సుమారు ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగిందీ సంఘటన. ఇప్పుడు బ్లాగు లోకంలో కాపీ కవితల గురించి జరుగుతున్న చర్చ చదువుతుంటే గుర్తొచ్చింది. అవి 'నువ్వేకావాలి' సినిమా విడుదలైన కొత్త రోజులు. సొంత సినిమా కావడంతో ఈటీవీ లో ప్రతి అరగంటకీ ఆ సినిమా ప్రకటన వచ్చేది. ప్రకటనలు చూసీ, చూసీ పాటల పల్లవులన్నీ నోటికి వచ్చేశాయి. అదే సమయంలో ఒకతనితో పరిచయం అయ్యింది. ఉద్యోగం కోసం వచ్చి, ఓ మిత్రుడి సూచన మేరకు నా సలహా కోసం వచ్చాడతను. అతనికి సాహిత్యం మీద కొంచం ఆసక్తి ఉండటంతో తొందరలోనే ఇద్దరి మధ్య బాగా మాట్లాడుకునే చనువు ఏర్పడింది. అతను ఉద్యోగంలో చేరాక కూడా అప్పుడప్పుడూ కలుస్తూ ఉండేవాళ్ళం. ఒక రోజు అలా కలిసినప్పుడు సంభాషణ సాహిత్యం వైపు వెళ్ళింది. "చాలా పుస్తకాలు చదువుతారు కదా..మీరు కవిత్వం ఎందుకు రాయకూడదు?" అని అడగాడతను. నాకెందుకో తనతో జోక్ చేయాలనిపించింది. "రాస్తూనే ఉంటా.. పత్రికల్లో వస్తూ ఉంటాయి కూడా.." అన్నాను నమ్మకంగా.
అతను కొంచం ఎక్సైట్ అయినట్టు కనిపించాడు. "అవునా..నేనెప్పుడూ చదవలేదు.. ఏ పేరుతో రాస్తారు? నా కోసం ఒకటి రాసివ్వరూ ప్లీజ్" అని అడిగాడు. అంతేనా.. కాగితం, కలం ఇచ్చాడు. నాకు అప్పుడే 'నువ్వేకావాలి' ప్రకటన గుర్తొచ్చింది. కొంచం ఆలోచించినట్టు నటించి సీరియస్ గా కాగితం మీద రాసేశా.. 'అనగనగా ఆకాశం ఉంది.. ఆకాశంలో మేఘం ఉంది.. మేఘం వెనుక రాగం ఉంది.. రాగం నింగిని కరిగించింది.. కరిగే నింగి చినుకయ్యింది.. చినుకే చిటపట పాటయ్యింది.. చిటపట పాటే తాకిన్నేల చిలకలు వాలే చెట్టయ్యింది.. రాచిలుక నువ్వేకావాలి.. ఆ రాచిలుక నువ్వేకావాలి..' రాయడం పూర్తి చేసి అతని చేతికిచ్చా.. అతను అదంతా చదివి మళ్ళీ ఎక్సైట్ అయ్యి, "ఎంత బాగుందో.. మీరు సినిమాల్లో ఎందుకు ప్రయత్నించకూడదు?" అని అడిగాడు. "నన్ను మించి నటించేస్తున్నాడు" అని మనసులో అనుకుని, "అక్కడ చాలా మంది ఉన్నారు.. నాకంత ఆసక్తి లేదు" అన్నాను, ముఖం చాలా మామూలుగా పెట్టి. కాస్సేపు మాట్లాడి, అతనా కాగితం పట్టుకుని వెళ్ళిపోయాడు. నేనా విషయమే మర్చిపోయాను.
ఓ వారం రోజుల తర్వాత మళ్ళీ కనిపించాడతను. "మిమ్మల్ని ఇంకెప్పుడూ నమ్మను" అన్నాడు సీరియస్ గా. ఏమైందో నాకు అర్ధం కాలేదు. "మీ కవిత మా బాస్ కి చూపించాను" ..ఉహు.. అప్పటికీ నాకు వెలగలేదు. "మా ఫ్రెండ్ రాశాడండి..సినిమాల్లో ట్రై చేస్తే మంచి పాటల రచయిత అవుతాడు..కానీ అతనికి ఇంటరెస్ట్ లేదట..అని చెప్పాను.. నన్ను పిచ్చోడిని చూసినట్టు చూశారు.." అప్పుడు నాకు విషయం కొంచం అర్ధమైంది.. మళ్ళీ అతనే చెప్పడం కొనసాగించాడు. "ఏం బాబూ.. నువ్వు టీవీ కానీ, సినిమాలు కానీ చూడవా? అని అడిగాడాయన. నా ముఖం చూసి, నిజంగానే నాకు విషయం తెలియదని అర్ధం చేసుకుని, అది సినిమా పాటని చెప్పాడు." ఇతనికి తెలిసీ నన్ను ఆట పట్టించడానికి సినిమాల్లో ప్రయత్నించమన్నాడని అనుకున్నాను నేను. అతను కాగితం భద్రంగా తీసుకెళ్ళినప్పుడు కూడా సందేహించలేదు. "ఉద్యోగం వేటలో సినిమాలు చూడడం కుదరలేదు. రూమ్ లో టీవీ కూడా లేదు.. కొత్త ఆఫీస్ లో నా పరువుపోయింది.. మీరు జోక్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు.. పెద్ద ఫూల్ అయ్యాను.." అతను చెబుతూనే ఉన్నాడు. చాల కష్టపడి అతన్ని కూల్ చేశా. ఆ పాట ఎప్పుడు విన్నా అతని ముఖమే గుర్తుకు వస్తుంది.