అతడే నిర్వహించాడు మరి. 

ఇన్నాళ్ళూ, అవే కథల్ని అదే కథనంతో చూసి విసుగెత్తిన ప్రేక్షకుల కోసం కథనంలో కొత్తదనం చూపించే ప్రయత్నం చేస్తున్నారు కొందరు నవతరం దర్శకులు. మొన్న 'ఎక్స్ ప్రెస్ రాజా' ఇప్పుడు ఈ తాజా సినిమా. ఎంచుకున్నది పరమ రొటీన్ పాత కథనే అయినా, కథనాన్ని ఆసక్తి కరంగా మలచి, బిగి సడలని విధంగా స్క్రీన్ ప్లే రాసుకుని, ఎక్కడా ఒక్క అనవసర సన్నివేశం కూడా లేకుండా చిత్రించి రొటీన్ కి భిన్నంగా ఉండే సినిమాల కోసం అలమటిస్తున్న ప్రేక్షకులకి అందిస్తున్నారు. ఈ తరహా సినిమాలు బాగా ఆడితే, కొత్త కథల్ని ప్రయత్నిచే ధైర్యం వస్తుంది నవ దర్శకులకి.

అనగనగా అనంతపురం. అక్కడ తెలుగు ప్రేక్షకులకి బాగా అలవాటైన కత్తులు, బాంబులు, తుపాకులు,  తెల్ల పంచెల రెండు ఫ్యాక్షన్ గ్రూపులు. ఒకానొక ఫ్యాక్షన్ గ్రూపు నాయకుడి చెల్లెలు మహాలక్ష్మి. పదేపదే బీయే ఫెయిలవుతూ, బీయే పాసయ్యే వరకూ పెళ్లి చేసుకోనని ఖరాఖండీగా చెబుతూ ఉంటుంది. సగటు ప్రేక్షకుడు ఊహించగలిగే విధంగా ఆమె ప్రేమలో ఉంది. ప్రేమించింది కూడా తన అన్నకి అనుయాయిగా ఉండే పిరికి కృష్ణ గాడిని. కృష్ణ  గాడు వృత్తి రీత్యా బోర్ వెల్ ఆపరేటర్. ప్రవృత్తి రీత్యా నందమూరి బాలకృష్ణ వీరాభిమాని.


ఏళ్ళ తరబడి మహాలక్ష్మిని రహస్యంగా ప్రేమిస్తున్నా ఆవిషయాన్ని ఆమె ఇంట్లో చెప్పే ధైర్యం లేని కృష్ణ గాడు తెగించేందుకు నిర్ణయించుకున్న సమయంలోనే, మహాలక్ష్మి కుటుంబానికి వచ్చిన అనుకోని ఆపద రూపంలో తన వీరత్వాన్నీ చూపించుకునే అవకాశం దొరుకుతుంది. హీరోకాబట్టి సహజంగానే దాన్ని సద్వినియోగం చేసేసుకుని కథకి శుభం పలికేస్తాడు. సినిమా మొదలైన మొదటి పావుగంటలో కృష్ణ గాడి ప్రేమని ఎస్టాబ్లిష్ చేసేసి, తర్వాతి అరగంటలో మహాలక్ష్మి కుటుంబానికి రాబోయే ఆపద తాలూకు బ్యాక్ గ్రౌండ్ వర్కుని మొదలు పెట్టేసిన దర్శకుడు, కథ మరీ ప్లెయిన్ అయిపోకుండా ఉండడం కోసం చైల్డ్ సెంటిమెంటునీ, ఓ అంతర్జాతీయ తీవ్రవాదినీ కథలో భాగం చేశాడు.

సినిమా ప్రధమార్ధం 'మర్యాద రామన్న' సినిమాని గుర్తు చేసింది కొన్ని చోట్ల. ఫ్యాక్షన్ వాతావరణం, పిరికి హీరో అనే సామ్యాలు ఉండడం వల్ల కావొచ్చు బహుశా. రెండో సగం పూర్తిగా రోడ్డెక్కేసింది. హీరో, విలన్, పోలిస్ గ్రూపుల మధ్య దాగుడుమూతలాటతో కూడిన రోడ్డు ప్రయాణం. మధ్య మధ్యలో ఓ పెట్టీ కేసులో ఇరుక్కుని పోలీసు లాకప్ నుంచి బయట పడే మార్గం కోసం వెతుక్కునే తీవ్రవాదితో పండించిన హాస్య సన్నివేశాలు. వెరసి ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోయింది. నాయికా నాయకులది 'రహస్య ప్రేమ' అవ్వడం వల్ల, లవ్ ట్రాక్ ని ఫోన్ సంభాషణలతో సింపుల్ గా తేల్చేశారు. పాటలు మరీ తక్కువ ఉన్నాయో, థియేటర్ ఆపరేటర్ ఎడిట్ చేసేశాడో తెలియడం లేదు.

హనుకి గెడ్డం అంటే బాగా ఇష్టం అనుకుంటా. మొదటి సినిమాలో ఇద్దరు హీరోలకీ గెడ్డం పెట్టేసి, సినిమాని ముక్కలు ముక్కలుగా చూసే వాళ్లకి ఎవరెవరో తెలీని కన్ఫ్యూజన్ సృష్టించాడా.. ఈ సినిమాలో కృష్ణగాడి వేషం కట్టిన నానికీ గెడ్డం పెట్టేశాడు. గెడ్డంతో పాటు లెన్సులు కూడా. మహాలక్ష్మిగా కనిపించిన మెహరీన్, కాజల్ అగర్వాల్ ని అనుకరించే ప్రయత్నాలు బాగానే చేసింది. రాజేష్ పాత్రకి ముగింపు ఇవ్వడం మరచిపోయారు, సెకండాఫ్ హడావిడిలో. హీరోగారి బాలకృష్ణ అభిమానం వల్ల కథకి ప్రత్యేకంగా ఒరిగింది ఏమిటో మాత్రం అర్ధం కాలేదు.

కథా నాయకుడితో పాటు తీవ్రవాదిగా చేసిన మురళీ శర్మ, ఏసీపీ పాత్ర వేసిన సంపత్ రాజ్ నటించే అవకాశం బాగా దొరికింది. బ్రహ్మాజీకి మరో మంచి పాత్ర, సీనియర్ నటి అన్నపూర్ణ కి నటించేందుకు అవకాశం ఉన్న పాత్ర దొరికాయి. సాంకేతిక విభాగాల్లో మొదట చెప్పుకోవాల్సింది యువరాజ్ కెమెరాని, విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్నీ. అనంతపురాన్ని అందంగా చూపించింది కెమెరా. రెండు పాటలు, నేపధ్య సంగీతం బాగున్నాయి. టైట్ స్క్రీన్ ప్లే కి తగ్గ ఎడిటింగ్. సినిమా మొత్తాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటే, దర్శకుడు షూటింగ్  కన్నా ఎక్కువరోజులు స్క్రిప్టు మీద పనిచేశాడనిపించింది. రొటీన్ సినిమాలు ఆదరించే వాళ్ళతో పాటు, వైవిధ్యభరిత సినిమాల్ని ఇష్టపడే వాళ్ళకీ నచ్చే సినిమా ఇది.

శుక్రవారం, ఫిబ్రవరి 12, 2016

అతడు అరుణ్ సాగర్ ...

మగజాతికి 'మేల్ కొలుపు' పాడిన అరుణ్ సాగర్ దీర్ఘనిద్రలోకి వెళ్ళిపోయాడు. ఉదయాన్నే నిద్రని పూర్తిగా వదిలించుకోక మునుపే పలకరించిన వార్త ఇది. నమ్మడానికి కొంత సమయం పట్టింది. నమ్మక తప్పదని నిర్ధారించుకున్నాక ఏదో తెలియని ఒక శూన్యం. త్వరగా..చాలా త్వరగా వెళ్ళిపోయాడు సాగర్. వెళ్లేముందు తెలుగు కవిత్వం మీద తనదైన సంతకం చేసి మరీ వెళ్ళాడు. జర్నలిజం మీదా అతనిదైన ముద్ర ఉందని చెబుతున్నారు మిత్రులు. తను నాకు బంధువూ, మిత్రుడూ కాదు. అతను కవి, నేనతని అనేకానేక పాఠకుల్లో ఒకణ్ణి. ఇంతకీ ఎవరీ అరుణ్ సాగర్?

'అతి సర్వత్ర వర్జయేత్' అన్నారు పెద్దవాళ్ళు. తెలుగునాట గత శతాబ్దపు ఎనభైలలో ఎగసిన స్త్రీవాదం, తొంభైల నాటికి అతి ధోరణుల్లో పడిపోయింది. స్త్రీవాదమంటే స్త్రీపురుష సమానత్వమన్న భావన పోయి మగవాడిని ఎంత తీవ్రంగా దుర్భాషలాడితే అంత గొప్ప ఫెమినిజమన్న భావన తెలుగు సాహిత్యంలో బలపడిపోయింది. కవిత్వం, కథలు.. ఏవైనా కావొచ్చు. స్త్రీవాదం అంటే పురుష దూషణ. ఓ తండ్రిగా, భర్తగా, కొడుకుగా, స్నేహితుడిగా ప్రతిపాత్రలోనూ మగవాడు ఎంత దుర్మార్గంగా ఉంటాడో వైనవైనాలుగా వర్ణిస్తూ కథలూ, కవిత్వాలూ లెక్కకు మిక్కిలిగా అచ్చయిన కాలం.

అవి చదివిన మగవాళ్ళలో కనీసం కొందరైనా "నేనింత వెధవనా? కాదు.. కానేకాదు. మరి నేనెందుకీ నిందలు మొయ్యాలి?" అన్న ప్రశ్నలు వేసుకుంటున్న తరుణంలో కలం పట్టాడు అరుణ్ సాగర్. అతివాద ధోరణుల స్త్రీవాదానికి కౌంటర్ గా పురుష వాదాన్ని వినిపించాడు. స్త్రీవాదం మీదే కాక, కవిత్వం మీదే ఒకలాంటి విరక్తి బయల్దేరిన ఆ కాలంలో 'ఆంధ్రజ్యోతి' లో వచ్చే అరుణ్ సాగర్ కవితలు పెద్ద రిలీఫ్ నా బోటి వాళ్లకి. "ఇన్నాళ్ళకి మనగొంతు వినిపించే వాడు ఒకడొచ్చాడు" అని సంబర పడ్డాం మిత్రులం. ఎన్నో సాయంత్రాలు ఇరానీ చాయ్, అరుణ్ కవిత్వాలతో కలగలిసి రాత్రిలోకి కరిగిపోయాయి.


మాలో ఎక్కువమందికి బాగా నచ్చిందీ, దాదాపుగా కంఠతా వచ్చేసిందీ 'మేల్ కొలుపు.' తర్వాతి కాలంలో అరుణ్ సాగర్ ఇంటిపేరుగా మారిపోయిన చిరు సంకలనం. 'గుండె జబ్బులు నాన్నలకే ఎందుకు వస్తాయి?' అన్న అరుణ్ సాగర్ సూటి ప్రశ్న ఎన్ని మగ హృదయాలని తాకిందో ప్రత్యక్షంగా చూశాను. 'ఐసీయూ లో నాన్న' లని గురించి తను రాసిన కవిత గుర్తొచ్చినప్పుడల్లా ఒళ్ళు జలదరిస్తుంది. 'షివల్రీ' ని ప్రదర్శించి, తాము చేయాల్సిన పనిని కూడా మగ సహోద్యోగుల మీదకి నెట్టేసే మహిళా ఉద్యోగులని గురించి సాగర్ రాసిన కవిత మీద పెద్ద వివాదమే చెలరేగిందప్పట్లో. ఉన్నమాట చెప్పుకోవాలంటే, అలాంటి ఉద్యోగినులూ నాకు తెలుసు.

అరుణ్ సాగర్ చేసింది స్త్రీవాదం మీద దాడి కాదు. స్త్రీవాదం పేరు మీద మగవాళ్ళ మీద జరుగుతున్న దాడికి ఎదురుదాడి. ఈ క్రమంలో కొన్ని సార్లు అతని గొంతులో తీవ్రత ధ్వనించిన మాట నిజం. కానీ, అది అవసరం కూడా. మగవాడు మోస్తున్న బరువులని గురించీ, కన్నీళ్లు పెట్టుకోడానికి వీల్లేకుండా సమాజం అతడికి ఆపాదించిన 'ఇమేజి' గురించీ అరుణ్ రాసిన కవితలు కనీసం కొందరినైనా ఆలోచింపజేశాయి. అరుణ్ సాగర్ ఆరంభించిన పురుష వాదాన్ని ఆ తర్వాత చాలా మంది అందిపుచ్చుకున్నారు. కొందరతన్ని అనుకరించారు, మరికొందరు అనుసరించారు. పురుష వాద కవిత్వానికి దారిని నిర్మించిన వాడు మాత్రం అతడే.

'మేల్ కొలుపు' రోజుల్లో అరుణ్ సాగర్ ని కలవాలని చాలా కోరికగా ఉండేది. అప్పట్లోనే తను 'ఆంధ్రజ్యోతి' నుంచి ఓ టీవీ చానల్లో చేరాడు. నా మిత్రుడికి మంచి ఫ్రెండ్ కూడా. కనీసం నాలుగైదు సందర్భాల్లో నాలుగడుగుల దూరం నుంచి తనని చూశాను. మాటలు విన్నాను తప్ప పలకరించలేదు. 'హీ ఈజేన్ ఎక్సెంట్రిక్' మొదలు, 'చాలా బా మాట్లాడతాడబ్బా' వరకూ చాలా వ్యాఖ్యలే విన్నాను. 'ఈసారి తప్పక పలకరించి మాట్లాడాలి' అని తను గుర్తొచ్చినప్పుడల్లా అనుకునే మాట. అలా అనుకోడానికి ఇక అవకాశం లేదు. అరుణ్ సాగర్ ఆత్మకి శాంతి కలుగు గాక..