శనివారం, ఏప్రిల్ 30, 2011

గీతాకృష్ణ కాఫీబార్

కొందరు దర్శకులు సినిమాని కొంచమైనా "డిఫరెంట్ గా తీస్తారు" అని ఓ నమ్మకం నాకు. ఆ కొందరి జాబితాలో గీతాకృష్ణకీ స్థానం ఉంది. 'సంకీర్తన,' 'కోకిల,' 'కీచురాళ్ళు' ఇంకా నిన్న మొన్నటి అంతగా కలిసిరాని 'టైం' వరకూ తను తీసిన సినిమాలు జయాపజయాలకి అతీతంగా యెంతో కొంత నవ్యతతో ఉండడం నేను గమనించిన విషయం. కొన్ని కొన్ని సార్లు గీతాకృష్ణ ఆలోచనలు చాలా అడ్వాన్సుడు గా ఉంటాయనిపిస్తుంది నాకు. కేవలం గీతాకృష్ణ మీద నాకున్న నమ్మకం కారణంగా చూసిన సినిమా నిన్న విడుదలైన 'గీతాకృష్ణ కాఫీబార్.'

రెండేళ్ళకి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకి గీతాకృష్ణ కథ, స్క్రీన్ప్లే, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలతో పాటు సంగీతాన్నీ సమకూర్చారు. ప్రధమార్ధంలో ఎక్కడ గీతాకృష్ణ మార్కు కనిపించని విధంగా సాగిన సినిమా, ఇంటర్వల్ కి వచ్చేసరికి కథకి కీలకమైన ముడిపడి, ద్వితీయార్ధం అంతా చకచకా సాగుతూ కొంత సాగతీత ముగింపు దృశ్యాలతో ముగిసింది. మొదటిసగం కలిగించిన నిరాశను, రెండో సగం కొంతమేరకి తొలగించడంతో సినిమా ముగిసే సమయానికి "అనవసరంగా బలయ్యాం" అన్న భావన కలగలేదు.

సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ మానవుడు తన మెదడుని ఉపయోగించగలిగిన దానిలో కనీసం ఒక్క శాతం కూడా పూర్తిగా ఉపయోగించడం లేదనీ, కనీసం పది శాతం ఉపయోగించినా ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయంటూ జాతికి చేసిన సూచననీ, ఉగ్రవాదం తీవ్రవాదం పెచ్చరిల్లిన ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపమన్న మహాత్ముడి సిద్ధాంతాన్ని ఆచరించడం ఎంతవరకూ సమంజసం అన్న ప్రశ్ననీ కలిపి అల్లుకున్న కథ ఇది. కొంచం గందరగోళంగా అనిపిస్తోంది కదూ? సినిమా ప్రధమార్ధం కూడా ఇలాగే గందరగోళంగా సాగింది.

చిన్నప్పుడే తండ్రినీ, పెద్దయ్యాక తల్లినీ కోల్పోయిన యువకుడు రామకృష్ణ (శశాంక్) కి తను చాలా మేధావిననీ, మేధస్సుతో ఏమైనా సాధించవచ్చుననీ గట్టి నమ్మకం. ఆ నమ్మకంతోనే చేతిలో సర్టిఫికెట్లు లేకపోయినా, కేవలం తన మేధస్సుతో ఉద్యోగం సంపాదించడం కోసం హైదరాబాద్ బయలుదేరతాడు. ప్రయాణంలో తనలాగే అనాధ అయిన చిన్నపాప శివాని (బేబి శివాని) పరిచయమవుతుంది. భాగ్యనగరం చేరుకున్నాక రేడియో జాకీ సృజన (బియాంక దేశాయ్) తో ఓచిన్న తగువుతో మొదలైన పరిచయం ఇంటర్వల్ నాటికి ప్రేమగా మారుతుంది.

ప్రారంభ సన్నివేశాలతో సినిమాపై ఆసక్తిని పెంచిన దర్శకుడు దానిని నిలబెట్ట లేకపోయాడు. పాత్రల పరిచయం అయ్యాక, కథలాంటిది ఏదీ మొదలు కాకపోగా, అనవసర సన్నివేశాలు వస్తూ పోతూ స్క్రీన్ టైం వృధా అవుతున్న భావన కలిగించాయి. మాటకి ముందు హీరో 'నేను జీనియస్ ని కదా' అనడం విసుగు రప్పించింది. ఓ అపరిచితుడితో జరిగిన చిన్న వాగ్వాదం తర్వాత, తనకో లక్ష రూపాయలిస్తే తన మేధస్సుని ఉపయోగించి ఏడాది తిరిగేసరికల్లా దానిని కోటి రూపాయలు చేస్తానని చాలెంజ్ చేస్తాడు రామకృష్ణ. అయితే, ఆ అపరిచితుడు లక్ష కి బదులు కోటి రూపాయలు ఇస్తాననీ, ఏడాదికల్లా దానిని వంద కోట్లు చేయాలనీ షరతు విధించడంతో కథ విశ్రాంతికి చేరింది.

నిజానికి సినిమాని ఈ పాయింట్ నుంచి మొదలు పెట్టి చాలా బాగుండేది కదా అనిపించింది, రెండోభాగం నడిచిన తీరు గమనించాక. దర్శకుడిగా తన పనితనాన్ని రెండో సగంలో చూపించాడు గీతాకృష్ణ. చాలా సీరియస్గా సాగిన రెండో సగంలో కథకీ, అప్పటికే హీరో పాత్రని నాన్-సీరియస్ గా ఎస్టాబ్లిష్ చేసిన తీరుకీ పొసగలేదు. అప్పటికే స్క్రీన్ టైం సగం అయిపోవడంతో హీరోకి తన మేధస్సుని చూపించే అవకాశం పూర్తిగా దొరకలేదు. తాజ్ హోటల్ మీద టెర్రరిస్ట్ దాడి జరిగిన కాలంలో రాసుకున్న కథ కావడం వల్ల కాస్త పాతబడినట్టుగా అనిపించినా, ఆ తరహా దాడులు వాటిపట్ల ప్రభుత్వ స్పందనల్లో పెద్దగా మార్పు లేనందున మరీ అవుట్ డేటెడ్ గా అనిపించలేదు.

కూసింత నాటకీయంగా చిత్రీకరించిన క్లైమాక్స్ సన్నివేశంలో సుదీర్ఘమైన సీరియస్ డైలాగుల్ని శశాంక్ పలికిన తీరు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. చాలా సన్నివేశాల్లో విలన్ గా చేసిన అతుల్ కులకర్ణి శశాంక్ ని డామినేట్ చేసేశాడు. బియాంక కి నటించడానికి కొంచం అవకాశం ఉన్న పాత్ర. బానే చేసింది. సాధారణంగా గీతాకృష్ణ సినిమాల్లో సంగీతం కూడా ఓ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కానీ ఈ సినిమాలో పాటలు నిరుత్సాహ పరిచాయి. ప్రధమార్ధంలో వచ్చే 'హలో హలో..' పాట ఒక్కటే గుర్తుంది. రెండో సగంలో నేపధ్య సంగీతం బాగా కుదిరింది. ఎమ్వీ రఘు చాయాగ్రహణం బాగుంది.

రెండేళ్ళకి పైగా షూటింగ్ జరిపిన గీతాకృష్ణ స్క్రిప్ట్ మీద మరికొంత సమయం వెచ్చించి ఉంటే బాగుండేది అనిపించింది, సినిమా పూర్తవ్వగానే. ముఖ్యంగా మొదటి సగం సాగతీతగానూ, రెండో సగం 'అప్పుడే అయిపోయిందా' అనిపించేట్టుగానూ ఉందంటే అది స్క్రీన్ ప్లే లోపమే. అలాగే చాలా సన్నివేశాలలో ప్రధాన పాత్రల నుంచి సరైన నటన రాబట్టుకోలేదు అనిపించింది. కొన్ని చోట్ల డబ్బింగ్ లిప్ సింక్ కుదరలేదు. (తమిళ, కన్నడ భాషల్లోనూ విడుదల చేశారు). ముఖ్యంగా శశాంక్ కి ఎవరిచేతైనా డబ్బింగ్ చెప్పించి ఉంటే బాగుండేది. రెండో సగంలో మాస్ మసాలా పాట లేకపోయినా పర్లేదు. మొత్తం మీద రెండోసగం కోసం మొదటి సగాన్ని భరించగలిగే వాళ్ళు ఈ కాఫీని ప్రయత్నించవచ్చు.

శుక్రవారం, ఏప్రిల్ 29, 2011

కొత్తావకాయ్

"ఒక్క మాటు ఇలా తోట లోంచి వెళ్లి, మా బామ్మగారు రమ్మంటున్నారు అని శాయమ్మకి చెప్పు బాబూ.. అందరూ వచ్చేశారు, మీకోసమే చూస్తున్నారు అని కూడా చెప్పేం.. మర్చిపోవద్దు..." ఓ నాలుగు సార్లు బామ్మచేత ఇలా బతిమాలించుకుని, అడ్డదారిన శాయమ్మ గారి ఇంటికి పరిగెత్తాను నేను. అప్పటికే రాజ్యం గారింటికీ, జగదాంబగారింటికీ రెండేస్సార్లు వెళ్లి రావడం అయ్యింది, జల్లెడ కోసం. ఆ మధ్యలోనే మావిడికాయలన్నీ గోలెంలో వేసి బాగా కడిగేసి, ఆరబెట్టేశాను. చిన్నపిల్లాడినన్న పేరే కానీ ఎన్నిపనులో. కొత్తావకాయ ఊరికే వస్తుందా మరి?

నాకసలు అలా ఇంట్లోనుంచి బయటికి తిరగడం అంటే భలే సరదా. రోజూ అలా తిరగడానికి ఉండదు కదా. అలా అని బామ్మ అడిగిన వెంటనే పని చేసేశామనుకో, ఇంక బతిమాలదు మనల్ని. అదే కాసేపు ఆగితే దార్లో తినడానికి ఏదో ఒకటి పెట్టి మరీ పంపిస్తుంది. ఇట్టే వెళ్లి అట్టే శాయమ్మ గారిని తీసుకొచ్చేశాను. వేసంకాలం సెలవలు కదా, బడి లేదు. ఆవకాయ పనులకోసమని మధ్యాహ్నం భోజనాలు తొరగా అయిపోయాయి. అమ్మ, బామ్మ వరస చూస్తుంటే కాఫీలు కూడా ఉండేలా లేవు.

కారాలు దంపడానికి మంగమ్మా, సుబ్బలక్ష్మీ వచ్చేశారు. అమ్మ అప్పటికే కుంది రోలు, రోకళ్ళు కడిగి పెట్టేసింది. పెద్ద పెద్ద పొట్లాల్లో ఉన్న ఎండు మిరపకాయలు, ఆవాలు పళ్ళాల్లో పోసి ఎండలో పెట్టేసింది. జాడీలో ఉన్న రాళ్లుప్పు కూడా విడిగా ఎండబెట్టేసింది. కుంది రోలు తులసి కోట పక్కకి లాక్కుని, "ముందర కారం కొట్టేత్తావండి" అంటూ మిరపకాయలు అందుకున్నారు ఆడవాళ్ళిద్దరూ. అమ్మేమో దంపిన కారం జల్లించడానికి సిద్ధంగా ఉంది. చూస్తుండగానే ఖణేల్ ఖణేల్ మంటూ రోకలి చప్పుళ్ళు మొదలైపోయాయి పెరట్లో. "ఇదిగో మంగమ్మా, భద్రం. గతమాటు నీ విసురుకి రోకలి పొన్ను విరిగిపోయింది," బామ్మ జాగ్రత్తలు మొదలు పెట్టేసింది.

శాయమ్మ గారు మావిడికాయలు తరగడానికి కూర్చున్నారు. నాకేమో తరిగిన ముక్కలు తుడిచే పని. అసలు ఆవకాయ పెట్టడంలో అన్ని పనులకన్నా కష్టమైనదీ, జాగ్రత్తగా చేయాల్సిందీ ఇదే. ఓ పాత గుడ్డతో తరిగిన ప్రతీ ముక్కనీ జాగ్రత్తగా తుడవాలా. పెచ్చు మీద ఓ చిన్న మైకా కాగితం లాంటి పొర ఉంటుంది. అది ఊడి చేతిలోకి వచ్చేదాకా ఊరుకోకూడదు. గోకైనా తీసేయాలి. అలా తియ్యలేదనుకో, ఆవకాయ్ పాడైపోతుంది. నేనొక్కడినీ అంత ముఖ్యమైన పని చేస్తున్నాననైనా లేకుండా, మధ్య మధ్యలో బామ్మ బోల్డన్ని ఆర్డర్లు.

కారం ఓ నాలుగు దంపులు దంపేసరికి మంగమ్మ బుగ్గనేసుకోడానికి బెల్లమ్ముక్క అడిగింది. అలా వేసుకుంటే దంపడం సులువౌతుందిట. ఏమిటో, నా పనికే ఏ సులువులూ లేవు. "దేవుడు గదిలో నీలం మూత సీసాలో బెల్లం ముక్కలు ఉంటాయి, నిమ్మళంగా సీసా పట్టుకురా నాయినా" అంది బామ్మ. అసలు ఎవరూ చెప్పకుండానే ఆ సీసా ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు. ఎలా తెలుసో ఎవరికీ చెప్పననుకో. ఓ బెల్లమ్ముక్క గుటుక్కుమనిపించి, సీసా తెచ్చి బుద్ధిగా బామ్మకిచ్చా. మంగమ్మతో పాటు బామ్మ నాకూ ఓ ముక్కిచ్చింది "మా నాయినే" అంటూ. ఈ ముక్క బుగ్గనేసేసుకున్నా.

నేనెంత తొరగా తుడుస్తున్నా, శాయమ్మ గారు గబాగబా కోసేస్తున్నారు కదా. తుడవాల్సిన ముక్కలు పెరిగిపోతున్నాయి. దంపేవాళ్ళు ఉస్సు అస్సు అంటున్నారు.. అందరికీ చెమటలు కారిపోతున్నాయ్. ఇలాంటి పని ఏ రాత్రో పెట్టుకోవాలి కానీ, ఈబామ్మకేంటో ఏవీ తెలీదు, చెప్పినా వినదు. చూస్తుండగానే అన్నేసి మిరపకాయలూ దంపడం అయిపోయింది. మజ్జిగ తేట తాగేసి ఆవాలు రోట్లో పోసుకున్నారు వాళ్ళు. శాయమ్మ గారు చెప్పినట్టు వాళ్ళంత గబగబా చేయడం మనకి రాదు. బామ్మ కూడా మధ్యలో ముక్కలు తుడవడానికి వచ్చింది కానీ, మళ్ళీ ఏదో పనుందని వెళ్ళింది.

మొత్తానికి మా ముక్కల పని అయ్యేసరికి, వాళ్ళు ఆవపిండి, ఉప్పు కూడా దంపేసి, కూరా పులుసూ పట్టుకుని వెళ్ళిపోయారు. అమ్మ అప్పటికే కడిగి ఆరబెట్టిన పెద్ద జాడీని తులసికోట దగ్గరికి పట్టుకొచ్చింది. జాడీ ఎంత ఉంటుందంటే, అందులో నేను ములిగిపోతాను. అప్పటికి నీరెండ పడుతోంది. బామ్మ, నేను తుడిచిన మావిడి ముక్కలు, ఉప్పు, కారం, ఆవపిండీ జాడీలోకి దింపి బాగా కలుపుతోంటే, అమ్మ నూని కేన్లు బయటికి పట్టుకొచ్చింది. ఎంతనూనో! ఆ నూనితో ఎన్నేసి జంతికలూ, చేగోడీలూ, పాలకాయలూ చేసుకోవచ్చో నేను లెక్కలేసుకుంటుంటే, శాయమ్మ గారి పర్యవేక్షణలో అమ్మ, బామ్మ కలిసి ఆ నూనంతా జాడీలోకి వంపేసి, బాగుచేసిన మెంతులు జాడీలో పోసి బాగా కలిపేశారు. అంతే, ఆవకాయ పెట్టడం అయిపోయింది. జాడీని దేవుడి గదిలోకి సాయం పట్టేశారు.

మూడో రోజు సాయంత్రం నేను అన్నం తింటోంటే "కాస్త రుచ్చూడు" అంటూ కొత్తావకాయ విస్తట్లో వేసింది బామ్మ. ఓ ముద్ద తిని, "కొంచం ఉప్పగా ఉంది" అన్నాన్నేను. అంతే, బామ్మకి కోపం వచ్చేసింది. "దీపాలెట్టాక ఉప్పు ఉప్పు అనకూడదు.." అంటూ వాదించేసింది. మరి ఉప్పుడుపిండి కావాలంటే ఏమని అడగాలో? రాత్రి అన్నంతిన్న నాన్న, తాతయ్యా కూడా అదే మాట, ఉప్పు తగులుతోందని. ఈసారి బామ్మకి కోపం రాలా. "నేను జాగ్రత్తగానే చూశాను, శాయమ్మ ని కూడా చూడమన్నాను. సాయంత్రం చంటాడూ ఉప్పన్నాడు కానీ, వాడి మోహం వాడికేం తెలుసులే అనుకున్నాను" అంది, నేను నిద్రపోతున్నాననుకుని. "రేపు తిరగేశాకా కూడా తగ్గకపోతే, ఓ నాలుక్కాయలు తరిగి పడేద్దావండత్తయ్యగారూ" అని అమ్మ అనడం కూడా వినిపించింది నాకు. పెచ్చులకి మాత్రం ఎవరూ పేరు పెట్టలా... ఏడాదంతా అయ్యింది కానీ, ఒక్కళ్ళకీ విస్తట్లోకి మైకా కాయితంముక్క రాలేదు.

గురువారం, ఏప్రిల్ 28, 2011

కడప...పుట్టపర్తి...కడప...

గత కొన్ని వారాలుగా వార్తల్లో బాగా వినిపిస్తున్న, కనిపిస్తున్న ప్రాంతాలు కడప, పుట్టపర్తి. తండ్రికి రాజకీయ జీవితం ఇచ్చి, ముఖ్యమంత్రిగా ఎదగనిచ్చిన పార్టీ మీదా, పార్టీ అధినేత్రి మీదా అలిగిన వారసుడు ఆ పార్టీని విడిచిపెట్టి, వేరు కుంపటి పెట్టుకున్న ఫలితంగా కడప పార్లమెంట్, పులివెందుల అసెంబ్లీ స్థానాలకి జరగబోయే ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకీ ఓ సవాలుగా మారడంతో పాటు, వార్తలకోసం ఆవురావురుమంటున్న ప్రసార సాధనాలకి కావలసినంత ముడిసరుకు అందిస్తోంది.

వారసుడికి సొంతంగా మీడియా హౌసు ఉండడం వల్లనూ, 'ఆ రెండు' మీడియా హౌసులూ అతని వ్యతిరేకులకి అనుకూలంగా (ప్రజలకి కాదు) పనిచేస్తున్నందువల్లనూ నాలాంటి వాళ్ళు నాణేనికి ఉన్న బొమ్మా బొరుసూ తెలుసుకోగలుగుతున్నారు. సందట్లో సడేమియాగా గొప్పవారి గోత్రాలు ఎవరూ అడగకుండానే బయట పడుతున్నాయి. ఇరువర్గాలూ కూడా మరణించిన 'మహానేత' నిజమైన వారసులం మేమంటే, మేమేనంటూ వాద ప్రతివాదాల్లో తేలుతూ టీవీ చానళ్ళ ద్వారా జనానికి వినోదాన్ని అందిస్తున్నాయి.

అచ్చంగా వారసత్వ పోరే, మరోరూపంలో జరుగుతోంది అదే రాయలసీమలోని పుట్టపర్తిలో. నూట ముప్ఫైకి పైగా దేశాల్లో భక్తుల చేత నడిచే దైవంగా కొనియాడబడ్డ పుట్టపర్తి దేవుడు సత్యసాయి బాబా అనారోగ్యం పాలైనట్టుగా మొదటి వార్త వచ్చిందే తడవుగా చర్చలు మొదలయ్యాయి, ప్రభుత్వానికి సమాంతరంగా సాయిబాబా నిర్మించిన అఖండ సామ్రాజ్యానికి వారసుడు ఎవరు? అనే అంశం మీద. వైద్యానికి స్వామి శరీరం సహకరించని కారణంగా ఆయన్ని బతికించలేక పోయామని వైద్యులు తేల్చేశారు. సమాధి నిర్మాణం కన్నా ముందే వారసత్వ చర్చ ఊపందుకుంది.

నలుగురైదుగురు భక్తులు కలిసి ఓ ఖాళీ స్థలంలో గుడి కట్టినా, ఆ ఆలయానికి కొంచం పేరూ, ఆదాయమూ వచ్చేసరికి దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా దానిని స్వాధీనం చేసేసుకోడానికి సర్వదా సిద్ధంగా ఉండే ప్రభుత్వం, లక్షన్నర కోట్ల రూపాయలకి పైగా విలువైన ఆస్తులు ఉన్నట్టుగా చెబుతున్న సత్యసాయి సంస్థల వ్యవహారంలో కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే ఎందుకు పోషిస్తోందన్నది లక్షన్నర కోట్ల రూపాయల ప్రశ్న. సత్యసాయి జీవించి ఉన్నంతకాలమూ పుట్టపర్తి అన్ని చట్టాలకీ అతీతమైన ప్రదేశంగానే వెలుగొందింది. ఆయన మరణం తర్వాత కూడా చట్టాలకి సంబంధించి 'యధాతధ స్థితి' కొనసాగనుందా?

మళ్ళీ కడపకి వద్దాం.. ఈ ఎన్నికలకోసం ప్రభుత్వం ఇంత ప్రజాధనం ఖర్చు పెట్టడం అవసరమా? (అభ్యర్ధుల ఖర్చు కాదు, ప్రభుత్వ పరంగా ఎన్నికల ఏర్పాట్ల ఖర్చు). ఎన్నిక ఎందుకు జరపాల్సి వస్తోంది? ఎన్నికైన అభ్యర్ధి, తన పదవీ కాలం పూర్తి కాకముందే, తనని గెలిపించిన పార్టీ పట్ల విశ్వాసం కోల్పోవడం వల్ల. సరే, రాజీనామా ఆయా అభ్యర్ధుల వ్యక్తిగత విషయం. వారి రాజీనామా కారణంగా ఏర్పడ్డ ఖాళీ భర్తీ చేయడం కోసం జరుగుతున్న ఎన్నికలో మళ్ళీ వాళ్ళే మరో పార్టీ తరఫున పోటీ చేస్తుంటే, అందుకోసం జనం పన్నులరూపం లో కట్టిన డబ్బుని ప్రభుత్వం ఖర్చుపెట్టడం అసమంజసంగా అనిపించడం లేదూ?

ఒక అభ్యర్ధి రెండు స్థానాలలో పోటీ చేసి గెలిచి, ఒక సీటుకి రాజీనామా చేసినప్పుడూ, ఇలా పదవీ కాలం పూర్తి కాకముందే ఎన్నికలు వచ్చేలా చేసి తనే మళ్ళీ పోటీలో నిలబడ్డ సందర్భంలోనూ ప్రభుత్వ పరంగా జరిగే ఖర్చుని సదరు అభ్యర్దే భరించే విధంగా చట్ట సవరణ జరపాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. ఇది కేవలం వారసుడి కారణంగా జరుగుతున్న ఎన్నికల గురించి మాత్రమే కాదు, ఎందుకంటే ఈ తరహా ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి కాదు. పుట్టపర్తి విషయం మాత్రమే కాదు, ఈ విషయాన్నీ ప్రభుత్వంలో ఉన్నవారెవరూ ఆలోచిస్తారనుకోను.

బుధవారం, ఏప్రిల్ 27, 2011

మాడంత మబ్బు

తెలుగు కథకుల్లో రాశిలో తక్కువే అయినా, వాసిలో ఎంచదగ్గ కథలు రాసినవాళ్ళు ఎందరు? ఈమధ్యనే సి. రామచంద్ర రావు 'వేలు పిళ్ళై' సంకలనం చదవడం పూర్తి చేయగానే తలెత్తిన ప్రశ్న ఇది. వెంటనే తట్టిన పేరు నిడుమోలు కల్యాణ సుందరీ జగన్నాథ్. బుక్ రాక్ లో వెతికితే ఆవిడ కథా సంకలనం 'అలరాస పుట్టిళ్ళు' కనిపించింది. పేజీలు తిప్పుతూ నాకు బాగా నచ్చిన కథ 'మాడంత మబ్బు' దగ్గర ఆగాను.

ఓ తరం సంస్కృతీ సంప్రదాయాలను, మానవ మనస్తత్వంలో వైచిత్రిని ఇంకా ప్రకృతి వివిధ రూపాల్నీ చిత్రించడంలో అందెవేసిన చేయి కల్యాణ సుందరి గారిది. కథ ముగింపుని గురించి చిన్నపాటి క్లూలు ఇస్తూనే, వేగవంతమైన కథనంతో ఆసాంతమూ ఊపిరి బిగబట్టి చదివేలా కథను నడపడం ఈవిడ శైలి. కథల్లో అధికశాతం విస్తృతమైన కాన్వాస్ కలిగి ఉంటాయి. అంతే కాదు, విషాదాంతాలే ఎక్కువ.

పల్లెటూరి ఆలూమగలు భాగ్యం, పెద్దిరాజుల కథ ఈ 'మాడంత మబ్బు.' కొల్లేరు పక్కనుండే పల్లెటూళ్ళో కాపురం. పెద్దిరాజు వృత్తి వ్యవసాయం. చిన్నప్పుడే తల్లితండ్రుల్ని కోల్పోయిన భాగ్యాన్ని తనదగ్గర ఉంచి పెద్ద చేసి, కొడుకునిచ్చి పెళ్లి చేసింది అత్తయ్య. తనవారెవరూ లేరన్న లోటు కనిపించని విధంగా భాగ్యాన్ని చూసుకుంటూ ఉంటాడు పెద్దిరాజు. పెళ్ళయ్యాక పెద్దిరాజు తల్లి కాలం చేస్తుంది. భాగ్యనికింకా చిన్నతనం వదలలేదు. పెద్దిరాజుకి భాగ్యం అంతే ఎంత ప్రేమ ఉందో, అంత అనుమానమూ ఉంది. ఆ అనుమానంతో అతనేమన్నా అన్నా "బావ కాకపొతే నన్ను ఇంకెవరు అంటారు?" అని సరిపెట్టేసుకుంటూ ఉంటుంది భాగ్యం.

ఆ ఏడు చేను ఈనిన వెంటనే సుంకు మీద వాన ముసుళ్ళు పట్టాయి. పంట నష్టం. ఎలాగో కాలక్షేపం చేశారు. ఆ మరుసటి ఏడూ అంతే. తర్వాత ముంపు వచ్చింది, వరుసగా రెండేళ్ళు. అసలు ముంపు వస్తుందని భాగ్యానికి ముందే తెలుసు. తొలకరికి ముందు పక్క ఊళ్ళో ఉన్న చుట్టాలని చూసి వస్తూ ఉంటే, ఎండి ఉన్న కొల్లేరులో అక్కడక్కడ పెరిగిన జమ్ములో కొంగలు నిలువెత్తున్న గూళ్ళు కట్టుకున్నాయి. పక్షులు అంత ఎత్తులో గూళ్ళు కట్టుకున్నాయంటే ముంపు వస్తుందనే కదా అర్ధం!

పూలమ్మిన చోట కట్టెలమ్మలేక రామగిరి పాడు కి కూలి పనికి వెళ్ళిపోయాడు పెద్దిరాజు, తన పొలాన్ని మునసబు గారికి కౌలుకిచ్చి. భాగ్యం 'తనూ వస్తా' నంది కానీ, "బస్తీ నమ్మకూడదు. అక్కడికొద్దు" అంటూ కళ్ళెర్రజేశాడు పెద్దిరాజు. అంతలోనే ప్రేమ చూపించాడు. వచ్చేటప్పుడు ఆమెకిష్టమైన జలతారు చందమామల నల్ల జరీచీర తెస్తానన్నాడు. పెద్దలు ఇచ్చినదాన్ని, తర్వాతి వాళ్లకి ఇవ్వడానికి తనకి కొన్నాళ్ళపాటు పట్నవాసం తప్పదన్నాడు. భాగ్యానికి జాగ్రత్తలు చెప్పి బయలుదేరాడు. పెరట్లో బూరుగు చెట్టు పువ్వు పూసి కాయ కాసింది. మృగశిర ప్రవేశించింది.

ఆవేళ, దూరాన్న పొలాల మీద చిన్న మబ్బు పట్టినట్టు కనిపించింది. పట్నం నుంచి పెద్దిరాజు వస్తున్నట్టు శేషయ్య ద్వారా తెలిసింది భాగ్యానికి. ఆమెకది పండుగే అయింది. "మాడంత మబ్బు పట్టే మంగళగిరి మీద.. కురిసెను తిరుపతిలో కుంభవర్షాలు.. కుంభ వర్షాల్ కురిసె స్తంభాలె తడిసె.. వెంకన్న కూచున్న వెండరుగు తడిసె.. మంగమ్మ కూచున్న మండపమే తడిసె.." అని పాడుకుంటూ ఇల్లంతా సర్దింది. గబగబా వంట చేసింది. రెండు పీటలు వాల్చి, కంచాలు పెట్టింది. మంచి చీర ఎంచి కట్టుకుంది. పక్క సిద్ధం చేసింది.

అప్పుడు గుర్తొచ్చింది, అతనికి భోజనం చేశాక బెల్లంగడ్డ నోట్లో వేసుకునే అలవాటు ఉందని. ఇంట్లో బెల్లం లేదు. ఎప్పుడూ బయటికి వెళ్లకపోయినా, ఆ చినుకుల్లో వీధి చివర భూషణం గారి కొట్టుకి వెళ్ళింది, అతనికి ఇంటి ముందర దారి తెలియడానికి లైటు పడేటట్టు కిటికీ తెరిచి పెట్టి, తలుపు గొళ్ళెంపెట్టి. అతను వచ్చాడా? ఆమె ప్రేమని అర్ధం చేసుకున్నాడా?? ...కుసుమ బుక్స్ ప్రచురించిన కల్యాణ సుందరి ఇరవై కథల సంకలనం 'అలరాస పుట్టిళ్ళు' కథా సంకలనం పేజీలు 298, వెల రూ. 60. (అన్ని పుస్తకాల షాపులు.) 'అలరాస పుట్టిళ్ళు' నాటికను గురించి నా టపా ఇక్కడ.

మంగళవారం, ఏప్రిల్ 26, 2011

డబ్బుఖర్చు...

మార్పు అన్నది ఓ నిశ్శబ్ద పరిణామం..మన పని మనం చేసుకుంటూ పోతే, మనకు తెలియకుండానే మన జీవితాల్లో ఈ మార్పు ప్రవేశించేస్తూ ఉంటుంది. ఏ విషయంలోనూ మనం నిన్నలా మొన్నలా ఉండం.. ఉండడం సాధ్యపడదు కూడా. ఉదాహరణకి డబ్బు ఖర్చు పెట్టడం అనే విషయాన్నే తీసుకోండి. ఒకప్పటికీ ఇప్పటికీ ఎంత మార్పు వచ్చేసిందో.. 'ఆచి తూచి ఖర్చు పెట్టడం' అన్నది ఒకప్పుడు అలిఖిత నియమంగా ఉండేది. పిల్లలూ, పెద్దలూ అందరూ పాటించేవాళ్ళు. నిజానికి అప్పట్లో పిల్లలకి తమ చేత్తో ఖర్చు పెట్టే అవకాశమే ఉండేది కాదు. డబ్బు దాచుకున్న వాడు గొప్పవాడు అప్పట్లో.

మరి ఇప్పుడో? ఎవరెంత ఎక్కువగా ఖర్చు చేస్తే వాళ్ళంత గొప్పవాళ్ళు. దాచుకోవడం కన్నా ఖర్చు పెట్టడమే మిన్న అన్నది మనకి తెలియకుండానే ప్రవేశించిన సాంస్కృతిక విప్లవం. కాన్వెంట్ పిల్లల కనీస పాకెట్ మనీ యాభై నుంచి వంద రూపాయలిప్పుడు.. ఇంక కాలేజీ పిల్లలకైతే డబ్బివ్వడం, లెక్ఖలు చూడడం లాంటి తతంగం ఏమీ లేదు. ఓ క్రెడిట్ కార్డో, డెబిట్ కార్డో తీసివ్వడం, అకౌంట్లో క్రమం తప్పకుండా బాలన్స్ ఉండేలా చూసుకుంటూ ఉండడం. కేవలం పిల్లలేనా? పెద్దవాళ్ళకి మాత్రం, ఏమీ తోచకపోతే గుర్తొచ్చే మొదటి పని షాపింగ్. ఏ ప్రత్యేక సందర్భం వచ్చినా చేసే మొదటి పని కూడా షాపింగే..
ఈ షాపింగ్ కి ప్రస్తుతం ఉన్న, రోజురోజుకీ పెరుగుతున్న ఆదరణకి నిదర్శనం కోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు.. మన చుట్టూ పెరుగుతున్న షాపింగ్ మాల్స్ ని గమనిస్తే చాలు.. ఆ మాల్స్ ప్రకటనల మీద వచ్చిస్తున్న మొత్తాన్ని లెక్కకట్టినా చాలు. అవసరానికి తగ్గట్టుగా కొనుక్కోవడం స్థానంలో, ముందుగా కొని తర్వాత ఉపయోగించడాన్ని గురించి ఆలోచించడం అన్న కాన్సెప్ట్ చాలా వేగంగా మన జీవితాల్లోకి చొచ్చుకుని వచ్చేసింది. ఫలితం, "మా ఇంట్లో కేవలం పనికొచ్చే వస్తువులు మాత్రమే ఉన్నాయి" అని ఎవరూ కూడా గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పలేని పరిస్థితి.

డబ్బు ఖర్చు అన్నది కేవలం షాపింగ్ కి మాత్రమే పరిమితం కాదు, కాలేదు. ప్రతిచోటా 'ఇది మనకి అవసరమా?' అన్న ప్రశ్నకి ఏమాత్రం తావులేని విధంగా ఖర్చు జరిగిపోతోంది. ఉదాహరణకి రైలు ప్రయాణాన్నే తీసుకుందాం.. ఈమధ్య కాలంలో పెరిగిన ధోరణి "టిక్కెట్ తత్కాల్ లో కొందాంలే.." తత్కాల్ టిక్కెట్ కొనడం తప్పుకాదు. కానీ ముందుగా రిజర్వేషన్ చేయించుకునే అవకాశం ఉన్నప్పటికీ, తత్కాల్ అనే సౌకర్యం ఉందన్న ఒకే ఒక్క కారణంతో ఎక్కువ మొత్తం ఖర్చు చేసి ఆ టిక్కెట్ కొననేల? ఎందుకంటే ఖర్చుకి మనం వెనుకాడం కాబట్టి. ఇంకా చెప్పాలంటే 'తత్కాల్' అన్నది ఓ ప్రెస్టేజ్ ఇష్యూ అయి కూర్చుంది కాబట్టి.

రాను రాను, సేవింగ్స్ గురించి మాట్లాడడం కూడా అవుట్ డేటెడ్ అయిపోతోంది. ఒక్క మార్చి నెలలో ఇన్కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు మినహా, మిగిలిన సందర్భాలలో ఎక్కడా ఎప్పుడూ సేవింగ్స్ ప్రస్తావన రావడం లేదు. షేర్ మార్కెట్, మూచ్యువల్ ఫండ్ కబుర్లు మాత్రం అక్కడక్కడా వినిపిస్తున్నాయి.. షేర్స్ ని స్థిరమైన సేవింగ్స్ అనగలమా? ఇలా ఎందుకు జరుగుతోంది? ఈ సంస్కృతికి ఎక్కడి నుంచి వచ్చింది? కొద్దిగా ఆలోచిస్తే దొరికిన సమాధానం, వారం ఐదు రోజులూ కష్టపడి సంపాదించిన మొత్తాన్ని వారాంతం రెండు రోజులూ పూర్తిగా ఖర్చు చేసేసి కొత్త వారాన్ని తాజాగా మొదలు పెట్టడం అన్నది అమెరికన్ సంస్కృతి. దీనిని మనం అరువు తెచ్చుకోలేదు.. తనే వచ్చి మనతో కలిసిపోయింది. అమెరికనైజేషన్ అన్నది ఇవాళ కొత్తగా మొదలైంది కాదు కదా.

జరుగుతున్న ఈ పరిణామం మంచికా, చెడుకా అన్నది ఇప్పుడే చెప్పడం కష్టం. ఎందుకంటే ఇది కాలం మాత్రమే జవాబు చెప్పగలిగే ప్రశ్న. 'చీమ-మిడత' కథ వింటూ పెరిగిన తరాలకి ఈ పోకడ ఓ పట్టాన అర్ధం కాకపోవచ్చు. అర్ధమయ్యి ఆందోళన కలిగించనూవచ్చు.. కానైతే, రోజురోజుకీ విశ్వరూపం దాలుస్తున్న ఈ ఖర్చు సంస్కృతిని నిలువరించడం ఏ ఒక్కరి వల్లనో జరిగే పని కాదు. బహుశా ఇదో శాఖా చంక్రమణం. 'మనోనేత్రం' సందీప్ గారు రాసిన ఈ టపా చదివాక అలా అలా ఆలోచనల్లోకి వెళ్లి వచ్చి రాసిన టపా ఇది.

సోమవారం, ఏప్రిల్ 25, 2011

శభాష్ లక్ష్మీమేఘన...

ఊహించినట్టుగానే 'పాడుతా తీయగా' చిన్న పిల్లల సిరీస్ లో టైటిల్ గెల్చుకున్న లక్ష్మీమేఘన కి అభినందనలు. అంజనీ నిఖిల, గణేష్ రేవంత్, రాఘవేంద్ర ల నుంచి గట్టి పోటీని తట్టుకుని ప్రధమ స్థానంలో నిలిచిన మేఘనకి నాలుగేళ్ల వయసునుంచే శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం, ఏ పాటనైనా భావయుక్తంగా పాడడం ప్లస్ పాయింట్లుగా నిలబడి, టైటిల్ గెలుచుకోడానికి సహకరించాయన్నది నా అంచనా. ఎందుకో తెలీదు కానీ, ఈ సిరీస్ ప్రారంభం నుంచీ ఈ అమ్మాయే టైటిల్ విజేత అవుతుంది అనిపించింది నాకు. ఇదే విషయాన్ని చాలా మంది మిత్రులతో అన్నాను కూడా.

క్వార్టర్ ఫైనల్స్ నుంచి పోటీ సరళి మారి, మిగిలిన గాయనీ గాయకులు పాడే విధానంలో మార్పు కనిపించింది. ఈ దశలో "ఈ అమ్మాయి గెలుపు అంత సులువు కాదేమో" అన్న సందేహం చిన్నగా మొదలయ్యింది. అయితే ఇంచు మించి ప్రతి రౌండ్ లోనూ తను టాప్ స్కోర్స్ సాధిస్తూ వచ్చింది. ఒక దశ వరకూ రాఘవేంద్ర ఈమెకి గట్టి పోటీ ఇచ్చాడు. శ్రీకాకుళం కి చెందిన ఇతనికి కూడా శాస్త్రీయ సంగీతం మీద పట్టు ఉంది. (ఆ మాటకి వస్తే ఫైనల్స్ కి వచ్చిన నలుగురూ శాస్త్రీయ సంగీత నేపధ్యం ఉన్నవాళ్ళే) ఎలాంటి పాటనైనా గంభీరంగా పాడే రాఘవేంద్ర గానంలో చాలా సందర్భాలలో మిస్సయింది ఎక్స్ ప్రెషన్. బాలూతో పాటుగా కార్యక్రమానికి వచ్చిన అతిధులు సైతం ఈ విషయాన్ని రాఘవేంద్ర దృష్టికి చాలాసార్లే తీసుకొచ్చారు.

పాటలకన్నా మిమిక్రీ మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నట్టుగా అనిపించే బుడతడు గణేష్ రేవంత్. ప్రతి ఎపిసోడ్ లోనూ ఓ ప్రత్యేక గెటప్ లో వచ్చో, పాడడం లో సరదా గిమ్మిక్కులు చేసో అందరి దృష్టినీ ఆకర్షించే గణేష్, వ్యాఖ్యాత ఎస్పీ బాలూకి ఇష్టుడు. ఎంతగా అంటే, విజేతలని ప్రకటించాక, బాలూ గణేష్ కి తన తరపున పాతికవేల రూపాయలు బహుమతి ప్రకటించారు. గణేష్-బాలూ లు చాలాసార్లు టాం అండ్ జెర్రీ తరహా హాస్యంతో ప్రేక్షకులని నవ్వుల్లో ముంచారు. ముఖ్యంతా గణేష్ 'కొంచం ఇష్టం కొంచం కష్టం' సినిమా నుంచి "ఎవడే సుబ్రహ్మణ్యం" పాడినప్పటినుంచీ ఇది మరికొంచం ఎక్కువయ్యింది. ఫైనల్స్ లో బాలూ గణేష్ చేత చేయించిన మిమిక్రీ రక్తి కట్టింది.

ఫైనల్స్ దశలో మేఘనకి గట్టి పోటీ ఇచ్చిన గాయని అంజనీ నిఖిల. ప్రారంభంలో ఈ అమ్మాయికి ఊపిరి తీసుకోవడం సమస్యగా ఉండేది. అలాగే పాడేటప్పుడు చాలా ఒత్తిడికి గురవుతున్నట్టుగా అనిపించేది. అయితే, రాను రాను ఈ సమస్యలని అధిగమించింది. ఫైనల్స్ చివరి రౌండ్ లో "నీలీల పాడెద దేవా.." పాట పాడడానికి సాహసించడమే కాదు, చాలా బాగా పాడి 'టైటిల్ పట్టుకుపోతుందేమో' అనిపించింది. ముఖ్య అతిధి వాణీ జయరాం ఈ పాటకి స్టాండింగ్ వోవేషన్ ఇచ్చారంటే నిఖిల ఏ స్థాయిలో ఈ పాటని పాడిందో ఊహించవచ్చు. ఈ అమ్మాయి పాడిన పాటల్లో నాకు బాగా నచ్చినవి "వేదంలా ఘోషించే గోదావరి.." "టుటుటూ టుటుటూ..." గణేష్, అంజనీ ఇద్దరూ విశాఖపట్నం నుంచి పోటీకి వచ్చారు.

లక్ష్మీమేఘన నాకు నచ్చడానికి కారణం ఏమిటి? ..తను పాడే విధానం. ఎలాంటి పాటనైనా, ఏ తరహా సాహిత్యాన్నైనా అనుభవిస్తూ పాడడం ఈ అమ్మాయి ప్రత్యేకత. నిజానికి కొన్ని పాటల సాహిత్యానికి అర్ధం కూడా ఈ పదకొండేళ్ళ అమ్మాయికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ తన పాట వింటూ ఉంటే మనకా భావన కలగదు. చాలా హాయిగా పాడడంతో పాటు, పాడుతున్నంత సేపూ అంతే హాయిగా కనిపిస్తుంది కూడా. ఫైనల్స్ చివరి రౌండ్ లో నా అభిమాన 'సువర్ణ సుందరి' సినిమా నుంచి తను పాడిన 'హాయి హాయిగా..' పాట పల్లవి, తొలి చరణం పాడేటప్పుడు మాత్రం కొద్దిగా ఒత్తిడికి గురయ్యిందేమో అన్న సందేహం కలిగింది నాకు. మిగిలిన చరణాలు మాత్రం ఎప్పటిలాగే చాలా హాయిగా పాడేసింది తను.

నిజానికి ఈ సిరీస్ ప్రారంభమయ్యింది లక్ష్మీమేఘన పాటతోనే. శ్రుతిలయలు సినిమాలో "శ్రీ గణనాధం.." పాటతో మొదలు పెట్టి, తర్వాతి ఎపిసోడ్లలో చాలా చక్కని పాటలని అంతే చక్కగా పాడింది మేఘన. "మౌనమేలనోయి.." అయినా "ఏస్కోర మావా సుక్కా." పాటైనా అలవోకగా పాడేయగలగడం ఈ పాలకొల్లు అమ్మాయి సామర్ధ్యం. నిజం చెప్పాలంటే పాడుతా తీయగా గత సిరీస్ కన్నా ఈ సిరీసే బాగా నచ్చింది నాకు. చివర్లో అజయ్ శాంతి (ఈయన్ని 'మనసులో వాన' రచయితగా గుర్తుంచుకోవడమే ఇష్టం నాకు) ప్రసంగం లాంటివి కొంచం సాగతీతగా అనిపించినా మొత్తం మీద అనవసరపు మెలోడ్రామాకి అతీతంగా కార్యక్రమం సాగడం అభినందించాల్సిన విషయం. వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్న కొత్త సిరీస్ లో కూడా పాడనున్నది చిన్నపిల్లలే.

శనివారం, ఏప్రిల్ 23, 2011

డబ్బింగ్ సినిమాలు

నాకు హిందీ నుంచి తెలుగులోకి డబ్ అయిన సినిమాలంటే ప్రత్యేకమైన అభిమానం. ఆంగ్లం, అరవం మరియు ఇతర భారతీయ భాషల నుంచి డబ్ అయిన సినిమాల కన్నా వీటిమీద ఇష్టం కొంచం ఎక్కువ. మరీ ముఖ్యంగా ఈ సినిమాల్లో పాటలు, సాహిత్యం. ఇది ఎంతగా అంటే, ఇప్పటికీ ఏదన్నా హిందీ సినిమా తెలుగు డబ్బింగ్ విడుదలై, ఆ తర్వాత ఎప్పుడైనా ఒరిజినల్ హిందీ సినిమా టీవీలో వస్తుంటే నేనీ డబ్బింగ్ పాటలు పాడుకుంటూ ఉంటాను.

ఈ డబ్బింగ్ సినిమాలని నేను కొంచం ఆలస్యంగా పట్టించుకున్నాననే చెప్పాలి. హిందీ నుంచి డబ్బింగ్ ఎప్పుడు మొదలయ్యిందన్నది నాకు ఇదమిద్దంగా తెలియదు కానీ, నేను చూసిన మొదటి డబ్బింగ్ చిత్రరాజం మాత్రం రాజశ్రీ వారి 'ప్రేమపావురాలు.' సల్మాన్ ఖాన్, రీమాలాగు వీళ్ళంతా తెలుగులో మాట్లాడుతుంటే ఏదో చిత్రమైన అనుభూతి. వాళ్ళ వేషానికీ, భాషకీ అస్సలు సంబంధం లేకపోవడం... అదేమిటో కానీ, భాగ్యశ్రీ మాత్రం పరాయిపిల్లలా అనిపించలేదు నాకు.

ఇంక పాటలైతే చెప్పక్కర్లేదు.. "సాయం సంధ్యవేళయ్యిందీ..." పాటలో బాలూ "తస్సదియ్యా" అనడం భలే నచ్చేసింది. "ఓ పావురమా.. హెహే.. ఒపావురమా," "నీజతలేక..పిచ్చిది కాదా.." ఇలా 'ప్రేమపావురాలు' లో పాటలన్నీ మారుమోగాయి అప్పట్లో. ఇప్పటికీ 'మైనే ప్యార్ కియా' డిస్క్ చూస్తుంటే (అవును డిస్క్ ఉంది నాదగ్గర, "దేశాన్నే ఊపేసిన భాగ్యశ్రీనా?" అని జొన్నవిత్తుల రాశాడంటే, రాయడూ మరి) పాటలు వచ్చేసరికి నేను తెలుగులోకి షిఫ్ట్ అయ్యి పాడేసుకుంటూ ఉంటాను.

"నీ ఆశే నాకు ఆరాధనం.. ప్రేమించే గుండె ఒక నందనం.. అప్పగించా నా ప్రాణం పునఃమ్.. నా ప్రాణం నీ పునరంకితం.." ఈపాట గుర్తుందా ఎవరికైనా? "తుజ్హే దేఖా తో ఏ జానా సనం...." అదీ సంగతి. 'ప్రేమపావురాలు' తెలుగులో కూడా బాగా డబ్బు చేసుకునేసరికి హిందీ డబ్బింగ్ సినిమాల పరంపర మొదలయ్యింది. సినిమా రాకముందే తెలుగు ఆడియో వచ్చేసేది. ఇంక ఏ హోటల్ కి వెళ్ళినా అవే పాటలు. "చెమ్మ చెమ్మ చెక్కలాట.." పాట టబు సినిమా 'మాచీస్' తెలుగు డబ్బింగ్ 'అగ్గిరవ్వలు' లోది.

'ప్రేమపావురాలు' తర్వాత ఆ స్థాయి డబ్బింగ్ మ్యూజిక్ ని మళ్ళీ రాజశ్రీ సంస్థే అందించింది, 'ప్రేమాలయం' ద్వారా. "ఓ అక్కా నీ మరిదెంతో ఎర్రోడే.." "జోళ్ళు ఇచ్చుకో.. డబ్బు పుచ్చుకో.." "అమ్మా అమ్మా మన ముంగిట్లో కూసెను నేడొక కాకి.." లాంటి సాహిత్యం వినగలిగే అవకాశం దొరికింది. పాటలేనా? అప్పట్లో ఈ సినిమా తెలుగు డైలాగులు కూడా కేసెట్లుగా విడుదలయ్యాయి. ఆ చిత్రమైన తెలుగుకి భలే నవ్వొచ్చేది. (అప్పట్లో టీవీ చానళ్ళూ, టాక్ షోలూ లేవు మరి).

అదే టైములో మళ్ళీ వచ్చిన మరో ట్రెండ్, పాపులర్ హిందీ పాటల ట్యూన్ యధాతధంగా వాడుకుని (కాపీ చేసి అంటే మన సంగీతదర్శకుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటాయి) తెలుగు పాటలు చేసేయడం. 'తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్..' ని 'ఓ సుందరి నువ్వే మస్త్ మస్త్..' అనీ, మరో పాపులర్ పాటని 'పున్నాగ పూల తోటలో మాట ఇచ్చి మరవకు..' ట్యూన్ చేసి వదిలేశారు. ఇలాంటివే మరికొన్ని పాటలూ ఉన్నాయి. ఈ పరంపర కొన్నాళ్ళపాటు సాగింది. డబ్బింగ్ సినిమాల్లోనూ కొన్ని చక్కటి పాటలు ఉన్నాయి. అసలు శ్రీశ్రీ సిని రచయితగా మారింది డబ్బింగ్ సినిమాతోనే. డబ్బింగ్ లో రాజశ్రీకి ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'వైశాలి' అనే సినిమాలో 'ప్రేమ జీవన రాగం' పాట నాకెంతో ఇష్టం.

హిందీ డబ్బింగ్ సినిమాల ప్రాభవం కొంచం తగ్గాక హాలీవుడ్ డబ్బింగ్ సినిమాల మెరుపు దాడి మొదలయ్యింది. 'జురాసిక్ పార్క్' మొదలుకొని 'టైటానిక్' 'అనకొండ' ల మీదుగా సాగిన ప్రయాణం నిన్న మొన్నటి 'భూలోక వీరుడు' 'లోకం చుట్టిన వీరుడు' వరకూ అప్రతిహతంగా కొనసాగింది. ఈమధ్య ఎందుకో ఈ సినిమాలూ తగ్గాయనిపిస్తోంది. కారణాలు లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ వారిని కనుక్కోవాలి. ఇంగ్లీష్ సినిమాలు డబ్ చేయడంలోనే కాదు, ప్రచారంలోనూ వీరిది ప్రత్యేక శైలి. గుండె జబ్బులున్న వాళ్ళు వీళ్ళ సినిమాల ప్రోమోలకి తగుమాత్రం దూరంలో ఉండడం మంచిది.

మణిరత్నం లాంటి దర్శకులు తమిళ డబ్బింగ్ సినిమాలని తెలుగు నేలమీద పాపులర్ చేశారు. నేను చెప్పకపోయినా, మళయాళ డబ్బింగ్ సినిమాలకి ఇక్కడ ప్రాభవం తెచ్చి, అక్కడి అగ్ర హీరోల ఆగ్రహం కారణంగా తర్వాతి కాలంలో తెలుగులో హాస్య పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసేసిన తార కొందరికైనా ఈసరికి గుర్తొచ్చే ఉంటుంది. "ఇనుములో హృదయం మొలిచెనే.." పాట నిన్నమొన్నటి వరకూ చెవుల్లో తుప్పు వదిలిస్తూనే ఉంది. టీవీ చానళ్ళు బాగా పెరిగిపోవడంతో సినిమాలకీ డిమాండ్ పెరిగి, ఇప్పుడిప్పుడు ఇంగ్లీష్, హిందీ డబ్బింగ్ సినిమాలనీ వరుసగా ప్రసారం చేసేస్తున్నారు. ఇవాళ ఉదయం అలా చానళ్ళు మారుస్తుంటే 'ప్రేమాలయం' కనిపించి నన్నలా జ్ఞాపకాల్లోకి తిప్పి తీసుకొచ్చింది.

శుక్రవారం, ఏప్రిల్ 22, 2011

కథలగురించి మళ్ళీ..

హమ్మయ్య.. చాలారోజుల తర్వాత బ్లాగుల్లో తెలుగు కథల గురించి చర్చ జరుగుతోంది. అప్పుడెప్పుడో కథల నాణ్యత గురించి ఇక్కడే నా గోడు వెళ్ళబోసుకున్నాను. ఇప్పుడు మన 'తెలు-గోడు' అబ్రకదబ్ర గారు గడిచిన ఇవరయ్యేళ్ళలో వచ్చిన రెండువందల యాభై కథలు చదివి, ఆపై తన గోడుని మనతో పంచుకున్నారు. ఇప్పుడొస్తున్న కథల్లో గుర్తు పెట్టుకోగలిగేవీ, మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేవీ అత్యంత అరుదన్నది నిర్వివాదం. మరి, ఇందుకు కారణాలు?

ఇవాల్టికీ తెలుగు కథ అనగానే మొదట గుర్తొచ్చే పేర్లు శ్రీపాద, పాలగుమ్మి పద్మరాజు, చాసో... ఇలా వేళ్ళ మీద లెక్క పెట్టగలిగిన గత తరం కథకులవి మాత్రమే. తర్వాతి తరం రచయితలలో సర్వజనామోదం పొందిన వాళ్ళూ, వారి రచనల్లో అందరి ఆమోదం పొందినవీ వెతకడం కష్టమైన పని అనే చెప్పాలి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఆనాటి రచనలు అప్పటి పాఠకులని అలరించడమే కాకుండా, ఇప్పటికీ చిరంజీవులుగా నిలబడ్డాయి. ఇప్పటి రచనల్లో అలా నిలబడగలిగేవి ఏవీ?

ఏ రచన అయినా సమాజాన్ని ప్రతిబింబించాలి. చదివించే గుణం ఉండాలి. కథలో నవ్యతతో పాటు, కథనంలో వేగమూ ఉండాలి. మరి ఇప్పటి కథల్లో కనిపిస్తున్న సమాజం ఏమిటి? పల్చబడిపోతున్న కుటుంబ బంధాలూ, పెరిగిపోతున్న వ్యాపారీకరణ, కెరీరిజం, పల్లెల్లో మారుతున్న జీవన చిత్రం, రైతు సమస్యలూ, సెజ్లు, గతమెంతో ఘనకీర్తి టైపు నాష్టాల్జియా మరియు ప్రేమకథలు. గడిచిన ఇరవై యేళ్ళలోనూ సమాజంలో వచ్చిన మార్పులని కథా సాహిత్యం ఏమన్నా రికార్డు చేసిందా అంటే, అది కేవలం కార్పోరేటీకరణ తాలూకు దుష్ఫలితాలు, ఇంకా కెరీరిజం లో నలిగిపోతున్న యువత గురించి మాత్రమే అని చెప్పాలి.

మన సమాజంలో ఇంతకు మించి ఎలాంటి మార్పూ రావడం లేదా? లేక వస్తున్న మార్పుని సమర్ధవంతంగా రికార్డు చేయడంలో రచయితలు విఫలమవుతున్నారా? లేదా రికార్డు చేస్తున్న విధానం రొటీన్ గా ఒకే మూసలో పోసినట్టుగా ఉంటోందా? ఎలాంటి మార్పూ లేకుండా రోజులు గడిచిపోవడం అసంభవం కాబట్టి, దానిని రికార్డు చేయడం అన్నది సంతృప్తికరంగా సాగటం లేదని అంగీకరించాలి. అలాగే రికార్డు చేయడానికి ఉపయోగిస్తున్నభాష, భావ వ్యక్తీకరణ తీరు కూడా సంతృప్తికరంగా లేకపోవడం మూలంగానే ఈ చర్చలు. ఇందుకు కారణం ఎవరు?

పోతనామాత్యుడు భాగవతం మొదలు పెడుతూ "పలికెడిది భాగవతమట, పలికించెడి వాడు రామభద్రుడట.." అన్నాడు. మరి తెలుగు కథకి సంబంధించి ఇవాల్టి రోజున పలికించే వాళ్ళు ఎవరు? పత్రికలు, పాఠకులు తమ వంతు పాత్రని ఎంతవరకూ నిర్వర్తిస్తున్నారు? రచయితల్నీ, రచయిత్రులనీ వెతికి పట్టుకుని వాళ్ళ చేత నాణ్యమైన రచనలు చేయించుకోవాలన్న కమిట్మెంట్ ఉన్న సంపాదకులు ఇవాళ ఎంతమంది ఉన్నారు మనకి? టీవీ సీరియళ్ళ కారణంగా పడిపోతోందని చెబుతున్న పత్రికల సర్క్యులేషన్ పెంచుకోడానికి తంటాలుపడడంలో తలమునకలైన సంపాదకులకి కథల గురించి ఆలోచించే తీరిక లేదనే అనుకోవాలి.

సాహసించి ఓ రచయితో, రచయిత్రో తన కథలతో ఓ సంకలనం వేసుకుంటే ఆదరించే పాఠకులు ఎంతమంది? సొంతంగా పుస్తకం వేసుకోవడం అన్నది 'చేతి చమురు' వ్యవహారం తప్ప మరొకటి కాదన్నది బహిరంగ రహస్యమే. రాసిన కథలని అటు పత్రికలూ, ఇటు పాఠకులూ ఆదరించనప్పుడు ఆ రచయిత/రచయిత్రి ఏం చేయాలి? కష్టపడి చేసిన రచనకి పారితోషికం అందుకోవాల్సింది పోయి, సొంత డబ్బు ఖర్చు పెట్టడం, నష్టపోవడం.. ఇది సొంతంగా పుస్తకాలు ప్రచురించుకున్న వాళ్ళలో మెజారిటీ రచయితల అనుభవమని ఓ పబ్లిషర్ మిత్రుడి ఉవాచ. కథలు రాసిన వాళ్ళకి దక్కుతోన్నది ఏమిటి? ఉన్న కొద్దిపాటి పత్రికల్లోనూ, కథా సంకలనాల సంపాదక బృందంలోనూ ఉన్న మూసల కారణంగా ఆయా మూసల్లో ఇమిడిపోయే కథలు మాత్రమే వెలుగులోకి వస్తున్నాయిప్పుడు.

ఒకప్పుడు పత్రికలు సినిమాకి ప్లాట్ఫాం గా ఉండేవి. పత్రికల్లో వచ్చిన కథలనీ, నవలల్నీ సినిమాలు తీయడం, అందుకోసం మూల రచయితకి క్రెడిట్ తో పాటు కొంత పారితోషికం ఇవ్వడమో, లేక కథా విస్తరణలో సహకారం తీసుకోవడమో జరిగేది. ఫలితంగా రచయితకి ఆత్మతృప్తి తో పాటు పేరు, డబ్బూ మిగిలేవి. మరి ఇవాల్టి రోజున? సినిమా కి కథ అన్నదే అవసరం లేదు.. దర్శకుడికి నచ్చిన పాయింట్ ని కథగా మలచవలసిన రచయితకి కథా రచయితగా పేరు ఉండకపోవడమే పెద్ద అడ్వాంటేజ్. టీవీ సీరియళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుకోబోవడం కూడా అనవసరమే. మరి కథలూ, రచయితలూ ఎవరికి కావాలి?

కాబట్టి, నాణ్యమైన తెలుగు కథ అంతరించి పోవడం, రచయితలు కనుమరుగైపోవడం అన్న పరిణామానికి కేవలం ఒకటో రెండో కారణాలు చూపించలేము.. ఒకప్పుడు ఉచ్ఛ దశని చవి చూసిన వార పత్రికలు అనే మాధ్యమానికి ఇది సంధియుగం. అత్యంత సహజంగానే ఆ దశలో ఓ వెలుగు వెలిగిన కథలకీ, రచయితలకీ కూడా ఇది సంధి యుగమే. పత్రికలు మళ్ళీ పూర్వ వైభవం పొందుతాయా? లేని పక్షంలో వాటికి ప్రత్యామ్నాయం ఏమిటి? భవిష్యత్తులో పాఠకుల సంఖ్య పెరుగుతుందా లేక తగ్గుతుందా? కథా రచనకి డిమాండ్ పెరిగే అవకాశం ఉందా? ఈ ప్రశ్నలకి దొరికే సమాధానాల ఆధారంగా తెలుగులో నాణ్యమైన కథలు రాగలిగే అవకాశాలని అంచనా వేయగలుగుతాం.

బుధవారం, ఏప్రిల్ 20, 2011

కోనంగి

నామీద నాకు బాగా కోపం వచ్చిన కొన్ని సందర్భాలలో ఇదొకటి. దాదాపు పది నెలల క్రితం, 'నారాయణరావు' చదివిన హాంగోవర్ లో ఉండగా అడివి బాపిరాజు రాసిన మిగిలిన నవలలన్నీ సంకలనాలుగా విడుదల చేశారు విశాలాంధ్ర వాళ్ళు. అన్నీ వెంటనే కొనేశాను. కాకపొతే, అంత వెంటనేనూ చదవకుండా పక్కన పెట్టి ఉంచి ఇతరత్రా పుస్తకాలు ఒకటొకటిగా పూర్తి చేయడం మొదలు పెట్టాను. మొన్నోరోజు ఎందుకో బాపిరాజు గారు గుర్తొచ్చి, 'కోనంగి' ని పైకి తీశాను. చదివినంతసేపూ, పూర్తి చేసి పక్కన పెట్టాక కూడా నన్ను నేను తిట్టుకుంటూనే ఉన్నాను, ఈ పుస్తకాన్ని ఇంట్లో ఉంచుకుని కూడా చదవనందుకు.

కథ 1939 లో ప్రారంభమై తర్వాతి నాలుగేళ్ల కాలంలోనూ భారత స్వాతంత్ర పోరాటం తీరుతెన్నులనూ, అంతర్జాతీయ రాజకీయాలలో వచ్చిన మార్పులనీ నిశితంగా చిత్రిస్తూ 'కోనంగి' గా పిలవబడే కథానాయకుడు కోనంగేశ్వరరావు జీవితంలో చోటు చేసుకున్న అనూహ్య మార్పులని ఉత్కంఠభరితంగా పాఠకుల కళ్ళముందు ఉంచుతుంది. ఒక్క కోనంగి కథేనా? అతనికి అన్నిరకాలా సరిజోడి అయిన నాయిక అనంతలక్ష్మీ, ఆమె తల్లి జయలక్ష్మి, స్నేహితుడు మరియు కమ్యూనిస్టు డాక్టర్ రెడ్డి, అనంతలక్ష్మి మీద కన్నేసిన చెట్టియార్ ఇంకా అనేకానేకమంది కథ.

కోనంగి 'నారాయణరావం'త అందగాడు కాదు. ఆకర్షించే రూపం. మాటల పోగు. ముఖ్యంగా హాస్యభరితంగా మాట్లాడడం, కార్యసాధన చేయడం కొనంగికి వెన్నతో పెట్టిన విద్యలు. బందరులో బీయే పాసయ్యి, బతుకు తెరువు వెతుక్కుంటూ మద్రాసొచ్చిన కోనంగి, జీవితంలో స్థిరపడడం కోసం చేసిన మొదటి ప్రయత్నం వివాహం. 'హిందూ' పత్రికలో వరుడికోసం ఇచ్చిన ప్రకటన చూసి, సీతాదేవి అనే బాల వితంతువుని వివాహం ఆడడానికి మద్రాసులో అడుగు పెడతాడతడు. సీతాదేవి అతణ్ణి తిరస్కరించడం, కోనంగి అనంతలక్ష్మి తో తొలిచూపులోనే ప్రేమలో పడడం దాదాపు ఒకేసారి జరుగుతాయి.

అనంతలక్ష్మి మధురవాణి వంశీకురాలు. అయితే ఆమె తల్లి జయలక్ష్మిని ఓ ధనవంతుడైన అయ్యంగారు పెళ్లాడేడు. అయ్యంగారు అకాల మరణం తర్వాత మరో పురుషుడిని తన జీవితంలోకి రానివ్వలేదు జయలక్ష్మి. కుమార్తెని తన వృత్తిలో ప్రవేశింపనివ్వక ఒకరికి ఇల్లాలిని చేయాలన్నది జయలక్ష్మి కోరిక. క్వీన్ మేరీ కళాశాలలో చదువుతున్న అనంతలక్ష్మి చదువుతో పాటు ఆటపాటల్లో మేటి. అన్నింటా తరగతిలో ప్రధమురాలు. లలితకళల్లో అభినివేశం ఉంది. చక్కటి కవిత్వం రాస్తుంది. తనకి తెలుగు ట్యూషన్ చెప్పగల ఉపాధ్యాయుడి కోసం ఆమె వెతుకుతున్న సమయంలో ఉద్యోగం వెతుక్కుంటున్న కోనంగి తారసపడతాడామెకి. తొలిచూపులోనే కోనంగి పట్ల ఏదో తెలియని అభిమానం ఏర్పడుతుంది అనంతలక్ష్మికి.

కోనంగిది చిత్రమైన కథ. వితంతువైన తల్లికి, ఓ ధనవంతుడితో ఏర్పడ్డ సంబంధం కారణంగా జన్మిస్తాడు అతడు. తను చేసిన తప్పు కొడుకు రూపంలో కనిపిస్తూ ఉండడంతో అతణ్ణి దగ్గరకి తీయలేదు ఆ తల్లి. కోనంగి తండ్రి ఆస్తిని స్వీకరించడానికీ అంగీకరించదు. ఎన్నో ఇబ్బందులు పది చదువు పూర్తి చేసిన కోనంగి ఉద్యోగం కోసం మద్రాసు చేరతాడు. యుద్ధం రోజులు కావడంతో ఉద్యోగం దొరకడం అంత సులభం కాదని అర్ధమవుతుంది. దొరల కంపెనీలో సేల్స్ మెన్ గా చేరి తన మాట చాతుర్యంలో ఊహించని రీతిలో అమ్మకాలు పెంచిన కోనంగి, తనతో పనిచేసే ఆంగ్ల యువతి సారా తో ఏర్పడ్డ స్నేహం కారణంగా ఉద్యోగం పోగొట్టుకుంటాడు.

తిరిగి కంపెనీ వారు ఉద్యోగానికి ఆహ్వానించినా, దొరల పాలనకి వ్యతిరేకంగా దేశంలో ఉద్యమం జరుగుతున్న సమయంలో తాను దొరల కంపెనీలో పనిచేయడం సమంజసం కాదని భావించి తిరస్కరిస్తాడు. ఓ హోటల్లో సర్వర్ గా పనిచేస్తూనే, అనంతలక్ష్మి కి పాఠాలు చెబుతూ ఉంటాడు. అనంతలక్ష్మి ని తనదాన్ని చేసుకోవడం కోసం ప్రయత్నిస్తున్న చెట్టియార్, కోనంగి-అనంతలక్ష్మి ల అనుబంధాన్ని అనుమానించి కోనంగిపై హత్యాయత్నం చేయిస్తాడు. ఆ సమయంలో తనకి వైద్యం చేసి బతికించిన డాక్టరు రెడ్డితో గాఢమైన స్నేహం ఏర్పడుతుంది కోనంగికి.

రాజకీయంగా కోనంగిది గాంధీ మార్గం. రెడ్డి కమ్యూనిస్టు. ఈ భేదం వారి స్నేహానికి అడ్డు రాకపోగా, రెండు మార్గాలలోనూ ఉన్న మంచి చెడ్డలు చర్చకి వస్తూ ఉంటాయి. రెడ్డి ప్రోద్బలంతో 'దుక్కిటెద్దులు' అనే సినిమాలో కథానాయకుడిగా నటిస్తాడు కోనంగి. ఆ సినిమా విజయవంతమైనా, సినిమాల్లో కొనసాగడానికి ఇష్టపడడు. వివాహానికి వెలుపల ఉండే శారీరక సంబంధాల మీద గౌరవం లేని కోనంగి తనతో సంబంధం కోరిన సారానీ, సిని కథానాయికనీ సున్నితంగా తిరస్కరిస్తాడు. మరోవంక, అనంతలక్ష్మి తో కోనంగి ప్రేమ ఫలించి, జయలక్ష్మి అంగీకారంతో వారిద్దరి పెళ్ళీ జరుగుతుంది. తొలిరాత్రి జరిగిన మరునాటి ఉదయాన్నే అనూహ్య పరిస్థితుల్లో కోనంగినీ, డాక్టరు రెడ్డినీ ఓ కుట్ర కేసులో అరెస్టు చేస్తారు పోలీసులు.

జైల్లో ఉన్న కోనంగికి అనంతలక్ష్మి మీద అనుమానం కలిగే విధంగానూ, అటు అనంతలక్ష్మికి కోనంగిపై దురభిప్రాయం కలిగేలాగా ఆకాశ రామన్న ఉత్తరాల పరంపర మొదలవుతుంది. కోనంగి జైలు నుంచి విడుదలయ్యాడా? అనంతలక్ష్మిని కలిశాడా? అసలు జైలుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? భవిష్యత్తు కార్యాచరణని ఎలా నిర్ణయించుకున్నాడు? తదితర ప్రశ్నలకి సమాధానమే 'కోనంగి' నవల. చదువుతుండగా దాదాపు ఇదే కథాకాలంతో వచ్చిన నవలలు 'మాలపల్లి,' 'చదువు' 'రామరాజ్యానికి రహదారి' ఇత్యాదులన్నీ గుర్తొచ్చాయి. నవల పూర్తి చేశాక కోనంగిని మాత్రమే కాదు, అనంతలక్ష్మినీ మర్చిపోలేం. ఆనాటి సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులు, సిని, నాటక, పత్రికా రంగాలు అక్కడి పరిస్థితులు వీటన్నింటినీ నిశితంగా చిత్రించిన 'కోనంగి' నవల తెలుగు నవలా సాహిత్యాన్ని ఇష్టపడే వాళ్ళంతా తప్పక చదవాల్సిన పుస్తకం. (విశాలాంధ్ర ప్రచురణ, పేజీలు 286, వెల రూ. 150). బాపిరాజు ఇతర రచనలన్నీ వరుసగా చదివేయాలని బలంగా నిర్ణయించుకున్నానని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదూ..

ఆదివారం, ఏప్రిల్ 17, 2011

సుమన్ పలికిన 'శుభం'

ఇదేమిటీ 'అల్లుడు పట్టిన భరతం' లాగా? అని కదా సందేహం. మరి ఏం చేయాలి? ఉత్తినే 'శుభం' అని టైటిల్ పెట్టేస్తే నేనేదో నా బ్లాగుకి శుభం పలికేస్తున్నానని కొందరైనా అనుకునే ప్రమాదాన్ని శంకించిన వాడినై ఇలా మొదలు పెట్టాల్సి వచ్చింది. సూటిగా చెప్పకుండా ఈ సుత్తేమిటీ అన్న సందేహానికి నా సమాధానం ఏమిటంటే, మూడు గంటల పాటు సుమన్ బాబు ప్రీమియర్ షో ని శ్రద్ధగా చూసి, ఆ వెంటనే టపా రాయడం అంటే ఇదిగో ఇలాగే ఉంటుంది.

సినిమా నటీనటులెవరికీ సుమన్ బాబు-ఇంద్రనాగ్ ల ద్వయం తమ ప్రీమియర్ షో లలో అవకాశాలు ఇవ్వడం లేదన్న అపప్రదకి శుభం పలుకుతూ, సీనియర్మోస్ట్ కేరక్టర్ ఆర్టిస్ట్ అన్నపూర్ణని ఓ ముఖ్య పాత్రగా పెట్టి తీసిన తాజా ప్రీమియర్ షో నే ఇప్పుడు మనం చెప్పుకోబోయే 'శుభం.' సుమన్ ప్రొడక్షన్స్ సంస్థ సగర్వంగా సమర్పిస్తున్న ప్రీమియర్ షోల పరంపరలో ముచ్చటగా మూడోది. ఎప్పటిలాగే ప్రధాన పాత్రని సుమన్ బాబు యధాశక్తి పోషించగా అతని బామ్మ అన్నపూర్ణమ్మగా అదోమాదిరి పాత్రని అన్నపూర్ణ కొంచం ఎక్కువగానే భరించింది.

టైటిల్స్ పూర్తవ్వగానే అనగనగా ఓ ఆఫీసు. అక్కడ పనిచేసే ఓ అరడజను మంది ఆడా మగా ఉద్యోగుల పరిచయం తో కథ ప్రారంభం. తోలుబొమ్మలాటలో కేతిగాడు బంగారక్కల్లా కనిపించిన ఆ ఉద్యోగులని చూడగానే 'ఇంటిని చూసి ఇల్లాలిని, స్టాఫుని చూసి బాసునీ' చూడాలన్న సామెత గుర్తొచ్చేసి, వీళ్ళే ఇలా ఉంటే సదరు బాసు ఇంకెలా ఉంటాడోనన్న కుతూహలం కలిగింది. సరిగ్గా అప్పుడే స్పోర్ట్స్ షూ లతో బిగింప బడ్డ పాదాలు, జీన్స్ ఫేంట్ కవర్ చేసిన కాళ్ళు, ఆపై ఓ ఎర్ర చారల టీషర్ట్ నుంచి ఉబికి వస్తున్న బొజ్జా..వీటన్నింటినీ ముక్కలు ముక్కలుగా చూపిస్తూ ఆ పై బాస్ ముఖాన్ని క్లోజప్పుల్లో చూపించారు.

అస్సలు ఆశ్చర్యం కలగలేదు. ఆ బిల్డప్ చూడగానే అర్ధమైపోయింది, వచ్చెడు వాడు సుమన్ బాబు అని. అచ్చం నేనూహించినట్టుగానే జరిగింది. కొత్త విగ్గులో బాబుని అభిమానులు గుర్తుపట్టరేమో అని కాబోలు, పక్కనే పేరు కూడా రాశారు. బాస్ వసంత్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అధినేత వసంత్. అదేమిటో కానీ, ఆయన తన చాంబర్ లో కూర్చున్నది మొదలు రకరకాల అమ్మాయిలు రావడం, స్వయంవరం కోసం వచ్చామని చెప్పడం. ఆయనేమో 'మురారి' సినిమాలో మహేష్ బాబులా వాళ్ళని ముద్దు ముద్దుగా విసుక్కోవడం. 'ఇద్దరు పిల్లల తండ్రిలా కనిపిస్తున్నాడు, ఇతగాడికి ఇంకా పెళ్లి కాలేదా?' అని సందేహం నాకు.

ఆఫీసు నుంచి నిప్పులు కక్కుతూ ఇంటికొచ్చి, తనకున్న ఏకైక పెద్ద దిక్కు బామ్మ అన్నపూర్ణమ్మ మీద నిప్పులు చెరుగుతాడు వసంత్. ఆ బామ్మేమో హాస్య భరిత పాత్రలో తెలంగాణా శకుంతలలా రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి, పెళ్లి చేసుకోమని మనవణ్ణి ముద్దుగా విసుక్కుని, గోరుముద్దలు తినిపిస్తుంది. నెక్స్ట్ సీన్ హీరోయిన్ ఎంట్రీ.. ఇంట్లో కాదు, ఆఫీసులో. బోల్డన్ని క్లోజప్పుల్లో ఓ అమ్మాయిని చూపించేసరికి ఆవిడే హీరోయిన్ అని అర్ధమయ్యింది. ఆ అమ్మాయి హారిక (అంజు అస్రాని). ఆఫీస్ స్టాఫెవరూ పనిచేయడంలేదు కదా.. అందుకని పెండింగ్ లో ఉన్న పని పూర్తి చేయించడం కోసం బాస్ వైజాగ్ ఆఫీస్ నుంచి పిలిపించిన అకౌంటెంట్.

స్టాఫందరూ ఆమెని స్వయంవరంలో సెలెక్టయిన పెళ్లికూతురుగా అపార్ధం చేసుకోవడంతో, ఇదే అదనుగా భావించి ఆవిడ వసంత్ ని ప్రేమించేస్తుంది. (అతికష్టం మీద ఇచ్చిన సిగ్గెక్స్ప్రెషన్ పుణ్యమా అని ప్రేక్షకులు ఈ ప్రేమని అర్ధం చేసుకోగలుగుతారు.) నెక్స్ట్ సీన్ లో ఆవిడ వసంత్ ఇంటికి వెళ్తే, అక్కడ బామ్మ హారిక ని చూసి మనసు పారేసుకుని, మనవడంటే ఆ పిల్లకీ ఇష్టమేనని తెలుసుకుని, అతగాడిని పెళ్ళికి ఒప్పించాల్సిన బాధ్యతని ఆ పిల్ల మీద పెట్టేసి చేతులు దులిపేసుకుంటుంది.

వసంత్ తో కలిసి హోటల్ కి వెళ్లి కూల్ డ్రింక్ తనమీద పోసుకునీ, అతనితో షాపింగ్ కి వెళ్ళీ అతణ్ణి ప్రేమింపజేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది హారిక. ఇందులో భాగంగా అతణ్ణి తనకో చీర సెలక్ట్ చేసి పెట్టమంటుంది. నాలుగైదు మంచి చీరలు పక్కన పడేసి, అతను ఆరెంజ్ అని చెప్పిన ఎర్ర చీరనే కొనుక్కుని మర్నాడు ఆ చీర కట్టుకునే ఆఫీస్ కి వచ్చేస్తుంది హారిక. (ఇక్కడ రెండు విషయాలు.. అంత అర్జెంటుగా శారీ విత్ బ్లౌజ్ స్టిచింగ్ చేసిచ్చే టైలర్ ఎవరన్నా ఉన్నారా? ఉంటే చెప్పండి ప్లీజ్. రెండో విషయం.. ఆ చీరలో లాంగ్ షాట్లలోనూ, క్లోజప్పుల్లోనూ హారికని జమిలిగా చూడగానే వసంత్ తప్పకుండా 'ఇందువదన కుందరదన' అని పాటేసుకునేవాడు, చిరంజీవి తొందరపడి ఉండకపోతే)

మొత్తానికి హారిక కృషి వల్ల కన్నా, కాశీ వెళ్లిపోతానన్నబామ్మ బెదిరింపులకి లొంగి హారిక తో పెళ్ళికి ఒప్పుకుంటాడు వసంత్. అంగరంగ వైభవంగా జరిగిన పెళ్ళిలో కూల్డ్రింక్స్ అందించిన ఓ బీద అమ్మాయిని చూసి పద్దెనిమిది క్లోజప్ షాట్లలో స్టన్నయి పోతాడు పెళ్ళికొడుకు. అప్పుడొచ్చే ఫ్లాష్ బ్యాక్ లో తెలిసేదేమిటంటే, ఈ బీదమ్మాయి రాధ ('అందం' ఫేం భావన) గతంలో వసంత్ బీదవాడుగా ఉన్నప్పుడు అతను పెళ్లి చేసుకున్న గొప్పింటి అమ్మాయి అనీ, ఇతని బీదరికం భరించలేక విడిచి పెట్టి వెళ్లిపోయిందనీ, మనవడిని ఏకాకిగా చూడలేక రాధ చనిపోయిందని అబద్ధం చెప్పి బామ్మ అతణ్ణి రెండో పెళ్ళికి ఒప్పించిందనీను. కాస్త ఊరట ఏమిటంటే రాధ 'చనిపోయిందన్న' విషయం హారికకి తెలుసు.

పాపం, మనవడు రాధా రాధా అని కలవరిస్తున్నా, 'రాధ బతికున్నా చచ్చినట్టే, హారికే నీ భార్య' అని తేల్చి చెప్పి కాశీ యాత్రకి వెళ్ళిపోతుంది బామ్మ. (కాల్షీట్లు లేకపోవడం వల్ల అనుకుంటా, తర్వాత మళ్ళీ కనిపించలేదు..) "ముళ్ళ దారిలో మూడు ముళ్ళ బంధం.." అంటూ ఓ నేపధ్య గీతం. గాయకుడెవరో జేసుదాస్ లా ఫీలవుతూ పాడాడు. మన 'నాన్ స్టాప్ కామెడీ' ఫేం భోలేషా వలీ మ్యూజిక్. ఏమాటకామాట, మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. రాధని వెతుక్కుంటూ వెళ్ళిన వసంత్ కి తన తండ్రి మరణం, ఆస్తి దివాలా తదితర ఫ్లాష్ బ్యాక్ అంతా వివరంగా చెప్పేసి "మీ లాంటి ఉత్తముడికి నేను భార్యగా తగను, హారికే మీ భార్య" అనేస్తుంది రాధ.

అసలు రాధ ఊరు విడిచిపెట్టి వెళ్లిపోతానంటుంది కానీ మంచివాడు మరియు సున్నిత మనస్కుడైన వసంత్ ఒప్పుకోడు. ఆమె ఊళ్ళో ఉంటేనే తను హారికతో కాపురం చేస్తానని మారాం చేసి, మాట నెగ్గించుకుంటాడు. కట్ చేస్తే, పండు వెన్నెల, మల్లెపూలతో అలంకరించిన మంచం, మంచానికి ఓ చివర బితుకు బితుకుమంటూ వసంత్. పాలగ్లాసుతో హారిక ఆగమనం. (ఇక్కడ 'అయిగిరినందిని..' స్తోత్రం ఉంటే అద్దిరిపోయేది.. ప్చ్.. ఈసారి తొందరపడ్డది కళాతపస్వి, ఏమీ అనలేం..) హారిక మాత్రం బోల్డంత విశాల హృదయం కలదై, వసంత్ తనని పూర్తిగా ప్రేమించేందుకు టైం ఇస్తుంది.

రాధ విషయం హారిక తండ్రికీ, ఆ తర్వాత హారికకీ తెలిసిపోతుంది. హారిక తండ్రి -- సగటు తెలుగు సినిమా హీరోయిన్ తండ్రిలా -- రాధని ఊరు విడిచిపెట్టి వెళ్ళిపొమ్మని బెదిరిస్తాడు. హారికేమో ఎన్నో పాత సినిమాల్లోలాగా కొంగు చాపి "నాకు పతి భిక్ష పెట్టవా అక్కా" అని రాధని బతిమాలుకుంటుంది. ఎట్టకేలకి హారిక తను త్యాగం చేసేయాలని నిర్ణయించుకుంటుంది. అది చూసి తట్టుకోలేక రాధ ప్రాణాపాయం లోకి వెళ్ళిపోతుంది. (ఈ దశలో నేను వసంత్ చివరికి 'శ్రీవారి ముచ్చట్లు' లో అక్కినేనిలా మిగిలిపోతాడేమో అని అనుమానించాను). 'అంకితం' 'ఐలవ్యూ డాడీ' ల్లో లాగే కథ హాస్పిటల్ కి చేరుతుంది.

డాక్టర్ ఇద్దరు పేషెంట్లనీ బతికించేస్తాడు. వసంత్ ఇద్దరు భార్యల సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో అన్న అయోమయంలో ఉండగా, దర్శకుడు ఇంద్రనాగ్ స్వయంగా వచ్చి, తనని తాను పరిచయం చేసుకుని, కథకి భరతవాక్యం పలికించేస్తాడు. ఎప్పటిలాగే, ఎండ్ టైటిల్స్ రోలవుతుండగా పూజాదికాలు మొదలు షూటింగ్ విశేషాలు చూపించేశారు. గత రెండు షోలలా కాకుండా, ఈసారి ఇంద్రనాగ్ సుమన్ బాబు పాదాలకి నమస్కరించలేదు. సుమన్ బాబు పక్కనే రొమ్ము విరుచుకుని నిలబడ్డాడు. నెక్స్ట్ షో కి దర్శకుడు మారతాడో ఏమిటో.

ఎప్పటిలాగే సుమన్ బాబు చొక్కాలు, టీ షర్ట్లు చాలా బాగున్నాయి. ఎప్పటిలాగే మిగిలిన పాత్రలన్నీ వసంత్ మంచితనాన్ని శక్తి వంచన లేకుండా పొగిడాయి. ఎప్పటిలాగే కథానాయకుడు జరుగుతున్న వాటితో తనకి సంబంధం లేనట్టుగా నిర్వికారంగా చూస్తూ ఉండగా, అలా అలా సన్నివేశాలు వచ్చి కథని నడిపించేశాయి. బాబు వాడిన కొత్త విగ్గు బాగుంది. అది పాడవ్వనివిధంగా నటించడమూ బాగుంది. ఈసారైనా ఇలా ప్రీమియర్ షో కాకుండా భారీ జానపద చిత్రం తీస్తే బాగుండును.

గురువారం, ఏప్రిల్ 14, 2011

లౌక్యం

లౌక్యము అంటే ఏమిటి? మోసానికీ, లౌక్యానికీ భేదాలేమిటి? ..అదేమిటో కానీ ఈ ప్రశ్నలకి ఎప్పుడూ సంతృప్తికరమైన సమాధానం దొరకదు. అవతలి వాళ్ళని నొప్పించకుండా, మనకి కావాల్సిన విధంగా వాళ్ళని ఒప్పించడం లౌక్యం అనిపించుకుంటుందా? లౌక్యంలో యెంతో కొంత మోసం ఇమిడి ఉందా? అబద్ధం చెప్పక పోవడానికీ, నిజం చెప్పకుండా ఉండడానికీ ఉన్న భేదం లాంటిదే ఏదన్నా మోసానికీ, లౌక్యానికీ మధ్యన ఉందా? ఇవన్నీ ఎడతెగని ప్రశ్నలు.

"ఫలానా ఆయన చాలా లౌక్యుడు" అని ఎవరన్నా చెప్పినప్పుడు, సదరు వ్యక్తితో వ్యవహరించాల్సి వచ్చినప్పుడు యెంతో కొంత జాగ్రత్త పడిపోతాం కదా.. అయినప్పటికీ ఆయన మనకి తెలియకుండానే మనల్ని తన బుట్టలో వేసేసుకున్నప్పుడు, ఆ విషయం తర్వాతెప్పుడో మనకి తెలిసినప్పుడు ఆయన లౌక్యం ముందు మన జాగ్రత్త ఎందుకూ పనికి రాలేదు కదా అనిపించక మానదు. అలాంటప్పుడు సదరు లౌక్యాన్ని తెలియకుండానే అభినందించేస్తాం.

పైకి కనిపించకుండా లౌక్యం ప్రదర్శించడం అన్నది అందరికీ చేతనయ్యే విద్య కాదు. కొంతమంది ప్రదర్శించే లౌక్యం సులభంగా బయట పడిపోతూ ఉంటుంది. సాధారణంగా కార్యస్థలాలు ఇందుకు వేదికలు అవుతూ ఉంటాయి. బాసులే సదరు లౌక్యులు అవుతూ ఉంటారు. తను లౌక్యంగా ప్రవర్తించానని బాసుడు అనుకునేలా చేయడం ద్వారా ఉద్యోగులు కనిపించని లౌక్యాన్ని ప్రదర్శించేసి మంచి మార్కులు కొట్టేస్తూ ఉంటారు. అయితే ఇలా చేయడానికి ఉద్యోగుల్లో ఐక్యత అవసరం.. ఈ ప్రమాదం రాకుండా ఉండడం కోసమే చాలా మంది బాసులు విభజించి పాలిస్తూ ఉంటారేమో..

నలుగురు మనుషులు కలిసిన ప్రతి చోటా రాజకీయం పుడుతుందని కదా నానుడి.. నిజానికి రాజకీయం కన్నా ముందు లౌక్యం పుడుతుంది. అసలు లౌక్యం ముదిరితే రాజకీయం అవుతుంది అనడానికి కూడా అవకాశం ఉందేమో.. కొంచం పరిశోధనలు జరగాలిక్కడ. సుపరిపాలనకి లౌక్యం ముఖ్యావసరం. 'అర్ధశాస్త్రము' రాసిన కౌటిల్యుడు ఏమన్నాడు? "తుమ్మెద పుష్పాల నుంచి తేనెని గ్రహించినట్టుగా పాలకుడు ప్రజల నుంచి పన్నులు వసూలు చేయాలి" అని కదా.. దీనర్ధం పన్నులు విధించడంలోనూ, వసూలు చేయడంలోనూ లౌక్యం చూపమనే కదా..

"అది మోసం కాదు, నా లౌక్య ప్రజ్ఞే" అంటాడు రామప్పంతులు, మాయగుంటకి జాతకం బనాయించి ముసలి లుబ్దావదాన్లతో పెళ్లి సంబంధం కుదిర్చిన వైనాన్ని మధురవాణికి వర్ణించి వర్ణించి చెబుతూ.. "ఔరా! తాము చేస్తే లౌక్యమూ, మరొకరు చేస్తే మోసమూనా?" అని ఆశ్చర్య పోతుంది మధురవాణి. అయితే, ఇక్కడ మధురం చూపిన లౌక్యమూ తక్కువదేమీ కాదు. పెళ్ళికి లౌక్యులని పిలుచుకు రావడం కోసం పంతుల్ని పెద్దిపాలెం పంపేసి, అతగాడు తిరిగి వచ్చేలోగానే మాయగుంట తో అవధాన్లు పెళ్లి జరిపించేసి ఆపై తన కంటె కోసం పంతులుతో పెట్టుకున్న జట్టీని గురజాడ వారి 'కన్యాశుల్కం' చదివిన వాళ్ళని మర్చిపొమ్మన్నా మర్చిపోగలరా?

లౌక్యంగా బతికితే సౌఖ్యాలు పొందవచ్చా? వచ్చుననే అంటాడు దివాకరం. అదేనండీ, వంశీ 'ఏప్రిల్ 1 విడుదల' లో కథానాయకుడు. చుక్కలు తెమ్మన్నా కోసుకు తెచ్చేస్తానని భువనేశ్వరికి మాటిచ్చేశాడా? ఆవిడేమో చుక్కలొద్దు, నువ్వు నెల్లాళ్ళ పాటు కేవలం నిజాలు మాత్రమే మాట్లాడు చాలు అనేసరికి ఎక్కిళ్ళు మొదలవుతాయి మనవాడికి. అప్పటివరకూ చూపించిన లౌక్యాలన్నీ వరుసగా ఎదురు దెబ్బ కొట్టడం మొదలైపోతుంది. సౌఖ్యాలన్నీ అట్టే పోయి కష్టాలు మొదలైపోతాయి.

రామప్పంతుల్నీ, దివాకరాన్నీ చూడగానే ఒకటే సామెత గుర్తొస్తుంది. 'తాడిని తన్నేవాడుంటే వాడి తల దన్నేవాడు మరొకడు ఉంటాడు' అని. కానైతే ఆ వెంటే మరో ప్రశ్నా సర్రున దూసుకుని వచ్చేస్తుంది. అస్సలు లౌక్యం అనేదే చూపించకుండా బతకడం సాధ్యమా? అని. నిస్సందేహంగా దీనికి జవాబు 'కాదు' అనే చెప్పాలి. కానైతే దేనికన్నా ఓ పరిమితి అన్నది ఉంటుందని గుర్తుపెట్టుకోవడం కూడా అవసరమే మరి. ఇంతకీ లౌక్యము అంటే ఎదుటి వాళ్ళని మరీ ఎక్కువ మోసం చేయకుండా మనక్కావాల్సింది సాధించుకోడమేనా???

శనివారం, ఏప్రిల్ 09, 2011

జయప్రదం

ఈమధ్య కాలంలో నేను దాదాపు క్రమం తప్పకుండా చూసిన టీవీ కార్యక్రమాలలో ఒకటి గతంలో లోకల్ టీవీలో ప్రసారమై ఈ మధ్య వరకూ మాటీవీలో ప్రసారమైన 'జయప్రదం.' వెండి తెర మీద సౌందర్యానికి చిరునామాగా నిలబడ్డ జయప్రద ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత కావడమే ఇందుకు కారణం. అసలు జయప్రద అనగానే ఓ సరితమాధవి కళ్ళముందు మెదులుతారు. తనతో తెరని పంచుకున్న తారలనూ, అవకాశాలిచ్చిన సాంకేతిక నిపుణులని మాత్రమే కాక నేటి నటులు, నట వారసులు, సాంకేతిక నిపుణులనూ ఈ వేదిక ద్వారా ఇంటర్వ్యూ చేశారు జయప్రద.

ఇటు నటనలోనూ, అటు రాజకీయాలలోనూ తనదైన ముద్ర వేసిన జయప్రద, తొలిసారిగా బుల్లితెర మీద వ్యాఖ్యాత పాత్ర పోషించడం ఈ 'జయప్రదం' ప్రత్యేకత. ఇంటర్వ్యూలు చేయడం మంరీ అంత సులభమేమీ కాదని జయప్రదకి ఈ సరికి అర్ధమై ఉండాలి. కొందరు అతిధులతో ఆమె ఎంత చక్కగా మాట్లాడారో, మరికొందరిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు అంతగా తడబడ్డ సంగతి ప్రేక్షకులకి అర్ధమైపోయింది. నావరకు నాకు "జయప్రదది చక్కటి కాన్వెంట్ ఇంగ్లీష్" అన్న భ్రమలు ప్రారంభ ఎపిసోడ్స్ చూడగానే తొలగిపోయాయి.

నిజానికి ఇంగ్లీష్ మాత్రమే కాదు, ఆమె తెలుగూ అంతంత మాత్రమే అనిపించింది కొన్ని ప్రశ్నలని ఆమె 'సంధించిన' తీరు గమనించినప్పుడు. 'ఆయొక్క' 'మీయొక్క' లాంటి వాడుకలో లేని పదాలని వెతికి పట్టుకొచ్చి, ఒకటికి పదిసార్లు వాడి విసుగు రప్పించింది. అయిన దానికీ, కానిదానికీ పగలబడి నవ్వడం మరో మైనస్. సమయమూ, సందర్భమూ లేకుండా నవ్విన ఆ మాయల ఫకీర్ నవ్వు చూస్తే తనకి తాను కితకితలు పెట్టుకుని నవ్వుతున్నట్టుగా అనిపించింది. అయితే, వచ్చిన అతిధులకి అనుగుణంగా ఆమె ప్రవర్తిస్తున్నట్టుగా కొన్ని ఎపిసోడ్స్ తర్వాత అర్ధమయ్యింది.

జయప్రద అస్సలు శ్రద్ధ తీసుకొని మరో అంశం ఆహార్యం. కొన్ని ఎపిసోడ్లలో చాలా కృతకంగా, అసలు ఈమె జయప్రదేనా? అనిపించేలా ఉంది ఆమె మేకప్, వస్త్రధారణ. ముఖ్యంగా రాధిక ఎపిసోడ్లో జయప్రద మేకప్ చూసి కనీసం కొందరు చిన్న పిల్లలైనా జడుసుకుని ఉంటారని నా అంచనా. యువ నటులని ఆమె ఇంటర్వ్యూ చేసిన దాదాపు అన్ని ఎపిసోడ్స్ లోనూ ఆమె అలంకరణ కృతకంగానే ఉంది, వయసుని దాచుకునే ప్రయత్నం విఫలం కావడం వల్ల కావొచ్చు. అయితే కే. విశ్వనాధ్, అనుష్క, జయసుధల ఎపిసోడ్లలో మాత్రం జయప్రద 'స్టన్నింగ్' అంతే!

అసలు ఈ షో జయప్రద మాత్రమే ఎందుకు చేయాలి? ఎందుకంటే, అతిదుల్లో చాలామందితో ఆమికి సుదీర్ఘ పరిచయం ఉంది కాబట్టి. ఏ ఇతర వ్యాఖ్యాత కన్నా ఆమెకి రాపో ఎక్కువ కాబట్టి సహజంగానే కార్యక్రమం మరింతగా రక్తి కట్టించడానికి అవకాశం ఉంది. అయితే, వాస్తవంలో జరిగింది వేరు. కమల్ హాసన్ ని ఇంటర్వ్యూనే తీసుకుంటే వాళ్ళిద్దరూ బొత్తిగా అపరిచితుల్లాగా అనిపించారు. జయసుధతో కూడా మొదట చాలా మొహమాటంగా మాట్లాడి, రాను రాను ఆమె చూపిన చనువు వల్ల జయప్రద సహజంగా ప్రవర్తించడం చూసేవాళ్ల దృష్టిని దాటిపోలేదు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తో చేసిన ఎపిసోడ్ సరదాగా సాగుతూనే, సీరియస్ విషయాలనీ చర్చించగా, చిరంజీవి ఎపిసోడ్ హాస్యభరితంగా సాగింది. విశ్వనాధ్ ఎపిసోడ్ కొంచం గంభీరంగానూ, ప్రకాష్ రాజ్ ఎపిసోడ్ సీరియస్ గానూ సాగాయి. కృష్ణంరాజు షోలో ఆయన కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. అతిధుల సంబంధీకులు, అభిమానులు మాట్లాడిన వీడియోలు చూపించడం, అతిధుల బయోగ్రఫీని క్లుప్తంగా వివరించడం ఆకట్టుకున్నాయి. మొత్తం మీద నటీనటులు తెర మీద అలా కనిపించడం వెనుక, తెరవెనుక సాంకేతిక నిపుణుల కృషి ఎంత ఉంటుందో మరింత బాగా అర్ధమయ్యేలా చేసిన కార్యక్రమం ఈ 'జయప్రదం.'

శుక్రవారం, ఏప్రిల్ 08, 2011

నల్లరేగడి

పల్లెటూళ్ళలో పుట్టి పెరిగి గ్రామ రాజకీయాలెలా ఉంటాయో తెలిసిన వాళ్ళు ఒక్కసారిగా తమ జ్ఞాపకాలని తడిమి చూసుకునే నవల పాలగుమ్మి పద్మరాజు రాసిన 'నల్లరేగడి.' గ్రామీణ జీవితంతో ఏ మాత్రమూ పరిచయం లేనివాళ్ళకి అక్కడి ఒకనాటి సామాజిక, ఆర్ధిక రాజకీయ పరిస్థితులని గురించి దాదాపు పూర్తిగా అర్ధం చేసుకోడానికి ఉపయోగపడుతుందీ పుస్తకం. సాహిత్య అకాడమీ బహుమతి పొందిన ఈ నవలని 'పాలగుమ్మి పద్మరాజు రచనలు-2' సంకలనంలో మూడో నవలగా అందించింది విశాలాంధ్ర.

కథాకాలం దేశానికి స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళు. కథాస్థలం ఆంధ్ర దేశంలోని ఓ పల్లెటూరు. ఊరికేల్లా ఇద్దరే మోతుబరి రైతులు రామయ్య కాపు, సుబ్బయ్య కాపు. ఇద్దరిదీ చక్కని స్నేహం. ఒకరినొకరు బావా అని పిలుచుకుంటూ, ఊరి బాగుకోసం కలిసి పని చేయడమే కాదు వియ్యమందాలని కూడా నిర్ణయించుకుంటారు. మోతుబరులిద్దరూ ఏకమైపోతే ఊళ్ళో తన ఉనికి ప్రశ్నార్ధకమవుతుందన్న భయం మొదలవుతుంది కరణం ధర్మరాజులో.

కథానాయకుడు రాజు, సుబ్బయ్య కాపు చిన్న కొడుకు. ఆధునిక భావాలున్న వాడు. వ్యవసాయ పద్ధతుల మొదలు, కుటుంబ సంప్రదాయాల వరకూ ప్రతి విషయంలోనూ నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నవాడు. నాయిక లక్ష్మి రామయ్య కాపు గారాబుపట్టి. రాజంటే ప్రాణం ఆమెకి. రాజు ఇంట్లోనే ఉండే అతనికి మరదలి వరసయ్యే దూరపు బంధువు మల్లికి రాజుమీద అవ్యక్తమైన అభిమానం. చాలా సందర్భాల్లో రాజు అభిప్రాయాలూ అతను చేసే పనులూ తండ్రికీ, మామకీ ఇష్టం ఉండవు. కానీ అతను ఏం చేసినా ఆలోచించే చేస్తాడని నమ్మకం వాళ్లకి.

ఊరి పద్ధతికి విరుద్ధంగా ట్రాక్టరు వ్యవసాయం మొదలు పెడతారు రాజు. ఇది పెద్దలకి నచ్చదు. పశువులు తమ చెప్పుచేతల్లో ఉంటాయి, కానీ యంత్రం ఎలా పని చేస్తుందో తెలీదు. అదీకాక వ్యవసాయపు పనుల్ని నమ్ముకున్న కూలీల కుటుంబాలు రోడ్డున పడతాయి. ఇవన్నీ ఆలోచించినప్పటికీ, వాళ్ళు రాజుని నిరుత్సాహ పరచరు. అలాగే పెళ్ళికి కట్నం తీసుకోనంటాడు రాజు. ప్రభుత్వం వరకట్నానికి వ్యతిరేకంగా చట్టం చేసిన్దంటాడు. ఇవ్వకపోవడం తనకి పరువు తక్కువగా భావిస్తాడు రామయ్యకాపు. తీసుకోకుండా ఉండడం సుబ్బయ్యకాపుకీ ఇష్టం ఉండదు.

ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎక్కువ కాలం నిలబడదన్నది రాజు అభిప్రాయం. అందుకే తన పెళ్ళికి ముందే తన కోసం ఇంటి నిర్మాణం మొదలు పెడతాడు. ఈ విషయంలోనూ పెద్దవాళ్ళే సర్దుకుంటారు. గ్రామదేవత మల్లమ్మ తల్లి జాతరకి ముందు అమ్మవారి సమక్షంలో తాంబూలాలు మార్చుకుంటారు రామయ్య కాపు, సుబ్బయ్య కాపు. ఇక ముహూర్తాలు నిర్ణయించుకోవడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో, గుడి దగ్గర చిన్నగా మొదలైన ఓ తగువు రెండు కుటుంబాల మధ్యనా దూరాన్ని పెంచి పెంచి రామయ్య కాపు సుబ్బయ్యకాపులిద్దరినీ బద్ధ శత్రువులని చేస్తుంది.

ఎప్పుడూ లేని విధంగా ఊళ్లోకి పోలీసులు వస్తారు. అప్పుడే పంచాయతీ ఎన్నికలు రావడంతో గ్రామ రాజకీయాలు వేడందుకుంటాయి. ధర్మరాజు తన చానక్యాన్ని చూపి ఊళ్ళో ముఖ్యుడైపోతాడు. ప్రశాంతంగా ఉండే ఆ పల్లెలో హత్య, కిడ్నాపులు జరుగుతాయి. ఊహించని మలుపులతో కథ చకచకా సాగి ఊహాతీతమైన ముగింపుకి చేరుకుంటుంది. ఆసాంతం ఊపిరి బిగపట్టి చదివించే కథనం. కాకపొతే లెక్కకి మిక్కిలిగా ఉన్న అచ్చుతప్పులు చికాకు కలిగిస్తాయి.

నిజానికి నేను ఈ సంకలనం లో ఉన్న 'రెండవ అశోకుడి మూన్నాళ్ళ పాలన' 'రామరాజ్యానికి రహదారి' నవలలు పూర్తి చేసి, కొంత విరామం తర్వాత ఈ నవల చదవాలని అనుకున్నాను. కానీ అంతకాలం బుక్ షెల్ఫ్ లో నిరీక్షించడానికి పద్మరాజు గారు ససేమిరా అన్నారు. ఒక పాత్రకీ, మరోపాత్రకీ ఎలాంటి పోలికా లేకుండా పాత్రలని సృష్టించి వాటికి ప్రాణ ప్రతిష్ట చేయడం, మనస్తత్వాలని ఆధారంగా చేసుకుని కథని మలుపులు తిప్పడం పద్మరాజు గారి ప్రత్యేకత. (మూడు నవలల సంకలనం లో పేజీలు: 391, వెల రూ.180, విశాలాంధ్ర అన్ని శాఖలు)

గురువారం, ఏప్రిల్ 07, 2011

అలా మొదలైంది

"చాలా ఆలస్యమైంది.." సినిమా చూడడం పూర్తి చేసి థియేటర్ నుంచి బయటికి వస్తూ నాలోనేను అనుకున్న మాట ఇది. ఓ కొత్త దర్శకురాలు తీసిన చిన్న సినిమా విడుదలై, విజయవంతంగా ప్రదర్శితమవుతున్నా ఇన్నాళ్ళ వరకూ చూడడం వీలు పడలేదు నాకు. దాదాపుగా నా మిత్రులందరూ సినిమాని చూడడం, బాగుందని చెప్పడం జరిగిపోయింది. సినిమా చూశాక నాక్కలిగిన అభిప్రాయం కూడా ఇదే.

మిత్రులు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఒక ఫీల్ గుడ్ సినిమా చూడడానికి సిద్ధమై థియేటర్ కి వెళ్ళడం వల్ల, ప్రారంభ సన్నివేశం కొద్దిగా కన్ఫ్యూజ్ చేసింది నన్ను. ఓ కిడ్నాప్ తో కథ మొదలయ్యింది. నాయికా నాయకులు నిత్య (నిత్య మీనన్) గౌతం (నాని) లు అనుకోని పరిస్థితుల్లో కలుసుకుని, ఒకరిమీద ఒకరికి ఎలాంటి అభిప్రాయమూ ఏర్పడక ముందే విడిపోయి, అనుకోకుండా మళ్ళీ కలుసుకుంటూ, విడిపోతూ, అభిప్రాయాలు ఏర్పరుచుకుంటూ అప్పడప్పుడూ వాటిని మార్చుకుంటూ చివరికి ఏం చేశారన్నదే కథ.

నిజానికి ఈ సినిమాకి కథ కన్నా కథనమే ప్రాణం పోసింది. మామూలు కథని వైవిధ్య భరితంగా చెప్పడానికి కొత్త దర్శకురాలు నందినీరెడ్డి నమ్ముకున్నది స్క్రీన్ ప్లే ని. స్క్రీన్ ప్లే ని శ్రద్ధగా రాసుకుంటే మామూలుకథతో సినిమా తీసినా ప్రేక్షకులని మెప్పించవచ్చు అనడానికి ఉదాహరణ ఈ సినిమా. ఎందుకంటే సినిమా చూడడం పూర్తయ్యాక కథ ఏమిటి? అనుకున్నప్పుడు "ఇందులో కొత్త ఏముంది?" అనిపించక మానదు మరి.

అలాగే సినిమా అంతా కనిపించే అర్బన్ పోకడలు ఇది మల్టిప్లెక్స్ సినిమా అన్న విషయాన్ని చెప్పకనే చెబుతూ ఉంటాయి. సంభాషణల్లో తెలుగు కన్నా ఇంగ్లీషే ఎక్కువగా వినిపించింది. అలాగే అవసరం ఉన్నా లేకపోయినా హీరోయిన్ అరిచినట్టుగా డైలాగులు చెప్పడం ఎందుకో అర్ధం కాలేదు. బహుశా దానిని 'బబ్లీగా ఉండడం' అనుకోవాలేమో. గే కామెడీ ని అపహాస్యానికి కాకుండా హాస్యానికి వాడుకోవడాన్ని అభినందించాలి.

హాస్యం కోసం హాస్యం అన్నట్టుగా కాకుండా హాస్య సన్నివేశాల ద్వారా సందేశం ఇవ్వడానికీ ప్రయత్నించారు దర్శకురాలు. మొబైల్ ఫోన్లు విపరీతంగా వాడడాన్ని గురించి, మీడియా అతి గురించీ ఇంకా కుటుంబ బంధాల గురించీ బరువైన విషయాలని హత్తుకునేలా చెప్పడానికి హాస్యాన్ని వాడుకోవడంలో సఫలీకృతులయ్యారు నందిని. పాటలు మొదటిసారి విన్నది థియేటర్లోనే. సంగీతం మీద మరికొంచం శ్రద్ధ పెట్టి ఉండాల్సింది అనిపించింది.

నటీనటుల్లో మొదట ప్రస్తావించాల్సింది నిత్య గురించే. తొలి సినిమా అయినా చక్కగా చేసింది. ఇప్పటి సినిమాలతో పోలిస్తే కొద్దో గొప్పో నటించడానికి అవకాశం ఉన్న పాత్ర కావడం ఆమెకి కలిసొచ్చింది. మొదట చెప్పినట్టుగా డబ్బింగ్ మరికొంచం జాగ్రత్తగా చేయాల్సింది. నానికి వైవిధ్య భరితమైన పాత్రలు దొరుకుతున్నాయి. ఇందులో అతను టీవీ ఛానల్ రిపోర్టరా, కెమేరమేనా లేక దర్శకుడా అన్నది అర్ధం కాలేదు. చాలా కాలానికి రోహిణి కనిపించింది, తల్లిపాత్రలో. ఇప్పటి సినిమాల తల్లిపాత్రకి అచ్చమైన ప్రతిరూపం ఆమె పోషించిన రేవతి పాత్ర.

ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జాన్ గా నటించిన ఆశిష్ విద్యార్ధి గురించి. చాన్నాళ్ళకి ఓ వైవిధ్యభరితమైన పాత్ర దొరికింది ఇతనికి. చాలా బాగా చేశాడు కూడా. జాన్ పాత్రకి ఆశిష్ ని ఎంచుకోవడం కాస్టింగ్ పరంగా ఓ తెలివైన నిర్ణయం. ఐశ్వర్య రాయ్ కి నకలుగా చెప్పుకునే స్నేహ ఉల్లాల్ ఓ పాట నాలుగు సీన్ల అతిధి పాత్రలో కనిపించింది. ముగింపు సన్నివేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రలో కనిపించి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన రమేశ్ నటన గుర్తుండిపోతుంది. మంచి సినిమాని ఇచ్చిన నిర్మాత దామోదర్ ప్రసాద్, దర్శకురాలు నందినిరెడ్డి లకి అభినందనలు. మొత్తం మీద నందిని నుంచి మరిన్ని మంచి సినిమాలకోసం ఎదురు చూడొచ్చన్న ఆశ మొదలైంది.