బేరమాడడం అనేది మన జీవితంలో ఒక భాగం అని చెప్పాలేమో. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక వస్తువుని బేరం చేసే ఉంటారు. నిజానికి ఈ బేరం ఆడడం అనేది ఒక కళ అనిపిస్తుంది నాకు. ఈ కళలో మగ వాళ్ళతో పోల్చినప్పుడు మహిళలు నిష్ణాతులు అనడానికి కూడా ఎలాంటి అభ్యంతరమూ లేదు నాకు. ముందుగా ఒప్పుకోవాల్సిన నిజం ఏమిటంటే నాకు బేరమాడడం పెద్దగా రాదు. అయినా అప్పుడప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాను.
నా చిన్నప్పుడు మా ఊళ్లోకి బట్టల మూటల షావుకార్లు వచ్చేవాళ్ళు. పెద్ద పెద్ద బట్టల మూటలు సైకిల్ వెనుక కట్టుకుని ఊరూరూ తిరుగుతూ బట్టలు అమ్మేవాళ్ళు. వీళ్ళ దగ్గర ఎక్కువగా ఆడవారికి ఉపయోగ పడే వస్త్రాలు మాత్రమే దొరుకుతూ ఉండేవి. అందరూ మధ్యాహ్న భోజనాలు ముగించి, అరుగుల మీద చేరి పిచ్చాపాటీ లో పడే వేళకి సైకిల్ బెల్లు కొట్టుకుంటూ ఈ షావుకార్లు దిగిపోయే వాళ్ళు. ఒక్కసారిగా సందడి మొదలయ్యేది.
మా ఇంటి దగ్గర ఎవరు ఏం కొనుక్కోవాలన్నా నాడెం చూడడం (నాణ్యత పరిశీలించడం) మొదలు, బేరం చేయడం వరకూ అన్ని బాధ్యతలూ మా బామ్మే తీసుకునేది. బేరం చేయడం లో నోబుల్ బహుమతి లాంటిది ఏమన్నా ఉంటే ఆవిడకి నిరభ్యంతరంగా ఇచ్చేయొచ్చు. చెప్పిన రేటుకి సగం నుంచి బేరం మొదలయ్యేది. డైలీ సీరియళ్ళు లేని ఆ రోజుల్లో ఆ బేరమే గంటల తరబడి సీరియల్లా సాగుతూ ఉండేది.
ఒక బేరం సాగుతూ ఉండగానే మరొకరెవరో వచ్చి ఇంకేదో ఎంపిక చేసుకునే వాళ్ళు. అలా అలా సాగి సాగి చివరికి కొనాల్సినవి అన్నీ కలిపి 'కండ గుత్త బేరం' కింద కొనేసి ఎవరి వాటా డిస్కౌంట్ ని వాళ్ళు పంచేసుకునే వాళ్ళు. మా బామ్మ స్పూర్తితో నేను స్కూల్లో చదివే రోజుల్లో మొదటి సారి బేరం చేశాను, బడి దగ్గర కొట్లో నిమ్మతొనలు. అంటే నిజం నిమ్మతొన కాదు, తియ్యగా పుల్లగా ఉండే ఒక చాక్లెట్. బామ్మకి ఉన్నంత టాలెంట్ నాకు లేకపోవడం వల్ల బేరం కుదర లేదు.
హైస్కూల్లో చదివే రోజుల్లో 'పెళ్లి బేరాలు' అనే మాట నా చెవిన పడింది. అంటే కట్న కానుకలు మాట్లాడుకోవడం అన్నమాట. వినడానికి కొంచం అదోలా అనిపించినా ఆ పేరు సరైనదే అనిపించింది తర్వాత్తర్వాత. మేష్టారు హాజరేస్తూ ఒకమ్మాయి పేరు దగ్గర ఆగి 'ఎందుకు రాలేదు?' అని అడిగారు. ఆమె స్నేహితురాలు లేచి నిలబడి 'ఇయ్యాల్దానికి పెళ్లి బేరాలండి' అనగానే క్లాసంతా గొల్లుమంది. మేష్టారు పాపం నవ్వాపుకుని సైలెన్స్ అని అరిచారు. మా వైపు 'దూడల బేరగాళ్ళు' అని ఉంటారు. మనం పశువులని అమ్మాలన్నా, కొనాలన్నా వీళ్ళని సంప్రదిస్తే చాలు.
కాలేజీ పిల్లలెవరి దగ్గరైనా 'బార్గెయిన్' అని చూడండి. ముఖం చిట్లిస్తారు. మా రోజుల్లో కూడా అంతే. అమ్మతో బయటికి వెళ్ళినప్పుడు తనేమైనా బేరం చేస్తుంటే 'అబ్బా.. ఎందుకమ్మా' అని విసుక్కునే వాడిని. 'నీకు తర్వాత తెలుస్తుందిలే నాయనా' అనేది. తెలిసింది, నిజంగానే. మన దగ్గర బేరమాడే టాలెంట్ లేనప్పుడు, ఆ టాలెంట్ ఉన్న వాళ్ళని కూడా తీసుకెళ్తే ఉపయోగం అన్న సత్యం బోధ పడింది. వాళ్ళు బేరం చేసేటప్పుడు అమ్మకందారు మనం అడక్క పోయినా మనకి 'న్యాయమూర్తి' హోదా ఇచ్చేసినా, మనం ఆవేశ పడిపోకూడదనీ, మౌనంగా ఉండాలనీ కొన్ని అనుభవాలు నేర్పాయి.
ఇప్పటికీ నేను కూరగాయలు బేరం చేయడం లో వీక్. ఆ మాటకొస్తే ఎంపిక చేయడంలో కూడా. అందుకే బంగాళా దుంపలు, ఉల్లిపాయలు లాంటివే ఎక్కువగా కొంటూ ఉంటాను, నేను కొనాల్సి వచ్చినప్పుడు. వాడు అడిగింది చేతిలో పెట్టి, ఇంటికొచ్చాక ఓ రెండు రూపాయలు తక్కువ చెబితే చాలు, మన మనశ్శాంతికి లోటుండదు. వీధుల్లో అమ్మోచ్చే కూరగాయలు, పళ్ళు గీసి గీసి బేరం చేసేవాళ్ళు కూడా 'ఫ్రెష్' లకీ 'స్టోర్' లకీ వెళ్తే బేరం మాట మర్చిపోవడం వింతల్లోకెల్లా వింత. బేరం గురించి ఎంత చెప్పినా తరగని విశేషాలు పుడుతూనే ఉంటాయి మరి. అన్నట్టు ఈ టపా రాస్తున్నంత సేపూ 'భలే మంచి చౌక బేరము..' పాట గుర్తొస్తూనే ఉంది నాకు..