ఈమధ్య మన న్యాయవ్యవస్థ తరచూ వార్తల్లో కనిపిస్తోంది.
కోర్టుల్లో గుట్టలుగా పెరిగిపోతున్న కేసులు ఓ పక్క, భర్తీ కాక
మిగిలిపోతున్న ఉద్యోగాలు మరోపక్క, వెరసి న్యాయమూర్తులు ఒత్తిడికి
గురవుతున్నట్టుగా కనిపిస్తోంది. న్యాయమూర్తుల పోస్టుల భర్తీ విషయంలో
సాక్షాత్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దేశ ప్రధాని సమక్షంలో
భావోద్వేగానికి గురవ్వడాన్ని చూశాం మనం. కొన్ని న్యాయపరమైన చిక్కుల కారణంగా
ఏళ్లతరబడి పోస్టుల భర్తీ నిలిచిపోయిందని వ్యాసాలు ప్రచురించాయి పత్రికలు.
'న్యాయమూర్తుల నియామకంలో ప్రభుత్వం పాత్ర ఉండాలా? ఉండకూడదా?' అన్న చర్చ
సుదీర్ఘంగా కొనసాగుతోంది.
న్యాయమూర్తుల కొలీజియం ద్వారానే
నియామకాలు జరగాలి తప్ప ప్రభుత్వం జోక్యం ఉండకూడదని సీనియర్ న్యాయమూర్తులు
అభిప్రాయ పడుతూ ఉండగా, ప్రభుత్వ జోక్యం ఉండని స్వాతంత్య్రం ఏ వ్యవస్థకీ
ఉండకూడదనీ, న్యాయవ్యవస్థ కూడా ఇందుకు మినహాయింపు కాదనీ ప్రభుత్వ పెద్దలు
వాదిస్తున్నారు. నియామకాల్లో ప్రభుత్వ జోక్యం ఉన్న పక్షంలో కేసుల
విచారణలోనూ, తీర్పు వెలువరించడంలోనూ న్యాయవస్థ తాలూకు స్వతంత్రం
ప్రశ్నార్ధకవుతుందన్న వాదన కోర్టుల వైపు నుంచి వినిపిస్తోంది. ఇదిలా ఉండగా,
కావాల్సింది పెద్ద సంఖ్యలో న్యాయమూర్తులు కాదనీ, పనిచేసే న్యాయమూర్తులే
తక్షణావసరమనీ ప్రకటించింది లా కమిషన్.
నియామకాలని గురించిన
చర్చ జరుగుతూ ఉన్న సమయంలోనే, సుప్రీం కోర్టు వెలువరించిన ఒక తీర్పు,
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి వచ్చిన రెండు తీర్పులు ఆసక్తికరంగా
అనిపించాయి. సుప్రీం కోర్టు తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన
సింగూరు భూములకి సంబంధించింది. సతతమూ పేదల పక్షాన నిలబడి పోరాటాలు చేసే
కమ్యూనిష్టు పార్టీ పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న సమయంలో టాటా సంస్థకి
కార్ల కర్మాగారం ఏర్పాటు నిమిత్తం సింగూరులో భూసేకరణ చేసింది. రైతులంతా
బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడం, ఆ పోరాటాలకు నాయకత్వం
వహించిన తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ తదనంతరం పశ్చిమ బెంగాల్
ముఖ్యమంత్రి కావడం చరిత్ర.
నాటి బలవంతపు భూసేకరణని
వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చి, సేకరించిన భూముల్ని రైతులకి
స్వాధీనం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. భూసేకరణ అనంతరం
బెంగాల్లో జరిగిన ఏ ఎన్నికల్లోనూ కమ్యూనిస్టులు విజయం సాధించలేదు. కోర్టు
తీర్పు తర్వాత, ఆ పార్టీ నాయకులు చట్ట ప్రకారమే భూసేకరణ జరిగింది తప్ప
ప్రభుత్వం తప్పేమీ లేదని ప్రకటించారు. లోపం బ్రిటిష్ కాలం నాటి భూసేకరణ
చట్టానిదేననీ, సింగూరు సంఘటన ఫలితంగానే ప్రభుత్వం ఆ చట్టానికి మార్పు చేసిందనీ కూడా
పత్రికల్లోనూ, టీవీల్లోనూ గట్టిగా చెప్పారు. మమతా బెనర్జీ ప్రస్తుతం
రైతులకి భూములని స్వాధీనం చేస్తూ కోర్టు ఆదేశించిన నష్ట పరిహారాన్ని కూడా
పంపిణీ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పులని ప్రస్తావించే ముందు ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. మాన్య చంద్రబాబు నాయుడు గతంలో
ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో హైకోర్టు ప్రభుత్వాన్ని తప్పు పట్టిన
సందర్భాలు బహు అరుదు. దీనిని న్యాయ వ్యవస్థ పట్ల చంద్రబాబుకి ఉన్న
తిరుగులేని అవగాహనకి నిదర్శనంగా ఆయన అనుయాయులు టీవీ చర్చల సాక్షిగా
గర్వపడేవారు కూడా. అయితే, ప్రపంచస్థాయి రాజధాని నగరం అమరావతి నిర్మాణం కోసం
ప్రభుత్వం అనుసరిస్తున్న 'స్విస్ ఛాలెంజ్' విధానాన్ని నిలిపివేయవలసిందిగా
హైకోర్టు మూడు రోజుల క్రితమే ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం
సుప్రీం కోర్టుకు అప్పీలుకు వెళ్లేందుకు సిద్ధ పడుతూ ఉండగానే నిన్న
మరోకేసులో ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు.
తూర్పుగోదావరి
జిల్లా తుని సమీపంలో నిర్మించదలచిన ఔషధ పరిశ్రమనీ, అందునిమిత్తం జరిగిన
భూసేకరణనీ స్థానిక రైతులు వ్యతిరేకించారు. నాడు బెంగాల్లో బలవంతపు భూసేకరణ
జరిపిన వామపక్ష పార్టీలు తుని రైతులకి సంఘీభావం ప్రకటించాయి. రైతులు
హైకోర్టుని ఆశ్రయించారు. ఈ భూసేకరణని న్యాయస్థానం తప్పు పట్టింది. మాన్య
చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలకి వ్యతిరేకంగా వరుసగా రెండు తీర్పులు రావడం
బహుశా ఇదే మొదటిసారి. ప్రజాస్వామ్యంలో ఒక్కో వ్యవస్థ మీదా నమ్మకం కోల్పోతూ
వస్తున్న సామాన్యులకి అంతో ఇంతో నమ్మకం ఉన్నది న్యాయ వ్యవస్థ మీదే అనడం
అతిశయోక్తి కాదు. ఈ మూడు తీర్పుల్లాంటివి ఆ నమ్మకాన్ని పెంచుతున్నాయి కూడా.
నియామకాల్లో ప్రభుత్వ జోక్యం ఉన్నట్టయితే, స్వతంత్రంగా తీర్పులివ్వడం
కోర్టులకి ఏమేరకు సాధ్య పడుతుంది అన్నది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా పెద్ద
ప్రశ్న.