ఆదివారం, ఆగస్టు 30, 2009

పతంజలిభాష్యం

మన చుట్టూ ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించడానికి అధికారులూ, నాయకులూ ఉన్నారు. అయినా సమస్యలు సమస్యల్లాగే ఉన్నాయి. ఎందుకంటే సదరు నాయకులూ, అధికారులూ చాలామంది వాళ్ళ పని వాళ్ళు చేయడం లేదు. ఇలాంటప్పుడే మనకి ఆగ్రహం కలుగుతుంది. ధర్మాగ్రహం అంటారు దాన్ని. ఇది అందరిలోనూ ఉన్నా ఏ కొద్దిమందో మాత్రమే దానిని ప్రకటించ గలుగుతారు.

ఎందుకంటే ధర్మాగ్రహాన్ని ప్రకటించడానికి కావలసినవి నాలుగు.. సమస్యల పట్ల స్పందించే హృదయం, స్పందించగల తెగువ, స్పందించడానికి తగినంత భాష, ఆ స్పందనని ప్రచురించగల పత్రిక. ఈ నాలుగూ ఉన్నవాళ్ళు అతికొద్దిమంది ఉంటారు. ఆ అతి కొద్దిమందిలో ఒకరు కాకర్లపూడి నారసింహ యోగ పతంజలి. తెలుగు సాహితీ రంగంలో కే.యెన్.వై. పతంజలిగా ప్రసిద్ధుడైన ఈ అలమండ రాసబిడ్డ వ్యవస్థపై తన ధర్మాగ్రహాన్ని ప్రకటించి భాష్యకారుడైనాడు. ఆయన ఆగ్రహానికి అక్షర రూపమే 160 పేజీల 'పతంజలిభాష్యం.'

'నేను ఫలానా రచయిత రచనలు చదివాను' అని చెప్పుకోడాన్ని కొందరి విషయంలో మనం గర్వంగా ఫీలవుతాం. నాకు సంబంధించి ఆ కొందరు రచయితల జాబితాలో పతంజలిది తిరుగులేని స్థానం. తను సృష్టించిన ఒక్క 'వీరబొబ్బిలి' పాత్ర చాలు, పతంజలి రచనలు ఎందుకు చదవాలో చెప్పడానికి. "నేను ఫ్యూడల్ ని" అని రొమ్ము విరుచుకుని చెప్పిన పతంజలి ఎప్పుడూ పేదల పక్షమే. నిజానికి ఆయనది వెన్నలాంటి మనసు. లేకపోతే దగాపడ్డ వాళ్ళ గుండె ఘోష వినగలిగేవాడే కాదు.. వాళ్ళ పక్షాన గొంతు విప్పేవాడే కాదు.

"బాధ్యతారహిత మానవ సమాజం మీద అక్షర శర సంధానం" ఇది పతంజలి భాష్యానికి ప్రచురణ కర్తలు ఇచ్చిన ఉప శీర్షిక. నిజమే.. మన సమాజం బాధ్యతారహితం కాకపోయినట్టైతే రాష్ట్రంలో ఫ్లోరైడ్ సమస్య ఉండేది కాదు.. బాల కార్మికులు ఉండే వాళ్ళు కాదు. రైతుల బలవన్మరణాలు ఉండేవి కాదు. లాకప్ మరణాలూ, పోలీసు ఎన్కౌంటర్లూ కూడా ఉండి ఉండేవి కాదు. ప్రజల ముఖాల్లో బతుకు భయం, చావుకళ మచ్చుకైనా కనిపించేవి కాదు. ప్రజలంతా నవ్వుతూ, తుళ్ళుతూ నిశ్చింతగా ఉండేవాళ్ళు.

మనది బాధ్యతా రహిత సమాజం కాబట్టే ఇక్కడ ఎన్నికలు కేవలం ఐదేళ్లకోసారి జరిగే తంతు. ఎన్నికలైపోయిన తరువాత దేశం 'దగాపడిన ఆడకూతురి' లాగ ఉంటుంది. పాలకులకి 'హింసా మార్గమే చక్కని రాజమార్గం' అవుతోంది. 'కత్తిని బతిమాల కూడదు.. కత్తికి విజ్ఞప్తి చేయకూడదు.. కత్తికి ధర్మాలు బోధించకూడదు..' అని చెబుతూనే 'కత్తి ప్రాణ రక్షణ కోసం కాక రక్తదాహంతో వీధిలోకి వచ్చేస్తే దాన్ని జాగ్రత్తగా మళ్ళీ ఆయుధాగారంలోకి నెట్టేయాలి.. ఆ బాధ్యత మొత్తం ప్రజలందరిది..' అంటారు పతంజలి.

నిజానికి 'పతంజలిభాష్యం' పాతికేళ్ళ చరిత్రపై రన్నింగ్ కామెంటరీ. రాష్ట్రంలో సాంఘిక,ఆర్ధిక, రాజకీయ సమస్యలు, దేశ రాజకీయాలు, విదేశీ విధానాలు, అనేక సందర్భాల్లో అమెరికా కర్ర పెత్తనం లాంటి జరిగిపోయిన విషయాలన్నీ మనకి గుర్తు చేస్తుంది. కుర్చీల్లో కూర్చున్న మనుషులు మాత్రమే మారారు, వాళ్ళు అనుసరించే విధానాలు మారలేదు అని మనం మరింత స్పష్టంగా అర్ధం చేసుకోడానికి దోహద పడుతుంది. నీళ్ళు ఏ పాత్రలో పోస్తే ఆ రూపాన్ని సంతరించుకున్నట్టుగా, ఎలాంటి వ్యక్తైనా కుర్చీలో కూర్చునేసరికి అందుకు తగ్గట్టు మారిపోతాడు అని అర్ధమవుతుంది.

ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు ప్రజలపై వేసిన రకరకాల పన్నులు, ఉద్యోగుల పట్ల ఆయన వైఖరి, చంద్రబాబు చాణక్యం, 'అక్షరాల' సాయంతో అధికారంలోకి వచ్చిన వైనం, అదే అక్షరాలని వాడుకుని అధికారులతో ఆడుకున్న చమత్కారం మాత్రమే కాదు, కేంద్రంలో పీవీ 'చాణక్యం', వాజపేయి 'రాజనీతి,' సోషలిస్టు జార్జి ఫెర్నాండెజ్ జార్జి, ఫెర్నాండెజ్ అనే ఇద్దరు నాయకులుగా విడిపోయారన్న నిష్టుర సత్యం, కాశ్మీర్ సమస్యపై అమెరికా అనవసర జోక్యం, మన నాయకుల పొంతనలేని సమాధానాలు.... ఎన్నో, ఎన్నెన్నో అంశాలు.

గత పాతికేళ్ళ కాలం లో వివిధ పత్రికల్లో పతంజలి రాసిన 56 వ్యాసాల సమాహారం ఈ పుస్తకం. పతంజలిని గురించి ఆర్.కే. విశ్వేశ్వర రావు (ప్రచురణ కర్త), రావి శాస్త్రి, 'మో' రాసిన వ్యాసాల తో పాటు, పతంజలి స్వయంగా రాసిన 'నేపధ్యం' ఇంకా రమణజీవి చేసిన పతంజలి 'చివరి ఇంటర్వ్యూ' లనూ చదవొచ్చు. ఈ తెలుగు పుస్తకం సైజుని దృష్టిలో పెట్టుకున్నప్పుడు వెల ఎక్కువే అనిపిస్తుంది. మన చుట్టూ ఏం జరిగిందో, జరుగుతోందో తెలుసుకోడానికి తప్పక చదవాల్సిన పుస్తకం. (పర్స్పెక్టివ్స్ ప్రచురణ, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)

శుక్రవారం, ఆగస్టు 28, 2009

కప్పు కాఫీ

ఆఫీసు పని మధ్యలో అటెండర్ ని పిలిచాను. పక్క సెక్షన్ నుంచి కావాల్సిన కాగితాలు తీసుకురమ్మని చెప్పాను. అతను వెళ్తుంటే పరధ్యానంగా "కుదిరితే ఓ కప్పు కాఫీ.." అన్నాను. వెళ్తున్న వాడల్లా ఆగి నవ్వాపుకునే ప్రయత్నం చేశాడు. ఎందుకా? అని ఆలోచిస్తే గుర్తొచ్చింది 'బొమ్మరిల్లు' లో పాపులర్ డైలాగు "అంతేనా? వీలయితే నాలుగు మాటలు.. కుదిరితే ఓ కప్పు కాఫీ.." ...సిస్టం లో తల దూర్చేశాను వెంటనే.

ఈ మధ్య కాఫీ తాగడం బాగా ఎక్కువైపోయింది. మరీ నాలుగైదు కాఫీలు, రెండు మూడు టీలు తాగేస్తున్నాను. తగ్గించాలని ఎన్నిసార్లు ప్రయత్నం చేశానో లెక్కలేదు. కాఫీల సంఖ్యని రోజుకి ఒకటి చేయడం.. సంతోష పడేలోగానే నెమ్మదిగా మళ్ళీ కాఫీలు పెరిగిపోడం.. 'శ్రీశ్రీ' సిగరెట్ల కథలా అవుతోంది. ఒక్కసారిగా మానుకోడానికి ఇదేమైనా ఇవాళ కొత్తగా అయిన అలవాటా..? పైగా వారసత్వంగా వచ్చింది కూడాను.

గుండ్రాలు గుండ్రాలుగా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే, నా చిన్నప్పుడు మా ఇంట్లో తాతయ్య, బామ్మ కాఫీ తాగేవాళ్లు, అమ్మానాన్నా టీ తాగేవాళ్లు. పిల్లలు ఆ రెండూ తాగకూడదు కాబట్టి మనకి మూడు పూటలా పాలే. భలే విసుగ్గా ఉండేది పాలు తాగడం. అక్కడికీ నా పాల గ్లాసులో ఎవరూ చూడకుండా తాతయ్య చేత కొంచం కాఫీ పోయించేసుకునే వాడిని. బామ్మ మాత్రం అలా చేసేందుకు ఒక్కనాటికి ఒప్పుకునేది కాదు, నాకు జ్వరం వచ్చినప్పుడు తప్ప.

చిన్నప్పుడు జ్వరం వస్తే ఆయుర్వేద వైద్యం చేయించేవాళ్ళు. ఆ డాక్టరు గారు రెండుపూటలా వేడి కాఫీ తాగించమనే వాళ్ళు, జ్వరం త్వరగా తగ్గిపోతుందని. కేవలం కాఫీ తాగొచ్చనే కారణానికి జ్వరం రావాలని కోరుకున్న రోజులు ఎన్ని ఉన్నాయో.. ఎప్పుడైనా అమ్మతో అంటే తిట్టేది. "వెధవ కాఫీ, కావాలంటే నాన్నగారు చూడకుండా పెట్టిస్తా.. జ్వరం కోరుకోకు" అంటూ అక్షింతలు. ఊరికే అలా అనేదే కాని ఇచ్చేది కాదు, అది వేరే విషయం.

హైస్కూలికి వచ్చాక పరిక్షల ముందు నైటౌట్లు అలవాటై, నిద్రాపుకునే మిష మీద తేనీరు సేవించడానికి పర్మిషన్ దొరికింది. కాఫీ కి మాత్రం కాలేజీలో చేరే వరకూ ఆగాల్సి వచ్చింది.. అందరూ రహస్యంగా సిగరెట్లు తాగే వయసులో, నేను రహస్యంగా కాఫీ తాగేవాడిని హోటల్లో. మా ఇంట్లో మా పిన్ని చేసే కాఫీ మాత్రం అద్భుతం. కేవలం కాఫీ తాగి బతికేయొచ్చు. మిగిలిన కుటుంబ సభ్యుల కాఫీ ప్రావీణ్యం గురించి మాట్లాడ్డం అంత మంచిది కాదు.

ఇప్పటికీ నేను విచారించే విషయాల్లో ఫిల్టరు కాఫీ తయారు చేయడం నేర్చుకోలేక పోవడం ఒకటి. చాలాసార్లు ప్రయత్నం చేశాను కానీ అంత బాగా రావడం లేదు. పాలు వేడి చేసుకుని ఇన్ స్టంట్ కాఫీ చేసుకోడం మాత్రం వచ్చు. అప్రతిహతంగా సాగిపోతున్న నా కాఫీ వ్రతానికి మూడేళ్ళ క్రితం బ్రేకు పడింది. నా రక్తంలో కొవ్వు ఎక్కువగా ఉందన్న విషయం కనిపెట్టిన డాక్టరు, ఓ జాబితా ఇచ్చి "ఇవి తీసుకోడం తగ్గించండి" అన్నాడు. జాబితాలో మొదటిది కాఫీ.. అప్పటినుంచీ బోల్డన్ని సార్లు కాఫీ తగ్గించాను.. తగ్గిస్తూనే ఉన్నాను.

గురువారం, ఆగస్టు 27, 2009

యూటర్న్

నిత్యం నోట్ల కట్టలతో సహజీవనం చేసే ఓ మల్టి మిలియనీర్ తన యాభై ఐదేళ్ళ వయసులో జీవిత గమనాన్ని మార్చుకునేలా చేసిందో పదేళ్ళ పిల్ల. అతని సంపదని, సంపాదనా కాంక్షనీ చాలెంజ్ చేసింది తన చర్య ద్వారా.. అంతటి వ్యాపార సామ్రాట్టూ ఆ పిల్లకి తాను వారసుడిగా ప్రకటించుకున్నాడు. ఇలాంటి సంఘటనలు కథల్లో మాత్రమే సాధ్యమనిపిస్తాయి కదా? అవును, ఇది కథే. పేరు 'యూటర్న్' రచయిత దగ్గుమాటి పద్మాకర్.

మూడేళ్ళ క్రితం ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ఈ కథలో నాయకుడు వసంత సేన్. అతను చేయని వ్యాపారం లేదు. నిత్యం కోట్లాది రూపాయల లావాదేవీలు. ప్రధానమంత్రిని నేరుగా కలుసుకోగల అతి కొద్ది మంది ప్రముఖుల్లో అతనూ ఒకడు. అతని ఒక్కగానొక్క కూతురూ ఐఏఎస్ కి ఎంపికై, ట్రైనింగ్ లోనే మరో ఐఏఎస్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఒక దశ కి వచ్చాక జీవితం రొటీన్ గా అనిపించడం మొదలు పెట్టింది సేన్ కి.

మిత్రుడు, సైకాలజిస్టు డాక్టర్ శాంతారాం సలహా మేరకు జీవన విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటాడు సేన్. ప్రతి మూడు నాలుగు నెలలకీ ఒకసారి ఒక సామాన్యుడిలా సామాన్యులతో కలిసి కొద్ది రోజులు గడపడం వాటిలో ఒకటి. ఈ క్రమంలోనే ఒకసారి హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ నడుపుతున్న ఒక స్కూల్ కి వెళ్తాడు. అక్కడ హెడ్ మేష్టారు గా పని చేస్తున్న తన చిన్ననాటి మిత్రుడి సాయంతో ఓ మూడు రోజుల పాటు అక్కడి పిల్లలకి పాఠాలు చెప్పాలనుకుంటాడు.

సూటు, బూటు, బాడీ స్ప్రే, జెల్.. ఇలాంటివన్నీ వదిలి సింపుల్ గా తయారయ్యి స్కూలుకి వెళ్తాడు సేన్. మూడో తరగతి పిల్లలకి క్లాసు తీసుకుంటాడు. వాళ్ళ చేత ఆడిస్తాడు, పాడిస్తాడు. వాళ్ళు లెక్కల్లో వీక్ గా ఉన్నారని గమనించి, వైకుంఠపాళీ ఆడించి కూడికలు చురుగ్గా చేయగలిగేలా చేస్తాడు. రెండో రోజున క్లాసులో తను మర్నాడు వెళ్లిపోతున్నాననీ, పిల్లలందరికీ బహుమతులు ఇస్తాననీ, వాళ్ళంతా కూడా తనకి బహుమతులు ఇవ్వాలనీ చెబుతాడు. కాగితం మీద బొమ్మ గీసుకొచ్చినా చాలని చెబుతాడు.

మరికొన్ని రోజులు ఉండమని పిల్లలంతా బతిమాలినా తిరస్కరిస్తాడు సేన్. మర్నాడు పిల్లలందరికీ మ్యూజిక్ బాక్సులు కానుకగా ఇస్తాడు. పిల్లలు ఒక్కొక్కరూ బహుమతులు ఇవ్వడం మొదలు పెడతారు. రంగు పెన్సిలు, జెండా, కాగితం మీద వసంత సేన్ సారు గారికి అని రాసి స్పార్క్స్ చల్లి చేసిన ఆర్టూ ఇలా ఒక్కొక్కరూ వాళ్ళు తెచ్చిన బహుమతి ఇస్తారు. అందరికన్నా ఆఖర్న వస్తుంది శకుంతల.. సుమారు రెండు కేజీల బరువుండే నల్ల క్యారీ బ్యాగ్ మోసుకుంటూ.

ఆ సంచి అందుకుని "ఏమిటివి శకుంతలా?" అని అడుగుతాడు సేన్. "బలపాలు సార్" చెబుతుందా పిల్ల. అవన్నీ టేబిల్ మీద గుమ్మరిస్తాడు. "ఎందుకిన్ని దాచావు?" అని అడిగితే, ఆ పిల్ల "ఇది కూడా తెలియదా?" అన్నట్టు చూసి "రాసుకోడానికి సార్" అంటుంది, తను రెండేళ్ళు కష్టపడి దాచుకున్న బలపాలు, మంచి సార్ కదా అని ఇస్తే ఈయనేమిటీ ఇలా అడుగుతాడు అనుకుంటూ.

"అది కాదు శకుంతలా.. రెండేళ్లుగా మీ క్లాసులో యెంతో మంది పిల్లలు బలపాలు లేక దెబ్బలు తిని ఉంటారు కదా.. వాళ్లకి ఇస్తే..." ఉన్నట్టుండి మాటాడ్డం ఆపేస్తాడు సేన్.. అతనికి తన కోట్లాది రూపాయల సంపద గుర్తొస్తుంది. అదంతా టేబిల్ మీద కుప్పగా పోసిన బలపాల్లా అనిపిస్తుంది. మరో పక్క సేన్ మాటలకి శకుంతల ఏడ్చేస్తుంది. ఆమెని ఊరుకోబెట్టడం కోసం "కష్టపడి దాచుకున్నావు కదా? నాకు ఇష్టంగానే ఇస్తున్నావా?" అని అడుగుతాడు. తనకి ఇష్టమేనని నవ్వుతూ చెబుతుంది శకుంతల.

పిల్లలందరితోనూ ఫోటోలు దిగి, శకుంతలతో విడిగా ఓ ఫోటో దిగి, వాళ్ళిచ్చిన బహుమతులతో వెను తిరుగుతాడు సేన్. ఇంటికి వచ్చాక అతనిలో ఆలోచన మొదలవుతుంది. ఏ పని చేస్తున్నా అది బలపాలు కూడబెట్టడం లాగే అనిపిస్తుంది. అశాంతి పెరిగిపోతుంది. ఇక తప్పనిసరై శాంతారాం సలహా అడుగుతాడు సేన్. అతనితో చర్చించాక, తన వారసులు ఓ పది తరాలకి సరిపోయే ఆస్తి విల్లు రాసి మిగిలిన దానితో వీలైనన్ని స్కూళ్ళు ప్రారంభించి ఉచిత విద్య అందించాలని, స్కూల్లో చదివిన ప్రతి ఒక్కరూ స్కూలు కోసం ఏదైనా చేసేలా చర్యలు తీసుకోవాలనీ నిర్ణయించుకుంటాడు.

బుధవారం, ఆగస్టు 26, 2009

వానొచ్చింది..

ఎదురు చూడగా చూడగా ఎట్టకేలకి మేఘం మనసు కరిగింది.. వర్షం కురిసింది.. మామూలుగా కాదు.. నింగీ నేలా ఏకమయ్యేంత వాన కురుస్తోంది. హమ్మయ్య.. కొన్ని సమస్యలకి పరిష్కారం దొరికింది. ముందుగా వాతావరణం చల్లబడింది. వానల పుణ్యమా అని కూరగాయల పంట మొదలవుతుంది కాబట్టి వాటి ధరలు కొంచం తగ్గొచ్చు. గడ్డి మొలుస్తుంది కాబట్టి పాలకి సమస్య ఉండకపోవచ్చు. రైతుల అదృష్టం బాగుంటే పంటలు బాగానే పండొచ్చు.

మనం ఆశాజీవులం కాబట్టి భవిష్యత్తుని ఎప్పుడూ పచ్చగానే ఊహించుకుంటాం. మరి వర్తమానం సంగతేమిటి? వర్షం కురవడం వల్ల ఏం జరిగింది? ఎప్పుడూ ఏం జరుగుతుందో అదే జరిగింది. మహానగరాలు (?) మొదలు చిన్న చిన్న పట్టణాల వరకు రోడ్లన్నీ మునిగిపోయాయి. పేపర్ల భాషలో లోతట్టు ప్రాంతాలు జలమయ మయ్యాయి. ఇక్కడ రెండు సమస్యలు. బాధితులకి తాత్కాలిక ఉపశమనం, సమస్యకి శాశ్వత పరిష్కారం. రెండూ రాజకీయాల చుట్టూ తిరిగే సమస్యలే.

మా ఊళ్ళో ఏటా వినాయక చవితి టైముకి గోదారి రావడం మామూలే. ('వరదలు' అన్నది పేపర్లు, రేడియో, టీవీల వాళ్ళ భాష, మేమెప్పుడూ గోదారొచ్చింది అనే అంటాం, అంటున్నాం) గోదారికి బాగా కోపం వచ్చినప్పుడు లంక గ్రామాలు మునిగిపోతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళని ఒడ్డుకి తీసుకొచ్చి స్కూళ్ళలోనూ అక్కడా ఉంచి, భోజనాలూ అవీ చూసి, గోదారి తగ్గాక పంపిస్తూ ఉంటారు సర్కారు వాళ్ళు. ప్రతిసారీ వాళ్ళది ఒకటే గొడవ, కొందరిని (అంటే ఫలానా పార్టీకి వోటేసే వాళ్ళని) బాగా చూస్తున్నారు, ఇంకొందరిని చూడడం లేదు అని. దాన్నే రాజకీయం అంటారని తర్వాత తెలిసింది.

ఇదిగో ఇప్పుడు వానలకి కూడా అదే రాజకీయం. ప్రభుత్వం వాళ్ళిచ్చే సాయం కొంత మందికే అందుతోందనీ, చాలా మందికి అందడం లేదనీ. చోటామోటా నాయకుల మొదలు బడా నేతల వరకూ ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోడం. రెండు రోజులు ఎండలు కాస్తే వాన తాలూకు బురద ఎండిపోతుంది.. ఈ తిట్ల బురద మాత్రం ఇప్పట్లో ఆరేలా కనిపించడం లేదు. సరే.. వాళ్ళకది నిత్యకృత్యం.. విషయం ఇది కాకపోతే మరొకటి. మనం అసలు సమస్య గురించి ఆలోచిద్దాం.

ఇప్పుడంటే కొంచం పెద్ద వానలు పడ్డాయి కాబట్టి రోడ్లు మునిగి పోయాయంటే అర్ధం చేసుకోవచ్చు. మామూలుగా చిన్న చినుకు పడితేనే నీళ్ళన్నీ రోడ్డు మీద ఉంటాయి మనకి. ఇంక మురికి వాడల పరిస్తితి చెప్పక్కర్లేదు.. వాళ్ళని నీళ్ళలోనుంచి బయటికి తేడానికి పడవల మీద వెళ్ళాల్సిందే. హరప్పా, మొహెంజుదారో నాగరికతల్లో ప్రజలు డ్రైనేజి వ్యవస్థ మీద బోలెడంత శ్రద్ధ చూపించారు.. చాలా అభివృద్ధి చెందేశాక అలాంటి వాటి గురించి ఆలోచించడం మనకెంత సిగ్గు చేటు?

అసలు మన మురుగు నీటి డ్రైనేజీ లే ఉండాల్సిన సైజులో సగం ఉంటాయి.. ఆక్రమణలూ అవీ పోగా మిగిలిన డ్రైనేజీ లు పాపం ఎప్పుడో తప్ప మనల్ని ఇబ్బంది పెట్టవు. వర్షం కురిస్తే ఆ నీళ్ళకి వేరే దిక్కు లేదు, డ్రైనేజీ లో కలవాల్సిందే. చెరువులు, కుంటలూ ఇళ్ళ స్థలాలుగా రూపాంతరం చెందేశాయి. అసలే అంతంత మాత్రం డ్రైనేజీలు కొత్తగా నీళ్ళు వచ్చి చేరితే పొంగి పొర్లక ఏం చేస్తాయి? 'పల్లమెరగడం' నీటి ధర్మం కాబట్టి, మనుషులు ధర్మం తప్పినా ప్రకృతి ధర్మం తప్పదు కాబట్టి, ఈ నీళ్ళన్నీ పల్లపు ప్రాంతాలకి పోటెత్తుతాయి.

కంటింజెంసీ ఫండ్స్ తో తాత్కాలిక ఉపశమనాలు చేసి, శాశ్వత పరిష్కారానికి నిధుల కోసం ప్రపంచ బ్యాంకుకి ఓ ఉత్తరం రాయడం తో ప్రభుత్వ బాధ్యత పూర్తవుతుంది. మరి మన బాధ్యత? డ్రైనేజీ లు పొంగడంలో మన తప్పేమీ లేదా? కాల్చేసిన సిగరెట్టు ముక్క నుంచి, ఇంట్లో మిగిలిపోయిన అన్నం వరకూ ఏది పారేయాలన్నా మనకి మొదట కనిపించేది డ్రైనేజీ నే కదా? పైగా ఈ చెత్తా చెదారాన్నంతా ప్లాస్టిక్ సంచుల్లో మూటకట్టి మరీ పారేస్తాం. అడిగేంత ధైర్యం ఎవరికి?

ఎవరు చేసింది వాళ్ళే అనుభవించాలని కదా మన కర్మ సిద్ధాంతం చెబుతోంది.. అది వోటు వేసో, వెయ్యకో నాయకులని ఎన్నుకోవడమే కావొచ్చు.. లేదా చెత్తతో డ్రైనేజీ లు నింపడమే కావొచ్చు.. పర్యవసానాలు అనుభవించాల్సింది మనమే.. దీనికి వర్షాన్ని నిందిస్తే ఎలా?

మంగళవారం, ఆగస్టు 25, 2009

నాయికలు-ఇందిర

'యద్భావం తద్భవతి' అని ఒక వాడుక. అంటే మనం ఏం చూడాలనుకుంటున్నామో అదే చూడగలం. ఇందిర ని గురించి చెప్పడానికి ఈ వాక్యం సరిగ్గా సరిపోతుంది అనిపించింది నాకు. ఆమెని ఎలా అయినా అనుకోవచ్చు.. బతక నేర్చినది అనో, తను అనుకున్నది సాధించుకోడానికి ఎంతకైనా తెగించే జాణ అనో, పరిస్థితులకి ఎదురు నిలిచి పోరాడగల ధీర అనో.. ఆమె ఎలాంటిది అన్నది చూసే మన దృష్టిని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇందిర మామూలు వ్యక్తి కాదు.. 'కాలాతీత' వ్యక్తి.

అర్ధ శతాబ్దానికి పూర్వం డాక్టర్ పి. శ్రీదేవి రాసిన నవల 'కాలాతీత వ్యక్తులు' లో నాయిక ఇందిర. నిజానికి నాయకుడు అనాలేమో. బలమైన పురుష పాత్ర లేని ఈ నవల్లో ప్రతి పాత్రా ప్రత్యక్షం గానో, పరోక్షం గానో ఇందిర చుట్టూ తిరిగేవే. తనకంటూ ఒక ఇల్లూ, నేనున్నాను అని అండగా నిలబడే భర్తా, సంతానం.. ఇవీ ఇరవయ్యేళ్ళు నిండిన ఇందిర కలలు. ('అంతులేని కథ' నాయిక సరిత గుర్తొస్తోంది కదూ?)

కానీ ఇందిర వాస్తవ జీవితం వేరు. ఇంటరుతో ఆగిపోయిన చదువూ, బాధ్యత పట్టని, తన మీద ఆధారపడ్డ తండ్రీ.. ఆ తండ్రిని పోషించడం కోసం చాలీచాలని సంపాదన ఇచ్చే ఉద్యోగమూ.. విశాఖపట్నంలో అద్దింటి జీవితం ఆమెది. హోటలు భోజనం, స్నేహితులతో షికార్లూ.. పర్సులో పైసా లేకపోయినా దర్జా వెలగబెట్ట గలదు.. ఆమె షికార్లకీ, స్నేహాలకీ అడ్డు చెప్పడు తండ్రి ఆనందరావు. ప్రతిగా అతని పేకాట, తాగుడు వ్యసనాలకి డబ్బిచ్చి ప్రోత్సహిస్తూ ఉంటుంది ఇందిర.

తనవాడుగా చేసుకోదగ్గ మగవాడికోసం ఇందిర కళ్ళెప్పుడూ వెతుకుతూనే ఉంటాయి. అదిగో ఆ వెతుకులాటలో ఆమెకి కనిపించినవాడు ప్రకాశం. మెడికల్ కాలేజి స్టూడెంట్.. ఆమె ఉండే ఇంట్లోనే పై వాటాలో ఉంటున్నాడు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి మేనమామ పెంపకంలో పెరిగిన 'పిరికి' ప్రకాశాన్ని తనదారికి తెచ్చుకోడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తుంది ఇందిర.. అతనితో వెళ్ళాల్సినంత దూరమూ వెళ్తుంది. ఆ ప్రకాశం తను ఆశ్రయం ఇచ్చిన కళ్యాణి పట్ల ఆకర్షితుడవుతున్నాడని తెలిసి తట్టుకోలేకపోతుంది.

కళ్యాణిని ఇంటి నుంచి వెళ్ళగొట్టి, గాలివాటం మనస్తత్వం ఉన్న ప్రకాశం మళ్ళీ ఆమెని కలుసుకోకుండా చేస్తుంది ఇందిర. ప్రకాశం ఉత్త 'చెవల వాజమ్మ' అని అర్ధం కాగానే అతని స్నేహితుడు కృష్ణమూర్తి తో స్నేహం మొదలుపెడుతుంది. కృష్ణమూర్తి డబ్బున్నవాడు, డబ్బంటే లెక్కలేని వాడు. ఈ కారణానికి అతడు ఆనందరావుకి కూడా నచ్చుతాడు. ఇంతలో మేనమామకి భయపడ్డ ప్రకాశం అతను చూసిన సంబంధం చేసుకోడానికి ఒప్పేసుకుంటాడు..

అయినా అధైర్య పడదు ఇందిర.. తనకి కావాల్సింది తనకి ధైర్యం ఇచ్చేవాడనీ, తన కొంగు చాటున దాక్కునే వాడు కాదనీ చెబుతుంది. ఈసారి కృష్ణమూర్తితో వెళ్ళాల్సినంత దూరం వెళ్తుంది ఇందిర. "మనమందరం శుద్ధ నూనె మిఠాయి సరుకు మనుషులం కృష్ణమూర్తీ! ఏమిటేమిటో అనుకుంటాం. రెక్కలున్నాయనుకుని ఎగరడానికి ప్రయత్నించుతాం. రెక్కలు లేవు మనకు. ఉన్నా, అవి తడిసి పోయాయి. నా రెక్కల్ని బీదరికం తడిపేసింది. నీ రెక్కల్ని మితిమీరిన డబ్బు తడిపేసింది. అంచేత మనిద్దరి పరుగులాటలూ ఒకటే.." అని జీవిత సత్యం బోధపరుస్తుంది అతనికి.

మిన్ను విరిగి మీద పడ్డా నిశ్చలంగా ఉండగల ఇందిర, తనలో భావాలనీ వాటి సంచలనాన్నీ ఏమాత్రం బయట పడనివ్వని ఇందిర, కృష్ణమూర్తి తనని పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించినప్పుడు మాత్రం ఆశ్చర్యపోతుంది. అతనితో వాదిస్తుంది.. ఆ వాదనలో ఓడిపోతుంది. కృష్ణమూర్తికి భార్య అవుతుంది. ('కాలాతీత వ్యక్తులు' విశాలాంధ్ర ప్రచురణ, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)

సోమవారం, ఆగస్టు 24, 2009

సిరివెన్నెల

కొన్ని సినిమాలు తీయడానికి కేవలం డబ్బుంటే చాలు. మరి కొన్ని సినిమాలు తీయడానికి మాత్రం సాహసం, గుండె ధైర్యం కావాలి. ఇవి నిర్మాత, దర్శకుడు ఇద్దరికీ ఉండాలి. అలాంటి సాహసం, గుండె ధైర్యం ఉన్న దర్శక నిర్మాతల నుంచి వచ్చిన సినిమా 'సిరివెన్నెల.' కథానాయకుడు అంధుడు.. నాయిక మాట్లాడలేని అమ్మాయి.. ఆమె అతన్ని మూగగా ప్రేమిస్తూ ఉంటుంది.. అతని మనసు మాత్రం తనకి కొత్త జీవితాన్నిచ్చిన మరో అమ్మాయి దగ్గర ఉంటుంది.

ఈ రెండు లైన్ల కథకి సున్నితమైన భావోద్వేగాలు మేళవించి రెండు గంటల ఇరవై నిమిషాల సినిమాగా మలచడానికి ఎంత సాహసం, ఓర్పు, నేర్పు కావాలి? అవన్నీ పుష్కలంగా ఉన్న అతికొద్ది మంది తెలుగు దర్శకుల్లో ఒకరైన కే.విశ్వనాధ్ అపూర్వ సృష్టి ఈ 'సిరివెన్నెల.' కథానాయకుడు హరి ప్రసాద్ గా బెంగాలీ నటుడు సర్వదమన్ బెనర్జీ, అతన్ని ప్రేమించే మాటలు రాని అమ్మాయి సుభాషిణి గా సుహాసిని, అతను ఆరాధించే 'జ్యోతి' పాత్రలో హిందీ నటి మూన్ మూన్ సేన్ నటించారు.

పుట్టుకతోనే అంధుడైన హరి కి వేణుగానంలో అపూర్వ ప్రతిభ ఉంది.. చెల్లెలు సంయుక్త సాయంతో చిన్న చిన్న ప్రదర్శనలు ఇచ్చి పొట్ట పోసుకుంటూ ఉంటాడు. ఈవెంట్ మేనేజర్ జ్యోతి పరిచయం అతని జీవిత గతిని మార్చేస్తుంది. ఓ గొప్ప వేణు గాన విద్వాంసుడవుతాడు హరి. చిత్రంగా అతని జీవితంలో ప్రవేశించిన జ్యోతి అంతే చిత్రంగా మాయమవుతుంది. ఓ ప్రయాణంలో అతనికి పరిచయమైన సుభాషిని కవితలు రాస్తుంది, బొమ్మలు గీస్తుంది, శిల్పాలు కూడా చెక్కుతుంది. కానీ మాట్లాడలేదు. హరి ప్రేమ కథ తెలిసి అతన్ని జ్యోతితో కలపడానికి యెంతో ప్రయత్నిస్తుంది.

పాత్రల పరిచయంతో సినిమా ప్రారంభమవుతుంది.. ముందుగా సుభాషిణి బొమ్మలు గీస్తుందని చూపిస్తారు.. తర్వాత ఆమెకి మాటలు రావని, అలాగే వేణు గాన విద్వాంసుడు పండిట్ హరిప్రసాద్ అంధుడనీ తెలుస్తుంది. టైటిల్స్ పూర్తయ్యేసరికి జ్యోతి మినహా ప్రధాన పాత్రలన్నీ కథాస్థలానికి చేరుకుంటాయి. వేణుగానంలో హరి ప్రతిభను ప్రేక్షకులకి పరిచయం చేస్తాడు దర్శకుడు 'విధాత తలపున' పాటతో. ప్రేక్షకుల్లో ఉన్న సుభాషిణి హరిని అభిమానించడం మొదలు పెడుతుంది.

చాలా ఏళ్ళ తర్వాత తను పుట్టి పెరిగిన ఊరికి తిరిగి వచ్చిన హరి పాడుకునే పాట 'ఈగాలి..ఈనేల..' పాట చివరి చరణం 'కన్నెమూగ కలలుగన్న స్వర్ణ స్వప్నమై..' లో సుభాషిణి ప్రేమని ఆవిష్కరించిన తీరు అద్భుతం. ఆమె రాసిన కవితలో అక్షరాలు వాన నీటిలో కరిగి హరి వేణువు నుంచి నీలిరంగులో బయటికి రావడం బహు చక్కని వ్యక్తీకరణ. (పనిలో పనిగా విశ్వనాధ్ సెంటిమెంట్ అయిన స్నాన దృశ్యం చిత్రీకరణ కూడా పూర్తయ్యింది.. మరికొన్ని స్నాన దృశ్యాలూ ఉన్నాయి.. )

ఇప్పుడింక సుభాషిణి తన ప్రేమని వ్యక్తీకరించాలి..ఎలా? తన అన్న గిరీష్ ('సప్తపది' లో హరిబాబు గా చేసిన నటుడు గిరీష్) ని అర్ధరాత్రి నిద్రలేపి, పెళ్లి ప్రస్తావన తెచ్చి, హరి పాట వినిపిస్తుంది. గిరీష్ హరి గతాన్ని గురించి తెలుసుకోడం ద్వారా ప్రేక్షకులకీ హరి గురించి తెలుస్తుంది.శివమణి డ్రమ్స్ తో పోటీ పడుతూ ఎగిసే అగ్ని జ్వాలలకి అనుగుణంగా వేణువు వాయించే పందెంలో గెలిచి జ్యోతి దృష్టిలో పడతాడు హరి. అది మొదలు అతనికి సర్వమూ జ్యోతే..

హరికి జ్యోతి సూర్యోదయాన్ని పరిచయం చేస్తుంది.. ఇదొక బ్రిలియంట్ సీన్.. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ నచ్చి తీరే సీన్. వర్షపు సౌందర్యాన్ని చూపిస్తుంది.. ('చినుకు చినుకు' బిట్ సాంగ్.. నాకు చాలా ఇష్టం) సమస్త ప్రకృతినీ అతను తన మనో నేత్రంతో తిలకించేలా చేస్తుంది. ('ప్రకృతి కాంతకు..' మరో మంచి పాట) జ్యోతి తో పీకలోతు ప్రేమలో మునిగిపోతాడు హరి..కానీ వ్యక్తం చేయడు. అంధ బాలిక రేణు (బేబి మీనా) కి వెన్నెల్లో బృందావనం చూపిస్తానని మాటిస్తాడు హరి. ఆమె తాతగారు (రమణ మూర్తి) తన రికార్డింగ్ కంపెనీ ద్వారా హరి రికార్డు విడుదల చేస్తారు. హఠాత్తుగా మాయమైపోతుంది జ్యోతి.

'కొన్నేళ్ళకి' ఒక పెద్ద విద్వాంసుడిగా పేరు తెచ్చుకున్నా తను కట్టుకున్న ఇల్లు మొదలు, విడుదల చేసే రికార్డు వరకూ జ్యోతికే అంకితం ఇస్తూ ఉంటాడు హరి. అది కేవలం కృతజ్ఞతా? ప్రేమా? అతనికి మాత్రమే తెలుసు. అది తెలుసుకోకుండా పెళ్లి ప్రస్తావన తేవడం మంచిది కాదంటాడు గిరీష్. ఆలోచనలో పడుతుంది సుభాషిణి. ఇప్పుడు సుభాషిణి హరికి ఎదురు పడాలి.. తను అతన్ని ప్రేమిస్తోంది.. కానీ అతని మనసు మరొకరి దగ్గర ఉంది.. తన భావాలన్నీ ఆమె కేవలం తన కళ్ళతోనే వ్యక్తీకరించగలదు.. కానీ అతను వాటిని చూడలేడు.. జ్యోతినీ హరినీ కలపమని శివుణ్ణి కోరుకుంటుంది.. (నేను తరచూ వినే 'ఆదిభిక్షువు..' పాట)

తనకి వచ్చిన విద్యని ఉపయోగించి జ్యోతి బొమ్మ చెక్కాలనుకుంటుంది సుభాషిణి.. కానీ జ్యోతి ని తనెపుడూ చూడలేదు.. ఆమెని ప్రేమించిన హరీ ఆమెని చూడలేదు.. అతని ద్వారా జ్యోతి రూపు రేఖలు తెలుసుకుని బొమ్మ చెక్కుతుంది. నిజానికి జ్యోతిని సంయుక్త చూసింది..ఇంకా మరికొందరూ చూశారు.. కానీ ఆమె రూపు రేఖల గురించి వాళ్ళెవరినీ అడగదు సుభాషిణి.. ఆమెకి కావలిసింది హరి మనోఫలకంపై ఉన్న జ్యోతి రూపం. దానికే రూపు కడుతుంది. సరిగ్గా అప్పుడే జ్యోతి మళ్ళీ ప్రత్యక్షమవుతుంది. వెన్నెల్లో బృందావనం చూపించమంటూ రేణు వస్తుంది.. అదేమిటో ఈ కొన్నేళ్ళ లోనూ ఆమె యెదగదు.. సంయుక్త కూడా అంతే. ('చందమామ రావే..' పాట..)

జ్యోతి రూపంతోనూ, గుణగణాల తోనూ పని లేకుండా ఆమెని ప్రేమిస్తున్నానంటాడు హరి. సినిమా క్లైమాక్స్ కి పరిగెడుతుంది. నాకు కొరుకుడు పడని ఒకే ఒక్క అంశం జ్యోతి ఆత్మార్పణం. హరి లో ఉన్న కళాకారుడిని గుర్తించి వెలుగులోకి తెచ్చింది. అతను తనని ప్రేమించాడు.. తను అందుకు అర్హురాలు కాదనుకుంది.. ఇద్దరి జీవితవిధానాలూ వేరనుకుంది.. తను అతనికి దక్కకపోయినా హరి మునుపటిలాగే పాడాలని మాట తీసుకుంది.. తన కళ్ళని అతనికి ఇవ్వడం కోసం ఆత్మహత్య చేసుకోవడం.. ప్చ్.. నేను కన్విన్స్ కాలేను.

ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సుహాసిని నటన. హరి మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసిన తర్వాత, జ్యోతిని మొదటి సారి కలిసినప్పుడు ఆమె గుర్తుండిపోయే నటనని ప్రదర్శించింది. మహదేవన్ సంగీత సారధ్యంలో ఏ ఒక్క పాటనీ బాగాలేదు అనలేం.. ఇప్పటికీ రోజూ విన్నా బోర్ కొట్టని పాటలు. హరిప్రసాద్ చౌరాసియా తన వేణుగానం తో సినిమాకి ప్రాణం పోశారు. ఈ సినిమా తో గేయ రచయితగా పరిచయమైన సీతారామశాస్త్రి సినిమా పేరునే తన ఇంటిపేరుగాచేసుకున్నారు. దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్ ప్లే విశ్వనాధ్ సమకూర్చుకున్నారు. గీతాకృష్ణ ఆర్ట్స్ సంస్థ 1986 లో నిర్మించింది ఈ సినిమాని.

శుక్రవారం, ఆగస్టు 21, 2009

జముకుల కథ

"ఒలప్పో బెండకాయి కూరొండీసినావంటే.." మా చిన్న పిన్నిని అంటే అమ్మ ఆఖరి చెల్లెలిని మేమంతా చాలారోజులు ఏడిపించాం, ఈ పాటపాడి. అంతేనా తన పిల్లలకి వాళ్ళమ్మ చేసిన పనిని వర్ణించి వర్ణించి చెప్పాం.. పిన్ని తిడుతున్నా లెక్క చేయకుండా. గోదావరి జిల్లాలో పుట్టి పెరిగిన మా పిన్ని శ్రీకాకుళం యాసలో పాట పాడడం వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది.. మా చిన్నప్పుడు అమ్మ చాలా సార్లు నెమరేసుకున్న జ్ఞాపకం. మేము పదేపదే అడిగి మరీ చెప్పించుకున్న కబురు.

ఇంట్లో పిల్లలు తొమ్మిది మంది, వచ్చి పోయే బంధువుల పిల్లలు మరో అయిదారుగురితో వీధి బడిలా కళకళలాడే ఇంట్లో క్రమశిక్షణ ఉండాలంటే ఇంటి యజమాని హిట్లర్ కాక తప్పదు. తాతగారు ఓ రెండాకులు ఎక్కువ చదవడం వల్ల హిట్లర్ కి పెద్దన్న అయిపోయారు. ఆ తరువాయి మా పెద్ద మామయ్య.. అంటే అమ్మ వాళ్ళ అన్నయ్య. ఈయనంటే మాక్కూడా ఎంత భయమంటే మేము పెద్దయ్యాక కూడా ఒక్కసారికూడా తనకి ఎదురు పడలేదు. ఇంట్లో ఉండే క్రమశిక్షణ కారణంగా పిల్లలకి బడికి తప్ప ఎక్కడికీ వెళ్లడానికి వీలుండేది కాదు.

పల్లెటూరంటే పండగలకి పబ్బాలకి బోల్డన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందులో అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో గుళ్ళకి లెక్కలేదు. ఏడాదిలో చాలారోజులు ఏవో కార్యక్రమాలు ఉంటూనే ఉండేవి. ఇలా ఓసారి గుళ్ళో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో 'జముకుల కథ' కూడా ఉంది. శ్రీకాకుళం నుంచి ఆటగాళ్ళు వస్తారనీ, చుట్టుపక్కల ఊళ్లలో ఎక్కడా జరగని కార్యక్రమమనీ మూడు రోజుల ముందు నుంచీ బోల్డంత ప్రచారం చేసేశారు. సహజంగానే అమ్మ వాళ్ళకీ ఆ కార్యక్రమం చూడాలనిపించింది.. అంతే సహజంగా తాతగారు వీల్లేదనేశారు.

కార్యక్రమం జరిగే రోజు రానే వచ్చింది. అమ్మవాళ్ళంతా కూడబలుక్కుని ఇద్దరు పిల్లలు రహస్యంగా వెళ్లి జముకుల కథ చూసి వచ్చేట్టూ, వాళ్ళని మిగిలిన వాళ్ళు రక్షించేట్టూ, ఆ ఇద్దరూ మర్నాడు మిగిలిన వాళ్లకి కథ చెప్పేట్టూ ఒప్పందం చేసుకున్నారు. అందరి కన్నా చిన్న వాళ్ళు, అంతకు ముందు ఏ ప్రోగ్రాముకీ వెళ్ళని వాళ్ళూ అయిన పిన్నిని, చిన్న మామయ్యని ఎంపిక చేశారు జముకుల కథ చూసి వచ్చేందుకు. రాత్రి కొంచం పొద్దుపోయాక వాళ్ళిద్దరూ బయటికి జారుకోవడం, అమ్మ వాళ్ళు తలగడలకి దుప్పట్లు కప్పి అమ్మమ్మ కన్నుగప్పడం జరిగిపోయాయి.

ఒప్పందం ప్రకారం మర్నాడు వాళ్ళిద్దరూ మిగిలిన వాళ్లకి వాళ్ళు చూసిన విశేషాలు చెప్పాలి. మధ్యాహ్నం భోజనాలయ్యాక పిల్లలంతా ఓ చోట కూడారు. ముందుగా జముకుల కథ చెప్పడానికి వచ్చిన వాళ్ళు ఎలాంటి మేకప్ చేసుకున్నారో, మోకాళ్ళ వరకూ వరుసలువరుసలుగా గజ్జెలు ఎలా కట్టుకున్నారో చెప్పారు. ప్రదర్శన గురించి చెబుతూ చెబుతూ ఒక హాస్య సన్నివేశం దగ్గర మా పిన్ని ఉత్సాహంగా లేచి నిలబడి "ఒలప్పో బెండకాయి కూరొండీసినావంటే.." అని పాడుతుండగా, గజ్జెల చప్పుడుని ఇమిటేట్ చేస్తూ మా చిన్న మామయ్య 'జుముకు జుమా..జుముకు జుమా..' అని దరువేస్తున్న వేళ.. గది గుమ్మం దగ్గర అలికిడయ్యింది.. అక్కడ పెద్ద మామయ్య.

అందరూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.. తప్పించుకునే మార్గం లేదు. నాట్య భంగిమలో పిన్ని అలాగే నిలబడిపోయింది, ఫ్రీజ్ చేసిన టీవీ దృశ్యంలా.. విచారణ, వెనువెంటనే శిక్ష. ఆడపిల్ల అని పిన్నిని పెద్దగా కొట్టలేదుట కానీ, చిన్న మామయ్యకి బాగా పడ్డాయిట. అయితే అంత టెన్షన్ లోనూ మిగిలిన వాళ్ళ సాయంతోనే బయటికి వెళ్లామన్న రహస్యాన్ని వాళ్ళిద్దరూ బయట పెట్టలేదుట. "మాకు జాలేసింది.. కానీ చెబితే మాకందరికీ కూడా పడతాయి.. పైగా ఇంకెప్పుడూ అలా బయటికి వెళ్లడానికి ఉండదు..అందుకే తేలు కుట్టిన దొంగల్లా ఉండిపోయాం.. " అని చెప్పింది అమ్మ.

బుధవారం, ఆగస్టు 19, 2009

నిప్పులాంటి నిజం

మర్డర్ మిష్టరీలంటే ఆసక్తి లేనిది ఎవరికి? కల్పిత పాత్రలే అని తెలిసినా, హంతకుడెవరో తెలుసుకోడం కోసం డిటెక్టివ్ నవలని తిండి నీళ్ళు మానేసి మరీ చదవని వాళ్ళు అరుదు. అలాంటిది ప్రపంచాన్ని కుదిపేసిన ఓ హత్య తాలూకు పరిశోధనని, ఆ పరిశోధన బృందానికి నాయకత్వం వహించిన అధికారులే పుస్తక రూపంలో అందించారంటే చదవకుండా ఉండగలమా? హతుడైన ఆ నాయకుడు భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ.. ఆ పుస్తకం పేరు 'నిప్పులాంటి నిజం.'

రాజీవ్ హత్య కేసు పరిశోధనకి కేంద్ర ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) సారధి సీనియర్ ఐపీఎస్ అధికారి డి.ఆర్. కార్తికేయన్, మరో అధికారి రాధా వినోద్ రాజు తో కలిసి, తన పరిశోధనకి 'ట్రైంఫ్ ఆఫ్ ట్రూత్' అనే పేరుతొ అక్షర రూపం ఇచ్చారు. జర్నలిస్టు జి.వల్లీశ్వర్ 'నిప్పులాంటి నిజం' పేరుతో తెనిగీకరించారు. ఈ పుస్తకం వెల్లడించిన విషయాలు చాలా వరకు వార్తల రూపంలో తెలిసినవే ఐనప్పటికీ, కథనం డిటెక్టివ్ నవలని తలపించింది. ఫలితం..పుస్తకాన్ని పూర్తి చేసి కానీ పక్కన పెట్టలేం.

రాజీవ్ గాంధీ హత్య జరిగిన మర్నాడు ఎలాంటి ఆధారాలూ లేకుండా, కనీసం అనుమానితులెవరో తెలియకుండా పరిశోధనకి రంగంలోకి దిగిన సిట్ అధికారులు ఒక్కో ఆధారాన్నీ సంపాదించిన వైనం, నేరస్తులని ఒకరొకరుగా అదుపులోకి తీసుకున్న వివరం ఊపిరి బిగపట్టి చదివిస్తుంది. హత్యాస్థలంలో పోలీసులకి దొరికిన ఒకే ఒక్క ఆధారం ఒక కెమెరా. అందులో రీల్ డెవలప్ చేయించి, అధికారులు చూసేలోగానే ఆ ఫోటోలు మద్రాసు నుంచి వెలువడే ఒక జాతీయ ఆంగ్ల దినపత్రిక మొదటి పేజీలో ప్రచురితమయ్యాయి.

అదిమొదలు, నేర పరిశోధనలో పత్రికల కారణంగా అధికారులకి ఎన్నోసార్లు ఆటంకాలు ఎదురయ్యాయి. నేరస్తుల సమాచారాన్ని సేకరించడంలో, వారి ఆనుపానులు కనుక్కోడంలో అవే పత్రికలు సహకరించాయి కూడా.. వివిధ పక్షాల నుంచి రాజకీయ ఒత్తిడులకీ లోటు లేదు. హంతకులు లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీయీ) కి చెందిన వారని సిట్ అధికారులు ప్రకటించగానే విమర్శలు చుట్టుముట్టాయి. అది మొదలు హత్యకి ప్రధాన సూత్రధారులు శివరాజన్, శుభ ల కోసం వేట మొదలయ్యింది.

సస్పెన్స్ సినిమాలోచేజింగ్ సీన్ ని తలపించే ఈ వేట లో సిట్ అధికారుల లక్ష్యం ఒక్కటే, నిందితులని ప్రాణాలతో పట్టుకోవాలని. ఎందుకంటే పోలీసులకి దొరికిన పక్షంలో సైనేడ్ మింగి చనిపోమ్మని నిందితులందరికీ ఎల్టీటీయీ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. వారు మెడలో సైనేడ్ కాప్సూల్స్ ధరించారు కూడా. హత్య జరిగి యేడాది పైగా గడిచాక శివరాజన్, శుభ లను పట్టుకోగలిగారు, సిట్ అధికారులు. సజీవులుగా కాదు, నిర్జీవులుగా..

రాజీవ్ హత్యకి కొన్ని గంటల ముందు ఒక ఆగంతకుడు శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయానికి ఫోన్ చేసి 'రాజీవ్ ఇంకా సజీవంగానే ఉన్నారా?' అని అడిగిన వైనం తో మొదలయ్యే ఈకథనం శ్రిపెరంబదూరు సభాస్థలిలో భద్రతా వైఫల్యాలు లాంటి అంశాల మీదుగా సాగి, పరిశోధన, కోర్టు తీర్పుతో ముగుస్తుంది. ఎల్టీటీయీ కి భారత దేశంలో ఉన్న విస్తృతమైన నెట్ వర్క్, ఆ సంస్థ కార్యకర్తల అంకిత భావం ఆశ్చర్య పరుస్తాయి.

శ్రీలంక తమిళుల సమస్యలు, భారత-శ్రీలంక సంబంధాలనూ వివరంగా చర్చించారు ఈ పుస్తకంలో. ఎక్కడా అనువాదం అన్న భావన కలగదు, పుస్తకం చదువుతుంటే. ('నిప్పులాంటి నిజం,' ఎమెస్కో ప్రచురణ, పేజీలు 304, వెల రూ.150, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)

మంగళవారం, ఆగస్టు 18, 2009

అన్నం కావాలి

చిన్నప్పుడు నాకు తడిమట్టితో బొమ్మలు చేసి ఆడుకోవడం సరదా.. బొంగరాలతో పాటు కూరగాయలు, జంతువులు ఇలా రకరకాల బొమ్మలు చేసేవాడిని. (వాటిని నేను బొమ్మలనే అనేవాడిని, చూడ్డానికి అలా లేకపోయినా) మర్నాటికి అవి పెళుసెక్కి ఎందుకూ పనికొచ్చేవి కాదు. ఓసారి నేను బొమ్మలకోసం మట్టి తెచ్చుకోడానికి తోటలోకి వెళ్తుంటే అమ్మ అడ్డుకుంది.. "గోళ్ళనిండా మట్టి చూసి తాతగారు కొప్పడుతున్నారు" అంటూ..

నేను బొమ్మలు చేయాలని పట్టుబట్టేసరికి ప్రత్యామ్నాయంగా మైదాపిండి తడిపి ముద్ద చేసి ఇచ్చింది. అప్పటి నా క్రియేటివిటీ అంతా ఉపయోగించి నేనో బల్లి బొమ్మ తయారు చేశాను. రెండు ఆవ గింజలు సంపాదించి కళ్ళు పెట్టేసరికి అది పరాగ్గా చూస్తే బల్లి అనుకునేలా తయారైంది. మా ఇంట్లో బల్లులకి లోటు లేకపోవడంతో గోడమీద సజీవ బల్లులని చూస్తూ నా బొమ్మకి మెరుగులు దిద్దాను. అమ్మేదో పనిలో ఉండేసరికి ఆ బొమ్మని బామ్మకి చూపిద్దామని ఉత్సాహంగా వంటింట్లోకి బయలుదేరాను.

వంటగది గుమ్మం దాటి లోపలి పిల్లలకి ప్రవేశం ఉండేది కాదు. దాంతో గుమ్మంలో నిలబడి బామ్మని పిలిచాను. ఆవిడ వంట హడావిడిలో పరాగ్గా చూసి, నేను నిజం బల్లిని వేట చేసి తెచ్చాననుకుని తిట్టడం మొదలు పెట్టింది. 'ఎవర్నీ ముట్టుకోకు..బట్టలిప్పేసే స్నానం చెయ్యి..' అని ఆవిడ హడావిడి చేస్తుండగా అమ్మొచ్చి నన్ను రక్షించింది. నేను కష్టపడి బొమ్మ చేస్తే మెచ్చుకోకపోగా తిట్టిన బామ్మ మీద నాకు సహజంగానే బోల్డంత కోపం వచ్చింది. అవకాశం కోసం ఎదురు చూస్తున్నా.

ఆవేళ శనివారం. మా ఇంట్లో ఒంటి పొద్దు. అంటే మధ్యాహ్నం మామూలుగానే అన్నాలు తినేస్తారు కానీ రాత్రి అన్నం బదులు ఇడ్లీలు, మినపరొట్టి, పెసరట్లు, పిండి పులిహోర..ఇలా ఏదో ఒక టిఫిన్ చేసేవాళ్ళు, పెద్దవాళ్ళ కోసం. పిల్లలకి రెండు పూటలా అన్నాలే. కావాలంటే టిఫిన్ కూడా తినొచ్చు. మధ్యాహ్నం భోజనాలయ్యాక అమ్మ, బామ్మ మాట్లాడుకుంటుంటే అనుకోకుండా నా చెవిన పడిందో సంగతి. విషయం ఏమిటంటే రాత్రికి ఒక చిన్న అన్నం కరుడు మాత్రం మిగిలింది.

"వాడి మొహం.. వాడు ఇంతకన్నా తింటాడా అత్తయ్య గారూ.. అంతగా ఐతే ఆ చేసేదేదో కొంచం ఎక్కువగా పెడదాం.. మళ్ళీ వాడికోసం వండడం ఎందుకూ" అంటోంది అమ్మ. రాత్రి వంట గురించి చర్చలు అన్నమాట. బామ్మేమో "సరే సరే అలాగే చేద్దాం" అంటోంది. వీళ్ళిద్దరూ కలిసి నాకేదో అన్యాయం తలపెడుతున్నారని అర్ధమయ్యింది. అసలే బల్లి తాలూకు అవమానం నుంచి ఇంకా తేరుకోలేదు. ఇప్పుడు నన్నెవరు రక్షిస్తారు, తాతయ్య తప్ప?

తాతయ్య సాయంత్రం ఇంటికి రావడం ఆలస్యం.. ఎదురెళ్ళి చెప్పేశా.. "రాత్రికి నాకు అన్నం వండరుట.. మధ్యాహ్నంది కొంచం ఉంటే అదే పెడతారుట" అని కొంచం దీనంగా చెప్పేశా.. అసలే బయటినుంచి చిరాగ్గా వచ్చారేమో, తాతయ్యకి బోల్డంత కోపం వచ్చేసింది. ఆయన కోసం అమ్మ మంచినీళ్ళ గ్లాసు తెచ్చింది. "మీ అత్తగారు లేదా అమ్మా?" అని అడిగారు. కోడళ్ళని ఏమీ అనకూడదని ఆయన పాలసీ. బామ్మ రాగానే అగ్గి రాముడైపోయారు.

"చంటి వెధవకి కాస్త అన్నం వండలేరా? ఏం.. వాడి తిండి దగ్గరే పొదుపు గుర్తొచ్చిందా?" అని ఇంకా ఏవేవో అని, నాకోసం వంట చెయ్యమని ఆర్డరేసి, బయటకి ప్రయాణమయ్యారు, ఊళ్ళో షికారుకి. వెనకాలే నేను. రాత్రి వంట అమ్మ డ్యూటీ.. అమ్మ టిఫిన్ పనిలో బిజీ గా ఉండడంతో నా వంట బామ్మమీద పడింది. ఇంటికి తిరిగి రాగానే వంట చేశారో లేదో కనుక్కుని, నన్ను అన్నం తిని రమ్మని పంపారు తాతయ్య.

బామ్మ సీరియస్ గా వడ్డించింది. "మాదొచ్చోదాని.. తినకపో చెబుతాను.." అంటూ దండకం మొదలు. నేను కొంచం అన్నం తిన్నానో లేదో..అమ్మ కాలుస్తున్న మినప రొట్టి వాసనకి నోట్లో నీళ్ళూరాయి.. అన్నం తినేస్తే మరి రొట్టి తినడానికి పొట్టలో చోటుండదు కదా.. అందుకని "ఇంక చాలు బామ్మా.. కడుపు నిండిపోయింది" అని చెప్పా. ఇంక చూడాలి, బామ్మకీ తాతయ్యకీ పెద్ద యుద్ధమైపోయింది. తర్వాత నేను మినపరొట్టి ఆరగించడమూ, మర్నాడు నన్ను తిట్టుకుంటూ మిగిలిన అన్నాన్ని బామ్మ పనిమనిషికి ఇవ్వడమూ జరిగాయి.

శనివారం, ఆగస్టు 15, 2009

జనయిత్రీ దివ్యధాత్రి

ఓ కొత్త అంశంతో కథను రాసి పాఠకులని మెప్పించడం కన్నా, బాగా నలిగిన విషయాన్ని కొత్తగా చెప్పడం రచయితలకి కత్తిమీద సాము. ఈసాముని అవలీలగా చేశారు కథా రచయిత గోపరాజు రాధాకృష్ణ. దేశభక్తి ని ఇతివృత్తంగా తీసుకుని ఈయన రాసిన కథ 'జనయిత్రీ దివ్యధాత్రి' తొమ్మిదేళ్ళ క్రితం 'ఈనాడు' ఆదివారం లో ప్రచురితమయ్యింది.

కార్గిల్ యుద్ధం ముగిసిన సమయంలో రాసిన ఈ కథలో కథానాయిక తులసి. ఎన్నో ఏళ్ళ తర్వాత తండ్రి వస్తున్నాడన్న కబురు తులసికి తెలియడంతో కథ ప్రారంభమవుతుంది. "తాతగారు వస్తున్నారు చిన్నా.." అని తన కొడుక్కి చెబుతుంది. తులసి తండ్రి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ లో ఉద్యోగి. పదిహేనేళ్ళ క్రితం కనిపించకుండా పోతాడు. బోర్డర్ నుంచి పాకిస్తాన్ వాళ్ళు కిడ్నాప్ చేశారని, కాల్చి చంపేశారనీ వార్తలు వస్తాయి.

తండ్రి మరణ వార్త తెలిసి గుండె ఆగి మరణిస్తుంది తల్లి. తల్లిదండ్రులది ప్రేమ వివాహం కావడంతో బంధువులెవరూ లేరు. అనాధాశ్రమంలో చేరుతుంది తులసి. ఇంటర్ పూర్తవ్వడంతోనే పార్ట్ టైం ఉద్యోగాలు వెతుక్కుని, ఆశ్రమం నుంచి లేడిస్ హాస్టల్ కి మారుతుంది. వయోలిన్ నేర్చుకోవాలన్న చిన్నప్పటి కోరిక గుర్తొచ్చి దగ్గరలోనే ఉన్న మ్యూజిక్ స్కూల్లో చేరుతుంది.

మ్యూజిక్ స్కూల్ ప్రిన్సిపాల్ మేనల్లుడు రఘు తొలిచూపులోనే ప్రేమలో పడతాడు తులసితో. అతను సైనికుడు. ఆమె అంగీకారంతో పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళిద్దరికీ ఓ కొడుకు చిన్నా. రఘు గురించి తండ్రికి ఎలా చెప్పాలా అని తులసి మధనపడుతున్న సమయంలోనే కూతుర్ని వెతుక్కుంటూ ఆయన వస్తాడు. ఫోటోలో ఉన్న నాన్నతో పోలికలు వెతుక్కుని తండ్రిని గుర్తుపడుతుంది తులసి.

వృద్ధుడైన ఆ తండ్రి కూతురి ముఖం చూడగానే అడిగిన మొదటి సంగతి అల్లుడికి ఏమైందనే.. రాష్ట్రపతి నుంచి తాను శౌర్య పతకం తీసుకుంటున్న ఫోటో చూపించి, కార్గిల్ యుద్ధంలో రఘు మరణించాడని చెబుతుంది తులసి. పాకిస్తాన్ వాళ్ళు తనని కిడ్నాప్ చేసి జైల్లో ఉంచిన వైనం వివరిస్తాడాయన. ఇంటికి ఉత్తరాలు కూడా రాయనివ్వలేదనీ, జైలు నుంచి విడుదలయ్యాక మిత్రుల సహాయంతో తులసి చిరునామా పట్టుకోగాలిగాననీ చెబుతాడు.

తను స్కూల్లో వేసి ప్రైజు గెల్చుకున్న వీరసైనికుడి ఏకపాత్రాభినయాన్ని తాతగారికి ప్రదర్శించి చూపుతాడు చిన్నా.. అమ్మే రాసిచ్చిందనీ, కష్టపడి నేర్పించిందనీ చెబుతాడు. చిన్నాని కోరుకొండ సైనిక స్కూల్లో చేర్చాలని నిర్ణయించుకున్న తులసి, తండ్రి ఏమంటాడో అని భయపడుతుంది. కూతుర్ని ఆయన అబినందించడం కథకి ముగింపు. ఆసాంతం ఊపిరి బిగపట్టి చదివించే కథనం ఈ కథ ప్రత్యేకత. చివరి వాక్యం చదవగానే ఓ నీటి చుక్క కంటి చివరినుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేయక మానదు. బ్లాగ్మిత్రులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

గురువారం, ఆగస్టు 13, 2009

నీరాకకోసం...

"ఎదురు చూపులు ఎదను పిండగా ఏళ్ళు గడిపెను శకుంతల.. విరహ బాధను మరిచిపోవగా నిదురపోయెను ఊర్మిళ..." ...ప్చ్.. ఏం కవులో.. ఎదురు చూపులు కేవలం ఆడువారికే పరిమితమైనట్టు రాస్తారు.. వీళ్ళు మగవాళ్ళై ఉండి సాటి పురుషులని అర్ధం చేసుకోరెందుకో..

అర్ధం చేసుకో గలిగిన వాళ్ళే ఐతే నీ కోసం నేనెంతగా ఎదురు చూస్తున్నానో తెలిసేట్టుగా ఓ కవితో గేయమో రాసి ఉండేవాళ్ళు కదా? నేను కనీసం దానిని పాడే ప్రయత్నం చేసి నిన్ను ప్రసన్నం చేసుకునే వాడిని కదా.. పాడడం ఆపమని నన్ను బెదిరించదానికో, బతిమాలడానికో నువ్వు వచ్చేదానివి కాదూ?

"యమునా తటిపై నల్లనయ్యకై ఎదురు చూసేను రాధ..." బాగుంది వర్ణన.. మరి నీ కోసం..ఈ నల్లపిల్ల కోసం.. నా ఎదురు చూపుని తెలిపేదేలా? ఎప్పుడో తప్ప అలగని నువ్వు ఇప్పుడిలా మూతిబిగేస్తే ఏం చేసి నీ అలక తీర్చాలి? నీ చెలులు, సఖులు అప్పుడప్పుడూ ఇలా కనిపించి అలా మాయమవుతున్నారు.. వాళ్ళని నువ్వేమని బెదిరించావో తెలియదు..నీ జాడ మాత్రం చెప్పడం లేదు.

నీది కోకిల రూపమే కావొచ్చు.. స్వరం కాకి కన్నా కర్ణ కఠోరం కావొచ్చు.. అయినా నువ్వంటే నాకెంత ప్రేమో తెలుసా? నీ పాట వినడం కోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో.. ఏం? నలుపు మాత్రం రంగు కాదా? అందులో మాత్రం అందం లేదా?

ప్రేమని వ్యక్తం చేయడానికి నీకు తెలిసినంత భాష నాకు తెలియదు.. ఏం చేయమంటావు చెప్పు? నీ ప్రేమలో తడిసి ముద్దైన క్షణాన, వళ్ళంతా కళ్ళు చేసుకుని నిన్ను చూస్తానే.. ఆ చూపులో నా ప్రేమను నువ్వు చదువుకోగలవు అనుకుంటాను నేను. నీకు నేను అర్ధం కాలేదా? అర్ధమయ్యీ నన్ను సాధిస్తున్నావా?

ఎంకి ఎక్కడుందని ఎవరైనా అడిగితే "ఎలుగు నీడలకేసి ఏలెత్తి సూపింతు.." అన్నాడు నాయుడు బావ. ఎంత అదృష్టవంతుడు?! నాకామాత్రం అదృష్టం కూడా లేదే.. వెలుగుకీ నీకూ చుక్కెదురు మరి.. ఒక్క దానివీ రాకుండా నిశిని తోడు తీసుకుని మరీ వస్తావు..

ఎప్పుడైనా ధైర్యం చేసి వెలుగు నీకేసి ఓరచూపు చూసిందనుకో.. అహ.. ఎప్పుడైనా మాత్రమే.. అప్పుడు నువ్వూరుకుంటావా? రంగురంగులు చూపించేస్తావు. వెలుగు మొండితనానికి పోతే, చురచురా చూసి చరచరా వెళ్ళిపోతావు. ఎప్పుడూ వెలుగు మీద చూపించే కోపాన్ని ఇప్పుడు నామీద చూపిస్తున్నావు నువ్వు.

అసలు ప్రేమని ప్రకటించడం అన్నది నీ దగ్గర నేర్చుకోవాలి ఎవరైనా.. ఎన్నాళ్ళుగానో నీలో.. లోలో.. దాచుకున్న ప్రేమనంతా ఒక్కసారిగా కుమ్మరించేస్తావు.. అవతలివాడు తట్టుకోగలడా లేదా అన్న ఆలోచన కూడా ఉండదు నీకు.. నీ ప్రేమ ధాటికి ఉక్కిరిబిక్కిరై, తేరుకునే లోగా ఉన్నట్టుండి ఒక్కసారిగా నిశ్శబ్దమై పోతావు. నిన్ను అర్ధం చేసుకోవాలని ఎన్నో వెర్రి ప్రయత్నాలు.. అర్ధమైతే ఇక నీ గొప్పదనం ఏముంది చెప్పు?

ఇన్ని చెబుతున్నాను కదా.. ఈక్షణంలో నువ్వొస్తే ఇవన్నీ మర్చిపోతాను నేను.. అసలు నువ్వు కనిపిస్తే నన్ను నేనే మర్చిపోతాను. ఎందుకు అలిగావని అడగాలని కూడా గుర్తుండదు నాకు. నువ్వు కనిపించకపోతే నేనెంత దిగులు పడతానో ఇన్నేళ్ళ మన చెలిమి సాక్షిగా నీకు తెలుసు..

నా దిగులు పోగొట్టడం కోసం నీలాకాశపు రాజమార్గాన మెరుపు నగలని సింగారించుకుని ఉరుముల సన్నాయి నేపధ్యంలో నాకోసం వచ్చి నీ ప్రేమను వర్షించవా నీలిమేఘమా....

బుధవారం, ఆగస్టు 12, 2009

నాయికలు-వేదసంహిత

కొన్ని కొన్ని పుస్తకాలు మొదటి సారి చదివినప్పుడు చాలా బాగా అనిపిస్తాయి..కొన్ని పాత్రలు మనకి మరీ దగ్గరగా అనిపిస్తాయి.. మనకి తెలియకుండానే ఆ పాత్ర (ల) తో ప్రేమలో పడిపోతాం. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లా అన్నమాట.. అలా నేను ప్రేమలో పడ్డ అనేక పాత్రల్లో ఒకామె వేదసంహిత. ఆంత్రోపాలజీ రీసెర్చ్ స్కాలర్, అపాచీ కల్చర్ మీద పీహెచ్.డీ. చేయడమే కాదు, ఆ అపాచీల నాయకుడి మనసునూ గెలుచుకున్న అమ్మాయి. అంతే కాదు, తాగి వచ్చి భార్యపై కత్తిపీటతో దాడి చేసే ఓ భర్తకి భార్య కూడా!

సుమారు రెండు దశాబ్దాల క్రితం అనుకుంటా.. 'ఆంధ్రజ్యోతి' వారపత్రిక ఓ ప్రయోగం చేసింది. 'ప్రేమ' అనే సబ్జెక్ట్ ఎంపిక చేయడంతో పాటు, ముఖ్య పాత్రల పేర్లనూ నిర్ణయించి, ముగ్గురి చేత సీరియల్స్ రాయించి ప్రచురించింది. మూడు సీరియళ్ళ టైటిళ్ళూ 'ప్రేమ,' ప్రధాన పాత్రల పేర్లు అభిషేక్, సంహిత, చలం. యద్దనపూడి సులోచనా రాణి, వెన్నలకంటి వసంత సేన, యండమూరి వీరేంద్రనాథ్ లు ఆ సీరియళ్ళు రాశారు. ముగ్గురు సంహితల్లోనూ నాకు బాగా నచ్చింది యండమూరి వేదసంహిత.

బ్రహ్మదేవుడు తను సృష్టించిన అమ్మాయి గురించి తనే తన్మయంగా మాట్లాడి సరస్వతీదేవి కి కోపం తెప్పించడం లాంటి అపసవ్యపు ప్రారంభం చికాకు తెప్పించినప్పటికీ, గోదారి ఒడ్డున పల్లెటూరు ఆదిత్యపురానికీ, గాజాలో రెడ్ ఇండియన్ల స్వతంత్ర పోరాటానికీ వేదసంహిత అనే అందమైన అమ్మాయిని వంతెనగా చేసి ఆశ్చర్య పరుస్తాడు రచయిత. ఒంటరిగా ఆదిత్యపురం వచ్చిన వేదసంహిత పల్లెటూళ్ళ మీద రిసెర్చ్ మిష మీద సోమయాజిగారింట్లో అద్దెకి దిగుతుంది.

అప్పటికి సివిల్ సర్విస్ పరిక్షలు రాసి వస్తుంది వేదసంహిత. ఆధునికంగా ఆలోచిస్తూనే సంప్రదాయాన్ని విడిచిపెట్టకపోవడం ఆమె ప్రత్యేకత. పదిమంది చుడీదార్ అమాయిల్లో ఓ లంగా వోణీ అఅమ్మాయి తను. తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడతారు ఆ ఊరి కుర్రాళ్ళు చలం, అరుణ్. వాళ్ళతో తాను 'వివాహితను' అని చెబుతుంది, మెడలో ఉన్న తాళిబొట్టు తీసి చూపిస్తుంది.

ఆమె వచ్చిన కొన్నాళ్ళకే ఆమెని వెతుక్కుంటూ ఆ ఊరొస్తాడు అభిషేక్. 'అపాచీలు' అనే ఆటవిక తెగకి నాయకుడతడు. ఈ ప్రపంచంలో 'ప్రేమ' తో సాధించలేనిది ఏదీ లేదని నమ్మిన వాడు. "స్త్రీకి కష్టాలు లేకపోవడమే సంతోషమా? భర్త కష్టాల నుంచి బయటపడితే చాలా?" ఇవి వేదసంహితని వేధించే ప్రశ్నలు. సమాజాన్ని సంతోషాన్ని వెతుక్కోవాలన్న అభిషేక్ సూచన ఆమెని ఆలోచనలో పడేస్తుంది. భర్తనుంచి తాను ఆశించే ప్రేమని అభిషేక్ నుంచి పొందుతుంది వేదసంహిత.

ఇప్పుడు ఈనవల మళ్ళీ చదువుతుంటే, అప్పటి ఉత్కంఠత గుర్తొచ్చి నవ్వొచ్చింది. కథలో నాటకీయత తో పాటు, కథనంలో లోపాలూ చాలానే కనిపించాయి. ముఖ్యంగా పల్లెటూళ్ళ గురించి, సంస్కృతీ సంప్రదాయాల గురించీ రచయిత ఇచ్చే సుదీర్ఘ ఉపన్యాసాలు విసుగు కలిగించాయి. అయితే అప్పటికీ, ఇప్పటికీ మారనది ఒకటి ఉంది.. వేదసంహిత మీద అభిమానం. బహుశా తొలిప్రేమ బలమేమో?!! ('ప్రేమ,' నవసాహితి ప్రచురణ, వెల రూ. 50.)

మంగళవారం, ఆగస్టు 11, 2009

అంతులేని కథ

తొమ్మిదిమంది సభ్యులున్న కుటుంబాన్ని పోషించడం కోసం తనను తాను యంత్రం గా మార్చుకున్న పాతికేళ్ళ సరిత కథ 'అంతులేని కథ.' కె. బాలచందర్ దర్శకత్వంలో 1976 లో విడుదలైన ఈ సినిమా కథానాయికగా జయప్రద స్థానాన్ని సుస్థిరం చేసింది. ఆమెకి అనేకమంది అభిమానులని సంపాదించి పెట్టింది..వాళ్ళలో నేనూ ఒకడిని. చక్కని, చిక్కని కథ చేతిలో ఉంటే అతి తక్కువ బడ్జెట్ లో మంచి సినిమా తీయొచ్చని నిరూపించారు బాలచందర్.

సంసారం బరువు మోయలేక పారిపోయిన తండ్రి, అతను తిరిగి వస్తాడని ఆశగా ఎదురుచూసే తల్లి.. తనకంటూ పైసా సంపాదన లేకపోయినా, పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలని కన్న వ్యసన పరుడైన అన్న మూర్తి. కాళ్ళ పారాణి ఆరకముందే వితంతువుగా పుట్టింటికి చేరిన చెల్లెలు భారతి. ఈమె కాక మరో చెల్లెలు, ఓ అంధుడైన తమ్ముడు.. ఇదీ సరిత కుటుంబం. వీళ్ళందరినీ పోషించే ఏకైక దిక్కు సరిత.

చదువుకున్నది, సంస్కార వంతురాలు, అందగత్తె ఇంకా దయార్ద్ర హృదయ అయిన సరిత పైకి మాత్రం నడిచే నిప్పుకుండ. 'రాక్షసి' అంటారామెని ఇంటా, బయటా. తను ప్రేమించిన తిలక్ కి కూడా తనకి కొన్ని బాధ్యతలు ఉన్నాయనీ, అవి తీరాక పెళ్లి చేసుకుందామనీ చెబుతుందే తప్ప అవేమిటో చెప్పదు సరిత. ఈ సరితకో స్నేహితురాలు చంద్ర.. ఈమె స్వభావం సరితకి పూర్తి విరుద్ధం.. బలాదూర్ జీవితం చంద్రది.

ఎప్పటికైనా ఆ ఇంటికి ఓ మగదిక్కు ఏర్పడితే, ఉద్యోగానికి రాజీనామా చేసి, తిలక్ ని పెళ్లి చేసుకుని ఓ బుల్లి సరితకి తల్లవ్వాలన్నది సరిత కల. అన్నని మార్చాలని ప్రయత్నించి విఫలమవుతుంది. తండ్రి వస్తున్నాడని తెలిసి సంతోషిస్తుంది. కానీ ఆ తండ్రి ఓ బైరాగి రూపంలో ప్రత్యక్షం కావడంతో భోజనం కూడా పెట్టకుండా పంపేస్తుంది. సరిత బాధ్యతలు తీరేవి కాదని తెలుసుకున్న తిలక్ భారతిని పెళ్లి చేసుకుంటాడు.

సరిత పనిచేసే కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఆమెని పెళ్లి చేసుకోడానికి ఇష్టపడతాడు. చివరి నిమిషంలో అతనికి తన చిన్న చెల్లిని ఇచ్చి పెళ్లి చేస్తుంది సరిత. పెళ్లి జరగడానికి కొద్ది క్షణాల ముందే మూర్తి హత్యకి గురయ్యాడని తెలియడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంటుంది. నటీనటుల గురించి చెప్పాల్సొస్తే మొదట చెప్పాల్సింది జయప్రద గురించే. అభిమానం చేతో ఏమో కానీ నాకు మాత్రం ఈ సినిమాలో ఆమె నటన అసామాన్యం అనిపిస్తుంది.

మూర్తి పాత్రతో రజనీకాంత్ తెలుగు తెరకి పరిచయమయ్యాడు. వికటకవి గోపాల్ గా నటించిన నారాయణ రావుకీ ఇదే తొలి సినిమా. మేనేజింగ్ డైరెక్టర్ గా అతిధిపాత్ర చేశాడు కమల్ హాసన్. మూర్తి, ఇతర కుటుంబ సభ్యులు సరిత సంపాదనకి లెక్కలు అడిగే సన్నివేశం నాకు ఈ సినిమాలో చాలా బాగా నచ్చిన సీన్. భారతి సరితని 'అప్పు' అడిగినప్పుడు, భారతి-తిలక్ ల ప్రేమ గురించి సరితకి తెలిసినప్పుడు సరిత గా జయప్రద ప్రదర్శించిన హావభావాలు గుర్తుండిపోతాయి.

మూర్తి గా రజనీ నటననీ తక్కువ చేయలేం. మిగిలిన పాత్రల్లో బాగా నచ్చేది 'చంద్ర' గా 'ఫటాఫట్' జయలక్ష్మి నటన. ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీతంలో పాటలన్నీ బాగుంటాయి. 'తాళికట్టు శుభవేళ' పాట ఎవర్ గ్రీన్. 'దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..' 'ఏమిటి లోకం..' 'ఊగుతుంది నీ ఇంట వుయ్యాల..' ప్రతి పాటా ప్రత్యేకమైనదే. నా చాయిస్ విషయానికొస్తే 'దేవుడే ఇచ్చాడు..' తో పాటు 'కళ్ళలో ఉన్నదేదో..' పాట. మొత్తం సినిమా అంతా డామినేట్ చేసిన జయప్రద ఈ పాట దగ్గరికి వచ్చేసరికి జానకి గొంతు ముందు వెనక్కి తగ్గిందనిపిస్తుంది.

క్రమశిక్షణ తో ఉండే సరిత జీవితాన్ని చూపిస్తోనే, పార్లల్ గా క్రమశిక్షణ లేని చంద్ర జీవితాన్నీ చూపిస్తాడు దర్శకుడు. ప్రతి విషయాన్నీ తేలిగ్గా తీసుకునే చంద్ర తత్త్వం వల్ల ఆమె తన తల్లిని నష్టపోతుంది చివరికి. సరిత ఆఫీసు ప్రయాణం తో మొదలయ్యే సినిమా, అదే సన్నివేశంతో ముగుస్తుంది. అక్కడక్కడా మెలోడ్రామా కొంచం శృతి మించినట్టు అనిపిస్తుంది. చూసేటప్పుడు ఇది మూడు దశాబ్దాల కిందటి సినిమా అని గుర్తు పెట్టుకోవాలి.

ఆదివారం, ఆగస్టు 09, 2009

ఆదివారం అనుబంధాలు

చాలా రోజులుగా వాయిదా వేస్తున్న పనులన్నీ ఉదయాన్నే ఒక్కసారిగా గుర్తొచ్చాయి. నాకున్న టైం ఒక్క పూట. ఈ ఒక్క పూటలో అన్ని పనులూ చేయడం ఎలాగూ సాధ్యం కాదు. 'ఏవిటి సాధనం?' అని ఆలోచిస్తుండగా, ప్రాధాన్యతా క్రమంలో ఒక పనిని ఎంచుకోమని అంతరాత్మ చెప్పింది.

ఈసారికిలా కానిద్దాం అనుకుని జాబితా వేస్తే కుప్పలుగా పేరుకుపోయిన 'ఆదివారం అనుబంధాలు' క్లియర్ చేయడం అధిక ప్రాధాన్యత ఉన్న పెండింగ్ పనిగా తేలింది. అసలే ఆ పుస్తకాల కుప్పలోకి ఈమధ్య ఓ చిట్టెలుక ప్రవేశించిం దన్న అనుమానాలు బలపడుతున్నాయి.

దినపత్రికల ఆదివారం అనుబంధాలు చాలారోజులు దాచడం మొదటి నుంచీ అలవాటు. వాటిని క్లియర్ చేసేముందు నచ్చిన కథలూఅవీ కత్తిరించి దాస్తూఉంటాను. ఉదయాన్నే'ఆంధ్రజ్యోతి' 'సాక్షి' 'ఈనాడు' సండేమేగజైన్లు ముందేసుకుని కూర్చున్నా. దగ్గర దగ్గర రెండేళ్ళ పుస్తకాలు. వాటిలో కొన్ని దుమ్ము ధూళితో నిండి ఉండడంతో ఎందుకైనా మంచిదని ముఖానికి కర్చీఫ్ కట్టుకున్నా..

అటు, ఇటు ఉన్న ఇళ్ళ వాళ్ళు ఎందుకు అనుమానంగా చూస్తున్నారో కాసేపు ఆలోచిస్తే కాని అర్ధం కాలేదు. పేపర్లు, టీవీల నిండా స్వైన్ ఫ్లూ వార్తలే కదా.. పుస్తకాలు వేటికవి విడి విడిగానే ఉంచాను చాలా రోజులు. ఐతే అవన్నీ ఎప్పుడో నాకు తెలియకుండా ఐకమత్యాన్ని ప్రకటించాయి. మళ్ళీ వాటిని విడగొట్టడం ఎందుకని అలాగే నాపని మొదలుపెట్టాను.

ఇల్లేరమ్మ చెప్పినట్టు 'తనకున్న పని తినకున్నా తప్పదు..' అందులోనూ ఉదయాన్నే ఉప్మా తిన్నాక ఇంక అస్సలు తప్పదు. ఆహా.. ఒక్కో పుస్తకం తిరగేస్తుంటే ఎన్ని జ్ఞాపకాలు. ఎప్పుడో చదివిన కథలు, కబుర్లు. వీలైనన్ని పుస్తకాలు క్లియర్ చేయాలి అనుకుంటూ మొదలు పెట్టాను కానీ, నాకు తెలియకుండానే మున్సిపాలిటీ ఎద్దులా నచ్చిన చోట ఆగిపోవడం మొదలుపెట్టాను.

'జీవితం..రైలుబండి' అంటూ వంశీ రాసిన వ్యాసం. ఉదయం రైల్లో హైదరాబాద్ నుంచి రాజమండ్రి ప్రయాణాన్ని తనదైన శైలిలో కళ్ళకు కట్టాడు. కత్తిరించి 'వంశీ' ఫైల్లో భద్రపరిచా. 'సాక్షి' 'ఈనాడు' తో పోల్చినప్పుడు 'ఆంధ్రజ్యోతి' ఆదివారాలు క్లియర్ చేయడానికి ఎక్కువ టైం పట్టింది. వాటిలో కథలతో పాటు, కొన్ని ఆర్టికల్సూ నాకు నచ్చుతాయి.

అప్పట్లో 'ఫెయిల్యూర్ స్టోరీ'లు చాలావరకు కత్తిరించి దాచాను. 'భజంత్రీ కథలు' తర్వాత దాచాల్సిన ఫీచరేదీ కనిపించలేదు. ఈమధ్య 'ఆంధ్రజ్యోతి' చదవడం తగ్గింది, పేపరబ్బాయి దయవల్ల.. మొన్నటివరకూ మనం ఏం చదవాలో జర్నలిస్టులూ, ఎడిటర్లూ నిర్ణయిస్తారనుకునే వాడిని. పేపరబ్బాయిలదే కీలక పాత్ర అని అనుభవం మీద తెలిసింది.

'సాక్షి' ఫండే తిరగేస్తుంటే ప్రారంభంలో మాత్రమే ఆకట్టుకున్న 'ఆరాధన' సీరియల్, మల్లాది బాగా నిరాశ పరచిన 'తాడంకి ది థర్డ్' సీరియల్ కనిపించాయి. తాడి బలరాం 'సిని ఫక్కీ' లో కొన్ని ఆర్టికల్స్ మరో సారి చదివా. కొన్ని ఇతర భాషల కథల అనువాదాలు మాత్రం ఫైల్ చేశాను. 'ఈనాడు' ఆదివారాల్లో ఓ సౌలభ్యం ఉంది. ఒకప్పుడు మంచి కథలు వచ్చేవి కానీ ఇప్పుడు ఎక్కడో తప్ప దాచాల్సిన కథలు తగలడంలేదు.

'ఈనాడు' లో కూడా వంశీ ఆర్టికల్ ఒకటి కనిపించింది. కేరళ హౌస్ బోట్ ప్రయాణం గురించి. కత్తిరించబోతుంటే వెనుక పేజిలో 'జాతీయ అవార్డ్ లక్ష్యం' అంటూ గాయని సునీత కబుర్లు కనిపించాయి. వీటిలో ఆమె చెప్పిన ఒక కబురూ, దానిపై మిత్రులు పేల్చిన జోకులూ గుర్తొచ్చి నవ్వుకున్నా. నేను అనుకున్నంత వేగంగా పని పూర్తి చేయలేకపోడం వల్ల, అనుకున్న టైమైపోయింది కానీ పనవ్వలేదు. ఏం చేస్తాం.. సగం లో వదిలేసి వాయిదా వేస్తాం.. వీలైనంత త్వరలో పూర్తి చేయాలి.

శనివారం, ఆగస్టు 08, 2009

బాధ్యత

ఏదైనా పని చేసినప్పుడు విజయం మనల్ని వరిస్తే అది మనవల్లే అని చెప్పడం, పరాజయం పాలైతే అందుకు నెపాన్ని మరొకరికి నెట్టడం మానవ నైజం. గెలుపులో ఓ మత్తు ఉంటుంది.. అది మన కళ్ళకి గంతలు కడుతుంది. ఫలితంగా మనం ఆ గెలుపు సాధించడానికి సాయపడ్డ వాళ్ళని తాత్కాలికంగానైనా మర్చిపోయేలా చేస్తుంది. అదే వైఫల్యం ఐతే మన ఇగో ని దెబ్బ తీస్తుంది. 'నా అంతటి వాడు ఓడిపోవడం ఏమిటి?' అనిపిస్తుంది. ఓటమికి కారణం మనం కాదు మరెవరో అనిపిస్తుంది.

చిన్నప్పుడు క్లాసులో మంచి మార్కులు వస్తే 'కష్టపడి చదివాను.. అందుకే మార్కులు వచ్చాయి' అంటాం. అదే మార్కులు సరిగ్గా రాకపోతే 'మేష్టారు సరిగ్గా పాఠం చెప్పలేదు' అనేస్తాం. అంతేనా? 'మేష్టారికి ఫలానా వాళ్ళంటే ఇష్టం..అందుకే నేనెంత చదివినా వాళ్ళకే మార్కులు వేస్తారు' అని ప్రచారం చేయడానికీ వెనుకాడం. ఇదే ప్రచారం ఎవరైనా మనమీద చేస్తే వాళ్ళని 'కుళ్ళుబోతు' అంటాం.

ఉద్యోగంలో మనం చాలా కష్టపడి పనిచేస్తాం.. (కనీసం మనం అలా అనుకుంటూ ఉంటాం) ప్రమోషన్ వస్తే అది మన ప్రతిభే.. మనకి కాకుండా పక్కవాడికి వస్తే వాడు బాసుని కాకా పట్టి తెచ్చుకున్నాడు.. ఈ రెండు వాదనలూ మన దగ్గర సిద్ధంగా ఉంటాయి. మనకి ప్రమోషన్ ఇచ్చిన బాస్ దేవుడు..ఆయనకి ప్రతిభని గుర్తించడం తెలుసు. అదే ప్రమోషన్ పక్కవాడికి ఇస్తే ఆ బాస్ ఓ పెద్ద ఫూల్.. మనం సరిగ్గా పని చేయకపోవడం అనే కారణం ఉండి ఉంటుందని మనకి తోచదు.

విజయానికి బాధ్యత వహించడానికి ఉత్సాహ పడే వ్యక్తులు మనకి అన్నిచోట్లా తారస పడతారు. ముఖ్యంగా సిని, రాజకీయ రంగాల్లో కొంచం ఎక్కువగా కనిపిస్తారు. సినిమా హిట్టయ్యిందంటే 'అది నా ప్రతిభే' అని హీరో, దర్శకుడూ విడివిడిగా ప్రకటనలిస్తారు. ఆ సినిమా కోసం వాళ్ళెంత కష్టపడ్డారో ఇంటర్వ్యూలు ఇస్తారు, అలుపు లేకుండా. తర్వాత వాళ్ళ మార్కెట్ పెరుగుతుంది. నిర్మాత కూడా సంపాదించింది ఖర్చయ్యే వరకూ సినిమాలు తీస్తూనే ఉంటాడు.

సినిమా ఫెయిలయితే మాత్రం హీరో, దర్శకుడూ కూడా వేలెత్తి చూపేది నిర్మాతనే. "నిర్మాత ఖర్చుకి వెనుకాడ్డంతో అనుకున్న క్వాలిటీ రాలేదు" అంటాడు దర్శకుడు. "నా ఇమేజ్ కి తగ్గట్టుగా సినిమా లేదు.. పబ్లిసిటీ కూడా సరిగ్గా లేదు.. నా అభిమానులు చాలా నిరాశ పడ్డారు" అంటాడు హీరో. నిర్మాతకి సొమ్ము పోవడంతో పాటు, పెద్ద హీరో, దర్శకులతో సినిమా తీసే చాన్సు కూడా శాశ్వతంగా పోయినా పోతుంది. ఒక్కోసారి దర్శకుడూ, పాపం హీరోయిన్నూ కూడా ఫ్లాపుకి బాధ్యత వహించాల్సి వస్తూ ఉంటుంది.

రాజకీయాల గురించి చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలు. గడిచిన ఐదేళ్లూ రాష్ట్రంలో చక్కగా వర్షాలు కురిశాయి. ప్రభుత్వం వరుణదేవుడికి అడక్కపోయినా తమ పార్టీ సభ్యత్వం ఇచ్చేసింది. (సభ్యత్వ రుసుము ఎవరు కట్టారో తెలీదు) సమయానికి వర్షాలు కురిపించినందుకు ఆయనకి కృతఙ్ఞతలు చెబుతూ పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనలు ఇచ్చింది. (ఆయన కూడా పేపర్లు చదువుతాడని నాకు అప్పటివరకూ తెలీదు) వర్షాలు కురిసినందుకు పూర్తి బాధ్యత వహించింది.

ఇప్పుడేమో వర్షఋతువు సగం గడిచినా చినుకు రాలలేదు. వరుణ దేవుడు పార్టీ పదవి ఇవ్వలేదని అలిగాడో ఏమిటో తెలీదు కానీ చుక్క రాల్చలేదు. గడిచిన ఐదేళ్లూ వర్షాలు పడితేనే ధరలు ఇలా ఉన్నాయంటే, ఇప్పుడు వర్షాలు లేకపొతే భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో ఆలోచించడానికి ధైర్యం చాలడం లేదు. వర్షం కురవకపోడానికి ప్రభుత్వం బాధ్యత వహించడం లేదు. కనీసం వరుణ దేవుడిని నిలదీస్తూ ప్రకటనలు కూడా ఇవ్వడం లేదు. అసలు వర్షం విషయమే మర్చిపోయినట్టుంది.

విజయమైనా, వైఫల్యమైనా అందుకు పూర్తి బాధ్యత ఒక్కరిదే అవ్వదు. మనకి విజయం వచ్చినప్పుడు అందులో మరొకరి వాటాని అంగీకరించగల విశాలత్వం, వైఫల్యానికి బాధ్యత తీసుకోగల గుండె ధైర్యం, ఆత్మ విశ్వాసం అవసరం. ఇది రాత్రికి రాత్రి అలవడేది కాదు.. చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే కానిదీ ఏదీ లేదు.

శుక్రవారం, ఆగస్టు 07, 2009

మొగ్గల చీర

మా బామ్మ దృష్టిలో చీర అంటే ఏక రంగు నేత చీరే. సాదా అంచుతో ఉన్న చీరలు ఇంట్లోనూ, జరీ అంచు చీరలు బయటికి వెళ్ళేటప్పుడూ కట్టుకునేది. ఇక పెళ్ళిళ్ళు, పేరంటాలకి పట్టు చీరలు సరేసరి. అమ్మ మాత్రం పూలు, డిజైన్లు ఉన్న చీరలు కట్టుకునేది. బామ్మవాటిని 'మొగ్గల చీరలు' అని వెక్కిరించేది. అత్తయ్యలు కూడా అమ్మ కట్టుకునే లాంటి చీరలే కట్టుకునే వాళ్ళు కానీ బామ్మ పాపం వాళ్ళనేమీ అనేది కాదు.

బామ్మ బాధ పడలేక అమ్మకూడా అప్పుడప్పుడూ ఆ అంచున్న చీరలు కట్టుకునేది. "ఏమీ బాలేవమ్మా.. బామ్మలాఉన్నావు.. అసయ్యంగా.." అని తను అడక్కపోయినా నా అభిప్రాయం ప్రకటించే వాడిని అమ్మ దగ్గర. అప్పటికింకా "అమ్మా..నీకేం తెలీదు" అనడం రాలేదు నాకు. నా మాటలు బామ్మ ఎక్కడ వింటుందో అని హడిలిపోయేది అమ్మ. నాన్న అమ్మకి చీర తెచ్చినప్పుడల్లా బామ్మ డైలాగు ఒక్కటే "ఇదేం చీరా..మొగ్గల చీర.."

మొగ్గల చీర మీద బామ్మ తన అభిప్రాయాలు తన స్నేహితురాళ్ళ దగ్గర తరచూ ప్రకటిస్తూ ఉండేది. ఆ చీరల మీద వ్యతిరేకతతో ఆవిడ కొన్ని సామెతలు కూడా సృష్టించింది.. "వద్దంటే మొగ్గల చీర కట్టుకు రావడం" వాటిలో ఒకటి. (ఈ సామెత మరెవ్వరూ వాడగా వినలేదు కాబట్టి, పేటెంట్ మా బామ్మదే అనుకుంటున్నా) ఒకరోజు అమ్మ, బామ్మ ఏదో విషయం మీద తీవ్రంగా చర్చించుకుంటున్నారు. నాకసలే అభిప్రాయాలు చెప్పేయడం అలవాటు కదా.. వాళ్ళ మధ్యలోకి వెళ్లి నా అభిప్రాయం చెప్పేశా..

సహజంగానే బామ్మకది నచ్చలేదు. "మధ్యలో నిన్నెవరు రమ్మన్నార్రా.. వద్దంటే మొగ్గల చీర కట్టుకుని.." అంటూ కోప్పడింది. సమయానికి తాతయ్య ఇంట్లో లేరు..దాంతో ఫిర్యాదు చేయడానికి లేకపోయింది. అప్పటికింకా నేను సినిమాలు ఎక్కువగా చూడకపోయినా నా మనసు ప్రతీకారంతో రగిలిపోయింది. ఏం చెయ్యాలా? అని ఆలోచించి, అమ్మ బామ్మ వాళ్ళ చర్చలో వాళ్లుండి నన్ను గమనించడం లేదని తెలుసుకుని ఇంట్లోంచి బయటికి నడిచాను.

ముందుగా మా బామ్మ తేలుమంత్రం స్నేహితురాలు శాయమ్మ గారింటికి వెళ్లాను. ఆవిడతో ఆకబురూ ఈకబురూ చెప్పి "ఇవాళ మా బామ్మ గారు మొగ్గల చీర కట్టుకున్నారండీ" అని చెప్పి మరో ఇంటికి వెళ్లాను. ఇలా నాలుగైదు ఇళ్ళు తిరిగి, తాతయ్య, నాన్న ఇంటికి వచ్చే వేళకి పిల్లిలా ఇంటికి చేరాను. సాయంత్రం శాయమ్మ గారు హడావిడి పడుతూ వచ్చి "ఏమిటండీ మొగ్గల చీర కట్టుకున్నారుట?" అని అడిగేశారు బామ్మని. నేను ప్రమాదాన్ని శంకించిన వాడినై తాతయ్యని వదల్లేదు.

మరి కాసేపటికి మరో ఇద్దరు స్నేహితురాళ్ళు వచ్చారు, మొగ్గల చీరలో మా బామ్మని చూడ్డానికి. నాన్న చేత నన్ను భయపెట్టించాలని చూసింది కానే, తాతయ్య పడనివ్వలేదు. పైగా "నీకంతగా మనుసుగా ఉంటే ఓ మొగ్గలచీర కొనుక్కో.. నేనేవన్నా వద్దన్నానా?" అని ఎదురు దాడికి దిగారు. పాపం..బామ్మ చాలా అవమాన పడింది. ఎందుకంటే వారం రోజులపాటు ఎవరు కనబడ్డా ఆవిడని "ఏమిటండీ మొగ్గల చీర కట్టుకున్నారుట?' అని అడగడమే.. మా బామ్మకి నేను 'పగ వాడిని' ఎందుకయ్యానా? అని ఆలోచిస్తుంటే గుర్తొచ్చిన అనేక సంఘటనల్లో ఇదీ ఒకటి.

బుధవారం, ఆగస్టు 05, 2009

మనసు

ఏమిటో ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది.. నా చుట్టూ ఉన్నవాళ్ళంతా ఒక్కొక్కరూ ఒక్కొరకం సమస్యలో ఉన్నారు. ఎవర్ని కదిలించినా 'మనసు బాలేదు' అన్న సమాధానమే వినాల్సి వస్తోంది.. నిజమే మనసు బాగుండడం, బాగోకపోవడం అన్నది మన చేతుల్లో ఉండదు. అది ఎప్పుడు ఎలా ఉంటుందో, అలా ఎందుకు ఉంటుందో తెలిస్తే ఇంక మనసు గురించి చెప్పుకోడానికి ఏముంటుంది?

'మెండార రాజూ నిద్రించూ నిద్రయునొకటే.. అండనే బంటు నిద్ర అదియూనొకటే..' అని పాడారు తాళ్ళపాక అన్నమాచార్యుల వారు. నిజానికి ఈ సమానత్వం నిద్రకే కాదు, మనసుకీ వర్తిస్తుంది. మనసు ప్రశాంతంగా లేకపొతే, వాడు ఎంతటి చక్రవర్తి ఐతేనేమి..పట్టు పానుపు మీద పవ్వళిస్తేనేమి? కంటిమీదకి కునుకన్నది రాదు కదా.. పంచ భక్ష్య పరమాన్నాలు విస్తట్లో ఉన్నా, నోటికి సహించవు కదా?

మనసు సంగతి బాగా తెలిసిన పెద్దమనిషెవరో ఒకాయన ఈ మనసుని కోతితో పోల్చాడు. బహు చక్కటి పోలిక.. కోతి చేష్టలకి, మనసు పోకడలకి కారణాలు వెతకడం కష్టమే. బేసిగ్గా మనసు మంచిదే.. మనల్ని సంతోషంగా ఉంచుతుంది, మనకి కావాల్సింది దొరికినప్పుడు. కాకపొతే దాని చెడ్డ తనమంతా బయట పడేది ఎప్పుడంటే మనం బాగా కోరుకున్నది మనకి దొరకనప్పుడు. అది దొరికేంత వరకు భలే హింస పెడుతుంది మనల్ని.

కావాల్సింది మనకి దొరికేంత వరకూ మనసు పెట్టే హింస ఒక రకమైతే, అస్సలు దొరకదు అని తెలిసినప్పుడు పెట్టే హింస మరొక రకం. అలాంటప్పుడు 'దొరికిన దానితో తృప్తి పడాలి' లాంటి మాటలు గుర్తు చేసుకోడానికి అస్సలు ఇష్టపడం మనం. "మనం కోరుకున్నది ఇక దొరకదు" అన్న నిజం తట్టుకోడానికి చాలా గుండె ధైర్యం కావాలి. ఇలాంటి ధైర్యం లేనివాళ్ళే, ఆత్మహత్యకి సిద్ధపడుతూ ఉంటారు.

సరే.. మనం బాగా కోరుకున్నది మనకి దొరికింది.. అప్పుడు మనసు ఏం చేస్తుంది? మనల్ని సంతోషంగా ఉంచుతుంది.. ఎన్నాళ్ళు? ఇది కొంచం కష్టమైన ప్రశ్న.. కావాల్సింది దొరక్కపోతే జీవితాంతం మనల్ని బాధ పెట్టే ఈ మనసే, దొరికినప్పుడు జీవితాంతం సంతోషంగా ఉంచదు, అదేమిటో మరి. కొన్నాళ్ళు మనల్ని సంతోషంగా ఉండనిచ్చాక మరింకేదో కావాలనిపిస్తుంది. కథ మళ్ళీ మొదటికి వస్తుంది.

మనసుని అదుపులో పెట్టుకోడానికి పూర్వకాలంలో ఐతే తపస్సులు, ఇప్పుడు యోగ, ధ్యానం అందుబాటులో ఉన్నాయి. కాకపొతే బోల్డంత కృషి అవసరం. కృషి ఉంటేనే కదా మనుషులు ఋషులు, మహా పురుషులు అయ్యేది. మనసుకీ కవిత్వానికీ దగ్గర సంబంధం. రాయగలిగే శక్తి ఉన్నవాళ్ళకి మనసు బాగున్నా కవితే, బాగోకపోయినా కవితే. సిని కవుల్లో ఒకాయనకి ఏకంగా 'మనసు కవి' అన్న పేరే ఉంది.

మనసు బాగోనప్పుడు దాన్నలా వదిలేయకుండా, బాగు చేసుకునే మార్గం ఆలోచించడం అవసరం. అన్ని మనసులూ ఒక్కలా ఉండనట్టే, స్వస్థత చేకూర్చుకునే మార్గాలు కూడా మనసుని బట్టి మారుతూ ఉంటాయి. వీలైనంత తొందరగా మనసుకి స్వస్థత చేకూరిస్తేనే మనం బాగుండగలం. మామూలు కోతి కన్నా పిచ్చి కోతి మరింత ప్రమాదకారి.. దెబ్బతిన్న మనసూ అంతే..

సోమవారం, ఆగస్టు 03, 2009

శిల

ఒక అందమైన, తెలివైన అమ్మాయి, ఒక ప్రతిభావంతుడైన అబ్బాయిని మనస్పూర్తిగా ప్రేమిస్తే.. ఆమె ప్రేమని పొందిన ఆ కుర్రాడు జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడు. అలాకాక, ఆ అమ్మాయి అతని ప్రతిభపై ఈర్ష్య పెంచుకుని, అతనిపై ప్రేమ నటిస్తే.. ఆ అబ్బాయి ఏమవుతాడు? ఆమెతో ప్రేమలో పూర్తిగా మునిగిన వాడైతే సర్వనాశనం అవుతాడు. అలాగే అయ్యాడు దాసు, 'శిల' కథలో నాయకుడు.

గోదావరి తీరం తరువాత, తాను అత్యంత ఇష్టపడే గాలికొండ పురాన్ని కథాస్థలంగానూ, వేణు గానాన్ని నేపధ్యం గానూ తీసుకుని పదమూడేళ్ళ క్రితం వంశీ రాసిన కథ 'శిల.' కథ ఎంత సాఫీగా సాగుతుందో, ముగింపు అంత బీభత్స రస ప్రధానంగా ఉంటుంది. కథా నాయిక లీల వేణుగానంలో దిట్ట. ఆమెకీ విద్య తల్లి ప్రభావతి నుంచి వచ్చింది. లీల తన గర్భంలో ఉండగానే భర్తను పోగొట్టుకున్న ప్రభావతి గాలికొండపురం వచ్చి ఓ సంగీత పాఠశాల ప్రారంభిస్తుంది.

తల్లి దగ్గర శిష్యరికం చేసి వేణుగానం నేర్చుకున్న లీల ఆశయం ఒక్కటే.. ఆ మారుమూల పల్లెలో కఠోర సాధన చేసి, బాహ్య ప్రపంచంలోకి వచ్చి ప్రదర్శన ఇచ్చి హరిప్రసాద్ చౌరాసియా, మహాలింగం వంటి వేణు గాన విద్వాంసులని ఒక్కసారిగా అధిగమించాలని. లీల తన ప్రయత్నాలలో తానుండగా ఆమెకి పరిచయమవుతాడు దాసు. అతనిదో విచిత్రమైన మనస్తత్వం, అంతకన్నా విచిత్రమైన కథ.

అన్నవరం దేవస్థానం ఆస్థాన క్షురకుడి కొడుకు దాసు. తండ్రంటే పడదు. తండ్రి మరణించగానే, ఆయన తాలూకు సిగరెట్ పెట్టెలోనుంచి సిగరెట్ తీసి వెలిగించుకుని, స్వతంత్రం ప్రకటించుకున్న తత్త్వం అతనిది. గురు ముఖతా నేర్చుకోకపోయినా, ఏమాత్రం సాధన లేకపోయినా వేణుగానం అవలీలగా అతని వశమయ్యింది. అతను వేణువు ఊదుతుంటే ఎంతటి వారైనా తన్మయులై వినాల్సిందే.. విచిత్రం ఏమిటంటే అతను ఎన్నో రాగాలు తన వేణువుపై పలికించ గలిగినా, వాటి పేర్లు లక్షణాలు ఏమాత్రం తెలియవు.

అలాంటి దాసు గాలికొండపురం వచ్చాడు.. ప్రభావతి దగ్గర ఆశ్రయం సంపాదించాడు. అతని ప్రతిభ నలుమూలలకీ పాకడానికి ఎక్కువ సమయం పట్టలేదు. వేణుగానంలో అతని ప్రతిభ చూసి మతిపోయినంత పనవుతుంది లీలకి. తను ఎన్నో ఏళ్ళు కఠోర శ్రమ చేసి నేర్చిన విద్యని, అతను ఏ ప్రయత్నమూ లేకుండానే ప్రదర్శించడం చూసిన లీలకు అతని పట్ల అసూయ ప్రారంభమయ్యింది. అతన్ని నాశనం చేయడం కోసం ప్రేమ నాటకం మొదలు పెడుతుంది.

స్వతహాగా అందమైనదీ, అంతకు మించి తెలివైనదీ అయిన లీలకి దాసుని తన దాసుడిగా చేసుకోడానికి యెంతో సమయం పట్టదు. ఇప్పుడు దాసుకు లీల ఎంత చెబితే అంత. సంగీతమైనా, మరేదైనా లీల తర్వాతే. సరిగ్గా అప్పుడే అతని ప్రతిభ అమెరికాలో మ్యూజిక్ కాంపాక్ట్ డిస్కులు తయారుచేసే పార్ధసారథి గారి దృష్టిలో పడుతుంది. ఓ మిత్రుడితో కలిసి గాలికొండపురం వచ్చిన ఆయన, దాసుని తనతో తీసుకెడతానంటాడు.

లీల ని వదిలి ఎక్కడికీ వెళ్ళనంటాడు దాసు. అంత గొప్ప అవకాశం వదులుకోవద్దంటుంది లీల. తమ మ్యూజిక్ స్కూల్ వార్షికోత్సవంలో ప్రదర్శన ఇచ్చి వెళ్ళమని కోరుతుంది.. ఆ ప్రదర్శనకి పార్ధసారథి గారిని ముఖ్య అతిధిగా ఆహ్వానిస్తుంది. దాసు ఆవేశం, అతని బలహీనతలను తెలిసిన లీల అతన్ని నాశనం చేయడానికి ఆ ప్రదర్శనని వేదికగానూ, వేణువుని ఆయుధంగానూ వాడుకుంటుంది. 'స్వాతి' వారపత్రికలో తొలి ప్రచురణ పొందిన ఈ కథ, వంశీ 'ఆనాటి వానచినుకులు' కథా సంకలనం లోనూ చోటు సంపాదించుకుంది.

ఆదివారం, ఆగస్టు 02, 2009

స్నేహం

ఎప్పుడు ఎందుకు ఎలా ఏర్పడుతుందో తెలియని బంధం 'ప్రేమ' అంటారు చాలామంది.. కానీ అది సరి కాదు.. అలా ఏర్పడే బంధం 'స్నేహం.' నిజానికి ప్రేమకి తొలిమెట్టు స్నేహమే. ఇప్పటి మన ప్రాణ స్నేహితులతో మనకి స్నేహం ఎప్పుడు ఎలా కుదిరిందో తల్చుకుంటే చాలా చిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. చిరుపరిచయాలే కాదు, మాట పట్టింపులూ, అభిప్రాయ భేదాలు కూడా మనకి స్నేహితులని తెచ్చిపెడతాయి.

అప్పటివరకు ఆడుతూ పాడుతూ తిరిగి, ఒక్కసారిగా పలక బలపం పట్టుకుని బడికి వెళ్ళిన తొలిరోజును గుర్తు చేసుకుంటే, క్లాసులో మనల్ని చూసి పలకరింపుగా నవ్వి తన పక్కన చోటు చూపించిన వాళ్ళు తప్పకుండా మన బెస్ట్ ఫ్రెండ్స్ జాబితాలో ఉంటారు. హైస్కూలు స్నేహాలు కూడా ఇంచుమించు ఇలాగే ప్రారంభమవుతాయి. చదువు లోనూ, ఆటల్లోనూ మనతో పోటీ పడేవాళ్ళు మనకి స్నేహితులవ్వగానే మనపై వాళ్ళ గెలుపుని మనం స్పోర్టివ్ గా తీసుకోగలుగుతాం.

స్కూలు స్నేహాలకి పూర్తిగా భిన్నమైనవి కాలేజి స్నేహాలు. మనకి తెలియకుండానే ఇక్కడ కొన్ని ఈక్వేషన్స్ పనిచేయడం ప్రారంభిస్తాయి. అందుకే కాబోలు, స్కూలు స్నేహితులతో ఫీలైనంత దగ్గరతనం, కాలేజీ స్నేహితులతో అనుభవించ లేము. స్కూలు స్నేహాలు దొంగతనంగా మామిడికాయలు కోసుకు తినడానికి ప్రోత్సహిస్తే, కాలేజీ స్నేహాలు అమ్మాయిలని రహస్యంగా ఆరాధించడానికి కారణమవుతాయి, చాలామంది అబ్బాయిలకి.

ఉద్యోగం చేసే చోట ఏర్పడే స్నేహాలు చాలా వరకు 'అవసరార్ధపు' స్నేహాలే. ఆ చోటునుంచి ఉద్యోగం మారగానే వాళ్ళలో చాలామందిని సులువుగా మర్చిపోతాం. వాళ్ళతో మళ్ళీ కలిసి పని చేయాల్సొచ్చి నప్పుడు పాత స్నేహాన్ని గుర్తు చేసేసుకోగలుగుతాం. కొంచం ఇంచుమించు ఇరుగుపొరుగులతో స్నేహాలూ ఇలాంటివే. ఐతే ఈ టైపు స్నేహాల్లో చిరకాలం ఉండేవీ ఉంటాయి.

జీవితంలో కొత్త స్నేహితులు ఏర్పడే మరో సందర్భం పెళ్లి. అతని ప్రాణస్నేహితులతో ఆమెకి, ఆమె స్నేహితులతో అతనికీ (ఇష్టం లేకపోయినా) తప్పదు. ఇలాంటి స్నేహాలలో 'అన్నయ్యా..' 'చెల్లెమ్మా..' లాంటి పిలుపులు వినిపించేస్తూ ఉంటాయి. పిల్లల్ని స్కూల్లో వేశాక ఏర్పడేవి మరో రకం స్నేహాలు. వాళ్ళ టీచర్లతోనూ, స్నేహితుల తల్లిదండ్రులతోనూ వద్దన్నా ఫ్రెండ్షిప్ ఏర్పడిపోతుంది. ఈ స్నేహాల్లోనుంచి బోల్డన్ని అపార్ధాలూ, కొండొకచో బోల్డంత హాస్యమూ పుట్టే అవకాశం మెండుగా ఉంది.

స్నేహం మీద బోల్డంత అపనమ్మకం ఏర్పడేది ఎప్పుడంటే పిల్లల్ని కాలేజిలో చేర్చినప్పుడు. 'మనవాడు మంచాడే, కానీ స్నేహాల వల్ల పాడైపోతాడేమో' అని అనుమానించని తలిదండ్రులు బహుశా ఉండరు. మన బంగారం మీద మనకి బోల్డంత నమ్మకం మరి. మన కులదీపకుడు/దీపిక కి మార్కులు తగ్గినా, వాళ్ళు మన చెప్పిన మాట వినక పోయినా అందుకు కారకులు (మన దృష్టిలో) స్నేహితులే..

ముఖపరిచయం లేకుండా, కేవలం అభిప్రాయాలు, అభిరుచులు నచ్చడం వల్ల ఏర్పడే స్నేహం ఒకటి ఉంది. పత్రికలు, తపాలా శాఖ వాళ్ళూ మహారాజ భోగం అనుభవించిన రోజుల్లో దానిని 'కలం స్నేహం' అనేవాళ్ళు.. ఇప్పుడీ ఎలక్ట్రానిక్ యుగంలో దానిని మనం 'ఇ' స్నేహం అంటున్నాం. అలా స్నేహాన్ని ఏర్పరుస్తున్న వేదికలు మన బ్లాగులు. బ్లాగ్మిత్రులందరికీ 'ఫ్రెండ్షిప్ డే' శుభాకాంక్షలు.

శనివారం, ఆగస్టు 01, 2009

సప్తపది

మంచి సినిమా తీయడానికి చక్కని కథ ఎంత అవసరమో, ఆ కథని అంతే చక్కగా చెప్పగలగడమూ అంతే అవసరం. ఈ కథ చెప్పే విధానాన్నే సినిమా పరిభాషలో స్క్రీన్ ప్లే అంటారు. కథని ఎక్కడ ప్రారంభించి ఎక్కడ ముగించాలో, ఏ దృశ్యం తర్వాత ఏ దృశ్యం రావాలో వివరిస్తుంది స్క్రీన్ ప్లే. కె. విశ్వనాధ్ సినిమాల్లో స్క్రీన్ ప్లే పరంగా నాకు బాగా నచ్చిన సినిమాల్లో ఒకటి 'సప్తపది.'

సున్నితమైన కథాంశాన్ని తీసుకుని, దానిని చెప్పాల్సిన విధంగా చెప్పారు విశ్వనాధ్. తనకి ఇష్టమైన ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్ ని సమర్ధవంతంగా ఉపయోగించుకుని, సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ ఎక్కడా ప్రేక్షకులకి ఆసక్తి సడలని విధంగా తీశారీ సినిమాని. ఈ సినిమా మొత్తానికి కేవలం ఒకే ఒక్క సన్నివేశం మాత్రం అనవసరం అనిపిస్తుంది నాకు.

కృష్ణా నది వొడ్డున ఓ పల్లెటూరు. ఆ ఊరి దేవీ ఆలయం పూజారి యాజులు గారు. (జే.వి. సోమయాజులు). ఆయన కొడుకు అవధాని (రమణమూర్తి), మనవడు గౌరీనాధం కూడా అర్చకత్వం చేస్తూ ఉంటారు. ఆ ఊరి పెద్దమనిషి, యాజులు గారి స్నేహితుడు రాజుగారు (అల్లు రామలింగయ్య). ఊరందరికీ వీళ్ళిద్దరూ అంటే భయమూ భక్తీ. వీళ్ళిద్దరూ ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటూ ఉంటారు. ఇంట్లో యాజులు మాటకి కొడుకు, కోడలు అన్నపూర్ణమ్మ (డబ్బింగ్ జానకి) మనవడు ఎదురు చెప్పరు.

ఓ పక్క టైటిల్స్ పడుతుండగానే కథ తాలూకు మూడ్ ని క్రియేట్ చేసి, పాత్రలని ప్రవేశ పెడతారు. టైటిల్స్ అయ్యాక వచ్చే రెండో సన్నివేశంలో కథానాయిక 'హేమ' పరిచయం ఉంటుంది. అమ్మవారి ఉత్సవాల్లో ఆమె నృత్య ప్రదర్శన ఏర్పాటు చేస్తారు రాజుగారు. హేమ ఎవరో కాదు, యాజులు గారి కూతురు జానకి కూతురు. కూతురు ఒక నాట్యాచార్యుడిని పెళ్లి చేసుకుందని ఆమె అంటే కోపం యాజులు గారికి. కూతురు మరణించాక కూడా అల్లుడితోటీ, మనవరాలితోటీ కూడా మాట్లాడడు ఆయన. మరోపక్క ఆయన కొడుకు, కోడలికి హేమని గౌరీనాధానికి ఇచ్చి పెళ్లి చేయాలని ఉంటుంది.

విడిపోయిన రెండు కుటుంబాలనూ కలపాలని రాజుగారు ఈ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. హేమ పై వచ్చే తొలి సన్నివేశంలోనే ఆమె తన డాన్స్ ట్రూపులో వేణువు ఊదే హరిబాబు తో సన్నిహితంగా ఉండడాన్ని చూపిస్తారు. తన నృత్య ప్రదర్శనతో యాజులు గారిని మెప్పిస్తుంది హేమ. తరువాతి సన్నివేశంలో హేమ, హరిబాబు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నట్టు, మూఢాచారాలు, వింత నమ్మకాలు వాళ్లకి అడ్డుపడుతున్నట్టు చూపిస్తారు. వాళ్ళిద్దరూ కలిసి గుళ్ళో ఓ వుయ్యాల కడతారు.

హేమ ప్రదర్శనని మెచ్చుకున్న రాజుగారు, ఆమెని గౌరీనాధానికి ఇచ్చి పెళ్లి చేయమని యాజులుకి సలహా ఇస్తారు. "నాట్యం చేసే పిల్ల" అని యాజులు అభ్యంతరం చెబితే, నాట్యం వేదాల నుంచి పుట్టిందే కదా అని ఒప్పిస్తారు. హేమని ఆలయానికి పిలిచి, వేదగానానికి నాట్యం చేయమని ఆమెకి పరీక్ష పెట్టి, గౌరీనాధానికి, ఆమెకి పెళ్లి జరిపిస్తానని ప్రకటిస్తారు యాజులు. పడవలో తన ఊరికి తిరుగు ప్రయాణమైన హేమకి గతం గుర్తొస్తుంది.

ఒక నాట్య ప్రదర్శనలో హరిబాబు తో పరిచయం, అతని చొరవతో అది ప్రేమగా మారడం. ఆమె తన ప్రేమని వ్యక్త పరిచాక.. అతను తాను 'హరిజనుణ్ణి' అని చెప్పడం.. హేమ తనని పెళ్లి చేసుకోడం కుదరని పక్షంలో ఆమె మరెవ్వరి సొత్తూ కాకూడదన్న 'వింత కోరిక' కోరడం జరుగుతాయి. హరిబాబు తన వివరాలు చెప్పకుండా మోసం చేసినందుకు హేమ అతన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తుందేమో అనిపిస్తుంది.. కానీ హేమ అతనిపై ప్రేమని పోగొట్టుకోదు.

గౌరీనాధంతో హేమ పెళ్లి జరిగాక, ఆమె అతనికి తను నిత్యం పూజించే దేవతలా కనిపించడం తో వాళ్ళిద్దరూ 'పరాయి' వాళ్ళుగానే ఉంటారు. హేమకి పిల్లలు కలగపోవడంతో, ఆమెచేత గుళ్ళో చెట్టుకి వుయ్యాల కట్టించే ప్రయత్నం చేస్తారు. గతం గుర్తొచ్చి కళ్ళు తిరిగి పడిపోతుంది హేమ. గుళ్ళో పూలమ్ముకునే అమ్మాయి నుంచి విషయం తెలుసుకున్న గౌరీనాధం, హేమ ద్వారా హరిబాబు ని గురించి తెలుసుకుని అతన్ని తీసుకురాడానికి బయలుదేరతాడు. మనవరాలిని ఓ హరిజనుడికి ఎలా ఇవ్వాలన్న యాజులు సంశయాన్ని పోగొడతారు రాజుగారు. ఊరివారందరినీ సమాధాన పరిచి, హేమని హరిబాబుతో పంపడం సినిమా ముగింపు.

ముందుగా చెప్పినట్టుగా స్క్రీన్ ప్లే ఈ సినిమాకి బలం అనిపిస్తుంది నాకు, సినిమా చూసిన ప్రతిసారీ. రాజుగారి భార్య, కూతురు ఒకేసారి పురిటికి సిద్ధపడడం ఒక్కటే అనవసరపు సన్నివేశం అనిపిస్తుంది. నిజానికి ఈ సన్నివేశం లేకపోయినా కథకేమీ నష్టం లేదు. విశ్వనాథ్ చాలా సినిమాల్లో లాగే ఇందులోనూ నటులు కనిపించరు..ఆయా పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. స్క్రీన్ ప్లే తర్వాత చెప్పుకోవలసింది పాటల గురించి. మహదేవన్ సంగీతం లో పాటలన్నీ ఆపాత మధురాలే.

సత్యభామచేత వడియాలు పెట్టించడం విశ్వనాధ్ కే చెల్లింది. 'అచ్చెరువున అ-చ్చెరువున విచ్చిన కన్నుల జూడ' 'ఆ రాధ ఆరాధనాగీతి వినిపించ' లాంటి చమక్కులు చూపారు వేటూరి. 'గోవుల్లు తెల్లన' పాటలో జానకి గళ విన్యాసాన్ని తలచుకోకుండా ఉండగలమా? జంధ్యాల పదునైన సంభాషణలు రాశారు.. ముఖ్యంగా కత్తిమీద సాము లాంటి ముగింపు సన్నివేశాల్లో వచ్చే సంభాషణలు గుర్తుండిపోతాయి. ఈ సినిమాలో వర్ణ వ్యవస్థను చిత్రించిన తీరు గురించి చాలా చర్చలే జరిగాయి. నాకైతే ఇది ఎన్నిసార్లు చూసినా విసుగనిపించని సినిమాల్లో ఒకటి. జ్యోతి ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై భీమవరపు బుచ్చి రెడ్డి నిర్మించిన ఈ సినిమా 1981 లో విడుదలై అవార్డులని గెలుచుకుంది.