సాహసాలు చేయడమంటే నాకు సరదా.. ఇవి చేయబోతున్నట్టు ఇంట్లో చెప్పకపోవడం నా అలవాటు. ఇన్సూరెన్సు పాలసీలు, రావాల్సిన, తీర్చాల్సిన బాకీల వివరాలన్నీ ఓ పుస్తకం లో వివరంగా రాసి ఉంచి వాటిని క్రమం తప్పకుండా అప్డేట్ చేసే అలవాటు ఉంది కాబట్టి నా సాహసాల వల్ల వెనుక వాళ్లకి అన్యాయం జరుగుతుందనే భయం లేదు. అలా "సిరికిం జెప్పకుండా" నేను చేసిన తాజా సాహసం సుమనోహరుడి ఉషా పరిణయ వీక్షణం.
రిలీజ్ షో చూసే అవకాశం ఇవ్వని ఉద్యోగాన్ని తిట్టుకుంటూ, సెకండ్ షో కి థియేటర్ దగ్గరికి చేరుకున్నాను. మరీ తెర ముందుగా కూర్చుని చూడడం కష్టమని, "ఏ రో" అని అడిగాను కౌంటర్ అబ్బాయిని. "ఫోర్త్ సార్" అన్నాడు వినయంగా. "స్క్రీన్ ముందునుంచా?" నా సందేహం. నాకేసి విచిత్రం గా ఓ చూపు చూసి "బ్యాక్ నుంచి సార్" అని టిక్కెట్ చేతిలో పెట్టాడు.
పక్క థియేటర్ లో వేరే సినిమాకి టిక్కెట్లు దొరకని ఓ ఫ్యామిలీ ఇంతలో అక్కడికి వచ్చింది. "ఉషా పరిణయం చూద్దామా అమ్మా?'' తన కూతురిని పర్మిషన్ అడిగాడు. "ఈలో ఎవలూ?" అడిగిందా నాలుగేళ్ల పిల్ల ముద్దుగా.. ఆయన అక్కడే ఉన్న నీలిమేఘ శ్యాముడి పోస్టర్ చూపించాడు. "ఈలు బూచాలు..వద్దు" చెప్పేసిందా అమ్మాయి నిష్కర్షగా.. శకునం బాగోలేదనుకుంటూ థియేటర్ లోకి అడుగుపెట్టాను.
ఇంకా సినిమా మొదలు కాలేదు. జనం ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఎవరూ ఫోన్లు చేసి డిస్ట్రబ్ చేయకుండా ముందు జాగ్రత్తగా స్నేహితులందరికీ సంక్షిప్త సందేశాలు పంపాను, సినిమా చూడబోతున్నట్టు. వెంటనే జవాబులు వచ్చేశాయి. నా ఆరోగ్యం కోసం ప్రార్ధనలు చేయబోతున్నట్టు ఒకరు, 'నీధైర్యాన్ని దర్శించి దైవాలే తల దించగా..' అని మరొకరూ.. ఇలా... వీటికి నేను భయపడతానా?
మొత్తం ఓ పాతిక మంది ప్రేక్షకులు ఉన్నారు హాల్లో. సినిమా మొదలయ్యింది. ఎక్కడా ఉషా కిరణ్ పేరు గాని, రామోజీ పేరు గాని లేకుండా టైటిల్స్ పూర్తయ్యాయి. బాణాసురడనే రాక్షసుడు శివుడు తన రాజ్యానికి కావలి ఉండే విధంగా వరం పొందడం తో మొదటి సీన్ అయ్యింది. ఓ డెబ్బై ఏళ్ళు పైబడ్డ తాతగారు ఆయన టీనేజ్ మనవడు వచ్చి నా పక్క సీట్లలో సెటిల్ అయ్యారు. గ్రాంధికం, వ్యావహారికం కలగలిపిన భాషలో శివుడు, రాక్షసుడు మాట్లాడుకోడాన్ని ఎంజాయ్ చేస్తున్న నేను ఈ కొత్త వాళ్ళ కోసం మౌనం పాటించాల్సొచ్చింది.
రెండో సీన్ లో తెరమీద బారెడు పొద్దెక్కింది. ద్వారకలో బంగారు శేషపాన్పు మీద పవ్వళించిన శ్రీకృష్ణుడు.. మరెవ్వరో కాదు మన సుమనోహరుడే... ఆనందంగా నాట్యం చేస్తూ ఆయనకి మేలు కొలుపు పాడుతున్న జానపదులు. ఆ జానపదులకి నాయకుడు మన ప్రభాకరుడు. (ప్రత్యేక అతిధి పాత్ర, ఈ పాటకే పరిమితం). పాట సాంతం అయ్యాక స్వామి కళ్ళు తెరిచి చిరు నవ్వులు చిందించారు.. అది మొదలు, మూడు గంటల పాటు అంతా తానే అయ్యారు.
కథ అత్యంత మందగమనంతో సాగుతోంది. బాణాసురిడి కూతురు కలలోకి ఓ అందగాడు (?) వచ్చి ఆమెని కలవరపెడతాడు. అతను మరెవరో కాదు కృష్ణుడి సోదరుడు బలరాముడి (ఇంకెవరూ..మన ఈశ్వర్రావే) మనవడు అనిరుద్ధుడు. మాయలు మంత్రాలు తెలిసిన తన స్నేహితురాలు చిత్రరేఖ సహాయంతో అతన్ని కిడ్నాప్ చేయించి తన అంతః పురానికి రప్పించుకుంటుంది ఉష. స్వామి ఇందుకు రహస్యంగా సహాయం చేస్తారు. మరోపక్క అనిరుద్దుడికి భార్య కాగల అమ్మాయిల చిత్రపటాలు తెప్పిస్తుంది బలరాముడి భార్య రేవతి (నాగమణి).
స్వామి లీల వల్ల వాటిలో ఉష పటం వచ్చి చేరడం. రేవతికి ఆ పటమే ఎంతగానో నచ్చడం జరుగుతాయి. నా పక్కన కూర్చున్న తాతగారి మనవడు అసహనంగా కదులుతున్నాడు. (నేనెంతగా సినిమాలో లీనమైపోయినా..అతన్ని గమనిస్తూనే ఉన్నా) ఇంతలో అతనికి ఫోన్ వచ్చింది. "డొక్కు సినిమారా.. ఇంటర్వెల్ లో వచ్చేస్తా" అని గుసగుసగా చెప్పడం వినిపించింది. తెరమీద అనిరుద్ధుడి కిడ్నాప్ వార్త అతని తల్లిదండ్రులకి తెలిసింది. వాళ్ళు ఆందోళన పడుతుంటే కేళీ విలాసంగా చిరునవ్వులు చిందించారు స్వామి. నేను చూసుకుంటా అని వాళ్లకి హామీ ఇచ్చి మాకు 'విశ్రాంతి' ని ప్రసాదించారు.
లైట్లు వెలగ్గానే తాతగారి మనవడు "అంకుల్..చిన్న రిక్వెస్ట్" అన్నాడు. "నేను బయటికి వెళ్తున్నాను. కొంచం మా తాతగారిని చూసుకోండి.. సినిమా అవ్వగానే వచ్చి పికప్ చేసుకుంటా.." అన్నాడు. నేను కొంచం అమాయకంగా ముఖం పెట్టి "సినిమా బాగుంది కదా" అన్నాను, వెళ్ళిపోవడం ఎందుకూ అన్నట్టు. అతను కొంచం ఇబ్బందిగా నవ్వి, "అర్జెంటు పని అంకుల్, ఫ్రెండ్ ఫోన్ చేశాడు..ప్లీజ్" అన్నాడు. ఇంతకీ ఆ తాతగారు ముందువరుసలో తన వయసు వాళ్ళ పక్కన కూర్చున్నారు.. "అంత వెనక్కి రాలేను" అంటూ.. విశ్రాంతి తర్వాత పది మందిమి మిగిలాం.
రెండో సగం లో ఘటోత్కచుడు, చిత్ర విచిత్రమైన రాక్షసులు బోల్డంత మంది వచ్చి హాస్యం పుట్టించే ప్రయత్నం చేశారు.. నాకైతే సుమన్ గారి హాస్యం ముందు అవన్నీ బలాదూర్ అనిపించాయి. ఆయన నవ్వు, నడక, మాట, పాట.. ఒకటేమిటి.. ప్రతి కదలికా హాస్య రస భరితమే. అనిరుద్ధుడు తన కూతురి దగ్గర ఉన్నాడని తెలిసిన బాణాసురుడు అతన్ని జైల్లో బంధిస్తాడు. ఘటోత్కచుడు తన మాయలతో అనిరుద్ధుడి జాడ తెలుసుకుంటాడు.
ఈ మాత్రం మాయలు కృష్ణుల వారే చేయగలరు కానీ, ఎందుకో ఆయన అన్నా వదినా ఆయన్ని నమ్మరు. ఘటోత్కచుడు, కృష్ణుల వారు, వారి బృందం బాణాసురుడి రాజ్యానికి వెళ్లి అనిరుద్ధుడిని విడిపించడం, యుద్ధం అనివార్యం కావడంతో కృష్ణుల వారు బాణాసురిడితో యుద్ధం చేసి పెళ్ళికి ఒప్పించడం కథ ముగింపు. ఎప్పటిలాగే సుమన్ గారు తెర ముందు, వెనుక అన్నీ తానే అయ్యారు. మొత్తం నటీ నటులందరి లోనూ తనే అందంగా కనిపించే విధంగా శ్రద్ధ తీసుకున్నారు.
సినిమా అన్నారు కాని చూడ్డానికి టెలిఫిలిం లాగే అనిపించింది..పైగా 35 mm. నాకైతే "శ్రీకృష్ణ బలరామ యుద్ధం" పదే పదే గుర్తొచ్చింది. ఐతే ఇది థియేటర్ కాబట్టి విశ్రాంతి మినహా ఎక్కడా కమర్షియల్ బ్రేక్స్ లేవు. అందరూ టీవీ నటులే కావడం తో, సుమన్ తో కాంబినేషన్ సీన్లలో వాళ్ళంతా కంపెనీ ఎండీ ముందు నాలుగో తరగతి ఉద్యోగుల్లా భయ భక్తులతో నిలబడ్డారు. కథలో భాగంగా జానపదుడి గాను, బృహన్నల (?) గానూ మారు వేషాలు వేశారు స్వామి.
నల్లనయ్యగా సుమన్ నయనానందకర విశ్వ రూపాన్ని కళ్ళ నిండుగా నింపుకుంటూ కింద రాసిన "సర్వేజనా సుఖినోభవన్తు" వాక్యాన్ని చదువుకుంటూ థియేటర్ బయటికి వస్తున్నానో లేదో మిత్రుల నుంచి నా క్షేమాన్ని తెలియజెప్పమంటూ సందేశాలు. "సినిమా ఎలా ఉందని మర్యాదకైనా అడగరా?" రిప్లై లో కోప్పడ్డాను నేను. "మాకు తెలియక పోతే కదా..." ఓవర్ కాన్ఫిడెన్స్ తో వాళ్ళ జవాబు.