సోమవారం, సెప్టెంబర్ 25, 2017

కన్యాశుల్కం - ఇంకొన్ని కబుర్లు

తెలుగునాట ఆధునిక సాహిత్యానికి శక కర్తగా చెప్పదగ్గ గురజాడ అప్పారావు పంతులు రాసిన 'కన్యాశుల్కం' నాటకం తొలికూర్పు విడుదలై నూటపతికేళ్ళు. ఇవాళ్టికీ ఈ నాటకం ప్రేక్షకుల, పాఠకుల ఆదరణ పొందడమే కాదు, కాల పరీక్షకి నిలబడి భవిష్యత్తు తరాల ఆదరణనీ చూరగొంటుందన్న నమ్మకం రోజురోజుకీ బలపడుతోంది. "అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష" అని ఈ నాటకంలో అగ్నిహోత్రావధానులు పాత్ర పలుకుతుందో సన్నివేశంలో. ఆధునిక తెలుగు సమాజానికి సంబంధించినవి అన్నీ 'కన్యాశుల్కం' నాటకంలో కనిపిస్తాయి అనడంలో అతిశయోక్తి ఏమాత్రమూ లేదు. కాలం మారినా, సరికొత్త ఆవిష్కరణలు ఎన్ని ప్రవేశించినా మానవ నైజంలో పెద్దగా మార్పులేవీ రాలేదనడానికి సాక్షిగా నిలబడే నాకటం ఇది.

వేదవ్యాస విరచిత సంస్కృత భారతాన్ని, తెలుగులోకి అనువదించడానికి శ్రీకారం చుట్టిన నన్నయ భట్టారకుడిని తొలి తెలుగు రచయితగా గుర్తించింది చరిత్ర. క్రీస్తుశకం పదకొండో శతాబ్దం నాటి ముచ్చట ఇది. అటుపైని, తిక్కన, ఎఱ్ఱన భారత ఆంధ్రీకరణని పూర్తిచేశారు. అటుపైని శ్రీనాధుడు, బమ్మెర పోతన, శివకవులు.. ఈ వరుసలో శ్రీకృష్ణదేవరాయలు అటుపైని తంజావూరుని కేంద్రంగా చేసుకుని పాలించిన నాయకరాజుల కాలం. నన్నయ నుంచి నాయక రాజుల దగ్గరకి వచ్చేసరికి, సాహితీ శకం కవుల పేరు నుంచి రాజుల పేరు మీదకి బదిలీ అయింది. అనేక కారణాలకి, నాయక రాజుల కాలాన్ని సాహిత్యానికి 'క్షీణయుగం' అన్నారు. దేశం పరాయి పాలలోకి వెళ్లడంతో సహజంగానే కళా సాహిత్యాలు మూలన పడ్డాయి కొంతకాలం.

దాదాపు ఇదే సమయంలో భాషా ఉద్యమాలు మొదలై, వాడుక భాషలో కావ్యాలు రాయాలని నిశ్చయించారు వ్యవహార భాషా ఉద్యమకారులు.  దైవ లీలలనో, విరహం నిండిన ప్రేమ కథలనో కాక, సామాన్యుల సమస్యలని ఇతివృత్తాలుగా తీసుకుని రచనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది 'కన్యాశుల్కం' నాటకానికి పూర్వరంగం. ఇంగ్లీషు చదువుకున్న వారిలో భావ వైశాల్యం పెరిగి, ఆచారాలుగా చెలామణి అవుతున్న వాటిలో చెడుని గుర్తించి, సంస్కరణ ఉద్యమాలు ఊపందుకున్న సమయం కూడా అదే. ఇంగ్లీషు చదువుకున్న గురజాడ, చుట్టూ జరుగుతున్న భాషా, సంస్కరణ ఉద్యమాలని ఆకళింపు చేసుకున్నారు. విజయనగరం మహారాజు కోరిక మేరకు, బాల్యవివాహ సమస్యని గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి 'నాటకం' సరైన మాధ్యమంగా భావించి రచన ఆరంభించారు.

నాటి సమాజం ముందు సవాళ్లుగా నిలబడ్డ వితంతు పునర్వివాహం, యాంటీ నాచ్ ఉద్యమాలని కూడా నాటకంలో భాగం చేశారు. చేదుమాత్రకి తీపి పూతగా, ఇవ్వదల్చుకున్న  సందేశానికి హాస్యం, వ్యంగ్యం అనే మెరుగు పూతలు పూసి కాలానికి నిలబడే బలమైన పాత్రల్ని సృష్టించి, నానుడులుగా మిగిలిపోయే సంభాషణలు సృజించారు. నాటకం మొత్తంలో ఎక్కడా 'అనవసరం' అనిపించే పాత్ర కానీ, సన్నివేశంకానీ లేదు. ప్రాసకోసం ఏమాత్రం పాకులాడకుండా, పాత్రల ఔచిత్యం ఏమాత్రం చెడని విధంగా పదికాలాల పాటు నిలిచిపోయే సంభాషణలు రాయడం మామూలు విషయం ఏమీ కాదు. ఈ నాటకాన్ని మొదటిసారి చదివిన వాళ్లకి పేకాట సన్నివేశం, సారాయి దుకాణం సన్నివేశం అనవసరమనో, సాగతీత అనో అనిపించొచ్చు. మరోసారి చదివివినప్పుడు వాటి 'అవసరం' తప్పక బోధపడుతుంది. 

మనం ఉన్నది పితృస్వామ్య వ్యవస్థలో. అందుకే, ఓ నవల గురించి లేదా సినిమా గురించి చర్చ వచ్చినప్పుడు మొదటగా వచ్చే ప్రశ్న 'హీరో ఎవరు?' అని. ఇంతకీ, 'కన్యాశుల్కం' నాటకంలో హీరో ఎవరు? కథానాయక పాత్ర నాటకం/నవల/సినిమాలో ఆసాంతమూ ఉండాలి. మంచిచెడుల్లో మంచి వైపు నిలబడాలి. దుష్టులకి శిక్షించి, శిష్టులని రక్షించాలి. ఎంతోకొంత స్వీయ సంస్కారమూ పొందాలి. 'కన్యాశుల్కం' ని ఆమూలాగ్రం పరిశీలించినప్పుడు, ఈ లక్షణాలన్నీ ఉన్న ఒకేఒక్క పాత్రగా 'మధురవాణి' నిలబడుతుంది. సౌజన్యారావుపంతులు తో సహా మిగిలిన పాత్రలన్నీ ఆమె కన్నా ఓ మెట్టు కిందే నిలబడి కనిపిస్తాయి. హాస్యాన్నీ, వ్యంగ్యాన్ని అడ్డం పెట్టుకుని లోకరీతి మీదా, పెద్దమనుషుల మీదా ఆమె వేసిన చురకలు సామాన్యమైనవి కాదు.

నూటపాతికేళ్ల కాలంలో 'కన్యాశుల్కం' నాటకాన్ని గురించి వేల సంఖ్యలో చర్చలు, వందల సంఖ్యలో విమర్శ వ్యాసాలూ వచ్చాయి. నాటకం మీద, నాటకంలోని పాత్రల మీదా విశ్వవిద్యాలయ స్థాయిలో పరిశోధనలూ జరిగాయి. అయినా, ఇంకా మాట్లాడుకోడానికి ఇంకా చాలా మిగిలి ఉండడమే ఈ నాటకం ప్రత్యేకత. 'యద్భావం తద్భవతి' అన్నది ఈ నాటకం విషయంలో అక్షరాలా నిజం. విజయనగరం మహారాజా తో ఆరంభించి ఎందరో, ఎందరెందరో 'కన్యాశుల్కం' పల్లకీని మోశారు, మోస్తూనే ఉన్నారు. కమ్యూనిస్టు పార్టీ వారు ఈ నాటకాన్ని 'ఓన్' చేసుకున్నారు. వారి ముద్రశాలలు, మార్కెటింగ్ సౌకర్యాలు, సాహిత్యవిభాగాల కృషి కారణంగా ఈ నాటకానికి, తద్వారా పార్టీకి కూడా మంచి ప్రచారం జరిగింది. అదే సమయంలో, ఆ రాజకీయ భావజాలాన్ని వ్యతిరేకించే వారిలో కొందరు ఈ నాటకం జోలికి పోకుండా 'అదంతా లెఫ్ట్ వ్యవహారం' అని దూరం పెట్టడమూ నాకు తెలుసు.

ఇప్పటి తరంలో 'కన్యాశుల్కం' సంబంధీకులని గురించి ప్రస్తావించుకోవాల్సి వచ్చినప్పుడు, మొదట తల్చుకోవాల్సింది ఇటీవలే స్వర్గస్తులైన ఉపాధ్యాయుల అప్పల (యుఎ) నరసింహమూర్తి గారిని. "బీభత్స రస ప్రధానమైన విషాదాంత నాటకం" అన్న శ్రీశ్రీ వ్యాఖ్యని ఖండించడమే కాదు, ఆ వ్యాఖ్య నాటకం స్థాయిని తగ్గించేలా ఉన్నదని చెప్పడానికి మొహమాట పడలేదు. గురజాడ సాహిత్యం మొత్తాన్ని  'గురుజాడలు' పేరుతో ప్రచురించిన 'మనసు' ఫౌండేషన్ వారి కృషిని అభినందించాలి, తెలుగులోనే కాదు, భారతీయ భాషల్లో ఎక్కడా కూడా ఒక కల్పిత పాత్రకి ఆత్మకథ రాయడం అన్నది జరగలేదు. ఆ గౌరవం మన మధురవాణి కి దక్కింది. 'మధురవాణి ఊహాత్మక ఆత్మకథ' ని వెలువరించిన పెన్నేపల్లి గోపాలకృష్ణ కృషికి తగినంత గుర్తింపు రాలేదేమో అన్న భావన కలుగుతూ ఉంటుంది, ఆ పుస్తకాన్ని తిరగేసినప్పుడల్లా.

నది ఎప్పుడూ ఒకేలా ప్రవహించనట్టే, భాష కూడా ఎప్పుడూ ఒకేలా సాగదు. కాలం గడిచేకొద్దీ నదీ గమనంలో మార్పులొచ్చినట్టే, తరాలు గడిచే కొద్దీ వాడుక భాషలోనూ ఎన్నో మార్పులు వచ్చేస్తాయి. అప్పటివరకూ వాడుకలో ఉన్న పదాలు మరుగున పడడం, కొత్తపదాలు వచ్చి చేరడం సహజ పరిణామమే. మరి, నూట పాతికేళ్ల నాటి నాటకంలో అర్ధం కాని పదాలు ఎదురు పడకుండా ఉంటాయా? పాఠకులకి ఎదురయ్యే ఈ సమస్యని పరిష్కరించారు 'కన్యాశుల్కం పాఠకుడు' మందలపర్తి కిషోర్. 'కన్యాశుల్కం పలుకుబడి' పేరిట ఆయన వెలువరించిన నిఘంటువు పక్కన ఉంటే చాలు, నాటకం రెండు కూర్పుల్లోనూ ఏ ఒక్క పదమూ అర్ధం కాకపోవడం అన్న సమస్యే రాదు. ఇప్పటి తరమే కాదు, భవిష్యత్ తరాలు కూడా కిషోర్ కృషిని మెచ్చుకుని తీరాలి.

పఠనాసక్తి ఉన్నవాళ్లు 'మంచి పాఠకులు' కావాలంటే చదవాల్సిన పుస్తకాల జాబితాలో మొదటి వరసలో ఉంటుంది 'కన్యాశుల్కం.' రచనలు చేసేవాళ్ళు మంచి రచయితలుగా ఎదగాలంటే మళ్ళీ మళ్ళీ చదవాల్సిన పుస్తకం 'కన్యాశుల్కం.' " ఈ సమాజం ఎటుపో తోంది? మనుషులు ఎందుకిలా తయారవుతున్నారు?" లాంటి ప్రశ్నలు తలెత్తిన వెంటనే రిఫర్ చేయాల్సింది 'కన్యాశుల్కం' నాటకాన్నే. ఈ రచనకి రాజకీయాలని ఆపాదించడం అనవసరం అనిపిస్తుంది నాకు. గతంలో ఈ నాటకాన్ని గురించి బ్లాగులో ప్రస్తావించినప్పటికీ, నూటపాతికేళ్ల సందర్భంగా ఏమన్నా రాయాలి అనిపించింది. ఆ వెంటనే 'ఒక్కో పాత్రని గురించీ రాస్తే' అన్న ఆలోచన రావడం, బ్లాగు మిత్రులందరి ప్రోత్సాహంతో అక్షరరూపం దాల్చడం జరిగిపోయింది. మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.

ఆదివారం, సెప్టెంబర్ 24, 2017

హెడ్ కనిష్టీబు

ఏడంకాల 'కన్యాశుల్కం' నాటకంలో ప్రతీ అంకంలోనూ ప్రస్తావనకి వచ్చే పేరు హెడ్ కనిష్టీబు. పేరు కూడా తెలియని ఈ పాత్ర ప్రత్యక్షంలో కనిపించేది కొన్ని సన్నివేశాల్లోనే అయినా, పరోక్షంలో ఇతడి ప్రస్తావన చాలాసార్లే వస్తుంది. ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోలీసు వ్యవస్థ పనితీరు కంపెనీ పాలనా కాలంలో ఎలా ఉండేదో తెలుసుకోడానికి బహు చక్కగా ఉపయోగ పడే పాత్ర ఇది. ప్రధమాంకంలో పూటకూళ్ళమ్మ చేతా, గిరీశం చేతా దెబ్బలు తిన్న రామప్పంతులు "మధురవాణీ, యేవీ బేహద్బీ? కనిష్టీబుక్కబురంపించూ" అని పురమాయిస్తాడు, అక్కడికి హెడ్ కనిష్టీబు తన ఇంట్లో నౌఖరైనట్టు. ఇక రెండో అంకంలో గిరీశం లెక్చరు విన్న బండి అతనైతే "మాఊరి హెడ్ కానిస్టేబిల్ని కాంగ్రెస్ వారు యెప్పుడు బదిలీ చేస్తారు?" అని అడిగేస్తాడు.

హెడ్ కనిష్టీబు పాత్ర ప్రత్యక్షంగా కనిపించేది తృతీయాంకంలో రామచంద్రపురం అగ్రహారంలోని రామప్పంతులు ఇంట్లో. మధురవాణితో పంతులు సరసమాడుతున్న సమయంలో చుట్ట కాలుస్తూ ప్రవేశించి, కుర్చీ మీద కూర్చుని "రావప్పంతులూ.. యిన స్పెక్టరికే టోపీ వేశావటే?" అని ఏకవచనంలో అడిగి పంతులు పరువు తీసేస్తాడు. తన లౌక్య ప్రజ్ఞ ఉపయోగించి, దాన్ని హాస్యంగా తీసిపారేసే ప్రయత్నం చేసిన పంతుల్ని అడ్డుకుని, "యినస్పెక్టరు పేరు చెప్పి రావినాయుడి దగ్గర పాతిక రూపాయల్లాగావట. యిలా యందరి దగ్గర లాగాడో రావప్పంతుల్ని నిల్చున్న పాట్లాని పిలకట్టుకు యీడ్చుకురా అని నాతొ ఖచ్చితంగా చెప్పి ఇనస్పెక్టరు పాలెం వెళ్ళిపోయినాడు" అంటూ ఇక పరువన్నది మిగల్చడు. అయితే, అప్పటికే పంతులు వ్యవహారం అంతా 'పైన పటారం లోన లొటారం' అని మధురవాణికి తెలుసు కాబట్టి కొత్తగా వచ్చిన నష్టమేమీ లేదు.

రామప్పంతుల్ని తీసుకుని వెళ్తూ వెళ్తూ మధురవాణికి సౌజ్ఞ చేస్తాడు హెడ్ కనిష్టీబు. "అతడు ఇచ్చేది చచ్చేది లేదు గాని, జట్టీలేవైనా వొస్తే ఓ వొడ్డు కాస్తాడు" అనుకుంటుంది ఆత్మగతంగా. పంతులటు వెళ్ళగానే మాయగుంట వేషంలో ఉన్న శిష్యుణ్ణి వెంటబెట్టుకుని మారువేషంలో వచ్చిన కరటక శాస్త్రితో లుబ్దావధాన్లు సంబంధం నిశ్చయం చేసే విషయం మాట్లాడుతూ కూడా హెడ్ ప్రస్తావన తెస్తుంది మధురవాణి. "హెడ్ కనిష్టీబుకి మాత్రం కొంత నిజం చెబుదాం. అతగాడు ఇప్పుడే వస్తాడు" అంటుంది. "స్వాధీనుడేనా?" అని శాస్త్రి ప్రశ్నకి, "గులాం" అని జవాబిస్తుంది. ఇక చతుర్ధాంకంలో మాయగుంటకీ, లుబ్దావధాన్లుకీ జరిగే పెళ్ళిలో సందడంతా హెడ్ కనిష్టీబుదే. మధురవాణి హెడ్డుని తప్ప మరొకర్ని కన్నెత్తి చూడలేదు. బ్రాహ్మణ్యం యావన్మందీ గెడ్డం పట్టుకుని బతిమాలినా పాడక పోగా, హెడ్ కనిష్టీబుమీద విరగబడి నవ్వుతూ కబుర్లు చెప్పింది.

నాటకం పంచమాంకంలో మధురవాణి కంటెతో సహా మాయగుంట మాయమైపోయిన దగ్గర్నుంచీ నిజమైన పోలీసు డ్యూటీలో కి దిగుతాడు హెడ్ కనిష్టీబు. మొదట రామప్పంతులుతో కలిసి, ఖూనీ కేసని ఎత్తు ఎత్తి లుబ్దావధాన్లుని బెదరగొట్టి నాలుగు రాళ్లు లాగుతాడు. సారాయి దుకాణానికి తరచూ వచ్చే బైరాగి మహిమల మీద గుడ్డి నమ్మకం హెడ్డుకి. బైరాగిని కూడా సాక్షిగా వేసి, రెండు రాళ్లు ముట్టజెపుతాడు కూడా. సారాయి దుకాణంపు చర్చల్లో వితంతు వివాహాలని గట్టిగా సమర్థిస్తాడు. తీరా మాయగుంట కేసు అడ్డం తిరిగి,  అప్పటివరకూ తనకి అండగా ఉన్న ఇనస్పెక్టరు చీవాట్లు వేసేసరికి ఏం చేయాలో తోచని పరిస్థితిలో పడిపోతాడు. మాయగుంటని వెతికి కోర్టులో ప్రవేశ పెట్టక తీరని పరిస్థితి వచ్చినప్పుడు తన ఆశలన్నీ బైరాగి మీదే పెట్టుకుంటాడు హెడ్ కనిష్టీబు.

బైరాగి దగ్గర మహిమలేవీ లేవనీ, అతడికి తెలిసిందల్లా సారాయి దుకాణాల్లో బాకీలు పెట్టి ఇంకో ఊరు పారిపోవడమే అనీ పెద్దగా చదువుకోని సారాయి దుకాణ దారుకి అర్ధం అవుతుంది తప్ప, ఎంతో కొంత చదువుకుని ప్రభుత్వంలో పోలీసు ఉద్యోగం చేస్తున్న హెడ్డు మాత్రం బైరాగి అంజనం వేసి మాయగుంట ఆచోకీ కనిపెడతాడనీ, తనని కేసు నుంచి బయట పడేస్తాడనీ ఎదురు చూస్తూనే ఉంటాడు. "భాయీ! నీ రూపాయలు నేనిస్తాను. తెలివిమాలిన మాటలాడకు. గురువు గారికి కళ్ళు మొయ్యా ఆగ్రహవొస్తే మనం మండిపోతాం," అంటాడే తప్ప, బైరాగి మహిమలు నిజమే అయితే, సారాయి దుకాణ దారుడికి బాకీ పడాల్సిన అగత్యం ఏమిటని ఆలోచించడు. పవనం బంధించి వాయువేగం మీద ప్రయాణం చేసే శక్తి బైరాగికి ఉందనడంలో హెడ్ కనిష్టీబుకి ఏ సందేహమూ లేదు.

శత్రువులకు వాగ్బంధం చేస్తానని మాటిచ్చిన బైరాగి, "యినస్పెక్టరుకి మీ మీద యిష్టవని చెప్పేవారే?" అని గుర్తుచేసుకుంటాడు. "ఈ పెద్ద వుద్యోగస్తులకి దయలూ దాక్షిణ్యాలూ యేవిఁటి గురూ?వాళ్లకి యంత మేపినా, వాళ్లకి కారక్టు వొస్తుందనిగాని, ప్రమోషను వొస్తుందనిగాని ఆశ పుట్టినప్పుడు తెగని కత్తితో పీకలు తెగ గోస్తారు. మా యినస్పెక్టరుకి సూపరెంటు పని కావాలని ఆశుంది. తాసిల్దారికీ వాడికీ బలవద్విరోధం వుంది. ఆ విరోధం మధ్య నన్ను కొట్టేస్తూంది," అంటూ అధికార్ల గుట్టు విప్పుతాడు హెడ్ కనిష్టీబు. బైరాగి అంజనం వేసి మాయగుంట ఆచోకీ కనిపెడతానని హామీ ఇవ్వగానే, "అది మొగాడయినా, ఆడదయినా కూడా కనపడుతుందా భాయీ?" అని అడుగుతాడు. మధురవాణి 'కొంత నిజం' చెప్పింది కదా మరి.

"యవిడెన్సు యాక్టులో అంజనాలు, పిశాచాలూ సాక్ష్యానికి పనికొస్తాయిటయ్యా?" అని గిరీశం నిలదీస్తే కూడా, "ఆ బైరాగిని మీరెరగరు. ఆయన గొప్ప సిద్ధుడు. ఏం జెయ్యాలంటే అది చెయ్యగల్డు. అతడు పక్కని వుంటే నాకు కొండంత ధైర్యం వుండేది" అని వాపోతాడే తప్ప రెండో ఆలోచన చేయడు హెడ్ కనిష్టీబు. సారాయి దుకాణ దారుని బైరాగి నుంచి బాకీ వసూలు చేసుకోనివ్వడు. యంతసేపూ బైరాగినీ, అతడు వేయబోయే అంజనాన్నీ నమ్ముకుని ఎదురు చూస్తాడే తప్ప, కేసు విచారణకి ఇంకా ఏమన్నా మార్గాలున్నాయా అనే ఆలోచనే రాదనికి. ప్రపంచంలోనే శక్తివంతమైన పోలీసు వ్యవస్థగా పేరున్న బ్రిటిష్ పోలీసు వ్యవస్థలో క్షేత్రస్థాయి పనితీరు మీద గురజాడ విసిరిన వ్యంగ్య బాణమే హెడ్ కనిష్టీబు పాత్ర అనిపిస్తుంది. ఇవాళ్టికీ ఈ వ్యవస్థలో పెద్దగా మార్పులు కనిపించకపోవడం దురదృష్టకరం.

శనివారం, సెప్టెంబర్ 23, 2017

హవల్దారు అచ్చన్న

"గవునర్ మెంటూ, దేవుళ్ళూ, బ్రాహ్మలూ వారి నేరాలు వారివి. వాటితో మనకి పనిలేదు. మనభక్తి మనకుండాలి" అంటాడు 'కన్యాశుల్కం' నాటకం పంచమాంకంలో సారాయి దుకాణం సన్నివేశంలో మాత్రమే కనిపించే హవల్దారు అచ్చన్న. ఈ మాజీ సోల్జరు ఉద్దేశం అధికారంలో ఉన్నవాళ్ళ తప్పుల్ని పట్టించుకోనవసరం లేదని. గవర్నమెంటు, దేవుళ్ళు సరే. బ్రాహ్మల్ని ఎందుకు కలిపాడూ అంటే, నాటి సమాజంలో డబ్బుండి, అధికారంతో దగ్గర సంబంధం ఉన్న వర్గం అదే కదా మరి. లుబ్ధావధాన్లు పెళ్లాడిన మాయగుంట ఉన్నట్టుండి మాయమైపోయిన విషయం రామచంద్రపురం అగ్రహారపు కాళీ మండపం దగ్గరున్న సారాయి దుకాణానికి పాకింది. అప్పటికే మాయగుంట రెండో పెళ్లి పిల్ల అనే ప్రచారం ఆరంభించాడు రామప్పంతులు.

'కన్యాశుల్కం' నాటక రచయిత గురజాడ చర్చకి పెట్టదల్చుకున్న బాల్య వివాహ నిషేధం, వితంతు పునర్వివాహాలని గురించి లోతైన చర్చ సారాయి దుకాణం దగ్గరే జరుగుతుంది. "పోలీసోళ్ళకీ అక్కర్లేక, బాపనోళ్లకీ అక్కర్లేక, యెదవ ముండని బాపనాడు పెళ్లి జేసుకుంటే లోకం అంతా ఊరుకోవడవేనా?" అని చర్చ లేవదీస్తాడు గ్రామ మునసబు రామినీడు. ఆ రామినీడు మేనల్లుడే అచ్చన్న. ఈస్టిండియా కంపెనీ సైన్యంలో హవల్దారుగా పనిచేసి పింఛను పుచ్చుకుంటున్న వాడు.  "కలికాలంగదా భాయీ. ఎంతచెడ్డా బ్రాహ్మలు మనకి పూజ్యులు" అంటాడు అచ్చన్న. "తాక్క సోజరు వాడు చెడ్డాడు. తాగి సిపాయి వాడు చెడ్డాడు. జ్ఞానికి జ్ఞానపత్రి, తాగుబోతుకి సారాయి," అంటూ గ్లాసందుకుని సైన్యం కబుర్లు మొదలుపెడతాడు.

"పింఛను పుచ్చుకున్నా సిపాయినామా చెయ్యాలా?" అని రామినీడు అడిగినప్పుడు, "కుంఫిణీ నమ్మక్ (కంపెనీ ఉప్పు) తిన్న తర్వాత ప్రాణం ఉన్నంత కాలం కుంపిణీ బావుటాకి కొలువు చెయ్యాలి. రేపు రుషియాలో (రష్యాలో) యుద్ధం వొస్తే పింఛను ఫిరకా యావత్తూ బుజాన్ని తుపాకీ వెయ్యవా?" అన్న ప్రశ్ననే జవాబుగా చెబుతాడు. "మొన్నగాక మొన్న ఇంగిరీజ్ (బ్రిటిష్) రుషియా దేశానికి దండెత్తి పోయి రుషియాని తన్ని తగల లేదా? అప్పుడెవైందో ఇప్పుడూ అదే అవుతుంది" అని తన యజమాని పట్ల నమ్మకం ప్రదర్శిస్తాడు. ఈస్టిండియా కంపెనీ సైన్యంలో కింది స్థాయిలో పని చేసిన వారు కూడా యజమానుల పట్ల (పరాయిదేశస్తులే అయినా) ఎంత విశ్వాసంగా ఉన్నారో తెలుసుకోడానికి హవల్దారు చక్కని ఉదాహరణ.

"మా రాణీ చల్లగా ఉండాలి" అని కోరుకునే అచ్చన్నకి, సీమ రాణీ సాక్ష్యాత్తూ ఆ శ్రీరాముడి అవతారం అని బలమైన నమ్మకం. ఆమె కాళీమాయి అవతారం అన్న దుకాణదారుతో ఏమాత్రం ఏకీభవించడు సరికదా, "రాముడు పఠం కాళీ నెత్తిమీద పెట్టకపోతే కుంఫిణీ సిపాయిన్నవాడు ఇక్కడికి వొచ్చునా?" అని దుకాణదారునే నిలదీస్తాడు. చెప్పన్న దేశాలూ చూసిన హవల్దారు, "పరిపరివిధాల ఆచారాలు వ్యవహారాలు ఉన్నాయి కానీ నీతి వకటీ, భగవంతుడుడొకడూ అంతటా వొక్కటే" అని  తెలుసుకున్నానంటాడు. "ముసలి బాపనోడు యధవ గుంటని పెళ్లాడితే, మీ నేస్తం కరణపోణ్ణి (రామప్పంతులు), ఆ ముసలాడి యధవ కూతుర్ని (మీనాక్షి) పెళ్ళాడమని బోధ సెయ్యరాదా?" అని రామినీడు, హెడ్ కానిస్టీబుని వెటకారం చేసినప్పుడు, తాను కలగజేసుకుంటాడు అచ్చన్న.

"తెల్లా నల్లా వొకటా? తెల్లవాడికి క్రీస్తు వొక పధ్ధతి పెట్టాడు. ముసల్మాను కి పైగంబరు ఒక పధ్ధతి పెట్టాడు. నల్లవాడికి రాముడు వొక పధ్ధతి పెట్టాడు. భగవంతుడు తెల్లవాడితో ఏవన్నాడూ? వెధవని పెళ్లాడు అన్నాడు. రాముడు తెలుగువాడితో ఏవన్నాడూ? వెధవని పెళ్ళాడద్దు అన్నాడు" అంటూ కుండ బద్దలుకొడతాడు. సారాయి దుకాణపు చర్చే అయినప్పటికీ, తనకి స్థిరమైన అభిప్రాయలు ఉన్న విషయాలకి మాత్రమే స్పందించడం, తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడం అచ్చన్న పధ్ధతి. అందుకే, "రాముడు యెధవ ముండల్ని కాని పనులు సెయ మన్నాడూ? మన్లో మారు మనువులుండేవి కావా?" అని మునసబు తిరగేసినప్పుడు, మాటాడక ఊరుకుంటాడు.

తన యజమాని (గవర్నమెంట్), దేవుడు వీళ్లిద్దరి పక్కనా తన యజమాని దగ్గర వర్గాన్ని నిలబెట్టిన మాజీ సైనికుడు హవల్దార్ అచ్చన్న.ఆ వర్గం చేసిన తప్పుల్ని ఎంచడాన్ని తన యజమాని చేసిన, దేవుడు చేసిన తప్పుల్ని ఎంచడంతో సమంగా భావించాడు. అచ్చన్నకి మాంచి నిఖార్సైన మనిషని పేరుంది. సరిగ్గా సారాయి దుకాణంలో ఈ చర్చ జరుగుతున్నప్పుడే, కంటె విషయంలో హెడ్ కానిస్టీబు సాయం కోరి అతగాడిని వెతుక్కుంటూ వస్తాడు రామప్పంతులు. ఖూనీ కేసని చెప్పి లుబ్దావధాన్లుని బెదిరిస్తే నాలుగు రాళ్లు రాలతాయని సలహా ఇవ్వడంతో పాటు, దుకాణంలో ఉన్న అందరినీ సాక్ష్యానికి తెమ్మంటాడు. "హవల్దారు అబద్ధం ఆడమంటే తంతాడు" అంటాడు హెడ్ కానిస్టీబు.

సంఘంలో సంస్కరణల కోసం జరిగే ప్రయత్నాలకి ఏయే వర్గాల నుంచి ఎలాంటి స్పందన ఉంటుందో తెలియజెప్పే సారాయి దుకాణం సన్నివేశంలో, లోకజ్ఞానం తెలిసిన హవల్దారు అచ్చన్న వితంతు వివాహాలని వ్యతిరేకించాడు. దేశభక్తి, దైవభక్తి మెండుగా ఉన్న ఈ నడివయసు మనిషి సంస్కరలణని ఆహ్వానించడం కన్నా, వెనుకటి పద్ధతుల్లో ఉన్న చెడుని చూసీ చూడనట్టు ఊరుకోవడమే ఉత్తమం అన్న అభిప్రాయంతో ఉన్నాడు. నాటకంలో అతడి పాత్ర ఈ ఒక్క సన్నివేశానికే పరిమితం. 

శుక్రవారం, సెప్టెంబర్ 22, 2017

సౌజన్యారావు పంతులు

ఏదైనా ఒక వ్యవస్థ మీద జనానికి నమ్మకం పోతున్నప్పుడు ఆ వ్యవస్థలో ఏదన్నా అద్భుతం  జరుగుతూ ఉంటుంది. ఆ అద్భుతాన్ని ఆలంబనగా చేసుకుని ప్రజలు మళ్ళీ ఆ వ్యవస్థ మీద నమ్మకం పెంపొందించుకుంటూ ఉంటారు (మన ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లాగా). రామప్పంతులు లాంటి కోర్టు పక్షులు, నాయుడు, భీమారావు లాంటి వకీళ్లు, ఫోర్జరీ కాగితాలు, నకిలీ సాక్షులు కుప్పలు తెప్పలుగా పెరిగిపోయి మొత్తం న్యాయవ్యవస్థ ద్వారా జరిగే 'న్యాయం' అన్నది సందేహాస్పదమయిన తరుణంలో ప్రవేశించాడు వకీలు సౌజన్యారావు పంతులు. కల్పిత సాక్ష్యాలకీ, నకిలీ పత్రాలకీ శుద్ధ వ్యతిరేకి. సాక్ష్యం అంటే నిజమైన సాక్ష్యమే అయి ఉండాలన్న 'సత్తెకాలపు' మనిషి. అంతేకాదు, పార్టీ ఇచ్చే ఫీజుమీద కన్నా తన పార్టీ కేసు గెలవడమే ముఖ్యంగా భావించుకునే వకీలు సౌజన్యారావు 'కన్యాశుల్కం' నాటకం చివరి రెండంకాల్లో కనిపించే ప్రత్యేక అతిధి పాత్ర.

లుబ్దావధాన్లుని పెళ్లాడిన మాయగుంట, మధురవాణి కంటెతో సహా గోడ దూకి పారిపోవడంతో, తన కంటె తెచ్చి ఇస్తే తప్ప అతగాడి ఇంట్లోకి అతగాడిని అడుగు పెట్టనిచ్చేది లేదని భీష్మించుకు కూర్చుంటుంది మధురవాణి. కంటెని సాధించడం కోసం లుబ్దావధాన్లే మాయగుంటని ఖూనీ చేశాడని కథ అల్లి కేసు బనాయిస్తాడు రామప్పంతులు. కోర్టులన్నీ తన చెప్పుచేతల్లో ఉన్నాయనీ, ఎలాంటి సాక్ష్యాన్నయినా పుట్టించగలననీ రామప్పంతులు దిలాసా. మాయగుంటనీ, కంటెనీ వెతకాల్సిన బాధ్యత పోలీసులది. వాళ్ళు కూడా రెండు గ్రూపులుగా చీలిపోయారు - ఖూనీ జరిగిందనీ, జరగలేదనీ. ఈ గందరగోళం చాలక, బుచ్చమ్మని లేవదీసుకుపోయిన గిరీశం మీద అబ్ డక్షన్ కేసు బనాయించాడు అగ్నిహోత్రావధానులు. విశాఖపట్నం ప్లీడర్లకి చేతినిండా పని.

సత్యసంధత, సంఘ సంస్కరణాభిలాష మెండుగా ఉన్న సౌజన్యారావు పంతులు యాంటీ నాచ్. అంటే, సానివాళ్ళ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉన్నవాడు. వేశ్యావృత్తిని నిర్మూలించాలనే ఆశయంతో పనిచేస్తున్న వాడు. ఏకేసుని పడితే ఆ కేసుని  తీసుకోడు. తన దగ్గరికి వచ్చిన పార్టీ పక్షాన న్యాయం ఉందని నమ్మితేనే రంగంలోకి దిగుతాడు. ఖూనీ కేసు నుంచి బయట పడేయమని లుబ్దావధాన్లు తనని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఆ ముసలి  బ్రాహ్మడి మీద నమ్మకం కలిగింది సౌజన్యారావుకి. వెంటనే కేసు టేకప్ చేశాడు. అదిమొదలు నిజమైన సాక్షుల కోసం వెతుకులాట ఆరంభించాడు. పోలిశెట్టితో సహా ఎవరూ సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా లేరు. ఎట్టి పరిస్థితుల్లోనూ లుబ్దావధాన్లుని రక్షించాలన్న పట్టుదల పెరిగిపోయింది ఆ వకీలులో.

మాయగుంట వేషం మార్చేసుకుని, ఊరు దాటేసే ముందు మధురవాణి కంటెని ఆమెకే ఇచ్చేశాడు మహేశం. కానీ, అది రహస్యంగా జరిగిపోయింది. ఆ కంటెని, కన్యాశుల్కంగా పుచ్చుకున్న పన్నెండువందల రూపాయల సొమ్మునీ బంగీ కట్టి లుబ్దావధాన్లుకి పంపిస్తే ఖూనీ జరగలేదని పోల్చుకుంటారన్నది కరటక శాస్త్రి ఆలోచన. కంటె కోసం మధురవాణిని ఒప్పించే క్రమంలో సౌజన్యారావు పంతులు సౌజన్యాన్ని వేనోళ్ళ వర్ణిస్తాడు శాస్త్రి. అది విన్నవాళ్లకి ఎవరికైనా 'లోకంలో ఇంకా ఇలాంటి మనుషులున్నారా?' అన్న సందేహం కలుగుతుంది. మధురవాణికీ అదే సందేహం కలిగింది. ఆమె, సౌజన్యారావు పంతులు దర్శనం చేయాలనుకుంది. అతగాడు చూస్తే యాంటీ నాచ్. వేశ్య ముఖం చూడడానికి కూడా ఇష్టపడడు. అందుకే ఓ రాత్రి వేళ మారువేషం వేసుకుని, తలపాగా చుట్టుకుని అతడి బసకి బయలుదేరుతుంది.

"మనం చెడ్డవారని అనుకునే వారి యెడల కూడా మంచిగా వుండుటకు ప్రయత్నము చేస్తే దయాపరిపూర్ణుడైన భగవంతుడు సృజించిన యీ లోకము మీకు మరింత యింపుగా కనపడుతుంది! మీకూ, మీ పరిచయం కలిగిన వారికీ మరింత సౌఖ్యము కలుగుతుంది. కాక, మంచిచెడ్డలు ఏర్పర్చగలిగిన వాడు యెవడు? మంచిలోనూ చెడ్డ ఉంటుంది. చెడ్డలోనూ మంచి ఉంటుంది" అంటూ మారువేషంలో ఉన్న మధురవాణితో సంభాషణ ఆరంభిస్తాడు సౌజన్యారావు పంతులు. "మంచిగా వుందామని ప్రయత్నిస్తున్నాను. అంతకన్న నాయందు యోగ్యతేమీ లేదు" అని తన గురించి చెప్పుకుని, లుబ్దావధాన్లు కేసులో సాయం చేసే ఎవరినైనా తమ పాలిట దేవుడిగా భావించుకుంటాం అంటాడు. ఆ సహాయం ఒక వేశ్య వల్ల జరగాల్సి ఉందనీ, ఆమె డబ్బుకి అసాధ్యురాలనీ విన్నప్పుడు, ఆలోచనలో పడతాడు. తాను ఆమెని ఉంచుకున్న పక్షంలో లుబ్దావధాన్లుకి సాయపడగలదు అన్న మాట విన్నప్పుడు మొదట కోపం తెచ్చుకుంటాడు, అటుపైని శత్రువుల కుట్ర ఉందేమో అని సందేహిస్తాడు.

మధురవాణి తన మారువేషం తీసేసి, "నా వూరూ పేరూ అడిగితిరి. వూరు విజయనగరం, పేరు మధురవాణి" అన్నప్పుడు, మొదట ఆశ్చర్యం, అటుపైని కోపావేశం కలుగుతాయి సౌజన్యారావు పంతులికి. తాను మంచిదానిని అని నమ్మించడానికి ఒక తుని తగువు మనవి చేస్తానంటుంది మధురవాణి. "అట్టే సేపు నువ్వు నా యెదుటగానీ నిలిచి ఉంటే నువ్వు ఏ తగువు తీరిస్తే ఆ తగువుకి ఒప్పుదల అవుతానేమో అని భయవేస్తోంది" అన్న సౌజన్యారావు జవాబు వింటున్నప్పుడు "ఎంతనేర్చిన..." కీర్తన గుర్తొచ్చి తీరుతుంది! కరటక శాస్త్రులే గుంటూరు శాస్త్రులని, మహేశమే మాయగుంట అనీ విన్నప్పుడు "ఔరా.. ఏమి చిత్రము! మేలుకున్నానా, నిద్రబోతున్నానా?" అని ఆశ్చర్యపోయి, అటుపైని బీదవాడిని కాబట్టి ఫీజు (మధురవాణికి ఒక ముద్దు) ఇచ్చుకోలేనంటాడు. "నీవు సొగసరివి. ముద్దు చేదని కాదు. వ్రతభంగం (యాంటీనాచ్) గదా అని దిగులు" అంటూనే ముద్దు పెట్టుకోబోతాడు. కానీ, మధురవాణి సమ్మతించదు.

"నువ్వు మంచి దానివి. ఎవరో కాలుజారిన సత్పురుషుల పిల్లవై వుంటావు. ఈ వృత్తి మానలేవూ, స్థితి లోపమా?" అన్న సౌజన్యారావు ప్రశ్న ఒకింత గందరగోళ పరుస్తుంది. సత్పురుషులైతే కాలు ఎందుకు జారతారు? కాలు జారాక సత్పురుషులు ఎలా అవుతారు?? సత్పురుషుడనే నామం సార్ధకంగాగల శ్రీకృష్ణుడిని (భగవద్గీత) ఆమెకి కానుకగా ఇస్తాడు. "అప్పుడప్పుడు తమ దర్శనం చేయవచ్చునా?" అన్న మధురవాణి ప్రశ్నకి తటపటాయిస్తాడు. "వృత్తి మానినా, మంచి-" అంటూ భవిష్యత్తుని గురించి తన నిర్ణయాన్ని చెబుతుందామె. "అయితే రావచ్చును" అంటాడు సంతోషంగా. యాంటీనాచ్ సౌజన్యారావు పంతులు, ఒక్క మధురవాణిలో మార్పుకి దోహదం చేసి ఊరుకోకుండా, ఆమె ద్వారా వేశ్యావృత్తిలో ఉన్నవారిలో మార్పు కోసం ప్రయత్నం చేసి ఉంటే, మధురవాణి ఒక్క భక్తి మార్గానికే పరిమితం కాకుండా, సంఘసేవలోనూ రాణించి ఉండేది కదా అనిపిస్తుంది.

మధురవాణి వచ్చి చెప్పేవరకూ తన శిష్యుడు గిరీశం అసలు రంగుని పోల్చుకోలేక పోతాడు సౌజన్యారావు పంతులు. ఇది గిరీశం  గొప్పదనమా లేక పంతులు బోళా తనమా అన్నది ప్రశ్నే. అయితే, అసలు సంగతి తెలిసిన మరుక్షణం, గిరీశాన్ని ఇంటినుంచి గెంటేయడమే కాక, బుచ్చమ్మని కలవడానికి వీల్లేకుండా ఏర్పాటు చేస్తాడు. ఆమెని పూనాలో విడోస్ హోమ్ కి పంపి చదివించాలనీ, చదువు పూర్తయ్యాక తనకి నచ్చిన వాడిని పెళ్లిచేసుకోవచ్చనీ నిర్ణయిస్తాడు. అటు, లుబ్దావధాన్లులో మార్పు తెచ్చి మీనాక్షిని వితంతువుల మఠానికి పంపే ఏర్పాటు చేస్తాడు. రామప్పంతులు లాంటి వాళ్ళని దూరం పెట్టడం ఒక్కటే పరిష్కారంగా భావించాడు. యెంత ప్రయత్నించినా, సౌజన్యారావు పంతులు మార్పు తేలేకపోయింది ఒక్క అగ్నిహోత్రావధానులులోనే. అనునయ వాక్యాలకీ, బెదిరింపులకీ కూడా లొంగడు అగ్నిహోత్రావధానులు. సౌజన్యారావు పంతులే వుండి ఉండకపోతే మాయగుంట ఖూనీ కేసు ఎన్నెన్ని మలుపులు తిరిగి ఉండేదో ఊహించడం కష్టమే.

గురువారం, సెప్టెంబర్ 21, 2017

సిద్ధాంతి

"పంచాంగానికేం ఈ వెధవ పల్లిటూర్లో? సిద్ధాంతి ఆడింది ఆటా. పాడింది పాటా. యంత ద్రోహం చేశాడయ్యా సిద్ధాంతి?" అంటూ సిద్ధాంతి మీద చిందులు తొక్కుతాడు రామప్పంతులు - లుబ్దావధాన్లు పెళ్లి కోసమని తాను పెద్దిపాలెం వెళ్లి లౌక్యుల్ని పిలుచుకుని వచ్చేసరికే ఆ పెళ్ళి కాస్తా అయిపోవడం చూసి. తెల్లవారి నాలుగు ఘడియలకి ముహూర్తమని చెప్పిన సిద్ధాంతి, రామప్పంతులు అటు వెళ్ళగానే శుభ ముహూర్తాన్ని నాలుగు ఘడియల రాత్రి ఉందనగాకి మార్చేసి, మాయగుంటతో లుబ్ధావధాన్లుకి పెళ్లి జరిపించేసి, గుంటూరు శాస్త్రులు వేషంలో ఉన్న కరటక శాస్త్రిని 'కన్యాశుల్కం' తో సహా ఊరి పొలిమేర దాటించేస్తాడు. ఆ శుల్కంలో సగం వాటా తనకి ఇచ్చేలా గుంటూరు శాస్త్రులుతో ఒప్పందం కుదుర్చుకున్నాకే, లుబ్దావధాన్లుకి సుబ్బితో జరగాల్సిన పెళ్లిని రద్దుచేసి, మాయగుంటతో స్థిరపరుస్తాడు రామప్పంతులు.

పంతులు చెప్పినట్టుగానే రామచంద్రపురం అగ్రహారంలో సిద్ధాంతి ఆడింది ఆట, పాడింది పాట. కాబట్టే, ఆ సిద్ధాంతినే అడ్డం పెట్టుకుని వృద్ధుడైన లుబ్ధావధాన్లుని పెళ్ళికి ఒప్పిస్తాడు రామప్పంతులు, తన లౌక్యప్రజ్ఞని అంతటినీ వినియోగించి. "మన సిద్ధాంతిని దువ్వేటప్పటికి వాడేం జేశాడనుకున్నావు? లుబ్ధావధాన్లు జాతకం యగాదిగా చూసి శీఘ్రంలో వివాహ యోగవుందన్నాడు. ఆ వివాహం వల్ల ధనయోగవుందన్నాడు. దాంతో ముసలాడికి డబ్బొస్తుందన్న ఆశ ముందుకీ, డబ్బు ఖర్చవుతుందన్న భయం వెనక్కీ లాగడం ఆరంభించింది," అంటూ నాటకం తృతీయాంకంలో లుబ్దావధాన్లుని పెళ్ళికి ఒప్పించిన వైనాన్ని రామప్పంతులు మధురవాణితో చెబుతున్నప్పుడు మొదటిసారిగా సిద్ధాంతి ప్రస్తావన వస్తుంది. పంతులు ప్రలోభానికి లొంగి, జాతకంలో వివాహ యోగాన్ని కల్పించినప్పుడే సిద్ధాంతి ఎలాంటివాడన్నది తెలిసిపోతుంది.

అదే అంకం తర్వాతి సన్నివేశంలో, మాయగుంట వేషంలో ఉన్న మహేశాన్ని తీసుకుని, గుంటూరు శాస్త్రులు వేషంలో వచ్చిన కరటక శాస్త్రి తన పథకాన్ని మధురవాణికి వివరంగా చెప్పినప్పుడు కూడా, "మా పంతులు వక్కడివల్లా ఈ పని కానేరదు" అంటుంది మధురవాణి. ఇంకా ఎవరెవరి సహాయం అవసరమవుతుందో చెబుతూ, సిద్ధాంతిని చూసి అతనికో రెండు కాసులిస్తానని చెప్పమని సలహా ఇస్తుంది. "ఈ పనికి సిద్ధాంతే కీలకం" అని హెచ్చరిస్తుంది కూడా. సరిగ్గా రామప్పంతులు మాయగుంటని లుబ్దావధాన్లుకి పరిచయం చేసే సన్నివేశంలోనే సిద్ధాంతి ప్రవేశిస్తాడు నాటకంలోకి. వస్తూనే, "యవరు మావా ఈ పిల్ల?" అని లుబ్దావధాన్లునే వాకబు చేసి, "భాగ్య లక్షణాలేం పట్టాయీ ఈ పిల్లకీ.. విశాలమైన నేత్రాలూ, ఆ కర్ణాలూ, ఆ ఉంగరాలు జుత్తూ.." అంటూ ఆరంభించి, ఆ పిల్ల (పిల్లాడు మహేశం) చేయి అందుకుని "ఏ అదృష్టవంతుడు ఈ పిల్లని పెళ్లాడాడో కానీ.." అంటూ అర్ధోక్తిగా ఆగుతాడు.

'భాగ్యలక్షణాలు' అన్న మాట పిసినారి లుబ్ధావధాన్లుకి కర్ణపేయమని బాగా తెలుసు సిద్ధాంతికి. పైగా, మాయగుంట విషయం తనకేమాత్రం తెలియదని చెప్పడానికన్నట్టు, ఆ పిల్లకి పెళ్ళయిపోయిందేమో అన్న - ఏమాత్రమూ అతకని - అనుకోలు ఒకటి వినిపిస్తాడు. "యింకా పెళ్లి కాలేదండీ" అని రామప్పంతులు అనడమే తరువాయిగా, "మీరు పెళ్లి చేసుకోవాలని ఉంటే ఇంతకన్నా అయిదోతనం, అయిశ్వర్యం, సిరీ, సంపదా గల పిల్ల దొరకదు" అంటూ కవిత్వంలోకి దిగడమే కాదు, ఆ పిల్ల చెయ్యి చూసి "ఇది సౌభాగ్య రేఖ. ఇది ధన రేఖ. పంతులూ! భోషాణప్పెట్టెలు వెంటనే పురమాయించండి" అంటున్నప్పుడు, వింటున్న లుబ్దావధాన్లు మనసు వెయ్యిగంతులు వేసే ఉంటుంది. అక్కడితో ఆగలేదు సిద్ధాంతి, "యేదీ తల్లీ, చెయి తిప్పూ. సంతానం వొకటి, రెండు, మూడు.." ... పెళ్ళిచేసుకుంటే వారసుణ్ణి కనొచ్చని ఆశ పడుతున్న లుబ్దావధాన్లుకి అంతకన్నా కావాల్సింది ఏముంది?

"పోలిశెట్టి కూతురికి ప్రసవం అవుతూంది. జాతకం రాయాలి" అని నిష్క్రమించబోతూ, రామప్పంతులుని చాటుకి తీసుకెళ్లి మాట్లాడతాడు సిద్ధాంతి. రామప్పంతులే పెళ్లికొడుకనుకుని "రేపటి త్రయోదశి" ని ముహూర్తంగా నిర్ణయించేశాడు ఇంతకీ. అక్కడికీ, "ఆరోజు ముహూర్తం లేదే?" అని అవధాన్లు సందేహ పడితే, "శుభశ్య శీఘ్రం. ద్వితీయానికి అంత ముహూర్తం చూడవలసిన అవసరం లేదు" అని తొందరపెడతాడు రామప్పంతులు. గుంటూరు శాస్త్రులుకి దక్కబోయే పన్నెండు వందల రూపాయల కన్యాశుల్కంలో సంగోరు వాటా తనదే అన్న ఆశ పంతుల్ని పరుగెత్తించింది. ఇక పెళ్లి వేడుకలో హడావిడంతా సిద్ధాంతిదే. రామప్పంతులు అలా పెద్దిపాలెం బయలుదేరగానే, ముహూర్తం ముందుకు జరిగిన విషయం బయట పెట్టి ఆడవాళ్ళని తొందరపెట్టడం మొదలు, ఊళ్ళో బ్రాహ్మలందరినీ పిలిచేయడం వరకూ అన్నీ తానే అవుతాడు.

"పంతులు లేకుండా లగ్నం అయితే" అని సందేహిస్తున్న లుబ్దావధాన్లుని " పంతులుకా, మీకా పెళ్లి? జంకవోడక స్నానం కానీయండి" అని అతగాణ్ణి కోప్పడే చనువు సిద్ధాంతి సొంతం. రామప్పంతులు తిరిగొచ్చి, తనకి జరిగిన మోసం తెలుసుకుని, ఒళ్ళు తెలియని కోపంతో పెళ్లికూతురు రెండో పెళ్లి పిల్లన్న ప్రచారం మొదలుపెట్టినప్పుడు, గట్టిగా అడ్డుకున్నవాడు సిద్ధాంతే. పంతుల్ని రెక్క పట్టి నిలబెట్టడమే కాదు, తన్నేందుకు కూడా సిద్ధ పడతాడు. అటుపైని, పంతులుకి లాభించే మాట చెప్పి శాంతింపజేస్తాడు. సిద్ధాంతి మళ్ళీ కనిపించేది, మధురవాణి ఇంట్లో జరిగే పేకాట సన్నివేశంలోనే. మధురవాణి మీద ఆశు కవిత్వం చెప్పిన పూజారి గవరయ్యని మెచ్చుకుని, గవరయ్య మీదే అప్పటికప్పుడు పద్యమల్లి తన పాండిత్యాన్ని ప్రదర్శిస్తాడు. పేకాట సాగుతూ ఉండగానే రామప్పంతులు తిరిగి రావడంతో, పెరటిదారిలో గోడ గెంతి పారిపోడానికి గాజుపెంకులు అడ్డమని బాధపడతాడు.అటుపైని, సిద్ధాంతి మళ్ళీ కనిపించడు నాటకంలో.

మాయగుంట ఖూనీ కేసులో అందరినీ సాక్షులుగా వేసిన పోలీసులు, పెళ్లి చేసిన సిద్ధాంతిని వదిలేశారెందుకో మరి. జ్ఞానం అనే ముసుగు వేసుకుని, అబద్ధాలతో జీవితం గడిపే మనుషులకి మహ చక్కని ఉదాహరణ సిద్ధాంతి. శాస్త్రాన్నీ, శాస్త్రంలో అతని జ్ఞానాన్ని నమ్మిన వాళ్ళని మోసం చేస్తూ వచ్చిన సిద్ధాంతికి, ఏమాత్రం శాస్త్ర జ్ఞానం ఉందన్నది ప్రశ్నార్థకం. జాతకం పేరుతో కవిత్వం అల్లేసి, మాయగుంట పెళ్లి అనే కార్యాన్ని గట్టెక్కించడంతో పాటు, నాలుగు రాళ్ళ సంపాదనతో తన పబ్బం గడిపేసుకున్న ఈ లౌక్యుడి తాలూకు వారసులు, ఇప్పటికీ అనేక రూపాల్లో తిరుగాడుతూ ఉండడం అసలైన విషాదం.

బుధవారం, సెప్టెంబర్ 20, 2017

వెంకమ్మ

చదువుకీ, లోకజ్ఞానానికీ సంబంధం లేదు అనడానికి ఉదాహరణ వెంకమ్మ. ఆమె చదువుకోలేదు. కానీ లోకం పోకడని ఆకళింపు చేసుకుంది. తన భర్త ఎంతటి మూర్ఖుడో ఆమెకి బాగా తెలుసు. అతడితో కాపురం చేస్తూనే తనకి కావాల్సినవి సాధించుకుంది. కొడుకుని ఇంగ్లీషు చదివించడం కావొచ్చు, చిన్న కూతురి పెళ్లి సంబంధాన్ని తప్పించడం కావొచ్చు.. అన్నీ వెంకమ్మ ఇష్టప్రకారమే జరుగుతాయి చివరికి. అమాయకపు గృహిణిలా కనిపిస్తుంది కానీ ఆమె కార్యసాధకురాలు. మాట్లాడేది తక్కువే అయినా, ఆమె మాటలు సూటిగానూ, స్పష్టంగానూ ఉంటాయి. 'కన్యాశుల్కం' నాటకంలో కేవలం రెండు అంకాల్లో మాత్రమే కనిపించే వెంకమ్మ, కృష్ణరాయపురం వాసి అగ్నిహోత్రావధానులుకి ఇల్లాలు. బుచ్చమ్మ, వెంకటేశం, సుబ్బిలని కన్నతల్లి. వెంకటేశాన్ని పట్టుపట్టి ఇంగ్లీషు చదువులకోసం పట్నం పంపింది వెంకమ్మే.

అసలు వెంకటేశం ఇంగ్లీషు చదువులు ఎందుకు చదువుకోవాలి? చదివి ఏమి సాధించాలి? ఈ ప్రశ్నలకి కచ్చితమైన జవాబులున్నాయి వెంకమ్మ దగ్గర. "మీలాగే వాడూ జంఝాలు వొడుక్కుంటూ బతకాలని ఉందా యేవిఁటి?" అని భర్తని నిలదీస్తుంది, అతగాడు కొడుకు చదువుకి జరుగుతున్న, జరగబోయే ఖర్చు లెక్కలు, వాటితాలూకు పరిణామాలూ ఆలోచిస్తున్నప్పుడు. వేదం ఎనభై రెండు పన్నాలూ ఒక్క దమ్మిడీ పుస్తకాల ఖర్చు లేకుండా చదువుకున్న అగ్నిహోత్రావధానులుకి, ఇంగ్లీషు చదువుల్లో ఏడాదికి పదిహేనురూపాయలు (నూటపాతికేళ్ల క్రితం) పుస్తకాల కింద ఎందుకు ఖర్చు చెయ్యాలో ఏమాత్రం అర్ధం కాదు. కానీ, రాబోయే ప్రయోజనాలని ఊహిస్తున్న వెంకమ్మకి అదేమీ పెద్ద మొత్తం కాదు. "మీకంత భారవంతోస్తే మావాళ్లు నాకు పసుపూకుంకానికీ ఇచ్చిన భూవమ్మే కుర్రాడికి చదువు చెప్పిస్తాను" అని కచ్చితంగా చెబుతుంది.

ఆ పల్లెటూరి గృహిణికి ఇంగ్లీషు చదువుమీద ఎందుకంత మోజు? ఎందుకంటే, ఆమెకి చదువు లేకపోయినా లోకం పోకడ మీద మంచి అవగాహన ఉంది. మొన్నమొన్నటివరకూ తన వాకిట్లో జుట్టు విరబోసుకుని గొట్టికాయలాడిన నేమాని వారి కుర్రాడికి ఇంగ్లీషు  చదువుకోవడం వల్లే మునసబీ అయ్యింది. తన కొడుకు ఆపాటి ఉద్యోగం సాధించలేకపోడని ఆవిడకి గట్టి నమ్మకం. అందుకే, ఖర్చుకి వెరవొద్దని ఒకటికి పదిసార్లు చెబుతుంది భర్తతో. పైగా, పెట్టిన ఖర్చు పిల్లా పాపలతో తిరిగొస్తుందని కూడా బాగానే తెలుసు. "మనవాడికో మునసబీ ఐనా, పోలీసు పనైనా అయితే రుణాలిచ్చి ఈ అఘ్ఘురారం భూవులన్నీ కొనేస్తాడు.." అదీ సంగతి. భూముల్ని తనఖా పెట్టి అప్పు తీసుకుని, ఆ బాకీ తీర్చలేక అప్పిచ్చిన వాళ్ళకే భూములు అమ్ముకుని చెల్లు చేసుకోవడం నాటి పధ్ధతి. కొడుకు తన సంపాదనతో అగ్రహారీకులకి అప్పులిచ్చి, భూములన్నీ సొంతం చేసేసుకుంటాడన్నది వెంకమ్మ ఆలోచన.

అంతమాత్రాన, వెంకమ్మకి కొడుకు మీద ప్రేమ లేదనుకుంటే పొరపాటు. "యీ చదువుల కోసవని పిల్లవాణ్ణి వొదులుకుని వుండడం, వాడు పరాయి వూళ్ళో శ్రమదమాలు పడుతూండడం. నా ప్రాణాలు ఎప్పుడూ అక్కణ్ణే వుంటాయి," అంటుంది గిరీశంతో. డబ్బంటే ఎన్నడూ వెనక చూళ్ళేదని చెబుతూనే, "మేం కనడం మట్టుకు కన్నాం. మీరే వాడికి తల్లీ తండ్రీని. యల్లా కడుపులో పెట్టుకుని చదువు చెబుతారో మీదే భారం" అంటూ అప్పగింత పెడుతుంది. గిరీశం కాకుండా, మరెవరైనా సరైన గురువు దొరికి ఉంటే, వెంకటేశం తల్లి కోరుకున్నట్టే చదువులు చదివి ఆవిడ కలలు నెరవేర్చి ఉండేవాడేమో. "మా అబ్బాయీ మీరూ ఒక్క పర్యాయం యింగిలీషు మాట్లాడండి బాబూ," అని గిరీశాన్ని ఎంతో ఆదరంగా అడుగుతుంది వెంకమ్మ. ఇలాంటిదేదో జరగొచ్చని ముందే ఊహించిన గిరీశం, శిష్యుణ్ణి అందుకు తయారుచేసి ఉంచుతాడు.

వెంకమ్మకి ఇంగ్లీషు రాకపోవడం చేత, తనకొడుకు జంకూగొంకూ లేకుండా దొరలభాష మాట్లాడేయడం చూసి ఎంతో ముచ్చట పడుతుంది - ఏం మాట్లాడుతున్నాడో ఏమాత్రం తెలియకపోయినా. కొడుకు చదువొక్కటే కాదు, ఆడపిల్లల కష్టమూ తెలుసామెకి. పెద్దకూతురు బుచ్చమ్మని ముదుసలి వరుడికి ఇచ్చి పెళ్లి చేయడంతో కొద్దికాలానికే వితంతువై పుట్టింటికి తిరిగి వస్తుంది. చిన్నకూతురికి అదే కష్టం రానివ్వకూడదని నిశ్చయించుకుంటుంది వెంకమ్మ. భర్త ఎవరిమాటా వినని వాడు కాబట్టి, తాను చేయగలిగేది ఏదీ లేదని చేతులు ముడుచుకుని కూర్చోదు. లుబ్ధావధాన్లుతో సుబ్బి పెళ్లి జరక్కుండా చూడడానికి తన పరిధిలో ఏం చేయగలదో ఆలోచిస్తుంది. తన ఒక్కదానివల్లా జరిగే పని కాదని గ్రహించి అన్నగారు కరటక శాస్త్రి మీద కార్యభారం మోపుతుంది.

ఎట్టి పరిస్థితిలోనూ సుబ్బి పెళ్లి జరిపి తీరాలని అగ్నిహోత్రావధానులు పట్టుపట్టుకుని కూర్చోవడంతో, ఆ పెళ్లిని ఆపడం కోసం ప్రాణత్యాగానికి సిద్ధ పడుతుంది వెంకమ్మ. పెరట్లో ఉన్న నూతిలో దూకేస్తుంది. గిరీశం ఆమెని రక్షించి, "మీ అత్తగారు సాక్షాత్తూ అరుంధతి వంటివారు. మనలో మనమాట, ఆమెకి ఈ సంబంధం ఎంతమాత్రమూ యిష్టము లేదు. పుస్తె కట్టే సమయమందు, మీ ఇంటి నూతులో పడి ప్రాణత్యాగం చేసుకుంటానని యిరుగుపొరుగమ్మలతో అంటున్నారు" అంటూ లుబ్ధావధాన్లుకి ఉత్తరం రాస్తాడు. అదే గిరీశం, వెంకటేశంతో "నూతులో పడడం గీతులో పడడం నాన్సెన్స్. ఓ రెండు తులాల సరుకోటి మీ నాన్న చేయించి యిచ్చాడంటే మీ అమ్మ ఆ మాట మానేస్తుంది" అనేస్తాడు సులువుగా. అంతవరకే వస్తే, వెంకమ్మ ప్రాణత్యాగానికే సిద్ధపడి ఉండేది అనిపిస్తుంది, ఆమె పట్టుదలని పరిశీలించినప్పుడు.

'కన్యాశుల్కం' నాటకంలోని స్త్రీపాత్రల్లో భర్తచాటు భార్య వెంకమ్మ ఒక్కర్తే. పైగా, ఆ భర్త అక్షరాలా మూర్ఖప గాడిద కొడుకు. అతగాడితో సంసారాన్ని నిర్వహించుకుని వస్తూ, కొడుకుని ప్రయోజకుణ్ణి చేయడానికీ, పెద్ద కూతురి విషయంలో చేసిన పొరపాటు,  చిన్నపిల్ల విషయంలో జరక్కుండా చూడడానికీ కంకణం కట్టుకుంది. అన్నగారి మద్దతూ, పుట్టింటి ఆస్తి తాలూకు దన్నూ ఉన్నప్పటికీ, పెళ్లి నుంచి బయటకు రాలేని కాలంలో, ఆ వయసులో, సంసారనిర్వహణకి ఆమె ఎంత కష్టపడి ఉంటుందన్నది ఇప్పటి ఊహకి అందదు. ఆరో అంకంలో బుచ్చమ్మ గిరీశంలో లేచి వెళ్లిపోయిందని తెలిసినప్పుడు వెంకమ్మ పైకేమీ మాట్లాడదు. కానీ, లోపల్లోపల కూతురు చేసిన పనిని మెచ్చుకుని, అందుకు సంతోషించే ఉంటుంది బహుశా. ఆ నాటి వరకూ బుచ్చమ్మని "రొమ్ము మీద కుంపటల్లే" భరించింది ఆమే మరి. కుటుంబంలో తల్లి ఎలా ఉండాలో చెప్పే నిలువెత్తు ఉదాహరణ వెంకమ్మ.

మంగళవారం, సెప్టెంబర్ 19, 2017

వెంకటేశం

వెంకటేశానికి చెగోడీలంటే మహా ఇష్టం. గేదె పెరుగన్నా, జామపళ్ళన్నా కూడా ఇష్టమే. గొట్టికాయలు, కోతిపిల్లి కర్ర ఆటల్లో వెంకటేశాన్ని కొట్టేవాడు లేదు. వీటన్నింటికన్నా పొగచుట్టలు కాల్చడం అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. కృష్ణరాయపురం వాసి అగ్నిహోత్రావధానులు కొడుకు వెంకటేశం. తండ్రిలా సంస్కృతం కాకుండా, పట్నంలో ఉండి ఇంగ్లీష్ చదువుకుంటున్నాడు. అసలే ఇంగ్లీషు చదువులు దేశంలో ప్రవేశించిన కొత్త రోజులు కదా, పైగా వేంకటేశానికి చిల్లర ఖర్చులు జాస్తి. అందుకే, అతగాడి చదువు ఖర్చు తడిపి మోపెడవుతోంది తల్లిదండ్రులకి. ఇక ఆ చదువేదో అయ్యీ అవ్వడంతోనే అతగాడికి పెళ్ళిచేయక తీరదు కదా. పెళ్లంటే 'కన్యాశుల్కం' తో వ్యవహారం. చదువుకీ ఖర్చు చేసి, పెళ్ళికీ డబ్బు ఖర్చు పెట్టాలంటే మాటలు కాదు. అందుకే వెంకటేశానికి ఖర్చు లేకుండా పెళ్లయ్యే మార్గం ఆలోచించాడు అగ్నిహోత్రావధానులు.

కిందటేడు పరీక్ష ఫెయిలయిన వెంకటేశం ఈమారైనా పాసయినాడో లేదో అని సందేహం అవధాన్లుకి. తండ్రి సందేహాన్ని నిజం చేస్తూ పరీక్ష తప్పాడు వెంకటేశం. ఆమాట చెబితే తండ్రి అగ్గి రావుడైపోతాడని బాగా తెలుసు. కాబట్టే, తనకి అప్పుడప్పుడూ చదువు చెబుతూ ఎప్పుడూ లెక్చర్లిచ్చే గురువు గిరీశాన్ని కూడా తన వెంట ఊరికి తీసుకెళ్లాడు. అక్కడ, తల్లిదండ్రులు, మేనమామ సమక్షంలో జరిగే 'కుమార విద్యా ప్రదర్శన' లో వేంకటేశం చదువుల సారం ఏమిటన్నది తేటతెల్లమవుతుంది. చదువుకే కాదు, పొగచుట్టలు కాల్చడంలో కూడా గిరీశమే గురువు వెంకటేశానికి. ఆ చుట్టలు కొనుక్కోడానికి డబ్బు ఇబ్బంది రాకుండా ఉండడం కోసం, గురువు గారు చెప్పిన పుస్తకాల జాబితా తయారు చేస్తాడు శిష్యుడు, 'కుప్పుసామయ్యర్ మేడ్ డిఫికల్ట్' తో సహా.

ఇంతకీ వెంకటేశానికి ఖర్చు లేకుండా పెళ్లయ్యే మార్గం ఏమిటి? అతని చెల్లెలు సుబ్బిని, రామచంద్రపురం వాసి లుబ్ధావధాన్లుకిచ్చి పెళ్లి చేసి, తద్వారా వచ్చే పద్ధెనిమిది వందల రూపాయల కన్యాశుల్కంతో వెంకటేశానికి పెళ్ళిచెయ్యడం. ఇదిగో, ఈ సుబ్బి పెళ్లే 'కన్యాశుల్కం' నాటకానికి మూల కథ, ఆ పెళ్ళికి ప్రధాన కారకుడు వెంకటేశం. అంతేకాదు, గిరీశం ఇచ్చకాలు చెప్పి లేవదీసుకుపోయిన వితంతువు బుచ్చమ్మ, వెంకటేశానికి స్వయానా అక్కగారు. పరీక్ష ఫెయిలయి పల్లెకి వచ్చినా చదువు మీద ఏమాత్రం ఖాతరీ లేదు వెంకటేశానికి. ఇటు సంస్కృతమూ, అటు ఇంగ్లీషూ కూడా అంతంత మాత్రమే. 'నలదమయంతులిద్దరు' పద్యం చెప్పగలడు కానీ, అర్ధం తెలీదు. ఇక ఇంగ్లీష్ అయితే 'దేరీజే వైట్ మాన్ ఇన్ ది టెంట్' మొదలు 'నౌన్స్ ఎండింగ్ ఇన్...' వరకూ గళగ్రాహిగా మాట్లాడేస్తాడు. ఎటొచ్చీ, ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళెవరూ దగ్గరలో ఉండకూడదు.

గిరీశం లెక్చర్లకి తప్పనిసరి శ్రోత వెంకటేశం. అతగాడి కవిత్వానికి ప్రధమ పాఠకుడు కూడా. చుట్ట కాల్చడంతో పాటుగా, 'పొగచుట్టకి సతిమోవికి..' లాంటి పద్యాలూ పట్టుబడ్డాయంటే అదంతా గిరీశం తరిఫీదు మహత్యం. ఇతగాడి చదువు ఇలా ఉంటూ ఉండగా, రెండు మూడేళ్ళలో సర్కారీ నౌకరీ అయిపోతుందని తల్లిదండ్రుల ఆశ, వెంకడు ఇంగ్లీష్ చదువు చదివేస్తున్నాడని మహేశం లాంటి సావాసగాళ్ళ అసూయ, తమ్ముడి చదువు కోసమే తల్లీతండ్రీ గొడవలు పడుతున్నారన్న బుచ్చమ్మ అమాయకత్వం.. ఇవన్నీ ఆ చదువుని గురించి చుట్టూ ఉన్న వాళ్ళ స్పందనలు. చదువుకయ్యే ఖర్చుతో కానీ, గొడవలతో కానీ ఏమాత్రం నిమిత్తం లేని బలాదూర్ కుర్రాడు వెంకటేశం. 'అక్కడిదాకా వచ్చినప్పుడు చూసుకుందా' అనుకునే రకమే తప్ప బాధ్యతా, భయమూ బొత్తిగా కనిపించవు.

ఇంగ్లీష్ చదువు అని గొప్పగా అనుకోడం తప్ప తల్లిదండ్రులకి ఆ చదువుని గురించి ఏమీ తెలియకపోవడం, గురువు గిరీశానికి కూడా చదువు చెప్పడం కన్నా ఇతరేతర విషయాల మీదే ఆసక్తి మెండవ్వడం వల్ల వెంకటేశం చదువు గుంటపూలు పూస్తోంది. "మా నాన్న నాకూ పెళ్లి చేస్తాడు" అని సంబరంగా గిరీశానికి చెబుతాడు వెంకటేశం. పెళ్ళిలో పెళ్ళికొడుకు ప్రత్యేకంగా చూడబడతాడన్నది తప్ప ఇంకేమీ ఆలోచించి ఉండడు బహుశా. అగ్నిహోత్రావధానులు కొడుకు, అందునా ఇంగ్లీషు చదువుకుంటున్న వాడు, కాబట్టి మనుషులంటే బొత్తిగా లెఖ్ఖ లేదు వెంకటేశానికి. ఆడవాళ్ళ మీద అతడి ప్రతాపం చూడాల్సిందే. "గిరీశం గారు సురేంద్రనాధ్ బెనర్జీ అంతటి వారు" అని బుచ్చమ్మకి చెప్పిన వెంకటేశం, "ఆయనెవరురా?" అన్న ప్రశ్నకి, "అయన అందరికన్నా గొప్పవాడు" అని ఒక్కముక్కలో తేల్చేస్తాడు తప్ప, తనకీ తెలీదని ఒప్పుకోడు.

గిరీశం, బుచ్చమ్మని తన దారికి తెచ్చుకోడానికి వెంకటేశాన్నే ఉపయోగించుకుంటాడు. బుచ్చమ్మ ఎదురుగా, వితంతు వివాహాలని గురించి వెంకటేశానికి లెక్చరు దంచి, ఆమెని దారికి తెచ్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తాడు. సుబ్బి పెళ్ళికి యావత్ కుటుంబమూ రామచంద్రపురం ప్రయాణమైనప్పుడు, వెంకటేశాన్ని బుచ్చమ్మ బండిలో ఎక్కిస్తారు. ఓ రాత్రి వేళ వెంకటేశం బండి నుంచి ఏనుగు మీదకి మారతాడు. గిరీశం ఆ బండిలోకి మారి రామవరం దారి పట్టించేస్తాడు. తెల్లారి లేచి, కూతురుతో పాటే నగలపెట్టి, కోర్టు కాగితాలు కూడా ఆ బండిలో ఉండిపోయాయని అగ్నిహోత్రావధానులు గుండెలు బాదుకుంటూ ఉంటే, "అక్కయ్య పెట్టెలో నా పుస్తకాలు కూడా పెట్టాను" అంటాడు వెంకటేశం, కొత్త పుస్తకాలు కొనే వరకూ చదువు బాధ తప్పిందని సంతోషించి ఉంటాడు బహుశా. "ఈ గాడిదకొడుకు యింగిలీషు చదువు కొంప ముంచింది" అని నెపాన్నంతా కొడుకు చదువు మీదకి నెట్టేస్తాడు అగ్నిహోత్రావధానులు.

ఈకాలం పిల్లలంతా బొత్తిగా కెరీర్ ఓరియంటెడ్ అయిపోయినా, వెంకటేశాలు అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటారు, కాదంటారా?

సోమవారం, సెప్టెంబర్ 18, 2017

లుబ్ధావధాన్లు

సత్యమూర్తి అనే పేరుగల మహానుభావుడు అసత్యం తప్ప మరొకటి ఆడకపోవచ్చు. భీముడన్న పేరు కలిగి గాలేస్తే ఎగిరిపోయేంత అర్భకంగానూ ఉండొచ్చు. అందరూ అలాగే ఉంటారా అన్న ప్రశ్న రాకుండా ఉండడం కోసం, పేరుకు తగ్గట్టుగా.. ఇంకా చెప్పాలంటే ఆ పేరు తనకి అతికినట్టు సరిపోయేలా ప్రవర్తించే వ్యక్తి లుబ్ధావధాన్లు. ఈ రామచంద్రపురం అగ్రహారీకుడు ముందు పుట్టాడా, పీనాసితనం ముందుగా పుట్టిందా అని అడిగితే 'కన్యాశుల్కం' నాటకం చదివిన వాళ్లంతా జవాబు కోసం ఒక్క క్షణం తడుముకుంటారు. పెద్దలిచ్చిన ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఎటూ అతి జాగ్రత్తపరుడు కనుక ఏమీ ఖర్చు పెట్టకుండా మరింత జాగ్రత్త చేశాడు. ఒక్కగానొక్క కూతురు మీనాక్షికి ఈడైన సంబంధం తెచ్చి పెళ్లి చేయకుండా,  శుల్కానికి ఆశించి బాగా పెద్దవాడికి ఇచ్చి పెళ్లిచేశాడు.

మీనాక్షికి అత్తవారి తరపున ఆస్తిపాస్తులు బాగానే కలిసొచ్చాయి. కానీ, భర్తే కలిసిరాలేదు. ఈమె కాపురానికి వెళ్లేముందే, అతగాడు పరలోకానికి ప్రయాణం కట్టేశాడు. వితంతువుగా పుట్టింటిలోనే మిగిలిపోయిన మీనాక్షికి లోకం మీద కించిత్ కోపం. అందుకే, కట్టుతప్పి ప్రవర్తిస్తూ తండ్రికి నిజమైన 'గుండెలమీద కుంపటి' గా మారింది. రోజులు మారుతున్నా, వితంతు పునర్వివాహాలు జరుగుతున్నా అటువైపు బొత్తిగా ఆలోచన చేయడు లుబ్ధావధాన్లు. అవడానికి వేదం చదువుకున్న వాడే కానీ, ఆచరణకు వచ్చేసరికి ప్రతిదీ డబ్బుతో ముడిపెట్టి చూడడం బాగా అలవాటైపోయింది. మీనాక్షిని కట్టడి చేసే మార్గాల కోసం వెతుకుతున్న లుబ్దావధాన్లుకి తన జాతకంలో వివాహ ధన యోగాలు జమిలిగా ఉన్నట్టుగా తెలియడంతో పాటు, పెళ్లి జరక్కపోతే పెద్ద ఎత్తున నష్టం వచ్చిపడిపోయే సూచనలు కూడా ఉన్నట్టు ఒకరిద్దరు సిద్ధాంతులు కుండబద్దలుకొట్టి చెబుతారు.

తల్లిలేని మీనాక్షి తలచెడి తన ఎదురుగానే తిరుగుతూ ఉంటే, ఆమెని గురించి ఆలోచించకుండా మరో పెళ్లి మాట తలపెట్టడం ఏమిటన్న స్పృహ ఏమాత్రం లేదు లుబ్దావధాన్లుకి.  చవగ్గా వచ్చే సంబంధం చేసుకుంటే, వచ్చే పిల్ల మీనాక్షినీ, మీనాక్షి ఆ పిల్లనీ కట్టడిలో పెడతారన్న దూరాలోచన చేస్తాడు. 'ఆడదానికి ఆడదే శత్రువు' అన్న నానుడి ఎటూ ఉండనే ఉంది కదా. లుబ్ధావధాన్లుకి ఆప్త మిత్రుడు రామప్పంతులు. వ్యవహారాలన్నింటిలోనూ సలహా సంప్రదింపులు పంతులుతోనే. ఆ పంతులికీ, మీనాక్షికీ సంబంధం ఉందన్న విషయం అవధాన్లుకి తెలియంది కాదు. చూసీ, చూడనట్టు నటిస్తూ ఉంటాడు. పంతులు సలహా మేరకు, కృష్ణరాయపురం అగ్రహారీకుడు అగ్నిహోత్రావధానులు కూతురు సుబ్బిని పద్ధెనిమిది వందలు శుల్కమిచ్చి పెళ్లి చేసుకోడానికి ఏర్పాటు చేసుకుంటాడు లుబ్దావధాన్లు. కరటక శాస్త్రి, మధురవాణీ పూనుకోకపోతే పెళ్లి జరిగిపోయేదే. వాళ్ళ పూనిక వల్ల ఆ పెళ్లి జరగక పోగా, అవధాన్లు మీద ఖూనీ కేసు వచ్చి పడింది.

లుబ్ధావధాన్లుకి వ్యవహార జ్ఞానం బొత్తిగా లేకపోవడాన్ని తనకి అనుకూలంగా మలుచుకుంటాడు రామప్పంతులు. సంబంధం వద్దంటూ, అగ్నిహోత్రావధానులు రాసినట్టుగా ఒక ఫోర్జరీ ఉత్తరం రాయడమే కాదు, అప్పటికప్పుడు గుంటూరు శాస్త్రులు కూతురితో లుబ్దావధాన్లుకి పెళ్లి నిశ్చయం చేసేస్తాడు. పన్నెండు వందల రూపాయలకే సంబంధం కుదిరినందుకు మిక్కిలి సంతోషించిన అవధాన్లు, వధువు పూర్వాపరాలేవీ విచారించకుండా, పంతులు మాట మీద నమ్మకం ఉంచి పెళ్లి చేసేసుకుంటాడు. తాను ఊళ్ళో లేకుండా చూసి పెళ్లి జరిగిపోవడమూ, తన వాటా డబ్బు ఎగేసి గుంటూరు శాస్త్రులు పారిపోవడంతో హద్దుమాలిన కోపం వస్తుంది రామప్పంతులుకి. ఆ కోపంలో, ఆ గుంటూరు శాస్త్రులు పాంచాళీ మనిషనీ, ఆ పిల్ల రెండో పెళ్లి పిల్లనీ నోటికొచ్చినట్టు దూషిస్తాడు. అటుపైన పంతులు చల్లబడ్డా, అవధాన్లులో అనుమానం మిగిలిపోతుంది.

రామప్పంతులు నాటిన అనుమాన బీజం పెరిగి పెద్ద వృక్షమైపోవడంతో తిండీ నిద్రా కరువవుతాయి లుబ్ధావధాన్లుకి. తను పెళ్లాడిన పిల్ల మొదటి మొగుడొచ్చి తన పీక నులిమేస్తున్నట్టు పీడకలలు. ఇది చాలదన్నట్టుగా, మధురవాణి కంటెతో సహా మాయగుంట పారిపోవడం, కంటెని సంపాదించడం కోసమని రామప్పంతులు ఖూనీ కేసు బనాయించడంతో ఊపిరాడదు ఆ వృద్ధుడికి. ఒకవైపు ఆ పిల్ల ఏమైందో అని ఆందోళన, మరోవైపు కేసులభయం, ఇంకో వైపు డబ్బు ఖర్చయిపోతుందని బెంగ, ఇవి చాలవన్నట్టు తమ్ముడి వరసయ్యే గిరీశం వచ్చి తన పేరిట పవరాఫ్ టర్నామా గిలికి ఇచ్చేయమని పీకమీద కూర్చుంటాడు. "నాకున్న బంధువులంతా నా దగ్గిర డబ్బు లాగాలని చూసేవారే కానీ, నా కష్టసుఖాలకి పనికొచ్చేవాడు ఒక్కడైనా కనపడడు" అని తమ్ముడి మీద నిష్టూరమాడతాడు లుబ్ధావధాన్లు.

కేసు గురించే తప్ప, ఫీజు మాట ఎత్తకపోవడం వల్ల కావొచ్చు, వకీలు సౌజన్యారావు పంతులు మీద మాంచి గురి కుదిరింది అవధాన్లుకి. తాను చేసిన తప్పులన్నింటినీ ఆ వకీలు ఒక్కొక్కటిగా ఎత్తి చూపిస్తే, ఎదురు చెప్పకపోగా అంగీకరించి, వాటిని సరిదిద్దుకునేందుకు సిద్ధ పడతాడు లుబ్ధావధాన్లు. మీనాక్షి మంచిచెడ్డలు చూడకపోవడం మొదలు, వృద్ధాప్యంలో చిన్న పిల్లని పెళ్లి  చేసుకోవడం వరకూ తాను చేసిన తప్పులన్నింటినీ అంగీకరిస్తాడు. సౌజన్యారావుని "దొడ్డ" వాడిగా అంగీకరించి, తన మంచి  చెడ్డల భారం అతగాడిమీద పెట్టేసి, నిశ్చింత పొందుతాడు లుబ్దావధాన్లు. తనమీద ఒకేసారి జరిగిన బహుముఖ దాడి, లుబ్దావధాన్లులో మార్పుకి కారణం అయి ఉంటుంది బహుశా. అదే సమయంలో, తన డబ్బుని కాక తనకి మంచి జరగాలని మాత్రమే ఆశించి, తన తరపున పనిచేస్తున్న సౌజన్యారావు పంతులు సౌజన్యమూ కొంతమేరకు పనిచేసింది.

నాటకం ప్రధమార్ధంలో తన పిసినారితనం, అమాయకత్వంతో నవ్వించే లుబ్ధావధాన్లు పాత్ర, మాయగుంట మాయమైన అనంతరం వచ్చిపడే చిక్కుల కారణంగా సింపతీని సంపాదించుకుంటుంది. కీలకమైన 'ఉత్తరం' సన్నివేశంలో "ఏవిటీ అభావచేష్టలూ?" మొదలు, లుబ్ధావధాన్లు పలికే ప్రతి సంభాషణా తెగ నవ్విస్తుంది. "ఏం ధూళి? సంరక్షణ చేసేవాళ్ళు లేకపోబట్టి కదా" అంటూ మధురవాణి తలకి నూనె రాయడం ఆరంభించింది మొదలు, ఒకపక్క ఉత్తరంలో విషయాలకి కోపం ప్రకటిస్తూ, పెళ్లి చేసుకోడాన్ని గురించి నిర్ణయాలు క్షణక్షణానికీ మార్చుకుంటూ, మరోవంక మధురవాణి స్పర్శకీ, ఆమె చేతుల మృదుత్వానికీ తన్మయుడయ్యే లుబ్దావధాన్లని మర్చిపోగలమా? తప్పులు అందరూ చేసినా, చేసినవాటిని అంగీకరించి, మార్గాన్ని  మార్చుకోడానికి సిద్ధపడే వాళ్ళు కొద్దిమందే ఉంటారు. ఆ మార్పు జరగాలంటే ఎన్ని దెబ్బలు తగలాలో చెబుతుంది లుబ్దావధాన్లు పాత్ర.

ఆదివారం, సెప్టెంబర్ 17, 2017

రామప్పంతులు

లౌక్యప్రజ్ఞలో తనని మించిన వాడు లేడని గట్టి నమ్మకం రామచంద్రపురం అగ్రహారీకుడు రామప్పంతులుకి. కానీ, అదేం చిత్రమో, 'కన్యాశుల్కం' నాటకంలో రామప్పంతులు చూపించిన లౌక్య ప్రజ్ఞ అంతా అతగాడికే ఎదురు తిరిగింది. నడివయసుకి వచ్చినా ఇంకా "పడుచు వాణ్ణి" అని చెప్పుకోడం సరదా. పెద్దలిచ్చిన ఆస్తి కరారావుడు చుట్టేసి, వాళ్ళకీ, వీళ్లకీ జుట్లు మూడేసి జీవితం సాగిస్తున్నా హోదాకీ, ఫాయాకీ ఎక్కడా లోటు రాకూడదనుకునే స్వభావం. శాక్తేయుణ్ణి అనీ, యోగ సాధన చేస్తాననీ చెప్పుకునే రామప్పంతులు, 'కామిగాక మోక్షగామి కాడు' అంటారు కాబట్టే, మధురవాణి ని ఉంచానంటాడు. క్లిష్ట సమయాల్లో తెచ్చిపెట్టుకున్న బింకం అభినయిస్తాడు కానీ, చచ్చేంత భయస్తుడు. నలుగురూ గౌరవించ తగ్గ పనులేమీ చేయకపోయినా, అందరిచేతా బహువచనంలో పిలిపించుకోవాలని మహా పట్టుదల.

తనది ధన జాతకమనీ, వాక్ స్థానమందు బృహస్పతి ఉన్నాడనీ చెప్పుకునే రామప్పంతులుకి,  ఇంగ్లీష్ చదువుకోలేదని కించిత్ చింత ఉంది. "నాకు యింగిలీషే వొస్తే దొరసాన్లు నా వెనకాతల పరిగెత్తరా?" అనుకోగలిగే ఆత్మవిశ్వాసం అతగాడి సొంతం. తన దండలు సన్నవే అయినా ఉక్ఖు కడ్డీలనీ, తనకి ఒంటి సత్తువతో పాటు బుద్ధి సత్తువకూడా విపరీతమనీ ప్రచారం చేసుకోవడం రామప్పంతులుకి ఇష్టమైన పనుల్లో ఒకటి. అసలు 'కన్యాశుల్కం' నాటకంలో మూలకథ అయిన లుబ్ధావధాన్లు-సుబ్బిల పెళ్లి కుదిర్చింది రామప్పంతులే. అందుకోసం పిసినారి ముసలివాడు లుబ్దావధాన్లు మీద రెండేళ్ల పాటు తన లౌక్య ప్రజ్ఞ అంతా ఉపయోగించాడు. పెళ్ళిచేసుకుంటే డబ్బు ఖర్చు కావడం లోకసహజం, అది కూడా కన్యాశుల్కపు రోజుల్లో వరుడి పక్షానికి ఖర్చులు లావే.

అయితే, అసాధ్యాలని సాధ్యం చేసే లౌక్యుడు రామప్పంతులు, లుబ్ధావధాన్లుకి పెళ్ళయితే వల్లమాలిన ధనం వొస్తుందని ఆశ పెడతాడు. ఊళ్ళో ఉన్న సిద్ధాంతి చేతా, ఊరికి వచ్చిన పండా (ఉత్తరాది పండితుడు) చేతా అదే మాట చెప్పిస్తాడు. పండా అయితే మరో అడుగు ముందుకేసి, వివాహ, ధన యోగాలు జరగడానికి వీల్లేని మహా యోగాలనీ, పెళ్లి జరగని పక్షంలో మార్కవో, ధననష్టమో సంభవిస్తుందనీ బెదిరించి, గ్రహశాంతి చేయమని సూచిస్తాడు. ఇక తప్పనిసరై పెళ్ళికి ఒప్పుకుంటాడు లుబ్ధావధాన్లు. పెళ్లి పేరు చెప్పి, రెండు పక్షాల దగ్గరనుంచీ ఏదో రూపంలో సొమ్ము లాగాలన్నది రామప్పంతులు ఆలోచన. "పెళ్ళైతే ధనం ఖర్చవుతుందిగానీ రావడవెలగ?" అని ఆశ్చర్యపోయిన మధురవాణితో ఒకింత దర్పంగా తను జరిపించిన కథంతా చెప్పిన రామప్పంతులు, "నీకు మేజువాణి నిర్ణయించుకున్నాను కానూ, నీకు పదిరూపాయలు సొమ్ము దొరకడం ద్రవ్యాకర్షణ కాదా?" అని బులిపించ ప్రయత్నిస్తాడు.

"నమ్మించోట చేస్తే మోసం, నమ్మంచోట చేస్తే లౌక్యం" అని, మోసానికీ, లౌక్యానికీ మధ్య ఉన్న రేఖామాత్రపు భేదాన్ని విప్పి చెప్పే రామప్పంతులు, "తాను చేస్తే లౌక్యం, మరోడు చేస్తే మోసం" అన్న మాటని మాత్రం ఒప్పుకోడు. వ్యవహారం దగ్గర ఎంత నిక్కచ్చిగా ఉంటాడో, మాయగుంటకి లుబ్ధావధాన్లుతో పెళ్లి నిశ్చయించమని గుంటూరు శాస్త్రులు వేషంలో ఉన్న కరటక శాస్త్రి వచ్చి వేడుకునే సన్నివేశంలో చూడొచ్చు. పిల్లని అమ్మిన డబ్బుల్లో సగం తనకి ఇచ్చేట్టు అయితేనే, పెళ్లి కుదురుస్తానని తెగేసి చెప్పడమే కాదు, "పాపపు సొమ్ము మా దగ్గరకు రాగానే పవిత్రమైపోతుంది" అని తన వాటాని ఘనంగా సమర్ధించుకుంటాడు కూడా. కోర్టులకి సమాంతరంగా దొంగ సాక్ష్యాల వ్యవస్థనే నడిపించిన వాడు రామప్పంతులు. పాత తాటాకులు అలేఖాలు, ముప్ఫయ్యేళ్ళ నాటి కాకితాలు, రకరకాల సిరాలే కాదు, గెజిట్ ఆర్డర్ రేటుకి సాక్షులు  కూడా సిద్ధంగా ఉంటారు అతగాడి దగ్గర.

అయితే, అంతటి లౌక్యుడైన రామప్పంతులునీ, లౌక్యుల్ని పిలవడం కోసం పెద్దిపాలెం పంపేసి, పెళ్లి ముహూర్తం ముందుకి జరిపేసి, పాంచరాత్ర వివాహాన్ని ఏకరాత్రం చేసేసి, పంతులు తిరిగొచ్చే లోగా కన్యాశుల్కపు సొమ్ముతో ఊరు దాటేసిన కరటకుడి లౌక్యం ముందు, రామప్పంతులు ఏపాటి అనిపించక మానదు. మధురవాణి దగ్గర గప్పాలు కొట్టిన ప్రతిసారీ, ఆమెకి చులకనైపోతున్నా తన ప్రయత్నాలు మానుకోడు. అసలు, మొట్టమొదట ఆమెకి రెండు వందలు అడ్వాన్సు ఇచ్చినప్పుడే గిరీశాన్ని తూలనాడి, అతగాడి చేతిలోనూ, పూటకూళ్ళమ్మ చేతిలోనూ కూడా దెబ్బలు తింటాడు. అటుపైన, "నేనే చిన్నతనంలో ఇంగ్లీషు చదివి ఉంటే జడ్జీల ఎదుట పెళపెళలాడించుదును. నాకు వాక్ స్థానమందు బృహస్పతి ఉన్నాడు. అందుచాతనే యింగిలీషు రాకపోయినా నా ప్రభ యిలా వెలుగుతూంది" అని ఆరంభించగానే, "మాటలు నేర్చిన శునకాన్ని వేటకి పంపితే ఉసుకోమంటే ఉసుకోమందిట" అంటూ అంటిస్తుంది మధురవాణి.

లుబ్ధావధాన్లుకి గిరీశం రాసిన ఉత్తరంలో, "యీ రామప్పంతులు చిక్కులకి జాకాల్, తెలివికి బిగ్ యాస్" అని టీకా టిప్పణి సహితంగా రాయడమూ, లుబ్ధావధానులేమో "గాడిదని ఎందుకు తెమ్మన్నావయ్యా నా నెత్తిమీదకి?" అని అపార్ధం చేసుకోవడమూడు... నవ్వుకున్నవాళ్ళకి నవ్వుకున్నంత హాస్యం!  తన కన్నా వయసులో చాలా పెద్దవాడే అయిన లుబ్ధావధాన్లు తనని కోపంలో ఏకవచన ప్రయోగం చేస్తే సహించడు. లుబ్ధావధాన్లు కూతురు, వితంతువు అయిన మీనాక్షిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో సంబంధం నెరపుతాడు రామప్పంతులు. ఓ రాత్రివేళ లుబ్దావధాన్లుకి పట్టుబడి చావుదెబ్బలు తింటాడు. మధురవాణిని ఉంచుకున్నా, ఆమె మీద విపరీతమైన అనుమానం. అలాగని ఆమెతో తెగతెంపులు చేసుకోడు.

పోలీసుల్ని ఉపయోగించుకోవడం ఎలాగో రామప్పంతుల్ని చూసి నేర్చుకోవచ్చు. ప్రధమాంకంలో, గిరీశం చేతిలోనూ, పూటకూళ్ళమ్మ చీపురుతోనూ దెబ్బలు తిన్నప్పడు, అంత బాధలోనూ కూడా "గవురనుమెంటు జీతవిచ్చుంచిన కనిష్టీబులుండగా మనకెందుకు శరీరాయాసం?" అంటూ కనిష్టీబుకి కబురంపించమంటాడు మధురవాణితో. మాయగుంటతో పాటు మాయమైపోయిన మధురవాణి కంటె కోసం పోలీసులనే ఆశ్రయిస్తాడు.కంటె ఇప్పించకపోతే హెడ్ కనిస్టీబు మీద పిటిషన్ వేస్తానంటూ "అక్కరమాలిన లౌక్యాలు" చేస్తాడు కూడా. సౌజన్యారావు పంతులు తిరస్కారానికి గురైన రామప్పంతులు, బుచ్చమ్మ అబ్ డక్షన్ కేసులో జాతకం బనాయింపు విషయం బయటపడిపోవడంతో ఫోర్జరీ కేసు భయంతో కోర్టు నుంచి జారుకున్నాక మళ్ళా కనిపించడు. కోర్టు వ్యవహారాలు అనుభవం అయినవాళ్ళకి రామప్పంతుల్ని కొత్తగా పరిచయం చేయనవసరం లేదు, ఇవాళ్టికీ.

శనివారం, సెప్టెంబర్ 16, 2017

మీనాక్షి

రామచంద్రపురం అగ్రహారీకుడు లుబ్దావధాన్లు ఏకైక సంతానం మీనాక్షి. లుబ్దావధాన్లు దగ్గర బాగానే డబ్బున్నా, పేరుకు తగ్గట్టే పరమ లోభి. 'కన్యాశుల్కం' ఆశించి, మీనాక్షికి చిన్నప్పుడే ఓ ముసలి వాణ్ణిచ్చి  పెళ్లి చేశాడు. పెళ్ళైన కొద్ది కాలానికే ఆ వరుడు కన్నుమూయడంతో, ఏ ముచ్చటా తీరకుండానే తల చెడి పుట్టిల్లు చేరింది. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న మీనాక్షి, పుట్టింటికి తిరిగొచ్చాక తండ్రి ఆలనా పాలనా చూడడం ఆరంభించింది. అయితే, కేవలం తండ్రి చాటు బిడ్డ కాదు మీనాక్షి. ఆమెలో ఓ తిరుగుబాటు ఉంది. జీవితం మీద కొండత ఆశ ఉంది. తనకి జ్ఞానం తెలియని వయసులో జరిగిన పెళ్లి కారణంగా, తను కఠోరమైన జీవితం గడపాల్సిన అవసరం లేదని ఆమె నమ్మకం. అందుకే, తన అవసరాలు తీర్చుకునే దొడ్డిదారి వెతుక్కుంది. ఆ దారి మరేదో కాదు, తన తండ్రి స్నేహితుడు రామప్పంతులు.

తండ్రిమీద అభిమానం ఉన్నా, తన వైవాహిక జీవితం మొగ్గలోనే మాడిపోడానికి అతడే కారణమన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోదు మీనాక్షి. తనకన్నా వయసులో చాలా చిన్నదైన సుబ్బిని తండ్రి పెళ్లి చేసుకుంటానన్నప్పుడు తనకేమనిపించిందో పైకి చెప్పలేదు మీనాక్షి. ఆ పెళ్లి చెడిపోయి, మాయగుంటతో పెళ్లి నిశ్చయం అయినప్పుడు మాత్రం చాలా మామూలుగా పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసుకుంది. ముహూర్తం విషయం తండ్రి తనతో సరిగ్గా చెప్పలేదని సిద్ధాంతి దగ్గర బాధ పడింది కూడా. పెళ్లవ్వగానే ఊరెళ్ళిపోతూ మారువేషంలో ఉన్న కరటక శాస్త్రి మాయగుంట మహేశాన్ని అప్పగించిందికూడా మీనాక్షికే. "మీ పిల్లని నా కడుపులో పెట్టుకోనా తాతయ్యా" అనడమే కాదు, తనకని ఇచ్చిన పులిమొహరుని కూడా మాయగుంట దగ్గరే ఉండనిస్తుంది "దాం దగ్గర ఉంటేనేం, నా దగ్గర ఉంటేనేం" అంటూ.

పెళ్ళిలో రామప్పంతులు చేసిన అల్లరి కారణంగా, తాను పెళ్లాడింది రెండో పెళ్లి పిల్లనేమో అన్న అనుమానం మొదలవుతుంది లుబ్దావధాన్లులో. ఆ పిల్ల మొదటి మొగుడొచ్చి తన పీక నులిమేస్తున్నట్టు పీడకలలు కూడా మొదలవుతాయి. దాంతో ప్రాణభయం పట్టుకుని అల్లరి ఆరంభిస్తాడు. అప్పుడు  అతగాడికి ధైర్యం చెప్పింది మీనాక్షే. "ఒహవేళ రెండో పెళ్లి పిల్ల అయితే మాత్రం గప్ చుప్ అని ఊరుకోవాలి గాని, అల్లరి చేసుకుంటారా? యంతమంది ఈ రోజుల్లో రెండో పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నారు కారు? పిల్ల బుద్ధిమంతురాలు. మీ అదృష్టం వల్ల దొరికింది. మాట్లాడక ఊరుకోండి" అని లోకరీతి వివరిస్తుంది. అయినా వినిపించుకోని లుబ్ధావధాన్లు "ఇహ బతకను" అని రాగం అందుకునేసరికి, ఒక్కసారిగా నవ్వుతుంది మీనాక్షి. తనకన్నా చిన్నపిల్లని తన తండ్రి రెండో పెళ్లి చేసుకోడం పట్ల మీనాక్షి ప్రకటించిన తిరస్కారం ఆ నవ్వు.

కానీ, ఆ నవ్వు ఒక్క క్షణమే. అంతలోనే తండ్రి మీద జాలి ముంచుకొస్తుంది ఆమెకి. ధైర్యవచనాలెన్నో చెబుతుంది. కానీ, తండ్రి అవేవీ తలకెక్కించుకోకుండా "దాన్ని కూడా పాడుచేస్తున్నావూ?" అని కొత్త భార్య విషయంలో అనుమానపడ్డప్పుడు, మళ్ళీ తిరస్కారం కనిపిస్తుంది ఆమెలో. "ఇలాంటి మాటలంటేనే నాకు అసయ్యం" అని సూటిగా చెబుతుంది. మాయగుంట మీద మీనాక్షి చూపించిన ప్రేమ తాత్కాలికమే. ఎప్పుడైతే, తన పులిమొహరు తనకి యివ్వలేదో ఆ పిల్ల మీద అనుమానం మొదలవుతుంది. ఒళ్ళు పట్టని కోపం వచ్చి చీపురుకట్టతో కొట్టబోతుంది. "ఛస్తే ఈడ్చి పారేస్తాను" అనడానికి కూడా వెనుకాడదు. ఇహ, పారిపోయిన మాయగుంట ఆచోకీ కనిపెట్టడానికి రంగంలోకి దిగిన పూజారి గవరయ్యని - అంత ఒత్తిడిలోనూ - తర్కంతో ప్రశ్నించింది మీనాక్షే.

మాయగుంటని "దాని మొగుడు యగరేసుకుపోయాడు" అని చెప్పిన గవరయ్యతో, "ఎక్కడికి యగరేసుకు పోయాడు? వాడు ఈ సీసాలో ఉన్నాడన్నారే?" అని అడుగుతుంది మీనాక్షి. గవరయ్య కొంచం అలోచించి, ఇద్దర్నీ సీసాలో బంధించానని సమాధానమిస్తాడు. "యిద్దర్నీ ఓ సీసాలో పెడితే దెయ్యప్పిల్లల్ని పెడతారేమో" అన్న మీనాక్షి సందేహంలో హాస్యం ధ్వనించినా, కొంచం ఆలోచిస్తే ఆమె ఆలోచనలు ఏ దిశగా సాగుతున్నాయో స్పష్టమవుతుంది. రామప్పంతులుతో మీనాక్షి సంబంధం బహిరంగ రహస్యమే. అందరికీ తెలిసినా ఎవరికీ తెలియనట్టే ఉంటారు. ఆర్నెల్లకీ, ఏడాదికీ పీకలమీదకి వచ్చినా, అంతటి లుబ్ధావధాన్లూ డబ్బు ఖర్చు చేసి గండం గట్టెక్కిస్తూ ఉంటాడు. తన ప్రవర్తనకి మీనాక్షి సిగ్గు పడదు, పశ్చాత్తాపం ప్రదర్శించదు. ముసలివాడికి తనని ఇచ్చి కట్టబెట్టడమే దీనికంతటికీ కారణమని ఆమెకి బాగా తెలుసు.

తనని నేడో రేపో వితంతు వివాహం చేసుకుంటాడని ఎదురు చూస్తున్న రామప్పంతులు, ఉన్నట్టుండి మధురవాణిని తెచ్చి పెట్టుకోవడం మింగుడు పడదు మీనాక్షికి. దెయ్యాల మీద నమ్మకం లేకనో, లేక రామప్పంతులు మీద కోపం చేతనో, ఓ అర్ధరాత్రి వేళ తలుపుతట్టిన పంతులికి దిగదుడుపు కూడు చేతికిస్తుంది. "దెయ్యం తిని సచ్చిందా ఏవిటి?" అని ఎదురడుగుతుంది. మధురవాణితో మంచి స్నేహమే ఉన్నా, పంతులుని దక్కించుకుని, తన జీవితాన్ని ఓ గాడిలో పెట్టుకోవడం కోసం మధురవాణి మీద నిందారోపణలకి వెనుకాడదు. "ఆడది నీతి తప్పిన తర్వాత అంతేవిటి, ఇంతేవిటి? అందునా సాంది ఖాయిదాగా ఉండాలనుకోవడం మీదీ బుద్ధి తక్కువ" అని హితబోధ చేస్తుంది కూడా. రామప్పంతులు తనని పెళ్ళాడి తీరక తప్పదని, రాత్రికి రాత్రే ఇల్లు వదిలి అతగాడితో ప్రయాణమైపోతుంది.

మరోపక్క, తన కంటె  తెస్తే కానీ ఇంట్లోకి రానివ్వనని అల్లరిపెడుతుంది మధురవాణి. అదిగో, ఆ సందర్భంలో మీనాక్షికి పంతులు పెట్టిన ముద్దుపేరు 'ఆకు చిట్టెడ.' "పంతులు నన్ను కౌగలించుకుని ఎత్తుకుంటే మా నాన్న చూసి, తన్ని, యిద్దర్నీ ఇంట్లోంచి తగిలేశాడు. నువ్వు హెడ్డు కనిష్టీబుతో పోతున్నావు, నిన్నొదిలేసి నన్ను పెళ్ళాడతానని ఒట్టేసుకున్నాడు. నన్ను లేవదీసుకొచ్చి, నన్ను పెళ్లాడక తప్పుతుందా ఏవిటి?" అని మధురవాణిని అడుగుతుంది మీనాక్షి. "అవశ్యం పెళ్ళాడవలసిందే. పెళ్లాడకపోతే నువ్వు మాత్రం ఊరుకుంటావూ? దావా తెస్తావు. పంతులు గారికి  దావాలంటే సరదానే!" అంటూ పంతులు బలహీనత మీద కొడుతుంది మధురవాణి. ఇంతచేసీ, పంతుల్ని పెళ్ళాడలేక పోయింది మీనాక్షి. ఆ రాత్రే, "చిట్ట పులిని తండ్రొచ్చి వండకి తీసుకుపోయినాడని" దాసరివేషం కట్టిన మహేశం ద్వారా తెలుస్తుంది.

మాయగుంట ఖూనీ కేసు విషయమై సౌజన్యారావు పంతులుని కలిశాక, లుబ్దావధాన్లులో పశ్చాత్తాపం కలగడంతో పాటు, మీనాక్షిని వితంతువుల మఠంలో చేర్చాలని, చదువు, పెళ్లి ఆమె ఇష్టానికి వదిలేయాలని నిర్ణయించుకుంటాడు. తన భవిష్యత్తుని గురించి మీనాక్షి తెలివైన నిర్ణయమే తీసుకుని ఉంటుంది.

శుక్రవారం, సెప్టెంబర్ 15, 2017

మహేశం

సంస్కృత పండితుడూ, విజయనగరం నాటక కంపెనీలో విదూషకుడూ అయిన కరటక శాస్త్రికి ప్రియశిష్యుడు మహేశం. సంస్కృత విద్యార్థి. కరటకుడి మేనల్లుడు వెంకటేశం ఈడువాడు. అవతలున్నది గురువుగారైనా, మరెవరైనా ఎలాంటి శషభిషలూ లేకుండా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడ్డం మహేశం నైజం. అందుకే. "ఈ రోజుల్లో సంస్కృతం చదువు ఎవరికి కావాలి?" అని గురువు గారడిగితే, "దరిద్రులకి కావాలి" అని ఠపీమని జవాబిస్తాడు. అవును, ఇంగ్లీషు చదువుకోడం హోదాకి చిహ్నంగా మారిన కాలంలో, తన ఈడు వాడైన వెంకడు తనకి ఇంగ్లీషు వచ్చునని గర్రా వెలిగిస్తూ ఉన్నప్పుడు మహేశానికి ఆ మాత్రం కడుపు మండడం సహజమే. అంతే కాదు, ఇంగ్లీష్ చదువంటే ఆషామాషీ కాదని కూడా తెలుసునా కుర్రాడికి. అందుకే, "నీకు ఇంగ్లీషు చదువుకోవాల్నుందా?" అన్న కరటక శాస్త్రి ప్రశ్నకి, "చెప్పించే దాతేడీ?" అని ఎదురు ప్రశ్న వేస్తాడు.

ఇంగ్లీషు చదువులు దేశంలో ప్రవేశించిన తొలినాళ్లలో, ఆ చదువులపై మోజు పెంచుకుని, చదువుకునే స్తోమతు లేని తొలితరం యువతకి ప్రతినిధి మహేశం. వెంకటేశం ద్వారా పరిచయమైన గిరీశం ఓ అద్భుతమైన మనిషిగా తోస్తాడు అతనికి. ఇంగ్లీషు మీద మోజుతో పాటు, తాను నేర్చుకుంటున్న సంస్కృతం ఎందుకూ కొరగానిదన్న భావనా బలపడుతూ ఉంటుంది. "పనికొచ్చే ముక్క ఒక్కటీ ఈ పుస్తకంలో లేదు. నాలుగంకెలు బేరీజు వేయడం, వొడ్డీ వాశి కట్టడం కాళిదాసుకేం తెలుసు?  తెల్లవాడిదా మహిమ! ఏ  పట్నం యెక్కడుందో, ఏ కొండలెక్కడున్నాయో అడగవయ్యా గిరీశం గార్నీ; నిలుచున్న పాట్న చెబుతాడు" అని ముచ్చటపడతాడు మహేశం. అంతే కాదు "నాటకంలో నా చేత వేషం కట్టించి పెద్ద చేంతాళ్ల లాంటి హిందుస్తానీ ముక్కలూ, సంస్కృతం ముక్కలూ అర్ధం తెలియకుండా భట్టీయం వేయించడానికి మీకు ఓపికుందిగాని, నాకు నాల్రోజులకో శ్లోకం చెప్పడానికి శ్రద్ధ లేదుకదా?" అని గురువుగారిని నిలదీయగలడు.

శిష్యుడి  చురుకుదనం తెలిసిన వాడు కాబట్టే, మేనకోడలు సుబ్బికి లుబ్ధావధాన్లుతో జరగబోయే పెళ్లిని చెడగొట్టడానికి మహేశాన్ని సాయం కోరతాడు కరటక శాస్త్రి. "నీకు తలదువ్వి కోక గడితే పజ్వండేళ్ల కన్నె పిల్లలా ఉంటావు. నిన్ను తీసుకెళ్లి లుబ్ధావుధాన్లికి పెళ్లి చేస్తాను. నాలుగు పూటలు వాళ్ళింట నిపుణతగా మెసిలి, వేషం విప్పేసి పారిపోయిరా. నిజవైన పెళ్ళిముహూర్తం చాలా వ్యవధి ఉంది," అంటూ పధకం వివరించగానే, "యిదెంతపని!" అని సులువుగా అనేస్తాడు. భయవక్కర్లేదని గురువు గారికి హామీ ఇస్తాడు. వేషానికి ప్రతిగా మహేశానికి తన పిల్లనిచ్చి ఇల్లరికం ఉంచుకుంటాననీ, ఇంగ్లీషు చెప్పిస్తాననీ మాటిస్తాడు కరటకశాస్త్రి. అప్పటికే సంస్కృతం పుస్తకాల మీద నమ్మకం పోగొట్టుకున్న మహేశం, ఒట్టు కోసం గిరీశం గారినడిగి ఇంగ్లీషు పుస్తకం తెస్తానంటాడు. "ఎగేస్తే భూవి తోడ్రా" అని కరటకుడంటే, "మీరు ఎగేస్తే భూవేం చేస్తుందిలెండి" అని జీవితసత్యం పలుకుతాడు.

మాయగుంట వేషం వేయించిన గురువుగారు, తనని మధురవాణి బసకి తీసుకు వెళ్లడంతోటే  ఆమె మాయలో పడిపోతాడు మహేశం. నిజంగా ఆడపిల్లేనని భ్రమ పడిన మధురవాణి సరసం ఆడబోతే, "కొడుతుంది కాబోలురా నాన్నా. ఇంటికెళ్లిపోదాం రా" అంటాడు. మధురవాణి ముచ్చటపడి బలవంతంగా ముద్దు పెట్టుకుంటే, "నేరని పిల్లని చెడగొడుతున్నావు" అంటాడు కరటకుడు. "నాలాంటి వాళ్లకి  నూరు మందికి నేర్పి చెడగొట్టగలడు. ఎవరి శిష్యుడు? ఈ కన్నెపిల్ల నోరు కొంచం చుట్ట వాసన కొడుతూంది" అంటూ రహస్యం బయట పెట్టేస్తుంది. ఈ గడబిడకి పాపం, తాను పోషిస్తున్న పాత్ర పేరేవిటో కూడా మర్చిపోయి "ఇంతకీ నా పేరేవిటండోయి" అని కరటక శాస్త్రిని అడుగుతాడు. "సబ్బు అనే పేరు జ్ఞాపకం ఉంచుకుంటే సుబ్బి అనే పేరు జ్ఞాపకం ఉంటుంది" అని చిట్కా చెబుతారు గురువుగారు.

రామప్పంతులు ఎదుటా, లుబ్ధావధాన్లు ఎదుటా నిజంగానే నిపుణతతో మెసలుతాడు మహేశం. మధురవాణి కంటె తెచ్చి వధువుకి అలంకరిస్తాడు రామప్పంతులు. మీనాక్షి అయితే "అది ఒట్టి సత్తెకాలపు పిల్ల నాన్నా.. నాకెంతో ఉపచారం చేస్తోంది" అని చెబుతుంది తండ్రితో. పెళ్ళిలో రామప్పంతులు చేసిన అల్లరి కారణంగా, పెళ్లికూతురు రెండో పెళ్లి పిల్లేమోనన్న అనుమానం బలపడుతుంది లుబ్ధావధాన్లుకి. దాంతో, ఆ పిల్ల మొదటి మొగుడొచ్చి తన పీక నులిమేస్తున్నట్టు భ్రమలు మొదలవుతాయి. ఆ ఇంట్లోనుంచి పారిపోడానికి ఇదే మంచి అవకాశంగా తోస్తుంది మహేశానికి. తనకు అంతకు ముందే పెళ్ళయిందన్న 'రహస్యాన్ని' మీనాక్షి చెవిన వేసి, ఆమె దెబ్బలు కొడుతుంటే తప్పించుకోడానికి చెయ్యి కొరికేసి మరీ ఓ రాత్రి వేళ గోడదూకి పారిపోతాడు, కంటెతో సహా. ఆ కంటెని లుబ్ధావధాన్లు ఇంట్లోనే వదిలేస్తే ఖూనీ కేసులూ అవీ ఉండకపోయేవి.

పారిపోయిన మహేశం మధురవాణి బసకి చేరి, పేకాట సంరంభంలో ఉన్న మధురవాణినీ, ఆమె స్నేహితుల్నీ రామప్పంతులు గొంతుని అనుకరించి భయపెడతాడు. "వాళ్ళింట  ఏవేవి చిత్రాలు చేశావో చెప్పు?" అని అడిగినప్పుడు, "ముద్దెట్టుకోనంటే చెబుతాను" అని చెప్పి, "ముద్దెట్టుకుంటే యెంగిలౌతుంది" అంటూ తనకున్న బుద్ధి తన పెద్దలకి లేదని నిరూపించుకుంటాడు. ఆమె కంటె ఆమెకి ఇచ్చేసి, వేషం విప్పేసి, దాసరి వేషంలో ఊరు దాటేస్తాడు, రామప్పంతులు భయపడే చావు పాటలు పాడుకుంటూ. మళ్ళీ మహేశం కనిపించేది, ఖూనీ కేసు హడావిడికి భయపడిన కరటక శాస్త్రి, శిష్యుడితో సహా విశాఖపట్నంలో ఉన్న మధురవాణి బసకి వచ్చినప్పుడే.

ఆడిన నాటకానికి గాను గురుశిష్యులిద్దరికీ మఠ ప్రవేశం తప్పదని మధురవాణి హడలగొడితే, "మా గురువుగారి మాటకేం. అయన పెద్దవారు. ఏం వచ్చినా సర్దుకోగలరు. నేను పాపం పుణ్యం ఎరగని పసి పిల్లవాణ్ణి. నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డువేశావంటే కీర్తి ఉండి పోతుంది" అనడమే కాదు, అప్పటికప్పుడు గురువుగారితో తెగతెంపులు చేసుకుని ఆమె శిష్యరికం చేయడానికి సిద్ధపడిపోతాడు. "నీళ్లు తోడుతాను, వంట చేస్తాను. బట్టలు వుతుకుతాను గాని బ్రాహ్మణ్ణి కదా, కాళ్ళు పట్టమనవు గద?" అన్న అమాయకపు ప్రశ్నతో ఆమెని నవ్విస్తాడు. మధురవాణి కంటెని లుబ్ధావధాన్లుకి పోస్టులో పంపితే, ఖూనీ జరగలేదని పోల్చుకుంటారని కరటకుడి ఆలోచన. కంటె తిరిగి వచ్చేవరకూ మహేశాన్ని, మధురవాణి తాకట్టులో ఉంచుతాడు. వెళ్తూ వెళ్తూ జాగ్రత్తలు చెప్పబోయిన గురువుగారితో "ఎవరిదగ్గర ఉన్నప్పుడు వారు చెప్పిందల్లా చేయడవే నా నిర్ణయం" అని తెగేసి చెబుతాడు మహేశం.ఇంగ్లీషు చదువులు చదివాక మహేశం ఇంకెన్ని చిత్రాలు చేశాడో తెలుసుకునే వీలు లేదుకదా అనిపిస్తూ ఉంటుంది, 'కన్యాశుల్కం' చదివినప్పుడల్లా.

గురువారం, సెప్టెంబర్ 14, 2017

మధురవాణి

సుబ్బి అనే చిన్నపిల్లకీ, లుబ్ధావధాన్లు అనే ముసలివాడికీ నిశ్చయమైపోయిన పెళ్లిని చెడగొట్టి,  బాల్య వివాహం బారినుంచి సుబ్బిని కాపాడడమే 'కన్యాశుల్కం' నాటకం  ప్రధాన కథ. ఈ పెళ్లిని చెడగొట్టేందుకు ఎవరి స్థాయిలో వాళ్ళు కృషిచేసినా, ప్రముఖంగా చెప్పుకోవాల్సింది మధురవాణి అనే వేశ్యని గురించి. ఆమె వృత్తి చేత వేశ్య కనుక చేయవలసిన చోట ద్రవ్యాకర్షణ చేస్తుందే తప్ప, దయాదాక్షిణ్యాలున్న మనిషి. 'మంచి వారి యెడల మంచి గాను, చెడ్డవారి యెడల చెడ్డగానూ' ఉండమని చిన్ననాడు తల్లి చేసిన బోధలని అక్షరాలా ఆచరణలో పెడుతోంది. సుబ్బి పెళ్లి చెడగొట్టడానికి ఎవరి కారణాలు వాళ్లకి ఉన్నప్పటికీ, ఏ కారణమూ లేకపోయినా, తనేనాడూ సుబ్బి ముఖం చూడకపోయినా ఆ పిల్లకి అన్యాయం జరగకూడదన్న తాపత్రయం మధురవాణిది.

నాటకం ప్రధమాంకంలో, మధురవాణి బసలో "పిలా.. అగ్గిపుల్ల"  అన్న రామప్పంతులు పిలుపు ద్వారా మధురవాణి పరిచయం జరుగుతుంది, ఆమె పిల్ల కాదు అగ్గిపుల్ల అని. ఇక ఆమె మొట్ట మొదట మాట్లాడే మాటే "మగవాడికైనా ఆడదానికైనా నీతి ఉండాలి" అని! వేశ్య పాత్ర చేత నీతిని గురించి మాట్లాడించడమే కాదు, నాటకం కడవరకూ ఆమె తన నీతికి కట్టుబడి ఉన్నదని చిత్రించారు రచయిత గురజాడ అప్పారావు పంతులు. మధురవాణి ఊరు విజయనగరం. నాటి కాలపు సానులందరిలాగే తల్లి దగ్గర లోకజ్ఞానం, సంగీతం అభ్యసించింది. వాళ్ళ కన్నా ఓ మెట్టు పైగా కొంత కాలం ఇంగ్లీష్ కూడా చదువుకుంది, గిరీశం దగ్గర. ఈ కారణానికి గిరీశం మీద మాట రానివ్వదు. ఎంతటి వాళ్ళనైనా సరే, తన ఎదురుగా గిరీశాన్ని దూషించే మాటైతే తన ఇంట్లో నుంచి విజయం చేయమంటుంది. గిరీశం ఆమెని ఉంచాడు కూడా.

నెల రోజుల కిత్రం గిరీశం ఇచ్చిన ఇరవై రూపాయల (పూటకూళ్ళమ్మ గిరీశానికిచ్చిన సంత బాపతు) తర్వాత అతని నుంచి మరి పైసా రాలలేదు. డబ్బుకి యటాముటీ రావడంతో మరో కొమ్మ వెతుక్కోడానికి నిశ్చయించుకున్న మధురవాణికి రామచంద్రపురం వాసి రామప్పంతులు తారసపడతాడు. ఆమెని ఉంచుకోడానికి అంతా సిద్ధం చేసి, రెండు వందల రూపాయలు అడ్వాన్స్ కూడా ఇస్తాడు. అతగాడు మాట మీద నిలబడే మనిషి కాకపోవడంతో కాలక్షేపం చేయడం కష్టం అనుకుంటుంది మొదట. ఆ తర్వాత, అతడి స్థితి 'పైన పటారం లోన లొటారం' అని తెలిసినప్పుడు, తెలియక మోసపోయినట్టు గ్రహించి, శీఘ్రమే మరో కొమ్మ వెతుక్కోవాలని నిశ్చయించుకుంటుంది. ఇంతలో ఆమెకి రామప్పంతులు స్నేహితుడు లుబ్ధావధాన్ల పెళ్లి వార్త తెలుస్తుంది.

వధువెవరో తనకి తెలియకపోయినా, వృద్ధుడు, రోగిష్టీ అయిన లుబ్ధావధాన్లుని కట్టుకుని సుఖపడేది ఏమీ ఉండదని తెలుసు కనుక, ఆ పెళ్లి తప్పించమని రామప్పంతులుని కోరుతుంది మధురవాణి. పంతులు ససేమిరా అంటాడు. ఇంతలో మరువేషం వేసుకుని శిష్యుడితో సహా రామచంద్రపురం వచ్చిన కరటక శాస్త్రి, పంతులింట లేని వేళ చూసి ఇంటి తలుపు తడతాడు. మధురవాణికీ, శాస్త్రికీ మునుపే స్నేహం. పెళ్లి చెడగొడితే, మధురవాణికి డబ్బిస్తానని శాస్త్రి ఆశ చూపినప్పుడు "మీ తోడబుట్టువుకి ప్రమాదం వొచ్చినప్పుడు నేను డబ్బుకి ఆశిస్తానా?" అని అడుగుతుంది. అంతే కాదు, ఆ క్షణం నుంచీ, లుబ్ధావధాన్లుకి మాయగుంటతో పెళ్లి జరపడానికి తెరవెనుక నుంచే విశేషమైన కృషి చేస్తుంది. హెడ్ కానిస్టీబుతో చనువు నటించి, మాయగుంట పెళ్లి జరగడానికి, అటుపైని కరటక శాస్త్రీ, శిష్యుడూ ఒకరి వెనుక ఒకరు ఊరు విడిచి పారిపోడానికి పోలీసుల అడ్డు లేకుండా కాస్తుంది.

స్త్రీల పట్ల గొప్ప ఆదరభావం మధురవాణికి. అందుకే, గిరీశాన్ని వెతుక్కుంటూ తన ఇంటికి వచ్చిన పూటకూళ్ళమ్మకి నోటితో "లేడ" ని చెబుతూనే, నొసటితో మంచం కిందకి చూపుతుంది. లుబ్దావధాన్లు కూతురు మీనాక్షితో మంచి స్నేహం, ఆమె స్థితి పట్ల సానుభూతీను. ఆమెని గురించి చెడ్డ మాట వినడానికి సిద్ధ పడదు. మీనాక్షిని వివాహం చేసుకోవలసిందిగా రామప్పంతులు పై ఒత్తిడి తెస్తుంది కూడా. చదువు చెప్పాడన్న కారణానికి గిరీశం మీద గౌరవం ఉన్నా, కేవలం బుచ్చమ్మ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకునే అతగాడి నిజస్వరూపాన్ని సౌజన్యారావు పంతులు ముందు ఉంచుతుంది. రామప్పంతుల్ని గాడిద అంటూ ఏడిపించినా, లుబ్ధావధాన్లు ఛాతీ కొలిచి బులిపించినా అదంతా వాళ్ళ బలహీనతలతో ఆడుకోవడమే అనిపిస్తుంది. కంటె చేతికిస్తూ ఆమె కరటక శాస్త్రికి పోసిన తలంటి కూడా సామాన్యమైనది కాదు. అది విన్నాక, అంతటి పండితుడికీ తెల్లవెంటుకలు లావయ్యాయి.

రామచంద్రపురంలో తగుమాత్రం పెద్దమనుషులు - సిద్ధాంతి, భుక్త, పూజారి గవరయ్య, పోలిశెట్టి లాంటి వాళ్ళు - అందరినీ తన బస చుట్టూ తిప్పుకుని లుబ్దావధాన్లు ఇంట్లో జరిగే నాటకాన్ని రక్తి కట్టిస్తుంది. ఇక హెడ్ కానిస్టీబైతే మధురవాణికి "గులాం." మాయగుంట పారిపోయాక, కంటె విషయంలో గడబిడ జరిగి, వరస కేసులు దాఖలైనప్పుడు భయపడ్డ కరటక శాస్త్రి - డిప్టీ కలెక్టరు కి మధురవాణి మీద మోజుందని తెలిసి - చూసి రమ్మంటాడు. "చూడదల్చుకోలేదు" అన్నప్పుడు "హెడ్డు కనిస్టీబు పాటి చేశాడు కాదా?" అని శాస్త్రి మాట జారితే, "హెడ్డుని నౌఖరులా తిప్పుకున్నాను కానీ, అధికం లేదే. ఆ నాలుగురోజులూ, సర్కారు కొలువు మాని అతడు నా కొలువు చేశాడు" అని గుర్తు చేస్తుంది. అంత మాత్రం చేత, తాను గొప్పదాన్నని కానీ, తవ వృత్తిలో హైన్యత లేదని కానీ భావించదామె.

"నీ తల్లి తరిఫీదు చేతనే నువ్వు విద్యా సౌందర్యాలు రెండూ దోహదం చేసి పెంచుకున్నావు" అని కరటకుడు మెచ్చుకోలు మాటాడితే, "అంతకన్నా కాపు మనిషినై పుట్టి మొగుడి పొలంలో వంగ మొక్కలకూ, మిరప మొక్కలకూ దోహదం చేస్తే యావజ్జీవితమూ కాపాడే తనన్న వాళ్ళు ఉందురేమో" అంటుంది. అంగడి వాడికి మిఠాయి మీద ఆశా, సానికి వలపూ మనసులోనే మణగాలని నమ్మే మధురవాణికి, తాను కొద్దికాలం ఉండే యవ్వనాన్ని జీవనాధారం చేసుకున్నానని అనుక్షణం గుర్తుంటుంది. ఆమెకున్న తిక్క నేస్తులకి ఉపచరించేదే కానీ, ఎవరికీ హాని చేసేది కాదు. వృత్తిని మానేస్తే అందుకు ప్రత్యామ్నాయం ఏమిటన్నది ఆమెని వెంటాడే ప్రశ్న. మాయగుంట పెళ్లి నాటకానికి తెరదించడానికి మారువేషంలో సౌజన్యారావు పంతులు బసకి వెళ్లిన మధురవాణి, అదే ప్రశ్నని అతగాడి ముందు ఉంచుతుంది, కానీ జవాబు మాత్రం రాదు.

వృత్తి చేత అనేకరకాల మనుషులని చూస్తూ వచ్చిన మధురవాణికి సౌజన్యారావు పంతులు సౌజన్యం మీద రవ్వంత అనుమానం. అతగాడికి నిజంగా ప్రచారంలో ఉన్న మంచి లక్షణాలన్నీ ఉన్నాయా లేక పైకి తెలియని బలహీనతలు ఏమన్నా ఉన్నాయా అన్న స్త్రీ సహజమైన కుతూహలం. అందునా, స్త్రీ వ్యసనం లేని మగవాడిని చూడడం ఆమెకి బొత్తిగా కొత్త. మనుషుల్ని ఆడించే స్వభావం ఉండనే ఉంది. అందుకే, సౌజన్యారావు తనని ముద్దు పెట్టుకునేందుకు అంగీకరిస్తేనే, లుబ్ధావధాన్లు కేసు ముడి విప్పుతానని షరతు విధిస్తుంది. తీరా కేసు విషయం తేలిపోయాక, సౌజన్యరావుకి తన మీద ఆకర్షణ లేదని అర్ధమవుతుంది. అందుకే, "మంచి వారిని చెరపవద్దని మా అమ్మ చెప్పింది," అంటూ ముద్దుని తిరస్కరిస్తుంది. "వట్టి రంగువేసిన గాజుపూస" అని గిరీశం మధురవాణిని అంటే అని ఉండవచ్చు గాక, మధురవాణి మనసు మాత్రం "ప్యూర్ డైమండ్" అంతే, మరో మాట లేదు.

బుధవారం, సెప్టెంబర్ 13, 2017

బైరాగి

హరిద్వారంలో మఠం కట్టించడమే బైరాగి లక్ష్యం. అందుకోసం ఎక్కడ డబ్బొచ్చినా కాదనకుండా స్వీకరిస్తాడు. కాకపొతే, ఆ మఠం పనులు ఎప్పుడు మొదలవుతాయో, ఎప్పటికి పూర్తవుతాయో నరమానవుడికి తెలియదు. సిద్ధుడు కాబట్టి బైరాగికి మాత్రమే తెలుసు. బైరాగికి ఆదీ అంతం లేదు. నాటికి ఆరొందల ఏళ్ళ క్రితం నాటి వేమన బైరాగికి తాత. రెండొందల యాభై ఏళ్ళ క్రితం కాశీలో జరిగిన ఓ సంఘటనకి బైరాగి ప్రత్యక్ష సాక్షి. చూడగానే 'సిద్ధుల్ని' పోల్చగల రామచంద్రపురం సారా దుకాణదారుడు బైరాగిని పోల్చి, ఆతిధ్యం ఇస్తాడు. కాళీ మందిరం దగ్గరున్న సారాయి దుకాణం దగ్గర బైరాగికి భక్త బృందం తయారవుతుంది. ఆ బృందానికి నాయకుడు సారాయి దుకాణదారే.

"అమృతమనేది ఏమిటి? సారాయే! నాడు ఇదే గదా తాగడానికి దేవాసురులు తన్నుకు చచ్చారు" అంటూ భక్తులకి జ్ఞానబోధ చేసే బైరాగి, తనకి తెలిసిన రస విద్యని ఉపయోగించి బంగారం తయారు చేసి తన శిష్యులకి కానుగ్గా ఇస్తానని ఊరిస్తూ ఉంటాడు. ఆ బంగారంతోనే మఠం కట్టొచ్చు కదా అని అడిగిన అజ్ఞానపు శిష్యుడితో "మేం చేసే స్వర్ణం మేమే వాడుక చేస్తే తల పగిలిపోతుంది" అని సెలవిస్తాడు. తనబోటి సిద్ధులకి చలీ, వేడీ, సుఖం దుఃఖం లేవని కూడా జ్ఞానం పంచుతాడు. ఇంతా చేసి బైరాగి లౌకిక విషయాలకి పూర్తిగా దూరంగా ఉంటాడనుకోవడం పొరబాటు. మాయగుంట ఖూనీ కేసులో సాక్ష్యం చెప్పడానికి సిద్ధమైపోతాడు. ఏవైనా దొరికితే, హరిద్వారంలో మఠానికి పనికొస్తాయని!

"సాక్ష్యం అంటే మావంటి వాళ్ళే చెప్పాలి. యోగ దృష్టి వల్ల చూశావంటే ఎక్కడ జరిగినదీ, ఎప్పుడు జరిగినదీ కళ్ళకి కట్టినట్టు అప్పుడు కనిపిస్తుంది," అనడమే కాదు, అవసరమైతే కల్పించడానికి కూడా సిద్ధ పడిపోతాడు. "వెర్రి! వెర్రి! నిజవేఁవిటి, అబద్ధవేవిఁటి? మేం సిద్ధులం. అబద్ధం నిజం చేస్తాం. నిజం అబద్ధం చేస్తాం. లోకవే పెద్ద అబద్ధం" అన్నాకా ఇంక తిరుగేవుంటుంది. పైగా, హెడ్ కనిస్టీబు బైరాగికి ప్రియ శిష్యుడు కూడా. అందుకే ఖూనీ కేసు పేరు చెప్పి లుబ్ధావధాన్లుని పీడించి తెచ్చిన పజ్యండు రాళ్ళలో గురోజీకో తులసిదళం సమర్పిస్తాడు. బైరాగి అసలు రంగుని మొదట పోల్చిన వాడు కూడా సారాయి దుకాణదారే. తన దుకాణంలో తాగిన సారాయికి బైరాగి సొమ్మివ్వకుండా మాయమైపోవడంతో ఆ సిద్ధుడి మహిమల మీద నమ్మకం పోతుందతనికి.

మాయమైపోయిన బైరాగి, మళ్ళీ కూనీ కేసు కోర్టులో విచారణకి వచ్చేనాటికి మళ్లీ ప్రత్యక్షం అవుతాడు. ఈ మారు, కొత్త శిష్యుల మధ్యన. ప్రాతః కాలమే గంగని సేవించి కాశీలో బయల్దేరానంటాడు. వాళ్లలో ఒక శిష్యుడు "యోగులకి సిద్ధులుండవురా? ఈయనేరా ఉప్మాక లోనూ సింవాచెలం లోనూ మొన్న శివరాత్రికి వొక్కమారే అగుపడ్డారు" అని మిగిలిన వాళ్లకి పరవశంగా చెబుతాడు. శివరాత్రి నాడు రెండు వైష్ణవ క్షేత్రాల్లో ఒకే మారు కనిపించిన బైరాగి గొప్పదనాన్ని వాళ్లలో కొందరు నమ్ముతారు, మరికొందరు నమ్మరు. "తెల్లోడు తీగిటపా యేసినాడు కాడ్రా? నిమేటుకి ఉత్తరం దేశ దేశాలకి వెళ్లదా?" అంటాడు నమ్మని వాళ్లలో ఒకడు.

తన సదావృత్తి ఏర్పాటు చూసుకున్న బైరాగి, కొత్త శిష్యుల్ని ఊళ్ళో విశేషాలు అడుగుతాడు. అప్పుడు తెలుస్తుంది, మాయగుంట ఖూనీ కేసు విచారణకి వచ్చిందని. సాక్షుల్లో  తానూ ఒకడు కాబట్టి ప్రమాదాన్ని శంకిస్తాడు. "ఈ వూరు పాపంతో నిండినట్టు కనబడుతూంది. మేం ఉండజాలము" అని జారుకునే ప్రయత్నం చేస్తాడు. ఇంతలోనే దుకాణదారు అదాటున వచ్చి, తన బాకీ తీర్చే వరకూ కదలనివ్వనని చెప్పేస్తాడు. అప్పుడు, తనవంటి మరో దాసరిని గురించి కథ కల్పిస్తాడు బైరాగి. కొత్త శిష్యులు కూడా దుకాణదారుని తప్పు పడతారు. ఇంతలో హెడ్ కానిస్టీబు వచ్చి బైరాగిని రక్షిస్తాడు. అప్పుడు కూడా దుకాణదారు డబ్బివ్వాల్సిందే అని కూర్చుంటే, "నలుగురిలోనూ మర్యాద తీయడం ధర్మవేనా తమ్ముడూ? యోగరహస్యాలు పామరుల దగ్గరా వెల్లడి చేయడం?" అని బాధ పడతాడు.

ఎంతటి వాళ్ళనీ తన మాట చాతుర్యంతో ఆకర్షించడం, ఆ పూటకి పబ్బం గడుపుకోవడం బైరాగికి వెన్నతో పెట్టిన విద్య. కాశీ కబుర్లు, హరిద్వారం విశేషాలు ఎప్పుడూ నాలిక చివరనే ఉంటాయి. ఎలాంటి వాళ్ళనీ ఆకర్షించడానికి బంగారం తయారు చేసే రసవిద్య ఉండనే ఉంది. దుకాణదారు లాంటి వాళ్ళు ఒక్క అనుభవంతోనే బైరాగి మాయ నుంచి బయటపడితే, హెడ్ కానిస్టీబు లాంటి వాళ్ళు మాత్రం ఎప్పటికీ అతగాడి మహిమలని నమ్ముతూనే ఉంటారు. అంజనం వేసి మాయగుంట జాడ కనుక్కుంటానని కానిస్టీబుకి మాటిచ్చిన బైరాగి, అటు తర్వాత కనిపించకుండా మాయమైపోతే, ఆ నాటకాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తాడు పూజారి గవరయ్య. అవసరాలు గడుపుకోడానికి, కష్టపడకుండా సౌకర్యవంతమైన జీవనం గడపడానికి మతాన్ని, అమాయక భక్తుల్ని అడ్డుపెట్టుకునే వాళ్ళు అన్ని కాలాల్లోనూ ఉన్నారని చెబుతుంది 'కన్యాశుల్కం' నాటకంలో బైరాగి పాత్ర.

మంగళవారం, సెప్టెంబర్ 12, 2017

బుచ్చమ్మ

"నాన్నా, తమ్ముడికి పెళ్ళి చెయ్యాలంటే నా సొమ్ము పెట్టి పెళ్లి చెయ్యండి గాని దానికి కొంప ముంచి లుబ్ధావధాన్లుకి యివ్వొద్దు.." అత్యంత కోపిష్టీ, మూర్ఖుడూ అయిన తండ్రి ఎదుట నిలబడి బుచ్చమ్మ చెప్పిన మాట ఇది. ఇక్కడ "నా సొమ్ము" అంటే, భర్త మరణించిన తర్వాత ఆమెకి అత్తింటి నుంచి మనోవర్తిగా వచ్చిన సొమ్ము. తమ్ముడు వెంకటేశం చదువు ఆగిపోవడం ఆమెకి ఇష్టం లేదు. అలాగని, ఆ చదువు కోసం చెల్లెలు సుబ్బికి వృద్ధుడైన లుబ్ధావధాన్లుతో పెళ్లి జరగడం అంతకన్నా ఇష్టం లేదు. తలచెడి పుట్టింటికి వచ్చిన ఆడపిల్ల బతుకెంత దుర్భరమో ఆమెకి అనుభవపూర్వకంగా తెలుసు. చెల్లిలికా స్థితి రానివ్వకూడదని తాపత్రయం. అందుకోసం, తన జీవితం మొత్తానికి ఆధారమైన సొమ్ముని వదులుకోడానికి సిద్ధపడింది.

'కన్యాశుల్కం' నాటకంలో ఉదాత్తమైన పాత్రల గురించి మాట్లాడేటప్పుడు బుచ్చమ్మ ఆట్టే ప్రస్తావనకు రాదెందుకో. ఆమెని ఒక అమాయకురాలిగా గుర్తిస్తారే తప్ప, ఆమెలోని ఉదాత్తత చర్చకు రాదు. ఇంతకీ బుచ్చమ్మ మాటని ఆ తండ్రి పూర్తిగా విననేలేదు. పెరుగూ అన్నం తింటున్నవాడల్లా అదాటున లేచి, ఆ విస్తరి ఆమె నెత్తిన రుద్దేశాడు. ఆమె మేనమామ అడ్డుపడబోతే అతగాడి నెత్తిన చెంబుడు నీళ్లు గుమ్మరించాడు. తన ఆలోచనని తండ్రి వినిపించుకోడని తెలిసీ ప్రయత్నం మానుకోలేదు తల్లిదండ్రుల చాటు అమాయకపు పల్లెటూరి పిల్ల బుచ్చమ్మ. ఆ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకునే ఆమెని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేశాడు గిరీశం, క్రిస్మస్ సెలవుల్లో వెంకటేశానికి చదువు చెప్పడానికి పట్నం నుంచి కృష్ణరాయపురం వచ్చిన మాస్టారు.

గిరీశం చెప్పే కబుర్లని తెల్లబోయి వింటుంది బుచ్చమ్మ. తండ్రి, తమ్ముడు, మేనమామ వినా ఆమె మాట్లాడిన మరో మగవాడు గిరీశం. అతగాడు మొదలే కబుర్ల పుట్ట. పైగా బుచ్చమ్మ మీదా, ఆమె సొమ్ముల మీదా కన్నేసిన వాడు. అందుకే ఆమె ఒంటరిగా దొరికే అవకాశం కోసం ఎదురుచూస్తూ, దొరికినప్పుడల్లా మామూలు విషయాలతో ఆరంభించి, ప్రేమ కబుర్లు, పెళ్లి కబుర్లు చెప్పి, విధవా వివాహం శాస్త్ర సమ్మతమని ఒప్పిస్తాడు. అప్పుడు కూడా, "మా నాస్తం రాంభొట్లు గారి అచ్చమ్మ మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్ళాడుతానంది" అనే అంటుంది తప్ప, గిరీశాన్ని తాను పెళ్ళాడవచ్చునన్న ఆలోచన రాదు బుచ్చమ్మకి. వితంతువు కాబట్టి మిగిలిన జీవితం అంతా పుట్టింట గడపాలి తప్ప రెండో ఆలోచన చేయకూడదన్న పెద్దల మాటకి కట్టుబడిన యువతి ఆమె.

"తమ్ముడూ గిరీశం గారు గొప్పవారట్రా?" అని అక్క అడిగినప్పుడు, గిరీశానికి ప్రియశిష్యుడిగా వెంకటేశం కూడా తన గురువుగారి  గొప్పదనం గురించి అక్కయ్యకి పెద్ద లెక్చరు దంచుతాడు. "అయితే గిరీశం గారికి ఉద్యోగం కాలేదేమి?" అన్న బుచ్చమ్మ ప్రశ్నలో ఒకింత అమాయకత్వము, దానితో పాటే చదువుకున్న వాళ్లందరికీ ఉద్యోగం కావాల్సిందే అన్న లోకరీతి ధ్వనిస్తాయి. "తమ్ముడూ, వెధవలు పెళ్ళాడ్డం మంచిదంటారు కదా, ఆయనెందుకు పెళ్లాడారు కార్రా?" అన్న ప్రశ్నలో కేవలం కుతూహలం మాత్రమే ఉందా అంటే చెప్పడం కష్టం. వెంకటేశం "నాన్న తన్నకుండా ఉంటే" వితంతువుని పెళ్లి చేసుకుంటానన్నప్పుడు లోపల ఎంతగానో సంతోషించి ఉంటుంది బుచ్చమ్మ.

అమాయకంగా అనిపించినప్పటికీ, బోళా మనిషి కాదు బుచ్చమ్మ. అందుకే గిరీశం ఇచ్చకాలని విని ఊరుకుంటుందే తప్ప, అతగాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకూలంగా జవాబు చెప్పదు. పుట్టింట్లో జీవితం కష్టంగానే ఉన్నా, ఎక్కడా ఆ మాటని పెదవి దాటనివ్వదు. "డబ్బుకాశించి ముసలి పెళ్లిళ్లు చేసే పెద్దవాళ్లది తప్పు" అని గిరీశం తన తల్లిదండ్రులని తప్పు పట్టినప్పుడు కూడా "నాకు తెలియదు" అంటుంది తప్ప అంతకుమించి మాట్లాడదు. "మాటవరసకు మనిద్దరం పెళ్లాడామే అనుకో.." అంటూ ఆరంభించిన గిరీశం మేడా, బండి, పిల్లలు, సరుకు జప్పరా అంటూ ఓ రంగురంగుల కలని ఆమె ముందుంచినప్పుడు కూడా ఏమీ మాట్లాడకుండా వింటుంది. "అప్పుడు మన వెంకటేశం మన దగ్గరే ఉండి చదువుకుంటాడు" అన్నప్పుడు మాత్రం, "అయితే మరి నాన్నకి ఖర్చుండదు. నాన్నా, అమ్మా వాడి చదువుకోసం దెబ్బలాడ్రు" అని మాత్రమే అంటుంది.

ఇన్ని అస్త్రాలూ తిరిగి వచ్చేసిన తర్వాత, గిరీశం ప్రయోగించిన చివరి అస్త్రం, బుచ్చమ్మ  తనతో లేచిపోయి వచ్చేస్తే సుబ్బి పెళ్లి ఆగిపోతుంది అని. బుచ్చమ్మ లేచిపోవడం వల్ల గడబిడ జరిగి పెళ్లి ఆగుతుందని, అటు లుబ్దావధాన్లుకి, ఇటు అగ్నిహోత్రావధాన్లుకి కూడా బుద్ధి వచ్చి మళ్ళీ బాల్య వివాహం అన్న మాట తలపెట్టరనీ ఆమెని నమ్మించ గలుగుతాడు గిరీశం. తన సుఖం కోసం కన్నా, చెల్లెలికి బాల్య వివాహం తప్పిపోతుందన్న కారణానికి మాత్రమే గిరీశంతో వెళ్లిపోవడానికి ఒప్పుకుంటుంది బుచ్చమ్మ. గిరీశం నిజరూపం తెలిసిన తర్వాత, బుచ్చమ్మ గారికి చదువు చెప్పించే ఏర్పాటు చేయాలనీ, చదువుకున్నాక ఆమె భవిష్యత్తు ఆమె నిర్ణయించుకుంటారనీ అంటాడు సౌజన్యారావు పంతులు. గిరీశంతో పెళ్లి తప్పిపోవడం బుచ్చమ్మని బహుశా బాధించి ఉండదు. అంతకన్నా, చెల్లెలి పెళ్లి తప్పిపోయిన ఆనందాన్ని ఆమె ఎక్కువగా అనుభవించి ఉంటుంది.

సోమవారం, సెప్టెంబర్ 11, 2017

పోలిశెట్టి

ఓ పక్క మాయగుంట కనిపించక రామచంద్రపురం అగ్రహారం మొత్తం అట్టుడికిపోతూ ఉంటే, రామప్పంతులు ఇంటి కొట్టు గదిలో మధురవాణి బృందం తాపీగా ఆడే పేకాటలో మొదటిసారి కనిపిస్తాడు పోలిశెట్టి, తనకి 'భష్టాకారి' ముక్కలు పడ్డాయని బాధపడుతూ. పోలిశెట్టిని చూడడానికి 'కన్యాశుల్కం' నాటకం పంచమాంకం వరకూ ఆగాలి కానీ, అతగాడి ప్రస్తావన మాత్రం చతుర్ధాంకంలోనే వస్తుంది. సుబ్బి పెళ్లి చెడగొట్టడం కోసం, లుబ్దావధాన్లుకి గిరీశం రాసిన ఉత్తరంలో "మీ వూరి వారెవరోగాని వక తుంటరి, మీరు విశేష ధనవంతులన్నియు, పెళ్లి దేవదుందుభులు మ్రోయునటులు చేతురనియు..." అని రాసినప్పుడు మొదటిసారిగా పోలిశెట్టిని గురించి చర్చ జరుగుతుంది. 

ఉత్తరం చదువుతున్న రామప్పంతులు, వింటున్న లుబ్దావధాన్లు, మధురవాణి ఆ 'తుంటరి' ఎవరై ఉంటారా అన్న ఆలోచన చేస్తున్నప్పుడు, ఏనుగులు, లొట్టిపిట్టలు, గాడిదల వల్ల రామప్పంతులికేం లాభం లేదని తీర్మానిస్తుంది మధురవాణి. "ఒకవేళ రాతబు బేరం జరుగుతుంది గనక పోలిశెట్టికి లాభించవచ్చును," అని ఆలోచన చేస్తుంది తనే. "బాగా చెప్పావు - పోలిశెట్టి చేసిన పనే" అని లుబ్దావధాన్లు సమర్ధించడమూ, "అనుభవించు" అని రామప్పంతులు, లుబ్ధుణ్ణి కోప్పడ్డమూ వెంటవెంటనే జరుగుతాయి. ఈ సంభాషణని బట్టి, పోలిశెట్టి రామచంద్రపురం అగ్రహారంలో ఒక వ్యాపారి అని తెలుస్తుంది. అటుపై, పోలిశెట్టి మళ్ళీ కనిపించేది పేకాట సన్నివేశంలోనే.

పేకముక్కలు కలుపుతున్న భుక్త మీద పోలిశెట్టికి విశేషమైన అనుమానం, కావాలనే ముక్కలు సరిగా కలపడంలేదని. "ఆ! బాపనయ్య పంచాలని తప్పు పంచుతున్నావు. తప్పు పంచితే బేస్తు మీద కుదేలెట్టిస్తాను" అని బెదిరిస్తాడు కూడా. " రెండో ఏత నాలుగాసులడకూడదా" అని ఆశ పడడమే కాదు "ఎంత సెడ్డా బాపనాడి శాపనాకారం మా శెడ్డది" అని జాగ్రత్త పడతాడు పోలిశెట్టి. పోనీ అనుకుందుకు సిద్ధాంతి మీద కూడా అనుమానమే, బేస్తు మీద కుదేలెట్టి, బాకీలు పెట్టి ఎగేసేస్తాడేమో అని. భుక్త తోటీ, సిద్ధాంతి తోటీ పోలిశెట్టి పేచీలు పెట్టుకుంటూ ఉండగానే, పూజారి గవరయ్య ఆశు కవిత్వం ఆరంభిస్తాడు. "రాణా డైమను రాణి" అని మధురవాణి మీద కవిత చెప్పడం, ఆ వెంటనే ఆమె తురుపు రాణీ వేయడంతో పోలిశెట్టి గుండెలు బాదుకుంటాడు.

"అదుగో అదుగో ఈ బాపనాడు కపీశం శెప్పి, మధురవోణి దగ్గర రాణీ ఉందని చెప్పేసేడు.. గోరం.. గోరం.." అంటూ గొడవ చేయడమే కాదు. తర్వాతి ఆటకి ముక్కలు పంచుతుంటే, మంచి ముక్కలు పడాలని "నరశింవ్వ నీ దివ్వె నామ మంతరము శేత..." అంటూ ప్రార్ధన ఆరంభిస్తాడు. పాపం, ప్రార్ధన ఫలించి మంచి ముక్కలే పడతాయి కానీ, రామప్పంతులు గొంతుని అనుకరించి మధురవాణిని పిలుస్తూ మహేశం తలుపు తట్టడంతో ఆట అర్ధాంతరంగా ఆగిపోతుంది. అటకమీద దాగుదామని నిచ్చెనెక్కిన పోలిశెట్టి సిద్ధాంతి మీద పడతాడు. అప్పుడు కూడా రామప్పంతులుకి దొరికిపోకూడదని "నరశింవ్వ నీ దివ్వ..." అందుకుంటాడు. మొత్తం మీద, పోలిశెట్టే లేకపోతే పేకాట సన్నివేశానికి అంత కళా కాంతీ ఉండేవి కాదు. ఇక్కడ చీకట్లో మాయమైన పోలిశెట్టి, మళ్ళీ సప్తమాంకంలో తెరమీదకి వస్తాడు.

మాయగుంట కూనీ జరగలేదనీ, ఆ కేసులో లుబ్ధావధాన్లు నిర్దోషి అని బలంగా నమ్మిన వకీలు సౌజన్యారావు పంతులు, 'నిజమైన' సాక్షుల కోసం వెతుకుతూ పోలిశెట్టిని తన ఇంటికి పిలిపించు కుంటాడు. కేసుని గురించి సౌజన్యారావు చెప్పినదానికల్లా "అబ్బెంతర వేటి బాబూ" అనడం తప్ప మరో మాట మాట్లాడడు. "మీరు చెప్పబోయే సాక్ష్యానికి స్టేట్మెంటు కట్టుకుంటాను. జరిగినది అంతా చెప్పండి, వ్రాసుకుంటాను" అనగానే అప్పుడు అభ్యంతరం ఏవిటో చెబుతాడు పోలిశెట్టి. "మా యింటోళ్ళకి ఉడ్డోలవైన జబ్బుగా ఉందని కబురెట్టారు బాబూ, నాకు సేతులు కాల్లు ఆడకుండ ఉన్నాయి. ఈ సాచ్ఛీకాల్లో తిరిగితే పిల్లా పేకా బతుకుతారా బాబూ?" అని అడిగేస్తాడు.

పోలిశెట్టి సాక్ష్యం ఎంత ముఖ్యమో సౌజన్యారావు పంతులు పరిపరివిధాల చెప్పినా, "తమరు తలిస్తే సాచ్ఛీకానికి కొదవా?" అంటాడే తప్ప, సాక్ష్యం పలకడానికి మాత్రం అంగీకరించడు. కనిస్టీబోళ్ళు ఊరుకోరు కాబట్టి సాక్ష్యం చెప్పడానికి అంగీకరించానని, చెబితే ఇన్నీసిపికటరు పీక పిసికేస్తాడు కాబట్టి చెప్పననీ నిజం ఒప్పేసుకుంటాడు. పైగా, ఆవేళ రాత్రి తనసలు ఊళ్ళోనే లేననీ, లొంగోరం సంతకెళ్ళాననీ కొత్త కథ ఆరంభిస్తాడు. సౌజన్యారావు పంతులుకి కోపం వచ్చిందేమో అని సందేహం పోలిశెట్టికి. శాంతపరుచుకోడం కోసం, "ఆవునెయ్యి బాబూ - గుమగుమలాడేది - ప్రతోరం పంపుకుందునా బాబూ?" అని అడిగినప్పుడు మాత్రం, పంతులుకి నిజంగానే కోపం వస్తుంది.

"మీ ఇన్స్పెక్టర్ కి పంపండి" అంటాడు అంతటి సౌజన్యమూర్తీ కూడా. అప్పుడు కూడా ఏమాత్రం తగ్గడు పోలిశెట్టి. "తవక్కోపవొస్తే బతగ్గలవా బాబూ" అంటూ గుమ్మం దిగి, ఆ వెంటనే ఆత్మగతంగా "బతిగాన్రా దేవుడా. పెందరకాళే ఇంటికి పోయి యెంకటేశ్వర్లుకి అర శెటాకు నెయ్యి దివ్వెలిగిస్తాను" అనుకుంటాడు. ఒక హాస్య సన్నివేశంలో పరోక్షంగానూ, మరో హాస్య సన్నివేశంలో ప్రత్యక్షంగానూ కనిపించే పోలిశెట్టి, ఈ సీరియస్ సీన్ తర్వాత మరి కనిపించడు. పేకాట సన్నివేశంలో అతగాడి ఆశనీ, ఆత్రుతనీ, సౌజన్యారావు పంతులుతో సంభాషణలో పోలిశెట్టి లౌక్యాన్నీ, జాగ్రత్తనీ గమనించవచ్చు. కాళ్ళకూరి నారాయణరావు 'చింతామణి' నాటకంలో సుబ్బిశెట్టి (ఒరిజినల్ రచనలో పాత్ర, తర్వాతి అనుసరణలు కాదు) ఈ పోలిశెట్టికి వారసుడే అనిపిస్తాడు.

ఆదివారం, సెప్టెంబర్ 10, 2017

పూటకూళ్ళమ్మ

'కన్యాశుల్కం' నాటకంలో మొట్టమొదట వినిపించే పేరు పూటకూళ్ళమ్మ. "సాయంకాలమైంది" అంటూ ఆత్మగతం మొదలు పెట్టిన గిరీశం, ఆ వెంటనే "పూటకూళ్ళమ్మకు సంతలో సామాను కొనిపెడతానని నెలరోజుల కిందట యిరవై రూపాయలు పట్టుకెళ్లి డాన్సింగర్లు కింద ఖర్చుపెట్టాను. యివాళ ఉదయం పూటకూళ్ళమ్మకీ నాకూ యుద్ధవై పోయింది. బుఱ్ఱ బద్దలు కొడదామా అన్నంత కోపం వచ్చింది కానీ.." అంటూ కొనసాగిస్తాడు. డాన్సింగర్లు మాట ఆచోకీ కట్టినట్టు కనబడుతుందనీ, ఉదయం కథ ఆలోచిస్తే ఇటుపైని తిండి పెట్టేట్టు కానరాదనీ వాపోతాడు.

నాటకంలో కనిపించే మొత్తం ముగ్గురు వితంతువుల్లో పూటకూళ్ళమ్మ ప్రత్యేకం. కేవలం మొదటి అంకంలో ఒక్క సన్నివేశానికి ఆమె పాత్ర పరిమితం. కానీ, ఆమె ద్వారా గురజాడ ఇచ్చిన సందేశం మాత్రం కాలానికి నిలబడింది. అన్నం అమ్ముకోవడాన్ని తప్పుగా భావించే ఆ రోజుల్లో, 'పూటకూళ్ళమ్మ' ఎలా అవతరించిందో తెలియాలంటే, పాత్ర పేరైనా తెలియని ఆమె కథని అర్ధం చేసుకోవాలి. అదీ గిరీశం చేతే చెప్పించారు రచయిత. పూటకూళ్ళమ్మ ముచ్చటగా తప్పటడుగులు వేసే రోజుల్లో ఒక కునుష్ఠి ముసలాడికి కట్ట నిశ్చయించారు. పుస్తె కట్టబోతూంటేనో, కట్టిన ఉత్తర క్షణంలోనో ఆ ముసలాడు పెళ్లి పీటల మీదే గుటుక్కుమన్నాడు.

ఇంతకీ పెళ్లి అయిందా, లేదా అన్న మీమాంస వచ్చినప్పుడు కొందరు పుస్తె కట్టాడన్నారు. కొందరు కట్టలేదన్నారు. పిల్లతండ్రి, పెళ్ళికొడుకు వారసుల మీద దావా తెచ్చాడు. పురోహితుడు అవతలి వాళ్ళ దగ్గర లంచం పుచ్చుకుని పుస్తె కట్టలేదని సాక్ష్యమిచ్చాడు. దాంతో కేసు పోయింది. ఆమెని మరెవరూ పెళ్లాడారు కాదు. ఆస్తీ, ఆదరించే దిక్కూ కూడా లేకపోవడంతో కాలక్రమంలో ఆ పసిపిల్ల పూటకూళ్ళమ్మగా మారి తన తిండి తాను సంపాదించుకోడం ఆరంభించింది. ఆమె పరాధీన కాదు కాబట్టి, తనదైన రీతిలో తిరుగుబాటు చేసింది. ఎవరిమీద? తనని బాల్య వితంతువుగా మార్చిన పద్ధతులు, ఆచారాల మీద.

పూటకూళ్ళమ్మ గిరీశాన్ని "వుంచుకుని, యింత గంజి పోస్తోంది." ఒంటరి ఆడది, పైగా పూటకూళ్ళ ఇంటిని సమర్ధించుకుని రావాల్సి ఉంది. కాబట్టి, నోరు పెట్టుకుని బతకడం అలవాటు చేసుకుంది. "విడో మేరియేజెస్.." గురించి అనర్గళంగా ఉపన్యాసాలు దట్టించే గిరీశం తనని పెళ్ళాడతాడన్న ఆశ ఆమెలో ఏమూలో ఉండబట్టే, అతగాడు తన కష్టార్జితాన్ని తగలేసినా (ఆరోజుల్లో ఇరవై రూపాయలంటే చాలాపెద్ద మొత్తమే, పైగా ఒక మామూలు పూటకూళ్ళమ్మకి మరింత పెద్దమొత్తం. గతంలో కూడా తాను ఖర్చు పెట్టేశానని గిరీశమే ఒప్పుకున్నాడు కదా) చూసీ చూడనట్టు ఊరుకుంది. అయితే, డాన్సింగ్ గర్ల్ విషయం తెలిశాక మాత్రం మిన్నకుండలేకపోయింది. గిరీశాన్ని వెతుక్కుంటూ చీపురుకట్టతో సహా మధురవాణి ఇంటికి ప్రయాణమయ్యింది.

పూటకూళ్ళమ్మ అడుగుపెట్టేసరికి, మధురవాణి ఇంట్లో మాంచి నాటకం జరుగుతోంది. అంతకు మునుపే 'పార్టింగ్ విజిట్' ఇవ్వడం కోసం గిరీశం వచ్చి ఉన్నాడు. ఆ సరికే, మధురవాణి ని ఉంచుకోడానికి అంతా ఏర్పాటు చేసుకుని రెండు వందల రూపాయలు అడ్వాన్సు ఇచ్చిన రామప్పంతులు మంచం కింద దాగాడు. వీధి గుమ్మం దగ్గర "తలుపు తలుపు" అన్న పూటకూళ్ళమ్మ గొంతు వింటూనే, మంచం కిందకి చేరిన గిరీశం అక్కడ రామప్పంతులుని చూసి నిర్ఘాంతపోతాడు. అంతేనా, పూటకూళ్ళమ్మ తన మీద దాడి చేస్తుందని తెలిసిన వాడు కాబట్టి, ఆ దెబ్బ రామప్పంతులుకి తగిలేలా చేసి తాను తప్పించుకుంటాడు.

అంతటితో ఆగినా బాగుండేది, పూటకూళ్ళమ్మ తనని చూసేయడంతో "వెఱప్పా మంచం కిందకి రా. వెర్రి వదలగొడతాను" అనడంతో, పూటకూళ్ళమ్మ కోపం హద్దు దాటుతుంది. "అప్పనిట్రా వెధవా నీకూ?" అంటూ చీపురు సహితంగా ఆమె మంచం కిందికి వెళ్ళొలోపే, రెండో వైపు నుంచి మంచమెక్కి, అటుపై రామప్పంతుల్ని ఓ చరుపు చరిచి మరీ పారిపోతాడు గిరీశం. తనని కొడుతుందేమో అన్న భయం చేత, రామప్పంతులు మధురవాణికి "చీపురుకట్ట లాక్కో" అని పురమాయించడంతోనే,  "ఫెడేల్మంటే పస్తాయించి చూస్తున్నాను. నీ మొగతనం ఏడిసినట్టే ఉంది" అంటూ నిష్క్రమిస్తుంది.

ప్రధమాంకంలో పూటకూళ్ళమ్మని ప్రవేశ పెట్టడం ద్వారా, నాటకం ద్వారా తాను చెప్పదల్చుకున్న బాల్య వివాహ సమస్యనీ, ప్రధాన పాత్రలైన గిరీశం, మధురవాణి, రామప్పంతుళ్ళ వ్యక్తిత్వాలనీ పరిచయం చేసేశారు గురజాడ. బాల్యవివాహం బాధితురాలయ్యీ, తన కాళ్ల మీద తాను నిలబడ్డ పూటకూళ్ళమ్మని స్వతంత్ర వ్యక్తిత్వానికి ప్రతీకగా తీర్చి దిద్దారు. (నూట పాతికేళ్ల క్రితం స్త్రీలకి ఉన్న అవకాశాలు బాగా తక్కువ అన్నది గుర్తించాలి). జాగ్రత్తగా పరిశీలిస్తే, 'కన్యాశుల్కం' నాటకంలో ప్రతి స్త్రీ పాత్రా ఒక స్టేట్మెంట్ అనిపిస్తుంది. పూటకూళ్ళమ్మని 'బోల్డ్ స్టేట్మెంట్' అనొచ్చేమో.

నాటకంలో ఇంకెక్కడా పూటకూళ్ళమ్మ కనిపించదు కానీ, చతుర్ధాంకంలో ఆమె ప్రస్తావన వస్తుంది. లుబ్దావధాన్లు పెళ్ళికి ఆడ పెళ్ళివారి తరపున రానున్న గిరీశం, రామప్పంతులుతో ఏమన్నా చిలిపి జట్టీ పెట్టుకుంటాడేమో అని విచారించిన మధురవాణి, ఆ ప్రమాదం తప్పించుకోడానికి "పెళ్లి వంటలకి పూటకూళ్ళమ్మని కుదర్చండి" అని పంతులుకి సలహా ఇచ్చి, "ఆమె నోరు మహా చెడ్డది" అంటుంది. చీపురు దెబ్బ గుర్తు చేసుకున్న రామప్పంతులు "నోరే కాదు, చెయ్యి కూడా చెడ్డదే" అంటాడు. ఇంతకీ లుబ్దావధాన్లుకి ఆ సంబంధం తప్పిపోవడంతో, పూటకూళ్ళమ్మ మళ్ళీ కనిపించలేదు.

శనివారం, సెప్టెంబర్ 09, 2017

పూజారి గవరయ్య

ఎంతటి పిశాచన్నైనా పట్టి బంధించే సత్తా, నేర్పూ ఉన్న మాంత్రికుడు పూజారి గవరయ్య. లుబ్ధావధాన్లు పెళ్లాడింది మనిషిని కాదు కామినీ పిశాచాన్ని అని చెప్పడమే కాదు, ఆ పిశాచాన్ని భర్త సహితంగా సీసాలో బంధించిన ప్రజ్ఞాశాలి. రామచంద్రపురం అగ్రహారపు సిద్ధాంతికి చేదోడు వాదోడుగా ఉండడమే కాదు, ఊరూ పేరూ లేని బైరాగి మాయారూపంలో సంచరిస్తుంటే చనువుగా మాట్లాడగల శక్తి కూడా గవరయ్యకే ఉంది. అలాగని నిత్యం క్షుద్ర పూజల్లో మునిగి తేలుతూ ఉంటాడనుకుంటే పొరపాటే. శుద్ధ లౌకికుడు. అగ్రహారీకులందరితో కలిసి మధురవాణి పేకాడుతుంటే, ఒక్కొక్కరిమీదా ఆశువుగా కవిత్వం చెప్పగల సరసుడు. సమయానికి తగు మాటలాడడం గవరయ్యకి వెన్నతో పెట్టిన విద్య.

'కన్యాశుల్కం' నాటకం చతుర్ధాంకంలో లుబ్దావధాన్లుకి గుంటూరు శాస్తుర్లు కూతురితో (మాయగుంట) పెళ్లి జరిగిన ఉత్తర క్షణమే కథలోకి ప్రవేశిస్తాడు గవరయ్య. నాలుగ్గడియల పొద్దుకు లగ్గం కాబట్టి, లౌక్యుల్ని పిలుచుకు రావడానికి పెద్దిపాళెం బయల్దేరతాడు పెళ్లిపెద్ద రామప్పపంతులు. అతగాడు అటు వెళ్ళగానే పాంచరాత్ర వివాహం కాస్తా ఏకరాత్రానికి మారిపోడంతో పాటు, ముహూర్తం కూడా 'నాలుగ్గడియల రాత్రి ఉందనగా' కి ముందుకి జరుగుతుంది. ఇంకేముంది, పంతులు తిరిగొచ్చేసరికి కొత్తజంట పసుపు బట్టలతో కూర్చుని ఉంటుంది. అప్పుడు అద్దుమాలిన కోపంతో చిందులేసే రామప్పంతులుని శాంతింప జేసింది గవరయ్యే. అంతేనా, కొత్తజంట రామప్పంతులు కాళ్ళ మీద పడి ఆశీర్వాదం అందుకునేలా చేస్తాడు కూడా. అల్లుడి (రామప్పంతులు) కాళ్ళకి మావగారి (లుబ్దావధాన్లు) చేత మొక్కించిన చమత్కారి గవరయ్య.

"తమరు ఏదో వ్యవహారాటంకం చేత రాజాలినారు కారనుకున్నాం. తాము లేకపోవడం చేత సభ సొగసే పోయింది," అని  "నియ్యోగి లేని సావిడి అయ్యాయో అది వట్టి రోత - అది యెట్లన్నన్" అంటూ పద్యం అందుకోబోతాడు. అంతేకాదు, "పంచాంగం మార్చడానికి ఎవడి శక్యం బాబూ?" అంటూనే ముహూర్తానికి పంతులు లేకపోవడం చేత పెళ్ళికొడుకు లుబ్దావధాన్లు, మేజువాణీ చేయాల్సిన మధురవాణి ఎంతగా తల్లడిల్లారో వర్ణించడం మొదలు పెడతాడు. "అట్టే పందిట్లో నిశ్చేష్టురాలై పుత్తడిబొమ్మ లాగ నిల్చుందిగాని బ్రాహ్మణ్యం యావన్మందీ గెడ్డం పట్టుకు ఎంత బతిమాలుకున్నా పాడింది కాదు," అంటూండగానే, కొండుభొట్లు అందుకుని, మధురవాణి అంతసేపూ హెడ్డు కనిస్టీబుతో కబుర్లు చెప్పిందని రహస్యం బయటపెట్టి భవిషం తీసేస్తాడు. గవరయ్య ఏమాత్రం తడుముకోకుండా ఆ మాట్లాడింది కూడా పంతులు యోగక్షేమం గురించే అని కవిత్వం పన్నేస్తాడు.

పంచమాంకంలో మాయగుంట లుబ్దావధాన్లు ఇంట్లో నుంచి మాయమైపోయే సమయానికి, మధురవాణి ఇంట్లో పేకాట కాలక్షేపం చేస్తూ ఉంటాడు గవరయ్య. భుక్త, పోలిశెట్టి, మధురవాణి, సిద్ధాంతి 'బేస్తు' పేక ఆడుతుంటే, వాళ్లందరికీ వినోద కాలక్షేపం గవరయ్య పని. "రాణా డైమను రాణీ" అంటూ మధురవాణి మీదా, "పోలిశెట్టి ముఖము పోలిరొట్టెని బోలు" అంటూ పోలిశెట్టి మీదా అక్కడికక్కడే కవితలల్లేసి తర్వాతి కాలపు ఆశు కవులందరికీ తాత స్థానంలో నిలబడ్డాడు. మాయగుంట ఆచోకీ కనిపెట్టడం కోసం గవరయ్యకి కబురెడతారు. అతగాడు మంత్రాలు జపించి, కామినీ పిశాచి రూపంలో ఉన్న మాయగుంట ఒక్కదాన్నే కాదు, ఆమె భర్తని కూడా సీసాలో బంధించేస్తాడు. ఆ సీసాని భూస్థాపితం చేసి, చేయాల్సిన శాంతుల జాబితా వల్లిస్తుంటే, "నా ఇల్లు గుల్ల చెయ్యాలి" అని ఆవేశ పడతాడు పాపం లుబ్దావధాన్లు.

అంతలావు కామినీ పిశాచాన్ని సీసాలో బంధించిన గవరయ్యే, కొద్ది రోజులతర్వాత 'ఆ పిల్ల గోడదూకి పారిపోయిందని, తాను కళ్లారా చూశానని' సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది. ఈ కేసులో మరో ప్రధాన సాక్షి బైరాగి కారణాంతరాల వల్ల అదృశ్యం అయిపోతే, బైరాగి తనకి కనిపిస్తున్నడనీ, తన చేత అంజనం వేయించి మాయగుంట ఆచోకీ కనిపెట్టిస్తాడనీ హెడ్ కానిస్టీబుకి ధైర్యం చెబుతాడు. అదృశ్య బైరాగితో గవరయ్య సంభాషణలు, బైరాగి తనకి కూడా కనిపిస్తున్నాడని అసిరి చెప్పే సాక్ష్యం.. ఇవన్నీ చదివి ఊహించుకోవాల్సిందే. బైరాగి కనిపించడం "డామ్ హంబగ్" అన్న గిరీశాన్ని గుక్క తిప్పుకోనివ్వడు గవరయ్య. "నువ్వు రెండు ఇంగిలీషు ముక్కలు చదువుకుని నాస్తికుడివి కాగానే మహత్యాలు పోతాయనుకున్నావా ఏవిటి? నువ్వు సొట్టకర్ర తిప్పితే సిద్దులకి తగులుతుందా?" అని ప్రశ్నిస్తాడు.

అంతటితో ఊరుకోకుండా, "కిరస్తానప భ్రష్టలు చేరిన చోట మాంత్రికులు, సిద్ధులు ఉండజనదు" అని ప్రకటించి, ఖాళీ జాగావైపు చూసి "రండి గురోజీ, మన తోవని మనం పోదాం" అని బయల్దేరేస్తాడు. హెడ్ కనిస్టీబు, లుబ్ధావధాన్లు ఎంత బతిమాలినా కరగక "అవుధాన్లు గారు పెళ్లాడింది కామినీ పిశాచం. 'అది మనిషీ, గోడ గెంతి పారిపోయిందీ' అని నేను అబద్ధపు సాక్ష్యం చెప్పానంటే మరి మంత్రం అన్నది నాకు మళ్ళీ పలుకుతుందా?" అని, తన వంతు సాక్ష్యం కూడా గిరీశం చేతే చెప్పించుకోమని సలహా చెప్పి మరీ వెళ్ళిపోతాడు గవరయ్య. పిశాచాలనీ, అంజనాలనీ జనం నమ్మినంతకాలం పూజారి గవరయ్యలు పుడుతూనే ఉంటారు

శుక్రవారం, సెప్టెంబర్ 08, 2017

నాయుడు

"యేమండీ రామప్పంతులన్నా, మిగతా ఫీజు ఇప్పించారు కారుగదా?" ఇది 'కన్యాశుల్కం' నాటకం ఆరో అంకంలో ప్రవేశించే వకీలు నాయుడు పాత్ర మొట్ట మొదటి డైలాగు. కేవలం రెండంకాల్లో, కొద్ది సన్నివేశాల్లో మాత్రమే కనిపించే నాయుడు తన 'పార్టీ' కేసు ఓడిపోడానికి తిరుగులేని కృషి చేశాడు!  పద్దెనిమిది వందలు శుల్కమిచ్చి సుబ్బిని పెళ్లి చేసుకుంటాడనుకున్న లుబ్ధావధాన్లు అప్పటికే మాయగుంటని మనువాడేయడం సుబ్బి తండ్రి అగ్నిహోత్రావధానులుని పుండులా సలిపితే, పెళ్లి  ప్రయాణంలో పెద్దకూతురు బుచ్చమ్మని గిరీశం లేవదీసుకు పోవడం పుండుమీద కారం రాసినట్టు అవుతుంది.

రామప్పంతులు సలహా మేరకి, గిరీశం మీద అబ్ డక్షన్ కేసు ఫైలు చేసిన అగ్నిహోత్రావధానులుకి, వకీలు నాయుడు పనితనం మీద మొదటినుంచీ సందేహమే. పైగా, కేసు విషయం తేలకపోగా రామప్పంతులు ధారాళంగా చేయిస్తున్న ఖర్చుని భరించడానికి శక్తి చాలడం లేదు అవధానులుకి. సరిగ్గా అప్పుడే నాయుడు ఫీజు విషయం కదపడంతో కోపం నషాళానికెక్కి "మీరు రాసిన డిఫెన్సు బాగుంది కాదని భుక్తగారన్నారష!" అనేయడంతో నాయుడు కోపం తారాస్థాయి చేరుతుంది. "నా దగ్గర హైకోర్టుకి కూడా ప్లయింట్లు రాసుకుపోతారు. యీ కుళ్ళు కేసనగా యేపాటి?" అని చప్పరించేస్తాడు.

రామప్పంతులు లౌక్యం చూపించి, కేసు వకాల్తీనమాని 'ఇంగ్లీషు చదువుకున్న' భీమారావు పంతులుకి మార్పించేస్తాడు. ఈ గడబిడలో, నాయుడికిచ్చిన వకాల్తా రద్దు పరచకపోవడంతో అగ్నిహోత్రావధానులు తరపున పరస్పర విరుద్ధంగా వాదించే ఇద్దరు వకీళ్లు తయారవుతారు కోర్టులో. "స్మాలెట్ దొరగార్ని (ఆరోజుల్లో విశాఖ కలెక్టర్) మెప్పించిన ముండాకొడుకుని, నాకు లా రాకపోయితే యీ గుంట వెధవలికిటోయ్ లా వస్తుంది? పాస్ పీసని రెండు యింగ్లీష్ ముక్కలు మాట్లాడటంతోటే సరా, యేమిటి? అందులో మన డిప్టీ కలక్టరు గారికి ఇంగ్లీష్ వకీలంటే కోపం. అందులో బ్రాహ్మడంటే మరీని, ఆ మాట ఆలందరికి బోధపరచండి" అంటాడు నాయుడు. (పాపం, డిప్టీ కలెక్టర్ గారికి మాత్రం ఇంగ్లీష్ చదువుకున్న బ్రాహ్మణ వకీలు సౌజన్యరావు పంతులుతో మాంచి స్నేహం).

నాయుడంత చెప్పినా రామప్పంతులు కరగడు, అగ్నిహోత్రుడు మారు మాట్లాడడు. "అయితే నన్నీలాగు మర్యాద చేస్తారూ? యీ బ్రాహ్మడి యోగ్యత యిప్పుడే కలక్టరు గారి బసకు వెళ్లి మనవి చేస్తాను" అని చెప్పి మరీ వెళ్ళిపోతాడా వకీలు. తనకి ఫీజు బాకీ చెల్లించకపోగా మరో లాయర్ని కుదుర్చుకున్నందుకు గాను అంతకంతా ప్రతీకారం తీర్చుకుంటాడు,  డిప్టీ కలెక్టరు కచేరీ (కోర్టు)లో.  కన్యాశుల్కానికి ఆశించి బుచ్చమ్మని ముసలి వరుడికిచ్చి పెళ్లి చేయడం, ఆ 'సహస్ర మాసైక జీవి' పరమపదం వేంచేస్తే, ఆస్తి నిమిత్తం కేసు తేవడం, ఆపై ఇరుగు పొరుగులతో సరిహద్దు తగాదాలన్నీ విడమరిచి చెప్పి "వీరు తమవంటి  గవర్నమెంట్ ఆఫీసర్లకు తరచుగా పని కలుగజేసి ప్లీడర్లని పోషిస్తూ ఉంటారు" అని మనవి చేయడంతో డిప్టీ కలెక్టర్ "బలే శాబాష్!" అని కేసు వినడానికి సరదా పడతాడు.

భీమారావు పంతులుకి మాటిమాటికీ అడ్డంపడి ఇంగ్లీష్ వకీలు పరువూ, అగ్నిహోత్రావధానులు పరువూ కూడా నిలువునా తీసేస్తాడు నాయుడు. బుచ్చమ్మకి మైనారిటీ తీరలేదనడానికి సాక్ష్యంగా భీమారావు పంతులు దాఖలు చేసిన జాతకాన్ని గురించి నాయుడి మాట: "యీ జాతకం విశ్వామిత్రుడంత యోగ్యుడైన బ్రాహ్మడిచేత తయారు చేయబడ్డది. అదుగో! ఆ మూల నిలబడ్డ రామప్పంతులు గారికి యీ జాతకంలో మంచి ప్రవేశం ఉందండి" అని రామప్పంతులునీ ఇరికిస్తాడు. పేస్డ్ వకీలు తానుండగా, నాయుడు మాట్లాడడం ఏమిటని అభ్యంతరం లేవదీస్తాడు భీమారావు. నాయుడు ఏమాత్రం తొణకడు. "డబ్బు పుచ్చుకున్నందుకు నా పార్టీ తరపున నాలుగు మాటలు చెప్పి తీరుతాను గాని ఇంగ్లీషు చదువుకున్న కొందరు వకీళ్ళ లాగ నోటంట మాట్రాకుండా కొయ్యలాగ నిలబడనండి" అని తేల్చి చెప్పేసి, భీమారావుని ఎత్తిపొడుస్తాడు.

చార్జి కాగితం చూసిన కోర్టు గుమస్తా "ఇందులో ముద్దాయి ఇంటిపేరూ, సాకీనూ (చిరునామా) లేదండి" అనడంతోనే, డిప్టీ కలక్టరు కన్నా ముందు నాయుడే అందుకుని "ఈ ఆర్జీ వల్లకాట్లో రామనాధాయ వ్యవహారంలాగుంది. ఇంగ్లీషు వకీళ్లు దాఖలు చేసే కాగితాలు ఈ రీతినే ఉంటాయండి" అంటూ భీమారావు మీద తన కడుపుడుకు తీర్చుకుంటాడు. "సాకీనూ మొదలైనవి లేనిదీ కేసు అడ్మిట్ చేయడానికి లేదు" అని చెప్పి టిఫిన్ కి వెళ్ళిపోతాడు డిప్టీ కలెక్టరు. "ఏమండోయ్ కేసు అడ్డంగా తిరిగిందే?" అని అగ్నిహోత్రావధానులు అడగడంతోనే, భీమారావు పంతులు ఏమాత్రం తొణక్కుండా "ఇచ్చిన ఫీజుకి పనైపోయింది. మళ్ళీ ఫీజిస్తే కానీ మాట్లాడేది లేదు" అని తెగేసి చెప్పేస్తాడు. భాషలు వేరయినా ఫీజుల విషయంలో వకీళ్ళందరూ ఒక్కటే అని మనకి బోధ పడుతుంది.

ఇంత జరిగినా కూడా, అవధాన్లు మీద నాయుడి కోపం చల్లారదు. డిప్టీ కలెక్టరు వేసిన చీవాట్ల తాలూకు అవమానభారంతో ఉడికిపోతున్న అవధాన్లు దగ్గరికి వచ్చి "ఇంగ్లీషు వకీలు సరదా తీరిందా? ఫోర్జరీకి (బుచ్చమ్మ జాతకం) తమక్కూడా మఠ ప్రవేశం (జైలు) అవుతుంది" అని చల్లగా చెబుతాడు. అసహాయతలోంచి పుట్టిన కోపంతో నాయుణ్ణి "నీ ఇంట కోడి కాల్చా" అని శపిస్తాడు అగ్నిహోత్రావధానులు. ఆ శాపాన్ని చాలా స్పోర్టివ్ గా తీసుకున్న నాయుడు "రోజా కాలుస్తూనే ఉంటారు" అంటాడు, అగ్నిహోత్రుడికే అగ్గెత్తుకొచ్చేలా. ఇంత జరిగినా నాయుడు, అవధానులుని విడిచిపెట్టడు. "ఫోర్జరీ కేసు ఖణాయించకుండా డిప్టీ కలెక్టరు తో సిఫార్సు చేశాను కదా, నాకేమిస్తారు?" అని అడిగేయడమే కాదు, డబ్బు లేకపోతే ప్రోనోటు రాయమనీ, అదీ కుదరకపోతే ఒక బండెడు ధాన్యం ఇవ్వమనీ పీడిస్తాడు. చివరికి రెండు పుట్లు మిరపకాయలకి బేరం స్థిరపడుతుంది.

బ్రిటిష్ పాలిత భారతదేశంలో ప్లీడర్ల పని తీరు ఎలా ఉండేదన్నది విప్పి చెబుతాడు నాయుడు. కేఎన్వై పతంజలి 'పిలక తిరుగుడు పువ్వు' లో కనిపించే వకీలు 'తాడి మోహనరావు నాయుడు' పాత్రకి స్ఫూర్తి ఈ నాయుడే! 'కోర్టు వ్యవహారాల్లో నాటికీ నేటికీ ఏమన్నా తేడా ఉందా' అన్నది మాత్రం  ప్రశ్నార్థకమే..

గురువారం, సెప్టెంబర్ 07, 2017

గిరీశం

ఒకే ఒక్క ఆత్మగతంతో ఓ పాత్ర  తాలూకు రూపు రేఖా విలాసాలను అలవోకగా వర్ణించారు మహాకవి గురజాడ అప్పారావు. 'కన్యాశుల్కం' నాటకం ఆరంభ ఘట్టంలో గిరీశం తనలో తాను మాట్లాడుకునే మాటలద్వారా అతడి తాలూకు సమస్త (అవ) లక్షణాలనీ రూపుకట్టారు. నాటకానికి గిరీశమే కథా నాయకుడేమో అన్న సందేహం లేశమాత్రం కలగని విధంగా పూటకూళ్ళమ్మ దగ్గర డబ్బు తీసుకుని డాన్సింగ్ గర్ల్ కింద ఖర్చు పెట్టేయడం మొదలు, అందిన చోటల్లా అప్పులు చేయడం, ఇది చాలదన్నట్టు వెంకు పంతులు గారి కోడలికి లవ్ లెటర్ రాయడం వరకూ విజయనగరం బొంకులదిబ్బ మీద నిలబడి జ్ఞాపకం చేసుకుంటాడు గిరీశం.

ఈ సృష్టిలో గిరీశానికి తెలియని విషయం లేదు. పూర్తిగా తెలిసిన సంగతీ లేదు. కబుర్లతో కాలక్షేపం చేయడం, ఎదుటి వాళ్ళ బలహీనతలు ఆసరా చేసుకుని వాళ్ళ మీద పెత్తనం చేయాలని చూడడం, సులువుగా డబ్బు, కీర్తి సంపాదించే మార్గాలని నిరంతరం అన్వేషిస్తూనే ఉండడం, ఏదన్నా విషయం పీకల మీదికి వచ్చినప్పుడు ఎవరో ఒకరిని బలిచేసి తాను జాగ్రత్తగా తప్పుకునే నేర్పు... వీటన్నింటి కలబోతే గిరీశం. ఆశ్చర్యం ఏమిటంటే అమాయక ప్రజతో పాటు, ఒక్క చూపుతో మనుషుల్ని అంచనా వేయగల మధురవాణి, కాస్త సంభాషణ చేసి అవతల మనిషి ఏమిటన్నది తెలుసుకోగల వకీలు సౌజన్యరావు పంతులూ కూడా గిరీశం బుట్టలో పడడం.

'కన్యాశుల్కం' నాటకం ఆరంభం నుంచి చివరి వరకూ ప్రతి అంకంలోనూ కనిపించే ప్రధాన పాత్ర గిరీశం. నిజానికి "సాయంకాలమైంది..." అన్న గిరీశం ఆత్మగతంతో ఆరంభమయ్యే ఈ నాటకం, "డామిట్! కథ అడ్డంగా తిరిగింది" అన్నఅతగాడి అనుకోలుతో ముగుస్తుంది. విజయనగరంలో ఇక తన పప్పు ఉడకదని అర్ధమై, క్రిస్మస్ సెలవుల్లో ప్రియ శిష్యుడు వెంకటేశానికి చదువు చెప్పే మిషమీద వాళ్ళ ఊరు కృష్ణరాయపురం అగ్రహారం బయల్దేరతాడు గిరీశం. బయల్దేరే ముందు మధురవాణి ఇంట్లో, తనకి తగలవలసిన పూటకూళ్ళమ్మ చీపురుదెబ్బలకి రామప్పంతుల్ని బలిచేసి, అతగాడి నెత్తి చరిచి లఘువేసి మరీ నేర్పుగా బయట పడతాడు.

కృష్ణరాయపురంలో వెంకటేశం అక్కగారు, బ్యూటిఫుల్ యంగ్విడో బుచ్చమ్మని చూడగానే మనసు పారేసుకుని, ఆమెకి అత్తవారి ఆస్థి కూడా ఉందని తెలిశాక ఆమెని వలలో వేసుకోడానికి న్యాయమైన దారి తొక్కాలని నిర్ణయానికి వస్తాడు. బుచ్చమ్మ చెల్లెలు సుబ్బి పెళ్లి, తనకి అన్న వరసయ్యే లుబ్దావధాన్లుతో నిశ్చయమయినప్పుడు, ఆ పెళ్లి చెడగొట్టడం కోసం అన్నగారికి ఓ (అత్యద్భుతమైన) ఉత్తరం రాస్తాడు గిరీశం. 'సుబ్బిమీద గిరీశానికి ఎందుకింత కనికరం?' అన్న సందేహం మనకి వచ్చే లోగానే, మాయగుంట హత్యకేసులో సతమతమవుతున్న లుబ్ధావధాన్లుని తన పేరిట దత్తత పత్రిక రాయమనీ, పవరాఫ్ టర్నామా గొలికి ఇచ్చేయమనీ ఇదే గిరీశం పీడించినప్పుడు కదా అసలు రహస్యం అర్ధమవుతుంది.

గిరీశం తనని తాను కొత్తవాళ్ళకి పరిచయం చేసుకునే పధ్ధతి మా గొప్పగా ఉంటుంది. పరీక్షలు పాసయిన వాడిననీ, లెక్చర్లిచ్చే పండితుడిననీ, పెద్ద పెద్ద ఉద్యోగాలు తనని వెతుక్కుంటూ వచ్చినా సంఘ సేవ నిమిత్తం వాటిని వద్దనుకున్నాననీ... ఒకటేమిటి, విన్నవాళ్ళకి విన్నంత. ఎదుటివాళ్ళని బురిడీ కొట్టించడంలో గిరీశం దిట్ట. "యంతమందిని పంపినా ఇచ్చారు కారుంటుండి. నేను వాళ్ళలాగా ఊరుకునే వోణ్ణి కానండి" అంటూ ధుమధుమలాడుతూ వచ్చిన పొటిగరాప్పంతులు గారి నౌకర్ని "పెద్దమనిషివి కదా. నువ్వూ తొందర పడడం మంచిదేనా? నీ తండ్రి యంతటి పెద్దమనిషి" అని చల్లబరిచి, ఆ 'పెద్దమనిషి' కి హవానా చుట్టలు చదివించుకుని గండం గట్టెక్కుతాడు.

గంటల తరబడి లెక్చర్లు దంచడంలో గిరీశాన్ని మించిన వాడు లేడు. 'ది ఎలెవన్ కాజస్ ఫర్దీ డిజెనరేషన్ అఫ్ ఇండియా' మొదలుకొని 'భగవత్ సృష్టిలో పునరుక్తులు' వరకూ ఏ విషయం మీదైనా గాలిపోగేసి, ఇంగ్లీష్, ఉరుదూ పదాలు దట్టించి వినేవాళ్ళు 'డంగైపోయేలా' ఏకబిగిన మాట్లాడేయగలడు. 'నేషనల్ కాంగ్రెస్' విషయమై గిరీశం రెండు గంటల పాటు లెక్చరు ఇస్తే, అంతా విన్న బండి అబ్బాయి "కాంగ్రెస్ వాళ్ళు మా ఊరి హెడ్ కానిస్టేబిల్ని ఎప్పుడు బదిలీ చేస్తారు?" అని అడిగాడు (ఈ బండి అతనంటే నాకు చాలా ఇష్టం!). 'మనవాళ్ళొట్టి వెధవాయిలోయ్' లాంటి స్వీపెంగ్ స్టేట్మెంట్స్ మొదలు, విడో మీద కవిత్వాలు, 'పొగతాగని వాడు దున్నపోతై పుట్టున్' అన్న సూత్రీకరణలు.. ఇవన్నీ గిరీశం సొంతం. ఇక ఒపీనియన్స్ చేంజ్ చేసుకునే విషయంలో ఇప్పటి మన పొలిటీషియన్లకి ముత్తాతే కదూ.

అమాయకురాలు, తల్లితండ్రుల చాటు బిడ్డ అయిన బుచ్చమ్మని తన దారికి తెచ్చుకోడానికి గిరీశం చేసిన ప్రయత్నాల్ని ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఆత్మస్తుతి నిండిన మామూలు సంభాషణలతో ఆరంభించి, అటుపై అరేబియన్ నైట్స్, మదనకామరాజు కథలూ చెప్పి, ఇల్లూ, పిల్లలూ, సరుకూ జప్పరా అంటూ ఆశ పెట్టి, ఒట్టు పక్కన పెడితే తన తల మిగిలిపోతుందని భయపెట్టి, బుచ్చమ్మ లేచిపోతే తప్ప సుబ్బి పెళ్లి ఆగదని నమ్మించి, పెళ్ళికి బయల్దేరిన బళ్ళలో ఆమె బండిని దారి తప్పించేస్తాడు. అప్పుడైనా ఆమెని పెళ్లి చేసుకునే వాడేనా అంటే - లుబ్ధావధాన్లు కనుక దత్తత పత్రిక రాస్తే - సందేహమే. మధురవాణితో సహా ఎంతోమంది డాన్సింగ్ గర్ల్స్ తో వ్యవహారాలు సాగించి, తనని తాను 'నెపోలియన్ ఆఫ్ యాంటీ నాచ్' అని అభివర్ణించుకోవడం గిరీశానికి మాత్రమే సాధ్యం.

ఇంగ్లీష్ చదువుల్ని సమాజం సరిగా అర్ధం చేసుకోనట్టయితే, గిరీశం లాంటి ఆషాఢభూతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించేందుకే గురజాడ ఈ పాత్రని సృష్టించారేమో అనిపిస్తూ ఉంటుంది. అన్నట్టు, నాలుగైదేళ్ల క్రితం ఒక రచయిత్రి రాసిన తెలుగు నవల్లో కథానాయిక తండ్రికి  సాహిత్యం అంటే చాలా ఇష్టం. ఆయన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు 'కన్యాశుల్కం' చదివి, కొడుకు పుడితే 'గిరీశం' అని పేరు పెట్టుకోవాలి అనుకుంటాడు. కొడుకే పుడతాడు కానీ, అతని తండ్రి (చంటి పిల్లాడి తాత) ఆ పేరు పెట్టడానికి ఒప్పుకోడు. అసలు 'కన్యాశుల్కం' చదివిన వాళ్ళు ఎవరైనా కొడుక్కి 'గిరీశం' పేరు పెట్టుకోవాలి అనుకుంటారా??

బుధవారం, సెప్టెంబర్ 06, 2017

కరటకశాస్త్రి

నాటకంలో ఎంత హాస్యమైనా చెల్లుతుందని బాగా తెలిసిన విదూషకుడు కరటకశాస్త్రి. అదే హాస్యాన్ని నటనలోకి తెచ్చినా నెగ్గుకు రాగల భరోసా ఉన్నవాడు. విద్య చేత సంస్కృత పండితుడు, వృత్తి చేత విజయనగరం నాటక కంపెనీలో విదూషకుడూను. క్రియలో అంతవరకూ రాకపోయినా, మాటల్లో అమేషా మెడపట్టుకుని బయటకు తరిమే ఇల్లాలికి మగడు. భర్తకి ఇష్టం ఉండదని తెలిసీ, పెరట్లో కాస్తున్నాయని  రోజూ ఆ ఇల్లాలు దొండకాయ కూరే  వండినా కిక్కురుమనకుండా కంచం ఖాళీ చేసే సగటు మగాడు.

ఇవన్నీ నాణేనికి ఒకవైపు. మరోవైపున తోబుట్టువుకి కొండంత అండగా నిలబడే అన్నగారు. మేనల్లుడు, మేనకోడళ్ళ పట్ల బాధ్యత ఉన్న మేనమామ. అగ్నిహోత్రావధానులంతటి 'మూర్ఖప గాడిద కొడుకు' కూడా "ఐతే నన్ను ఆక్షేపణ చేస్తావషే? యీమారన్నావంటే నీ అన్న ఉన్నాడని ఊరుకునేది లేదు" అంటూ భార్య వెంకమ్మ మీద కోపాన్ని అదుపులో పెట్టుకోవడం ఒక్కటి చాలు, ఆ అన్నగారు కరటకుడెంతటి అసాధ్యుడో తెలియడానికి. "అగ్నిహోత్రావధాన్లూ, కుర్రవాడికి రవ్వంత చదువు చెప్పించడానికి ఇంత ముందూ వెనకా చూస్తున్నావు? బుచ్చమ్మనమ్మిన పదిహేను వందల రూపాయాలేంజేశావ్?" అని జంకూ గొంకూ లేకుండా అడగ్గలడు.

సోదరి వెంకమ్మ చిన్న కూతురు సుబ్బి పెళ్లిని తలపెట్టాడు బావగారైన అగ్నిహోత్రావధానులు. వరుడు లుబ్ధావధాన్లుకి అరవయ్యేళ్ళ పైమాటే. పెళ్లి తప్పించాల్సిన బాధ్యత అన్నగారిమీద పెట్టేసింది వెంకమ్మ.  తప్పించని పక్షంలో నుయ్యో గొయ్యో చూసుకుంటానని హెచ్చరించింది కూడా. అన్ని విధాలా కుదిరిన సంబంధాన్ని చెడగొట్టడం అంటే మాటలు కాదు కదా. ఇక్కడే, కరటకశాస్త్రి లోని నటుడు వినియోగానికి వచ్చాడు. తన శిష్యుడు మహేశం చేత ఆడపిల్ల వేషం కట్టించి, తాను పిల్ల తండ్రి వేషం కట్టి, సుబ్బికి మాట్లాడుకున్న కన్నా తక్కువ శుల్కానికి మహేశాన్ని లుబ్ధావధాన్లకి కట్టబెట్టి చెల్లెలికిచ్చిన మాట ప్రకారం పెళ్లి తప్పిస్తాడు.

గిరీశం శిష్యరికం చేస్తున్న మేనల్లుడు వెంకటేశం చదువు మీద మొదటి నుంచీ సందేహమే కరటకశాస్త్రి కి. గురుశిష్యులిద్దరూ ఇంగ్లీష్ లో మాట్లాడుకున్నపుడే ఎక్కడో ఏదో తేడా జరుగుతోందని స్ఫురించి ఉండాలి. అందుకే, "అబ్బీ, ఒక తెనుగు పద్యం చదవరా?" అని అడగడమూ, వెంకటేశం "పొగచుట్టకి సతిమోనికి" అనగానే "చబాష్" అనడమూను. "తెల్లవాళ్ళ స్కూళ్లలో తెలుగు పద్యాల మీద ఖాతరీ లేదండి" అని గిరీశం ఇచ్చిన వివరణ వింటూనే "తర్ఫీదు మా చక్కగా ఉంది. వీణ్ణి పెందరాళే తోవ పెట్టకపోతే మోసవొస్తుంది" అనుకుంటాడు ఆత్మగతంగా.

కార్యసాధకుడికి నిలువెత్తు ఉదాహరణ కరటకశాస్త్రి. సుబ్బి పెళ్లి తప్పించమని అగ్నిహోత్రావధానులతో గొడవ పెట్టుకుని లాభం లేదని బాగా తెలుసు. అక్కడికీ "బావా, ఈ సమ్మంధం చేస్తే నీ కొంపకి అగ్గెట్టేస్తాను" అని బెదిరిస్తాడు కానీ, అగ్నిహోత్రావధానులు ముందు ఆ బెదిరింపు తాటాకు చప్పుడని బాగా తెలుసు. చేయాల్సిన పని ఏమంత సులువు కాదని తెలుసు కాబట్టే, "గట్టి అసాధ్యం తెచ్చి పెట్టావే" అంటాడు చెల్లెలితో. అలాగని చేతులు ముడుచుకుని కూర్చోలేదు. తన శక్తియుక్తుల్ని అంచనా వేసుకుని రంగంలోకి దిగాడు. స్నేహితులు కూడా కలిసి రావడంతో కార్యం సాధించాడు.

మహేశానికి ఇంగ్లీష్ చదువు చెప్పించి, తన కూతురినిచ్చి పెళ్లిచేసి ఇల్లరికం ఉంచుకుంటానని మాటిచ్చి నాటకానికి ఒప్పించడం మొదలు, రామప్పంతులు ఊళ్ళో లేకుండా చూసి అప్పటికప్పుడు లుబ్ధావధాన్లుని ఏకరాత్ర వివాహానికి ఒప్పించడం వరకూ అడుగడుగునా కరటకుడి ప్రతిభ కనిపిస్తూనే ఉంటుంది. లౌక్యంతో తనకి మించిన వాడు లేడని విర్రవీగే రామప్పంతులు మీద లౌక్య ప్రజ్ఞ చూపించి గెలిచాడు. ఏకరాత్ర వివాహ విషయం తెలిసి పంతులేవంటాడో అని భయపడుతున్న 'అల్లుడు' లుబ్ధావధాన్లుతో "పావంతటి దానికి విరుగుడుంది, పంతులుకుండదా?" అన్నప్పుడు కరటకశాస్త్రి లో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది.

ఇచ్చకాలకి లొంగే మనిషి కాదని తెలిసీ, మధురవాణిని బులిపించేందుకు తన పాండిత్యాన్నంతా వినియోగిస్తాడు కరటకశాస్త్రి. 'నీలాంటి మనిషి మళ్ళీ ఉందా?' అన్నా, 'ఏకానారీ సుందరీ వాదరీవా' అన్నా, 'మధురవాణి అంటూ ఒక వేశ్యా శిఖామణి ఈ కళింగ రాజ్యంలో ఉండకపోతే భగవంతుడి సృష్టికి ఎంత లోపం వచ్చి ఉండును?' అని  ప్రశ్న వేసినా, మధురవాణి భుజాలు పొంగుతాయని కాదు, ఎంతోకొంతయినా పని సానుకూలం కాకపోతుందా అని. ప్రోనాచ్, యాంటీ నాచ్ గురించీ, వకీలు సౌజన్యరావు పంతులు సౌజన్యం గురించీ మధురవాణి ఎదుట ఇచ్చిన ఉపన్యాసం పుణ్యమా అని తల వాచి తెల్లవెంట్రుకలు లావవుతాయి పాపం.

'కన్యాశుల్కం' నాటకం ద్వితీయాంకంలో తొలిసారి కనిపించే కరటకశాస్త్రి, చతుర్ధాంకంలో కథని కీలకమైన మలుపు తిప్పి, మళ్ళీ షష్ఠ్యంకంలో ప్రత్యక్షమై  నాటకాన్ని ముగింపు దిశగా నడిపిస్తాడు. మొత్తం నాటకంలో జరిగే 'మాయగుంట పెళ్లి' అనే ఉప నాటకానికి సూత్రధారి, ప్రధాన పాత్రధారి కూడా ఇతగాడే. చిఱిగెడ్డం అతికించుకుని, గుంటూరు శాస్తుర్లు అని మారుపేరు పెట్టుకున్నా, మాటల్లో పడమటి యాస పలికించలేకపోతాడు. ఉపనాటకం మధ్యలో శిష్యుణ్ణి వదిలి వెళ్లేప్పుడు, మీనాక్షి కి జాగ్రత్తలు చెప్పేప్పుడు మహేశం యెడల కరటకశాస్త్రి కి ఉన్న వాత్సల్యం కనిపిస్తుంది. డిప్టీ కలక్టర్ని చూడమని మధురవాణిని బలవంతం చేసినప్పుడు కరటకుడి మీద మనకి కించిత్ కోపం వచ్చినా, మధురవాణి తలంటి పోయగానే ఆ కోపం ఎగిరిపోతుంది.

(ఇతగాడి పేరు చాలా రోజులపాటు 'కరకట శాస్త్రి' అని పొరబడ్డాన్నేను. కళ్ళెంత మోసం చేస్తాయి!! "కరటకము అంటే కాకి. గురజాడ లాంటి రచయిత పాత్రకు పేరు పెట్టారెంటే దాని వెనుక ఎంతో అర్ధం ఉంటుంది" అంటూ మిత్రులొకరు తలంటి పోయడం గుర్తొస్తూ ఉంటుంది, కరటకశాస్త్రి ని ఎప్పుడు తల్చుకున్నా).