ఉత్కంఠ భరితంగా సాగిన 'పాడుతా తీయగా' చిన్నపిల్లల వరుస రెండో సిరీస్ లో విశాఖపట్నానికి చెందిన సాయిరమ్య మొదటి బహుమతి అందుకుంది. హైదరాబాద్ అమ్మాయి దామిని రెండో స్థానంలో నిలబడగా, ఖమ్మానికి చెందిన నూతన, నెల్లూరు జిల్లా తడ నుంచి వచ్చిన శరత్ చంద్ర మూడో స్థానంలో నిలబడ్డారు. విశాఖపట్నం పోర్టు కళావాణి ఆడిటోరియం లో జరిగిన ఫైనల్స్ లో ముఖ్య అతిధిగా పాల్గొన్న సిని దర్శకుడు దాసరి నారాయణ రావు, మొదటి బహుమతి విజేతకి మూడులక్షల రూపాయలు, రెండో బహుమతి విజేతకి లక్ష రూపాయలు, మూడో బహుమతి విజేతలు ఒక్కొక్కరికీ యాభైవేల రూపాయల నగదు బహుమతులు అందించారు.
సాయిరమ్య, దామిని, శరత్ చంద్ర మొదటి ఎపిసోడ్ నుంచీ బాగా పాడుతూ ఉండడంతో వీళ్ళు తప్పకుండా ఫైనల్స్ కి వస్తారు అనుకున్నాను నేను. ఎలాంటి భావాన్నైనా గొంతులో అలవోకగా పలికించగలిగే నూతన పాటల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించడంతో పాటు, చిన్న చిన్న లోపాలని సవరించుకోవడం ద్వారా ఫైనల్స్ కి స్థానం సంపాదించుకుంది. విజయనగరం అమ్మాయి లహరి సైతం ఫైనల్స్ లో తొలిదశ వడపోత వరకూ రాగలిగింది. ఆశ్చర్యకరంగా ఈ సిరీస్ లో మొదటినుంచీ కూడా అబ్బాయిల సంఖ్య బహు తక్కువ. వచ్చిన కొద్దిమందీ ప్రారంభ ఎపిసోడ్లలోనే ఒక్కొక్కరుగా వెను తిరగగా ఒక్క శరత్ చంద్ర మాత్రం చివరివరకూ నిలబడగలిగాడు.
నేను ఊహించిన ముగ్గురూ ఫైనల్స్ కి రావడం సంతోషాన్ని కలిగించినా వీళ్ళలో మొదటి బహుమతి ఎవరిది? అన్న విషయంలో ప్రతి పాటకీ అభిప్రాయం మారిపోతూ వచ్చింది. శరత్ చంద్ర 'అన్నమయ్య' సినిమాలో 'అంతర్యామీ...' పాట పూర్తి చేసిన మరుక్షణం 'ఇతనే విజేత' అనుకున్నాను.. మరో రౌండ్లో దామిని 'మాటే మంత్రము..' పాడిన తీరు చూసి, 'తప్పకుండా మొదటి బహుమతి అందుకుంటుంది..' అన్న అంచనా వచ్చేసింది. సాయిరమ్య, నూతనలూ తక్కువ తినలేదు. అందువల్లనే ఈ సిరీస్ చివరికంటా ఉత్కంఠ కొనసాగింది. కేవలం వాళ్ళ వాళ్ళ పాటల్ని మాత్రమే కాకుండా, వేరొకరికి కోరస్ పాడేటప్పుడూ అదే శ్రద్ధని కొనసాగించారు పిల్లలందరూ.
ప్రారంభ ఎపిసోడ్లతో పోల్చినప్పుడు, సెమి-ఫైనల్స్ దశనుంచీ కార్యక్రమం నాణ్యత బాగా పెరిగిందన్నది నా పరిశీలన. వడపోతల తర్వాత మిగిలిన గాయనీ గాయకులంతా నువ్వా-నేనా అన్నట్టుగా ఉండడమే బహుశా ఇందుకు కారణం. 'పద్యం తెలుగు వారి సొత్తు.. పద్యాలు నేర్చుకుందాం.. మన పిల్లలకి నేర్పిద్దాం' అని వీలున్నప్పుడల్లా చెప్పే కార్యక్రమ వ్యాఖ్యాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పద్యం రౌండు లేకుండానే ఈ సిరీస్ ముగించడం కించిత్ ఆశ్చర్యాన్ని కలిగించింది. చివరి ఎపిసోడ్లో అన్నా పద్యాల రౌండ్ ఉంటుందని ఎదురు చూసి నిరాశ పడ్డాను నేను. కారణం ఏమో తెలీదు కానీ, పద్యాలకి బదులుగా శాస్త్రీయ సంగీత ప్రధానమైన పాటలు పాడారు పిల్లలు.
సాయిరమ్య గొంతులో వినిపించే జీర కారణంగా, శ్రావ్యత కొంచం తగ్గినట్టు అనిపిస్తుంది నాకు. విజేతగా నిలబడడానికి ఆ అమ్మాయికి ఇది ఇబ్బంది కాగలదేమో అనిపించింది నాకు. అయితే, పాటల ఎంపికలో తెలివిగా వ్యవహరించి, తన గాత్ర ధర్మానికి సరిపోయే పాటల్ని మాత్రమే ఎంచుకుని బాగా సాధన చేసి పాడడం ద్వారా తనకి మైనస్ అవుతుందనిపించే అంశాన్నే ప్లస్ గా మార్చుకుంది ఈ అమ్మాయి. ఆత్మవిశ్వాసం పాళ్ళు రవ్వంత ఎక్కువగా కనిపించే దామిని పాటలో 'ప్రొఫెషనలిజం' బాగా ఉంటుందనేది బాలూ తరచూ చెప్పిన మాట. ఇదే ఆమెకి మైనస్ గా మారింది అనుకోవాలా??
ఓ దశలో, 'రాజేశ్' సిరీస్ లో లాగా అమ్మాయిలతో పోటీపడి శరత్ చంద్ర టైటిల్ విజేతగా నిలబడతాడా? అనిపించింది.. అలా నిలబడే అర్హతలు అతనికి ఉన్నాయన్నది నిస్సందేహం. అయితే కంఠస్వరం మారే వయసు కావడం వల్ల, కొన్ని కొన్ని చోట్ల గొంతు అతనికి సహకరించక, కావాల్సిన భావం పూర్తిగా పలకలేదేమో అనిపించింది. మరీ ముఖ్యంగా, చివర్లో పాడిన 'బ్రోచేవారెవరురా..' పాటలో ఈ ఇబ్బంది వినిపించింది నాకు. నూతన అనగానే నాకు మొదట గుర్తొచ్చే పాట 'ప్రతిఘటన' సినిమాలో 'ఈ దుర్యోధన దుశ్శాసన..' క్వార్టర్ ఫైనల్స్ దశలో ఈ అమ్మాయి ఈ పాట పాడినప్పుడు 'అవసరమైన దానికన్నా కొంచం ఎక్కువ భావాన్ని పలికించింది' అనిపించింది. పాటేదైనా దానిని భావయుక్తంగా పాడడం ఈ అమ్మాయి ప్రత్యేకత. వచ్చేవారం నుంచీ టీనేజ్ గాయనీ గాయకులతో కొత్త సిరీస్ ప్రసారం కాబోతోంది.