ఆదివారం, ఆగస్టు 29, 2010

మేరీకమల

మేరీకమలకి తెలుపు రంగంటే ఇష్టం.. ఆకు సంపెంగలంటే ఇష్టం.. బిందెలకి బిందెలు నీళ్ళు ఎత్తి పోసుకోడం ఇష్టం.. పూరీలు, బంగాళాదుంపల కూరంటే ఇష్టం.. 'శారద' సినిమాలో "రేపల్లె వేచెనూ.." పాటంటే ఇష్టం. ఇన్ని ఇష్టాలున్న మేరీకమల అంటే నాకు చాలా ఇష్టం. ఇంతకీ తనెవరో చెప్పలేదు కదూ.. వంశీ 'మా పసలపూడి కథలు' లో ఒక కథలో ప్రధాన పాత్ర. ఆ కథ పేరు 'మేరీకమల.'

ఉత్తమ పురుషలో సాగే ఈ కథ ప్రారంభం అచ్చమైన వంశీ శైలికి ప్రతీక. "చింత చెట్టు కింద పడుకున్న సత్తీరెడ్డి గారి ఎడ్ల డెక్కలు సాపుగా చెక్కి నాడాలేస్తన్నాడు తూర్పు కంసాలి. చెరుకు తోట మధ్యలో ఉన్న అమ్మోరి గుడి మూలల్లో బాగా నాచు పట్టేస్తుంది. జబ్బు చేసిన కుక్క పచ్చ గడ్డి తింటుంది. గోదారి కాలవలో ఉన్న పడవని ఎదురు గాలి అవడం వల్ల ముగ్గురు మగోల్లు తాడేసి లాగుతుంటే పడవలో ఉన్న ఆడమనిషి ఓ పక్కన చుక్కాని చూసుకుంటూ కూరొండుతుంది. ఆరారా అన్నంలో కలుపుకు తినేద్దాం అన్నంత కమ్మని వాసన. తట్టంచేపా వంకాయ ఇగురు.."

పసలపూడి పక్కనే ఉండే రాంపురంలో శంకరనారాయణ గారి హాస్పిటల్లో నర్సు మేరీకమల. పెద్ద పెద్ద కళ్ళతో నల్లగా ఉండే మేరీకమల.. సుతిమెత్తని అడుగులతో ఈ ప్రపంచంలో ఎవర్నీ నొప్పించని మేరీకమల.. "మూగమనసులు సినిమాలో సావిత్రీ, కొత్త దేవదాసు సినిమాలో జయంతీ, అవేకళ్ళు సినిమాలో వెన్నిరాడై నిర్మలా ఈ ముగ్గురి ఫోటోలు కలగలిపితే మేరీ కమల అవుద్ది. వయసులో నాకంటే పెద్దది మేరీకమల" అంటాడు రచయిత.

కష్టపడి పనిచేసే మేరీకమలకి ఎక్కువగా నైట్ డ్యూటీలే వేసేవాళ్ళు హాస్పిటల్ వాళ్ళు. రాత్రి పదింటికి డ్యూటీకి వెళ్తే తెల్లవారి ఆరింటికి తన గదికి తిరిగి వచ్చేది. "నేను ఏడు గంటలకి వెళ్లి కమలా అని పిల్చేవాడ్ని. ఆమె నవ్వుతా తలుపులు తీసేది.." ఆమె స్వస్థలం కోటిపల్లి పక్కన గోదారి గట్టు దిగువలో ఉన్న కోట. ఈలి వాడపల్లి గారి హాస్టల్లో చదువుకున్నప్పుడు క్రిష్టియన్ మతం పుచ్చుకుంది. హాస్టల్లో ఉండగానే కారు డ్రైవర్ చందర్రావుని లవ్ చేసి పెళ్లి చేసుకుంది.

చందర్రావుని తను భరించలేదని అర్ధమయ్యాక నర్సు ట్రైనింగ్ అయ్యి హాస్పిటల్లో చేరింది మేరీకమల. సోమేశ్వరం గుళ్ళో ఈవో గా పని చేస్తున్న బడుగు కృష్ణారావు ఆమెని ఇష్టపడి రెండో పెళ్లి చేసుకున్నాడు. అతనికి భార్యా, పిల్లలూ ఉన్నారు. ఈ పెళ్లి సంగతి ఇంట్లో చెప్పలేదు. "రెండు సార్లు పెళ్లి చేసుకున్న ఆ మనిషి వెనకాల బడడం కరెక్టా అని చాలాసార్లు అనుకున్నాను. కాదు అని ఓ పక్క అనిపిస్తున్నా తిరిగి మళ్ళా ఆ మనిషే కావాలనిపిస్తుంది. ఆ నవ్వూ, పలకరింపూ కావాలనిపిస్తున్నాయి."

"ప్రతిరోజూ పూరీల పొట్లం పట్టుకెళ్ళి ఇస్తుంటే సగం నిద్రోతూనే తినేది. రేపల్లి వీచెనో పాట పాడ్తుంటే ఎక్కడ నోచ్చుకుంటానో అని ఇబ్బంది పడతా వినేది. నీకు తెలుపంటే ఇష్టం గదా నీకు పండక్కి తెల్లచీర కొని తెస్తాను అని నేనంటే నా మోచేతిమీద చెయ్యేసి 'ఆడోల్లు చీర ముడేసి మూడునాలుగుసార్లు చుట్టి కుచ్చెళ్లు దోపుకుంటారు గదా.. నేను మట్టుకు ముడేసాకా చుట్టుకోకుండా నేనే గిరగిరా తిరుగుతాను తెల్సా' అంది. 'ప్రతి రోజూ అంతేనా?' అన్నాను. 'చీర కట్టుకోడం మొదలెట్టినప్పట్నించీ' అంది"

రోజూ పూరీలు తెచ్చిచ్చి, పాటలు పాడి వెళ్ళే కుర్రాడితో తన స్నేహాన్ని గురించి కృష్ణారావుకి తెలిస్తే బాగోదేమో అని సందేహిస్తుంది మేరీకమల. అందుకే అతన్ని ఇంటికి వచ్చి మాట్లాడడం కన్నా ఉత్తరాలు రాయమని ప్రోత్సహించింది. "నువ్వు నా ముందు మాట్లాడ్డం కంటే నువ్వు రాసే ఉత్తరాలే బాగుంటాయి మర్చిపోకేం" అంటూ సాగనంపింది. "నేను రాసే ఉత్తరాలు చీర మడతల్లో కలరా ఉండలు మధ్య పెట్టి, జాగ్రత్తగా దాచుకునేది." ఆమె విచిత్రమైన చీరకట్టు, అతను ఆమెకి రాసిన ఉత్తరాలు ఆమె కథని ఏదరికి చేర్చాయన్నదే 'మేరీకమల' కథ ముగింపు.

ఆదివారం, ఆగస్టు 22, 2010

రేచకుడు

"మిలటరీ కుర్చీలో కాళ్ళు బారజాపుకుని కూర్చుని ఉన్నాడు బత్తుల రేచకుడు. వాక్యం తప్పు: కాలు బారజాపుకుని కూర్చున్నాడు. ఒక కాలు మోకాలి వరకు లేకపోవడం స్పష్టంగా తెలుస్తోంది. నోట్లో రెండు వేళ్ళ మందాన చుట్ట వెలుగుతోంది.." ఇవీ రేచకుడిని గురించి గొల్లపూడి మారుతిరావు తన నవల 'సాయంకాలమైంది' లో రాసిన పరిచయ వాక్యాలు. ఈ నవలలో 'నవనీతం' తర్వాత నాకు అంత బాగా నచ్చిన మరో పాత్ర రేచకుడు.

నవలలో ఓ ప్రధాన పాత్ర తిరుమల అనబడే చిన్న తిరుమలాచార్యులు అమెరికా వెళ్ళిన మూడేళ్ళ తర్వాత తొలిసారి దేశానికి వచ్చిన సందర్భంలో, అమెరికా మిత్రుడు విష్ణుమూర్తి కోరిక మేరకు అతని తండ్రి రేచకుడిని చూడడానికి విశాఖపట్నం నుంచి గిరిగాం వెళ్తాడు. తిరుమల అలా తన ఇంటికి రావడం రేచకుడికి ఏమాత్రం ఇష్టం లేదు. ఆ అయిష్టతకి కారణం నెమ్మది నెమ్మదిగా బోధపడింది తిరుమలకి.

"ఆడెలా ఉన్నాడు బాబూ? పెద్ద ఉద్యోగం చేస్తున్నాడా? ఆడెలా ఉంటాడో కాస్త సెప్పు బాబూ! నీలాగా సూటేత్తాడా? నీలాగా నల్ల కళ్ళద్దాలెడతాడా?..." రేచకుడి ప్రతి ప్రశ్న వెనుకా ఆసక్తే కానీ ఆర్తి లేదు. ఉత్సాహమే కానీ ఉద్విగ్నత లేదు. అంత ఆనంద పడుతున్న తండ్రిని ఎప్పుడూ చూడలేదు తిరుమల. అతనికి బిడ్డల్ని చూడాలని బెంగ పెట్టుకునే తల్లిదండ్రులే తెలుసు. ఆలోచనల్లోనే ఆనందాన్ని జుర్రుకుంటున్న రేచకుడు కొత్తగా కనిపించాడు. "మీకు కాలు లేదని మీ అబ్బాయి నాకు చెప్పలేదే?" అన్నాడు ప్రశ్నార్ధకంగా.

"నాక్కాలు లేకపొతే ఆడికేమయింది బాబూ! గిరిగాం రైతు నాకొడుక్కి కాలుంటేనేం పోతేనేం? నా కొడుకు దొర. సీమలో పెద్ద ఉద్యోగం సేత్తున్నాడు. అది చాలు నాకు." ...కాలు ఎలా పోయిందో రేచకుడి మాటల్లోనే: "మనకి ఒంటి నిండా సక్కెరే బాబూ! తీపి తినక్కరలేదు. సిన్నప్పట్నుంచీ నేను ఇమాం పసందు అంటే పీక్కోసుకుంటాను. ఆరువేల పళ్ళు దింపుతాను. ఎండలు ముదిరి, తొలకరిదాకా ఎంత లేదన్నా రెండొందల పళ్ళు తింటాను. నీయవ్వ.. పోతే దొర బిడ్డలాగా పోవాలి కానీ, ఏడుత్తూ బతికితే ఏం లాభం?"

ఈ వార్త కొడుక్కి చెప్పక పోవడమే కాదు, అతనికి తల్లిదండ్రుల్ని మర్చిపోవడం కూడా అలవాటు చేస్తున్నాడు రేచకుడు. వీధి బడిలో ఆరో క్లాసు చదివిన పక్క రైతు తనని యెగతాళి చేస్తే, ఆ పంతంతో అతనికి బుద్ధి చెప్పడం కోసం కొడుకుని శ్రీకాకుళం లో పెట్టి చదివించాడు రేచకుడు. కొడుకు ఇంగ్లీష్ చదివితే పొంగిపోయాడు. వ్యవసాయం చేస్తానంటే వద్దన్నాడు. గొడవ పెట్టి అతన్ని అమెరికా పంపాడు. తర్వాతి ముప్ఫయ్యేళ్ళ కాలంలో కొడుకుని కేవలం ఆరుసార్లు చూశాడు రేచకుడు. చివరిసారి చూసింది ఆరేళ్ళ నాడు.

"సచ్చి కాటికెల్లేనాడు మనకెవడు దగ్గర బాబూ? మనకి సేవలు సేయ్యలేదని ఆళ్ళ బతుకెందుకు పాడుసెయ్యాల? ఆడు నాకెందుకు సేవ సెయ్యాల? ఆడి బతుకు ఆడు బతకాల" ఇదీ రేచకుడి సిద్ధాంతం. ముప్ఫయ్యేళ్ళుగా విష్ణుమూర్తి పంపిన వస్తువులన్నీ ఓ గది నిండా బొమ్మల కొలువులా తీర్చి దిద్దాడు రేచకుడు. గెంతుకుంటూ వెళ్లి ఓ శాలువా తీసి "ఈ సిల్కు గుడ్డ ఆల్లమ్మ కోసం పంపించాడు ఆరు నెలల కిందట!" అన్నాడు గర్వంగా. "మరి ఆవిడ వాడుకోలేదేం?" అన్న తిరుమల ప్రశ్న ఒక జోక్ లాగా అనిపించింది రేచకుడికి.

"ఎలా వాడుతాదయ్యా! ఈ లోకంలో ఉంటేగా వాడుకోడానికి! ...సచ్చిపోయి నాలుగేళ్లయింది. సచ్చిపోయిన తల్లిని నాలుగేళ్ళు ఆడి మనస్సులో బతికించాను. నేను గొప్పొన్నా, కాదా సెప్పు బాబూ!" ..."అమెరికా నుంచి వస్తే కాలుపోయిన నాన్ననీ, సచ్చిపోయిన తల్లినీ తల్చుకు ఏడుత్తాడని పూర్ణయ్య పంతులు గారితో చెప్పి అవాకులూ చెవాకులూ రాయిత్తాను. ఉత్తరాల్లో నేను రెండు సార్లు యాత్రలకెల్లాను. ఓసారి కాశీ ఎల్లాను. నిజానికి గిరిగాం దాటి ఎక్కడికీ పోలేదు.."

ఇంతటి రేచకుడూ భార్య చివరి క్షణాల్లో ఆమెకిచ్చిన మాటకోసం తనకెంతో ఇష్టమైన ఇమాం పసందు తినడం మానేశాడు. "తల్లి చావునే కొడుకు నుంచి దాచి మోసం చేస్తున్న మీరు మీ ఆవిడకిచ్చిన మాటని తప్పలేరా?" అన్న తిరుమల ప్రశ్నకి గిలగిల్లాడిపోయాడు రేచకుడు. "కొడుకుని మోసం సేసేది ఆడ్ని బాధపెట్టే హక్కు నాకు లేదని. నా పెళ్ళాన్ని మోసం సెయ్యనిది దాన్ని సుఖపెట్టే అవకాశం ఇంక రాదని" ఈ మాటలంటున్నప్పుడు రేచకుడి కనుకొలకులలో మంచిముత్యం లాంటి నీటిచుక్క తళుక్కుమంది.

చూసినదేదీ తన కొడుక్కి చెప్పొద్దని తిరుమలని కోరి, కారెక్కబోతున్న తిరుమల భుజం మీద చెయ్యివేసి ఆపి రేచకుడు అడిగిన ప్రశ్న: "వచ్చినప్పట్నుంచీ సూత్తున్నాను. నువ్వు తొడుక్కునే కోటు ఎంతుంటాది?" .."కనీసం మూడువేలు"... బొడ్డులోంచి మడతలు పడ్డ నోట్ల కట్టలోంచి మూడువేలు తీసి "ఈ రంగు మా బుల్లోడికి శానా బాగుంటాది. ఈ అయ్య కొనిచ్చాడని ఆడికి నువ్వు కొనియ్యి!" అన్నాడు రేచకుడు.

బుధవారం, ఆగస్టు 18, 2010

పాటల ముసలయ్య

మా ముసలయ్య గారి ఇంటి పేరు 'పాటల' కాదు. కానీ అదేమిటో ఆయన్ని అందరూ పాటల ముసలయ్య అనే పిలిచేవాళ్ళు. తను ఘంటసాల అంతటి వాడినని మా ముసలయ్య గారు ఎప్పుడైనా అనుకున్నారో లేదో తెలీదు కానీ, మా ఊరి వాళ్ళు మాత్రం "మైకందుకున్నాడ్రా మన గంటసాల" అనే వాళ్ళు, మైకులో ఆయన పాట వినిపించగానే. ముసలయ్య గారికీ, మైకుకీ అవినాభావ సంబంధం మరి.

పండుగలు పబ్బాలకే కాదు, ఎవరింట్లో ఎలాంటి శుభకార్యం జరిగినా మైకుసెట్టు బిగించడం మా ఊళ్ళో ఆనవాయితీ. ఘంటసాల 'నమో వేంకటేశా..' అనడం ఆలస్యం. మా ముసలయ్య గారు మైకుసెట్టు దగ్గర వాలిపోయేవాళ్లు. "శవం కాడ గెద్ద కూడా అంత బేగా వాల్దు" అని కిట్టని వాళ్ళు అనుకున్నా ఆయన లెక్క చేసేవాళ్ళు కాదు. మైకందుకుని తన గొంతు విప్పే వాళ్ళు. చిన్ననాడు తను నేర్చుకున్న శతక పద్యాల మొదలు, భజన పాటలు, తాజా సినిమా పాటల వరకూ తన స్టైల్లో పాడేసేవాళ్ళు.

ముసలయ్య గారు మైకందుకున్నారంటే హీనపక్షం రెండు మూడు గంటలపాటు తన విద్యని ప్రదర్శించే వాళ్ళు. ఆయన మా ఊళ్ళో కుంచం పెద్దమనిషి మరియు సాధు స్వభావి అవ్వడం వల్ల ఊళ్ళో అందరికీ కొద్దో గొప్పో మొహమాటం ఉండేది. ఆ మొహమాటం చేత ఆయన మైకందుకున్నా ఎవరూ 'వద్దు' అనలేక పోయేవాళ్ళు. వెనకాల తిట్టుకోవడం మాత్రం మర్చిపోయేవాళ్ళు కాదు.

అప్పట్లో దేవుడి కల్యాణానికి మా ఊరి కుర్రాళ్ళంతా కలిసి ఒక నాటకం వేశారు. పొరుగూరి నుంచి హీరోయిన్ని తీసుకురాడానికి బడ్జెట్ ఒప్పుకోక పోవడంతో ముసలయ్య గారి చేత హీరోయిన్ వేషం వేయించేశారు. ఆయనది కుంచం కీచు గొంతు అవడం వల్లనూ, దానిని మరికొంచం కీచు చేసి ఆయన డైలాగులు చెప్పినందు వల్లనూ వేషం బాగానే పండింది. వీరోవిన్ వేషం కట్టింది ముసలయ్య గారని తెలిసిపోవడం వల్ల జనం కొంచం ఎక్కువగానే ఎంజాయ్ చేశారు.

ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చిందని పెద్దాళ్ళు ఊరికే అనలేదు కదా.. అలా ముసలయ్య గారి హీరోయిన్ వేషం మాకు కొత్త సమస్యలు తెచ్చి పెట్టింది. మైకందుకున్న ప్రతిసారీ పద్యాలు, పాటలు అనంతరం ఆయన మొత్తం నాటకం స్క్రిప్టు ని మైకులో చదివేసేవాళ్ళు. అంటే మొదట్లో పాడే 'వందే వందే కళామ తల్లీ' మొదలు చివర్లో పాడే 'జన గణ మన..' వరకూ (అప్పట్లో పాడే వాళ్ళు). అది కూడా ఆయా పాత్రలకి గొంతులు మార్చి మరీ వినిపించే వాళ్ళు.

మైకుసెట్టు కుర్రాడికి మాత్రం ఇది బాగా కలిసొచ్చింది. మైకు బిగించి, గొట్టాన్ని ముసలయ్యగారి చేతిలో పెట్టి తన పనులు చూసుకోడానికి వెళ్ళిపోయేవాడు. ఆయన అక్కడినుంచి కదలరు కాబట్టి సెట్టుకి కాపలా కాయక్కర్లా. రికార్డులు మార్చే పని అసలే లేదు. అలా ముసలయ్యగారి మైకు సెట్టు కుర్రాడిగా మారిపోయారు. కుర్రాడు వచ్చే వరకూ ఆయన మైకులో పాడుతూనో, మాట్లాడుతూనో ఉండేవాళ్ళు.

మైకుసెట్టు కోసం చకోర పక్షుల్లా ఎదురు చూసే నాలాంటి వాళ్ళ పాలిట మాత్రం ఇది పిడుగుపాటే. ఎందుకంటే నాటకం పుణ్యమా అని మైకు ముసలయ్యగారి చేతిలో ఒక పూటంతా ఉండిపోతోంది మరి. ఇదిలా ఉండగా మా ఊళ్ళో ఏడో తరగతి ఫెయిలై ఆ తర్వాత కరెంటు పని నేర్చుకున్న కుర్రాడొకడు సరికొత్త మైకుసెట్టు మరియు రికార్డులు కొన్నాడు. లోకల్ ఫీలింగ్ కొంత, కొత్త పాటల మీద అభిమానం కొంత పని చేసి మా ఊరి వాళ్ళు మైకు సెట్టుకి ఇతన్నే పిలవడం మొదలు పెట్టారు.

ఈ కొత్త మైకు సెట్టు కుర్రాడు మరెవరో కాదు, సాక్షాత్తూ మా పాలిట దేవుడు. ఎందుకంటే ముసలయ్యగారికి మైకు ఇవ్వనని మొదట్లోనే నిర్మొహమాటంగా చెప్పేశాడు. ఆయన మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తగు మాత్రం పెద్దమనుషులందరి దగ్గరా ఆయన ఆ విషయం చెప్పుకుని బాధ పడ్డారు కూడా. పెద్ద మనుషులంతా ఆయన దగ్గర మైకు సెట్టు కుర్రాడిని "ఎదవకి కుర్రతనం" అని తిట్టినా, అతన్ని పిలిచి ఏమిటని అడగలేదు, పిలవడం మానలేదు.

ఊళ్లోకి మైకు సెట్టు వస్తోంది, వెళ్తోంది.. ముసలయ్యగారి పాట మాత్రం వినిపించడం లేదు. ఆయన కూడా మైకు సెట్టు కుర్రాడి మీద కంప్లైంట్ చేయడం మానేశారు. రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఉన్నట్టుండి మైకులో ముసలయ్యగారి గొంతు ఖంగుమంది. ఊరు ఉలిక్కిపడింది. ఎప్పుడూ ఆయన పాడే 'సినిమా-భక్తి' గీతాలే. కానీ ఎక్కడో చిన్న తేడా.

కొంచం శ్రద్ధగా వింటే అర్ధమయ్యింది. ఆయన తన పాటల్లో ముక్కోటి దేవతలని స్తుతించడం లేదు. ప్రభువు మహిమల్ని కీర్తిస్తున్నారు. బాణీలు అవే అయినా సాహిత్యం మారింది. పల్లెటూళ్ళో ఏ వార్త అయినా ఓ చివరి నుంచి మరో చివరికి పాకడానికి పది నిమిషాలు చాలా ఎక్కువ. పదో నిమిషం గడవక ముందే తెలిసిన విషయం ఏమిటంటే మా ఊళ్ళో కొత్తగా ఒక చర్చి మొదలు పెట్టారు.

పూరి గుడిసెలో మొదలు పెట్టిన చర్చికి కొయిటా వారొకరు మైకుసెట్టు కానుకగా చదివించారు. ముసలయ్య గారు క్రైస్తవ భక్తి గీతాలు ఆలపిస్తాననగానే చర్చి పాస్టర్ గారు చాలా ఆనందంగా మైకు ఆయన చేతికి ఇచ్చారు. అయితే ఊరు ఊరుకోలేదు. మైకు సెట్టు కుర్రాడిని ఏమీ అన్ని పెద్దమనుషులు 'ఏటండీ మతం మారిపోతన్నారా?' అంటూ ముసలయ్య గారిని నిలదీశారు.

ముసలయ్యగారు అస్సలు ఆవేశ పడలేదు. "పాటకి మతవేటండీ.. మన గుడికాడ మైకెట్టించి పిలండి, మన పాటలు పాడకపోతే అడగండి" అనేశారు. పెద్ద మనుషులెవరూ అంత ధైర్యం చేయలేదు. చర్చి వాళ్ళు మర్యాద పూర్వకంగా 'వద్దు' అని చెప్పే వరకూ ముసలయ్యగారు అక్కడ పాటలు పాడుతూనే ఉన్నారు. ప్రభువు మమ్మల్ని రక్షించడానికి చాలా కాలమే పట్టింది.

సోమవారం, ఆగస్టు 09, 2010

మర్యాద రామన్న

హీరోగా తొలి సినిమా 'అందాల రాముడు' తోనే తనని తాను ప్రూవ్ చేసుకున్న హాస్య నటుడు సునీల్ కథానాయకుడిగా రూపొందిన రెండో సినిమా 'మర్యాద రామన్న.' భారీ చిత్రాల దర్శకుడిగా పేరొందిన ఎస్.ఎస్. రాజమౌళి దర్శకుడు. షూటింగ్ జరుగుతున్నంతసేపూ సినిమా రాజమౌళి పంధాలో ఉంటుందా లేక సునీల్ సినిమాలా ఉంటుందా? అన్న కుతూహలం వెంటాడింది నన్ను. చూశాక 'సునీల్ సినిమానే' అనిపించింది.

బుద్ధిమంతుడైన రాము (సునీల్) కథ ఇది. అతనో అనాధ. హైదరాబాద్ లో చిన్న చిన్న పనులు చేస్తూ పొట్ట పోసుకుంటూ ఉంటాడు. ఉద్యోగం పోవడం, ఎక్కడో రాయలసీమలో పూర్వీకుల ఆస్తి కలసిరావడం ఒకేసారి జరుగుతాయి. ఆ ఆస్తి అమ్మేసి ఒక ఆటో కొనుక్కుని కొత్త జీవితం మొదలు పెట్టాలన్నది రాము ఆలోచన. మిత్రులు వారిస్తున్నా వినకుండా సీమ కి బయలుదేరతాడు. రైల్లో అపర్ణ (సలోని) పరిచయం అవుతుంది.

సరదా రైలు ప్రయాణం తర్వాత గమ్యం చేరుకున్న రాము ఊహించని విధంగా చిక్కుల్లో పడతాడు. తను అడుగుపెట్టింది సాక్షాత్తూ తనని చంపడం కోసం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న తన శత్రువు రామినీడు (నూతన నటుడు నాగినీడు) ఇంట్లోనే అని తెలిశాక అతని అవస్థ వర్ణనాతీతం. పైగా తనకి రైల్లో పరిచయమైన అపర్ణ మరెవరో కాదు, రామినీడు ముద్దుల కూతురు. రాము తన ప్రాణాలనీ, అపర్ణనీ ఎలా దక్కించుకున్నాడన్నది మిగిలిన కథ.


కమెడియన్ హీరోగా సినిమా అనగానే అతని రూపురేఖలతోనో, ద్వందార్ధపు దైలాగులతోనో హాస్యం పుట్టించే ప్రయత్నాలు జరగడం సహజం. అలా కాకుండా కేవలం కథ నుంచీ, సన్నివేశాల నుంచీ క్లీన్ కామెడీ సృష్టించిన రాజమౌళి అభినందనీయుడు. కొంచం పెద్దదే అయినా మొదటి సగంలో వచ్చే ట్రైన్ ఎపిసోడ్ ఆకట్టుకుంది. ట్రైన్ లో వచ్చే 'అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది..' పాట సరదాగా సాగింది, చిత్రీకరణ కూడా.

సినిమా మొదటి సగం తో పోల్చినప్పుడు రెండో సగం తేలిపోయినట్టుగా అనిపించింది. రెండో సగంలో బలమైన సన్నివేశాలు లోపించడం ఒక కారణం కాగా, హీరో కేవలం ప్రతి చర్యలకి మాత్రమే పరిమితం కావడం మరో కారణం. 'తెలుగమ్మాయి..' పాట చూస్తున్నంత సేపూ 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే..' సినిమాలో 'అల్లంత దూరాన ఒక తారక..' పాట గుర్తొస్తూనే ఉంది. అలాగే ముగింపు సన్నివేశం చూడగానే 'అందాల రాముడు' ముగింపు గుర్తొచ్చేసింది.

నటన పరంగా మొదట చెప్పుకోవాల్సింది రాము గా సునీల్ గురించి, వెనువెంటనే చెప్పుకోవాల్సింది రామినీడు గా నటించిన నాగినీడు గురించి. బరువు తగ్గి నాజూగ్గా కనిపించిన సునీల్ కొన్ని కొన్ని సన్నివేశాల్లో చిరంజీవిని అనుకరించడం కావాలని చేసిందో లేక యాద్రుచ్చికమో అర్ధం కాలేదు. నటనతో పాటు డేన్సులూ బాగా చేశాడు. ముఖ్యంగా 'రాయే సలోని' పాటకి సునీల్ వేసిన స్టెప్పులు ఆకట్టుకున్నాయి. నాగినీడు మాట్లాడే రాయలసీమ యాసలో అక్కడక్కడా కృష్ణా జిల్లా యాస వినిపించడం కొరుకుడు పడలేదు. మరికొంచం శ్రద్ధ తీసుకోవాల్సింది.

హీరోయిన్ సలోని పర్లేదు. బ్రహ్మాజీకి మరోసారి 'త్యాగపూరితమైన' పాత్ర దొరికింది. ఈ తరం శరత్ బాబు అనాలేమో ఇతన్ని. రావు రమేష్ ని ఒక సీన్ కే పరిమితం చేశారు. కథ, మాటలు రాసిన ఎస్.ఎస్. కంచి ('అమృతం' ఫేం) ఒక హాస్య పాత్రని కూడా పోషించి మెప్పించాడు. కీరవాణి సంగీతం లో పాటలు బాగున్నాయి. ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగిన ఈ సినిమాని కుటుంబ సభ్యులతో కలిసి నిర్భయంగా చూడొచ్చు.

ఆదివారం, ఆగస్టు 01, 2010

ఇలా జరక్కపోతే బాగుండును..

....ఉదయం నుంచి ఇప్పటివరకూ ఈ మాట ఎన్నిసార్లు అనుకున్నానో లెక్క లేదు. ఉదయాన్నే కాఫీ తాగుతూ పేపర్లు చదివే సమయంలో 'సాక్షి' ఫ్యామిలీ సెక్షన్ దగ్గర ఒక్కసారి ఆగాను. 'రీచార్జ్' అనే వారాంతపు కాలమ్ లో 'Hello శంకర్ శాస్త్రి' శీర్షికతో 'శంకరాభరణం' సినిమా గురించి సచిత్ర కథనం. విడుదలై మూడు దశాబ్దాలు గడిచాక ఈ సినిమా గురించి ఇప్పుడు కొత్తగా ఏం రాసి ఉంటారా అనే ఆసక్తి తో మిగిలిన పేపర్లు పక్కన పెట్టి చదవడం మొదలు పెట్టాను. నాలుగు పేరాలు చదవగానే ఎక్కడో చదివినట్టు అనిపించడం మొదలైంది. మరో రెండు పేరాలు చదివేసరికి అర్ధమయ్యింది...వంశీ రాసిన 'వెండితెర నవలలు' నుంచి మక్కీ కి మక్కీ దించేశారని.

కథనం రాసిన ప్రియదర్శిని రాం తన ఫోటోను ప్రచురించుకోవడంతో పాటు చివర్లో ఇన్ పుట్స్ అంటూ మరో ఇద్దరి పేర్లు రాశారు కానీ, ఎక్కడా 'వెండితెర నవలలు' పుస్తకాన్ని ప్రస్తావించలేదు. 'శంకరాభరణం' గురించి వైవిధ్యంగా ఏమన్నా రాసి ఉంటే బాగుండేది.. 'సాక్షి' వారికి ఇది అసాధ్యమైన విషయం ఏమీ కాదు. లేదూ, కనీసం ప్రచురించిన కథనానికి మూలాధారమైన పుస్తకానికి క్రెడిట్ ఇచ్చినా బాగానే ఉండేది.. ఈ రెండూ జరక్కపోవడం దురదృష్టకరం. ఇది కేవలం 'పొరపాటు' అని సరిపెట్టుకోలేక పోతున్నాను నేను.