"పున్నాగ కోవెల్లోన.. పూజారి దోసిళ్ళన్ని..
యవ్వనాలకు కానుక..."
వినడానికి మాత్రమే బాగుండే పాటల జాబితాలో చేర్చుకున్న పాట 'ప్రేమించు పెళ్లాడు' సినిమా కోసం వేటూరి రాసిన 'వయ్యారి గోదారమ్మ.. ' సాహిత్యంతో పాటుగా, ఇళయరాజా చేసిన స్వరం, బాలు-జానకిల గళం ఈ పాటని చిరంజీవిని చేసేశాయి. ఒక నర్సుతో ప్రేమలో పడ్డ ఓ కుర్రాడు, ఆమెతో పాడుకునే డ్యూయెట్ ఇది. అతిమామూలు సందర్భానికి కవితాత్మకంగా సాహిత్యం సమకూర్చారు వేటూరి.
"వయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం...
కడలి ఒడిలో కలసిపోతే కల-వరం..."
ప్రేమలో పడ్డ కుర్రాడికి నిద్దట్లో వచ్చే కలలో తన ప్రేయసి చేరువైతే ఆ 'కల' 'వరమే' కదా.
"ఇన్ని కలలిక ఎందుకో... కన్నె కలయిక కోరుకో...
కలవరింతే కౌగిలింతై..."
కలలెందుకు, కలయిక కోరుకో అంటోందా అమ్మాయి. 'కలవరం,' 'కల-వరం,' 'కలలిక,' 'కలయిక' ..పదాలతో ఆడుకోడం వేటూరికి కొత్తేమీ కాదు కదా.
"నిజము నా స్వప్నం... నీవు నా సత్యం ఔనో... కానో...
ఊహ నీవే... ఉసురుకారాదా..
మోహమల్లె... ముసురుకోరాదా..."
నా కల నిజం, నువ్వు నా నిజం అని అతనంటే, ఔనో/కానో అంటోందామె. నా ఊహల్లో ఉన్న నువ్వు ఊపిరివి కావొచ్చు కదా, మోహం లాగ నన్ను ముసురుకోవచ్చు కదా అని అడుగుతున్నాడతను.
"నవ్వేటి నక్షత్రాలు... మువ్వల్ని ముద్దాడంగ...
మువ్వగోపాలుని రాధికా...
ఆకాశవీణ గీతాలలోన... ఆలాపనై నే కరిగిపోనా..."
...అంటూ ముక్తాయించి చరణాన్ని ముగించాడతను. ఈ ముక్తాయింపు పూర్తిగా భావ కవిత్వమే అనిపిస్తుంది నాకు. పల్లవిలో లాగే ఇక్కడా 'మువ్వల్ని ముద్దాడంగ,' 'మువ్వగోపాలుని రాధికా' అంటూ శబ్దపరంగా దగ్గరగానూ, అర్ధంలో దూరంగానూ ఉండే పదాలు వాడారు వేటూరి.
"తాకితే తాపం... కమలం... భ్రమరం...
సోకితే మైకం... అధరం... మధురం...
ఆటవెలది... ఆడుతూరావే...
తేటగీతి... తేలిపోనీవే... "
కమలాన్ని భ్రమరం తాకడాన్ని గురించి, అధరం తాలూకు మధుర మైకాన్ని గురించి ప్రేమికులు కబుర్లాడుకోడం మామూలే. ఆమెని ఆటవెలది (నర్తకి) లా ఆడుతూ రమ్మంటున్నాడు. ఆ రావడంలో తేటగీతిని తేలిపోనివ్వమంటున్నాడా? (ఛందోరీతులైన ఆటవెలది, తేటగీతుల్ని ప్రేమగీతంలో ప్రవేశ పెట్టడం ముచ్చటైన విషయం).
"పున్నాగ కోవెల్లోన... పూజారి దోసిళ్ళన్ని...
యవ్వనాలకు కానుక...
యవ్వనాలకు కానుక...
చుంబించుకున్న... బింభాధరాల...
సూర్యోదయాలే పండేటి వేళ..."
మళ్ళీ గాఢమైన భావకవిత్వం! అతగాడు పున్నాగపూల కోవెల్లో పూజారట.. సదా అతడి దోసిళ్ళు నిండేది పున్నాగపూలతోనే. వాటిని యౌవనాలకి కానుక చేస్తున్నాడు. ఇక, అధరబింబాలు బింబాధరాలయ్యాయి. వాటి చుంబనాల్లో సూర్యోదయాలు పండుతాయట! (చిత్రీకరణలో నాయికకి అవసరానికి మించి లిప్ స్టిక్ వాడింది ఇందుకేనేమో మరి).
మామూలుగా పాటలు తీయడంలో ప్రత్యేక ముద్ర చూపించే దర్శకుడు వంశీ, ఈ చిత్రీకరణ విషయంలో మాత్రం సాహిత్యానికి, సంగీతానికి, గానానికి ఏమాత్రమూ న్యాయం చేయలేక పోయాడు. ఇంటర్లూడ్స్ లో వచ్చే క్లోజప్ షాట్స్ మినహా, పాటంతా నాయికా నాయకులు గోదారొడ్డున పరిగెడుతూనే ఉంటారు, ఏదో పరుగు పందానికి ప్రాక్టీస్ లాగా. విన్న ప్రతిసారీ 'బాగా తీస్తే బాగుండేది కదా' అనిపిస్తూ ఉంటుంది.