"సిరిసిరిమువ్వ సినిమాలో హేమ వేషం వెయ్యమంటే, స్టేజి వదిలి సినిమాల్లో చెయ్యనని చెప్పేసిందిట" ... శోభానాయుడు పేరు బహుళ ప్రాచుర్యంలోకి వచ్చిన తొలి సందర్భం ఇది. సినిమాలంటే ఇప్పుడున్నంత క్రేజు నలభయ్యేళ్ళ క్రితం లేకపోయినా, పిలిచి సినిమా అవకాశం ఇస్తే వద్దనడం మాత్రం వార్తే అయ్యింది. అప్పటికే ఆమె పేరున్న నర్తకి. పెద్ద పెద్ద వేదికల మీద తప్ప, ఓ మాదిరి కార్యక్రమాలకి పిలిచేవారు కాదు. కొన్నాళ్లకే విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి వచ్చిన నర్తకి అనే విశేషణం తోడయ్యింది. శోభానాయుడు ప్రదర్శనల్ని చూస్తూ వచ్చింది మాత్రం గత పాతికేళ్లుగా. మొట్ట మొదట చూసిందీ, చివరిసారిగా చూసిందీ ఒకటే బ్యాలే - 'శ్రీనివాస కళ్యాణం.' ఆమె పద్మావతి. వేదిక మీద ఆమె నర్తిస్తూ ఉంటే కళ్ళుతిప్పి మరో పాత్రని చూడడం కష్టం, చూపు తిప్పుకోనివ్వనిది రూపం మాత్రమే కాదు, అభినయం కూడా.
విదేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో, స్థిరపడిన తెలుగు వాళ్ళు వాళ్ళ పిల్లలకి కూచిపూడి నేర్పించడం, వాళ్ళని హైదరాబాద్ తీసుకొచ్చి రవీంద్రభారతిలో అరంగేట్రం చేయించడం అనే పధ్ధతి ఓ పాతికేళ్ల క్రితం మొదలై, ఐదారేళ్ళ పాటు ఉధృతంగా సాగింది. యూఎస్ వెకేషన్ సీజన్ లో అయితే వారానికి రెండు మూడు అరంగేట్రాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీటిలో చాలా కార్యక్రమాలకి శోభానాయుడు ముఖ్య అతిధి. అరంగేట్రం చేసే పిల్లల గురువులు, శోభానాయుడు శిష్యులు. అలా, తన ప్రశిష్యుల్ని ఆశీర్వదించడం కోసం ఆమె వీలు చేసుకుని వచ్చేవాళ్ళు. నాలుగు ముక్కలు మాట్లాడే వాళ్ళు. వాటిలో తాను చిన్నప్పటి నుంచీ నృత్యం మీద ఇష్టం పెంచుకుని, నేర్చుకోవడం మొదలు, దేశ విదేశాల్లో ప్రదర్శనలు, అక్కడి అనుభవాలు ప్రముఖంగా వినిపించేవి. ఆమెని గురించి ఆమె నుంచే విన్న సంగతులు ఎన్నో.
ఒకసారి విదేశంలో (రష్యాలో అని జ్ఞాపకం) తన ప్రదర్శన చూసిన ఓ యువజంట, ఆ తర్వాత వాళ్ళకి పుట్టిన పాపకి శోభ అని పేరు పెట్టుకున్నారని చాలా అపురూపంగా జ్ఞాపకం చేసుకునేవారు. ఈ అరంగేట్రాల కాలంలోనే 'అశ్విని' హెయిరాయిల్ ప్రకటనకు మోడలింగ్ చేశారు శోభానాయుడు. సినిమాలే వద్దనుకున్నామె ఇలా మోడలింగ్ చేయడం ఏమిటన్న ఆశ్చర్యం కలిగింది. దాదాపు అదే సమయంలో ఐఏఎస్ అధికారి అర్జునరావుని ఆమె వివాహం చేసుకున్నారు. ఇద్దరూ చెరో రంగంలో సెలబ్రిటీలు కావడంతో ఆ వివాహం అప్పట్లో విశేషమైన వార్త అయ్యింది పేపర్లకీ, మేగజైన్లకీ. 'ఇండియా టుడే' లో చదివిన కథనం ఇప్పటికీ గుర్తే. మొదటినుంచీ ఆమె ట్రూపులోనూ, అకాడెమీ లోనూ పురుషుల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. పురుష పాత్రల్ని కూడా స్త్రీలే పోషించే వాళ్ళు. కొంతకాలం క్రితం ట్రూపు వరకూ సడలింపు ఇచ్చారు.
Google Image |
తెలుగింటి పాత్రల్నే కాక, చండాలిక లాంటి పాత్రలకీ తెలుగుదనం అద్ది ప్రదర్శించారు శోభానాయుడు. సత్యభామగా ఆమెని స్టేజి మీద చూడడం ఒక అనుభవం. రెప్పపాటులో ఆమె ఎక్స్ప్రెషన్ మారిపోయేది. అడుగులు కూడా అంతే వేగంగా పడేవి. ముఖ్యంగా లైవ్ ఆర్కెస్ట్రాతో ప్రదర్శన ఇచ్చేటప్పుడు పాడే వాళ్ళకి సవాలుగా ఉండేది ఆమె ప్రదర్శన. (ఇలా పోటీ ఇచ్చే మరో 'అభినవ సత్యభామ' గురు కళాకృష్ణ). రంగాలంకరణలో విశేషమైన మార్పులు శోభానాయుడుతోనే మొదలయ్యాయి అంటారు. తెరలు, లైటింగ్ లాంటి ప్రతి విషయంలోనూ ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారనీ, ఎక్కడా ఏ చిన్న విషయంలోనూ రాజీ పడరనీ చెప్పుకునే వారు. కొందరు నర్తకులు అభినయానికి (ఎక్స్ ప్రెషన్స్) , మరికొందరు అడుగులకీ (ఫుట్ వర్క్) పెట్టిందిపేరు. ఈ రెండింటిలోనూ విశేష ప్రతిభ ఉన్న కొద్దిమందిలో శోభానాయుడు ఒకరు. ఆమె నర్తిస్తుంటే అక్షరాలా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూడాలి, అది కూడా రెప్పపాటు లేకుండా.
దాదాపు రెండేళ్ల క్రితం ఆమెని ముఖాముఖీ కలిసే అవకాశం వచ్చింది. మా మిత్రులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 'శ్రీనివాస కళ్యాణం' ప్రదర్శించడానికి శిష్యులతో వచ్చారు. ఆర్గనైజర్లతో ఉన్న అనుబంధం వల్ల ఆమెతో కలిసి బ్రేక్ఫాస్ట్ తీసుకునే అవకాశం దొరికింది. 'సిరిసిరిమువ్వ' మొదలుగా చాలా విషయాలు దొర్లాయి కబుర్లలో. వాళ్ళమ్మాయి 'శివరంజని' ని పరిచయం చేశారు. బృందంలో ఆమె కూడా ఓ సభ్యురాలు. ఆవేళ రాత్రి ప్రదర్శించిన 'శ్రీనివాస కళ్యాణం' మాత్రం నిరాశ పరిచింది. అభినయం విషయంలో ఆమె రాజీ పడలేదు కానీ, అడుగులు చాలా బరువుగా పడ్డాయి. వయసు తెచ్చిన మార్పు శరీరంలో కనిపించింది కానీ, అది అడుగుల్లో కూడా కనిపించేసరికి బాధేసింది.
ఆ మర్నాడు సహజంగానే ఆమె ఆరోగ్యం గురించి చర్చ జరిగింది మాలో మాకు. అప్పుడు విన్న కొన్ని విషయాలు యద్దనపూడి సులోచనారాణి 'కీర్తి కిరీటాలు' నవలని గుర్తు చేశాయి. రెండు రోజుల క్రితం డాన్సర్ మిత్రులొకరు ఆమె ఆరోగ్యం బాలేదన్న అప్డేట్ ఇచ్చారు. అయితే, ఇంత విషమం అని ఊహించలేదు. ఆమె నృత్యం, ఆమె మాటలు, ఆమె జీవితం.. ఇవన్నీ ఉదయం నుంచీ ఏ పని చేస్తున్నా గుర్తొస్తూనే ఉన్నాయి. కూచిపూడి నృత్యరీతిని ప్రపంచం నలుమూలలకీ తీసుకెళ్లిన నర్తకి, ఎందరికో నాట్యం మీద ఆసక్తి కలిగించిన నర్తకి, నాట్యం తప్ప జీవితంలో ఇంకేదీ తన మొదటి ప్రాధాన్యత కాదని కడదాకా మనసా వాచా నమ్మిన నర్తకి 'ఇకలేరు' అనుకోవడం కష్టంగానే ఉంది. మువ్వల చప్పుళ్ళల్లో ఆమె జ్ఞాపకాలు కలగలిసిపోతాయి. శోభానాయుడు ఆత్మకి శాంతి కలగాలి..